• మెరిసే మేఘాలు

    మెరిసే మేఘాలు
  • కురిసే వర్షాలు

    కురిసే వర్షాలు
  • విరిసే పుష్పాలు

    విరిసే పుష్పాలు
  • మురిసే భువనాలు

    మురిసే భువనాలు
  • నాకు

    నాకు
  • కదిలే కావ్యాలు

    కదిలే కావ్యాలు

ఆరోగ్య శతకం డౌన్లోడ్ చేసుకోండి





రోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ?
ఆరోగ్యంగా ఉండటమంటే రోగాలు రాకుండా ఉండటమేనా ?
వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి ? వాటి నివరణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి

ఇలా అరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను వివరిస్తూ మా నాన్నగారు ఆరోగ్య శతకం వ్రాశారు. పాఠశాల విద్యార్థుల్లో ఆరోగ్యం మీద అవగాహన, చైతన్యం కలిగించటం ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. పద్యాలతో ప్రజారోగ్యం మీద పుస్తకాన్ని వెలువరించటం మాకు తెలిసి తెలుగులో ఇదే మొదటి సారి. ఈ విషయాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కుడా గుర్తించి ధృవపత్రం అందచేయటం జరిగింది.

పిల్లలకు పెద్దలకు అందరికీ అర్థమయ్యేలా 115 తేటగీతి పద్యాలతో సులభ శైలిలో సాగిన ఈ పుస్తకాన్ని   ఇక్కడి నుంచి  డౌన్లోడ్  చేసుకోవచ్చు.







తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మా నాన్నగారి పుస్తకం




మా నాన్నగారు ప్రజారోగ్యం మీద తెలుగులో 704 తేటగీతి పద్యాలతో "ఆరోగ్యగీత" అనే పుస్తకం వ్రాశారు.



 ప్రజారోగ్యం మీద తెలుగులో చాలా పుస్తకాలు వచన రూపంలో వచ్చాయి. కానీ ఇంతవరకు ఎవరూ ఇలా పద్యాలతో పుస్తకం వ్రాయలేదు. అలాగే ఆయన 100 పద్యాలతో "ఆరోగ్య శతకం" వ్రాశారు. ప్రజారోగ్యం మీద ఎవరూ తెలుగులో శతకం వ్రాయలేదు. మా నాన్నగారి పుస్తకమే మొదటిది.



ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మా నాన్నగారికి సన్మానం చేసి, ధృవపత్రం అందజేశారు.







రుద్రమదేవి - సమీక్ష




వెయ్యేళ్ళ పాటు తమ విజయపతాకాన్ని రెపరెపలాడించి శాతవాహనుల తర్వాత తెలుగుదేశాన్నంతా ఒక్క తాటిపై నడిపి జాతి సంస్కృతి సంప్రదాయాలపై బలమైన ముద్ర వేసిన ఘనత కాకతీయులది. ఆ ఇంటపుట్టిన శార్దూలం రాణీ రుద్రమదేవి. వంశరక్షణతో పాటూ రాజ్యసంరక్షణ అనే బృహత్తర ఆశయాన్ని తన భుజస్కందాల పై వేసుకొని,అబలగా తనను సమకట్టిన శత్రుసమూహానికి సబలనని నిరూపించి, తాత తండ్రుల కీర్తికి ఏ మాత్రం తగ్గకుండా రాజ్యపాలన చేసి సుస్థిర యశోచంద్రికలందుకొన్న ధీర వనిత ఆమె. ఆమె చరిత్ర నిత్యస్మరణీయం . భావితరాలకి ఆదర్శప్రాయం. 

ఇటువంటి ఉత్కృష్టమైన కథను ఎన్నుకొని తెరకెక్కించే సాహసం చేశారు దర్శకుడు గుణశేఖర్. మరి ఆయన ప్రయత్నం ఫలించిందా ?

చరిత్ర చెప్పిన రుద్రమదేవి కథకు చిత్రంలో చూపెట్టిన కథకూ ఉన్న వ్యత్యాసాలేమిటి ?

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితనం ఎలా ఉంది ?


చరిత్ర చెప్పిన కథ

తెలుగువాళ్ళ ఇంటిపేర్లు సాధారణంగా గ్రామాల పేర్లతోనో, లేక వాళ్ళు ఆరాధించిన దేవతల పేర్లతోనో ప్రారంభమవుతూంటాయి. కాకతి పేరుతో చాలా గ్రామాలున్నాయి కాబట్టి వీటిలో కాకతీయులు ఏ గ్రామానికి చెందినవారో చెప్పటం కష్టం. అయితే వీళ్ళు కాకతి అనే కులదేవతను ఆరాధించటం చేత కాకతీయులైనారని ప్రామాణికాలు చెబుతున్నాయి. కాకతీయులు గుమ్మడితీగకు పుట్టినవాళ్ళని ఒక అద్భుతమైన కథ శాసనాల్లో ఉంది. ఈ వంశపు మూలపురుషుడైన మాధవవర్మ మహారాజు కొడుకు పద్మసేనుడికి చాలా కాలం సంతానం కలుగలేదు. చివరకి ఆయన గుమ్మడికాయలతో అనుమకొండ పద్మాక్షిదేవిని పూజిస్తే ఆ దేవి అనుగ్రహంతో సంతానం కలిగిందట. వీళ్ళ వంశం అనుమకొండలో వేయ్యేళ్ళు వర్ధిల్లుతుందని దేవి అభయం ఇచ్చిందట. పద్మసేనుడి తర్వాత ఎంతోమంది రాజులు వచ్చారు కానీ వీరిలో కాకతి గుండ్యనను కాకతీయ సామ్రాజ్యానికి బాటలు వేసిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఈ వంశంలో ప్రఖ్యాతి కెక్కిన మహారాజులలో గణపతిదేవ మహారాజు ఒకడు. కాకతీయుల స్వర్ణయుగం ఆయనతోనే ప్రారంభమయ్యింది. ఆయనకు, సోమదేవికి కలిగిన ప్రథమ సంతానమే రుద్రమదేవి.


అమిత పరాక్రమవంతుడు,సుపరిపాలనా దక్షుడైన  మహారాజుకు పుత్ర సంతానం లేదన్న వార్త ప్రజలకు ఆశనిపాతం,శత్రురాజులకు ఆనందదాయకం. ఈ విషయం గ్రహించిన గణపతిదేవుడు శివదేవయ్య మంత్రి సూచనలతో రుద్రమదేవిని పురుషుడిగానే పెంచుతాడు.  రుద్రదేవ మహారాజుగా తన కూతురుని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. తండ్రి ఆశయాలను అర్థం చేసుకున్న రుద్రమదేవి తదణుగుణంగానే ఎన్నో త్యాగాలకోర్చి రాటుదేలుతుంది. యుక్తవయస్సు వచ్చాక ,రాజ్య రహస్యం తెలిసినవాడు, సర్వ సైన్యాధ్యక్షుడైన జయాపసేనాని కుతురు ముమ్ముడమ్మను రుద్రమ్మదేవికిచ్చి వివాహం జరిపిస్తాడు గణపతిదేవుడు. ముమ్ముడమ్మకు విషయం తెలియనివ్వకుండా తానొక వ్రతం చేస్తున్నానని అంతవరకూ దీక్షలో ఉండాలని చెబుతుంది రుద్రమదేవి.

గణపతిదేవుడు వృద్ధుడవుతాడు. రుద్రమ్మదేవి కాకతీయ సింహాసనం అధిరోహిస్తుంది. రాజ్యంలో అల్లకల్లోలం బయలుదేరుతుంది. గోనగన్నారెడ్డి తండ్రి గోనబుద్ధారెడ్డి. ఈయన కాకతీయులకున్న అనేకానేక సామంత రాజులలో ఒకడు. రంగనాథ రామాయణం అనే ప్రసిద్ధమైన కావ్యాన్ని కూడా వ్రాసి కవిగానూ తన సత్తా చాటిన వాడు. అతని తమ్ముడు లకుమయారెడ్డి. బుద్ధారెడ్డి ప్రభుభక్తి పరాయణుడు. యాభై యేళ్ళకు అతనికి సంతానం కలుగుతారు. వారు కుప్పాంబ, గన్నారెడ్డి, విఠలరెడ్డి. వయోభారం పెరిగి అవసానదశకి చేరిన బుద్ధారెడ్డి, తమ్ముడు లకుమయ్యని పిలిచి, తన పెద్ద కొడుకు గన్నారెడ్డి పేరుతో రాజ్యపాలన చెయ్యమని, అతను పెద్దయ్యాక రాజ్యం అతనికే అప్పగించి, వేరొక నగరం పరిపాలించుకొమ్మని చెప్పి కన్నుమూస్తాడు. లకుమయ్య తన అన్నకుమారులను   విద్యాభ్యాసం కోసం ఓరుగల్లు పంపి తనే రాజులా చెలామణి అవుతాడు. రుద్రమ్మ పీఠం ఎక్కాక, ‘ఒక ఆడదాని మోచేతినీళ్ళు తాగాలా’ అని హుంకరించి స్వాతంత్ర్యం ప్రకటించుకోవాలని నిర్ణయించుకుంటాడు. తనలాగే స్త్రీపాలనలో తలదాచుకోవడానికి ఇష్టపడని మిగతా సామంతరాజులతో, రుద్రమ్మదేవికి వరుసకు అన్నలైన హరిహరదేవులు, మురారిదేవులు, ఇతర శత్రురాజులతో చర్చలు జరుపుతూంటాడు.

గోనగన్నారెడ్డి తండ్రిలాగే కాకతీయవంశ వీరాభిమాని. పినతండ్రి తనకు చేసిన అన్యాయం, దేశంలో జరుగుతున్న పరిణామాలు గమనించి కొంతమంది వీరులను తయారుచేసి, రుద్రమ్మదేవిని కలుస్తాడు. తామంతా గజదొంగలగా అవతారమెత్తి, రాజ్యంలో చెలరేగుతున్న అక్రమాలను పారద్రోలి, తిరుగుబాట్లను అణిచివేస్తామని, అందుకు అనుజ్ఞ ఇవ్వమని కోరుతాడు. రుద్రమ్మదేవి సరేనంటుంది. గన్నారెడ్డి నల్లమల అడవులలో ఒక పాడుబడిన దుర్గాన్ని బాగుచేయించి, తన సేనతో రహస్యంగా అక్కడ ఉంటూ అధర్మనిర్మూలనం చేస్తూంటాడు.

లకుమయ్య తన కుమారుడు వరదారెడ్డిని ఆదవోని రాకుమారి అన్నాంబికకిచ్చి వివాహం చెయ్యాలని తలపోస్తాడు. అన్నాంబికకు ఆ పెళ్ళి ఇష్టం ఉండదు. గన్నారెడ్డి మెరుపులా వచ్చి వరదారెడ్డిని అపహరించుకుపోయి, కొంతకాలానికి విడిచిపెడతాడు. లకుమయ్య మళ్ళీ వివాహ ప్రయత్నం చెయ్యబోగా, గన్నారెడ్డి ఈ సారి వధువైన అన్నాంబికను అపహరించి, అక్క కుప్పాంబను తోడునిచ్చి బావగారి రాజ్యానికి చేరవేస్తాడు. కుప్పాంబ అన్నాంబికను ఓరుగల్లులో రుద్రమ్మ దగ్గర చేర్చి తిరిగి వస్తుంది.


ఒకనాడు రుద్రమ్మదేవి, అన్నాంబిక కొంతమంది వీరులతో కలిసి మొగిలిచెర్ల వెళ్ళి కాకతమ్మకు పూజలు చేస్తారు. తిరిగివస్తూండగా రుద్రమ్మదేవికి వరుసకు అన్నలైన హరిహర మురారిదేవులు సైన్యంతో విరుచుకపడతారు. సామంత రాజైన చాళుక్య వీరభధ్రుడు సుడిగాలిలా ఊడిపడి వారిని తుదముట్టించి ఆమెను రక్షిస్తాడు. దేవగిరి యాదవ మహాదేవరాజు ఎనిమిది లక్షల మాహాసైన్యం పోగుచేసుకోని ఓరుగల్లు మీద దండయాత్రకు వస్తాడు. గన్నారెడ్డి అతని సైన్యంపై పడి అపారమైన ప్రాణనష్టం కలిగిస్తాడు. రుద్రమ్మదేవి మంత్ర దండనాయకులతో సమావేశం ఏర్పాటుచేసి పక్కా ప్రణాళికతో, హోరాహోరీగా యుద్ధం చేసి అతన్ని తరిమికొడుతుంది. పారిపోతున్న అతని సైన్యాలని కొండలమాటున దాగి గన్నారెడ్డి సర్వనాశనం చేస్తాడు. దిక్కుతోచని స్థితిలో మహదేవరాజు రుద్రమ్మదేవి శరణుకోరి బ్రతికి బయటపడతాడు.


ఓరుగల్లులో సంబరాలు మిన్నంటుతాయి. నిండుసభలో గన్నారెడ్డి గజదొంగ కాదని స్పష్టం చేస్తాడు శివదేవయ్య మంత్రి. లకుమయ్యను, ఇతర స్వామిద్రోహులను క్షమించి విడిచిపెడతారు. రుద్రమ్మదేవి మారుపెళ్ళికి గణపతిదేవుడు విధించిన షరతులు మూడు. రుద్రమ్మను పెళ్ళాడిన పురుషుడు ఎంతగొప్పవాడైనా చక్రవర్తి కారాదు. రుద్రమ్మదేవియే రాజ్యాన్ని పాలించాలి. ఆమె కుమారుడు రాజ్యం వహించబోయే ముందు కాకతి వంశానికి దత్తత రావాలి. ఆ షరతులకన్నీ ఒప్పుకొని చాళుక్య వీరభధ్రుడు ఆమెను పెళ్ళిచేసుకుంటాడు. తను ఇదివరకే పెళ్ళి చేసుకున్న ముమ్ముడమ్మను దత్తత తీసుకుని భర్త సోదరునితో ఆమెకు వివాహం చేయిస్తుంది రుద్రమ్మదేవి. మరో వైపు  అన్నాంబికకు గన్నారెడ్డికి వివాహం జరిపిస్తుంది. గోనగన్నారెడ్డి వర్ధమానపురం(నేటి మహబూబ్‌నగర్ జిల్లాలోని వడ్డిమాని) రాజుగా పట్టాభిషక్తుడవుతాడు.

