మొదటి రోజు తూగోజి లోని ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించాం.
రెండవ రోజు పగోజి వంతు.
ముందు గునుపూడి, ఆ పై పాలకొల్లు, అంతర్వేది, వీలు కుదిరితే యానాం చుట్టిరావాలని నిర్ణయించుకున్నాం.
ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా మా పగోజి యాత్ర ప్రారంభమైంది. ధవళేశ్వరం ఒక చిన్న గ్రామం. రాజమండ్రికి ఎనిమిది కిలోమిటర్ల దూరంలో ఉంది. పరవళ్ళు తొక్కే ఆకాశగంగను తన జాటాజూటంలో బంధించి గర్వమడగించి భువిపైకి దించిన పరమశివునిలా, మిడిసిపడే ఉత్తుంగ గోదావరికి సర్ అర్థర్ కాటన్ దొర ముకుతాడు వేసిందిక్కడే. 1852లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ ప్రాజెక్టు తన నిర్దేశిత కాలపరిమితి- వందేళ్ళనూ దిగ్విజయంగా పూర్తిచేసుకుని 160 సంవత్సరాలైనా ఇంకా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. కరువు కాటకాలతో తల్లడిల్లిపోయి భుక్తి కోసం పిల్లల్ని అమ్ముకున్న ప్రజలకు కాటన్‌దొర దార్శనికత కడుపునిండా తిండి పెట్టింది. పరాయివాడైనా పరుల సంక్షేమం కోసం పాటుపడ్డాడు కాబట్టి పట్టం కట్టి హృదయాల్లో పదిలంగా దాచుకున్నారు ప్రజలు. ఆ మాత్రం కృతజ్ఞత పాలకులకు కొరవడింది. ఆనకట్ట క్రిందే శిథిలావస్థలోనున్న కాటన్‌మ్యూజియం నిర్లక్ష్యానికి నిలువుటద్దం పడుతుంది.
తాడేపల్లిగూడేం నుంచి భీమవరం వెళ్ళే రోడ్డు ఘోరంగా ఉంది. భీమవరం వెళ్ళాలంటే నానా సాకులు చెప్పి మా డ్రైవరు ఎందుకు తప్పించుకోబోయాడో మాకప్పుడు అర్థమయ్యింది. కంకర తేలిపోయి గుంతలు పడిన రోడ్లపై గాల్లో తేలిపోతున్నట్లుగా వెళ్ళిపోతూ అంతరిక్షంలోని భారరహిత స్థితిని పైసా ఖర్చు లేకుండా ప్రత్యక్షంగా అనుభవిస్తారు ప్రయాణికులు. వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకొనే మా చిత్తూరు జిల్లాలో రోడ్లు ఇంతకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. పిల్లకాలువ పట్టీలు పాదాలకు తొడుక్కొని పరవశంతో నర్తించే
కన్నెపైర్లే లేకపోతే భీమవరం ప్రయాణం చప్పగా ఉండేది. త్యాగరాజుకు శ్రీరాముడు తప్ప ప్రాపంచిక సుఖాలేవీ పట్టనట్లు, మీలోని సౌందర్య పిపాస మీ సుఖలాలసను నియంత్రించగలిగితే... ఊళ్ళు దాటి వెళ్తూంటే కలువలతో కళకళలాడే చెరువులను, మొపెడ్ల పై అరటిగెలలు రెండువైపులా వేళ్ళాడదీసుకుని బాట మీద సాగిపోయే వాహనదారులను, గోచి తప్ప ఒంటి మీద మరో వస్త్రం లేకపోయినా ప్రపంచంతో పనిలేనట్లు పరిశ్రమించే రైతులను చూస్తూ రోడ్ల దుస్థితి లాంటి ప్రాపంచిక కష్టాలు మరచిపోయి తాదాత్య్మంతో సాగిపోవచ్చు. కోట్ల విలువ చేసే భూములున్నా సాధారణ జీవితం గడపటానికే ఇక్కడి ప్రజలు మొగ్గు చూపుతారని వాళ్ళ ఆహార్యం చెప్పకనే చెబుతుంది. గోదావరి జిల్లాల ప్రజలు మాటలంటే చెవికోసుకుంటారని, అనుబంధాలకు ప్రాణమిస్తారని, తమ శైలికి భిన్నమైన ఇతర జిల్లాల వాళ్ళతో వాళ్ళు సులభంగా సంబంధాలు ఏర్పరుచుకోలేరని చెప్పాడు డ్రైవరు. ఆ మాట నిజమేననిపించింది.
