• మెరిసే మేఘాలు

    మెరిసే మేఘాలు
  • కురిసే వర్షాలు

    కురిసే వర్షాలు
  • విరిసే పుష్పాలు

    విరిసే పుష్పాలు
  • మురిసే భువనాలు

    మురిసే భువనాలు
  • నాకు

    నాకు
  • కదిలే కావ్యాలు

    కదిలే కావ్యాలు

రుక్మిణీ కళ్యాణం

శ్రీమద్భాగవతంలోని అనేకమైన రసవద్ఘట్టాలలో రుక్మిణీ కళ్యాణం వొకటి.భక్తితో పాటూ,ప్రేమ,అరాధన,అనుబంధాలు ఇందులో ఒకదానితో వొకటి పెనవేసుకొని ఉన్నాయి.పరమాత్వతత్వంతో పాటూ,జీవిత సత్యం కూడా పొందుపరచబడి ఉన్న ఈ మధుర ఘట్టాన్ని,మారుతున్న కాల పరిస్థితులను,రంగస్థల ప్రదర్శనానుకూలతను దృష్టిలో వుంచుకొని,సరళమైన పద్య సౌందర్యంతో,సర్వజనామోదయోగ్యమైన నాటకంగా తీర్చిదిద్ది,తెరకెక్కించే ప్రయత్నం చేశారు మా నాన్నగారు..

రుక్మిణీ కళ్యాణం నాటిక పై అవధాన చక్రవర్తి,శతావధాన సార్వభౌమ డాక్టర్ మేడసాని మోహన్ ,శతాధిక నాటకకర్త,నాటక నవరత్నం కొడాలి గోపాలరావు వంటి ప్రముఖుల అభిప్రాయాలు ఇక్కడ జత చేస్తున్నాను.



ఈ నాటకంలోని కొన్ని రమ్యమైన పద్యాలు:

జగన్నాటక సూత్రధారియైన శ్రీకృష్ణుని ప్రేమకై అపర లక్ష్మీదేవియైన రుక్మిణి తపించి దుఃఖించే సందర్భంలో వచ్చే సీస పద్యం.

సీ||

సరసిజనాభ ! నీ శౌర్యార్చనార్పిత
ధామమ్ము కాని సౌందర్యమేల ?
పావన చరిత ! నీ ప్రణయానురాగాల
పులకించని పరువంపు తనమేల ?
మోహనాకార ! నీ మోవిపై మురళియై
మధుర శ్రుతులిడని మనుగడేల ?
దురితాపహార ! నీదు పదసన్నిధిలోన
ప్రమిదనై వెలుగని భాగ్యమేల ?

ఆ||

ఆశ్రిత జనపాల ! అంచిత గుణశీల !
పుణ్య హృదయలోల ! భువనపాల !
వేణుగానలోల ! వినవేల ! వేయేల !
నీవులేని బ్రతుకు నిలుపఁ జాల !

తన ప్రేమ రాయబారాన్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని కడకు తీసుకువెళ్ళిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడు యెంతకీ తిరిగి రాకపొయేసరికి 'ఏమైనదో ఏమో'నని రుక్మిణీదేవి మనస్సు పలుపలు విధాలుగా అలోచిస్తూ,చింతించే సమయంలో వచ్చే మరొక సీస పద్యం.

సీ||

ఏల నాస్వామి రాడేమి కతమొ ? భూసు
రేంద్రు డగ్నిద్యోతు డేగె, వృద్ధు
డాయసపడి, దుర్గమారణ్య మార్గమున్
గడచెనో? కడిచినా, కడలినధిగ
మించి ద్వారకపురమేగెనో? యేగిన
మాధవు దర్శన మతనికాయె
నో ! లేదో ! వినియేమను కొనెనో మనమున,
దయచేయతలచునో,తలుపడేమొ,

గీ||

కలికి ! శ్రీగౌరి యేరీతి కరుణ గొనునో ?
వ్రాలు నాతలనేమని వ్రాయబడెనో ?
తెల్లవారె లగ్నము,వచ్చిరెల్లవారు,
ఎట్లు తెల్లవారునో బ్రతుకేమి జేతు.

