విశ్వనాథ సత్యనారాయణ - వేయిపడగలు - విశ్లేషణ


విసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు ఆశువుగా చెబుతూండగా, వారి తమ్ముడు వెంకటేశ్వర్లు గారు వ్రాసిన నవల వేయిపడగలు. కేవలం 29 రోజుల్లో వేయిపేజీల ఉద్గ్రంథాన్ని వెలువరించడం విశ్వనాథ వారి పాండితీ ప్రకర్షకు నిదర్శనం. 1934లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన పోటీకోసం వ్రాయబడి అడవి బాపిరాజు గారి 'నారాయణరావు'  నవలతో పాటూ ప్రథమ బహుమతి పంచుకున్న ఈ నవల ఆయనకు విశేష ఖ్యాతినార్జించి పెట్టింది. 1968-70ప్రాంతాలలో బహుభాషాకోవిదుడైన దివంగత ప్రధానమంత్రి శ్రీ పి.వి.నరసింహారావు ఈ నవలను  హిందిలోకి అనువదించి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డునందుకొన్నారు. ఈ అనువాదం ఆధారంగా నిర్మితమైన 'సహస్రఫణ్ ' అనే ధారావాహిక హిందీ మొదలైన అనేక భారతీయభాషలలో దూరదర్శన్ ద్వారా ప్రసారమైంది.

ఇంతకుముందు వేయిపడగలు కథను సంక్షిప్తంగా మాత్రమే  చెప్పడం జరిగింది.  అది కాక ఎన్నో పిట్టకథలు, సహాయపాత్రలు ఉన్నాయి.  అన్నింటినీ గుదిగుచ్చడం కష్టం కాబట్టి ప్రధానమైన కథనే ఇక్కడ ప్రస్తావించాను.  ఇక్కడ ఒక ఇబ్బంది కూడా ఉంది. ఒకే పేరు గల పాత్రలు, ఒకే అక్షరంతో మొదలయ్యే పాత్రలు నవలలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు ధర్మారావు తండ్రి పేరు, కొడుకు పేరు రామేశ్వరమే.  వీళ్ళు కాకుండా ప్రతినాయకులలో ఒకడైన రామేశ్వరం ఉండనే ఉన్నాడు.  ఇంకొన్ని పాత్ర పేర్లు ఇలా ఉన్నాయి రామక్రిష్ణారావు, రంగాజమ్మ, రామచంద్రరాజు, రథంతరి, రుక్మిణమ్మారావు, రాజ్యలక్ష్మి...ఇలా సాగుతుంది వరస.  పొరపాటున మధ్యలో కొన్నిరోజులు విరామం ఇచ్చారంటే మళ్ళీ చదవడం మొదలుపేట్టేటప్పుడు ఎవరు ఎవరో గుర్తురాక గందరగోళానికి గురవ్వక తప్పదు.  కానీ ఒకసారి నవల మీద స్పష్టత వచ్చాక ముఖ్యమైన ప్రతిపాత్రా మనస్సులో గుర్తుండి పోతుంది.  అంత వివరణాత్మకంగా పాత్రలను మలచారు.

వేయిపడగలంటే సనాతన భారతీయ ధర్మాలు సంప్రదాయాలని అర్థం. సుబ్బన్నపేట దేవుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హర్రప్ప వంశీకులు,ధర్మారావు వంశీకులు, గణాచారి- వీరు నలుగురు ధర్మానికి నాలుగుస్తంభాలుగా నిలిచి ధర్మార్థకామమోక్షాలను పరిరక్షిస్తూ ప్రజలకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిన రంగారావు ప్రాచీన ధర్మాలకు తిలోదకాలిచ్చి హంగూ ఆర్భాటాలను వంటబట్టించుకొని విచక్షణారహితమైన నిర్ణయాలు తీసుకుని ప్రజాధనం వృధా చేస్తాడు.  ఫలితంగా ఖజానాపై అప్పుల భారం పెరిగి పరిపాలన కుంటుపడుతుంది. కొన్ని వందలఏళ్ళుగా అన్నం పెట్టిన వృత్తివిద్యలు కనుమరుగైపోయి ప్రజలు దిక్కులేనివాళ్ళవుతారు.  విదేశీ విద్యనే మహత్తరమైనదని, స్వజాతి సంస్కృతి ఆచారాలు అనాగరికమనే భావన ప్రబలుతుంది.  ప్రజలందరూ స్వధర్మం మరచిపోయి పరధర్మాల వైపు ఆకర్షితులై, అవే ఉత్తమమని నమ్మి, వాటిని అక్కున చేర్చుకోవటంతో సనాతనధర్మాలకి ప్రతీకైన సుబ్రహ్మణ్యేశ్వరుడు క్రమక్రమంగా తన పడగలన్నీ కోల్పోయి, కళావిహీనమై చివరికి రెండే పడగలతో మిగిలిపోతాడు. ఆ రెండు పడగలే ధర్మారావు, అరుంధతి.

