హిందూ దేవుళ్ళకి మీసాలు,గెడ్డాలు ఎందుకుండవో నాకర్థం కాదు. ఒక్క యమధర్మరాజు తప్ప మిగతా అందరూ క్లీన్‌షేవ్‌తో కనిపిస్తూంటారు. యమధర్మరాజుకి కూడా , ఆయన వృత్తిధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని కాస్త భయంకరంగా కనిపించాలని బుర్ర మీసాలు ఏర్పాటు చేసారు కానీ మరోకారణం చేత కాదు. బృహస్పతి దేవగురువు, వయస్సులో గురువు సహజంగా శిష్యులకంటే పెద్దవాడు కాబట్టి ఆయనకీ విషయంలో మినహాయింపు నిచ్చారు. సూర్యభగవానుడికి, శనేశ్వరుడికి, ఖగరాజైన గరుత్మంతుడికి కొంతమంది మీసాలు పెట్టి సంతోషించారు కానీ తతిమ్మా దేవగణం అంతా మీసాలు లేని మగరాయుళ్ళ బ్యాచే.
త్రిమూర్తుల విషయానికి వస్తే సృష్తికర్తైన బ్రహ్మను, లయకారకుడైన శంకరున్ని మనవాళ్ళు కరుణించి అప్పుడప్పుడు వారికి మీసాలు,గెడ్డాలు తగిలించారు. స్థితికారుడైన మహావిష్ణువును మాత్రం పట్టించుకోకుండా వదిలేశారు. తనకున్న కోట్లాది ఆలయాల్లో ఆయనెక్కడా మీసాలతో దర్శనమిచ్చిన దాఖలాలు లేవు (ఒక్క శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు గుడిలో తప్ప). క్షత్రియుడైన శ్రీరాముడిని, యదువంశీయుడైన శ్రీకృష్ణుడిని నూనూగు మీసాలు కూడా రాని పసిబాలకులలా చిత్రీకరించారు. పోనీ పురాణాలు,ఇతిహాసాలలో అలా వ్రాసుందా అంటే అదీ లేదు. వాల్మీకి రామయణంలోనే వనవాసం రోజుల్లో రాముడికి మీసాలున్నాయని అనుకోవటానికి ఆధారాలున్నాయి. అరణ్యకాండలో, బంగరులేడిగా రుపుదాల్చకముందు రావణుడికి హితబోధ చేస్తూ మారీచుడు,' శ్రీరాముడు మీసాలు గెడ్డాలు రాని పన్నెండేళ్ళ ప్రాయంలోనే ఒక్క బాణంతో తనను కొన్ని యోజనాల అవతల పడేలా కోట్టాడ'ని చెబుతాడు.ఇక ప్రముఖ సాహితీవేత్త, చరిత్రకారులు కీ.శే.సురవరం ప్రతాపరెడ్డిగారైతే భగవద్గీత బోధించేనాటికి శ్రీకృష్ణుడి వయస్సు దాదాపు ఎనభై యేళ్ళని లెక్కగట్టారు. అలాగే శ్రీరాముడు దాదాపు పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అవతార స్వరూపుడైనా,నరుడిగా ప్రవర్తిస్తూ ధర్మబద్ధంగా గడిపిన రాముడు కూడా ఏ చిత్రపటంలోనూ మీసాలతో కనిపించడు. రవివర్మ లాంటి చిత్రకారుల చిత్రాలే కాదు,ప్రాచీన శిల్పులు మలచిన శిల్పాలు సైతం అలానే ఉన్నాయి. దీనికి కారణాలేమిటో తెలియదు. ఆగమశాస్త్ర నియమాలేమైనా దేవుళ్ళకు మీసాలు,గెడ్డాలు నిషేదించాయేమో తెలియదు. వేదాలేమైనా ఈ ప్రస్తావన చేశాయా అంటే అదీ అనుమానమే. విజ్ఞులైన చదువరులు ఈ విషయమై సమాచారాన్ని పంచుకుంటే సంతోషిస్తాను.
ఈ లోగా రెక్కలు,కాళ్ళు తెగి రక్తమోడుతున్న 60వేల సంవత్సరాల వయోవృద్ధుడు జటాయువును పరామర్శిస్తున్న మీసాల రామలక్ష్మణులను ఇక్కడ చూడండి.
12 comments