రౌడీయిజం చేస్తున్న రాష్ట్రపతి కావల్సిన నేత




ళ్ళు గడిచే కొద్దీ వయస్సు పెరుగుతుంది.
వయసు పెరిగే కొద్దీ జ్ఞానం రావటం సహజం.
వస్తుందని ఆశించటంలో తప్పులేదు.

కానీ ఇవన్నీ మాములు మనుషులకు వర్తించే అంశాలు.రాజకీయ నాయకులకు కాదు.వాళ్ళు ఇటువంటివాటికి అతీతులు.యుక్తవయస్సులో ఉన్నా ముదిమి మీదపడుతున్నా వాళ్ళ వ్యవహారశైలి ఒకేలా ఉంటుంది.చెప్పేదొకటి చేసేదొకటి.తర్కానికి అందదు.'తొండ ముదిరి ఊసరవెల్లి అయిన'ట్లు వీళ్ళలో కొంతమంది ధోరణి నానాటికీ మరీ దిగజారిపోతూంటుంది.భావితరాలకి దిశానిర్దేశం చెయ్యాల్సిందిపోయి విచక్షణ మరిచిపోయి అకృత్యాలకి తెగబడే ఇలాంటి నేతల్ని చూస్తుంటే అసహ్యం కలగక మానదు.


ఇప్పటికే మీరు గ్రహించి ఉంటారు.


కాంగ్రెస్ కురువృద్ధుడైన కాకా అలియాస్ జి.వెంకటస్వామి గురించే ఇదంతా. కురువృద్ధుడన్న పదం ఇక్కడ ఉపయోగించినందుకు క్షమించాలి. భారతంలో భీష్మ, ద్రోణ, విదురాది వయోవృద్ధులంతా కురుసభలో న్యాయం కోసం పరితపించిపోయారే గానీ, వారే స్వయంగా ఏనాడూ ధర్మాన్ని అతిక్రమించలేదు. కానీ ఇక్కడ గౌరవనీయులైన కాకా గారే ఒక నటుడి స్థలాన్ని( శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కూడా హీరోగా ఒక సినిమాలో నటించాడు) నిర్లజ్జగా కబ్జా చేశారు. కబ్జా చెయ్యటమే కాకుండా ఈ వివాదంలోకి తెలంగాణా వాదాన్ని కూడా లాగారు. సీనియర్ నాయకున్నని, రాష్ట్రపతి కావల్సిన వ్యక్తినని స్వోత్కర్ష చెప్పుకొనే వెంకటస్వామి కబ్జా చెయ్యటం సిగ్గుపడాల్సిన అంశమైతే, దాన్లోకి తెలంగాణా వాదాన్ని లాగి ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టి లాభం పొందాలనుకోవడం పతనమైపోతున్న రాజకీయ విలువలకు పరాకాష్ట.  'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు' అని తన చర్యను సమర్థించుకుంటూ ఆయనిచ్చిన వివరణ వింటే ఆ పార్టీ నేతలంతా తలవంచుకోవాలి. తన స్థలం పక్కనే ఉంది కాబట్టి తననడిగి స్థలం కొనుగోలు చేసుండాల్సిందని ఆయనొక పసలేని వాదన లేవదీశారు. శ్రీకాంత్ తమ్ముడి స్థలమే కాకుండా రెండొందల ఎకరాల దళితుల స్థలాలను కూడా వెంకటస్వామి ఆక్రమించారని అక్కడి గ్రామస్తులు కొందరు ఆరోపించారు.  నిత్యం పదవీ కాంక్షతో తహతహలాడిపోతూ, వైయస్ ఉన్నంతకాలం మింగలేక కక్కలేక ఉండి సందుదొరికితే మైకు ముందుకొచ్చి అవినీతి గురించి లెక్చర్లు దంచిన వెంకటస్వామి నిర్వాకం చూసి, ఇప్పుడు రాష్ట్రప్రజలంతా నోళ్ళు వెళ్ళబెట్టి విస్తుపోతున్నారు.(నేను వైయస్ కు కానీ జగన్ కు కానీ అభిమానిని కాను) కబ్జా చేసిన స్థలంలో టీ.ఆర్.ఏస్. జెండాలను పాతిపెట్టి వివాదంలోకి ప్రాంతీయతత్వాన్ని లాగినా, ఆంధ్రా హీరోల సినిమాల విషయంలో ప్రవర్తించిన రీతిలో కాకుండా తెలంగాణా జె.ఏ.సి, బాధితుడైన శ్రీకాంత్ వైపే నిలబడటం ముదావహం. పోలీసులు కూడా న్యాయం శ్రీకాంత్ వైపే ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.మరోవైపు ఆయన మీద ఇటువంటి ఆరోపణలు కొత్తకాదని పత్రికలు కోడై కూస్తున్నాయి. ఇంత జరిగినా కనువిప్పు కలగని వెంకటస్వామి తాను తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశానని,అటువంటి తనకు సపోర్ట్ ఇవ్వకుండా ఆంధ్రుడైన శ్రీకాంత్ కు సపోర్ట్ ఇవ్వడమేంటని హుంకరిస్తున్నారు. పోలింగ్ శాతం కేవలం యాభైశాతం దాటటానికే ఆపసోపాలు పడే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అటువంటి దేశంలో ఇటువంటి నేతలకు కొదవ లేదు. గుడ్డిలో మెల్ల ఏంటంటే వాళ్ళు  మనదేశానికి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు కాకపోవటం. 

అంతవరకూ మనం అదృష్టవంతులమే.


2 comments

August 22, 2010 at 10:50 PM

మీ లా జరుగుతున్నా నిజాలను చెప్తే అందరూ హర్షిస్తారు ... అది మావలె తెలంగాణా అనుకూలురైనా ..వ్యతిరేకులైనా ... కానీ ఆకాశ రామన్న లాంటి అవివేక బ్లాగర్లు కేవలం కాకా ని బూచి గా చూపి తెలంగాణా వస్తే ఇదే జరుగుతుంది అని ప్రచారం చేస్తున్నాడు...
తెలంగాణా - ఆంధ్ర
దేశంలో రెండవ అతి పెద్ద భాష అయిన తెలుగు వాళ్లకి రెండు రాష్ట్రాలు ఉంటె మనమూ తోడూ నీడ గా ఉండొచ్చు .. రెండు ప్రభుత్వాలతో దేశం లో అతి వేగం గా అభి వృద్ది చెందవచ్చు ...

Reply

కృత గారు,

తెలంగాణా విషయంలో నా అభిప్రాయాలు మీ అభిప్రాయాలతో కలవకపోయినా కాకా చర్యలను మీరూ ఖండించినందుకు కృతజ్ఞతలు.

Reply
Post a Comment