రసరమ్య కావ్యం శ్రీరామరాజ్యం


రామాయణం భారతీయుల జీవాత్మ. శ్రీ రాముని పితృవాక్య పరిపాలన, సీతారాముల అన్యోన్యత , భరత లక్ష్మణ శతృఘ్నుల భాతృ భక్తి,  ఆంజనేయుని స్వామి భక్తి తరతరాలకీ చిరస్థాయిగా గుర్తుండిపోయేవి. ఎన్ని సార్లు చదివినా, పాడినా తనివితీరని గాథ అది. ఎల్కేజి ప్రేమలు, వెకిలి నవ్వులు, విపరీతమైన హింస, విశృంఖలత్వం తెలుగు సినిమా సామ్రాజ్యాన్నేలుతున్న ఈ రోజుల్లో, ఆ ఉధృతిలో పడి వో గట్టు చేరే ప్రయత్నం చెయ్యకుండా, ఏటికి ఎదురీది రామయణ నేపథ్యాన్ని, అందునా శోక ప్రధానమైన ఉత్తర రామాయణ ఘట్టాన్ని ఎన్నుకొని ఒక సినిమా నిర్మించాలనుకోవడానికి చాలా ధైర్యముండాలి. అంతకు మించి రామ కథ మీద అచంచలమైన భక్తి, విశ్వాసం ఉండాలి. ఆ రెండూ ఉన్న నిర్మాత యలమంచలి సాయిబాబు. మరో నిర్మాత  అయ్యుంటే (శ్రీరామదాసు, పాండురంగడు నిర్మాతలు) ఎలాగోలా ఈ సినిమాని చుట్టేసి ఓ పనైపోయిందనుకొనేవారు. సాయిబాబు మాత్రం ఎక్కడా రాజీపడలేదు. ఖర్చుకు వెనుకాడకుండా అత్యుత్తమమైన ఫలితం కోసం ఆయన పడిన తపనంతా సినిమాలో ప్రతి నిమిషం కనిపిస్తుంది. తెలుగులో ఇటువంటి కమిట్‌మెంట్ ఉన్న నిర్మాతంటే  శ్యాంప్రసాద్ రెడ్డి తప్ప ఇంకెవరూ గుర్తురారు నాకైతే. అందుకే సాయిబాబు గారికో సాష్టాంగ నమస్కారం.


కథ అందరికీ తెలిసిందే కాబట్టి దాని జోలికి పోను. కాకపోతే ఇందులో ఒక ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన మార్పు చేశారు. ఎన్నో ప్రయాసలు పడి సీతారాములనొక్కటి చేసిన హనుమంతుడు మళ్ళీ అడవుల పాలైన సీతమ్మను చూసి కృంగి పోతాడు. దారి చూపవయ్యా అని వేడుకుంటే బాలుని రూపంలో ఆశ్రమంలోనే ఉంటూ రామకథను గానం చేస్తూ, సీతమ్మ దుఃఖానికి ఉపశమనం చేకూర్చమని చెబుతాడు వాల్మీకి. ఇదే సృజనాత్మకత అంటే. రామకథను అణువణువునా జీర్ణించుకుని నిత్యం తర్కవితర్కాలు చేసి విశ్లేషించుకుంటే తప్ప ఇటువంటి భావనలు రావు. శ్రీరామరాజ్యానికి మాతృకైన లవకుశ కూడా కల్పితమే కాబట్టి, హనుమంతుడి పాత్రౌచిత్ర్యం దెబ్బతినలేదు కాబట్టి ఇది తప్పా వొప్పా అన్న ప్రశ్న ఉదయించదు. 




