రసరమ్య కావ్యం శ్రీరామరాజ్యం


రామాయణం భారతీయుల జీవాత్మ. శ్రీ రాముని పితృవాక్య పరిపాలన, సీతారాముల అన్యోన్యత , భరత లక్ష్మణ శతృఘ్నుల భాతృ భక్తి,  ఆంజనేయుని స్వామి భక్తి తరతరాలకీ చిరస్థాయిగా గుర్తుండిపోయేవి. ఎన్ని సార్లు చదివినా, పాడినా తనివితీరని గాథ అది. ఎల్కేజి ప్రేమలు, వెకిలి నవ్వులు, విపరీతమైన హింస, విశృంఖలత్వం తెలుగు సినిమా సామ్రాజ్యాన్నేలుతున్న ఈ రోజుల్లో, ఆ ఉధృతిలో పడి వో గట్టు చేరే ప్రయత్నం చెయ్యకుండా, ఏటికి ఎదురీది రామయణ నేపథ్యాన్ని, అందునా శోక ప్రధానమైన ఉత్తర రామాయణ ఘట్టాన్ని ఎన్నుకొని ఒక సినిమా నిర్మించాలనుకోవడానికి చాలా ధైర్యముండాలి. అంతకు మించి రామ కథ మీద అచంచలమైన భక్తి, విశ్వాసం ఉండాలి. ఆ రెండూ ఉన్న నిర్మాత యలమంచలి సాయిబాబు. మరో నిర్మాత  అయ్యుంటే (శ్రీరామదాసు, పాండురంగడు నిర్మాతలు) ఎలాగోలా ఈ సినిమాని చుట్టేసి ఓ పనైపోయిందనుకొనేవారు. సాయిబాబు మాత్రం ఎక్కడా రాజీపడలేదు. ఖర్చుకు వెనుకాడకుండా అత్యుత్తమమైన ఫలితం కోసం ఆయన పడిన తపనంతా సినిమాలో ప్రతి నిమిషం కనిపిస్తుంది. తెలుగులో ఇటువంటి కమిట్‌మెంట్ ఉన్న నిర్మాతంటే  శ్యాంప్రసాద్ రెడ్డి తప్ప ఇంకెవరూ గుర్తురారు నాకైతే. అందుకే సాయిబాబు గారికో సాష్టాంగ నమస్కారం.


కథ అందరికీ తెలిసిందే కాబట్టి దాని జోలికి పోను. కాకపోతే ఇందులో ఒక ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన మార్పు చేశారు. ఎన్నో ప్రయాసలు పడి సీతారాములనొక్కటి చేసిన హనుమంతుడు మళ్ళీ అడవుల పాలైన సీతమ్మను చూసి కృంగి పోతాడు. దారి చూపవయ్యా అని వేడుకుంటే బాలుని రూపంలో ఆశ్రమంలోనే ఉంటూ రామకథను గానం చేస్తూ, సీతమ్మ దుఃఖానికి ఉపశమనం చేకూర్చమని చెబుతాడు వాల్మీకి. ఇదే సృజనాత్మకత అంటే. రామకథను అణువణువునా జీర్ణించుకుని నిత్యం తర్కవితర్కాలు చేసి విశ్లేషించుకుంటే తప్ప ఇటువంటి భావనలు రావు. శ్రీరామరాజ్యానికి మాతృకైన లవకుశ కూడా కల్పితమే కాబట్టి, హనుమంతుడి పాత్రౌచిత్ర్యం దెబ్బతినలేదు కాబట్టి ఇది తప్పా వొప్పా అన్న ప్రశ్న ఉదయించదు. 




లవకుశతో బేరీజు వెయ్యకుండా చూస్తే శ్రీరామరాజ్యం ఒక అద్భుత దృశ్యకావ్యమనిపిస్తుంది. రాఘవేంద్రరావు వడ్డించిన కమర్షియల్ కిచిడీలతో పోల్చుకుంటే పంచభక్ష్య పరామాన్నం లాంటి ఈ సినిమా ఒక క్లాసిక్ అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. శ్రీరాముడిగా నందమూరి బాలకృష్ణ బాగా చేశాడనే చెప్పుకోవాలి. అతని పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో మెప్పించాడు.  ఆహార్యంలో తండ్రిని తలపించి, ఉచ్ఛారణలో వైవిధ్యాన్ని చూపించాడు. భధ్రుని మాటలు విని సీతను పరిత్యజించే సమయంలో బాధను, శృంగార సన్నివేశాల్లో చిలిపిదనాన్ని, కుశలవులతో వాగ్యుద్ధ సమయంలో రామబాణం వైశిష్ట్యాన్ని చెబుతూ  వీరరసాన్ని,సీత భూమిలోకి వెళ్ళిపోయే సమయంలో దుఃఖాన్ని,అసహాయతను స్పష్టంగా పలికించాడు. అతని దురదృష్టమేమిటంటే యాభైయేళ్ళ వయసులో ఈ సినిమా చేసే అవకాశం రావడం. ఫలితంగా కొన్ని క్లోజప్ షాట్స్‌లో ముదిమి ఛాయలు  కనిపిస్తాయి. వెండితెర రాముడిగా వీక్షకుల  గుండెల్లో కొలువుదీరిన ఆ 'తారకరాము' డి  తనయుడు కావటం మరో చిక్కు. ఎలా చేసినా శల్యపరీక్షలు చేసి తేలిగ్గా పెదవి విరిచేసేవాళ్ళూ లేకపోలేదు. సీతా శోకం ప్రధానమైన ఇతివృత్తంలో వియోగియైన భర్తగా విషాదాన్ని మొహాన పులుముకొని, తన శైలికి భిన్నంగా ప్రశాంతంగా సంభాషణలు పలుకుతూ, రౌద్రరసానికి అలవాటు పడిన అభిమానులని అలరించాలి. ఇన్ని ఒత్తిళ్ళను తట్టుకుంటూ కత్తి మీద సాము లాంటి శ్రీరామ పాత్రపోషణలో బాలకృష్ణ కృతకృత్యుడే అయ్యాడు. టాప్‌హీరో సమయంలోనే బాపుతో భగవాన్ శ్రీ కృష్ణ అనే పౌరాణిక చిత్రం ప్లాన్ చేసినా, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీ కృష్ణార్జున విజయం పరాజయం పాలవ్వడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఇప్పటికి అతని కల సాకరమయ్యింది.