 రుద్రమదేవి దంపతులకు ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆమె పేరు రుయ్యమ్మ .రుద్రమదేవి దత్తపుత్రిక అయిన ముమ్ముడమ్మ కుమారుడే ప్రతాపరుద్రుడు. ఇతన్నే భావి చక్రవర్తిగా బాల్యం నుంచి తీర్చిదిద్దుతుంది రుద్రమదేవి. విధివశాత్తూ పెళ్ళైన కొన్నేళ్ళకే చాళుక్య వీరభద్రుడు మరణిస్తాడు. భర్త మరణంతో కుమిలిపోతున్న రుద్రమదేవి వయోవృద్ధుడైన తండ్రి శివైక్యం చెందటంతో మొదలు తెగిన చెట్టులా కుప్పకూలిపోతుంది. పరిపరివిధాలా శోకించి ఒక దశలో ఆత్మహత్యా ప్రయత్నం చేయబోయి అంతలోనే కుదుటబడి ప్రతాపరుద్రుడి రక్షణభారాన్ని నెత్తిన వేసుకొంటుంది. స్వయంగా రణరంగంలోకి ఉరికి అనేక యుద్ధాలలో పాల్గొని విజయాలు సాధించి సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. చివరికి అదే ప్రయత్నంలో కళ్ళుమూస్తుంది.

సినిమాలో కథ

నాటకీయత కోసం మార్పులు చేర్పులు చేసుకున్నామని, ఎవరి మనసునైనా నొప్పిస్తే క్షంతవ్యులమని సినిమా ప్రారంభంలోనే ప్రకటించి ముందు జాగ్రత్త పడ్డారు గుణశేఖర్. తమ రాజ్యంలో పుత్ర సంతానం లేకపోవటం వల్ల కలిగిన పరిస్థితి గురుంచి విశ్లేషిస్తూ హిందూ దేశంలో ఒక మహరాజుకు ఇటువంటి పరిస్థితే ఎదురైతే ఆయనేం చేశాడో  ఇటలీ యాత్రికుడైన మార్కోపోలో చెప్పడంతో కథ ప్రారంభమవుతుంది. రుద్రమదేవి బాల్యాన్ని,చాళుక్య వీరభద్రుడితో ఆమె ప్రణయాన్ని, ముమ్ముడమ్మతో పెళ్ళిని స్పృశిస్తూ చివరకు మహదేవ రాజును ఓడించి ఆమె పట్టాభిషక్తురాలవటంతో చిత్రం సుఖాంతమవుతుంది. మిగతా కథను ఈ చిత్రానికి కొనసాగింపుగా తీయబోయే 'ప్రతాపరుద్రుడు ' కోసం అట్టి పెట్టారు దర్శకుడు.  కమర్షియల్ సక్సెస్ కోసం గోనగన్నారెడ్డి సన్నివేశాలను మార్చి వ్రాశారు. ఎక్కడో జరిగాల్సిన అన్నాంబిక (సినిమాలో అనామిక-కేథరీన్ థెరెసా ),వరదారెడ్డి సన్నివేశాలను  రుద్రమ్మదేవి సమక్షంలో జరిగినట్లు చూపించారు. అలాగే రుద్రమ్మదేవిని చంపడానికి హరిహర మురారిదేవులు ఏనుగుబొమ్మ ద్వారా పథకం పన్నితే గోనగన్నారెడ్డి వచ్చి రక్షించినట్లు చూపించారు. చాళుక్య వీరభద్రుడు-రుద్రమ్మదేవి ప్రణయ సన్నివేశాలు ,నాగదేవుడి పాత్ర వాణిజ్య అంశాల కోశమే. తమను పరిపాలిస్తున్నది యువరాణి కానీ యువరాజు కాదని తెలిసి ప్రజలు తిరుగుబాటు చేసినట్లు చూపించారు. ఇన్నాళ్ళూ మగవాడిగా తమను మభ్యపెట్టినందుకు ప్రతిగా మరణశిక్షకు సమానమైన రాజ్యబహిష్కరణ శిక్ష విధించినట్లు చరిత్రను తిరగ వ్రాశారు.

నటీనటులు , సాంకేతిక నిపుణులు, దర్శకత్వం 

రుద్రమ్మదేవి తన చిరాకాల స్వప్నమని,చిత్రం కోసం చాలా పరిశోధనలు చేశానని ఉద్వేగంగా చెప్పుకున్నారు గుణశేఖర్ . ఆయన ఆశయాన్ని తప్పకుండా మెచ్చుకోవాల్సిందే.  వెకిలి హాస్యం, ప్రత్యేక గీతాలున్న ఫార్ములా చిత్రాలే రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో తెలుగు వాడికి తన మూలాలు గుర్తుచేసే ఒక చారిత్రాత్మక చిత్రం,అందునా స్త్రీ ప్రాధాన్యత ఎక్కువున్న చిత్రాన్ని  ఇవ్వాలనుకోవడం , దాని కోసం సర్వశక్తులూ ఒడ్డి చిత్రాన్ని నిర్మించటం నిజంగా చాలా ధైర్యసాహసాలతో కూడుకున్న పని. ఇందుకు ఆయన్ని తప్పకుండా అభినందించాల్సిందే. 




అయితే గుణశేఖర్ అంటే సగటు ప్రేక్షకుడికి ముందుగా గుర్తుకొచ్చేది సెట్టింగులు. ఈ చిత్రంలో కూడా కథనం, పాత్ర పోషణ మీద కంటే అదనపు హంగుల మీదే ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తుంది. ఒక్క గోనగన్నారెడ్డికి తప్ప ఇతరులందరికీ ఆహార్యం చాలా బాగా కుదిరింది. గన్నారెడ్డి వస్త్రధారణలో మాత్రం తెలుగుదనం కంటే ఇటీవల విడుదలైన పాశ్చ్యాత్య సినిమా పోకడలు కనిపించాయి. అలాగే అంతఃపుర మందిరాలు, గ్రామాలు, అడవులలో వేసిన సెట్లు బాగా ఉన్నాయి. గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయాయి. సన్నివేశానికి అవసరం లేకపోయినా భారీతనం ఉట్టిపడటం కోసం చాలా చోట్ల అనవసరమైన గ్రాఫిక్స్ వాడారు. ఉదాహరణకు చిత్రంలో ప్రతినాయకుడైన మహదేవరాజును చూపించిన ప్రతిసారీ అతనో ఎత్తైన ఒంటిస్తంభపు మేడపై ఉన్నట్లు గ్రాఫిక్స్ వాడారు. అలాగే రుద్రమదేవి పరిచయ సన్నివేశాలు, క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు అతుకుల బొంతలా ఉన్నాయి. 3D సాంకేతికత ఇంకో అనవసర ఆకర్షణ . ఆ డబ్బును ముఖ్యమైన గ్రాఫిక్స్ కోసం వాడుకున్నా ఫలం దక్కేది. 

చారిత్రాత్మక సినిమాలకు కథనం, సంగీతం రెండుకళ్ళని చెప్పుకోవచ్చు. కథాపరంగా రుద్రమదేవిలో ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసే బలమైన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో  ఏ సన్నివేశమూ వీక్షకుడిపై ఎటువంటి ప్రభావం చూపదు. నటీనటులు కూడా ఆ స్థాయి నటన ప్రదర్శించలేదు. సినిమా అంతా డాక్యుమెంటరీలా నిదానంగా సాగుతూ వెళ్తుంది. ప్రథమార్థంలో ఉన్న ఆసక్తి ద్వితీయార్థంలో సన్నగిల్లుతుంది.  ఇది దర్శకుడి వైఫల్యం .నేపథ్య సంగీతం మరో ప్రధాన లోపం . సగటు సంగీత దర్శకుడు సైతం సాధారణ సన్నివేశాలకు  నేపథ్య సంగీతంతో ప్రాణం పోసే  ఈ రోజుల్లో, సంగీతజ్ఞాని ఇళయరాజా అందించిన సంగీతం పూర్తిగా నిరాశపరుస్తుంది.  ఇళయరాజా అభిమానులైన నాలాంటి వాళ్ళు సైతం రాజా ఇంత నాసిరకంగా ఎలా కొట్టారని ఆశ్చర్యపోకతప్పదు.   ఒక్క రి-రికార్డింగ్‌కే రెండుకోట్లు ఖర్చుబెట్టారన్నారు . విదేశాల్లో రి-రికార్డింగులు చేసి ఏం ప్రయోజనం స్వదేశీ పామరున్ని ఆకట్టుకోలేకపోతే ?


రుద్రమదేవిగా అనుష్క చక్కగా ఇమిడిపోయింది. అందానికి తగ్గ ఒడ్డూ, పొడవూ, ఠీవి తనలో ఉన్నాయి. తనకు తప్ప ఇతర ఏ నటీమణులకీ ఈ మేకప్ నప్పదేమో అనిపించినా ఆశ్చర్యం లేదు. అయితే మేకప్ కుదరటం వేరు నటనలో మెప్పించటం వేరు. అనుష్క నటన గొప్పగా లేకున్నా ఫర్వాలేదనిపిస్తుంది. గంభీరమైన ముఖకవళికలతో సినిమా మొత్తం నెట్టుకొచ్చింది. వీరోచిత సన్నివేశాలలో ఇంకాస్త బాగా చేసి ఉండొచ్చు. ముమ్ముడమ్మతో తొలిరాత్రి సన్నివేశాలలో అంతర్మథనాన్ని, ప్రజలంతా తనను తిరస్కరించినప్పుడు హావభావాలను ఒకేలా పలికించింది. పోరాట విన్యాసాలలో ఆమె పడ్డ కష్టం తెలుస్తుంది.

చిత్రంలో కరువైన వినోదాన్ని గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ ప్రేక్షకులకు పంచిపెట్టాడు. గన్నారెడ్డికున్న మహబూబ్‌నగర్ జిల్లా నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అతని సంభాషణలు తెలంగాణా యాసలో చెప్పించారు.  కొన్ని డైలాగులు పట్టి 



చెప్పినట్లున్నాయి,ఇంకొన్ని బాగానే చెప్పాడు. అయితే గొంతు బలహీనమవ్వటం వల్ల అవీ ఫర్వాలేదనిపిస్తాయి. కొన్ని లేకి సంభాషణలు కూడా ఉన్నాయి. ' గమ్ముండవోయ్' అన్న ఊతపదం బాగా పేలింది. క్లైమాక్స్లో  శిరస్త్రాణం ధరించి యుద్ధం చేస్తున్న సన్నివేశాలు తన మూర్తిమత్వాని(personality)కి నప్పలేదు. గన్నారెడ్డి ఒక రాజకుమారుడని,  పర్యవసానాల కారణంగానే అతను బందిపోటుగా మారాడనే విషయం స్పష్టంగా చెప్పలేకపోయాడు దర్శకుడు. గన్నారెడ్డి గురుంచి తెలియని వాళ్ళు సినిమా పూర్తయ్యాక అతనొక బందిపోటు ముఠా నాయకుడని,శత్రు సంహారంలో రుద్రమ్మదేవికి సహాయం చేశాడనే అనుకుంటారు కాని అతనో రాజకుమారుడని తెలుసుకోలేరు. చిత్ర జయాపజయాలతో నిమిత్తం లేకుండా కేవలం దర్శకుడి మీద గౌరవంతో ఎంతో ఆసక్తితో ఆగిపోయిన చిత్రంలో నటించి, చిత్రాన్ని పునరుద్ధరించి, విడుదలకు నోచుకునేలా చేసిన అర్జున్ నిజంగా అభినందనీయుడు. 

రుద్రమదేవి ప్రియుడు చాళుక్య వీరభద్రుడిగా రాణా నటన గురుంచి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. శివదేవయ్య మంత్రిగా ప్రకాష్‌రాజ్ సాంఘిక సినిమాలకు మల్లే తనదైన శైలిలో సంభాషణలు పలికినా ఉన్నంతలో కాస్త న్యాయం చేశాడు. గణపతిదేవుడుగా కృష్ణంరాజు, ముమ్ముడమ్మగా నిత్యమీనన్ పాత్రోచితంగా నటించారు. సుమన్ జయప్రకాష్ రెడ్డి తదితరులు ఆయా పాత్రలకు సరిపోయారు.

చివరగా 
రుద్రమదేవి అంతా గొప్పగా లేదు,అంత నాసిరకంగానూ లేదు. అలాగని రుద్రమదేవి కథ మీద గుణశేఖర్‌కున్న అంకితభావాన్ని కొట్టిపారెయ్యడానికి వీల్లేదు. కానీ అంకితభావంతో పాటూ ఆలోచన కూడా అవసరం. ముఖ్యంగా ఏది అవసరమో,ఏది అనవసరమోనన్న స్పష్టత చాలా అవసరం.ఎంత అవసరమంటే నాగదేవుడు లాంటి ప్రాముఖ్యత లేని పాత్రకు బాబాసైగల్ లాంటి పరభాషా గాయకున్ని నటుడిగా పెట్టుకోవడమే అవివేకం అనుకుంటే, అతనికో ప్రత్యేక గీతాన్ని పెట్టి చివరకి దాన్ని తొలగించడం ఇంకా అవివేకం అని తెలుసుకునేంత. కొసరు హంగుల కంటే అసలు కథ, కథనం ముఖ్యమని తెలుసుకునేంత . రుద్రమదేవి కథలో వీరరసం ప్రధానమని, ఆమె పెంపకం, ప్రణయం, మరో స్త్రీతో పెళ్ళి ఇవన్ని ఆసక్తికరమైన అంశాలే అయినప్పటికీ వాటికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంతవరకే ఇచ్చి మిగతా భాగాన్ని రుద్రమ విజయాలపై, కార్యనిర్వహణా దక్షతపై కేంద్రీకరించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని తెలుసుకునేంత.