లవకుశతో బేరీజు వెయ్యకుండా చూస్తే శ్రీరామరాజ్యం ఒక అద్భుత దృశ్యకావ్యమనిపిస్తుంది. రాఘవేంద్రరావు వడ్డించిన కమర్షియల్ కిచిడీలతో పోల్చుకుంటే పంచభక్ష్య పరామాన్నం లాంటి ఈ సినిమా ఒక క్లాసిక్ అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. శ్రీరాముడిగా నందమూరి బాలకృష్ణ బాగా చేశాడనే చెప్పుకోవాలి. అతని పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో మెప్పించాడు.  ఆహార్యంలో తండ్రిని తలపించి, ఉచ్ఛారణలో వైవిధ్యాన్ని చూపించాడు. భధ్రుని మాటలు విని సీతను పరిత్యజించే సమయంలో బాధను, శృంగార సన్నివేశాల్లో చిలిపిదనాన్ని, కుశలవులతో వాగ్యుద్ధ సమయంలో రామబాణం వైశిష్ట్యాన్ని చెబుతూ  వీరరసాన్ని,సీత భూమిలోకి వెళ్ళిపోయే సమయంలో దుఃఖాన్ని,అసహాయతను స్పష్టంగా పలికించాడు. అతని దురదృష్టమేమిటంటే యాభైయేళ్ళ వయసులో ఈ సినిమా చేసే అవకాశం రావడం. ఫలితంగా కొన్ని క్లోజప్ షాట్స్‌లో ముదిమి ఛాయలు  కనిపిస్తాయి. వెండితెర రాముడిగా వీక్షకుల  గుండెల్లో కొలువుదీరిన ఆ 'తారకరాము' డి  తనయుడు కావటం మరో చిక్కు. ఎలా చేసినా శల్యపరీక్షలు చేసి తేలిగ్గా పెదవి విరిచేసేవాళ్ళూ లేకపోలేదు. సీతా శోకం ప్రధానమైన ఇతివృత్తంలో వియోగియైన భర్తగా విషాదాన్ని మొహాన పులుముకొని, తన శైలికి భిన్నంగా ప్రశాంతంగా సంభాషణలు పలుకుతూ, రౌద్రరసానికి అలవాటు పడిన అభిమానులని అలరించాలి. ఇన్ని ఒత్తిళ్ళను తట్టుకుంటూ కత్తి మీద సాము లాంటి శ్రీరామ పాత్రపోషణలో బాలకృష్ణ కృతకృత్యుడే అయ్యాడు. టాప్‌హీరో సమయంలోనే బాపుతో భగవాన్ శ్రీ కృష్ణ అనే పౌరాణిక చిత్రం ప్లాన్ చేసినా, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీ కృష్ణార్జున విజయం పరాజయం పాలవ్వడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఇప్పటికి అతని కల సాకరమయ్యింది.


 నయనతార నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సీతగా తన పేరును ప్రకటించగానే రకరకాల సందేహాలు వ్యక్తం చేసి బ్యాడ్ ఛాయిస్‌గా తీర్మానించేసిన ప్రేక్షకులందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా నటించి మెప్పించింది. కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతూంటే అటు బాలామణి సీతగా స్వయంవరంలో, ఇటు రాముని పత్నిగా అంతఃపుర సౌధాలలో, శోకగ్రస్తయైన తల్లిగా వాల్మీకి ఆశ్రమంలో పరిణితి చెందిన హావభావలు కనబరిచి ఆకట్టుకుంది. ఆమె ప్రతిభకు గీటురాయిగా నిలిచే ఎన్నో సన్నివేశాలు ఈ చిత్రంలో ఒకదాని వెనుక మరొకటి వస్తూ మంత్రముగ్ధులను చేస్తాయి. బరువైన సన్నివేశాలలో కంటతడి తెప్పించే సత్తా తనకూ ఉందని రుజువు చేస్తూ తన సినీజీవితానికే తలమానికమైన నటన ఈ చిత్రంలో ప్రదర్శించింది. హాట్సాఫ్ 


కుశలవులగా చేసిన చిన్నపిల్లలు ముద్దుగా చేశారు. కుశుడితో పోలిస్తే లవుడికి ముందస్తు సినిమా అనుభవం ఉండటం వలన అతనిలో భావాలు బాగా పలికాయి. బాల హనుమంతుడిగా చేసిన పిల్లాడు కూడా బాగా చేశాడు. బాలనటుల క్యాటెగరిలో వీరిద్దరిలో ఒకరికి అవార్డొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


అక్కినేని నాగేశ్వరరావు గురుంచి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు. ఇటువంటివన్నీ ఆయనకు కొట్టిన పిండి.


లక్ష్మణుడిగా శ్రీకాంత్ ఫర్వాలేదనిపించాడు. సీతను అడవిలో వదిలే సన్నివేశంలో మాత్రం ఇంకాస్త బాగా  చేసుండాల్సిందనిపించింది .