 నయనతార నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సీతగా తన పేరును ప్రకటించగానే రకరకాల సందేహాలు వ్యక్తం చేసి బ్యాడ్ ఛాయిస్‌గా తీర్మానించేసిన ప్రేక్షకులందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా నటించి మెప్పించింది. కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతూంటే అటు బాలామణి సీతగా స్వయంవరంలో, ఇటు రాముని పత్నిగా అంతఃపుర సౌధాలలో, శోకగ్రస్తయైన తల్లిగా వాల్మీకి ఆశ్రమంలో పరిణితి చెందిన హావభావలు కనబరిచి ఆకట్టుకుంది. ఆమె ప్రతిభకు గీటురాయిగా నిలిచే ఎన్నో సన్నివేశాలు ఈ చిత్రంలో ఒకదాని వెనుక మరొకటి వస్తూ మంత్రముగ్ధులను చేస్తాయి. బరువైన సన్నివేశాలలో కంటతడి తెప్పించే సత్తా తనకూ ఉందని రుజువు చేస్తూ తన సినీజీవితానికే తలమానికమైన నటన ఈ చిత్రంలో ప్రదర్శించింది. హాట్సాఫ్ 


కుశలవులగా చేసిన చిన్నపిల్లలు ముద్దుగా చేశారు. కుశుడితో పోలిస్తే లవుడికి ముందస్తు సినిమా అనుభవం ఉండటం వలన అతనిలో భావాలు బాగా పలికాయి. బాల హనుమంతుడిగా చేసిన పిల్లాడు కూడా బాగా చేశాడు. బాలనటుల క్యాటెగరిలో వీరిద్దరిలో ఒకరికి అవార్డొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


అక్కినేని నాగేశ్వరరావు గురుంచి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు. ఇటువంటివన్నీ ఆయనకు కొట్టిన పిండి.


లక్ష్మణుడిగా శ్రీకాంత్ ఫర్వాలేదనిపించాడు. సీతను అడవిలో వదిలే సన్నివేశంలో మాత్రం ఇంకాస్త బాగా  చేసుండాల్సిందనిపించింది .


భూదేవిగా రోజా, భరతుడిగా సమీర్, చాకలి తిప్పడుగా బ్రహ్మానందం, ఇతర పాత్రలలో కే.ఆర్ విజయ, మురళీమోహన్, సీనియర్ నటుడు బాలయ్య సరిగ్గా ఇమిడిపోయారు . మర్యాదరామన్నలో నాగినీడుగా మెప్పించిన విలన్ పాత్రధారి ఋష్యశృంగునిగా నటించారు. నారద పాత్రలో ఏవియస్ కూడా కొన్ని సెకన్ల పాటూ తళుక్కున మెరుస్తారు. ఆంజనేయుడి దవడల మేకప్ మాత్రం ఒక్కో సీన్‌లో ఒక్కోలా ఉంది.


దర్శకత్వం విషయానికొస్తే, పచ్చటి ప్రకృతి కాన్వాసుపై వెచ్చటి ఏడు రంగుల ఇంధ్రధనస్సు చెక్కిన విధాతలా వెండితెరపై శ్రీరామరాజ్యాన్ని హృద్యంగా ఆవిష్కరించారు బాపు.  స్వతహాగా గొప్ప చిత్రకారుడు కావటం మూలన సన్నివేశాన్ని ఎంతబాగా ప్రెజంట్ చెయ్యవచ్చో ఆయనకు బాగా తెలుసు. భారీ రాజప్రాసాదాల నుంచి తెలుగుదనం తొణికిసలాడే ముని పర్ణశాలల వరకు  ఆయన ఆభిరుచి ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. కళ్ళను కట్టిపడేస్తుంది. రమణ గారి సంభాషణలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రాముడి ఏకపత్నీవ్రతతని, హనుమంతుని భక్తి తత్పరతని పిట్ట కథల రూపంలో చెప్పారు. రామయణం అంటే రాముని కథ కాదని, రాముడు నడిచిన మార్గమని అందరికీ తెలిపే ప్రయత్నం చేశారు. లవకుశలోని కొన్ని పద్యాలు డైలాగ్స్ రూపంలో అక్కడక్కడా వాడుకున్నారు. గ్రాఫిక్స్ విరివిగా ఉపయోగించారు.