( కాకతీయుల చరిత్రకు ఆధారాలు- ఖండవల్లి లక్ష్మీరంజనం  గారి కాకతీయ యుగము, ఏకామ్రనాధుని ప్రతాపరుద్ర చరిత్రం
గోనగన్నారెడ్డి - అడవి బాపిరాజు గారి గోనగన్నారెడ్డి నవల అధారంగా.ఈ పుస్తకం పై నా సమీక్షను ఇక్కడ చదవండి.)


ముదితల్ నేర్వగరాని..


బెంగుళూరులో పుట్టి పెరిగిన పిల్లలకు తెలుగు నేర్పించటం కష్టంతో కూడుకున్న పని. స్కూళ్ళలో కన్నడ లేదా హిందీ తప్ప మరో భాషను ఎన్నుకొనే అవకాశం లేదు. ఆ కష్టాన్ని ఇష్టంతో చేస్తూ ఎనిమిదేళ్ళ మా పాపకు కొన్ని తెలుగు పద్యాలు నేర్పించాను. పనిలో పనిగా నేను కూడా కొన్ని నేర్చుకున్నాను :-)







బాక్సాఫీస్ ఛత్రపతి రాజమౌళి బాహుబలి - సమీక్ష






మూడేళ్ళుగా తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బాహుబలి విడుదలయ్యింది. ప్రభాస్,రాణా,అనుష్క,తమన్నా లాంటి భారీ తారాగణమున్నా,మగధీర, మర్యాదరామన్న, ఈగ చిత్రాలతో  మాములు మాస్ దర్శకులకు తనకూ మధ్య వున్న వ్యత్యాసాన్ని విస్పష్టంగా లోకానికి చాటిచెప్పిన రాజమౌళి మీదే భారీ అంచనాలు  పెట్టుకున్నారు అందరూ. ప్రచార చిత్రాలు అంచనాలని మరింత రెట్టింపు చేసి ' మొదటి రోజు ఈ సినిమాని చూడకపోతే ఎలారా భగవంతుడా ' అనుకునే స్థాయికి సగటు ప్రేక్షకున్ని తీసుకెళ్ళాయి. మొదటి మూడురోజులు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఫుల్లయిపోయి ఎక్కడా టికెట్లు దొరక్క థియేటర్లపై దాడి చేసే పరిస్థితి.

  • ఇన్నికోట్ల మంది భారీ అంచనాలని రాజమౌళి అందుకున్నాడా  ?
  • భారత చలనచిత్ర దశని దిశని మార్చగల సినిమా వచ్చిందా ?
  • తెలుగు సినిమా స్థాయి ఇది అని తెలుగోడు తొడగట్టగలిగాడా  ?

కథ:


రాజ్యం కోసం అన్నదమ్ములైన ఇద్దరు రాకుమారులు పోట్లాడుకున్న సాదా సీదా కథ. ఈ విషయం రాజమౌళే అనేక సందర్భాలలో చెప్పాడు. ఇంతకన్నా రెండు ముక్కలు ఎక్కువ చెబితే సినిమా మొత్తం చెప్పినవాన్నవుతాను కాబట్టి చెప్పను.

నటీనటులు, కథనం,దర్శకత్వం :

బాహుబలి లో మొదట చెప్పుకోవల్సినవి ఫోటోగ్రఫీ, విజ్యువల్ ఎఫెక్ట్స్. తర్వాత చెప్పుకోవల్సినవి యుద్ధసన్నివేశాలు.

జలపాతాల దగ్గర సన్నివేశాలు, మహీష్మతి నగరం, యుద్ధ సన్నివేశాలు నభూతో. వంద అడుగుల భళ్ళాలదేవుడి విగ్రహాన్ని నిలబెట్టడానికి చేసే యత్నాలు, అంతఃపురం నుంచి పారిపోతున్న శివున్ని పట్టుకోవడానికి సైనికులు దొర్లించే అగ్నిగోళాలు, యుద్ధంలో వాడే చిత్రవిచిత్రమైన ఆయుధాలు, పనిముట్లు అమోఘం. సినిమాలో ప్రతి షాటూ కన్నులవిందే. కొన్ని  వందల మంది రాత్రనక పగలనక పడిన కష్టం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒకటి రెండు సన్నివేశాల్లో గ్రాఫిక్స్ సరిగ్గా కుదరకపోయినా చాలా సన్నివేశాలు భారత చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచేవే. టైంమెషిన్ ఎక్కితే వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్లు, ప్రతిభావంతులైన సాంకేతిక సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించి ప్రేక్షకుల కళ్ళెదుటే మహీష్మతీ నగరాన్ని ఆవిష్కరించాడు రాజమౌళి. సినిమాకు ప్రాణమైన యుద్ధ సన్నివేశాలలో అయితే విజృంభించాడు . యుద్ధ వ్యూహాలు సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా వివరించడం, ఆయుధ సామగ్రిని తరలించడం, యుద్ధగజాల అలంకరణ నుంచి, పోరాటల చిత్రీకరణ వరకూ అతని పనితనంలో పతాక స్థాయి కనిపిస్తుంది.  యుద్ధసన్నివేశాలు నిస్సందేహంగా హాలీవుడ్‌స్థాయిలో ఉన్నాయి. భీముడు గదాధారియై యుద్ధరంగంలో అడుగుపెడితే ముందుగా భయపడేవి మత్తగజాలేనట-ఎక్కడ తమ  కుంభస్థలాలు  పగిలిపోతాయేమోనని. భళ్ళాలదేవుడు  గదాధారియై  కాలకేయుడి యుద్ధగజాన్ని నేల కూల్చినప్పుడు ఆ సన్నివేశం గుర్తొచ్చింది.  అమరేంద్ర బాహుబాలి సవ్యసాచిలా శూలపాణియై శత్రుసేన తలలు తురుముకుంటూ వెళ్తూంటే అలా చూస్తూండిపోవాల్సిందే. 

అయితే నాణేనికి మరోవైపూ ఉంది. 

నేపథ్య సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. ట్రైలర్‌లో వాడిన మ్యూజిక్ బిట్‌నే కీరవాణి సినిమా మొత్తం తిప్పి కొట్టాడు. ఇక పాటల సంగతి సరే సరి. దీనికి తోడు డాల్బీ అట్మోస్ టెక్నాలజి వాడారు. ఇది ఎన్ని థియేటర్లలో పనిచేస్తుందన్నది ఓ ప్రశ్న .బెంగుళూరు లాంటి మహా నగరంలోనే డాల్బీ అట్మోస్ సర్టిఫైడ్ థియేటర్ ఒక్కటే ఉంది. సరైన సౌండ్ సిస్టం లేకపోతే మొదటి ముప్ఫై నిమిషాలు నేపథ్య సంగీతం ఇంత బలహీనంగా ఉందేంటి అని ప్రేక్షకుడు ఆశ్చర్యపోయినా తప్పులేదు.

రాజమౌళి చిత్రాలలో ప్రతినాయకుడు బలంగా ఉంటాడు. అతని మనస్తత్వం కౄరం హావభావాలు వికృతంగా ఉండి ప్రేక్షకులను భయభ్రాంతులను చేస్తాయి. ఛత్రపతిలో కాట్రాజ్ అయినా, విక్రమార్కుడులో విలన్ అయినా అటువంటివాడే. అతను పెట్టే చిత్రహింసలు భరించలేక ప్రజలు అవస్థలు పడుతూంటే ప్రేక్షకుడు కన్నీరు పెట్టుకుంటాడు. ప్రజల పట్ల జాలి, కథానాయకుడి మీద అభిమానం పెంచుకొని ఎప్పుడెప్పుడు అతను ప్రతినాయకుడి మీద తిరగబడతాడా అని ఉత్కంఠతో ఎదురుచూస్తాడు. కథానాయకుడు ఆవేశంతో సంభాషణలు పలుకుతూ ఒంటిచేత్తో కలియబడితే ' ఇది కదరా మనకు కావల్సిన ఎమోషన్' అని పూనకంతో ఉగిపోతాడు. అతను గెలిచిన ప్రతిసారి ఉత్సాహంతో చప్పట్లు కొడతాడు.

బాహుబలిలో అదీ లోపించింది. సువాసన లేని స్వర్ణరత్నఖచిత పుష్పం బాహుబలి.


బాహుబలిలో ప్రతినాయకుడు భళ్ళాలదేవుడు(రాణా). అతని పాత్ర మహాభారతంలో దుర్యోధనున్ని పోలి ఉంటుంది. అతనికి ఉన్నట్లే ఇతనికీ ఒక బలమైన గద ఆయుధంగా ఉంది. రాజమౌళి పొందిన ప్రేరణ అక్కడితోనే అంతమైనట్లు అనిపిస్తుంది. భళ్ళాలదేవుడి పాత్రపోషణ తేలిపోయింది. అసూయ, కౄరత్వం చాటుకునే బలమైన సన్నివేశాలు లేవు. ఉన్న ఒకటీ అరా సరైన సంభాషణలు, హావభావాలు పలక్క చప్పబడిపోయిపోయాయి. సాంకేతికంగా ప్రతి చిన్న విషయాన్ని అద్భుతంగా రాబట్టుకునే రాజమౌళి, భావోద్వేగాలకు సంబంధించిన ఇంత మౌలికమైన అంశాన్ని పట్టించుకోలేదెందుకో . రాణాని ఇంతకంటే కౄరంగా చూపెడితే భవిష్యత్తులో అతని హీరోయిజానికి ఇబ్బందని సందేహించాడో లేదో తెలియదు. నిజానికి బలమైన నటుడికి సంభాషణలు సన్నివేశాలతో పనిలేదు. కేవలం ముఖకవళికలు మాటవిరుపులతో సాధారణ సన్నివేశాన్ని అసాధరణంగా మలచగలడు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడున్న యువతరం నటుల్లో ఒకరికో ఇద్దరికో తప్ప మిగతావాళ్ళెవరికీ మొహంలో అన్ని భావాలూ పలకవు. అటువంటప్పుడు సన్నివేశాలు సంభాషణలు బలంగా ఉండాలి. బాహుబలిలో చెప్పుకోదగ్గ సంభాషణలు ఏవంటే తడుముకోవాలి . అయితే పరిచయ సన్నివేశాలలో,యుద్ధ సన్నివేశాలలో రాణా నటన బాగుంది.

ధృతరాష్ట్రుడు, శకుని ప్రేరణతో అల్లుకున్న బిజ్జలదేవుడి పాత్ర (నాజర్) కుడా అంతంతమాత్రమే. చెడు ఎంతో తీవ్రంగా ఉంటే తప్ప మంచి విలువ తెలియదు. బిజ్జలదేవుడిలో ఆ కుటిలత్వం చూపించే సన్నివేశాలు బలంగా లేవు. నాజర్ కంటే కోటశ్రీనివాసరావుకి ఇటువంటి పాత్రలు కొట్టిన పిండి.


దేవసేన (అనుష్క) దైన్యం వెనుక ఉన్న కారణాలేమిటో తెలిస్తే తప్ప ప్రేక్షకుడికి సానుభూతి కలగదు. ఈ సన్నివేశాలన్నీ రెండవ భాగంలో ఉన్నాయి కాబట్టి అంతవరకూ కేవలం కథానాయకుడి కన్నతల్లిని కట్టిపడేశారన్న కారణంతో జాలి చూపించాలి.

మమతల తల్లిగా శివగామి(రమ్యకృష్ణ), కళ్ళముందు ఎంత ఘోరం జరుగుతున్నా రాజరికానికి కట్టుబడిన బానిస నాయకుడిగా కట్టప్ప(సత్యరాజ్),కౄరత్వం మూర్తీభవించిన రాజ్యాధినేత కాలకేయ (ప్రభాకర్) పాత్రలు బావున్నాయి. రమ్యకృష్ణ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. తను సహజంగా మంచి నటి కాబట్టి బాగా చేసింది. గొంతు కూడా తనదే. ప్రతినాయకుడు తనే అనుకునేలా ఉన్న కాసేపూ గొప్పగా చేశాడు ప్రభాకర్. అతనికి ఇచ్చిన విచిత్రమైన భాష అదనపు ఆకర్షణ. మాస్ ప్రేక్షకులకు ఇట్టే నచ్చుతుంది. పర్షియా ఆయుధవ్యాపారి అస్లాం ఖాన్(సుదీప్) పాత్ర నిడివి చాలా తక్కువ. రెండవ భాగంలో పరిధి పెంచుతారేమో.

అవంతికగా తమన్నా నటన ఆకట్టుకుంటుంది. మొదటి సారి రౌద్రరస ప్రధానమైన పాత్ర పోషించినా మంచి మార్కులే కొట్టేసింది.


కథానాయకుడికి ఉండాల్సిన కనీసార్హతలు అన్నీ ప్రభాస్‌కు ఉన్నాయి. తన ' కటౌట్‌ ' కి ఏ వేషమైనా నప్పుతుంది. ఇక యువరాజుగా కత్తి చేతబట్టి జవనాశ్వం ఎక్కి యుద్ధవిన్యాసాలు చేస్తే అభిమానుల ఆనందానికి పట్టపగ్గాలుంటాయా ? శివుడిగా ప్రభాస్ మెప్పించాడు. ఇంతెత్తున్న శివలింగాన్ని అలవోకగా ఎత్తి రెండు చేతులతో పట్టుకొని వచ్చే సన్నివేశాల్లో అతన్ని చూసి మనసు పారేసుకోని టీనేజీ అమ్మాయిలుండరు. భద్రుడి(అడవి శేష్) తల ఎగరగొట్టే సన్నివేశంలో అతని హావభావాలు బాగా పండాయి. అమరేంద్ర బాహుబలిగా మాత్రం ఇంకాస్త బాగా చేసి ఉండొచ్చని అనిపించింది. వాచకం చాలా మెరుగవ్వాలి. పతాక సన్నివేశాల్లో వచ్చే కొన్ని శక్తిమంతమైన సంభాషణలను అస్పష్టంగా చెప్పి మమ అనిపించాడు. రచయితలు గంభీరమైన సంభాషణలు వ్రాయకపోబట్టి సరిపోయింది కాని లేకపోతే అల్లరిపాలయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయంలో రాణా కొంత నయం. 