గునుపూడి సోమేశ్వరాలయం
పరమశివుడికున్న అనేక నామాల్లో భీమ ఒకటి. ఆ పేరు మీదనే ఒక్కప్పుడు ఈ ప్రాంతం
భీమపురంగా పిలవబడేదని, కాలక్రమేణా అదే భీమవరంగా మారిందని చెబుతారు. భీమవరం గురుంచి మా స్నేహితులు గొప్పగా చెప్పారు కానీ నాకదేమీ కనిపించలేదు. బహుశా మేమెంచుకున్న మార్గం సరికాదేమో. అశ్వారూఢుడైన సర్ అర్థర్ కాటన్, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దాటుకుని మావుళ్ళమ్మ గుడి మీదుగా ఊళ్ళోకి వెళ్తే రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని మరో దారి చూపించారు. ఇరుకు రోడ్ల మీద నేర్పుగా వాహనాన్ని నడుపుతూ గునుపూడిలోని సోమేశ్వరాలయం చేర్చాడు డ్రైవరు.
దక్షారామం, కుమారారామాలలోని లింగస్వరూపాలతో పోల్చితే సోమారామంలోని లింగస్వరూపం చిన్నది. చంద్రుడు ప్రతిష్టించి పూజించిన లింగం కాబట్టి సోమేశ్వరుడన్నారు. దానికి తగ్గట్లుగానే పౌర్ణమి నాడు
శ్వేతవర్ణంలో మెరిసిపోతూ అమావాస్య నాడు గోధుమ వర్ణంలోకి మారిపోతూ నేత్రానందం కలిగిస్తారు స్వామి వారు. దేవాలయానికి అభిముఖంగానున్న
సోమకుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. దేశంలో మరో శివాలయంలోనూ లేని విధంగా, ఆలయానికి ఎదురుగా ఎత్తైన స్తంభం మీద కూర్చున్న నందీశ్వరుడూ ఇక్కడే కనిపిస్తాడు. స్వామి వారి ఆలయంపైనే అన్నాపూర్ణాదేవి కొలువై ఉండటం మరో విశేషం. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్థన స్వామి.
పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి
సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ప్రతిష్టించి పూజించిన లింగం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుడు. పాలకొల్లును పూర్వం క్షీరపురి, పాలకొలను, ఉపమన్యుపురం అనే పేర్లతో పిలిచేవారట. ఈ క్షేత్రం మీద రకరకాల గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
శివభక్తాగ్రేసరుడైన వ్యాఘ్రపాద మహర్షి కుమారుడు ఉపమన్యుడు. బాల్యంలో ఆయనోసారి మామగారింటికి వెళ్ళి అక్కడ ఆవుపాల మాధుర్యం చవిచూసి, తిరిగి వచ్చాక తనకు రోజూ ఆవుపాలే కావాలని మారం చేస్తూంటే ఆయన తల్లి పేదరికంతో కలిగిన తన ఆశక్తతను తెలియజేసి, చరాచర సృష్టికి మూలాధారుడైన పరమేశ్వరున్నే ప్రార్థించమని పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేస్తుంది. తల్లి ఉద్బోధతో ప్రభావితుడైన ఉపమన్యుడు హిమాలయాలకు వెళ్ళి పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి తదేక దీక్షతో తపమాచరిస్తూంటే దేవతలే