ఇందులో ప్రధానంగా మూడు తరాల జీవన విధానాల్ని, పాశ్చాత్యుల దురాక్రమణ తర్వాత చోటుచేసుకున్న మార్పులు చేర్పులని, తద్వారా ఎదురవుతున్న సమస్యలని చర్చించారు. ఒక రకంగా ఇది విశ్వనాథ సత్యనారాయణ గారి స్వీయచరిత్ర అనుకోవచ్చు. వారి పూర్వీకులు కాశీ వెళ్ళి అక్కడినుంచి శివలింగం తెచ్చి కృష్ణా నదీతీరంలోని ఒక గ్రామంలో ప్రతిష్ఠించారట. అలా ఆ గ్రామం విశ్వనాథపల్లై అదే వారింటి పేరుగా స్థిరపడిపోయింది. ఆ తర్వాత వీరు నందమూరు వలస వచ్చారు. విశ్వనాథవారి నాన్నగారు అక్కడ కూడా కాశీ నుంచి తెప్పించిన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. తెలుగు బోధకులుగా విజయవాడ, కరీంనగర్ కళాశాలల్లో పనిచేసిన విశ్వనాథ వేయిపడగలను నవలను కూడా ఆ విశ్వనాథునికే అంకితమిచ్చి తన శివభక్తిని చాటుకున్నారు. వారికి రెండు పెళ్ళిళ్ళయ్యాయి. మొదటి భార్య గతించాక మరో అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఆమెను కూడా అదే పేరుతో పిలిచేవారు.

వేయిపడగలులో కథానాయకుడు ధర్మారావు కూడా అంతే. అతను కవి,జాతీయ కళాశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. తరతరాలుగా అతని పూర్వీకులు సేవించుకుంటున్న నాగేశ్వరాలయం లోని శివలింగం కాశీ నుంచి తెప్పించి ప్రతిష్ఠించినదే.  తన భార్య చనిపోయాక ధర్మారావు కూడా మరో పెళ్ళిచేసుకుంటాడు. ఆమె పేరు కూడా అరుంధతి. ధర్మారావుకు సనాతనధర్మాల మీద సమున్నత విశ్వాసముంది. వాటికి ఆచరణకు అవరోధాలు కలిగినప్పుడల్లా విలవిలలాడిపోతాడు. స్వతహాగా సాత్వికుడు కానీ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు నిర్మొహమాటంగా వెల్లడించే స్వభావమున్నవాడు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పగలడే కానీ, నచ్చనివాటి మీద ఉద్యమాలు లేవదీసి పోరాటాలు చేసే తత్వం అతనికి లేదు. అన్నిటికీ సాక్షీభూతుడు కానీ దేనికీ ప్రత్యక్ష కారకుడు కాదు. Passive hero.

కథానాయిక అరుంధతి భర్తను రెండవ పెళ్ళి చేసుకోమనేటంత ఉదాత్తురాలు.  ప్రాచీన భారతస్త్రీ స్వభావానికి ప్రతీక. దేవదాసి భగవంతున్నే నమ్ముకుని ఆ మూర్తితో వివాహం కోసం పరితపించే పవిత్రమూర్తి. ఈమె పాత్ర సమాజంలో దేవదాసీలంటే ఉన్న చులకనభావాన్ని రూపుమాపి వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పడానికే సృష్టించబడిందనుకోవచ్చు. రంగారావు, మంగమ్మ లాంటి వాళ్ళు మొదట కొన్ని వ్యామోహాలకు లొంగినా జీవిత చరమాంకంలో తమ తప్పులు తెలుసుకొని మారిపోతారు. రామేశ్వరం, రాధాపతి, దివాను నాగేశ్వరరావు లాంటి వాళ్ళు పాశ్చాత్య సంసృతిని పూర్తిగా జీర్ణించుకుని పెడత్రోవలు తొక్కి పతనమైపోతారు. ధర్మారావు, అరుంధతి, హర్రప్ప లాంటి వారు ఎన్నిఆటుపోట్లు ఎదురైనా పూర్వాచార పరాయణులుగానే మిగిలిపోతారు.

