పంతొమ్మిదవ కామన్వెల్త్ ఆటలపోటీల నిర్వహణ కోసం కెనడాతో పోటీపడి మనదేశం అవకాశం దక్కించుకున్నప్పుడు ఎంతో మంది సంతోషించి ఉంటారు.వారం రోజుల నుంచి ఆ ఆనందమంతా ఆవిరైపోతోంది.
ఈ క్రింది గణాంకాలు చూడండి
- 2003లో బిడ్ గెలిచినప్పుడు ప్రభుత్వం అంచనా - 1835 కోట్లు
- 2007 ఏప్రిల్ లో బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం ఖర్చు -3566 కోట్లు
- 2010 మార్చిలో కామన్వెల్త్ గేమ్స్ డైరెక్టర్ జనరల్ వి.కె.వర్మ ప్రకారం -10,000 కోట్లు
- ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం -11,494 కోట్లు
అనధికార లెక్కల ప్రకారం ఈ ఖర్చు 30,000 నుంచి 35,000 కోట్లకు మధ్యలో ఉండొచ్చు.ప్రభుత్వ లెక్కలు ప్రామాణికంగా తీసుకున్నా ఏడేళ్ళలో,ఈ అంచనాలు, ఖర్చులు 600 శాతం పైనే పెరిగాయి.ఇక అనధికారిక వర్గాల సంఖ్యలు పరిగణనలోకి తీసుకుంటే కళ్ళుబైర్లు కమ్మి మూర్ఛపోవటం ఖాయం.పోనీ ఇంత ఖర్చు పెట్టి మనవాళ్ళు ఏ విశ్వకర్మ సృష్టించిన మయసభా భవన సముదాయాల్లాంటి
క్రీడాప్రాంగాణాలో,అతిథిగృహాలో నిర్మించారా అంటే అదీ లేదు.వివిధ వెబ్సైట్లలో దర్శనమిస్తున్న ఛాయాచిత్రాలు దేశప్రతిష్ఠని మంటగొలిపేలా ఉన్నాయి.విదేశీ ఆటగాళ్ళు కాదు కదా కనీసం స్వదేశీ సెంట్రీలు సైతం కాలుమోపలేనంత దుర్గంధభూయిష్టంగా ఉన్నాయి.
మరి..ఇంత డబ్బూ ఏమైపోయినట్లు?
అంచనాలకి,వాస్తవ ఖర్చులకి ఎందుకింత వ్యత్యాసం?
ఇదే అనుమానాన్ని ముందు పెడితే 'బీజింగ్ ఒలంపిక్స్ కోసం చైనా 140,000 కోట్లు ఖర్చు పెడితే మనం కేవలం 10,000కోట్లతో ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నామ'ని వి.కె.వర్మ గారు శెలవిచ్చారు.అయ్యా, చైనా ఆర్థిక పరిస్థితి ఏంటి? మన ఆర్థిక పరిస్థితి ఏంటి? చైనీయుల క్రమశిక్షణ ఎంత? మన నిర్మాణాల్లో అవినీతి ఎంత? సగటు చైనీయుడి దినసరి బత్తెం ఎంత, భారతీయుడి రోజు కూలీ ఎంత? ప్రభుత్వ కేటాయింపుల్లో వాస్తవంగా ఖర్చు పెట్టిందెంత? స్వాహా చేసిందెంత? చైనాతో పోటీపడవల్సింది ఇలాగేనా? మనం చీద్కరించుకున్న చైనా నవంబరులో జరుగబోయే ఏషియన్ క్రీడల కోసం రెండు నెలలముందే సర్వసన్నద్ధంగా ఉంది.మరి మన ప్రగల్భాలు ఏమయ్యాయి? ఏడేళ్ళుగా ఏం చేస్తునట్లు?