ఆశ్చర్యపోయారు. ఉపమన్యుడి భక్తితత్పరతను పరీక్షించదలచిన పార్వతీ పరమేశ్వరులు శచీంద్రులలా రూపాలు మార్చుకుని, ఐరావతంగా మారిన నందీశ్వరున్ని అధిరోహించి, ప్రమథ గణాలు దేవతా స్వరూపాలై వెంటరాగా పిల్లవాడి ముందు ప్రత్యక్షమయ్యారు. భోళాశంకరున్ని నమ్మి ఇంత బూది మిగుల్చుకోవటం కంటే అష్టైశ్వర్యాలను ప్రసాదించే అమరేంద్రున్ని కొలవటమే ఉత్తమమని అతని మనస్సు మార్చే ప్రయత్నం చేస్తారు. ఇంత తపస్సు చేసి వినరాని మాటలు వినాల్సి వచ్చినందుకు ఉపమన్యుడు బాధపడిపోతాడు. శివ నింద చేసినందుకు ఇంద్రుడిగా భావించిన శివుడిపై అఘోరాస్త్రం ప్రయోగించి ఆత్మాహుతికి సిద్ధపడతాడు. శివపార్వతులు సంతోషించి తమ నిజస్వరూపాలతో ప్రత్యక్షమై ఆ బాలున్ని శాంతపరచి వరం కోరుకోమంటారు. ఉపమన్యుడు ఆనందాతిశయంతో పరమేశ్వరున్ని పరిపరివిధాలా ప్రార్థించి తన మనస్సుకు శివ వైక్లభ్యం కలగని స్థితిని, నిత్యం శివుడి సన్నిధిలో ఉండే భాగ్యాన్ని, తన వంశంలో ఎవరికీ ఆవు పాలకు కరువు రాని అదృష్టాన్ని కోరుకుంటాడు. కోరుకున్న వరాలతో పాటూ జ్ఞానాన్ని, గణాధిపత్యాన్ని ప్రసాదించి తన పుత్రుడిగా స్వీకరిస్తాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి నిత్యయవ్వనాన్ని, క్షీరసాగరాన్ని కరుణిస్తుంది. అలా ఈ క్షేత్రానికి ఉపమన్యుపురం, పాలకొలను, క్షీరపురి అనే పేర్లు వచ్చాయి.
పరమేశ్వర కృపతో శ్రీమహావిష్ణువు సుదర్శనచక్రం పొందిన క్షేత్రం ఇదేనని, త్రేతాయుగంలో సీతారాములు కొలిచిన లింగం కాబట్టి రామలింగేశ్వరుడయ్యాడని ఇంకొన్ని గాథలు చెబుతాయి. కాశిలో ఏడాదిపాటూ భక్తితో గడిపితే కలిగే పుణ్యం ఇక్కడ ఒక్క నిద్రతో కలుగుతుందని క్షేత్ర ప్రాశస్త్యం చెబుతోంది.
అల్లువారి గీతా థియేటర్‌ని, అల్లురామలింగయ్య విగ్రహాన్ని దాటుకుని ఆలయాన్ని చేరుకున్నాం. ఇతర దేవాలయాలకున్నంత విశాలమైన ఆవరణ ఈ ఆలయానికి లేదు. ఇరుకు సందులో ఉంది. వాహానాలన్నీ ఆలయానికి ఆమడ దూరంలో ఆపి ఉంచి దర్శనానికి వెళ్ళాలి.
ఆలయంలోకి ఆడుగుపెట్టగానే ధ్వజస్తంభం దగ్గర తపోదీక్షలో ఉన్న ఈశ్వర స్వరూపం ముచ్చటగొలుపుతుంది. సోమేశ్వరలింగంలా క్షీరారామలింగం కూడా చిన్నది. లింగం మొనదేలి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. కుమారస్వామి బేధించిన లింగానికి ఇది శిరోభాగమని భక్తుల విశ్వాసం. ఆలయంలోపలి గోడలపై చెక్కిన వివిధ దేవతా మూర్తుల శిల్పాలు, పురాణ ఘట్టాలు భక్తులను ఆకర్షిస్తాయి. ఈ క్షేత్రానికీ జనార్థనస్వామే క్షేత్రపాలకుడు.
ఇక్కడితో మా పంచారామ యాత్ర పూర్తయ్యింది.
