పెద్దలకోసం ఒక పిట్టకథ

నగనగా ఒక పల్లెటూరి అన్నయ్య.అతనికి చదువబ్బలేదు.ఊళ్ళోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూంటాడు. పెళ్ళై ఒక పిల్లాడు కూడా ఉన్నాడు.అతని చెల్లెలికి మంచి సంబంధం కుదిరింది. వైభవంగా వివాహం జరిగి ఆమె కాపురానికి పట్నం వెళ్ళింది.ఒక శుభక్షణాన పండంటి ఆడపిల్లని ప్రసవించింది. అమ్మలక్కంతా వదిన చుట్టూ చేరి ' నీకు కోడలు పుట్టిందేవ్ ' అని ఊదరగొట్టారు.వాళ్ళ మాటలకు ఉబ్బితబ్బిబైపోయిన ఆమె ఉయ్యాలలో ఉన్నఆ పసిపాపను తన నాలుగేళ్ళ కొడుక్కి చిరునవ్వుతో చూపిస్తూ "అదిగో..అదే  రా, నీ పెళ్ళాం" అంది .చుట్టూ ఉన్న అమ్మలక్కలు ముసిముసి నవ్వులు నవ్వారు.

పిలుచుకోవడానికి పేరు కూడా పెట్టకముందే  ఆ పాపకు భర్త ఎవరో నిర్ణయమైపోయింది....తన ప్రమేయం లేకుండా !
 

అది ప్రారంభం.

*                                                 *                                                   *

రెండేళ్ళు గడిచాయి.
 

చెల్లెలు కూతురుని తీసుకొని సంక్రాంతికి పుట్టింటికొచ్చింది. ఆ పాపకు రెండేళ్ళు.తన మానాన తను ఆడుకుంటూ ఉంది.అన్నయ్య కొడుక్కి చదువంటే అసక్తి లేదు.ఎక్కడో గోళీకాయలాడుకుంటున్న వాడు,' పెళ్ళాం వొచ్చింద ' ని చెబితే పరుగెట్టుకుంటూ ఇంటికెళ్ళాడు.ఆ పాప దగ్గరికి వెళ్ళి ' ఇదిగో ! ఇప్పట్నుంచి నేను చెప్పినట్లు వినాలి..తెల్సిందా ' అని బెదిరించాడు.పాప భయంగా వాడి వైపు చూసింది.చెల్లెలది చూసి సరదాగా ' ఏంట్రోయ్ మా పాపను బెదిరిస్తున్నావ్ ' అని  గదమాయించింది.రోట్లో పచ్చడి దంచుతున్న వదిన ఆ మాటలకు చిన్నగా నవ్వుకున్నా, పక్కనే ఉన్న పొరుగమ్మ అందుకని ' ఏమమ్మా ఆ మాత్రం అనకూడదా నా కోడల్ని.వాడికి హక్కుంది కాబట్టి అన్నాడు.ఇంతలోనే నీ కూతురేం కందిపోదులే.అయినా ఎప్పటికైనా వాడి మాట వినాల్సిందే కదా ' అంది.

అనటమే కాకుండా తన చేతిలో ఉన్న ఏ తాయిలమో ఆ పాప చేతిలో పెట్టి,పిల్లాడికి కూడా కొంచెం ఇవ్వమంది.పాప అమాయకంగా ఆ పని చేస్తే ' అబ్బో ,ఎంత ప్రేమో బావ మీద ' అని దీర్ఘాలు తీసింది.

ఇది కొనసాగింపు.

 
*                                                 *                                                   *

పాపకు పదేళ్ళు వచ్చాయి.పిల్లాడికి పధ్నాలుగు.

పాప చదువులో,ఆటపాటల్లో చురుగ్గా ఉంది.అన్నింటిలో ముందంజ వేస్తోంది.
పిల్లాడు పదవ తరగతితోనే చదువుకు ఫుల్ స్టాప్
పెట్టేశాడు.చదువనేది అతని పాలిట కొరకరాని కొయ్యే అయ్యింది.మితిమీరిన  గారాబం వల్ల ఏ పనీపాటా లేకుండా జల్సారాయుడిలా తిరుగుతున్నాడు.అతను ఎదురైనప్పుడల్లా  పాప పడే భయానికి ' సిగ్గు ' అని భాష్యం చెప్పుకొని సంతోషిస్తున్నారు బంధువులు.ఎదిగే వయసులో ఏది నిజం ఏది అబద్ధం అన్న తార్కిక జ్ఞానం కొరవడి నలుగురు చెప్పిందే నిజమని గుడ్డిగా నమ్ముతున్నారు పిల్లలు. ఆకర్షణ ఏర్పడింది.చవకబారు సినిమాలు సీరియళ్ళు చూసి,సాహిత్యం చదివి అదే ప్రేమనే అంధవిశ్వాసంలో కూరుకుపోయారు.