ముగింపు: 

సమీక్షలతో సంబంధం లేకుండా సినిమా కనకవర్షం కురిపించడం ఖాయం. మొదటి భాగం చూసిన ప్రతి ప్రేక్షకుడికీ రెండవ భాగం ఎలా ఉండబోతుందో ఇట్టే తెలిసిపోతుంది-ఎమైనా ఊహించని మలుపులుంటే తప్ప. నాకు మాత్రం రెండవ భాగాన్ని మొదటి భాగంగా విడుదల చేసి అరచేతిపై శిశువు తేలుతున్న సన్నివేశం దగ్గర సశేషం అని పడి ఉంటే బాగుండేదని అనిపించింది.నా అభిప్రాయం తప్పని రాజమౌళి నిరూపిస్తే మరీ మంచిది.




ఉత్తరకాండ నుంచి జనక మహారాజు జన్మ వృత్తాంతం ఇతర విశేషాలు


  • 1. శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తర్వాతే రామాయణ రచన ప్రారంభిస్తారు వాల్మీకి. 

  • 2. రావణపత్ని మండోదరికి ఇద్దరు సోదరులు -మాయావి,దుందుభి.

  • 3. కుంభకర్ణుడి భార్య వజ్రజ్వాల. విభీషణుడి పత్ని సరమ,పుత్రిక అనల. ఇద్దరూ లంకలో ఉండగా సీతాదేవికి ధైర్య వచనాలు చెప్పి స్వస్థత చేకూరుస్తారు. 

  • 4. కుంభకర్ణుడి సౌకర్యార్థం రావణుడు నిర్మించిన మందిరం మూడు యోజనాల పొడవు, ఒక యోజనం వెడల్పుతో ఉండేది . ఒక యోజనం పదిహేను కిలోమీటర్లకు సమానం.

  • 5. రావణుడి దుష్కృత్యాలను భరించలేకపోయిన అతని అన్న కుబేరుడు, తమ్ముడికి హితబోధ చేసి సరిదిద్దాలనే ఉద్దేశ్యంతో రాయబారిని పంపుతాడు. రావణుడు ఆగ్రహంతో ఊగిపోయి రాయబారి శిరస్సు ఖండించి,అతని శరీరాన్ని రాక్షసులకు విందు చేసి ,అన్నపై, ముల్లోకాలపై దండయాత్రకు బయలుదేరుతాడు. 





  • 6. కుబేరున్ని ఓడించి పుష్పక విమానాన్ని దొంగలించి అందులో తిరిగి వెళ్తున్న దశకంఠుడు అకస్మాత్తుగా విమానం ఓ చోట ఆగిపోయి కదలకుండా మొరాయించేసరికి ఆశ్చర్యపోతాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో పరమశివుడు కేళీవిలాసంలో ఉంటాడని,అందుకే ఆ వైపుగా ఎవ్వరినీ అనుమతించరని నందీశ్వరుని ద్వారా తెలుసుకుంటాడు. అయినా అహంకారదర్పంతో తన మార్గానికి అడ్డొచ్చిన కైలాస పర్వతాన్ని పెకలించి పారేస్తానని పిచ్చి ప్రేలాపనలు చేసి కైలాసాన్నే కదిలించబోగా పరమశివుడు తన కాలి బొటనవ్రేలితో అతన్ని అదిమిపెట్టి గర్వభంగం కలిగిస్తాడు. బరువు మొయ్యలేక దశకంఠుడు వెయ్యి సంవత్సరాల పాటూ అరుస్తూ శివ స్తోత్రాలు వల్లిస్తాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై అతనికి వెయ్యి సంవత్సరాల ఆయుష్షును తిరిగి ప్రసాదించి, చంద్రహాసమనే దివ్య ఖడ్గాన్ని కానుకగా ఇస్తాడు. 

  • 7. రావణుడి ధాటికి భయపడిపోయి ఇంద్రుడు,యముడు,వరుణుడు,కుబేరుడు పక్షులుగా జంతువులుగా మారిపోయి తప్పించుకుంటారు. ఇంద్రుడు నెమలిగా మారిపోతే,యముడు కాకిగా, వరుణుడు హంసగా, కుబేరుడు తొండగా మారిపోయి దాక్కుంటారు. ఆపదలో ఆదుకొన్నందుకు ప్రతిగా ఆయా పక్షి,జంతు సంతతికి వరాలిస్తారు దేవతలు. నెమలికి సర్పభయం లేకుండా దేవేంద్రుడు వరం ఇస్తాడు. తన ఒంటిపైనున్న వేయి కన్నులే నెమలి పింఛానికి వస్తాయని,వర్షాగమనానికి ముందు నెమలి పురి విప్పి నాట్యం చేస్తుందని వరమిస్తాడు. కాకికి ఏం తిన్నా ఏం కాదని,ఇతరులు చంపితే తప్ప దానికి చావు లేదని,దాని ద్వారానే పితరులకి ఆహారం అందుతుందని వరమిస్తాడు యముడు. వరుణుడు హంసలకు తెలుపు రంగును ప్రసాదించి, నిత్యం నీళ్ళలో ఉండే వరాన్ని ప్రసాదిస్తాడు .కుబేరుడు తొండకు బంగారు వర్ణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. 

  • 8. మేఘనాథుడు (ఇంద్రజిత్) మండోదరీ-రావణుల ప్రథమ సంతానం. శౌర్యపరాక్రమాలలో తండ్రిని మించిన తనయుడు. శివున్ని ప్రసన్నం చేసుకొని భూమ్యాకాశాలలో ఎక్కడైనా సంచరించగల రథాన్ని, తామసి అనే మాయా విద్యను వరంగా పొందుతాడు. దేవేంద్రున్నే బంధించి బ్రహ్మ వచ్చి బ్రతిమాలితే విడిచిపెడుతూ మరిన్ని వరాలు పొందుతాడు. యుద్ధానికి బయలుదేరే ముందు ప్రతి సారీ యజ్ఞం చేయటం,ఆ యజ్ఞకుండంలోంచి వచ్చిన రథాన్ని అధిరోహించి శాత్రవ సంహారం చెయ్యటం అతనికలవాటు. యజ్ఞం చేస్తున్నప్పుడు మధ్యలో ఆయుధం పట్టరాదనే నియమం ఉంది. యజ్ఞం నిర్విఘ్నంగా పుర్తయ్యి రథాన్ని ఎక్కాడా, ఇక తనకు పరాజయమన్న మాటే లేదు. లక్ష్మణుడు యాగాన్ని ధ్వంసం చెయ్యటంతో ఇంద్రజిత్ యాగ సామగ్రినే విసురుతూ అస్త్రాలు ప్రయోగించి అవి నిష్ఫలమవ్వటంతో అవతలివాడు మాములువ్యక్తి కాదని గ్రహించి, రావణుడికి హితబోధ చేసి విఫలుడై చివరికి యుద్ధభూమిలో వీరమరణం పొందుతాడు. 

  • 9. వాలి,సుగ్రీవులకు తల్లిదండ్రీ ఇద్దరూ ఋక్షరజస్సనే వానరమే. ఒకప్పుడు బ్రహ్మదేవుడు యోగదీక్షలో ఉండగా ఆయన కళ్ళ నుండి జారిపడ్డ అశ్రుకణమే వానర రూపం దాల్చి ఋక్షరజస్సుగా పిలవబడ్డాడు. ఈ ఋక్షరజస్సే ఒకానొక సందర్భంలో స్త్రీమూర్తిగా మారిపోయి ఇంద్రుని ద్వారా వాలిని, సూర్యుని ద్వారా సుగ్రీవున్ని పిల్లలుగా పొంది మళ్ళీ పురుషాకృతిని పొందుతాడు. 


  • 10. బాల్యంలో తన అల్లరి చేష్టలతో ఆశ్రమవాసులను విసిగిస్తూండటంతో మహర్షులు కోపించి ఇతరులు గుర్తు చేస్తే తప్ప స్వశక్తి గుర్తుకురాదని హనుమంతున్ని శపిస్తారు. 

  • 11. ఇక్ష్వాకు మహారాజుకు నూర్గురు కుమారులు. వారిలో చివరివాడు పరమ అయోగ్యుడు. అతని పేరు దండుడు. ఇక్ష్వాకు మాహారాజు వాడిని వింధ్య పర్వత ప్రాంతానికి రాజును చేసి శుక్రాచార్యులను గురువుగా నియమిస్తాడు. మూర్ఖుడైన దండుడు గురువు గారు ఆశ్రమంలో లేని సమయంలో ఆయన కుతురైన అరజను బలవంతంగా వశపరచుకొని ఆ పిమ్మట తన దారిన తను వెళ్ళిపోతాడు. జరిగిన ఘోరం గ్రహించిన శుక్రాచార్యులు ఏడు రోజుల్లోగా మట్టి వాన కురిసి దండుని రాజ్యం సర్వనాశనమవుతుందని శపిస్తాడు. అలా అప్పుడు సర్వనాశనమైన ప్రాంతమే నేటి దండకారణ్యం.

  • 12. పట్టాభిషేకానంతరం పుష్పక విమానాన్ని కుబేరుని వద్దకు పంపించేస్తాడు శ్రీరాముడు. అయితే ఆ విమానం తన వద్దనుండటం కన్నా శ్రీరాముని వద్దనుండటమే శ్రేష్ఠం అని భావించిన కుబేరుడు విమానాన్ని మళ్ళీ రాముడి వద్దకే తిప్పి పంపుతాడు. 

  • 13. శ్రీరామ పట్టాభిషేకం అయ్యాక కొద్ది రొజులు అయోధ్యలో గడిపి సుగ్రీవుడితో కలిసి కిష్కింధ కు వెళ్ళిపోతాడు హనుమంతుడు. తిరిగి అశ్వమేధయాగ సమయంలో శ్రీరాముడు కబురంపగా వానర రాజైన సుగ్రీవుడు, అతని బృందంతో అయోధ్య వస్తాడు. మన సినిమాలలో చూపించినట్లుగా పట్టాభిషేకమయ్యాక శాశ్వతంగా అయోధ్యలో శ్రీరాముడి వద్దనే ఉండిపోడు.

  • 14. లక్ష్మణుడు సీతాదేవిని అడవులలో వదిలివెళ్ళినప్పటికీ గంగా నది ఆవలి గట్టుపై నిలబడి వాల్మీకి మహర్షి వచ్చి సీతాదేవిని తీసుకెళ్ళేంత వరకు వేచి చూస్తాడు. తర్వాతే భారమైన హృదయంతో మంత్రి సుమంత్రుని వెంట అయోధ్యకు తిరుగు ప్రయాణమవుతాడు. శ్రీరాముడి జాతకంలో తరచూ భార్యావియోగం ఉందనే విషయం తనకు,దశరథ మహారాజుకు దుర్వాస మహర్షి ద్వారా అంతకు పూర్వమే తెలుసునని,ఇది ఒకప్పుడు భృగు మహర్షి విష్ణువుకిచ్చిన శాపఫలమేనని చెప్పి లక్ష్మణున్ని ఊరడిస్తాడు సుమంత్రుడు. సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో తన నిజనామధేయంతోనే రక్షణ పొందుతుంది. ఆమె శ్రీరాముని ధర్మపత్ని సీత అని ఆశ్రమవాసులందరికీ తెలుసు.

  • 15. సీతాదేవి తండ్రియైన జనక మహారాజు అయోనిజుడు. పూర్వం నిమి అనే ఇక్ష్వాకు వంశ మహారాజు ఒక గొప్ప యాగం తలపెట్టి వశిష్ఠ మహర్షిని ఋత్విక్కుగా ఆహ్వానించబోతే ఆ మహర్షి తానిప్పుడు దేవేంద్రుడు నిర్వహించే యాగంలో ఉన్నానని,యాగం పరిసమాప్తమయిన వెంటనే వస్తానని చెబుతాడు. అంత వరకు వేచి ఉండలేక నిమి చక్రవర్తి తన యాగాన్ని గౌతమునితో నిర్వహిస్తాడు. యాగం జరుగుతూండగా వచ్చిన వశిష్ఠుడు తన స్థానంలో మరొకరు యాగాన్ని నిర్వహించటం గమనించి కోపోద్రిక్తుడై నిమి చక్రవర్తి శరీరం చైతన్యం కోల్పోయి జడత్వం పొందాలని శపిస్తాడు. నిమి చక్రవర్తి కుడా అదే ప్రతిశాపం వశిష్ఠునికిచ్చి గాలిలోనే యాగదీక్ష పూర్తిచేసి తన పూర్వశరీరంలో ఉండటం కంటే సకల ప్రాణుల కంటిరెప్పల పై ఉండాలని దేవతలను వరం వేడుకుంటాడు. అలా ప్రాణుల కళ్ళు విశ్రాంతి కోరుకున్నప్పుడు ఆయన కారణంగానే కంటిరెప్పలు మూసుకుంటాయి (అందుకే నిమేషము అన్నారు. దేవతల కంటిరెప్పలు కొట్టుకోవు. కాబట్టి వాళ్ళు అనిమిషులు). వారసుడి కోసం నిమి దేహాన్ని మథిస్తే పుట్టిన పిల్లవాడే జనక మహారాజు. శరీర మథనం వల్ల నిలబడిన రాజ్యం కాబట్టి ఆయన రాజ్యం మిథిలా నగరమయ్యింది.

  • 16. రావణుడి పినతల్లి కూతురు కుంభీనసి. ఆమె భర్త మధువనే రాక్షసుడు. రావణాదులు లంకలో లేని సమయంలో అతని సోదరియైన కుంభీనసిని అపహరించి రాక్షస వివాహం చేసుకుంటాడు మధువు. రావణుడికి విషయం తెలిసి మధువుని చంపబోతే, కుంభీనసి పతిభిక్ష కోరుతుంది. అప్పటికే స్వంత చెల్లెలైన శూర్పణఖకు పతీ వియోగం కలిగించి పాపం మూటగట్టుకున్న రావణుడు మరొకమారు అలాంటి కార్యమే చేయడం ఇష్టంలేక తన ప్రయత్నాన్ని విరమించుకొంటాడు. మధువు తన అపూర్వమైన భక్తిప్రపత్తులతో పరమేశ్వరున్ని మెప్పించి ఆయన శులాన్ని పొంది,అది చేతనున్నంత వరకు తనకు,తన కొడుకు లవణాసురునికి చావు లేకుండా వరం పొందుతాడు. లవణాసురుడు వరగర్వంతో కన్నూ మిన్నూ కానక ప్రవర్తిస్తూంటే మహర్షులంతా వచ్చి ప్రభువైన శ్రీరామునికి మొరపెట్టుకుంటారు. శ్రీరాముని కనిష్ఠ సోదరుడైన శతృఘ్నుడు సమరోత్సాహియై ముందుకు వచ్చి అన్నగారి నుంచి దివ్యాస్త్రం సాయంగా పొంది లవణాసురునిపై యుద్ధానికి వెళ్ళి అతని చేతిలో శూలం లేని క్షణంలో నిర్జించి విజయాన్ని సాధిస్తాడు. అలా ఒకప్పుడు లవణాసురుడు పాలించిన నగరమే ఇప్పటి మధురా నగరం. లవణాసుర వధ తర్వాత శతృఘ్నుడు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు.


