ధర్మారావు బి.ఏ చదువుతుండగా కృష్ణమనాయుడు పరలోకగతుడవుతాడు. అతని పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. చదువు నిలిచిపోతుంది.
రంగారావు ఆంగ్ల విద్యలో పట్టభద్రుడు. తండ్రి కాలం చేసిన వెంటనే అతను పెను మార్పులకు శ్రీకారం చుడతాడు. రకరకాల దేశీయ విద్యలని,కళాకారులని ఉదారంగా పోషించే విధానానికి స్వస్తి చెప్పి,అప్పటివరకు వసూలుకాని పన్నులన్ని,ఆస్తులు జప్తు చేసి మరీ వసూలు చేయిస్తాడు. అనవసరమైన ఉద్యోగులనందరినీ తొలగించి, పూచికపుల్ల కు కుడా లెక్కలు చూపుతాడు.పెత్తనమంతా తన పెద్దమ్మ కుమారులకు, మేనత్త కుమారులకు అప్పగిస్తాడు. అతని పెద్దమ్మ కుమారులలో ప్రముఖుడు రామేశ్వరం.
రంగారావు జమిందారుగా పట్టాభిషిక్తుడవుతాడు. సుబ్బన్నపేటలో విద్యుద్దీపాలు, వీధివీధికీ కుళాయులు వెలుస్తాయి. పట్టాభిషేక మహోత్సవానికీ ప్రముఖులందరికీ కబురు వెళ్తుంది.ధర్మారావుకి మాత్రం కబురు వెళ్ళదు.ఉత్సవాలు రోజుల తరబడి జరుగుతాయి.తనకు ఆహ్వానం లేకపోయినా, ఆ వంశం మీద గౌరవం తో ధర్మారావు తండ్రిగారి భొగాంగన కూడా పాల్గొని నృత్య ప్రదర్శన యిస్తుంది.ఆమెకు వయసుకు వచ్చిన కూతురొకటి వుంటుంది.ఆమె దేవదాసి.నిరంతరం శ్రీకృష్ణున్ని ధ్యానిస్తూ,ఉపవాసాలుంటూ అతన్నే భర్తగా భావిస్తూ వుంటుంది. రామేశ్వరంకు ఆమె మీద కన్నుపడుతుంది. ఆమెను పిల్చుకురమ్మని భటులను పంపుతాడు. దేవదాసి పరిగెత్తుకొని వెళ్ళి ధర్మారావు శరణు కోరుతుంది. ధర్మారావు ఆమెకు అభయమిచ్చి ఆమె రాదని చెప్పి భటులను తిప్పి పంపిస్తాడు. రామేశ్వరానికి తలకొట్టినట్లవుతుంది.
రంగారావు యిదంతా పట్టించుకోడు. అతనికి సుబ్బన్నపేట కంటే చెన్ననగరం (ఇప్పటి చెన్నై) బాగా నచ్చుతుంది. అక్కడికి వలసపోయి అధికారులతో,ఆంగ్లేయులతో కలిసిపోయి,పార్టీలకు సినిమాలకు తిరుగుతూ,అప్పుడప్పుడు సుబ్బన్నపేటకు వస్తూంటాడు. నిరాదరణకు గురైన ధర్మారావు కుటుంబాన్ని రంగారావు గారి తల్లి ఆదరిస్తుంది. ధర్మారావు ఆవిడకు పురాణ ప్రవచనం చేస్తూ ఆమె కృపకు పాత్రుడవుతాడు.
