ప్రతి సంవత్సరం దేశంలోకెల్లా అత్యథిక చిత్రాలు నిర్మించే పరిశ్రమగా తెలుగు సినీపరిశ్రమకు పేరుంది. అప్పుడప్పుడూ బాలీవుడ్ ఈ రికార్డుని తన్నుకుపోయినా అధికశాతం చిత్రాలు మన కంపౌండ్ నుండే విడుదలవుతూంటాయి. అయితే వాసి కంటే రాశి ఎక్కువన్న అపప్రథ మనకు చాలా కాలంగా ఉంది.దాన్నినిజం చేస్తూ ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. అలా వెళ్ళిపోయిన సినిమాలలో చిన్న సినిమాలున్నాయి, కోట్ల రూపాయిల ఖర్చుతో ఏళ్ళ తరబడి షూటింగ్ జరుపుకున్న పెద్ద సినిమాలూ ఉన్నాయి. వందకు పైగా తెలుగు చిత్రాలు ఏటా రిలీజవుతూంటే ఘనవిజయాలు సాధించిన చిత్రాల శాతం కనీసం పదిశాతాన్ని దాటకపోవటం నిజంగా శోచనీయం .
ఈ ఏడాది విజయం సాధించిన తెలుగు చిత్రాలు ఇవీ (విడుదలైన క్రమంలో) 1. అదుర్స్ 2.బిందాస్ 3.లీడర్ 4.ఏ మాయ చేశావే 5. బెట్టింగ్ బంగార్రాజు 6.డార్లింగ్ 7.సింహ 8.మర్యాదరామన్న 9.రోబో 10. బృందావనం .
ఈ సంవత్సరం విడుదలైన చిత్రాలలో నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకు ప్రతి ఒక్కరికీ లాభాలు తెచ్చిపెట్టిన ఏకైక డైరెక్ట్ తెలుగు చిత్రం సింహ . 2004 లో విడుదలైన లక్ష్మీనరసింహ తర్వాత ఆరేళ్ళ పాటూ సరైన సినిమా లేక వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలకృష్ణకు ఈ చిత్రం కొండంత ఉత్సాహాన్ని, ఉపశాంతిని కలిగించింది. ఎటువంటి అంచనాలు లేకుండా సాదాసీదాగా విడుదలైన ఈ చిత్రం మార్నింగ్‌షో నుంచే సూపర్‌హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీసు వద్ద తిరుగులేని
ఆధిపత్యాన్నిప్రదర్శించింది. అర్థశతదినోత్సవాలకే మొహం వాచిపోయిన తెలుగు సినీపరిశ్రమలో తొంభైకి పైగా కేంద్రల్లో శతదినోత్సవాన్ని, 3 కేంద్రాల్లో రజతోత్సవాన్ని, ఒక కేంద్రంలో 200 రోజుల పండుగను జరుపుకొని సంచలనం సృష్టించి Biggest hit of the year గా నిలిచింది.ఈ విజయం నందమూరి అభిమానులకి కొత్త ఊపిరిలూదింది.ఇమేజ్‌కి తగ్గ కథ, సామర్థ్యం ఉన్న దర్శకుడు దొరికితే తన చిత్రాలు సైతం యువహీరోలకు ముచ్చెమటలు పట్టిస్తాయని నందమూరి బాలకృష్ణ మరోసారి నిరూపించారు. డాక్టర్ నరసింహగా రౌద్రరస పోషణలో పరిణితి చెందిన నటన కనబరిచారు.అసందర్భోచితమైన డైలాగులు పేజీలకు పేజీలు వల్లించకుండా సింపుల్‌గా షార్ట్‌గా ఉన్న సంభాషణలను తనదైన శైలిలో చెప్పి మెప్పించారు. బోయపాటి శ్రీను ప్రతిభ గురుంచి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వై.వి.యస్ చౌదరిలా ఉత్తరకుమార ప్రజ్ఞలు చెయ్యకుండా సినిమా మీద దృష్టి పెట్టి బాలయ్య సినిమాల్లో దొర్లే పొరపాట్లు దొర్లకుండా చూసుకున్నారు.కథ ఎప్పుడో తొంభయ్యో దశకాల్లోని పాత చింతకాయ పచ్చడే అయినా దానికి వయొలెన్సు మసాలాను బాగా దట్టించి పకడ్బందీగా రూపొందించారు. డాక్టర్ నరసింహ గెటప్లోని బాలయ్య ఫోటోలు మెల్లమెల్లగా విడుదల చేస్తూ అభిమానుల్లో ఆశలు పెంచి, చక్కటి ట్రైలర్‌తో దాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళారు. పెద్దనిర్మాత నిర్మించకపోయినా, హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ బాణీలు సమకూర్చకపోయినా, విదేశాల్లో పాటలు లేకపోయినా, నెంబర్‌వన్ డైరెక్టర్ దర్శకత్వం వహించకపోయినా ఈ చిత్రం విశేష ప్రజాదరణ పొందింది.