రుక్మిణీదేవి లేఖను చదివి,తాను తక్షణమే వచ్చి ఆమెను పెళ్ళి చేసుకుంటానని అగ్నిద్యోతునికి అభయం యిస్తూ శ్రీకృష్ణుడు వెల్లడించే సన్నివేశంలో వచ్చే పద్యం.

కు||

చెచ్చెర నేనచ్చోటికి
వచ్చెద,శిక్షించెద తులువలనెల్ల,జనుల్
మెచ్చగ నారీ రత్నము
దెచ్చెద,చేపట్టెద ప్రియ దేవేరియనన్ ||



నాన్నగారి పుస్తకాలు - ప్రదర్శనలు

న్నో నాటికలు,గేయాలు వ్రాసినా, ప్రచురింపబడ్డ పుస్తకాలు రెండు.
అవి రుక్మిణీ కళ్యాణం(1991) ,అరోగ్యగీత(2002).






2003(మే-జూన్) లో రాష్త్ర ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవం-2002 పోటీలకు చిత్తూరు జిల్లా నుంచి ఎంపికై ప్రదర్శింపబడ్డ ఎకైక నాటిక 'దర్పణం' .



అదే సంవత్సరం(నవంబర్- డిసెంబర్) లో కిన్నెర, హైదరాబాద్ వారు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ నాటకోత్సవాలలో కూడా ఈ నాటిక ప్రదర్శింపబడింది(బాక్స్ ఐటెం).




చలం -మైదానం - రెండవ భాగం



మైదానం(The open plain) ఒక సర్రియలిస్టిక్(surrealistic) నవల.

సర్రియలిజం అంటే సబ్-కాన్షియస్ మైండ్ ఆలోచనలకు భావాలకు ఒక రూపం యిస్తూ అంతర్లీనంగా ఒక సందేశాన్నిజోడించి చెప్పే ఒక కళ. 1920లలో ఫ్రెంచిలో ఊపిరిపోసుకున్న ఈ సాహిత్య ఉద్యమానికి ఆద్యుడు, మేనిఫెస్టో రచయితైన ఆండీ బ్రెటన్ మాటల్లో సర్రియలిజం అంటే



"ఎవరి అదుపాజ్ఞలు లేనప్పుడు,ఎటువంటి తర్కానికి కానీ,సాంఘిక కట్టుబాట్లకు కానీ,ఆచార వ్యవహారాలకు కానీ,నీతి నియమాలకు కానీ లొంగకుండా,మాటల ద్వారా కానీ,వ్రాతల ద్వారా కానీ,మరే విధాల ద్వారా కానీ,తన మస్తిష్కం లో రేగే అలోచనలు ఉన్నది ఉన్నట్లుగా వెల్లడించే ప్రక్రియ"

సర్రియలిజం మూలాలు 1916 కాలంలో స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ లో మొదలైన దాదా ఉద్యమం(Dadaism)లో ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరగటానికి ప్రధాన కారణం అప్పటి అప్పర్ మిడిల్ క్లాస్ యొక్క కాపిటలిస్ట్ రీజనింగ్,అలోచనా విధానాలు అని గాఢంగా నమ్మిన కొంతమంది, వాటికి వ్యతిరేకంగా ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటివరకు ఉన్న అలోచనా శైలి,నాగరికత మీద విశ్వాసం సన్నగిల్లి, ప్రజల విచక్షణా జ్ఞానాన్ని, అభిప్రాయాలను, విద్యా వ్యవస్థను,మంచీ-చెడులను..ఇలా ఒక్కటేమిటి మొత్తం వ్యవస్థనే సవాల్ చేసి, ఉలిక్కిపడి నిశ్చేష్ఠుల్ని చేసే సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది Anti-Art. ఇటువంటి Art (రచనలు కానీ,చిత్రాలు కానీ) చాలాసార్లు లాజిక్ వుండదు. ఉన్నా అందులో దాగున్ననిగూడార్థం సగటు పాఠకుడికి అర్థం కాదు. ఈ తరహా సాహిత్య ప్రక్రియని తెలుగు సాహిత్యంలో కొద్దిమందే అడపాదడపా అనుకరించారు.అటూవంటివాళ్ళలో చలం వొకడు.