శివపురాణం నుంచి కొన్ని విశేషాలు




  1. 1.   పార్వతీదేవి విష్ణువు చెల్లెలు.అందుకే ఆయనలా నల్లగా ఉంటుంది.లక్ష్మీదేవి బ్రహ్మదేవుని చెల్లెలు.ఎర్రగా ఉంటుంది.సరస్వతి శివుని చెల్లెలు.తెల్లగా ఉంటుంది.

  2. 2.   సత్యము, శౌచము, తపస్సు, దయ నాలుగు పాదాలుగా ఉంటాయి.

  3. 3.   శివ కుటుంబంలో ఐదవవాడు చండీశ్వరుడు. చండీశ్వర స్థానంలో చిటికె మాత్రమె వెయ్యాలి. శివప్రసాదంలో మిగిలినదాన్ని ముందు చండీశ్వరుడు తింటాడు.ఆయనకు అర్పించిన తర్వాతే భక్తులు ఆరగించాలి.

  4. 4.   నవనందులుగా నందీశ్వరుడు తపస్సు చేసిన ప్రదేశాలు ఆంధ్ర దేశంలో ఉన్నాయి.

  5. 5.   విభూతి పెట్టుకున్నవాళ్ళంతా శైవులు కారు.విభూతి వైదికం.ఎవరైనా భస్మారాధరన చెయ్యవచ్చు. నుదుటి రాతను సైతం మార్చే శక్తి భస్మకుంది.స్నానం చేస్తే తడి విభూతిని పెట్టుకోవాలి. మూడు వ్రేళ్ళతో బూడిద పెట్టుకోరాదు. స్నానం చెయ్యనప్పుడు పొడి విభూతిని లలాటం మీద పూసుకొని వెళ్ళవచ్చు. మృగముద్ర పట్టి బూడిద పెట్టుకోవలి. ఆవు పేడను బాగా కాల్చి పొడి చేసి తయారు చేసిన బూడిద,యజ్ఞంలో ధర్భలను కాల్చి చేసిన బూడిద శ్రేష్ఠమైనవి .

  6. 6.   తల్లిదండ్రులకి రోజుకి ఒక్కసారి మాత్రమే నమస్కారం చెయ్యాలి. శివాలయంలో నాలుగైదు సార్లు నమస్కారం చెయ్యాలి. సన్యాసికి నాలుగు మార్లు నమస్కారం చెయ్యలి. ఆలయంలో తప్పకుండా కోర్కెలు కోరాలి.

  7. 7.   శివుడికి పునః ప్రతిష్ఠ లేదు.శివలింగం అరిగిపోయి ఎంత చిన్నదైపోయినా దాన్నే పూజిస్తారు.

  8. 8.   ఈ బ్రహ్మాండంలో సృష్టింపబడ్డ మొట్ట మొదటి పట్టణం -కాశీ నగరం. ప్రపంచమంతా లయమయ్యే సమయంలో కూడా మునిగిపోని ఎకైక నగరం కాశీ. వారణ,అశి అనే రెండు నదులు కలిసి ప్రవహించటం వలన అది వారణాశి అయ్యింది. విష్ణువు చెమటలో తడిసి మునిగిపోయిన భూమి కాశి.

  9. 9.   కేదారేశ్వర లింగస్వరూపాన్ని దర్శించినవారికి మోక్షం తధ్యం. నేరుగా కన్నుతో లింగాన్ని దర్శించకుండా ఒక రాగి కంకణంలో నుంచి చూడాలి.

  10. 10.   మేరు పర్వతం చుట్టూ నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తూంటాయి.

  11. 11.   నారద మహర్షి శాపం కారణంగా శ్రీమహావిష్ణువు రామావతారంలో భార్యావియోగం పొందవలసి వస్తుంది. ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించిన నారదుడు, మన్మథున్ని కూడా జయించానని గొప్పలు పోవటంతో ఆయన్ను పరీక్షించటానికి మహావిష్ణువు ఒక నాటకమాడుతాడు. తన మాయతో కాశీరాజు కూతురుగా జగదేక మోహనాంగిని సృష్టించి, నారదుని కళ్ళలో ఆమె పడేలా చేస్తాడు. ఆమె అందానికి వివశుడైన నారదుడు, ఆమెను ఎలాగైనా పొందాలని నిశ్చయించుకుంటాడు.ఆమె జాతకం పరిశీలించి హరియే ఆమె భర్తవుతాడని గ్రహించి, విష్ణువును ప్రార్థించి, తనను హరిలాగే చెయ్యమంటాడు. హరి అంటే కోతి అని మరొక అర్థం కూడా ఉంది. నారాయణుడు చిరునవ్వుతో అంగీకరించి నారదున్ని తనలా మార్చివేసి ముఖాన్ని మాత్రం కోతిలా చేసేస్తాడు. కాశీరాజు కూతురు స్వయంవరానికి అట్టహాసంగా వెళ్ళిన నారదుడు, ఆమె తనను కాకుండా అసలు శ్రీమహావిష్ణువును పెళ్ళాడటంతో ముందు తెల్లబోయి తర్వాత నవ్వులపాలవుతాడు. మానవ జన్మనెత్తి భార్యావియోగం అనుభవించాలని విష్ణువుని ఆగ్రహంతో శపిస్తాడు.





దృశ్యాదృశ్యాలు




కాశంలో తారల వైపు చూసి
ఆశువుగా కవిత్వం చెప్పమన్నాడో మిత్రుడు


ఆకాశ నికుంజంలో
అందంగా విరిసిన జాజిమల్లి జాబిలైతే
విరిసీ విరియని మొగ్గలే తారలు
వాలిపోయే తుమ్మెదలే కరిమబ్బులు


కలువరేకుల నా చెలికన్నుల్లో
కొలువుదీరాయి నిండుపున్నిమలు
ఆకాశమా అసూయపడకు
అమావాస్యనిశి నాకిక లేదు !


వెన్నెలవాగులో
వ్యాహ్యాళికెళ్దాం సఖీ !
నెలవంక నావనెక్కి
నక్షత్ర సుమాలు  ఏరుకొంటూ..


ఈ చీకటి నీటిగుంతలో
ఏ చిన్నారి విడిచిన కాగితపు పడవలో ఈ తారలు
కాలం కెరటాలపై స్నిగ్ధంగా సోలిపోతూ
కూతురి బాల్యచేష్టల్ని కళ్ళెదుటే నిలుపుతున్నాయ్


కొట్టుకుపోయిన కొత్త తార్రోడ్డుపై
కకావికలైన గులకరాళ్ళ మధ్య
మూతబడని మ్యాన్‌హోల్‌లా మూగగా చంద్రుడు
దశాబ్దాల నీ ప్రగతికి దేశమా !
దారుణ ప్రతీకలివే !!


కుంభకోణాల కమురుతెట్టులో
వేగిపోతున్న వ్యంజన పదార్థాలు
మినుకుబిక్కుమంటూన్న ఈ మామూలు మనుషులు
నవ్వీ నంజుకునే నేతల పీతలే అన్ని వేపులా !


సమస్య ఉప్పెనలో సర్వం కోల్పోయి
కెరటాల మబ్బులకు కృంగీ ఎదురీదీ
శరణార్థియై తరలిపోతున్నాడు శుష్కచంద్రుడు
నక్షత్రసంతతిని నడిపించుకుంటూ 


విసిరేసిన పులి విస్తట్లో
విరిగిపోయిన చుక్కల పుల్లల మధ్య
వెలిసిపోయిన జాబిలిముద్దను చూసి
పెదవి తడుపుకున్నాడో పరమనిర్భాగ్యుడు


కాముకుడి కర్కశత్వానికి
కుమిలిపోతున్న కన్నెపిల్లలా
వొళ్ళంతా మరకలతో
వికృతంగా  రోదిస్తున్నది ఒంటరి రాత్రి !


చీకటి ఉరికొయ్యల క్రింద చివరి శ్వాస పీల్చి
చిరాయువులై వెల్గుతున్నారెందరో పుణ్యమూర్తులు
క్రాంతిరేఖల వారి మార్గమే
శాంతిపుంజాల భావి ఉషస్సులకు నాంది


విబేధాలు విస్మరించి
విషాదాలు పెల్లగించి
సౌహార్ద్రత పరిఢవిల్లి 
సర్వజనాళి ఏకమైతే
వాస్తవం కాదా వసుధైక కుటుంబం !
వాకిట్లో వెలిగించిన ప్రేమామృతదీపాలు కావా
వినువీధిలో తారాతోరణం !!


భావావేశం అందరిలో ఉంది
బ్రతుకులో తారతమ్యాలే
భావనలో ప్రతిఫలిస్తాయి
స్పందించే మనసుంటే
సాక్షత్కరించే దృశ్యాలెన్నెన్నో

(సారంగలో  ప్రచురితం )


గోదావరి యాత్ర -4 (గునుపూడి, పాలకొల్లు, అంతర్వేది, యానం)

మొదటి రోజు తూగోజి లోని ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించాం.

రెండవ రోజు పగోజి వంతు.

ముందు గునుపూడి, ఆ పై పాలకొల్లు, అంతర్వేది, వీలు కుదిరితే యానాం చుట్టిరావాలని నిర్ణయించుకున్నాం.

ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా మా పగోజి యాత్ర ప్రారంభమైంది. ధవళేశ్వరం ఒక చిన్న గ్రామం. రాజమండ్రికి ఎనిమిది కిలోమిటర్ల దూరంలో ఉంది. పరవళ్ళు తొక్కే ఆకాశగంగను తన జాటాజూటంలో బంధించి గర్వమడగించి భువిపైకి దించిన పరమశివునిలా, మిడిసిపడే ఉత్తుంగ గోదావరికి  సర్ అర్థర్ కాటన్ దొర ముకుతాడు వేసిందిక్కడే. 1852లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ ప్రాజెక్టు తన నిర్దేశిత కాలపరిమితి- వందేళ్ళనూ  దిగ్విజయంగా పూర్తిచేసుకుని 160 సంవత్సరాలైనా ఇంకా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. కరువు కాటకాలతో తల్లడిల్లిపోయి భుక్తి కోసం పిల్లల్ని అమ్ముకున్న ప్రజలకు కాటన్‌దొర దార్శనికత కడుపునిండా తిండి పెట్టింది. పరాయివాడైనా పరుల సంక్షేమం కోసం పాటుపడ్డాడు కాబట్టి  పట్టం కట్టి హృదయాల్లో పదిలంగా దాచుకున్నారు ప్రజలు. ఆ మాత్రం కృతజ్ఞత పాలకులకు కొరవడింది. ఆనకట్ట క్రిందే శిథిలావస్థలోనున్న కాటన్‌మ్యూజియం నిర్లక్ష్యానికి నిలువుటద్దం పడుతుంది.

తాడేపల్లిగూడేం నుంచి భీమవరం వెళ్ళే రోడ్డు ఘోరంగా ఉంది. భీమవరం వెళ్ళాలంటే నానా సాకులు చెప్పి మా డ్రైవరు ఎందుకు తప్పించుకోబోయాడో మాకప్పుడు అర్థమయ్యింది. కంకర తేలిపోయి గుంతలు పడిన రోడ్లపై గాల్లో తేలిపోతున్నట్లుగా వెళ్ళిపోతూ అంతరిక్షంలోని భారరహిత స్థితిని పైసా ఖర్చు లేకుండా ప్రత్యక్షంగా అనుభవిస్తారు ప్రయాణికులు. వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకొనే మా చిత్తూరు జిల్లాలో రోడ్లు ఇంతకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. పిల్లకాలువ పట్టీలు పాదాలకు తొడుక్కొని పరవశంతో నర్తించే 




కన్నెపైర్లే లేకపోతే భీమవరం ప్రయాణం చప్పగా ఉండేది. త్యాగరాజుకు శ్రీరాముడు తప్ప ప్రాపంచిక సుఖాలేవీ పట్టనట్లు, మీలోని సౌందర్య పిపాస మీ సుఖలాలసను నియంత్రించగలిగితే... ఊళ్ళు దాటి వెళ్తూంటే  కలువలతో కళకళలాడే చెరువులను, మొపెడ్ల పై అరటిగెలలు రెండువైపులా వేళ్ళాడదీసుకుని బాట మీద సాగిపోయే వాహనదారులను, గోచి తప్ప ఒంటి మీద మరో వస్త్రం లేకపోయినా ప్రపంచంతో పనిలేనట్లు పరిశ్రమించే రైతులను చూస్తూ రోడ్ల దుస్థితి లాంటి ప్రాపంచిక కష్టాలు మరచిపోయి తాదాత్య్మంతో సాగిపోవచ్చు. కోట్ల విలువ చేసే భూములున్నా సాధారణ జీవితం గడపటానికే ఇక్కడి ప్రజలు మొగ్గు చూపుతారని వాళ్ళ ఆహార్యం చెప్పకనే చెబుతుంది. గోదావరి జిల్లాల ప్రజలు మాటలంటే చెవికోసుకుంటారని, అనుబంధాలకు ప్రాణమిస్తారని, తమ శైలికి భిన్నమైన ఇతర జిల్లాల వాళ్ళతో వాళ్ళు సులభంగా సంబంధాలు ఏర్పరుచుకోలేరని చెప్పాడు డ్రైవరు. ఆ మాట నిజమేననిపించింది.


