ఈ అవమానాలు మనకు కొత్తా ?!

      

      మొన్నటికి మొన్న కడప జిల్లా మైదుకూరులో, తెలుగులో మాట్లాడిన ఇద్దరు విద్యార్థుల మెడలో 'నేను తెలుగులో మాట్లాడను ' అని వ్రాసున్న పలకలు వేలాడదీయించి స్కూలంతా తిప్పించిన ఉపాధ్యాయుని ఉదంతం విన్నాం.అది మర్చిపోకముందే దాన్ని మించిన దారుణం విజయవాడలో నిన్నతొంగిచూసింది.

పాఠశాలలో ఉపాధ్యాయురాలు అడిగిన ప్రశ్నకు తెలుగులో సమాధానమిచ్చిన నేరానికి,ముగ్గురు పిల్లలు తమ బట్టలు విప్పి బయట నిలబడాల్సి వచ్చింది.అవమానం భరించలేక ఓ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటే అప్పుడు విషయం బయటికి పొక్కింది.మొదట బెట్టు చేసిన యాజమాన్యం,వెల్లువెత్తిన నిరసనలకు,ఒత్తిళ్ళకు తలొగ్గి ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది.యథాప్రకారంగా తప్పులన్ని టీచర్ల పై నెట్టి,తమకేమీ తెలియదని తప్పించుకుంది.అయితే తమకు జీతమిచ్చే యాజమాన్యం అదేశాలకు అనుగుణంగానే సదరు ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు అలా చెయ్యాల్సి వస్తున్నారు గాని,అదంతా తెలుగుభాష పై వాళ్ళకున్న అకారణ ద్వేషం అనుకోలేం.మైదుకూరులో సెయింట్ జోసెఫ్ స్కూల్,విజయవాడలో సెయింట్ ఆన్స్ స్కూల్..వెలుగులోకి వస్తున్న ఇటువంటి సంఘటనలు క్రిస్టియన్ మిషినరీ స్కూల్లల్లోనే జరుగుతూండటం కొసమెరుపు.కేవలం ఆ పాఠశాలల్లోనే ఈ దురాగతాలు జరుగుతాయని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ,మిషినరీ స్కూల్లు ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివాయని మాత్రం ఘంటాపధంగా చెప్పగలను.

అయితే ఈ అవమానాలు మనకు కొత్త కాదు.తెలుగులో మాట్లాడరాదని హుకుం జారీ చేసి,మాట్లాడితే జరిమానాలు, శిక్షలు విధించే పాఠశాలలు మన రాష్ట్రంలో కోకొల్లలు.సెయింట్ ఆన్స్ స్కూల్లోని ఈ నిబంధనలు ఈ మధ్య కొత్తగా ప్రవేశపెట్టినవి కావు.ఎన్నో ఎళ్ళుగా అమల్లో వున్నవే.మనకు చుచాయిగా అయినా తెలిసిన విషయాలే.కాబట్టి ఇప్పుడు కొత్తగా 'హవ్వ హవ్వ ' అని బుగ్గలు నొక్కుకొని మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.కాకపోతే ఇటువంటి పెడ ధోరణులు అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవల్సిన అవసరం చాలా వుంది.ఊహ తెలిశాక పిల్లలు తమ భావాల్ని వ్యక్తపరిచేది మాతృభాషలోనే.ఆ భాషని చిదిమేసి,పదజాలాన్ని రూపుమాపి,' అమ్మా' అనే బిడ్డ ఏడుపుని కూడా,తెలుగులో కాక ఇంగ్లీష్ లోకి అనువదించి,మార్చి ' ఓ మై గాడ్ ' అనేలా చేయాలనే తపన ప్రైవేటు పాఠశాలల్లో మితిమీరిపోతోంది. ఆ దుస్థితికి మనం దిగజారిపోకుండా చూసుకోవాలి.చిన్ననాటి నుండే తెలుగు భాష ఔన్నత్యాన్ని పిల్లల్లో పెంపొందించి,తెలుగు లో మాట్లాడటం,ఆలోచించటం,పుస్తకాలు చదవటం నేర్పించాలి.మనకు మాత్రమే సొంతమైన కమ్మని పద్యాలని కొన్నైనా కంఠతా పట్టించాలి.' మా తెలుగు తల్లికి మల్లేపూదండ ' పాట వింటే గర్వంతో గుండె ఉప్పొంగి,ఉద్వేగంతో కళ్ళలో నీళ్ళు తిరిగే అభిమానం పిల్లల్లో కలగాలి.ఆ బాధ్యత తల్లిదండ్రులందరి మీదా ఉంది.దురదృష్టవశాత్తూ ఇద్దరు చదువుకున్న తెలుగువాళ్ళు ఒకరికొకరు తారసపడినా ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు.ఈ జాడ్యాన్ని తొలగించుకోవాలి.మన భాషను మనమే గౌరవించుకోకపొతే పలుచనైపోతాం.కన్నతల్లిని,సొంత ఊరిని,మాతృభాషని అవమానించేవాళ్ళు పశువులతో సమానం.