సర్రియలిజం అనే కోణంలో చూసినప్పుడు మైదానం ఒక అద్భుతమైన నవల.ఇందులోని ప్రధాన పాత్రలు రాజేశ్వరి,అమీర్,మీరా. కథనంతా రాజేశ్వరి చుట్టూనే తిప్పుతూ,ఆమె ద్వారానే వివరిస్తాడు రచయిత. తన కథను సాటి స్త్రీతోనో, లేక పాఠకురాలితోనో, లేక సమాజంతోనో చెప్పుకుంటున్నట్లు కథనం సాగుతుంది. ఈ పాత్రల అలోచనాశైలి,మనస్తత్వ ధోరణులు ఏవీ తర్కానికి అందవు. ప్రస్తుత సమాజపు కట్టుబాట్లను, ఆచార వ్యవహారాలను ప్రశ్నిస్తూ,పూర్తి విప్లవాత్మక పద్ధతుల్లో ప్రవర్తిస్తాయి.

కథానాయిక మస్తిష్కమే ఇక్కడొక సువిశాలమైన మైదానం !

ఒక సువిశాలమైన మైదానం చూడగానే మనకి ఏమనిపిస్తుంది? కాసేపు ఆడుకోవాలని,ఇంకాసేపు గెంతులేయాలని,స్వేచ్ఛగా చుట్టూ కలయతిరగాలని అనిపించదూ? అలాగే తన మస్తిష్కమనే మైదానంలో, ఆమె కలయతిరుగుతూ,తనలో రేగే రకరకాల అలజడులకు స్వేచ్ఛారూపం యిస్తే,అప్పుడు జరగబోయే విపరీత పరిణామాలకు,వాటి దుష్ఫలితాలకు దర్పణమే ఈ పుస్తకం. ఇప్పుడు మనకు కొత్తగా అనిపిస్తున్న సహజీవనం అనే concept ని,ఆ concept ఒక గృహిణి తన స్వేచ్ఛాస్వాతంత్ర్యాల కోసం అన్వయించుకొంటే, ఆమెకు ఎదురయ్యే దుస్థితులని చలం ఆనాడే ఇందులో చర్చించారు. అలాగే వివాహ వ్యవస్థ మీద కూడా కొన్ని పదునైన వ్యాఖ్యలు చేశారు. మనస్తత్వాలు, శరీరధర్మాలు పొసగని ఎన్నో పెళ్ళైన జంటలు కేవలం సంఘానికి భయపడి తమ బ్రతుకు బండిని లాగించటం మీద విమర్శలు ఉన్నాయి. తన పసితనంలో తనను లొంగదిసుకోవటానికి విఫలయత్నాలు చెసి ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్పే మావయ్యను, అంతర్లీనంగా ఎంత కుళ్ళున్నా ఏనాడూ బయటపడకుండా గుట్టుగా కాపురాలు చేస్తూ నెట్టుకొచ్చే మనుషుల ద్వంద ప్రవృత్తులను, అటువంటి సమాజాన్ని రాజేశ్వరి పాత్ర 'ఛీ' కొడుతుంది. పురుషులతో సమానమైన శారీరక స్వాతంత్ర్యాన్ని కోరుకుంటుంది.

ఐతే,ఏ కళైనా సమాజ హితం కోరుకునే విధంగా ఉండాలి. అప్పుడే అ కళకొక అర్ధం పరమార్థం. మన సమాజంలో సర్రియలిజం గురుంచి ఎంతమందికి తెలుసు? మహా మహా మెధావులకే ఓ పట్టాన అర్థం కాని ఈ ప్రక్రియ ఇంక పామర జనులకు ఏం అర్థం అవుతుంది? తద్వారా వొరిగే ప్రయోజనం ఏమిటి? తను చెప్పదలచుకున్న విషయం పాఠకుడికి,లేదా వీక్షకుడికి సులభంగా అర్థమవ్వాలని ఒక రచయిత లేదా చిత్రకారుడు కోరుకుంటారు. అంతే కానీ తమ రచనలు చదివి,చిత్రాలు చూసి విషయం బోధపడక,వాటి సారాంశం తెలుసుకోడానికి ప్రత్యేక పరిశోధనలు చెయ్యాలని ఎవరూ అనుకోరు. పరిశోధన చేసి అర్థం చేసుకొనే వోపిక, తీరిక అందరికీ ఉండవు. ఒకవేళ ఉన్నా ఒక్కో వ్యక్తి ఒక్కో అర్థాన్ని తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు మంచి కంటే చెడు జరిగే అవకాశాలే ఎక్కువ. అందరి మనఃస్థితి ఒకేలా ఉండదు కదా. చలాన్ని,చలం రచనలని సమాజంలోని ఒక వర్గం బహిష్కరించడానికి ఇదొక కారణం.