భూదేవిగా రోజా, భరతుడిగా సమీర్, చాకలి తిప్పడుగా బ్రహ్మానందం, ఇతర పాత్రలలో కే.ఆర్ విజయ, మురళీమోహన్, సీనియర్ నటుడు బాలయ్య సరిగ్గా ఇమిడిపోయారు . మర్యాదరామన్నలో నాగినీడుగా మెప్పించిన విలన్ పాత్రధారి ఋష్యశృంగునిగా నటించారు. నారద పాత్రలో ఏవియస్ కూడా కొన్ని సెకన్ల పాటూ తళుక్కున మెరుస్తారు. ఆంజనేయుడి దవడల మేకప్ మాత్రం ఒక్కో సీన్‌లో ఒక్కోలా ఉంది.


దర్శకత్వం విషయానికొస్తే, పచ్చటి ప్రకృతి కాన్వాసుపై వెచ్చటి ఏడు రంగుల ఇంధ్రధనస్సు చెక్కిన విధాతలా వెండితెరపై శ్రీరామరాజ్యాన్ని హృద్యంగా ఆవిష్కరించారు బాపు.  స్వతహాగా గొప్ప చిత్రకారుడు కావటం మూలన సన్నివేశాన్ని ఎంతబాగా ప్రెజంట్ చెయ్యవచ్చో ఆయనకు బాగా తెలుసు. భారీ రాజప్రాసాదాల నుంచి తెలుగుదనం తొణికిసలాడే ముని పర్ణశాలల వరకు  ఆయన ఆభిరుచి ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. కళ్ళను కట్టిపడేస్తుంది. రమణ గారి సంభాషణలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రాముడి ఏకపత్నీవ్రతతని, హనుమంతుని భక్తి తత్పరతని పిట్ట కథల రూపంలో చెప్పారు. రామయణం అంటే రాముని కథ కాదని, రాముడు నడిచిన మార్గమని అందరికీ తెలిపే ప్రయత్నం చేశారు. లవకుశలోని కొన్ని పద్యాలు డైలాగ్స్ రూపంలో అక్కడక్కడా వాడుకున్నారు. గ్రాఫిక్స్ విరివిగా ఉపయోగించారు.

ఇళయరాజా సంగీతం వీనులవిందుగా ఉంది. పాటల విషయంలో మాత్రం కాస్త అసంతృప్తి మిగిలింది. శ్రీరామా లేరా ఓ రామా పాటలో మొదటి చరణం కట్ చేశారు.  శ్రీరామంజనేయ యుద్ధం సినిమాలో మేలుకో శ్రీ రామ పాట చూసి, బాపు ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించి ఉంటారనుకున్నాను. రెండవ చరణం బావున్నా మొదటి చరణం మొత్తం ఎగిరిపోయింది. అలాగే కలయా నిజమా పాటలో పల్లవులెగిరిపోయాయి. ఆల్బంలో నాకు బాగా నచ్చిన రెండు పాటలివి. గాలీ నింగీ నీరు పాటలో కూడా చివరి లైన్లు కనబడవు, వినబడవు. రామాయణము పాట పావుశాతమే ఉంది.  క్లైమాక్స్‌లో  శ్రీరాముడు కుశలవులతో మాట్లడుతూ  శస్త్రవిద్యలలోనే కాదు అస్త్రవిద్యలలో కూడా మీకు నైపుణ్యమున్నదన్న మాట అంటాడు. దీన్ని బట్టి చుస్తే కుశలవులతో రాముడు యుద్ధం చేసిన సన్నివేశాలున్నట్లనిపిస్తుంది. చిత్రవ్యవధిని దృష్టిలో ఉంచుకొని ఎడిటింగ్‌లో ఇవన్నీ తీసేశారో లేక సినిమాలో ఉన్న భాగాలను మాత్రమే షూట్‌చేసారో తెలియదు. అవి కూడా ఉండుంటే ఇంకా బావుండేది.


 తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది . లేకపోతే భవిష్యత్తులో భక్తిరస చిత్రమంటే  క్రియేటివిటీ పేరుతో కేరళలోనో, కౌలాలంపూర్‌లోనో డ్యూయెట్లు పెట్టించి, బొడ్డు పాటల కోసం ఒక పాత్రను సృష్టించి  , బ్రహ్మానందం, ఆలీ , సునీల్‌లతో వెకిలి హాస్యం గుప్పించిన కే.రాఘవేంద్రరావు సినిమాలే గుర్తుకొస్తాయి. ఆ పైన మీ ఇష్టం.


