నీలాలు కారేనా కాలాలు మారేనా

శీరిక్షలో నాకు నచ్చిన కొన్ని మధురగీతాల్ని మీతో పంచుకుంటాను.

ముందుగా 'ముద్దమందారం' సినిమా లోంచి 'నీలాలు కారేనా కాలాలు మారేనా ' పాట గురుంచి ..

1981 లో విడుదలై అఖండ విజయాలు సాధించిన తెలుగు సినిమాలలో ఇదొకటి. ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దర్శకుడిగా జంధ్యాల( వెంకట దుర్గాశివ సుబ్రహ్మణ్య శాస్త్రి) గారికిదే మొదటి సినిమా. అప్పటికే ఆయన సినీరచయితగా సుప్రసిద్ధులు. హీరో హీరోయిన్ల(ప్రదీప్,పూర్ణిమ)లతో సహా నటీనటులందరూ చాలా వరకు కొత్తవాళ్ళే. 'సుత్తివేలు' గా ప్రసిద్ధులైన కురుముద్దాలి లక్ష్మీ నరసింహా రావు గారికీ,ఏ.వీ.ఎస్ గారికీ ఇదే మొదటి చిత్రం. సంగీతం రమేష్ నాయుడు గారు. పాటలన్నీ వేటూరి గారే వ్రాశారు. ఆ సాహితీ పారిజాతపు మహావృక్షం కొమ్మరెమ్మల్లో విరబూసిన పాటలు, సుమధుర మరందాల సువాసనలే వెదజల్లాయి. యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ సినిమా విమర్శకులకు మాత్రం బాగా పని కల్పించింది. టీనేజ్ ప్రేమకథలతో యువతను పెడదోవ పట్టిస్తున్నారని వాళ్ళంతా జంధ్యాల పై అస్త్రశస్త్రాలను సంధించారు.





కథ మాములు ప్రేమ కథే.అమెరికా నుంచి తిరిగొచ్చిన ఒక లక్షాధికారి కొడుకు,తండ్రినెదిరించి ఒక పూలమ్ముకొనే పేదింటమ్మాయిని పెళ్ళిచేసుకుంటాడు. ఆ తర్వాత వారి జీవితం ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతుంది. ఆ సందర్భంగా వచ్చే సన్నివేశాలలో ప్రియురాలిని ఓదారుస్తూ కథానాయకుడు పాడే పాట ఇది.

నీలాలు కారేనా
కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా




మొదటి చరణంలో సూర్యుడికి,చంద్రుడికీ పేదాగొప్ప భావం లేదని,నింగినీ,నేలను కొనగల సంపద లేదని చెబుతారు.

సూరీడు నెలఱేడు సిరిగల దొరలే కారులే
పూరి గుడిసెల్లో, తేడా మనసుల్లో
వెలిగేటి దీపాలులే
ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేరులే
కలిమి లేముల్లో, కరిగే ప్రేమల్లో
నిరుపేద లోగిళ్ళులే


ఈ క్రింది చరణం చూడండి ఎంత బావుందో,


ఈ గాలిలో తేలి వెతలన్నీ మరిచే వేళలో
కలికి వెన్నెల్లో, కలల కన్నుల్లో
కలతారిపోవాలి లే
ఆ తారలే తేరి తళతళమెరిసే రేయిలో
ఒడిలో నువ్వుంటే ,ఒదిగిపోతుంటే
కడతేరిపోవాలి లే


ఒక వైపు పుచ్చపువ్వులా వెన్నెల !
మరో వైపు చల్లని గాలి !

అటువంటి గాలిలో తేలిపోతూ కష్టాలన్నీ మరిచిపోయే వేళ, ప్రియురాలి కలతలన్నీ ఆరిపోవాలని,తన ఒడిలో ఆమె ఒదిగిపోతుంటే అలాగే తుదిశ్వాస విడవాలని కోరుకుంటాడు. ప్రతి ప్రేమికుడు కోరుకునేదిదే.పండు వెన్నెల్లో ఈ పాట వింటూ పడుకుంటే ఎటువంటి కష్టాలైనా మరచిపోతాం. సినిమా గురుంచి తెలియకపోయినా,పాట విన్న వెంటనే కథ,కథతో పాటు సన్నివేశం,రెండూ శ్రోతలకి అవగతమవుతాయి. సగటు ప్రేమికుడి హృదయాన్ని వేటూరి చక్కగా ఆవిష్కరిస్తే,రమేష్ నాయుడు సంగీతం దానికి మరింత సొగసులు దిద్దింది. ఇక బాలు గురించి చెప్పాల్సిన పని లేదు. గంధర్వ గాత్రంతో భావయుక్తంగా పాడి పాటకు ప్రాణం పోసారాయన.

చంద్రునికీ మచ్చలున్నట్లు ప్రదీప్ నటనొక్కటే ఈ పాటకు లోటు .


3 comments

కొసమెరుపు సూపర్!
అయితే సుత్తి వేలు గారు తెలుగువారా! పేరు చూస్తే అచ్చ తెలుగు పేరులా ఉంది. వేలు అని ఉండడంతో అరవ్వారు అనుకునేదాన్ని.

Reply
July 22, 2010 at 11:05 PM

నేను ఇష్టపడి విని ఆస్వాదించే పాటల్లో ఇదొకటి .
వినడమే గాని కనలెం పంటి కింద రాయి లా ప్రదీప్ నటన
అందులో మొదటి సినిమా ఏమో చేతులు బిగపట్టి మరి నటించాడు

Reply

మందాకిని గారు,రవిగారు నెనర్లు,

ప్రదీప్ నటన అప్పుడూ,ఇప్పుడూ ఇలానే ఉంది.

Reply
Post a Comment