సర్రియలిజం గురించి తెలియని సగటు పాఠకుడి దృష్టిలో మైదానం ఒక చవుకబారు నవల. మైదానం అంటే కథలో నాయిక నివసించే స్థలమని, ఇందులోని పాత్రలకు వ్యక్తిత్వం లోపించిందని,విశృంఖలత్వాన్ని రచయిత ప్రేరేపిస్తున్నాడని అనుకొనే ప్రమాదం కూడా ఉంది. అయితే, ముందే చెప్పినట్లు దీనికి కారణం,తన అభిప్రాయాల్ని వ్యక్తం చెయ్యడానికి చలం ఎన్నుకొన్న సాహితీ ప్రక్రియ, ఆనాటి కాల పరిస్థితులు. అది అర్థం కానప్పుడు ఆయన రచనలూ అర్థం కావు. సాధారణ పాఠకుడు ఈ పుస్తకాలను తన ఇంట్లొ పెట్టుకోడు. తను అర్థం చేసుకోగలిగినా తన పిల్లలు సరిగ్గా అర్థం చేసుకుంటారో లెదోనన్న బెంగ. ఇంకొకరిని చదవమని ప్రోత్సాహించడు. ఇతరులు ఏమనుకుంటారోనని భయం.అందుకే ఇటువంటివి విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా, గ్రంథాలయాల్లో పి.హెచ్.డి విద్యార్థులకి పరిశోధనాంశంగా మగ్గిపోతూంటాయి. ఆనాడు చలం ప్రస్తావించిన సమస్యలు,లేవనెత్తిన ప్రశ్నలు నేటికీ సమాజంలో సజీవమై ఉన్నాయి. ఎందరు ఎలా అనుకున్నా,తెలుగు సాహిత్యం ఉన్నన్నాళ్ళు చలం మీదా,చలం రచనల మీదా చర్చలు జరుగుతూనే వుంటాయి.మైదానం అజరామరమై నిలిచి ఉంటుంది.



చలం - మైదానం - మొదటి భాగం



లం గారి గురించి,వారి స్త్రీవాద సాహిత్యం గురించి అనేకసార్లు విన్నాను కానీ,వారి రచన చదవడం ఇదే మొదలు.చదివిన మొదటి పుస్తకానికే సమీక్ష రాయటం నా దుస్సాహసమే అయినా,నా అభిప్రాయాలు చదివి దాని మీద కొంచెమైనా చర్చ జరిగి నాకు తెలియని విషయాలు బోధపడితే ఈ సమీక్షకు అర్థం పరమార్థం నెరవేరినట్లే.

కథ

రాజేశ్వరి ఒక సదాచార బ్రాహ్మణ గృహిణి.అందమైనది.

ఆమె భర్త ఒక ప్లీడరు. కోర్టు వాజ్యాల విషయమై ఆయన దగ్గరకు ఎంతోమంది క్లైంట్లు వస్తూపోతూంటారు. అలాంటి వాళ్ళలో ఒకడు అమీర్.

ఆఫీసు గదిలోంచి ఏవీ మాటలు వినబడకపొతే ఎవరూలేరనుకొని భర్త కోసం కాఫీ తీసుకెళ్ళిన రాజేశ్వరికి మొదటిసారి తారసపడతాడు అమీర్. తొలిచూపులొనే వాళ్ళిద్దరి మధ్య బలమైన ఆకర్షణ ఏర్పడుతుంది. అమీర్ మోహపారవశ్యపు ఉద్ధృతిలో ఉక్కిరిబిక్కిరైన ఆమె,అతని ప్రొద్బలంతో భర్త ఊరికి వెళ్ళిన ఒకనాటి రాత్రి అతనితో లేచిపోతుంది. అలా వెళ్ళిపోయి వాళ్ళు ఒక మైదానం చేరుకుంటారు..చుట్టూవున్న ఆకాశాన్ని,కొండల్ని, చింతచెట్లని,మైదానం ఆనుకొని ప్రవహిస్తున్న చిన్న సెలయేరుని చూసి ఆమె మనస్సు సంతోషంతో పరవళ్ళు తొక్కుతుంది. అక్కడే ఒక చిన్నిపాకలో అమీర్ తో తన క్రొత్త జీవితం ప్రారంభిస్తుంది ఆమె.