10 comments

Post a Comment

థ్రిల్లర్


ప్రేమంటే ఏమిటి ?
దాని లక్షణాలేమిటి ?
దానిలో నిజాయితీ ఎంత ?
ఏది ప్రేమ? ఏది ఆకర్షణ ?
ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దేనికి ప్రేమిస్తాడు ?

కఠోరమైన మనః ప్రవృత్తికి ఆహ్లాదకరమైన ముసుగు తొడిగి, తమ ప్రత్యేకతలను సద్గుణాలను మాత్రమే బయటికి ప్రొజెక్ట్ చేస్తూ,  అవతల వ్యక్తిని ఇంప్రెస్ చెయ్యటానికి తాపత్రయపడటమే  ప్రేమా ? ప్రేమకు పరమావధి పెళ్ళేనా ? పెద్దల్ని ఎదిరించి ప్రేమవివాహాలు చేసుకొని పెళ్ళాలను పుట్టింటికి పంపటానికి భీష్మించే భర్తలది, మెట్టినింటి చిన్న చిన్న సంప్రదాయాలని పాటించటానికి నానా రాద్ధాంతం చేసే భార్యలది నిజమైన ప్రేమేనా ?  ఏ ప్రయోజనాన్ని ఆశించని నిస్వార్థమైన ప్రేమ అసలుందా ? ఈ విషయాలన్నిటినీ స్పృశిస్తూ ఒక అద్భుతమైన అబ్సర్డ్ నవల వస్తే అదే యండమూరి వీరేంద్రనాథ్ థ్రిల్లర్. అబ్సర్డ్ నవలలో కథ కంటే భావం ప్రధానం. దాన్ని మనసుకు హత్తుకునేలా చెప్పటానికి  కొన్ని అవాస్తవిక సంఘటనల సహాయం తీసుకుంటారు రచయితలు. అటువంటిదే ఏడేళ్ళు ప్రేమకోసం తపస్సు చెయ్యటం. ఇది సాధారణంగా జరిగే పనికాదు. కానీ అటువంటి సంఘటనొకటి జరిగి,  ప్రేమరాహిత్యంతో బాధపడుతూ హ్యూమన్ రిలేషన్స్‌పైనే అసహ్యాన్ని నింపుకున్న ఓ అమ్మాయికి విశ్వజనీయమైన ప్రేమను బోధిస్తూ ఒక యువకుడు వస్తే ..అదే థ్రిల్లర్ .

కథలోకి  వస్తే విద్యాధరి ఒక అందమైన మధ్యతరగతి అమ్మాయి. అనాథ. ఆమె బాల్యం, పరిసరాలు ఆమెకు మానవ సంబంధాలపైనే ఒక రకమైన కసిని కలిగిస్తాయి. ఒకప్రముఖ దిన పత్రిక సంపాదకుడిగా పనిచేస్తూ పేరు ప్రఖ్యాతులు  లభించాక, నైతిక విలువలకు తిలోదకాలిచ్చి స్త్రీలోలుడై భార్యను హతమార్చి ఏ కేసు లేకుండా చూసుకున్న ఆమె తండ్రి, తండ్రిలాంటి వాడినని చెప్పుకుంటూ ఆమెను లోబర్చుకోవాలని ప్రయత్నించే ముసలి ఇంటి ఓనరు, తాగి నీటి తొట్లో పడిపోతే మానవతాభావంతో సపర్యలు చేసినందుకు ప్రేమించమని వేధించే ఆయన కొడుకు, ఆమె ఒంటరితనాన్ని ఆసరా చేసుకుని ఆమెను పొందాలనుకొనే ఆమె మేనేజరు ఇలా అందరూ ఆమె ప్రవర్తనపై చెరగని ముద్రవేసిన వాళ్ళే.