తరువాత మజిలీ అంతర్వేది.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి
పాలకొల్లు నుంచి అంతర్వేది వెళ్ళే మార్గం మనోహరంగా ఉంది. చించినాడ బ్రిడ్జి దగ్గర గోదావరి చిద్విలాసాలు చూడాల్సిందే. దిండి మీదుగా వెళ్తూంటే ఎటుచూసినా చేపల చెరువులు, కొబ్బరితోటలు లేదా పంటపొలాలూను. పోనుపోను రోడ్లు సన్నబడిపోయి, కారులోంచి క్రిందకు దిగి ఏమరుపాటున కుడివైపుకో ఎడమవైపుకో రెండడుగులు వేస్తే పిల్లకాలువలో పడిపోయేలా తయారవుతుంది పరిస్థితి. వన్వే ట్రాఫిక్ అన్నమాట. రోడ్డుకు రెండువైపులా కాలువగట్ల మీద స్థిరనివాసలేర్పరుచుకున్న మనుష్యుల్ని చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. ఇళ్ళకు రోడ్డుకు మధ్య కొబ్బరిబోదెలే వారధులు. సూర్యుడు కరుణించినంతవరకూ వీళ్ళ సుఖజీవనానికి ఢోకా లేదు. ఒక్క రెండు పదున్ల వానపడితే మాత్రం బిక్కు బిక్కుమంటూ గడపాల్సిందే. కాలువలు పొంగెత్తి ఇళ్ళను ముంచెత్తక మానవు. వర్షాకాలంలో ఇక సరేసరి. భావావేశం పేరిట పైత్యం వ్రాసే నాబోటి వాడెవడైనా ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి వివశుడైపోయి ఒక ఇల్లు కట్టుకుని, రెండు కొబ్బరిచెట్ల మధ్య ఊయల బిగించి, కొబ్బరాకుల కిటికీల్లోంచి ఆకాశంవైపు చూస్తూ ఆలోచనా స్రవంతిలో జీవితాన్ని మమేకం చేద్దామని ఆశపడితే ఒక్క నిమిషం మళ్ళీ పునరాలోచించాల్సి ఉంటుంది.
అంతర్వేది చేరేసరికి మధ్యాహ్నమైంది. సముద్రతీరం కాబట్టి ఇసుకమేటలు ఎక్కువ పచ్చదనం తక్కువ. ఊరు కూడా చాలా చిన్నది. గుడి, గుడిదగ్గర్లో కొన్ని ఇళ్ళు..అంతే.
విశాలమైన అంతర్వేది ఆలయం నవనారసింహ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ నృసింహుడు పశ్చిమాభిముఖుడై భక్తులకు దర్శనమివ్వడం విశేషం.ఇక్కడే వశిష్టగోదావరి నది సముద్రంలో కలుస్తుంది. వశిష్టగోదావరికి, సముద్రానికి మధ్యనున్న ఈ స్థలంలోనే పూర్వం బ్రహ్మదేవుడు వేదిక నిర్మించి రుద్రయాగం చేశాడని ఆనాటి నుండి ఈ క్షేత్రం అంతర్వేదిగా పిలువబడుతోందని పురాణం చెబుతోంది. ఆనాడు బ్రహ్మ ప్రతిష్ఠించిన నీలకంఠేశ్వరుడే ఇక్కడి క్షేత్రపాలకుడు.
మరో గాథ ప్రకారం హిరణ్యుక్షుడి కొడుకైన రక్తవిలోచనుడనే రాక్షసుడు వరగర్వంతో వశిష్టాశ్రమంపై దాడి చేసి అందరిని చంపి తినేయటంతో ఆయన కలత చెంది స్థితికారకుడైన శ్రీమన్నారాయణున్ని శరణు కోరాడు. శ్రీహరి అభయమిచ్చి నృసింహావతారియై వచ్చి రక్తవిలోచనుడి శిరస్సును సుదర్శన చక్రంతో ఖండించబోతే, ఆశ్చర్యంగా క్రింద పడిన ప్రతి రక్తపుబొట్టు నుండి మరో రక్తవిలోచనుడు ఉద్భవించి ఆయుధాలు విసరడం ప్రారంభించాడు. నృసింహుడు మహామాయను ప్రేరేపిస్తే ఆమె అశ్వారూఢయై వచ్చి ఆ రాక్షసుడి రక్తం ఒక్క చుక్క నేలపాలవకుండా మొత్తం తాగేసి సంహారానికి సహకరించింది. వశిష్ట మహర్షి కోరిక మేరకు లక్ష్మీ నరసింహుడిగా వెలసి ఆనాటి నుండి పూజలందుకొంటున్నాడు మహావిష్ణువు. మహామాయ
అశ్వారూఢాంబికగా ,గుర్రాలక్కగా పూజలందుకుంటోంది. ఆమె ఆనాడు తాగి విడిచిన రక్తం రక్తకుల్యానదిగా పిలవబడుతోంది. ఆలయానికి ఓవైపు ఎర్రటివర్ణంతో ప్రవహిస్తున్న నది అదేనని ఒక విశ్వాసం. రాక్షస సంహారానంతరం నృసింహుడు సుదర్శనచక్రం కడిగిన తీర్థం చక్రతీర్థంగా ప్రఖ్యాతికెక్కింది.