అమీర్ సహచర్యంలో ఆమెకు తనవాళ్ళు ఎవరూ గుర్తురారు. తినడానికి సరైన తిండి,కట్టుకొవడానికి సరైన బట్టలు లేకపొయినా, ఉన్నదాంతోనే సర్దుకుంటూ,అతనితో కలిసి మైదానం లో అటలాడుతూ,గెంతుతూ,ఏటిలో స్నానాలు చేస్తూ,సుఖిస్తూ అదే జీవిత పరమార్ధం అనుకుంటూంటుంది. ఒకప్పుడు తాను అసహ్యించుకున్న తురక తెలుగు, చేపల కూర ఇప్పుడు ఆమెకు ప్రియంగా కనిపిస్తాయి. వైష్ణవులకు విష్ణువే సర్వస్వం అయినట్లు,ఆమెకు అమీరే లోకం అవుతాడు. అలా కొన్ని రోజులు,నెలలూ దొర్లాక ఒకరోజు ఆమె స్వంత మావయ్య వస్తాడు. ఆమెకు నచ్చజెప్పి తీసుకువెళ్దాం అని పరిపరివిధాలా ప్రయతిస్తాడు. ఆమె ససేమిరా అంటుంది. పైగా మావయ్య ముందే అమీర్ తో కలిసి ఒకే మూకుట్లో అన్నం తింటుంది."ఏనాటికైనా మా గుమ్మం తొక్కవా" అని మావయ్య అంటే "మీ గుమ్మాలు తొక్కుతానని భయం లేకుండా బ్రతకండి" అంటుంది.

సాఫీగా సాగుతున్న రాజేశ్వరి జీవితంలోకి హఠాత్తుగా ఇంకో స్త్రీ ప్రవేశిస్తుంది. కొద్దిరోజులుగా అమీర్ దిగులుపడుతూ, అన్నం తినకుండా, పలక్కుండా, పలకరిస్తే విసుక్కొని ముసుగుపెట్టి పడుకోవటం ఆమె గమనిస్తుంది. మీరా అనే కుర్రవాడితో అమీర్ రహస్యంగా మట్లాడటం,అతనితో కలిసి చాలాసార్లు వూళ్ళోకి వెళ్ళిరావటం, వచ్చాక మరీ దిగాలుగా వుండటం చూసి పరిస్థితి విషమిస్తోందని ఆమె గ్రహిస్తుంది. మీరా ఒంటరిగా నడిచివస్తూండగా అతన్ని బ్రతిమాలి అసలు విషయం కనుక్కుంటుంది.

అమీర్ ఆ ఊరి తోళ్ళసాయిబు కూతురి మీద మనసుపడతాడు!

ఆ అమ్మాయి ఇతన్ని నిరాకరిస్తూంటుంది.మీరా ఆ అమ్మాయికి బంధువు.ఇద్దరికీ రాయబారం నడుపుతూంటాడు..!

విషయం తెలిసాక రాజేశ్వరి మనస్సులో రొద మొదలవుతుంది. ఆవేశంతో వెళ్ళి గుడిసెలో వున్న అమీర్ ను నోటికొచ్చినట్లు తిట్టేస్తుంది. అమీర్ ఏడుస్తాడు. ఆమె కరిగిపోయి అతన్ని దగ్గరకు తీసుకొని లాలిస్తుంది. మరుసటిరోజు మీరాని వెంటబెట్టుకొని వెళ్ళి సాయిబు కూతురుని కలిసి ఆమెను వొప్పిస్తుంది. రోజూ అమీర్ ను తనే తీసుకువెళ్ళి సాయిబు యింట్లో దిగబెట్టి తర్వాత తీసుకొని వచ్చేది.అమీర్ కు కొద్దిరోజుల్లోనే సాయిబుకూతురి మీద విముఖత కలుగుతుంది. ఆమెతో పోట్లాడి మళ్ళీ రాజేశ్వరికి దగ్గరవుతాడు.