వెంకటేష్‌కు ఈ ఏడాది కలిసి రాలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైన నమో వెంకటేశ యావరేజ్‌గా మిగిలిపోతే, అందరిలో ఉత్సుకత రేపిన చంద్రముఖి సీక్వెల్ నాగవల్లి , ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకొంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రీన్‌ప్లేలో మార్పులు చేర్పులు చెయ్యకుండా యాధాతథంగా సినిమా తియ్యడమొక కారణమైతే, అయిదుగురు హీరోయిన్లను పెట్టి కూడా వారికి తగ్గ పాత్రలు ఇవ్వకపోవడం ఇంకొక కారణం. జ్యోతిక అభినయం ముందు రిచా గంగోపాధ్యాయ, అనుష్క తేలిపోయారు. కన్నడ రీమేకులు తెలుగులో వర్కవుట్ కావని వాన (ముంగారు మళె), యోగి (జోగి), తాజ్ మహల్ (తాజ్ మహల్) లాంటి చిత్రాలు నిరూపించాయి.ఈ చిత్రం ఆ సెంటిమెంటును మరింత బలపరిచింది.
నాగార్జునవి రెండు చిత్రాలు విడుదలయ్యాయి. కేడి డిజాస్టర్ అయ్యింది. ఆనవాయితీ ప్రకారం క్రిస్మస్కు రిలీజైన రగడ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రం మాస్ లా సూపర్‌హిట్ అవుతుందో లేక డాన్, కింగ్ ల సరసన చేరుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
యువ హీరోలలో ఏ ఏడాది విజయాన్ని అందుకున్నవాళ్ళు జూనియర్ ఎన్టియార్, ప్రభాస్, మనోజ్, నాగచైతన్య, రాణా, అల్లరి నరేష్.
అదుర్స్ తో శుభప్రదంగా సంక్రాంతికి స్వాగతం పలికి నవ్వులలో ముంచెత్తిన ఎన్టియార్ అదే ఊపును బృందావనం తో కొనసాగించారు. తన ఇమేజ్‌కి భిన్నంగా తొలిసారి ప్రేమికుడిగా నటించారు. పాత కొత్త చిత్రాల కలబోత అయిన ఈ చిత్రంలో అటు
కుటుంబబాంధవ్యాలకు పెద్ద పీట వేస్తూనే, ఇటు ఎన్టియార్ శైలికి తగ్గ ఫైట్లు, పాటలు ఉంచి కమర్షియల్‌గా సక్సెస్ అయ్యేలా జాగ్రత్తపడ్డారు దర్శకులు వంశీ పైడిపల్లి. ఏన్నాళ్ళుగానో ఊరిస్తున్న విజయాన్ని ఈ చిత్రంతో మళ్ళీ అందుకున్నారు దిల్‌రాజు.
జోష్ తర్వాత, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన ఏ మాయ చేశావే చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేసింది. చాలాకాలం తర్వాత, కలకాలం గుర్తుండిపోయే సంగీతాన్ని అందించి కుర్రకారుని ఒక ఊపుని ఊపారు ఏ.ఆర్.రెహమాన్. సంక్లిష్ట భావాలున్న అమ్మాయిగా తన మొదటి సినిమాలోనే సమంత అద్భుతంగా
నటిస్తే, ఆ అమ్మయి ప్రేమ కోసం అర్రులు చాచే కుర్రాడుగా నాగచైతన్య తన పరిధిలో మెరుగ్గా చేశాడు. సినిమా చూస్తున్నంత సేపు జెస్సి , కార్తీక్ అనే రెండు పాత్రలే కనిపిస్తాయి కాని సమంత, నాగచైతన్యలు కనబడరు. నిజజీవితానికి దగ్గరగా ఉన్న అటువంటి పాత్రలు సృష్టించి, ఎటువంటి అశ్లీలత, వెకిలి వేషాలు లేకుండా ఒక ప్రేమకథని ఎంత రొమాంటిక్‌గా ప్రెజంట్ చెయ్యవచ్చో అంతే అందంగా చిత్రీకరించి కే.బాలచందర్ వంటి సినీపండితుల ప్రశంసలు అందుకున్నారు గౌతమ్ మీనన్.
కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అల్లరి నరేష్, ఉషాకిరణ్ మూవీస్‌తో జతకట్టి బెట్టింగ్ బంగార్రాజు రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చారు.ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకొంది. కే.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభప్రదం ఫెయిల్యూర్‌గా మిగిలిపోతే ఈ.వీ.వీ. దర్శకత్వంలో వచ్చిన కత్తి కాంతారావు ఫర్వాలేదనిపించుకొంది.
ఛత్రపతి తర్వాత చెప్పుకోదగ్గ చిత్రం ఒక్కటీ లేక డీలాపడ్డ ప్రభాస్‌కు డార్లింగ్ రూపంలో కాస్త ఓదార్పు లభించింది.
అలాగే బిందాస్ చిత్రం ద్వారా మంచు మనోజ్ మొదటిసారి సక్సెస్ చవిచూశారు .
రామానాయుడు కుటుంబం నుండి వచ్చిన రాణా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాతో తెరంగేట్రం చేశారు. వాచకంలో బాబాయి వెంకటేష్‌ని గుర్తుచేసే ఆయనకు ఈ చిత్రం సంతృప్తికరమైన ఫలితాన్నే ఇచ్చింది.
రెగ్యులర్ మాస్ మసాలా చిత్రాలకు భిన్నంగా రాజమౌళి రూపొందించిన మర్యాదరామన్న ప్రేక్షకుల మన్ననలు పొంది సునీల్‌ని బిజీ హీరోని చేసింది.ఒక ఊరిలో సినిమాతో హీరోయిన్గా పరిచయమై విజయాలు దక్కక తెరమరుగైపోయిన సలోనికి ఈ చిత్రం టర్నింగ్పాయింటే.
ఇమేజ్‌కి తగ్గ కథ కోసం మూడేళ్ళ విరామమిచ్చి ఖలేజా తో వీక్షకులను పలుకరించిన మహేష్‌బాబుకి చేదు అనుభవమే మిగిలింది. ఖలేజా అనగానే ఒక పక్కా మాస్ చిత్రాన్ని ఆశించి థియేటర్లకొచ్చిన ఆభిమానులను పొంతన లేని కథ ఖంగు తినిపించింది. కథ కంటే కామెడీకే ప్రాధాన్యతనిచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అనవసరమైన సన్నివేశాలతో సినిమా మొత్తం నింపేసి అభిమానులను నీరుగార్చేశారు. మహేష్ అనుష్కల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నా అవి చిత్రాన్ని రక్షించలేకపోయాయి.