దైవదర్శనం పూర్తి చేసుకుని యథాప్రకారం గుడిలో జరిగే అన్నదానంతో మా జఠరాగ్నిని శాంతపరిచి ఆలయం వెలుపలికి వస్తే వశిష్టగోదావరి సముద్రంలో కలిసే ప్రాంతానికి తీసుకెళ్తామంటూ కొందరు పడవలవాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టారు. మిట్టమధ్యాహ్నం సముద్రంలోకి వెళ్ళడమా అని మేం సందేహిస్తూంటే మా డ్రైవరు అవసరం లేదు ఫోమ్మంటూ వాళ్ళను కసురుకున్నాడు. కమీషన్ల కోసం కక్కుర్తిపడుతున్నావంటూ వాళ్ళు మా డ్రైవరు మీద విరుచుకుపడ్డారు. అతని బాధ అతనిది. మేం ఇప్పుడు సముద్రంలోకి వెళ్తే తిరిగొచ్చేసరికి ఆలస్యం అవుతుంది, అప్పుడు యానాం వెళ్ళడం కష్టమని అతని ఉద్దేశ్యం. తనే అన్ని ప్రదేశాలూ చూపిస్తానని మమ్మల్ని ఒప్పించి అంతర్వేది బీచ్‌ని, తీరం నుంచే దూరంగా కనిపిస్తున్న సంగమ స్థానాన్ని చూపించాడు. అంతర్వేది బీచ్ అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది. సునామీల సమయంలో కోతకు గురైన తీరప్రాంతాన్ని గమనిస్తే ఆ ఊళ్ళో ఎందుకు అంత తక్కువమంది నివసిస్తున్నారో అవగతమైంది.
యానాం
అంతర్వేది నుంచి రాజోలు, అమలాపురం వైపుగా యానాం వెళ్ళాం. అటు కోనసీమను ఇటు యానాంను కలుపుతూ గోదావరి నది పై 110 కోట్లతో నిర్మించిన బాలయోగి వారధి ఒక అద్భుతం. బ్రిడ్జి పైనుంచి వెళ్తూ పరవళ్ళు తొక్కుతున్న గోదావరి నదిని పరికిస్తే సంభ్రమాశ్చర్యాలతో నోరుమూతబడ్డం ఖాయం. దివంగత స్పీకర్ బాలయోగి ఈ వారధి ద్వారా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. భౌగోళికంగా గోదావరిజిల్లాలో ఉన్నా యానాం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పరిధిలోకి వస్తుంది. విశాలమైన వీధులు, పరిశుభ్రత, ప్రజల జీవన విధానం ముచ్చటగొలుపుతుంది. యానాం బీచ్ దగ్గరున్న పొడవైన శివలింగం చూపరులని ఆకర్షిస్తుంది. ప్రక్కనే చేపల మార్కెట్. చుట్టుప్రక్కలా అనేక లంక గ్రామాలు, చిన్న చిన్న ద్వీపాలు. ఓపిగ్గా చూడాలంటే ఒక్కరోజైనా కావల్సిందే.
కాసేపు బీచ్‌లో గడిపి అస్తమిస్తున్న సంధ్యవెలుగులతో ఆత్మశక్తిని రగలించుకొని తిరిగి రాజమండ్రి ప్రయాణమయ్యాం. వస్తూ వస్తూ ఒక చిన్న పల్లెటూరు దగ్గర రోడ్డు ప్రక్కన్నే చేస్తున్న వేడి వేడి మిరపకాయబజ్జీలు తినేసరికి ప్రాణం లేచివచ్చినట్లయ్యింది. బెంగుళూరులో ఇలా ఘాటుగా మసాలా దట్టించి, మధ్యలో ఉల్లిపాయలు వేసి,నిమ్మరసం పిండి మిరపకాయబజ్జీలు వడ్డించే బజ్జీకొట్ల కోసం ఎంత వెదికానో, ఎంత
వెదుకుతున్నానో.
-(సశేషం)
2 comments