కొంతకాలానికి రాజేశ్వరి గర్భవతి అవుతుంది. అమీర్ దాన్ని వదిలించుకోమంటాడు. ఆమె వినదు. మాతృత్వపు మమకారం పుట్టుకొచ్చి ఏమైనాసరే బిడ్డను రక్షించుకోవాలని నిశ్చయించుకుంటుంది.అమీర్ తాగొచ్చి ఆమెను కొడతాడు. తర్వాత ప్రేమ చూపిస్తాడు. అయినా వినకపోయేసరికి ఆరునెలలు ఆమెని విడిచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు.వెళ్తూ వెళ్తూ ఆమె పర్యవేక్షణ బాధ్యతలు మీరాకి అప్పగిస్తాడు.

మీరా పదహారేళ్ళ నాజూకైన కుర్రవాడు. అనుక్షణం తోడుగావుంటూ ఆమె బాగోగులు చూసుకుంటూంటాడు. ఆమె అతన్ని తమ్ముడిలా భావించి ప్రేమగా చూసుకుంటుంది. ఆ ప్రేమను మరోరకంగా తీసుకుంటాడు అతను. ఆమె పురుడు పోసుకోవటానికి ఒక స్త్రీని తీసుకొస్తాడు. ఆమెను కాపాడటానికి ఒకరోజు రాత్రి ఓ త్రాగుబోతుతో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతాడు. ఆమె కష్టాలకు కారణం ఆ బిడ్డే అని భ్రమించి,ఆమె బిడ్డను కూడా లుంగచుట్టి తీసుకెళ్ళి పారేసి వస్తాడు. అమీర్ కోసం, ఆమె వద్దు అనదు. మీరా తనకోసం పడ్డ కష్టాలు చుసి ఆమె మనస్సు కరిగిపోతుంది. ఆఖరుకి తన సర్వస్వం అర్పించటానికి సైతం సిద్ధపడుతుంది.

మీరా కబురందుకొని అమీర్ వస్తాడు. వచ్చిన కొద్దిరోజుల్లోనే రాజేశ్వరి,మీరాల మధ్య వున్న చనువు అతనికి అర్థమవుతుంది. మీరా కూడా మొదట సంకోచించినా తర్వాత చనువుగా వస్తూపోతూంటాడు. అయితే ఇద్దరికీ పొసగదు. తనకు ఇద్దరూ కావాలి అనుకొనే ఆమె వాళ్ళిద్దరి మధ్యా సతమతం అవుతూంటుంది. ఒకరోజు రాత్రి మీరా లోయలో పడిపోతే అతన్ని రక్షిస్తాడు అమీర్.

ఓ రాత్రి ఆమె అమీర్ తో ఏకాంతంగా నిద్రిస్తూన్న సమయాన,మీరా వచ్చి "నువ్వు లేకుండా నేను వుండలేను" అని ఆమెను తీసుకువెళ్ళి తనదాన్ని చేసుకుంటాడు.ఆ దృశ్యం చూసి అమీర్ ఉద్రేకంతో కత్తి తీసుకొనివస్తాడు. మీరాని చంపబోయి, ఆమె అడ్డుపడేసరికి చివరికి తనకుతానే పొడుచుకుంటాడు. ఈ విషయం తెలియక,అమీర్ ని చంపింది రాజేశ్వరి అనుకొని,ఆమెను కాపాడ్డానికి డాక్టరుతో,పోలీసులతో తనే చంపినట్టు అబద్ధం ఆడుతాడు మీరా. అతన్ని రక్షించడానికి తనే హత్య చేసినట్లు చెబుతుంది ఆమె.

ఇదీ కథ..


(మిగతా సమీక్ష రెండవ భాగంలో.)


తపస్వీ.. కళ్ళుతెరు !