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు, ఆర్గనైజింగ్ కమిటీ జనరల్ సెక్రెటరి లలిత్ భానోట్ గారు ఇంకొకడుగు ముందుకేసి పదితరాలు గుర్తించుకోవాల్సిన మాటనేశారు. 'మీకూ,మాకు అవి పరిశుభ్రంగానే ఉన్నాయి.విదేశీయుల ప్రమాణాలు వేరుగా ఉంటాయి.ఏదైనా మనం చూసే విధానంలో ఉంది.' అని తేల్చేశారు.నిజమే మరి.అక్కడ వసతి సౌకర్యాలు ఉన్నాయనుకుంటే ఉన్నాయి, లేదనుకుంటే లేదు.సర్వం మిథ్య అయినప్పుడు అలా అనుకోవడంలో తప్పేముంది? వెనకటికొక శిష్యుడు 'దేవుడనే వాడున్నాడా' అని సందేహం వెల్లబుచ్చితే ఆ గురువుగారు వెంటనే శిష్యుడి గూబ గుయ్యిమనిపించారట. ' అదేమిటి గురువు గారు,అలా పీకారంటే ' , ' శిష్యా ! ఇప్పుడు నీ చెంప పగలగొట్టినప్పుడొచ్చిన శబ్దం ఏ రూపంలో ఉందో చెప్పగలవా,అలానే దేవుడు కూడా.అంతా మన భావనలో ఉంది' అన్నాట్ట.కాబట్టి మనకి తెలియని విషయాల గురుంచి ఆట్టే అడిగి ప్రయోజనం లేదు,మన బుద్ధికి ఇంకా అంతటి పరిపక్వత కలుగలేదు అని సరిపెట్టుకోవటం తప్ప.కర్మసిద్ధంతాన్ని ఇంతబాగా వంటబట్టించుకున్న అధికారులు అత్యున్నత పదవులలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం. ఇంతటి స్థితప్రజ్ఞత ఉంది కాబట్టే ' చేసేదెవ్వడు, చేయించునదెవ్వడు ' అనుకుంటూ మనవాళ్ళు వారం రోజుల ముందు కూడా ముఖ్యక్రీడాంగణం ముందు తాపీగా పేవ్‌మెంట్లు, రోడ్లు నిర్మిస్తున్నారు.లీగు మ్యాచుల్లో అలసత్వంగా ఆడి ఓడిపోయి, చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచుల్లో చెమటోడ్చటం మనకు అలవాటే.అలాగే ఐదేళ్ళు అలసత్వం ప్రదర్శించిన ఘనత వహించిన షీలా దీక్షిత్ ప్రభుత్వం,రెండేళ్ళకు ముందు నిద్ర మేల్కొని,ఇప్పుడు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తోంది.అదీ ప్రధానమంత్రి స్వయంగా జ్యోక్యం చేసుకున్నాక.అడిగేవాడుంటేనే వొళ్ళు దగ్గర పెట్టుకుంటాం.లేకపొటే మనమే రాజు,మనమే మంత్రి.ఒక విధంగా ఇది మన సంస్కృతి.పాశ్చాత్యులకి ఇది విడ్డూరంగా అనిపిస్తే అది వాళ్ళ అజ్ఞానం.ఈ సమయంలో మనం చెయ్యగలిగిందొక్కటే. ఈ దేశాన్ని నవ్వులపాలు చేసే సంఘాటనలేవీ జరక్కుండా ఆటలపోటీలు సాఫీగా సాగిపోవాలని ఆ పరమాత్మున్ని ప్రార్థించటం.
కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
- గేమ్స్ ముగిశాక క్రీడాగ్రామం పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇలాంటి ఇంకో కార్యక్రమం జరిగే వరకు అదలా ఉత్సవ విగ్రహంలా పడుండాల్సిందేనా?
- కోట్లాది మంది ప్రజలు దారిద్ర్యంలో మగ్గుతున్న ఈ దేశంలో ఇంత భారీ ఎత్తున క్రీడలు నిర్వహించి ఈ దేశం సాధించేదేమిటి? ఎవర్ని ఉద్ధరించాలని ?
- పేదరికాన్ని నిర్మూలించటానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? ఢిల్లీ నగరంలో బిచ్చగాళ్ళందరినీ బలవంతంగా తరలించినట్లు, మళ్ళీ ఏ అంతర్జాతీయ కార్యక్రమమో నిర్వహించినప్పుడు పేదల్నందరినీ తరిమేసి,దేశంలో పేదరికాన్ని రూపుమాపామని చంకలు గుద్దుకుంటారా? లేక పేదరికాన్ని నిర్మూలించాలనే చిత్తశుద్ధి నిజంగా ప్రభుత్వానికి ఉందా?
- కొన్ని వేల కోట్ల రూపాయిలు చేతులు మారిన ఈ కుంభకోణంలో బాధ్యులైన అధికారులు,నాయకుల పై ప్రభుత్వం ఇకనైనా కఠిన చర్యలు చేపడుతుందా లేక షరా మాములుగా ఏ బలవంతపు పదవీవిరమణో, శాఖామార్పిడో చేయించి చేతులు దులుపుకుంటుందా?
- అన్నిటికన్నా ముఖ్యమైనది,అందరినీ పీడించేది.. కొన్ని కోట్ల మంది రెక్కల కష్టాన్ని అప్పనంగా దోచుకుతిని,దర్జాగా తిరిగే సంస్కృతికి అంతమెప్పుడు?
6 comments