గునుపూడి సోమేశ్వరాలయం


పరమశివుడికున్న అనేక నామాల్లో భీమ ఒకటి. ఆ పేరు మీదనే ఒక్కప్పుడు ఈ ప్రాంతం భీమపురంగా పిలవబడేదని, కాలక్రమేణా అదే భీమవరంగా మారిందని చెబుతారు. భీమవరం గురుంచి మా స్నేహితులు గొప్పగా చెప్పారు కానీ నాకదేమీ కనిపించలేదు. బహుశా మేమెంచుకున్న మార్గం సరికాదేమో.  అశ్వారూఢుడైన సర్ అర్థర్ కాటన్, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దాటుకుని మావుళ్ళమ్మ గుడి మీదుగా ఊళ్ళోకి వెళ్తే రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని మరో దారి చూపించారు. ఇరుకు రోడ్ల మీద  నేర్పుగా వాహనాన్ని నడుపుతూ గునుపూడిలోని సోమేశ్వరాలయం చేర్చాడు డ్రైవరు.


దక్షారామం, కుమారారామాలలోని లింగస్వరూపాలతో పోల్చితే సోమారామంలోని లింగస్వరూపం చిన్నది. చంద్రుడు ప్రతిష్టించి పూజించిన లింగం కాబట్టి సోమేశ్వరుడన్నారు. దానికి తగ్గట్లుగానే పౌర్ణమి నాడు 



శ్వేతవర్ణంలో మెరిసిపోతూ అమావాస్య నాడు గోధుమ వర్ణంలోకి మారిపోతూ నేత్రానందం కలిగిస్తారు స్వామి వారు. దేవాలయానికి  అభిముఖంగానున్న 
సోమకుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. దేశంలో మరో శివాలయంలోనూ లేని విధంగా, ఆలయానికి ఎదురుగా ఎత్తైన స్తంభం మీద కూర్చున్న నందీశ్వరుడూ ఇక్కడే కనిపిస్తాడు. స్వామి వారి ఆలయంపైనే అన్నాపూర్ణాదేవి కొలువై ఉండటం మరో విశేషం. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్థన స్వామి.

పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి


సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ప్రతిష్టించి పూజించిన లింగం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుడు. పాలకొల్లును పూర్వం క్షీరపురి, పాలకొలను, ఉపమన్యుపురం అనే పేర్లతో పిలిచేవారట. ఈ క్షేత్రం మీద రకరకాల గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

శివభక్తాగ్రేసరుడైన వ్యాఘ్రపాద మహర్షి కుమారుడు ఉపమన్యుడు. బాల్యంలో ఆయనోసారి మామగారింటికి వెళ్ళి అక్కడ ఆవుపాల మాధుర్యం చవిచూసి, తిరిగి వచ్చాక తనకు రోజూ ఆవుపాలే కావాలని మారం చేస్తూంటే ఆయన తల్లి పేదరికంతో కలిగిన తన ఆశక్తతను తెలియజేసి, చరాచర సృష్టికి మూలాధారుడైన పరమేశ్వరున్నే ప్రార్థించమని పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేస్తుంది. తల్లి ఉద్బోధతో ప్రభావితుడైన ఉపమన్యుడు హిమాలయాలకు వెళ్ళి పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి తదేక దీక్షతో తపమాచరిస్తూంటే దేవతలే ఆశ్చర్యపోయారు. ఉపమన్యుడి భక్తితత్పరతను పరీక్షించదలచిన పార్వతీ పరమేశ్వరులు శచీంద్రులలా రూపాలు మార్చుకుని, ఐరావతంగా మారిన నందీశ్వరున్ని అధిరోహించి, ప్రమథ గణాలు దేవతా స్వరూపాలై వెంటరాగా  పిల్లవాడి ముందు ప్రత్యక్షమయ్యారు. భోళాశంకరున్ని నమ్మి ఇంత బూది మిగుల్చుకోవటం కంటే అష్టైశ్వర్యాలను ప్రసాదించే అమరేంద్రున్ని కొలవటమే ఉత్తమమని అతని మనస్సు మార్చే ప్రయత్నం చేస్తారు. ఇంత తపస్సు చేసి వినరాని మాటలు వినాల్సి వచ్చినందుకు ఉపమన్యుడు బాధపడిపోతాడు. శివ నింద చేసినందుకు ఇంద్రుడిగా భావించిన శివుడిపై అఘోరాస్త్రం ప్రయోగించి ఆత్మాహుతికి సిద్ధపడతాడు. శివపార్వతులు సంతోషించి తమ నిజస్వరూపాలతో ప్రత్యక్షమై ఆ బాలున్ని  శాంతపరచి వరం కోరుకోమంటారు. ఉపమన్యుడు ఆనందాతిశయంతో పరమేశ్వరున్ని పరిపరివిధాలా ప్రార్థించి తన మనస్సుకు శివ వైక్లభ్యం కలగని స్థితిని, నిత్యం శివుడి సన్నిధిలో ఉండే భాగ్యాన్ని, తన వంశంలో ఎవరికీ ఆవు పాలకు కరువు రాని అదృష్టాన్ని కోరుకుంటాడు. కోరుకున్న వరాలతో పాటూ జ్ఞానాన్ని, గణాధిపత్యాన్ని ప్రసాదించి తన పుత్రుడిగా స్వీకరిస్తాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి నిత్యయవ్వనాన్ని, క్షీరసాగరాన్ని కరుణిస్తుంది. అలా ఈ క్షేత్రానికి ఉపమన్యుపురం, పాలకొలను, క్షీరపురి అనే పేర్లు వచ్చాయి.

పరమేశ్వర కృపతో శ్రీమహావిష్ణువు సుదర్శనచక్రం పొందిన క్షేత్రం ఇదేనని, త్రేతాయుగంలో సీతారాములు కొలిచిన లింగం కాబట్టి రామలింగేశ్వరుడయ్యాడని ఇంకొన్ని గాథలు చెబుతాయి. కాశిలో ఏడాదిపాటూ భక్తితో గడిపితే కలిగే పుణ్యం ఇక్కడ ఒక్క నిద్రతో కలుగుతుందని క్షేత్ర ప్రాశస్త్యం చెబుతోంది.

అల్లువారి గీతా థియేటర్‌ని, అల్లురామలింగయ్య విగ్రహాన్ని దాటుకుని ఆలయాన్ని చేరుకున్నాం. ఇతర దేవాలయాలకున్నంత విశాలమైన ఆవరణ ఈ ఆలయానికి లేదు. ఇరుకు సందులో ఉంది. వాహానాలన్నీ ఆలయానికి ఆమడ దూరంలో ఆపి ఉంచి దర్శనానికి వెళ్ళాలి.



ఆలయంలోకి ఆడుగుపెట్టగానే ధ్వజస్తంభం దగ్గర తపోదీక్షలో ఉన్న ఈశ్వర స్వరూపం ముచ్చటగొలుపుతుంది. సోమేశ్వరలింగంలా క్షీరారామలింగం కూడా చిన్నది. లింగం మొనదేలి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. కుమారస్వామి బేధించిన లింగానికి ఇది శిరోభాగమని భక్తుల విశ్వాసం. ఆలయంలోపలి గోడలపై చెక్కిన వివిధ దేవతా మూర్తుల శిల్పాలు, పురాణ ఘట్టాలు భక్తులను ఆకర్షిస్తాయి. ఈ క్షేత్రానికీ జనార్థనస్వామే క్షేత్రపాలకుడు.

ఇక్కడితో మా పంచారామ యాత్ర పూర్తయ్యింది.

తరువాత మజిలీ అంతర్వేది.


అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి



పాలకొల్లు నుంచి అంతర్వేది వెళ్ళే మార్గం మనోహరంగా ఉంది. చించినాడ బ్రిడ్జి దగ్గర గోదావరి చిద్విలాసాలు చూడాల్సిందే. దిండి మీదుగా వెళ్తూంటే ఎటుచూసినా చేపల చెరువులు, కొబ్బరితోటలు లేదా పంటపొలాలూను. పోనుపోను రోడ్లు సన్నబడిపోయి, కారులోంచి క్రిందకు దిగి  ఏమరుపాటున  కుడివైపుకో ఎడమవైపుకో రెండడుగులు వేస్తే పిల్లకాలువలో పడిపోయేలా తయారవుతుంది పరిస్థితి. వన్వే ట్రాఫిక్ అన్నమాట. రోడ్డుకు రెండువైపులా కాలువగట్ల మీద స్థిరనివాసలేర్పరుచుకున్న మనుష్యుల్ని చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. ఇళ్ళకు రోడ్డుకు మధ్య కొబ్బరిబోదెలే వారధులు. సూర్యుడు కరుణించినంతవరకూ వీళ్ళ సుఖజీవనానికి ఢోకా లేదు. ఒక్క రెండు పదున్ల వానపడితే మాత్రం బిక్కు బిక్కుమంటూ గడపాల్సిందే. కాలువలు పొంగెత్తి ఇళ్ళను ముంచెత్తక మానవు. వర్షాకాలంలో ఇక సరేసరి. భావావేశం పేరిట పైత్యం వ్రాసే నాబోటి వాడెవడైనా ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి వివశుడైపోయి ఒక ఇల్లు కట్టుకుని, రెండు కొబ్బరిచెట్ల మధ్య ఊయల బిగించి, కొబ్బరాకుల కిటికీల్లోంచి ఆకాశంవైపు చూస్తూ ఆలోచనా స్రవంతిలో జీవితాన్ని మమేకం చేద్దామని ఆశపడితే ఒక్క నిమిషం మళ్ళీ పునరాలోచించాల్సి ఉంటుంది.

అంతర్వేది చేరేసరికి మధ్యాహ్నమైంది. సముద్రతీరం కాబట్టి ఇసుకమేటలు ఎక్కువ పచ్చదనం తక్కువ. ఊరు కూడా చాలా చిన్నది. గుడి, గుడిదగ్గర్లో కొన్ని ఇళ్ళు..అంతే.

విశాలమైన అంతర్వేది ఆలయం నవనారసింహ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ నృసింహుడు పశ్చిమాభిముఖుడై భక్తులకు దర్శనమివ్వడం విశేషం.ఇక్కడే వశిష్టగోదావరి నది సముద్రంలో కలుస్తుంది. వశిష్టగోదావరికి, సముద్రానికి మధ్యనున్న ఈ స్థలంలోనే పూర్వం బ్రహ్మదేవుడు వేదిక నిర్మించి రుద్రయాగం చేశాడని ఆనాటి నుండి ఈ క్షేత్రం అంతర్వేదిగా పిలువబడుతోందని పురాణం చెబుతోంది. ఆనాడు బ్రహ్మ ప్రతిష్ఠించిన నీలకంఠేశ్వరుడే ఇక్కడి క్షేత్రపాలకుడు.






మరో గాథ ప్రకారం హిరణ్యుక్షుడి కొడుకైన రక్తవిలోచనుడనే రాక్షసుడు వరగర్వంతో వశిష్టాశ్రమంపై దాడి చేసి అందరిని చంపి తినేయటంతో ఆయన కలత చెంది స్థితికారకుడైన శ్రీమన్నారాయణున్ని శరణు కోరాడు. శ్రీహరి అభయమిచ్చి నృసింహావతారియై వచ్చి రక్తవిలోచనుడి శిరస్సును సుదర్శన చక్రంతో ఖండించబోతే, ఆశ్చర్యంగా క్రింద పడిన ప్రతి రక్తపుబొట్టు నుండి మరో రక్తవిలోచనుడు ఉద్భవించి ఆయుధాలు విసరడం ప్రారంభించాడు. నృసింహుడు మహామాయను ప్రేరేపిస్తే  ఆమె అశ్వారూఢయై వచ్చి ఆ రాక్షసుడి రక్తం ఒక్క చుక్క నేలపాలవకుండా మొత్తం తాగేసి సంహారానికి సహకరించింది. వశిష్ట మహర్షి కోరిక మేరకు లక్ష్మీ నరసింహుడిగా వెలసి ఆనాటి నుండి పూజలందుకొంటున్నాడు మహావిష్ణువు. మహామాయ  
అశ్వారూఢాంబికగా ,గుర్రాలక్కగా పూజలందుకుంటోంది. ఆమె ఆనాడు తాగి విడిచిన రక్తం రక్తకుల్యానదిగా పిలవబడుతోంది.  ఆలయానికి ఓవైపు ఎర్రటివర్ణంతో ప్రవహిస్తున్న నది అదేనని ఒక విశ్వాసం. రాక్షస సంహారానంతరం నృసింహుడు సుదర్శనచక్రం కడిగిన తీర్థం చక్రతీర్థంగా ప్రఖ్యాతికెక్కింది.

దైవదర్శనం పూర్తి చేసుకుని యథాప్రకారం గుడిలో జరిగే అన్నదానంతో మా జఠరాగ్నిని శాంతపరిచి ఆలయం వెలుపలికి వస్తే వశిష్టగోదావరి సముద్రంలో కలిసే ప్రాంతానికి తీసుకెళ్తామంటూ కొందరు పడవలవాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టారు. మిట్టమధ్యాహ్నం సముద్రంలోకి వెళ్ళడమా అని మేం సందేహిస్తూంటే మా డ్రైవరు అవసరం లేదు ఫోమ్మంటూ వాళ్ళను కసురుకున్నాడు. కమీషన్ల కోసం కక్కుర్తిపడుతున్నావంటూ వాళ్ళు మా డ్రైవరు మీద విరుచుకుపడ్డారు. అతని బాధ అతనిది. మేం ఇప్పుడు  సముద్రంలోకి వెళ్తే  తిరిగొచ్చేసరికి ఆలస్యం అవుతుంది, అప్పుడు యానాం వెళ్ళడం కష్టమని అతని ఉద్దేశ్యం. తనే అన్ని ప్రదేశాలూ చూపిస్తానని మమ్మల్ని ఒప్పించి అంతర్వేది బీచ్‌ని, తీరం నుంచే దూరంగా కనిపిస్తున్న సంగమ స్థానాన్ని చూపించాడు. అంతర్వేది బీచ్ అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది. సునామీల సమయంలో కోతకు గురైన తీరప్రాంతాన్ని గమనిస్తే ఆ ఊళ్ళో ఎందుకు అంత తక్కువమంది నివసిస్తున్నారో అవగతమైంది.