రెస్టారంట్‌లో తన ఇగో దెబ్బతీసినందుకు విద్యాధరిని దొంగ రశీదుల కేసులో ఇరికించి, ఆమెను భయపెట్టి పాదాక్రాంతం చేసుకోవాలనుకుంటాడు ఆమె మేనేజరు చక్రధర్. అటువంటి సమయంలో నాటకీయంగా రంగప్రవేశం చేసిన అనుదీప్ విద్యాధరికి ధైర్యం చెప్పి, చక్రధర్ బారి నుండి ఆమెను కాపాడుతాడు. తానెవరో ఆమెకు తెలియజేస్తాడు. ఏడు సంవత్సరాల క్రితం ఆమెను బస్‌లో చూసి ప్రేమలో పడ్డానని, ఆమె ప్రేమను పొందడానికి ఏడేళ్ళు వింధ్య పర్వతాలలో తపస్సు చేసానని చెబుతాడు. ' అన్ని సంవత్సరాలు తపస్సు చెయ్యడం దేనికి ? అప్పుడే చెప్పోచ్చు కదా ' అంటే ' అప్పటికే ఆమె వెంట తిరుగుతున్న రోమియోల్లో ఒకడ్ని కావటం ఇష్టం లేక, తన ప్రేమను అంగీకరిస్తుందో లేదో అన్న అనుమానం చేత ఆ పని చెయ్యలే' దంటాడు. ఆమె అతన్ని పిచ్చివాన్నిగా జమకడుతుంది. అతను తన ప్రేమ తీవ్రతను నిరూపించుకోవటానికి ఆమె శరీరంపై ఆమెకు తెలియకుండా ప్రేమ సందేశం వ్రాస్తాడు.  ప్రేమికుడంటే తనకు ప్రియమైనదాన్ని ప్రియురాలి కోసం వదులుకునేవాడని ఆమె ఒక పుస్తకంలో వ్రాసుకుంటే తనకెంతో ఇష్టమైన కుడిచేతిని భుజం వరకు నరికేసుకుంటాడు. సినిమా థియేటర్లో  బ్యాండేజీ కట్టబడి శూన్యంగా వున్న అతని కుడి భుజాన్ని చూసి విద్యాధరి భయంతో కేకలు వేస్తుంది. అదే థియేటర్‌కి కుటుంబంతో సహా వచ్చిన ఆమె తండ్రి స్నేహితుడు పోలీస్ కమీషనర్ ధర్మారావు ఆమెనెవరో ఆకతాయి ఏడిపిస్తున్నాడని భావించి అతని సంగతి చూడమని ఎస్సై విశ్వనాథాన్ని పురమాయిస్తాడు .

పోలీస్ స్టేషన్లో ఎస్సై విశ్వనాథానికి అతని భవిష్యత్తు చెప్పి, తన ప్రేమ శక్తిని నిరూపించుకోవటానికి కుడిచేతిని మళ్ళీ మొలిపిస్తాడు అనుదీప్. అతను నిజంగా చెయ్యి తెగ్గోసుకోలేదని, కేవలం ఆ భావాన్ని కలిగించాడని , అతనో మెస్మరిస్టన్న అంచనాకి వస్తారు ధర్మారావు, విద్యాధరి. విద్యాధరికి రక్షణగా ఇద్దరు కానిస్టేబుల్స్ ని నియమించి అతన్ని ఎలాగైనా పట్టుకోమని విశ్వనాథాన్ని ఆదేశిస్తాడు  ధర్మారావు.

దొంగ రశీదులతో ఇన్వెస్టర్లకు కోట్లరూపాయిల్లో ధనం ఎగ్గోట్టడానికి చక్రధర్, అతని పార్ట్‌నర్ పథకం పన్నారని, చక్రధర్ దగ్గర్నుంచి అందుకు సంబంధించిన రహస్య పత్రాలేవైనా సంపాదించి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సహకరించమని విద్యాధరిని కోరుతాడు ధర్మారావు. విద్యాధరి ఉత్సాహంతో అంగీకరిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అనుదీప్ అనవసరమైన రిస్కులు తీసుకోవద్దని ఆమెకు సలహా ఇస్తాడు. ఆమె దాన్ని పట్టించుకోదు. తమ మధ్య జరిగిన గొడవకు బాధపడుతున్నట్లు చక్రధర్‌ని నమ్మిస్తుంది. ఉబ్బితబ్బిబైన అతడు ఆమెను తన ఇంటికి ఆహ్వానిస్తాడు. రహస్య పత్రాలు సంపాదించటానికి ఇదే అనువైన అవకాశమని విద్యాధరి భావిస్తుంది. ఈ అసైన్మెంట్ గురుంచి విశ్వనాథంకు చెప్పి చక్రధర్ ఇంటికి వెళ్తుంది. అయితే ఆమె అంచనాలన్నీ తారుమారయ్యి కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటుంది. చక్రధర్ హత్యజేయబడతాడు. ఆమె నిందితురాలవుతుంది. తను ఏ నేరం చెయ్యలేదని మొత్తుకున్నా ఆమె మాట ఎవరూ వినరు.