ఎన్ని అవమానాలు జరిగినా,దున్నపోతు మీద జడివాన కురిసినట్లు కొన్ని సంవత్సరాలుగా తెలుగుభాష విషయంలో నిస్తేజంగా వున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యే కళ్ళుతెరిచి కలయచూసే ప్రయత్నం చేస్తోంది.పాఠశాలల్లో ' మా తెలుగుతల్లికి మల్లెపూదండా ' పాడాలనే నిబంధన విధించింది.విద్యార్థులను దండించిన ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకుంటూ సంఘటన పునరావృతమైతే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది.ఇది ముదావహం.అప్పుడే భవిష్యత్తులో మరే పాఠశాల ఇటువంటి దుస్సాహసానికి పూనుకోదు.ఈ చొరవను అధికార కార్యకాలాపాలను తెలుగులో జరిపే విషయంలో కుడా చూపించాలి.తెలుగుతల్లి విగ్రహాలు ధ్వంసం చేసి,' మా తెలుగు తల్లికి ' పాటని అడ్డుకొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవలి.ప్రాచీనభాష హోదా విషయమై న్యాయస్థానంలో ఉన్న పేచిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి.అప్పుడే తెగులు పట్టిన తెలుగుజాతికి విముక్తి.

జై తెలుగుతల్లి !



3 comments

Post a Comment

గోనగన్నారెడ్డి వాల్ పేపర్

సింహ షూటింగ్ లో ఆ మధ్య నందమూరి బాలకృష్ణ, గుణశేఖర్ దర్శకత్వంలో తను గోనగన్నారెడ్డి సినిమా చెయ్యబోతున్నట్లు చెప్పారు.గోనగన్నారెడ్డి అడవిబాపిరాజు గారి చరిత్రాత్మక నవల.కొంతకాలంగా ఈ సినిమా హీరో ఎన్.టీ.ఆర్ అని నాగార్జున అని వెబ్ సైట్స్ లో ఉహాగానాలు జరిగి తర్వాత నిలిచిపోయాయి.వాటికి తెరదించుతూ ఆ సినిమా తనే చెయ్యబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు.ఒక ప్రసిద్ధమైన చరిత్రాత్మక నవలని తెరకెక్కించే ప్రయత్నం జరగటం సినీప్రియులందరూ సంతోషించాల్సిన విషయం.గోన గన్నారెడ్డి గా బాలయ్యని ఊహిస్తూ వాటర్ కలర్స్ తో నేను వేసిన చిత్రం ఇది.



4 comments

Post a Comment

మధురాంతకం రాజారాం కథలు




పుస్తకాల కోసం విశాలాంధ్ర బుక్ హౌస్ సందర్శించిన ప్రతిసారీ ఈ పుస్తకం చూసి కొనాలనుకోవడం,తర్వాత అనేక కారణాలతో దాన్ని వాయిదా వేసి పాపులర్ రచయితల నవలలు కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళడం నాకు పరిపాటి. పాపులర్ అన్న పదం వాడినందుకు సాహితీ అభిమానులు క్షమించాలి. ఇక్కడ నా ఉద్దేశ్యం మధురాంతకం రాజారాంగారి పేరుప్రఖ్యాతులని తక్కువచేసి చూపడం కాదు. రాజారాంగారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకొని వుండవచ్చు. గౌరవ డాక్టరేట్లు,మరెన్నో సత్కారలు పొందివుండవచ్చు. కానీ ఈతరం కుర్రకారుకి, వారపత్రికల పాఠకులకి ఒక యండమూరి వీరేంద్రనాథ్, ఒక మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఒక యద్దనపూడి సులోచనారాణి తెలిసినంతగా ఆయన గురుంచి తెలియదన్నది నిర్వివాదాంశం. అలాంటి పాఠకులలో ఒకడినైన నేను, ఇలాక్కాదనిచెప్పి ఓ రోజు ఎలాగైతేనేం మొదటి భాగం కొనేశాను.కొన్నతర్వాత అందులోని కథలు చదువుకొని ఆశ్చర్యపోయాను. రుచికరమైన పదార్థం తిన్నాక దానికోసం మరింత అర్రులుచాచినట్లు మిగతా నాలుగు భాగాలు కూడా కొని గుక్కతిప్పుకోకుండా చదివేశాను.
 



 రాజారాంగారి కథలు పంచదారగుళికల్లాంటివి. నోట్లో వేసుకోగానే కరిగిపోయినట్లు చదవగానే అందులోని సారమంతా అంతరాంతరాల్లో ఇంకిపోయి, మనసంతా ఒకరకమైన హాయిని చేకురిస్తాయి. చిన్నప్పుడు పండువెన్నెల్లో ఆరుబయట పక్కలు పరుచుకొని, బామ్మ కథలు చెబుతూంటే ఆ కథలలోని పాత్రలను ఊహించుకొంటూ, ‘ఊ’కొడుతూ ప్రశాంతంగా నిదరోయినట్లు రాజారంగారి కథలు చదువుతూ స్వాప్నిక లోకాలలో తేలిపోతాం. వారి శైలి విలక్షణమైనది. అది అందమైన తెలుగు నుడికారాలు, మనం మరిచిపోయిన ఉపమానాలు, సామెతలు ప్రోదిచేసి సునిశిత హాస్యం రంగరించి, చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా పాఠకుల హృదయల్లోకి బట్వాడా చేస్తుంది.