ఇళయరాజా సంగీతం వీనులవిందుగా ఉంది. పాటల విషయంలో మాత్రం కాస్త అసంతృప్తి మిగిలింది. శ్రీరామా లేరా ఓ రామా పాటలో మొదటి చరణం కట్ చేశారు.  శ్రీరామంజనేయ యుద్ధం సినిమాలో మేలుకో శ్రీ రామ పాట చూసి, బాపు ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించి ఉంటారనుకున్నాను. రెండవ చరణం బావున్నా మొదటి చరణం మొత్తం ఎగిరిపోయింది. అలాగే కలయా నిజమా పాటలో పల్లవులెగిరిపోయాయి. ఆల్బంలో నాకు బాగా నచ్చిన రెండు పాటలివి. గాలీ నింగీ నీరు పాటలో కూడా చివరి లైన్లు కనబడవు, వినబడవు. రామాయణము పాట పావుశాతమే ఉంది.  క్లైమాక్స్‌లో  శ్రీరాముడు కుశలవులతో మాట్లడుతూ  శస్త్రవిద్యలలోనే కాదు అస్త్రవిద్యలలో కూడా మీకు నైపుణ్యమున్నదన్న మాట అంటాడు. దీన్ని బట్టి చుస్తే కుశలవులతో రాముడు యుద్ధం చేసిన సన్నివేశాలున్నట్లనిపిస్తుంది. చిత్రవ్యవధిని దృష్టిలో ఉంచుకొని ఎడిటింగ్‌లో ఇవన్నీ తీసేశారో లేక సినిమాలో ఉన్న భాగాలను మాత్రమే షూట్‌చేసారో తెలియదు. అవి కూడా ఉండుంటే ఇంకా బావుండేది.


 తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది . లేకపోతే భవిష్యత్తులో భక్తిరస చిత్రమంటే  క్రియేటివిటీ పేరుతో కేరళలోనో, కౌలాలంపూర్‌లోనో డ్యూయెట్లు పెట్టించి, బొడ్డు పాటల కోసం ఒక పాత్రను సృష్టించి  , బ్రహ్మానందం, ఆలీ , సునీల్‌లతో వెకిలి హాస్యం గుప్పించిన కే.రాఘవేంద్రరావు సినిమాలే గుర్తుకొస్తాయి. ఆ పైన మీ ఇష్టం.


10 comments

November 19, 2011 at 1:43 PM

If not for anything else, atleast for the last sentence you have mentioned in your post, I will definitely watch this movie.
Great review. Thanks!

Reply

మానస గారు, నా సమీక్ష పై గౌరవంతో మీరా మాటన్నందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని నిరాశపరచదనే ఆశిస్తాను.

Reply
November 19, 2011 at 7:32 PM

Great to see your love for Telugu literature. Wish to see many such posts.

Reply
November 19, 2011 at 8:13 PM

ఎంత బాగా రాసారండీ.. Great review!
మీ రివ్యూ చదివాక ఈ సినిమా చూసే అవకాశం లేనందుకు బాధగా ఉంది. :(
పాండురంగ మహత్యం చూసి భయపడిన మా ఇంట్లో వాళ్లకి చెప్తాను ఈ సినిమా చూడమని. :)

Reply
November 19, 2011 at 8:15 PM

I shared your post on my buzz. Hope you won't mind it! :)

Reply
November 19, 2011 at 10:13 PM

ఫస్ట్ డేనే చూసేద్దాం అనుకున్నానండీ.. కుదరలేదు.. అందరూ భలే ఊరించేస్తున్నారు.. బావుందడీ రివ్యూ..

Reply

@ రాకేష్ గారు, కృతజ్ఞతలు.తప్పకుండా ప్రయత్నిస్తాను.
@ మధురవాణి గారు,Thank you.I don't mind .పాండురంగడుతో చాలా మందినే భయపెట్టాడు మన దర్శకేంద్రుడు.ఈ సినిమా చూసైనా కళ్ళు తెరుస్తాడేమో చూడాలి.

@అవిరినేని భాస్కర్ గారు,
థాంక్యూ.

Reply

@రాజ్‌కుమార్‌గారు, ధన్యవాదాలు తప్పకుండా చూడండి.

Reply
November 21, 2011 at 12:27 AM

నేనూ చూసేసా.. నాకు నచ్చింది..

కొన్ని సన్నివేశాలని ఎంత బాగా అస్వాదించామో కొన్ని సన్నివేశాలలో అంతే బాగా నవ్వుకున్నాం.. హాస్య రసాన్ని కూడా ఎక్కడ విడువలేదు బాపు గారు... :)

Reply
Post a Comment