రవిశాస్త్రి మరో పోలీసాఫీసర్. అనుదీప్ గురుంచి మొదటిసారి విన్నప్పుడు కలిగిన అసక్తితో పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేసి అతను నిజంగానే వింధ్య పర్వతాలలో ఏడు సంవత్సరాలు తపస్సు చేశాడని తెలుసుకొని నిర్ఘాంతపోతాడు .అనుదీప్  అతనికి కొన్ని క్లూస్ ఇచ్చి చక్రధర్ హత్య వెనుక అతని పార్ట్‌నర్, ఎస్సై విశ్వనాథంల హస్తం ఉందని తెలియజేస్తాడు. విద్యాధరి విడుదలవుతుంది. తనకు సాయం చేసింది అనుదీప్ అన్న విషయం ఆమెకు తెలియదు. అనుదీప్‌కి మాటిచ్చిన కారణంగా రవిశాస్త్రి కూడా మౌనం వహిస్తాడు.  అనుదీప్ తన ప్రేమ సందేశాన్ని ఒక క్యాసేట్లో నిక్షిప్తం చేసి రవిశాస్త్రి ద్వారా ఆమెకు చేరవేస్తాడు. తను జైల్లో ఉన్నప్పుడు ఏ మాత్రం పట్టించుకోకుండా, బయటపడ్డాక మళ్ళీ తయారైన అనుదీప్‌ని చూసి ఆమెకు పట్టరాని కోపం వస్తుంది. క్షుద్ర విద్యలతో మనుషుల్ని కనికట్టులో పడేస్తున్నావని నిందిస్తుంది. అనుదీప్ హర్టవుతాడు. తను మెస్మరిస్టు కాదని, మెస్మరిస్టు కేవలం కొంత మందిని మాత్రమే మోసం చెయ్యగలడని,  ప్రపంచాన్ని మొత్తం మోసం చెయ్యలేడని, తన ప్రేమ నిజమే అయితే ప్రపంచమంతా కరెంటు పోతుందని, ఆమెకు నమ్మకం కలిగాకే కరెంటు వస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు.

కరెంటు పోతుంది. విద్యాధరి ధర్మారావు ఇంటికి వెళ్ళి తనకు అనుదీప్‌కి మధ్య జరిగిన సంభాషణ చెబుతుంది. ధర్మారావు ఫోన్లు చేసి ప్రపంచమంతా కరెంటు పోయిందని నిర్థారించుకుంటాడు. విద్యాధరి అనుదీప్ ఇంటికి వెళ్ళి అతన్ని ప్రేమిస్తున్నట్లు కాగితం వ్రాసి, అతని తల్లిదండ్రులకు ఇచ్చి వస్తుంది. ఈ లోగా తన స్వార్థం కోసం ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక కరెంటుని తిరిగి రప్పించమని దేవున్ని వేడుకుంటాడు అనుదీప్. అయితే ఇదంతా బూటకమని ఒక కొత్త జనరేషన్ కంప్యూటర్ కనుక్కోవటం వల్ల ఎలెక్ట్రాన్ల ప్రవాహం  ఆగిపోయి ప్రపంచమంతా కరెంటు పోయిందని, ఈ విషయం ముందే తెలుసుకున్న అనుదీప్ తెలివిగా అందరినీ ఫూల్స్‌ని చేశాడని ధర్మారావు చెబుతాడు. ఇలాంటి వాడిని వదిలెయ్యటం ప్రమాదకరమని ఒక తెల్లకాగితం మీద సంతకం పెట్టిస్తే పోలీసులు మిగతా సంగతి చూసుకుంటారని చెప్పటంతో అలానే చేస్తుంది విద్యాధరి. 

