ఈ వారం భాగవతం లోంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
- 1.   అష్టాదశ పురాణాలు వ్యాస భగవానుడే వ్రాశాడు.
- 2.   పరీక్షిత్తు అసలు నామధేయం విష్ణురాతుడు. కలిపురుషుడి వేడుకోలుకు కరిగిపోయి అతను జూదశాలల యందు, మధుశాలల యందు, వ్యభిచారుల యందు, జంతు వధ్యశాలల యందు, బంగారమందు ఉండవచ్చని అభయం ఇస్తాడు. కలి పురుషుడు పరీక్షిత్తు కిరీటంలో ప్రవేశించి, అతని బుద్ధిని పెడత్రోవ పట్టించి, ధ్యానమగ్నుడైన శమీక మహర్షి మెడలో చనిపోయిన త్రాచు పామును వేలాడదీసేలా చేస్తాడు.
- 3.   కురుక్షేత్ర యుద్ధకాలంలో విదురుడు తీర్థయాత్రకు వెళ్ళిపోతాడు.
- 4.   హిరణ్యాక్ష, హిరణ్యకశిపులలో హిరణ్యకశిపుడు పెద్దవాడు. తన కొడుకులిద్దరూ విష్ణువు చేతిలో మరణిస్తారని దితికి ముందే తెలుసు. ఆయన భయంతోనే వాళ్ళను 100 సంవత్సరాలు గర్భంలో దాచుకుంటుందామె.
- 5.   అనుహ్లాదుడు, సమ్హ్లాదుడు, హ్లాదుడు ప్రహ్లాదుని సోదరులు.
- 6.   ప్రహ్లాదుని మనవడు రాహువు. అతని తల్లి సింహిక. అమృతం పంచే సమయంలో రాహువు మారువేషంలో దేవతల వరుసలో కూర్చున్నాడని మోహినీ అవతారమెత్తిన విష్ణువుకు ముందే తెలుసు. అయినా వరుసలో కూర్చున్నవాడిని లేపడం ధర్మం కాదు కాబట్టి, అతను అమృతం తాగిన వెంటనే, అది గొంతు దిగక ముందే అతని శిరస్సుని ఉత్తరిస్తాడు. అయితే అమృతం మింగిన శిరస్సు అమరత్వం పొందింది కాబట్టి గ్రహస్థితిని కల్పిస్తారు.
- 7.   గజేంద్రుని భార్యలు 10లక్షల కోట్ల ఆడేనుగులు. గజేంద్రుడు వేయి సంవత్సరాల పాటూ మొసలిపట్టులో ఉండి పోరాడుతాడు. ఆ తర్వాత ఓపిక సన్నగిల్లి విష్ణువుని శరణు వేడితే, ఆయన ఆఘమేఘాల పై వచ్చి రక్షిస్తాడు.
- 8.   వృత్తాసురుని కంఠాన్ని వజ్రాయుధంతో కొయ్యటానికి ఇంద్రునికి దాదాపు ఒక సంవత్సర కాలం పట్టింది.
- 9.   నముచి అనే రాక్షసుడు అటు తడి, ఇటు పోడి కాని వస్తువు ద్వారా మరణించాలని కోరుకుంటే, దేవేంద్రుడు సముద్రపు నురగలో వజ్రాయుధం ముంచి అతన్ని సంహరిస్తాడు.
- 10.   బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి.
- 11.   దుర్వాసో మహర్షి భార్య కందళియే కదళీ వృక్షం (అరటి చెట్టు) గా రూపుదాల్చింది. ఆమె ఔర్వుడనే మహర్షి కూతురు. తలబిరుసు ఎక్కువ. ఆమె విషయం ముందే చెప్పి దుర్వాసో మహర్షికిచ్చి వివాహం జరిపిస్తాడు ఔర్వుడు. చాలా కాలం ఆమె ప్రవర్తన భరించిన దుర్వాసో మహర్షి ఒక రోజు ఆమె చెప్పిన పని చెయ్యకపోయేసరికి ఆగ్రహించి భస్మీపటలం చేస్తాడు. విషయం తెలుసుకున్న ఔర్వుడు కోపించి ఒక రాజర్షి ( అంబరీషుడు) చేతిలో ఘోరావమానం పొందుతావని శాపమిస్తాడు. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన దుర్వాసో మహర్షి ఆమె వృక్షంగా జన్మించి అమృతతుల్యమైన ఫలాలిస్తుంది వరమిస్తాడు.
- 12.   కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు.దేవాసుర సంగ్రామంలో అతన్ని సుదర్శనచక్రంతో సంహరిస్తాడు శ్రీమహావిష్ణువు.అసుర గురువు శుక్రాచార్యుడు మృతసంజీవనీ విద్యతో అతన్ని తిరిగి బ్రతికిస్తాడు. రోషిల్లిన కాలనేమి, తీవ్రమైన తపస్సు చేసి విష్ణువు చేతిలో కానీ, ఇతర ఏ దేవతల చేతిలో కానీ మరణం కలగకుండా బ్రహ్మ దగ్గర వరం పొందుతాడు.కంసుడిగా జన్మిస్తాడు.అతను కోరుకున్నది విష్ణువు చేతిలో కానీ ఇతర ఏ దేవతల చేతగానీ మరణం సంప్రాప్తించకూడదని. అందుకు తగ్గట్టుగానే భగవంతుడు విష్ణు రూపంలో అతన్ని పరిమార్చకుండా, కృష్ణావతారం ఎత్తి అతన్ని నిర్జిస్తాడు.