ఈ పుస్తకం చదువుతూంటే నాకు అప్రయత్నంగా భారత,భాగవతాలు గుర్తొచ్చాయి. అందులో ఉన్నట్లే ఇందులో కూడా ప్రతిపాత్రని వంశవృక్షంతో సహా వివరిస్తూ వెళ్తారు రచయిత. తెరమీది బొమ్మల్లా రకరకాల పాత్రలు వచ్చిపోతూ తమ వ్యక్తిత్వాల ద్వారా మన మనస్సులో స్థానాలేర్పరచుకొని వెళ్తాయి.రామేశ్వరశాస్త్రి దాతృత్వం, రత్నగిరి ఆత్మగౌరవం, లక్ష్మణస్వామి(ఏనుగు)స్వామిభక్తి,నాగేశ్వరశాస్త్రి నక్క వినయం, సుసానీ అవిధేయత చెదరని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు సమాజం పరుగులుపెడుతున్నపుడు, ఆ రథచక్రాల ఇరుసులలో ఇరుక్కొని నలిగిపోయిన సామాన్యుల వెతల్ని చక్కగా ఆవిష్కరించారు. ప్రాచీన కళలపై వీరికున్న అవగాహన అడుగడుగునా ప్రతిఫలిస్తుంది. ముఖ్యంగా నాట్యం గురుంచి, నాటకాల గురుంచి ముద్రలతో సహా వివరిస్తున్నప్పుడు ఆశేషమైన ఆ ప్రతిభా సంపత్తికి ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఆయన కలం నుంచి తప్పించుకున్న వస్తువు, వర్ణన లేదేమో? టైంమెషీన్‌లాంటి తన అద్భుతమైన రచనాశైలితో మనల్ని ఒక్కసారిగా మూడువందల ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తారు. చూడాలన్న(చదవాలన్న)ఉత్సుకత ఉంటే సున్నితమైన ప్రతి విషయాన్ని మైక్రోస్కోపిక్ వర్ణనలతో దర్శింపచేసి జ్ఞాన పిపాసను తీరుస్తారు. ఆయన సునిశిత పరిశీలనా దృష్టి ఎంతటిదో ఈ క్రింది వాక్యాల ద్వారా తెలియజేస్తాను.


"వర్షము పెద్దది కాజొచ్చెను.ఆ వానకు వడగండ్లు పడెను...ఒక పాము వానలో పరువెత్తుచుండెను. వడగండ్లు దాని శిరస్సును తాడించుచుండెను.అది పడగవిప్పి బుస్సుమనిలేచి ప్రక్కవాటుగా బొంయిమని వీచుచున్న గాలిని కసిగాట్లు కొరికి కష్టము మీద పోవుచుండెను".

వడగళ్ళు తన మీద పడుతూంటే పాము ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి.తననెవరో కసిదీర మోదుతున్నారని పాముకి కోపం.అక్కనా ప్రక్కనా ఎవరూ లేరు.హోరుమని వీస్తున్న గాలే అలా చేస్తూందనుకుందో, లేక తనకొచ్చిన ఉక్రోషాన్ని వెల్లగ్రక్కాలనుకుందో  కసిదీరా కాట్లు వేస్తోందట.

విశ్వనాథ వారు మేఘానికి వృక్షానికి మధ్య కూడా అద్భుతమైన సంబంధాన్ని ఏర్పరిచి హృదయాలకు హత్తుకొనేలా వివరించారు. ప్రతి సంవత్సరం పడమటి కనుమలు, వింధ్యగిరుల నుంచి ' పృషన్నిధి ' అనే నల్లని మేఘం సుబ్బన్నపేట వచ్చి అక్కడున్న నాలుగువందల ఏళ్ళ నాటి ' ఆదివటం ' అనే మహావృక్షాన్ని కలుసుకొని ఆనందభాష్పాలు రాలుస్తుంది. పట్టణీకరణం కారణంగా ఆదివటంతో సహా మహావృక్షాలన్నిటినీ నరికి విద్యుద్దీపాలకు సిమెంటు స్తంభాలను నాటుతారు. ఎప్పటిలాగే మళ్ళీ వచ్చిన పృషన్నిధి తన మిత్రుడైన ఆదివటం కనబడక తల్లడిల్లిపోతుంది. ఒక విద్యుత్‌స్తంభంపై ఆగి తనను కోరతవేసినట్లు బాధపడితే, ఒక ఝంఝూమారుతం వచ్చి దాన్ని నీళ్ళక్కరలేని గుట్టపైకి విసిరికొడుతుంది.