బెయిలు మీద విడుదలైన చక్రధర్ బిజినెస్ పార్ట్‌నర్, ఎస్సై విశ్వనాథం సాక్ష్యాలను సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించుకుని విద్యాధరి హత్యకు పథకం వేస్తారు.  ఆమెను రక్షించే క్రమంలో కత్తిపోట్లకు గురయ్యి కుప్పకూలిపోతాడు అనుదీప్. మరణశయ్య మీదున్న అతన్ని చూసి జాలిపడకుండా ఇది కూడా  క్షుద్ర విద్యే అని నిర్దయగా మాట్లాడిన విద్యాధరి చెంప చెళ్ళుమనిపిస్తాడు రవిశాస్త్రి. అనుదీప్ గురుంచి తను తెలుసుకున్నవి, అతను ఆమెకెలా సాయపడిందీ వివరిస్తాడు.  బరువెక్కిన హృదయంతో, వెల్లువెత్తిన ప్రేమతో విద్యాధరి అనుదీప్ ప్రేమను అంగీకరించటానికి హాస్పిటల్‌కు వెళ్తుంది. అయితే అక్కడ అనుదీప్ పేరుతో ఎవరూ అడ్మిటవ్వలేదని తెలిసి విస్తుబోతుంది. అంతే కాదు అంతకుముందు జరిగిన సంఘటనలన్నీ కలే అని తెలిసి అయోమయానికి గురవుతుంది.వాస్తవానికి జరిగింది వేరే. తనది నిస్వార్థమైన ప్రేమైనప్పుడు ఆమెనుంచి ప్రేమను ఆశించటం కూడా తప్పే అని గ్రహించిన అనుదీప్,అమె జ్ఞాపకాలను తనతో తీసుకుని వెళ్ళిపోతూ (మరణిస్తూ) ప్రేమ ద్వారా తనకు లభించిన అతీతమైన శక్తులతో ఇప్పటివరకు జరిగినదంతా కలేనన్న నమ్మకాన్ని ఆమెకి కలిగిస్తాడు. ఇంతగా ప్రేమించినవాడు తనకు శాశ్వతంగా దూరమయ్యాడన్న బాధ ఆమెకు కలుగకుండా ఉండటం కోసం జరిగిందంతా కలేనన్న విశ్వాసం ఆమెకు కలిగించి, ఆమెలో మనుషుల పట్ల, ప్రేమ పట్ల సద్భావన కలిగిస్తాడు.



నా దగ్గరున్న పాత వర్షన్‌లో ఇదీ ముగింపు. తర్వాత వచ్చిన వర్షన్స్‌లో మార్చినట్లున్నారు. విద్యాధరి హాస్పిటల్‌కు వెళ్ళి అచేతనానవస్థలో నున్న అనుదీప్ ని ముద్దు పెట్టుకోవటంతో అనంతవాయువుల్లో కలిసిపోబోతున్న అతని ప్రాణాలు తిరిగి వస్తాయి. కథ సుఖాంతమవుతుంది.

అనుదీప్ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు రచయిత. ఒక గొప్పింటిని కుర్రాడిని ప్రేమించి, వివాహం చేసుకుని, కుటుంబ సమస్యలతో సతమవుతూ పుట్టెడు చాకిరీ చేసినా అత్తవారింట్లో గుర్తింపుకు నోచుకోక, విషజ్వరంతో మరణించిన అతని చెల్లెలు, ఆమె వ్రాసిన ఆఖరి ఉత్తరం అతన్ని కదిలిస్తాయి. విద్యాధరిని ప్రేమించిన తొలినాళ్ళలో జరిగిన ఈ సంఘటన అతని జీవితాన్నే మార్చివేస్తుంది. ప్రేమంటే ఏమిటన్న ఆలోచన మొదలవుతుంది. శరీరం కోసం భార్యని, వృద్ధాప్యం కోసం పిల్లల్ని, అహం తృప్తి కోసం ప్రియురాలిని, అవసరం కోసం భర్తని, రక్షణ కోసం కులాన్ని, మతాన్ని దేశాన్ని ఇలా సంకుచితంగా కాకుండా ప్రేమనేది లేదా అన్న చింతన బయలుదేరుతుంది.  చదువు మధ్యలో ఆపేసి, ప్రేమంటే ఏమిటో తెలుసుకోవటానికి, తన ప్రేమ నిజమా కాదా అని తెలుసుకోవటానికి, ఆమె తనను ప్రేమించేలా చెయ్యమని దేవున్ని కోరుకోవటానికి ఏడేళ్ళు వింధ్య పర్వతాలలో తపస్సు చేస్తాడతను. తీరా దేవుడు ప్రత్యక్షమయ్యాక ఆయన రికమెండేషన్‌తో సంపాదించుకోనే కృత్రిమమైన ప్రేమ వద్దనుకుని, స్వశక్తితో ఆమె ప్రేమను గెలుచుకోవాలనుకుంటాడు.  అందుకు గాను తనకు తానే మూడు షరతులు విధించుకుంటాడు.