చీమలు దూరని చిట్టడవిలో !
చెట్టునీడన చట్రాతిపై !
పద్మాసనం వేసుక్కూర్చొని
ప్రపంచంతో పనిలేనట్లు
దేనికోసం ఓ తపస్వీ
దివారాత్రులు ధ్యానిస్తున్నావ్?!
మోక్షమే నీ లక్ష్యమైతే
కళ్ళు తెరుచుకొని !
ఒళ్ళు విరుచుకొని !
తపస్వీ కదలిరా !!
విధి కాటేస్తే !
వ్యథ కోసేస్తే !
బ్రతుకు దుర్భరమై !
భవిత బుద్బుదమై !
మందిరాల ముంగిట !
మసీదుల సందిట !
చౌరస్తా దారుల్లో !
చౌకబారు వాడల్లో !
అన్నిచోటులా !
అన్నివేళలా !
స్మృతిహీనుల్లా సంచరించే !
అభాగ్యులెందరో !
అనాథలెందరో !
ధరిత్రినిండా పండి ఉన్నారు !!
వాళ్ళంతా నీ తోబుట్టువులే !
నీ తల్లి వసుధ వొడిలో పాపలే !
నువ్వు వెదికే విశ్వేశ్వరుడు
పరివ్యాపితుడై పరివేష్ఠితుడై
ప్రతిప్రాణిలో వొదిగి ఉన్నాడు !!
ఉగ్రతపస్సులు !
యజ్ఞహవిస్సులు !
ఉన్న సమయం వృథాచేస్తాయ్ !!
జగత్సత్యాన్ని అవలోకించి !
జపతపాలను విసర్జించి !
జనస్రవంతిలో మమేకం కా !
అన్నార్తులకూ ఆపన్నులకూ
నీ ఆత్మీయహస్తం అందించు !
దీనులసేవలో దేవుడున్నాడు
సేవించి తరించు !
దర్శించి తరించు !!





స్మృతులు




చిరుమబ్బు సాగితే
తొలిచినుకు రాలితే
నీ రాకనూహించి
నీ నిశ్చలమయ్యా !

హరివిల్లు విరిస్తే
విరిజల్లు కురిస్తే
నీ నవ్వుల కొరకై
నే దొసిలి పట్టా !

వెన్నెల చిగురిస్తే
వన్నెలు పులకిస్తే
నీ వయారాలేరి
వెఱ్ఱికేక పెట్టా !

మల్లియలు విరిస్తే
మారుతం చలిస్తే
నీ స్పర్శనే తలచి
నన్ను నేను మరిచా !

ప్రకృతిలో ప్రతి అణువూ
తెలిపేది నీ ఉనికే
పలికేది నీ ఊసే
నీ స్మృతులే నాకు శ్వాస !
నీ వలపే జీవితాశ !!

('ఆంధ్రభూమి' మాసపత్రిక ఫిభ్రవరి 2001 ఎడిషన్లో ప్రచురితం )


ఆమె..!




రత్కాల సుందర రాత్రి
సిగ్గులొలికే మొగ్గ ధాత్రి ఆమె..!

ఆమె వదనం
పూర్ణ చంద్రం
లలిత నయనాలు
చలిత మీనాలు
వినీలాకాశమే వేణీభరము
శతకోటి తారలు
సిగముడిలో పూలు

కరుణభరితం
ఆమె హృదయం
మధుర హాసాలు
మువ్వ లాస్యాలు
సౌందర్యాస్వాదనే శ్వాస
ప్రేమే మతం
ప్రపంచ సౌఖ్యం అభిమతం

వశుడనై
వివశుడనై
వలపంతా మూటకట్టి
నే వనిత చెంత వాలితే
చిరునవ్వులు రువ్వుతూ
చకచకా వెళ్ళిపోయింది !!


(ప్రముఖ మాసపత్రిక 'ఆంధ్రభూమి' (డిసెంబరు 98) ఎడిషన్లో ప్రచురితం..)


ఎవరో..?

ళుకు సోకుల త్రుళ్ళి మురిసే తారకామణో
కళాశోభిత చంద్ర వికసిత కలువ కన్యకో
వలపు కొలనులో వన్నెలుబోవు వయ్యారి హంసో
ఎవరో ఆమెవరో
వెన్నెలనాటి వెలుగుల రాత్రి
విరితోటల పెరటిలో
విరజాజుల మధ్యలో
వాల్చిన ప్రక్కపై వివశంతో వాలి
కంబళిని లాగి కన్నుల్ని మూసి
కునుకు కోరేటి కమ్మటి వేళల
ఊహల ఊయలలో
ఊసుల బాసలలో
సుశంత సుషుప్తిలో
స్వప్నాల సొంపులో
మదిని దోచి మైమరపించు మానినీలతికమెవరో ?