చెప్పుకుంటూ వెళ్తే ఇవే బోలెడున్నాయి. ఆధ్యాత్మిక వర్ణనలలో ఆయన విశ్వరూపం ప్రదర్శిస్తారు. అద్భుతమైన పరిశీలనాదృష్టి, అపారమైన సాహితీశక్తి ఉంటే తప్ప ఇటువంటి ఊహలు కలగవు. అయితే సమాసభూయిష్టమైన కొన్ని వర్ణనల కారణంగా సగటు పాఠకుడికి బోరుకొట్టే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా చివరి అధ్యాయాలలో వచ్చే దేవదాసి ధర్మారావుల సంభాషణలు, గీతాలు, పద్యాలు చదివి ఆకళింపు చేసుకోవాలంటే చాలా ఓపిక అవసరం.అలాగే, ఆశువుగా చెబుతూంటే వ్రాసిన నవల కాబట్టి కథనానికి ఏమాత్రం సహాయపడని సన్నివేశాలు కూడా అక్కడక్కడా తగుల్తాయి.

ఈ నవలలో చర్చకు వచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. అన్నింటినీ కాకపోయినా కొన్నింటిని వివరిస్తాను.

1. ఇతిహాసాలు,పురాణాలలోని పాత్రలను అభినయిస్తున్నప్పుడు నటీనటుల వస్త్రధారణ హావభావాలు అందుకనుగుణంగా ఉండాలని వ్యాఖ్యానించారు.నారదుడు సామగానం చేస్తే నాటకాలలో భజనగీతాలు పాడుతున్నట్లు చూపిస్తారని,అలాగే శ్రీ కృష్ణుడికి నీలిరంగు బనియను తొడిగి,శిరస్సుపై నెమలిపింఛం పెడతారు గానీ మూతి మీద మీసం మాత్రం ఉంచరని,పాశ్చాత్య నాటకాలు ప్రదర్శిస్తున్నప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటారని విమర్శిస్తారు.ఈ మాటలతో నేనూ ఏకీభవిస్తాను. పేరుమోసిన పెద్ద పెద్ద నిర్మాతలంతా క్రేజీ కాంబినేషన్ల పేరుతో తలాతోకా లేని సినిమాలు ఏళ్ళ తరబడి తీసి చేతులు కాల్చుకొనే కంటే మన గాథల్లోని సంఘటనలను ఉన్నవి ఉన్నట్లుగా తెరకెక్కిస్తే విజయాల సంగతేమోకానీ కనీసం ఆత్మతృప్తైనా మిగులుతుంది.


2. బాల్యవివాహాలను సమర్థించారు.చిన్నప్పుడే ఆడపిల్లకు తన భర్తెవరో తేలిపోవటం వల్ల అతనిమీదే మనస్సు లగ్నమవుతుందని,పెళ్ళి చిన్నప్పుడే చేసినా కార్యం ఎప్పుడో పదమూడేళ్ళ తర్వాత రజస్వలైన తర్వాతే జరిపిస్తున్నాం కాబట్టి ఇందులో దోషమేమీలేదని వాదించారు.అంతేకాదు మనం చిన్ననాడే గర్భాదానం చేయిస్తున్నామని భ్రమపడి పాశ్చాత్యులు బాల్యవివాహాలను వ్యతిరేకిస్తున్నారని,వారి వాదన సరికాదని విశ్లేషించారు.అయితే బాల్యవివాహాల ద్వారా కలిగే ఇక్కట్లను ఆయన మర్చిపోయినట్లున్నారు. వరుడు, అత్తమామలు మంచివారైతే ఫర్వాలేదు.కొంతలో కొంత నయం.కాకపోతేనే వచ్చింది చిక్కు.అప్రయోజకుడైన భర్తకు సేవలు చేస్తూ,అత్తింటి ఆరళ్ళు భరిస్తూ,తన దౌర్భాగ్యానికి తనను తానే నిందించుకుంటూ పసిప్రాయం నుంచే నరకాన్ని అనుభవించాలి.ఒకవేళ మంచి సంబంధమే దొరికినా హాయిగా ఆడుతూపాడుతూ తిరిగే వయసులో పుట్టెడు చాకిరీలు చెయ్యటం అవసరమా?