మెగాఫ్యామిలీకి ఈ సంవత్సరం నిరాశను మిగిల్చిందనే చెప్పాలి. భారీ అంచనాలతో వచ్చిన అల్లు అర్జున్ వరుడు, పవన్‌కళ్యాణ్ కొమరం పులి, రామ్‌చరణ్ ఆరెంజ్ బాక్సాఫీసు దగ్గర ఘోర పరాజయాల్ని మూటకట్టుకున్నాయి. వరుడు లో గుణశేఖర్‌కు సెట్స్ మీదున్న మమకారం, కొమరం పులి లో ఎస్.జే.సూర్య పైత్యం ప్రస్ఫుటంగా కనిపించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. ముఖ్యంగా కొమరం పులి లో యాక్షన్ సన్నివేశాలు హాస్యాస్పదం కావడం అభిమానులకి మింగుడుపడని విషయం.అయితే అల్లు అర్జున్, మనోజ్, అనుష్కల కాంబినేషన్లో వచ్చిన వేదం ఒక మంచి ప్రయత్నంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. గమ్యం తో అకట్టుకొన్న దర్శకుడు క్రిష్ ఈ సినిమాతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.ఐదు విభిన్నమైన పాత్రల చుట్టూ కథనల్లుకొని , చివర్లో వాటిని కలుపుతూ మానవతే జీవన వేదం అని చాటిచెప్పారు.అయితే ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. మల్టిస్టారర్ చిత్రమే అయినా మార్కులు మొత్తం కేబుల్ కుర్రాడుగా నటించిన అల్లు అర్జున్ ఒక్కరే కొట్టేశారు. మగధీర తో ఘనవిజయం సాధించిన రామ్‌చరణ్ ఆరెంజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దర్శకుడిలో స్పష్టత లేకపోవటం వల్ల ఆరెంజ్ కొంతమందికే పరిమతమయ్యింది. హద్దులు దాటిన నిర్మాణవ్యయం, ప్రచార మాధ్యమాల్లో నాగబాబు వెళ్ళకక్కిన అర్థంలేని ఆవేదన (రుద్రవీణ నుంచి నిర్మాణరంగంలో ఉంటూ ,ఒక సాదాసీదా ప్రేమకథ కోసం ఆస్ట్రేలియా వెళ్ళి మగధీర కంటే ఒక పదిశాతం మాత్రమే తక్కువగా ఖర్చుబెట్టి, ఫెయిలయ్యాక దర్శకుడి మీదో హీరోయిన్ మీదో పడి ఏడవటం నాగబాబు తప్పు) ఈ సినిమాకి ప్రతికూలంగా పరిణమించాయి. నటనలో రామ్‌చరణ్ చూపించిన వైవిధ్యమొక్కటే అభిమానులకి ఊరటనిచ్చే అంశం.
సిద్దార్ధ్ బావ, గోపిచంద్ గోలీమార్ , జగపతిబాబు గాయం-2 పాసు మార్కులు తెచ్చుకోలేకపోయాయి.రవితేజ నటించిన శంభో శివ శంభో ,డాన్ శీను చిత్రాలు మొదట్లో కాస్త సందడి చేసినా తర్వాత సద్దుమణిగాయి.వరుస ఫ్లాపులతో వరుణ్‌సందేశ్ తడిసిముద్దయ్యారు. మరో చరిత్ర అతని సినీచరిత్రకే మాయని మచ్చగా మిగిలిపోయింది.
దేవ్ కట్టా దర్శకత్వంలో వచ్చిన ప్రస్థానం , చంద్ర సిద్ధార్థ అందరి బంధువయా, నరసింహ నంది 1940లో ఒక గ్రామం, క్రిష్ వేదం, తాతినేని సత్య భీమిలి కబడ్డీ జట్టు వైవిధ్యమున్న చిత్రాలుగా మిగిలిపోయాయి. ప్రస్థానం సాయికుమార్ నట వైదుష్యాన్ని ఆవిష్కరిస్తే, అందరి బంధువయా చంద్ర సిద్దార్థ ఉత్తమాభిరుచుకి అద్దంపట్టింది. రెండు చిత్రాలలోనూ కథానాయకుడు శర్వానందే కావడం అతను ఎంచుకున్న మార్గాన్ని స్పష్టం చేస్తోంది. ఇది అభినందనీయమే అయినా వాచకాభినయాలలో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. నరసింహ నంది దర్శకత్వంలో వచ్చిన 1940లో ఒక గ్రామం మూడు నంది అవార్డులు, ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నేషనల్ అవార్డు గెల్చుకొని పతాక శీర్షికలకెక్కింది. అప్పటికి గాని లాబ్‌ల నుంచి ఈ చిత్రానికి మోక్షం లభించలేదు. రిలీజైన తర్వాత కూడా ఈ చిత్రాన్ని పట్టించుకొన్న నాథుడే లేడు.ఎంచుకున్న కథాంశం చాలా పాతది కావటం ప్రధాన కారణం. బలహీనమైన కథానాయిక, సాగతీత కారణంగా అందరి బంధువయా ఫెయిలయితే, ఇమేజ్‌లేని కథానాయకుడి కారణంగా ప్రస్థానం చతికిలబడింది.స్లో నెరేషన్ , ట్రాజెడి క్లైమాక్స్ భీమిలి కబడ్డీ జట్టు పాలిట ఆశనిపాతాలయ్యాయి.