ధర్మారావు భార్య అరుంధతి. ఇద్దరికీ చిన్ననాటే వివాహం జరిగినా పెద్దమనిషియ్యేంత వరకు తల్లిదండ్రుల వద్దే వుంటుంది .అల్లుడికి ఆస్తిపాస్తులు లేవని,అతని మీదా,అతని వంశం మీదా లేనిపోనివన్ని చెప్పి ఆమె మనసు విరిచేస్తారు అత్తమామలు. ధర్మారావు ఆమెను కాపురానికి తీసుకొస్తాడు.మొదట్లో ఆమెకు ఏమీ నచ్చకపోయినా,అక్కడి మనుషులు తన భర్త గురుంచి,మామ గురుంచి గొప్పగా చెప్పుకోవటం విని ఆమె మనసు మర్చుకుంటుంది. అతను గుంటూరులో కళాశాలలో చేరి,కొన్నిరోజుల తర్వాత తన కుటుంబాన్ని కూడా అక్కడికి తరలిస్తాడు.
రంగారావు భార్య గొప్ప దైవభక్తురాలు. సుబ్బన్నపేటలోనే వుంటూ,నిత్యం పూజలు,వ్రతాలు చేస్తూ భర్తను దైవంలా కొలుస్తూంటుంది. ఆమె అలవాట్లు,పద్ధతులు ఆధునిక భావాలు కల రంగారావుకి నచ్చవు.వారిద్దరి కొడుకు హర్రప్ప. అతను చిన్నపిల్లవాడు. రంగారావుకి భార్యాపిల్లలతో సంబంధ బాంధవ్యాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. అతని తల్లి మంచం పడుతుంది.ధర్మారావుకి ఆర్థిక సహాయం నిలిచిపోతుంది. స్నేహితులే అతన్ని ఆదుకుంటూంటారు.ఆమెను పరామర్శించడానికి కోటకు వెళ్తే ధర్మారావును అవమానించి పంపేస్తారు రామేశ్వరం,అతని మనుషులు.రంగారావు భార్య కూడా జబ్బున పడుతుంది. కొన్నిరోజుల తర్వాత అత్తా కోడళ్ళు యిద్దరూ చనిపోతారు. దహనక్రియలు చేసిన రంగారావు కర్మకాండ చేయటాన్ని వ్యతిరేకిస్తాడు. అవన్నీ బ్రాహ్మణుల కుత్సిత వృత్తులని నిందిస్తాడు. చనిపోయిన తన తల్లి కోరిక మేరకు, ధర్మారావు దగ్గర చదువుకోవాలని పట్టుబడతాడు హర్రప్ప. అతని సంతోషమే ప్రధానంగా భావించి రంగారావు దానికి అడ్డుచెప్పడు. నయాపైసా జీతం యివ్వకపోయినా ధర్మారావు కోటకు వెళ్ళి పిల్లవాడికి పాఠాలు చెబుతూంటాడు .రంగారావు పిల్లవాన్ని దాసీల పర్యవేక్షణలో ఉంచి ఇంగ్లండు వెళ్తాడు.అక్కడ హోటెల్లో పనిచేసే అమాయకురాలైన ఒక పేద విదేశీ వనితను ప్రేమించి పెళ్ళిచేసుకొని తీసుకువస్తాడు. ఆమెకు కూడా సుబ్బన్నపేట నచ్చుతుంది.
సుబ్బన్నఫేటలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. కోటలో ఒక్క ఏనుగు, గుర్రం మిగలదు. కోటను ఆధునీకరిస్తారు. క్రిస్టియన్ మిషినరీలు ఊళ్ళో అడుగుపెడతాయి. రైల్వేస్టేషన్, పోలీస్ స్టేషన్ వస్తాయి. రంగారావు ప్రొత్సాహంతో మున్సిపల్ కార్పోరేషన్, కళాశాల ఏర్పాటవుతాయి. వాటి జమాఖర్చులు సవ్యంగా ఉండవు. దేశ సంస్కృతిని,వృత్తివిద్యలని బోధించే జాతీయ కళాశాల, ఆంగ్లవిద్య బోధిస్తూ విద్యార్థులకు ఉపకారవేతనాలందించే రంగారావు కళాశాల ముందు వెలవెలబోతుంది. కుటుంబ పోషణార్థం ధర్మారావు కుడా రంగారావు కళాశాలలో అధ్యాపకుడిగా చేరుతాడు.
(మిగతా మూడవ భాగంలో..)