యానాం

అంతర్వేది నుంచి రాజోలు, అమలాపురం వైపుగా యానాం వెళ్ళాం. అటు కోనసీమను ఇటు యానాంను కలుపుతూ గోదావరి నది పై 110 కోట్లతో నిర్మించిన బాలయోగి వారధి ఒక అద్భుతం. బ్రిడ్జి పైనుంచి వెళ్తూ పరవళ్ళు తొక్కుతున్న గోదావరి నదిని పరికిస్తే సంభ్రమాశ్చర్యాలతో నోరుమూతబడ్డం ఖాయం. దివంగత స్పీకర్ బాలయోగి ఈ వారధి ద్వారా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. భౌగోళికంగా గోదావరిజిల్లాలో ఉన్నా యానాం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పరిధిలోకి వస్తుంది. విశాలమైన వీధులు,  పరిశుభ్రత, ప్రజల జీవన విధానం ముచ్చటగొలుపుతుంది. యానాం బీచ్ దగ్గరున్న పొడవైన శివలింగం చూపరులని ఆకర్షిస్తుంది. ప్రక్కనే చేపల మార్కెట్. చుట్టుప్రక్కలా అనేక లంక గ్రామాలు, చిన్న చిన్న ద్వీపాలు. ఓపిగ్గా చూడాలంటే ఒక్కరోజైనా కావల్సిందే.






కాసేపు బీచ్‌లో గడిపి అస్తమిస్తున్న సంధ్యవెలుగులతో ఆత్మశక్తిని రగలించుకొని తిరిగి రాజమండ్రి ప్రయాణమయ్యాం. వస్తూ వస్తూ ఒక చిన్న పల్లెటూరు దగ్గర రోడ్డు ప్రక్కన్నే చేస్తున్న వేడి వేడి మిరపకాయబజ్జీలు తినేసరికి ప్రాణం లేచివచ్చినట్లయ్యింది. బెంగుళూరులో ఇలా ఘాటుగా మసాలా దట్టించి, మధ్యలో ఉల్లిపాయలు వేసి,నిమ్మరసం పిండి మిరపకాయబజ్జీలు వడ్డించే బజ్జీకొట్ల కోసం ఎంత వెదికానో, ఎంత 
వెదుకుతున్నానో.


-(సశేషం)





గోదావరి యాత్ర-3 (దక్షారామం,సామర్లకోట, అన్నవరం, పీఠాపురం, కాకినాడ)

దక్షారామం


దాక్షారామం గురుంచి చెప్పుకునే ముందు పంచారామాల గురించి తెలుసుకోవాలి.

తారకాసుర సంహార సమయంలో అతని గొంతులో ఉన్న తన తండ్రి పరమశివుడి ఆత్మలింగాన్ని ఆగ్నేయాస్త్రంతో బేధిస్తాడు కార్తికేయుడు. ఆత్మలింగం ఐదు ముక్కలైపోయి ఒక్కో ముక్క ఒక్కో క్షేత్రంలో పడుతుంది. ముక్కలైన లింగాలు ఆకర్షణాశక్తితో తిరిగి ఏకమవ్వాలని, పెరిగిపోయి ఆకాశం వైపు సాగిపోతుంటే, దాన్ని నిలువరించటానికి  సూర్య చంద్రులు, కార్తికేయుడు, ఇంద్రుడు, మహావిష్ణువు ఆ లింగాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అలా ఏర్పడినవే పంచారామ క్షేత్రాలు - అమరావతి, దక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, గునుపూడి. అమరావతి దూరమైపోతుంది కాబట్టి మిగతా నాలుగు ఆరామాలు దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాం. 

దక్షారామానికి విశేషమైన పురాణ ప్రాశస్త్యంఉంది. ఇది పంచారామాలలో ఒకటి మాత్రమే కాదు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కూడా. దక్షప్రజాపతి నిరీశ్వరయాగం చేసి నిహతుడై మేకముఖంతో పునర్జీవితుడైన స్థలం ఆలయానికి దగ్గర్లోనే ఉంది. సతీవియోగంతో ఖిన్నుడైన పరమేశ్వరుడు  ఆగ్రహంతో ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని ప్రళయతాండవం చేస్తూంటే  అఖిలలోకాలు గడగడలాడాయి. అందరూ స్థితికారకుడైన మహావిష్ణువు శరణు కోరితే, ఆయన శివున్ని శాంతపరచడానికి తన సుదర్శన చక్రం ప్రయోగించి సతీదేవి దేహాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించాడు. అలా ఖండింపబడ్డ శరీరభాగాలు పద్దెనిమిదిచోట్ల పడి అవే అష్టాదశ శక్తిపీఠాలయ్యాయి. ఇక్కడ అమ్మవారి నాభి పడింది. ఆమె మాణిక్యాంబగా కొలువై ఉంది. సూర్యభగవానుడు పూజించిన ఈ లింగానికి తూర్పు చాళుక్య భీముడు ఆలయం నిర్మించాడు. అందుకే భీమేశ్వరాలయం అయ్యింది. తనకు తన శిష్య పరివారానికి భిక్ష దొరకలేదన్న కారణంతో కాశీ నగరాన్ని శపించబోయి పరమేశ్వరుని ఆగ్రహానికి గురై వెలేయబడ్డ వ్యాస మహర్షి ఇక్కడే భీమేశ్వర-మాణిక్యాంబ సేవలో తరించి ఉపశమనం పొందారు.





ఆలయ ప్రవేశం చేయబోయేంతలో ద్వారం వద్దే బ్రాహ్మణుల గుంపు ఒకటి మమ్మల్ని  అటకాయించింది. వాళ్ళలో చొరవ కలిగిన బ్రాహ్మణుడొకరు ఆలయ విశేషాలన్నీ విపులంగా చెబుతామని,మరే క్షేత్రంలోనూ ఇంత వివరంగా చెప్పే వాళ్ళు దొరకరని,విశేషాలు చెప్పినందుకు ప్రతిగా భక్తులు తమకు తోచిన సొమ్ము  బ్రాహ్మణ సంఘానికి దానం చెయ్యాల్సి ఉంటుందని, ఆ ధనాన్ని తాము పేద బ్రాహ్మణ సంక్షేమం కోసం వినియోగిస్తామని చెప్పాడు. ఇదేదో ఉభయ తారకంగా ఉందని, చొరవగా మాట్లాడిన బ్రాహ్మణున్నే మేం  కుదుర్చుకున్నాం.

ఆ బ్రహ్మణుడు నిజమే చెప్పాడని తర్వాత తెలిసింది. అమరావతి సంగతి తెలియదు గానీ, మిగతా పంచారామాల్లో ఇలా క్షేత్ర మహత్యాన్ని, విశేషాలని చెప్పే వాళ్ళు నిజంగానే లేరు. పైగా ఆయన స్వస్థలం మా ఊరి దగ్గరే - శ్రీకాళహస్తట. చాలా ఏళ్ళ క్రితం వచ్చి ఇక్కడే స్థిరపడ్డారట. ఎంతో ఓపికతో ఆలయం అంతా కలయతిప్పి సంగతులన్నీ తెలియజేశారు.

దక్షారామం భోగస్థానం. ఇక్కడికెవరైనా అనుకోకుండా వస్తారు కానీ ముందే ప్రణాళికలు వేసుకొని రావడం జరగదట. రావణ సంహారానంతరం బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకొనే ప్రయత్నంలో సాక్షాత్తూ శ్రీరాముడు ప్రతిష్ఠించిన లక్ష్మీనారాయణుడు ఇక్కడి  క్షేత్రపాలకుడు. ఆలయంలోపల ఓ వైపు గర్భాలయం నమునాలో ఏకశిలతో చెక్కిన మరుగుజ్జు కట్టడం ఉంది. అది నమునా కాదని, నమునాలు కట్టి నిర్మాణాలు చేసేది మానవులు కాని దేవతలు కారని, అది భవిష్యత్తులో పాపాలు పెరిగి మనుష్యులు అంగుష్ఠ మాత్రులైనప్పుడు వారి సౌకర్యార్థం నిర్మించిన ఆలయమని చెప్పారు.





గర్భాలయానికి అభిముఖంగా ఠీవిగా నిలబడ్డ నిలువెత్తు నందీశ్వరుడు అబ్బుర పరుస్తాడు. త్రివిక్రముడైన భీమేశ్వరుడు ఇక్కడ తన  ధవళ  స్వరూపాన్ని తొమ్మిడడుగులకు కుదించుకుని రెండంతస్థులు ఆక్రమించి  భక్తులను అలౌకికానుభూతికి గురి చేస్తాడు. ప్రాతఃకాలంలో ఉషాకిరణాలు స్వామి వారిపై పడినప్పుడు మరింత వైభవంగా ఉంటుందట. క్రింద పానవట్టం దర్శించుకొని  మెట్లెక్కి పైకి వెళ్ళి పూర్తి లింగస్వరూపాన్ని దర్శించుకోవాలి. లింగం పైనున్న చిహ్నాలు కుమారస్వామి ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం గుర్తులని కొందరు, కిరాతుని రూపంలో అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు ధరించిన పులిచర్మం గుర్తులని ఇంకొందరు అంటారు.  భీమేశ్వరుని ప్రక్కనే సతీదేవి కొలువై ఉంటుంది. గర్భాలయం లోపల చీకటిగా ఉంటుంది. పూర్వం వెలుతురు కోసం గోడలకు వజ్రాలు,మణులు తాపించారట. ఔరంగజేబ్ దండయాత్రల కాలంలో ఇతరుల పాలవడం ఇష్టం లేక వాటంత అవే రాళ్ళుగా మారిపోయాయని గోడలపై పొడుచుకొచ్చిన రాళ్ళను చూపించి చెబుతారు.




మాణిక్యాంబ అమ్మవారు వామాచార స్వరూపిణి. ఎడమవైపు చూస్తూంటారు. హిమవంతుడు-మేనకాదేవిల ముద్దులపట్టి కనుక పార్వతీదేవికి మైనాకాంబ అని మరో పేరుంది. అదే మాణిక్యాంబగా రూపాంతరం చెందింది. అమ్మవారి స్వరూపం క్రింద శ్రీచక్రాన్ని నిక్షిప్తం చేశారు. అమ్మవారు స్వామివారు సమాన స్థాయిలో వినుతికెక్కిన ఆలయాల్లో ఇదొకటి. మిగతా రెండు ఆలయాలు- కాశీ (అన్నపూర్ణ,విశ్వనాథుడు), శ్రీశైలం (భ్రమరాంబ,మల్లికార్జునుడు).శ్రీనాథ కవిసార్వభౌముని భీమఖండం దాక్షారామ వైభవాన్ని తెలియజేస్తుంది.

దర్శనం పూర్తయ్యాక మాకు గైడ్‌గా వ్యవరించిన బ్రాహ్మణుడికి సంతోషంతో కొంత సొమ్ము ముట్టజెప్పబోయాం. ఆయన తనకొద్దొంటూ యువకుడైన మరో బ్రాహ్మణున్ని చూపించి ఆయనకివ్వమన్నారు. ఆ యువకుడికి మేమిచ్చిన మొత్తం నచ్చలేదు. సొమ్ము పుచ్చుకోకుండా పెదవి విరిచి ఇక్కడికొచ్చే భక్తులు కనీసం మూడువేలకు తక్కువ కాకుండా విరాళాలు ఇస్తారని అలకబూనాడు. మేమంత తూగలేమని చెప్పాం. అతను వినలేదు. చివరికి మా గైడ్ ఏమనుకున్నాడో మరి అతనికి నచ్చజెప్పి సొమ్ము స్వీకరించేలా చేశాడు
.

సామర్లకోట కుమారారామ భీమేశ్వరాలయం

శివపుత్రుడైన కుమారస్వామి సేవించిన లింగం కాబట్టి కుమారారామ భీమేశ్వరుడంటారు. ఈ ఆలయం దక్షారామాన్ని పోలి ఉంటుంది. దక్షారామంలో లాగే ఇక్కడున్న శివలింగం కూడా పొడుగ్గా ధవళ కాంతులతో మెరిసిపోతూ రెండంతస్థులు ఆక్రమించి ఉంటుంది. పంచారామాల్లోని మిగతా లింగాలు భోగప్రదాయకమైనవైతే ఇది యోగకారక లింగం. అమ్మవారి పేరు బాలాత్రిపురసుందరి. చైత్ర  వైశాఖ మాసాలలో సహస్రకరములతో  సూర్యభగవానుడు  పగటి పూట స్వామివారి పాదాలకు, సాయంకాలం అమ్మవారి పాదాలకు ప్రణమిల్లుతాడని ప్రతీతి. 






సామర్లకోట పూర్వ నామధేయం స్వాములకోట లేదా శ్యామల కోట అట. పూర్వం వైష్ణవ స్వాములు ఎక్కువగా నివసించిన స్థలమని ఓ కథనం చెబితే, శ్యామలాంబ గుడి, దాని చుట్టూ కోట ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని మరో కథనం చెబుతుంది.  మా దర్శనం పూర్తైన వెంటనే  మధ్యహ్నమయ్యిందని గుడి మూసేయటంతో అదృష్టం కోద్దీ దర్శనం లభించిందనే చెప్పాలి.

సామర్లకోట నుంచి పీఠాపురం వెళ్ళేసరికి పురుహూతికా దేవి-శ్రీ కుక్కుటేశ్వర స్వామి వార్ల ఆలయం ముసేశారు. పునర్దర్శనం మధ్యహ్నం మూడున్నర తర్వాతే అని తెలిసింది. భోజనాల కోసం వీధులు వెదుక్కుని హోటళ్ళ చుట్టూ తిరగటం కంటే దేవాలయాల్లో జరిగే ఉచిత నిత్యాన్నదానంతో కడుపు నింపుకుంటే ఇటు పుణ్యం అటు సమయం కలిసొస్తుందని మాకు ముందే చెప్పాడు మా డ్రైవరు. దర్శనానికి విరామమిచ్చినా భోజనాలు వడ్డిస్తూండటం చేత గుడి తలుపులు తెరిచే ఉంచారు.ఆకలి రుచెరగదంటారు కదా. అందరం భోంచేసి, వేడి వేడి అన్నం తినటం చేత, ఉక్కబోత చేత పట్టిన చెమటని తుడుచుకుంటూ కాసేపు ఆలయ మండపంలో విశ్రాంతి తీసుకొని, మరో రెండు గంటలు ఏం చెయ్యాలో తెలియక తర్జనభర్జన పడి చివరికి అన్నవరం వెళ్ళిరావాలని నిర్ణయించుకున్నాం.