అనువాద చిత్రాల విషయానికి వస్తే శంకర్-రజనీకాంత్-ఐశ్వర్యారాయ్-ఏ.ఆర్.రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన రోబో బాక్సాఫీసు రికార్డ్లను తిరగరాసింది. విడుదలైన మొదటి మూడువారాలపాటూ థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొందంటే అతిశయోక్తి లేదు. పిల్లా పెద్దా తేడా లేకుండా జనం విరగబడ్డారు.రోబో గా రజనీకాంత్ నటన, ఐశ్వర్యారాయ్ అందచందాలు, అత్యున్నత సాంకేతిక విలువలు ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేశాయి..ఆరుపదుల వయసులో, కుర్రహీరోలతో పోటీపడుతూ దేశమంతా విస్తుబోయే విజయాలు సాధించటం ఒక్క రజనీకే చెల్లింది.రోబో స్థాయిలో కాకపోయినా వేసవిలో వచ్చిన సూర్య యముడు కూడా ఓ మోస్తరు ప్రేక్షకాదరణకు నోచుకుంది .అదే సమయంలో విడుదలైన మణిరత్నం విలన్ అట్టర్‌ఫ్లాపైంది.
ఆరంభం నుంచి పలు వివాదాలకు కేంద్రబిందువవుతూ ఉత్కంఠను రేకెత్తించిన రాంగోపాల్‌వర్మ రక్తచరిత-1,2 చిత్రాలు మంచి టాక్ని సొంతం చేసుకున్నా కలెక్షన్లు రాబట్టుకోవడంలో విఫలమయ్యాయి.అమ్ముకొని నిర్మాతలు లాభపడ్డారేమో కాని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భంగపడ్డారు.శివ లా చరిత్ర సృష్టిస్తాయనుకున్న సినిమాలు వారం రోజులు హడావుడి చేసి నిశ్శబ్దంగా వైదొలగిపోవటం చూసి ' ఒక రాజమౌళో, వి.వి.వినాయకో ఈ కథను తెరకెక్కించి ఉంటే కలెక్షన్ల సునామీ వచ్చేద ' ని యాక్షన్ చిత్రాల అభిమానులు కొందరు వాపోయారు .
ఏతావాతా కథను నమ్ముకోకుండా కాంబినేషన్లను నమ్ముకున్న శింగనమల రమేష్ లాంటి నిర్మాతలు కోలుకోలేని దెబ్బలు తింటే, పక్కా స్క్రీన్‌ప్లేతో ముందుకెళ్ళిన పరుచూరి కిరీటి లాంటి చిన్ననిర్మాతలు జాక్‌పాట్ కొట్టారు.కళ్యాణ్‌రామ్ కత్తి ని మినహాయిస్తే సంక్రాంతి నుంచి క్రిస్మస్ వరకు నందమూరి హీరోల హవా కొనసాగింది.తారకరత్నకు ఉత్తమ ప్రతినాయకుడిగా (అమరావతి ) నంది అవార్డు ప్రకటింపబడింది కూడా ఈ సంవత్సరమే.ఇలా ఏ రకంగా చూసినా ఇది నందమూరి నామ సంవత్సరం అని చెప్పక తప్పదు.
5 comments
లీడర్, బెట్టింగ్ బంగార్రాజు కూడా హిట్లేనా...మీ ఊళ్ళో?
Replyతేజస్వి గారు,
Replyమీదే ఊరో నాకు తెలియదు.మా ఉళ్ళో మీ ఉళ్ళో ఆడకపోయినంత మాత్రాన అవి ఫ్లాపైపోవు. బెట్టింగ్బంగార్రాజు ఉషాకిరణ్ మూవీస్ బేనర్‌కి మంచి హిట్టన్నది కాదనలేని సత్యం.శేఖర్ కమ్ముల కంగారుపడి కంగాళీ చేసినా ఒక డెబ్యుటంట్ రేంజ్‌కి లీడార్ బానే ఆడింది. ఈ రెండు సినిమాలు నాకు నచ్చలేదు కానీ వాస్తవాలు వేరేగా ఉన్నాయి.
Bagundi.
Replyplease watch & subscribe
Replyhttp://bookofstaterecords.com/
for the greatness of telugu people.
లక్ష్మి గారు,ధన్యవాదాలు
Reply