'మా' మ్యూజిక్ యాంకర్ శశికాంత్
టీ.వీ.షోల్లో యాంకరింగ్  చేసి పాపులరవ్వడమంటే  ఓ రకంగా కత్తి మీద సామే.అందునా మగాళ్ళకి మరింత కష్టం. ఆడవారైతే  కొంతకాలం అందంతో నెట్టుకురాగలరేమో కానీ మగాళ్ళకు ఆ వెసులుబాటు లేదు. టాలెంట్ లేకపొతే గుర్తింపు కష్టం. ప్రముఖ మేల్ యాంకర్లెవరు అన్న ప్రశ్నకు ఒకప్పుడైతే చాలా పేర్లు వినబడేవి. కొంచెం వెనక్కి వెళ్తే రఘు కుంచే,శివాజీ, జోగిబ్రదర్స్, విజయ్ తగుల్తారు. ఇంకా వెనక్కి, అంటే డీ.డీ. మాత్రమే ఉన్న రోజుల్లోకి వెళ్తే  శాంతిస్వరూప్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఓలేటి పార్వతీశం లాంటివారు తారసపడతారు.ఇప్పుడడిగితే ఏ మనో అనో, సాయికుమారనో, సాగరనో, ఓంకారనో చెప్పాల్సివస్తుంది. వాళ్ళలో కూడా అధికశాతం మంది సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్ళే. ఉదయభాను, సుమ, ఝాన్సీ వంటి మహిళలు రాజ్యమేలుతున్న ఈ రంగంలో తనదైన శైలిలో రాణిస్తూ బాగా పేరు తెచ్చుకుంటున్నారు 'మా' మ్యూజిక్ యాంకర్ శశికాంత్.

 'మా' మ్యూజిక్ లో ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడుగంటల వరకు ప్రసారమయ్యే  'స్టార్ ఆన్ డిమాండ్' ప్రోగ్రాం కు యాంకర్ శశికాంత్. ఒక యాంకర్ కు ఉండవలసిన క్రియేటివిటీ, స్పోంటేనిటీ, చురుకుదనం, హాస్య చతురత,సంభాషణా చాతుర్యం, బాడీ లాంగ్వేజ్ అన్నీ తనలో ఉన్నాయి.కొంతమంది యాంకర్లను చూస్తుంటే మొహంలో, మాటల్లో కృత్రిమత్వం తాండవిస్తూంటుంది. 'ఎందుకొచ్చిన ఖర్మరా బాబో ' అనో, 'సరే, చెయ్యాలి కాబట్టి చేస్తున్నా'మనో యాంకరింగ్ చేస్తూంటారు.ఆబ్సెంట్ మైండ్ తో అడిగిన ప్రశ్ననే మళ్ళీ వేస్తూ, అసందర్భమైన విషయాలు ప్రస్తావిస్తూ విసుగు తెప్పిస్తూంటారు. శికాంత్ అలా కాదు. లైవ్ వైర్ లాంటి వాడు. చేసే పనిని అతనెంత ఇష్టపడుతున్నాడో, అతని ప్రవర్తనే చెబుతుంది. సరదాగా నవ్వుతూ,తుళ్ళుతూ ప్రేక్షకులకు కావల్సిన వినోదాన్ని పంచిపెడతాడు. నిత్యం నవ్వుతూ నవ్విస్తూండే అబ్బాయంటే మెచ్చని అమ్మాయెవరు?  సహజంగా ఇతనికి వచ్చే కాల్స్ చాలా మటుకు అమ్మాయిల నుంచే. అయితే అతనెప్పుడూ హద్దు మీరి మాట్లాడింది లేదు.తన పరిధుల్లో తనుంటూ అవసరమైనప్పుడు మెత్తని చురకలు వేస్తుంటాడు. చిటపటలాడుతూ ఆఫీసు నుంచి ఇంటికొచ్చినా ఈ షో చుశారంటే మీ పెదవులపై దరహాసం గ్యారంటీ.ప్రేక్షకులతో మమేకమైపోయే ఇటువంటి యాంకర్లు నలుగురైదుగురు చాలు ఏ టీ.వీ.యైనా తారాపథంలో దుసుకుపోవడానికి.

Good job Sasikanth.