ఆయన రచనావ్యాసంగానికి వారి వృత్తి కూడా ఎంతో దోహదం చేసిందనే చెప్పాలి. అచ్చమైన గ్రామీణ వాతవరణంలో పుట్టిపెరిగి,స్కూలుటీచరుగా పల్లెటూళ్ళు, పేటలు తిరుగుతూ, పలురకాల మనుషుల్ని, భిన్న మనస్తత్వాలని తరచిచూసే అవకాశం ఆయనకు కలిగింది. ఆ అనుభవాలనే సాకల్యంగా కథల రూపంలో విడమరిచి చెప్పి గ్రామీణజీవితానికి, మధ్యతరగతి మానవుల మానసిక వికారాలకి, ప్రవృత్తులకి, సగటు మనిషి సమస్యల వైచిత్రికి నిలువుటద్దం పట్టి ‘మరేం పర్లేద’ని భరోసా ఇస్తారు. చాలా కథలలో రచయితే సూత్రధారై కథను నడిపిస్తాడు. ‘సర్కసుడేరా’ కథలో సర్కసు ఫీట్లకు విస్తుబోయిచూస్తుంటే నిజజీవితంలో కడుపు కోసం అనేకమంది అభాగ్యులు అంతకంటే ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారని చెప్పే నాగులు,’ ఎడారికోయిల’ లో, విదేశాలలో స్థిరపడి తండ్రి మరచిపోయిన తన గ్రామీణ మూలాలు వెదుక్కుంటూ వెళ్ళే రవిబాబు,’ గ్రూప్ ఫోటో ‘ లో మనుషులంటే గిట్టక ఊరికి దూరంగా బ్రతుకుతూ చివరికి ఆ ఊరివారివల్లే బ్రతికిబట్టకట్టి మారిపోయే కోదండం, ‘కామదహనం’ లో మారుపేరుతో బూతుసాహిత్యం వ్రాస్తూ పెళ్ళయ్యాక మారిపోయే చలపతి,’ పులిపైనస్వారీ ‘ లో సినిమా ప్రొడ్యూసరుకి జ్యోతిష్యునిలా నమ్మించి బురిడీ కొట్టించే పిచ్చి కిష్టయ్య,’ కొండారెడ్డి కుతురు ‘ లో భర్తను హతమార్చడానికి వచ్చిన కసాయివ్యక్తులకి తిండిపెట్టి,వాళ్ళను మార్చి క్షమించే నాగతులసి, ‘ఓటుకత’ లో ఓటరు లిస్టులో తన పేరు ఉండి కూడా ఒక్కసారి కూడా ఓటు వెయ్యలేకపోయిన పశువులు మేపుకొనే గంగన్న,’మిస్ ఎమెరాల్డా ఫ్రం ఫ్రాన్స్ ‘ లో తల్లితండ్రుల ప్రేమకు నోచుకోక అనాథలా పెరిగి భారతదేశంతో అనుబంధాలు పెంచుకొనే ఎమెరాల్డా, ‘స్వస్థానం ‘ లో అనవసర ఆడంబరాలకుపోయి అవమానాలపాలైన నీరజ, ’జగమేలే పరమాత్మ’ లో గొప్ప సంగీతవిద్వాంసుడై వుండి కూడా, తగినంత సొమ్ము ఇవ్వలేదని నిర్వాకులని సంస్కారహీనంగా చూసే దేవకోట అనంతనారయణ శాస్త్రి,ఆయనకు బుద్ధిచెప్పే నిర్వాహకుడు శ్రీనివాసమూర్తి,…ఒక్కటేమిటి ఇలా ఎన్నో ఎన్నెన్నో పాత్రలు,వాటి స్వాభావాలు,యోగవియోగాలు పాఠకులని కట్టిపడేస్తాయి.పెద్దబాలశిక్ష లా ప్రపంచ జ్ఞానాన్ని బోధిస్తూ,పంచతంత్రం లా చిన్న చిన్న కథలలో జీవితసారాన్ని వడ్డిస్తాయి. వ్యక్తుల్ని,సన్నివేశాల్ని,రాగద్వేషాల్ని,ఈతిబాధల్ని,జీవనదృక్పథాన్ని ఇంత అద్బుతంగా,ఇంత కూలంకషంగా విశదపరిచిన రచయితలు తెలుగులో బహుకొద్దిమంది మాత్రమే.వారిలో రాజారాం ప్రథమశ్రేణిలో వుంటారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.ప్రతి సహిత్యాభిలాషి ఇంట్లో,ముఖ్యంగా వర్థమాన రచయితల గ్రంథాలయాల్లో ఉండవలసిన పుస్తకాలు ఇవి. ఇది మన సంస్కృతి. ఇది మన నాగరికత.

ప్రతులకు విశాలాంధ్ర బుక్ హౌస్ ని సంప్రదించవచ్చు.


పుస్తకం.నెట్ లో ప్రచురితం


3 comments

Post a Comment