3. విగ్రహారాధనను వెనుకేసుకొచ్చారు. నిర్గుణమైన పరబ్రహ్మను సగుణం చేసి ఆరాధిస్తున్నప్పుడు ఒక ఆకృతి అవసరమవుతుందని, ఆ భావాన్నే పూజిస్తున్నామని,హిందువుల దేవుళ్ళు విగ్రహాలైతే, ఫోటోలు, చిత్రాలు, సిలువ
చిహ్నాలు విగ్రహాలు కావా అని ప్రశ్నలు సంధించారు. క్రీస్తును చంపిన సిలువ క్రైస్తవమతానికి చిహ్నమెలా అయ్యిందని నిలదీస్తారు. ఇందులో సత్యం లేకపోలేదు .

4. విధవా వివాహాల మీద కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పురుషుడికి ధనముంటే, స్త్రీకి అందముందని, సంఘసంస్కర్తలు కూడా డబ్బు, అందమున్న విధవలనే చూసి పెళ్ళిచేసుకుంటున్నారని, వాటితో నిమిత్తం లేకుండా విధవావివాహాలు జరిగినప్పుడు మంచిదని చెబుతారు.

5. ఇంగ్లీషు చదువుల మీద  అభిప్రాయాలను వెల్లడించారు.పది పదహారేండ్ల వరకూ తెలుగు చక్కగా చెప్పి తర్వాత ఏ భాషైనా బోధించమని,చిన్నప్పటినుండీ ఇంగ్లీషే బోధించటం వలన ఇంగ్లీషు కొంచెం వస్తోంది కానీ,తెలుగేమీ రాకుండా పోతుందని ఆవేదన చెందారు. ఈ గొడవ ఆనాటి(1934) నుంచే ఉన్నట్లుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటం తప్పనిసరి కాబట్టి మన నిర్ణయాలని కొంత సమర్థించుకోగలిగినా తెలుగు సరిగ్గా చదవడం, వ్రాయటం రాని తరం తయారవటం మాత్రం నిజంగా దురదృష్టకరం.

6. విడాకుల చట్టాలకు,స్త్రీ సమాజాలకు కూడా తాను వ్యతిరేకినని మంగమ్మ పాత్ర ద్వారా చెప్పిస్తారు. పనులను పంచుకోవాలి కానీ వాటికోసం పోటీపడరాదని, చదువుకున్నంత మాత్రాన స్త్రీ పురుషులిద్దరికీ సమానమైన జ్ఞానముంటుందని భ్రమపడరాదని చెబుతారు. స్త్రీ విద్య గురుంచి మాట్లాడుతూ స్త్రీలను క్రైస్తవ బడుల్లోకి పంపరాదని ధర్మారావు చేత చెప్పిస్తారు. మిషనుస్కూళ్ళలో చదివిన ఆడపిల్లలకు మన సంప్రదాయాలు అలవాటుకాక హైందవ సంస్కృతి నాశనమవుతోందని, గృహదేవతైన ఆమెకు గృహసంబంధమైన మంచిచెడ్డలు తెలియకుండా పోతున్నాయని బాధపడతారు.


వీరి అభిప్రాయాలు కొందరికి విపరీతంలా తోచవచ్చు. చాలా మంది ఏకీభవించలేకపోవచ్చు. రచయితే రాధాపతి పాత్ర ద్వారా చెప్పించినట్లు ఈయనెవరో బి.సి కాలం నాటి వాడని తీసిపారేయవచ్చు. కానీ మూడు దశాబ్దాల కాలంలో మనుషుల్లో,సంఘంలో చోటుచేసుకున్న పరిణామాలకు దర్పణం పట్టిన నవలగా దీన్ని దర్శిస్తే,చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గ్రంథమని ఇట్టే బోధపడుతుంది.

ఒకప్పుడు ఈ నవల విడిగా లభ్యమయ్యేది కాదు.విశ్వనాథ వారి సాహితీసర్వసం(మొత్తం సెట్టు నాలుగువేలకు పైమాటే అనుకుంటా) కొంటే తప్ప విడిగా అమ్మబడదని చెప్పేవారు. నేను కూడా మూడు నాలుగుసార్లు ఆ సమాధానం విని నీరుగారిపోయాను. నా బోటి వాళ్ళను తలచుకోని ఆ నిబంధనను తర్వాత సడలించినట్లున్నారు. ఇప్పుడు విడిగా కూడా లభ్యమవుతోంది.

సాదా ప్రతి వెల 558/-, లైబ్రరీ ప్రతి వెల 1116/-


9 comments

Post a Comment