*                                                 *                                                   * 


పాప అమ్మాయయ్యింది.పిల్లాడు అబ్బాయయ్యాడు.

వీళ్ళ వ్యవహారం బయటపడి ఇంట్ళో పెద్ద దుమారం బయలుదేరింది.చదువులో రాణిస్తూ ఇంజనీరింగ్ లో సీట్ తెచ్చుకున్న అమ్మాయిని,చదువు సంధ్యాలేని ఒక పల్లెటూరి ఆకతాయికి ఇవ్వడానికి చెల్లెలు ఒప్పుకోలేదు.అన్నా చెల్లెళ్ళ సంబంధం బీటలు వారింది.కుర్రది కుర్రాడు మాత్రం తమ పట్టు వదల్లేదు.

కథ చివరి అంకానికి చేరుకున్నాక, ముగింపు ఒక్కో కుటుంబంలో ఒక్కోలా ఉంటుంది.

ఈ మొత్తం వ్యవహారంలో తప్పు బట్టవలసిందెవరినైనా ఉంటే అది ముందుగా ఇరుగమ్మ పొరుగమ్మ లాంటి పెద్దల్నే.
పిల్లలు పుట్టగానే  ఇలా హడవుడిగా వరసలు కలిపేసి భార్యాభర్తలుగా ఎందుకు నిర్ణయిస్తారో నాకర్థం కాదు.బాల్యంలో పిల్లలకు చెప్పాల్సిన మాటలు అవి కావు.' శ్రద్ధగా చదువుకొని,సద్బుద్ధులు అలవర్చుకొని,ప్రయోజకులు కండి' అని చెప్పాలి.అదే వాళ్ళకు మంచి నడవడిని నేర్పుతుంది.పిల్లలు వృద్ధిలోకొస్తే వాళ్ళ జీవిత భాగస్వాముల్ని వాళ్ళే ఎంచుకుంటారు.అలా కాకుండా చిన్నపటి నుంచే అస్తమానం ' అది నీ భార్య ' ,' వీడు నీ మొగుడు'  అని నూరిపోస్తే ఇంక చదువేమెక్కుతుంది.వయసుకు మించిన ఆలోచనలు చేసి,లేనిపోని విషయాలపై ధ్యాస మళ్ళి ఉపద్రావాలను కొనితెచ్చుకుంటారు.బాల్యంలో ఉన్నట్లే ఎల్లకాలం ఉండరు కదా.చిన్నప్పుడు కుదురుగా ఉన్న పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఒట్టి చవటలు గా తయారవచ్చు.అలాగే ఎందుకూ పనికిరారనుకున్నవాళ్ళు అద్భుతాలు చేయవచ్చు.ఏదో ముచ్చట కోసం వరుసలు కట్టి పెళ్ళి ప్రస్తావనలు తీసుకొచ్చే పెద్దలు ఈ వాస్తవాన్ని గుర్తించాలి.చదువులో ప్రతిభ కనబరుస్తున్న ఒక అమ్మాయి జీవితాన్ని ఏ విధంగా పెద్దలు ప్రభావితం చేశారో పై ఉదాహరణ చెబుతుంది.దీనివల్ల నష్టపోయేది ఆ అమ్మాయే. ' కోడలు', ' అల్లుడు' అని ఎక్కడలేని అప్యాయతలు ఒలకబోసిన పెద్దలు ఆమెకేమీ సహాయం చెయ్యరు.వాళ్ళకు తెలిసిందల్లా ఒక్కటే. తాంబూలం సేవిస్తూ ఏ రచ్చబండ దగ్గరో,కొప్పులు సరిచేసుకుంటూ ఏ గిలక బావి దగ్గరో ఇంకో కోడలు,అల్లుడు కోసం ఆత్రంగా వెదకటం.

1 comment

September 18, 2010 at 7:28 AM

ఇది మోసం,
"పెద్దలకోసం ఒక పిట్టకథ" అని టైటిల్ పెడ్తే ఇదేదో "పెద్దలకు మాత్రమె" అనుకుని పిటపిటలాడే పిట్ట కదా ఏమో అనుకుని ఆశగా వచ్చా :(
హ్మ్మ్

Reply
Post a Comment