- 13.   కంసుడు మహాపరాక్రమశాలి.తను యువరాజవగానే దిగ్విజయ యాత్ర ప్రారంభించి అన్ని దేశాలూ గెలుస్తాడు. యాత్రలో భాగంగా జరాసంధుని రాజధాని చేరుకున్నప్పుడు, అతను కువలయపీడం అనే మత్తగజాన్ని కంసునిపై పురిగొల్పుతాడు.కంసుడు రెండు చేతులతో దాన్ని ఒడిసిపట్టి గిరగిరా త్రిప్పి అది జరాసంధుని సభాప్రాంగణంలో పడేలా విసిరేస్తాడు. జారాసంధుడు అతని బలపరాక్రమాలకి ముగ్ధుడై తన కూతుళ్ళైన అస్థి, ప్రాప్తిలను అతనికిచ్చి వివాహం చేస్తాడు. అస్థి మొహం ఎప్పుడూ ఇంకాసేపట్లలో తుమ్మబోయేలా ఉంటే, తుమ్మిన తర్వత మొహం ఎలా ఉంటుందో ప్రాప్తి మొహం అలా ఉంటుంది.
- 14.   కంసుడు ఆ తర్వాత చాణూర ముష్టికాదులను ఓడించి వారిని తన అనుచరులుగా మార్చుకుంటాడు.అదే ఊపులో వానరుడైన ద్విందుడుని, ఋష్యమూక పర్వతంపై నివశిస్తున్న కేశి ని ఓడించి వారితో సఖ్యం ఏర్పరుచుకుంటాడు.ఆ తర్వాత మహేంద్రపర్వతం వెళ్ళి పరశురాముని కవ్విస్తే, ఆయన తన ధనస్సు అతనికిచ్చి ఎక్కుపెట్టమంటాడు. కంసుడు అలవోకగా ఆ ధనువు చేతబట్టి ఎక్కుపెడితే, ఆ ధనస్సుని అతనికే ఇచ్చివేసి, మహావిష్ణువు పరిపూర్ణావతారం అతని అంతఃపురానికి వచ్చి దాన్ని తిరిగి ఎక్కుపెట్టగలదని, ఆ అవతారం చేతిలో మరణం తధ్యమని చెబుతాడు.
- 15.   ప్రజాపతి సుతపుడు,అతని భార్య పృష్ణి పన్నెండువేల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి మహావిష్ణువునే కొడుకునుగా పొందే వరం పొందుతారు. మూడు జన్మలలో వారి కొడుకై జన్మించి వారిని తరింపచేస్తాడు నారాయణుడు.మొదట సుతపుడు-పృష్ణి దంపతులకు పృష్ణిగర్భుడిగా,తర్వాత అదితి,కశ్యపులకు వామనుడిగా, పిదప దేవకీ వసుదేవులకు శ్రీ కృష్ణుడిగా జన్మిస్తాడు.
- 16.   కంసుని చేత వధింపబడిన ఆరుగురు దేవకి వసుదేవ పుత్రులకు ఒక శాపముంది. వారు గతంలో మరీచి, ఊర్ణాదేవి అనే ఋషి దంపతుల పిల్లలు. ఒకసారి సత్యలోకం వెళ్ళి బ్రహ్మదేవుని చూసి నవ్వటంతో రాక్షసులై పుట్టండని ఆయన శపిస్తాడు. అలా మొదట కాలనేమి (కంసుని పూర్వజన్మ) పుత్రులుగా జన్మిస్తారు.తర్వాత హిరణ్యకశిపుని తనయులుగా పుడతారు. ఆ జన్మలో గొప్ప తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి దీర్ఘాయువును వరంగా పొందుతారు. తనకులేని దీర్ఘాయువు తన కొడుకులు పోందటంతో హిరణ్యకశిపుడు ఆగ్రహించి మీరంతా దీర్ఘనిద్రలో ఉండి చనిపోతారని, పూర్వజన్మలో మీ తండ్రే రాబోయే జన్మలో మిమ్మల్ని చంపుతాడని శపిస్తాడు.
(మిగతా విశేషాలు తరువాతి టపాలో)
3 comments
teliyani vishyaalu chala chepparandi..chala baavundi..good
ReplyKeep it up
chaalaa vishayaalanu telipaaru anDi. dayachEsi ee Tapanu konasaaginchagalaru.
Reply@ కార్తీక్‌చంద్ర గారు, థాంక్యూ
Reply@ సందీప్ గారు, తప్పకుండా