ఈ మధ్య నాగవల్లి గురుంచి వింటూంటే దెయ్యాలు భూతాల మీదా ఒక టపా వ్రాద్దామనిపించింది
దెయ్యాలు భూతాలు అనగానే నాకు నా చిన్నప్పటి ' ఓ స్త్రీ రేపు రా ' కథ టక్కున గుర్తొస్తుంది. 1988-89 ప్రాంతంలో అనుకుంటాను, ఒక పెద్ద పుకారు జనాల్ని చాలా భయపెట్టింది. ఒక స్త్రీమూర్తి ప్రేతమైపోయి రాత్రివేళల్లో సంచరిస్తూ నానా భీభత్సం సృష్టిస్తోందని , ఆవిడ బారిన పడకుండా ఉండాలంటే ఇంటి తలుపుల మీదో, గోడల మీదో 'ఓ స్త్రీ రేపు రా ' అని వ్రాయడమొక్కటే మార్గమని ఒక ప్రచారం బయలుదేరింది. అందరూ తలుపులు బిడాయించుకుని, ముసుగులు తన్నేశాక, రాత్రిపూట తీరిగ్గా వచ్చిన ఆడదెయ్యం అది చదువుకొని తనను చూసి భయపడుతున్నారన్న గర్వంతోనో, లేక ఆ ఇంటి వాళ్ళ మీద జాలితోనో, ఆ పూటకి వాళ్ళనేమీ చెయ్యకుండా విడిచిపెట్టేసి,మరుసటి రోజు వస్తుంది.ఇలా రోజూ వచ్చి, చదివిన వాక్యాలే మళ్ళీ మళ్ళీ చదువుకొని ఈ 'రేపు' అన్నది ఖచ్చితంగా ఎప్పుడొస్తుందో తెలుసుకోలేక తికమకపడి ఆఖరికి విసుగొచ్చి వెళ్ళిపోతుందన్నమాట.ఈ పుకారు ఎవరు ఎలా మొదలుపెట్టారో కానీ చాలా తొందరగా పాపులరైపోయింది.అదిగో పులి అంటే ఇదిగో తోక అని హడావుడిపడిపోయే బాపతు జనం మా కాలనీలో కూడా ఉన్నారు.వాళ్ళు ఈ దెయ్యానికి జడుసుకొని ముందు జాగ్రత్తచర్యగా గోడల మీద,తలుపుల మీద పెద్ద పెద్ద అక్షరాలతో ' ఓ స్త్రీ రేపు రా ' అని వ్రాసి పడేసారు. మా నాన్నగారు ఇలాంటివన్నీ నమ్మరు కాబట్టి, పైగా మేం అద్దె ఇంట్లో ఉండే వాళ్ళం కాబట్టి మా ఇంటి గోడలు, తలుపులు ఖరాబు కాలేదు.నాలుగైదు రోజులు గడిచి ఎవరికీ ఏమీ జరక్కపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకుని ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు.బహుశా ' రేపు రా ' అనగానే బుద్ధిగా తలూపి మరుసటి రోజు వచ్చే ఆడదెయ్యానికి, తుచ్ఛ మానవులు తనను వేళాకోళం చేస్తున్నారని ఆ మాత్రం పసిగట్టలేని తెలివిలేని దెయ్యానికి మనం భయపడటమేమిటని గ్రహించి కాబోలు.
నాకు ఊహ తెలిసాక నేను థియేటర్లో చూసిన మొట్టమొదటి దెయ్యం సినిమా శ్రీదేవీ కామాక్షీ కటాక్షం . మా ఊళ్ళో ఐ.యస్.మహల్ అని ఒక థియేటర్ ఉంది. అందులో ఎక్కువగా ఇంగ్లీషు సినిమాలో, హిందీ సినిమాలో వేస్తూంటారు. ఏ అమవాస్యకో, పౌర్ణమికో అందరూ తిరస్కరించిన తెలుగు సినిమానో, లేక వందరోజుల కోసం లాగబడే తెలుగు సినిమానో ఆడించినా మిగతా రోజులన్నీ ఇంగ్లీషు,హిందీ చిత్రాలనే ప్రదర్శించేవాళ్ళు. అటువంటిది హఠాత్తుగా ఆ థియేటర్ ఓనర్‌కి ఏమయ్యిందో కానీ విఠలాచార్య దర్శకత్వంలో కే.ఆర్.విజయ ప్రధానపాత్రధారిణిగా ఒక భక్తిరసచిత్రం తీసి జనం మీదకి వదిలేశాడు.పల్లెటూరు నుంచి వచ్చిన మా తాత ఊరికే ఉండకుండా,ఏడవ తరగతి చదువుతున్న నన్ను కూడా ఆ సినిమాకు లాక్కెళ్ళాడు.ముసలాళ్ళ ద్వారా కూడా ఉపద్రవాలు వచ్చిపడతాయని నాకప్పుడే చూచాయగా తెలిసింది.