అన్నవరం


పంపానదీ తీరాన రత్నగిరిపై కొలువైన భక్తవరదుడు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి. మేరువు కుమారులు భధ్రుడు,రత్నాకరుడు. ఘోర తపస్సు చేసి శ్రీరామచంద్రున్ని తనపై కొలువుంచుకునే వరం పొందిన అన్నయ్యను చూసి, రత్నాకరుడూ స్పూర్తిని పొందాడు. తదేక దీక్షతో శ్రీమహావిష్ణువును మెప్పించి త్రిమూర్త్యాత్మకమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణుని రూపంలో స్వామివారిని మోసే భాగ్యం పొందాడు.

స్వామివారి స్వరూపం అనేక విశేషాలకు ఆలవాలం. మూలవిరాట్టు క్రిందిభాగంలో ప్రతిష్టించిన నారాయణయంత్రం సర్వశక్తిమంతమైనది. అది బ్రహ్మస్వరూపం. పంచాయతనానికి గుర్తుగా ఆయనకు నలువైపులా వినాయకుడు, బాలాత్రిపురసుందరి, మహేశ్వరుడు, సూర్యనారాయణుడు కొలువై ఉంటారు. యంత్రం మీదుగా లింగాకృతిలో పైకి లేచిన మధ్యభాగం పరమశివుడికి ప్రతీక. ఊర్థ్వభాగంలో విష్ణు స్వరూపమై ధనుర్బాణాలు, వంపులు తిరిగిన



మీసకట్టుతో శ్రీ సత్యనారాయణుడు కనువిందు చేస్తాడు. స్వామివారికి ఎడమవైపు అనంతలక్ష్మి అమ్మవారు,కుడివైపున మహేశ్వరుడు నెలవై ఉంటారు. సృష్టి, స్థితి, లయకారకులను ముగ్గురినీ సూచించే స్వరూపం కనుకనే త్రిమూర్త్యాత్మకం  అన్నారు.  బ్రహ్మకు పూజలు జరిగే అతికొద్ది దేవాలయల్లో ఇదొకటి.  సీతారాములు ఈ ఆలయానికి క్షేత్రపాలకులు. దగ్గర్లోనే కొలువై ఉన్న వనదుర్గ ఆలయం మహామహిమాన్వితమైనది. ఆమె రాత్రి పూట నగర సంచారం చేస్తూ ప్రజలను రక్షిస్తూంటుందని ఓ నమ్మకం.

స్వయంభువుగా వెలసిన సత్యదేవుడు పూర్వం ఈరంకి ప్రకాశం అనే బ్రాహ్మణుడి కలలో కనబడి తను రత్నగిరిపై వెలసి ఉన్నానని, తనను ప్రతిష్ఠించి శాస్త్రప్రకారం తనకు పూజాదులు నిర్వహించమని ఆదేశించారు .బ్రాహ్మణుడి స్వప్న వృత్తాంతం తెలుసుకున్న ఆ ఊరి జమిందారు గారు గ్రామస్తుల సాయంతో వెదికించి, స్వామివారిని గుర్తించి, వెలికితీయించి, ప్రతిష్ఠించి పూజాదులు ప్రారంభించారు. అన్న (అడిగిన) వరాలను తీర్చే క్షేత్రం కనుక అన్నవరమైంది.

అన్నవరం చిన్న టౌన్. క్షేత్రం, క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రీకుల కోసం వెలసిన హోటళ్ళు తప్ప పెద్ద వూరేం లేదు. భక్తులు వెళ్ళేందుకు ఉన్న నడకదారిని చూసి శంకరాభరణం సినిమాలోనున్న చంద్రమోహన్, రాజ్యలక్ష్మిల సన్నివేశం గుర్తొచ్చింది. కొండపైకి ప్రయాణం తిరుమల ఘాట్‌రోడ్లను తలపించింది. వాహనాలను నేరుగా గుడి వెనుక భాగం వరకు తీసుకువెళ్ళచ్చు కాబట్టి వయస్సుమీదపడినవాళ్ళు తిరుమలోలా ఎక్కువ దూరం నడవాల్సిన పనిలేదు. భక్తుల రద్దీ లేకపోవటం చేత పది నిమిషాల్లో దర్శనం అయిపోయింది.







వైష్ణవులు,శైవులు అన్న భేదం లేకుండా అన్ని విశ్వాసాలవాళ్ళు కొలిచే దైవం శ్రీ సత్యనారాయణస్వామి. గోధుమఊక, ఏలకులు, పచ్చకర్పూరం, పాలు, నెయ్యి మొదలైన పదార్థాలతో  చేసిన ప్రసాదం స్వామివారికి ప్రీతిపాత్రం. ఆలయంలో భక్తులు వ్రతాలు చేసుకొనే వెసులుబాటు కూడా ఉంది. ఘాట్‌రోడ్ మీదుగా క్రిందకు దిగుతూంటే ప్రశాంతంగా ప్రవహిస్తున్న పంపానది  కాసేపు తన అందచందాలతో కట్టిపడేసింది.



పీఠాపురం (పురుహూతికా దేవి-శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం) 


పీఠాపురానికి మూడు ప్రత్యేకతలున్నాయి.

మొదటిది- దీన్ని పాదగయ క్షేత్రం అంటారు. ఇక్కడ పరమశివుడు కుక్కుటేశ్వర స్వామి రూపంలో పూజలందుకుంటున్నాడు. కుక్కుటం అంటే కోడి. పూర్వం గయాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి శ్రీమహావిష్ణువును మెప్పించి ఒక విచిత్రమైన వరం పొందాడు. భూప్రపంచంలో తనను మించిన పవిత్రమైన ప్రాణి, తన శరీరాన్ని మించిన పవిత్రమైన స్థలం మరెక్కడా ఉండకూడదని, తనను ఎవరు దర్శించినా, స్పృశించినా వాళ్ళ పాపం తొలగిపోయి పునీతులవ్వాలని వరం పొందాడు. దీంతో ఇంద్రాది దేవతలకు కొత్త చిక్కు వచ్చి పడింది. భూలోకంలో పాపుల సంఖ్య నానాటికీ క్షీణించి సకల ప్రాణులతో స్వర్గం నిండిపోతూండటంతో వాళ్ళు తలలు పట్టుకున్నారు. త్రిమూర్తులను శరణు వేడారు. వాళ్ళు చిరునవ్వు నవ్వి బ్రాహ్మణ రూపాలు ధరించి గయాసురున్ని సమీపించారు. తామొక దివ్యయజ్ఞం తలపెడుతున్నామని అయితే దానికి అనువైన పవిత్ర స్థలం గయాసురుని శరీరం తప్ప మరొకటి లేదని, ఏడు రోజులపాటు తమ యజ్ఞానికి సహకరించాలని కోరారు.

గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని భారీగా విస్తరింపజేశాడు. త్రిమూర్తులు అతని శరీరంపై కూర్చుని యజ్ఞం ప్రారంభించారు. వేయినాల్కలలో ఎగిసిపడుతున్న యజ్ఞాగ్నిని భరిస్తూ కదలకుండా పడుకుని కోడికూతతో రోజులు లెక్కపెట్టుకొంటూ ఆరురోజులు నెట్టుకొచ్చాడు గయాసురుడు. ఏడవరోజు సమీపిస్తూండటంతో పరమశివుడు ఇక లాభం లేదని కుక్కుట రూపం ధరించి ముందుగానే కూతపెట్టాడు. గడువైపోయిందని గయాసురుడు తన దేహాన్ని కదిలించేసరికి యజ్ఞానికి విఘ్నం కలిగింది. ఏడురోజులపాటూ యజ్ఞాగ్ని భరించలేనివాడివి ఇతరులపాపాలు ఎలా భరించగలవని ప్రశ్నిస్తారు బ్రాహ్మణులు. యజ్ఞానికి ఆటంకం కలిగించావు కనుక సంహారం తప్పదంటే, వచ్చినవారు త్రిమూర్తులే అని గ్రహించిన  గయాసురుడు తన దేహానికి పూజార్హత కలిగించమని వేడుకున్నాడు. అలా


గయాసురుని శిరోభాగం (బుద్ధగయ-బీహార్), నాభి (జాజ్‌పూర్-ఒరిస్సా), పాదాలు (పీఠాపురం) పావనమయ్యాయి. పరమశివుడే ఇక్కడే కుక్కుటేశ్వరుడిగా వెలశాడు.



రెండవది -ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి.ఇక్కడ అమ్మవారి ఎడమచేయి పడింది. గౌతమ మహర్షిచే శాపగ్రస్తుడైన ఇంద్రుడు ఇక్కడే అమ్మవారిని సేవించి పురుషత్వాన్ని తిరిగి పొందాడని పురాణ కథనం చెబుతోంది. పురుహూతికా దేవి నాలుగు చేతులలో కమలము, బీజాలు, పరశువు, మధుపాత్ర ధరించి అలరారుతూంటుంది. బీజాలు కమలము ధరించిన రూపాన్ని పురుహూత లక్ష్మిగా సమయాచారులు, పరశువు, మధుపాత్ర ధరించిన రూపాన్ని పురుహూతాంబగా వామాచారులు కొలిచేవారని మరో కథనం.


మూడవది -శ్రీమహావిష్ణువు పరిపూర్ణ స్వరూపం దత్తాత్రేయుడు. ఆయనే శ్రీపాద శ్రీవల్లభుడిగా అవతరించిన క్షేత్రం పీఠాపురం.

పీఠాపురంలోనే ఉన్న కుంతిమాధవాలయం ప్రశస్తమైనది.పాండవమాత కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవాలయం ఇది.

కాకినాడ


కాకినాడ చేరేసరికి సాయంకాలమైంది .

అధ్యాత్మిక ప్రవచనాలు వినేవాళ్ళాందరికీ కాకినాడ అంటే ముందు గుర్తొచ్చేది పూజ్య గురువు శ్రీ చాగంటి కోటేశ్వర్రావు గారు. ఆయన వాగ్గంగలో మునకలేసి తమ జీవితాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నవాళ్ళు నాతో సహా ఎందరో. అటువంటి విద్వత్వరేణ్యులు కాకినాడలో ఉండటం కాకినాడ వాసుల అదృష్టం. కాకినాడ పూర్వనామం కోకనదమట. ఒకప్పుడు ఎర్రటి కలువలతో నిండిన ప్రదేశం కనుక ఆ పేరట. ఆంగ్లేయులకు  షరా మాములుగా నోరు తిరక్క గో కేనడా అనటం మొదలుపెట్టి జనబాహుళ్యానికి వచ్చేసరికి అది కాకినాడగా మార్పుచెందింది.





పగలంతా ప్రయాణం చేసి అలసిపోయిన మమ్మల్ని సముద్రతీరం సేదతీర్చింది. పొంగెత్తే కెరటాలను సవాలు చేస్తూ పొగరుగా నిల్చున్న కుర్రకారు, ఎగిసిపడే అలలని చూసి భయపడుతూనే వెనక్కి జరిగి, తీరా ఆ అలలు పాదాలను ముంచెత్తి కాళ్ళ క్రింద ఇసుకను లాగేస్తే చక్కిలిగింతలు పెట్టినట్లయ్యి కేరింతలు కొట్టే పసిమనస్సులు, జీవనసంధ్యలో ఉన్నా ఒడ్డున కూర్చుని, త్రుళ్ళిపడే తమ పిల్లల్లో ప్రాత:కాలపు ఉషస్సులు వెదుక్కుని మురిసిపోయే వయోవృద్ధులు, దగ్గరకొచ్చినట్లే వచ్చి అంతలోనే దూరం జరుగుతూ ఒడ్డుకు విరహతాపాన్ని పెంచుతున్న ఓడలు, గూట్లో పెట్టిన నేతి దీపాల్లా దూరంగా మిణుకుమిణుకుమంటూన్న విద్యుద్దీపాలు..ఓహ్.. కొన్ని క్షణాలు అజరామరాలు..

భారమైన హృదయాలతో రాజమండ్రికి తిరుగుప్రయాణమయ్యాం. కాకినాడలో సుబ్బయ్య హోటల్ చాలా ప్రఖ్యాతి కెక్కిందని మా డ్రైవరు చెబితే  రాత్రి భోజనాలకు అక్కడే పార్శిల్ చేయించుకున్నాం. హోటల్  చూడ్డానికి మాములుగా చిన్నగా ఉంటుంది కానీ రుచిలో మాత్రం దానికి తిరుగులేదు. అక్కడలేని వెరైటీలు లేవు. పూర్తి శాకాహార భోజనశాల. భోజనాలు చేసేవారందరికీ తమ దగ్గరున్న రకాలు చెప్పి యజమానే కొసరి కొసరి వడ్డిస్తాడని చెప్పాడు డ్రైవరు.ఇక్కడ పార్శిల్ బుట్టల్లో చేస్తారు. ఒక బుట్ట ఇద్దరికి పూర్తిగా సరిపోయి ఇంకొంత మిగులుతుందంటే  మేం రెండు బుట్టలు తీసుకున్నాం. ఒక్క బుట్ట ఖాళీచెయ్యడానికే ఆపసోపాలు పడ్డాం. మరో బుట్టను వృథాచెయ్యడం ఇష్టం లేక హోటల్‌లోని పనిపిల్లలకు ఇస్తే పాపం వాళ్ళు  చాలా సంతోషించారు.

మరుసటి రోజు యాత్రకు ప్రణాళికలు వేసుకొని కమ్మని జ్ఞాపకాలతో కలల్లోకి జారుకున్నాం.


-(సశేషం)