  • 1. వాక్చాతుర్యంతో కానీ, ధీరోదాత్తమైన చర్యల ద్వారా గానీ, బహుమతుల ద్వారా గానీ, మగ స్పర్శ తాలూకు టెంప్టేషన్ ద్వారా గానీ ఆమె ప్రేమను పొందరాదు.

  • 2. ఆమె అభిప్రాయాలతో ఏకీభవించినట్లు మాట్లాడి, ఆమె కష్టల్లో ఉండగా ఓదార్చి ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యరాదు. 

  • 3. మంచి భవిష్యత్తు, సుఖప్రదమైన సంసారం, సెక్యూరిటీ లాంటి వాగ్దానాలు చేసి ఆమెను ఆకట్టుకోరాదు.


ఇవేవీ లేకుండా ఒకమ్మాయి మనస్సు గెలుచుకోవటం సాధ్యమయ్యే పనేనా?  అనుదీప్ సాధ్యమేనని నమ్ముతాడు. అతని పేరున బోల్డంత పుణ్యం జమయ్యింది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం పరిత్యజించే అవకాశమిస్తాడు దేవుడు. అనుదీప్ మాత్రం నెలరోజుల్లోగా విద్యాధరి ప్రేమను గెలుచుకోలేకపోతే శరీరం విడిచిపెట్టేయాలని నిర్ణయించుకుంటాడు. ఎత్తుకున్న కథాంశం ఏదైనా అది చదువరుల మానసిక వికాసాన్ని పెంపొందించేలా చెయ్యటంలో యండమూరి వీరేంద్రనాథ్‌ది అందెవేసిన చెయ్యి. ఈ నవలలో కూడా అది ప్రతిఫలించింది. బుద్ధుడిలా జ్ఞానోదయం పొంది, భీష్ముడిలా స్వచ్ఛంద మరణం వరంగా పొందిన అనుదీప్ ప్రియురాలి ప్రేమను పొందే క్రమంలో సంధించే ప్రశ్నలు , చేసే వాదనలు పాఠకుల్ని ఆలోచింపచేస్తాయి. తపస్సు దాకా అక్కర్లేదు. తమది ప్రేమేనా?  ఏమాశించి తాము ప్రేమిస్తున్నాం? తమ ప్రేమలో నిజాయితీ ఎంత?  అని పది నిమిషాలు నింపాదిగా ఆలోచించే వాళ్ళు యువతరంలో ఎంతమందున్నారన్నది ప్రశ్న. తమ ప్రేమ గురుంచి తల్లిదండ్రులకు మాటమాత్రం చెప్పకుండా  మోసం చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళు రేప్పొద్దున్న తమ జీవిత భాగస్వామిని మోసం చెయ్యరన్న నమ్మకమేమిటి? అంత విచక్షణే ఉంటే ఇన్ని ఆసిడ్ దాడులు, ఆత్మహత్యలు జరుగుతాయా?

ఈ నవలను రాజేంద్రప్రసాద్, సీత ప్రధాన పాత్రధారులుగా ముత్యమంత ముద్దు పేరుతో తెరకెక్కించారు. మూలాలు చెడగొట్టకుండా తమ పరిధి మేరకు బాగానే తీశారు. రవిరాజా పినిశెట్టి దర్శకుడు.  సినిమాలో కథను సుఖాంతం చేశారు. నవలలో లేని దివ్యవాణి పాత్ర సినిమాలో బాగా పండింది.  హంసలేఖ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు కూడా బాగా పాపులరయ్యాయి. అయితే సినిమా కంటే నవల చాలా బావుంటుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.


4 comments

Post a Comment