ఆ సినిమాలో ప్రతి రాత్రీ పన్నెండయ్యేసరికి దెయ్యం ఆవహించి భర్తపై విరుచుకపడే భార్యగా ముచ్చెర్ల అరుణ నటించింది.తెరపై గోడ గడియారం పన్నెండు కొట్టగానే,ముచ్చెర్ల అరుణ ఇంతింత కళ్ళేసుకుకొని,జుట్టు విరబోసుకొని నాలుక బయటపెట్టి వికృతంగా అరుస్తూ మొగుడు మీదకు ఎగిరి దూకుతూంటే థియేటర్లో కుర్చీలో కూర్చున్న నాకు పై ప్రాణాలు పోయినట్లే అనిపించింది.ఫస్ట్‌షో నుంచి ఇంటికొచ్చాక మా తాతను బాగా తిట్టుకొని సైలెంట్‌గా భోజనం చేసేసుకొని గట్టిగా ముసుగుతన్ని పడుకున్నాను.రాత్రి పన్నేండయ్యేసరికి మా ఇంట్లో గోడగడియారం ఠంగ్ ఠంగ్ మంటూ చప్పుడు చేస్తూంటే భయంతో బిక్కచచ్చిపోయేవాన్ని.టాయిలెట్ కోసం కూడా లేచేవాన్ని కాదు.అప్పట్లోనే చందూసోంబాబు నవల ది మాన్‌స్టర్ చదివాను.అందులో హీరోయిన్ స్నానం చేస్తూంటే షవర్లోంచి రక్తం కారటం లాంటి సన్నివేశాలున్నాయి.నేను కూడా స్నానం చేస్తూ షవర్ వైపు చూసేవాన్ని.అయితే అదే వయసులో ఈవిల్‌డెడ్ లాంటి సినిమాను నింపాదిగా చూడగలిగాను. నేటివిటి ప్రాబ్లెం వల్ల ఆ సినిమా నన్నంత భయపెట్టలేకపోయింది.
పెరిగి పెద్దయ్యాక దెయ్యాలు భూతాలంటూ అంతగా భయపడిన సన్నివేశాలు లేవు. రాత్రి, అమ్మోరు , 13బి, అరుంధతి, మంత్ర, చంద్రముఖి లాంటి సినిమాలలో అక్కడక్కడ వళ్ళు జలదరించినా, తులసీదళం, అష్టావక్ర లాంటి నవలలు చదివినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నా ఆ అనుభూతి ఎక్కువకాలం వెన్నంటలేదు.నాగవల్లి తోనైనా వెంకీ ఆ పని చేస్తాడేమో చూడాలి.
Subscribe to:
Post Comments (Atom)
2 comments
నాకు కూడా చిన్నప్పుడు దెయ్యలంటే తెగ భయం. సాయంత్రం 7.00 దాటాక మా పెరట్లోకి వెళ్ళేదాన్ని కాదు. చీకటి అంటే భయం. నేను నాలుగో ఐదో చదువుతున్నప్పుడనుకుంటా "పున్నమి రాత్రి" సినిమా చూసాను. అందులో ఒక రక్త పిశాచి ఉంటుంది. అది అదరినీ మెడకొరికి చంపేసి రక్తం తాగేస్తూ ఉంటుంది. దాదాపుగా ఒక రెండు సంవత్సరాలు ఆ రక్తపిశాచి నన్ను వెంటాడూతూనే ఉండేది. ఆ భయంతో నేను మళ్ళీ మామూలవుతానని మాత్రం అనుకోలేదు. :)))తరువాత ఎలాగో అలా భయం పోయింది.
Replyby the waY నాగవల్లి గురించి అన్ని ఆశలు పెట్టుకోకండి....ఆక్కడ పేరు గొప్ప ఊరు దిబ్బ ట.
సౌమ్య గారూ,ధన్యవాదాలు.
Replyనిజమేనండోయ్.ప్రాథమిక సమాచారం ప్రకారం నాగవల్లి సినిమా ప్రేక్షకులని మరో రకంగా భయపెట్టినట్లుంది.