ఉపోద్ఘాతం



మెరిసే మేఘాలు
కురిసే వర్షాలు
విరిసే పుష్పాలు 

మురిసే భువనాలు 
నాకు కదిలే కావ్యాలు !

ఇది నా కవితల పుస్తకానికి నేను వ్రాసుకున్న ఉపోద్ఘాతం ..



ప్రేరణ




నాకు ఈ మాత్రం సాహిత్యాభిలాష అబ్బిందంటే దానికి కారణం మా నాన్న గారే !

నాన్న గారు స్వతహాగా కవి,రచయిత,చిత్రకారుడు,రంగస్థల నటుడు.వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగైనా ప్రవృత్తులను ఆయన ఏనాడు అలక్ష్యం చెయ్యలేదు.వారు వ్రాసిన ఎన్నో గేయాలు,నాటికలు ఆకాశవాణి,దూరదర్శన్ లో ప్రసారం అయ్యాయి.'రుక్మిణీ కళ్యాణం' అనే పద్యనాటిక, అవధాన చక్రవర్తి,శతావధాన సార్వభౌమ డాక్టర్ మేడసాని మోహన్ ,శతాధిక నాటకకర్త,నాటక నవరత్నం కొడాలి గోపాలరావు వంటి ప్రముఖుల మన్ననలను పొంది జన బాహుళ్యంలో మంచి ప్రాచుర్యం తెచ్చి పెట్టింది.సారా వ్యతిరేక ఉద్యమం ఉద్దృతంగా ఉన్న రోజుల్లో 'సారసుర సంహారం' అనే నాటిక వ్రాసి అనేక ప్రదర్శనలు యిచ్చి చిత్తూరు జిల్లా కలెక్టర్ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకొన్నారు.ఎయిడ్స్ మహమ్మరి మీద వారు వ్రాసిన 'దర్పణం'
నాటిక 2002 లో చిత్తూరు జిల్లా నుంచి చాలా కాలం తర్వాత నంది నాటక పోటీలకు ఎంపికైన నాటకం గా సంచలనం సృష్టించింది.ప్రజారోగ్యం,పర్యావరణం మీద కూడా ఆయన ఎన్నో గేయాలు,పద్యాలు వ్రాశారు.ప్రముఖ వైద్య నిపుణుల సహకారంతో,అరోగ్య ప్రాధాన్యాన్ని వివరిస్తూ తేటగీతి పద్యాలతో 'అరోగ్యగీత' అనే పుస్తకాన్ని వ్రాశారు.

ఆ పరిమళం, సహజంగానే పిల్లలైన మాకు కూడా కాస్తొ కూస్తొ అబ్బింది.నాకు వీలైనంతలో అన్ని పుస్తకాలు చదవడానికి ప్రయత్నించాను.ఆ క్రమం లొ నాకు నచ్చిన కవులు శ్రీ బమ్మెర పోతన,శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి మరియు శ్రీశ్రీ.



తొలి పలుకులు


డిసెంబరు 28,2007..

కొన్ని బ్లాగులు చదివాక నాకంటూ ఒక బ్లాగ్ వుంటే బావుండు అని చాలా సార్లు అనిపించింది. అది కార్యరూపం దాల్చటానికి ఇన్ని రోజులు పట్టి ఇప్పటికి కుదిరింది.

మొదట్లో ఈ బ్లాగ్ లో ఏం వ్రాయాలో ఆలోచించలేదు...కానీ బ్లాగ్ పేరు గురుంచి ఆలోచిస్తూండగా భావ నిక్షిప్త అనే పేరు తట్టింది..

భావ నిక్షిప్త -- భావాలను దాచుకొనేది !

నా కుర్రతనంలో నేను వ్రాసుకొన్న కవితల పుస్తకానికి ఈ పేరు పెట్టుకొన్నాను.ఇప్పుడు బ్లాగ్ కి కూడా అదే పేరు పెట్టాను.

నా భావాలను దాచుకొనేది,వెల్లడించేది కాబట్టి భావ నిక్షిప్త అని పేరు పెట్టాను.