హిందూ దేవుళ్ళకి మీసాలు,గెడ్డాలు ఎందుకుండవో నాకర్థం కాదు. ఒక్క యమధర్మరాజు తప్ప మిగతా అందరూ క్లీన్‌షేవ్‌తో కనిపిస్తూంటారు. యమధర్మరాజుకి కూడా , ఆయన వృత్తిధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని కాస్త భయంకరంగా కనిపించాలని బుర్ర మీసాలు ఏర్పాటు చేసారు కానీ మరోకారణం చేత కాదు. బృహస్పతి దేవగురువు, వయస్సులో గురువు సహజంగా శిష్యులకంటే పెద్దవాడు కాబట్టి ఆయనకీ విషయంలో మినహాయింపు నిచ్చారు. సూర్యభగవానుడికి, శనేశ్వరుడికి, ఖగరాజైన గరుత్మంతుడికి కొంతమంది మీసాలు పెట్టి సంతోషించారు కానీ తతిమ్మా దేవగణం అంతా మీసాలు లేని మగరాయుళ్ళ బ్యాచే.
త్రిమూర్తుల విషయానికి వస్తే సృష్తికర్తైన బ్రహ్మను, లయకారకుడైన శంకరున్ని మనవాళ్ళు కరుణించి అప్పుడప్పుడు వారికి మీసాలు,గెడ్డాలు తగిలించారు. స్థితికారుడైన మహావిష్ణువును మాత్రం పట్టించుకోకుండా వదిలేశారు. తనకున్న కోట్లాది ఆలయాల్లో ఆయనెక్కడా మీసాలతో దర్శనమిచ్చిన దాఖలాలు లేవు (ఒక్క శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు గుడిలో తప్ప). క్షత్రియుడైన శ్రీరాముడిని, యదువంశీయుడైన శ్రీకృష్ణుడిని నూనూగు మీసాలు కూడా రాని పసిబాలకులలా చిత్రీకరించారు. పోనీ పురాణాలు,ఇతిహాసాలలో అలా వ్రాసుందా అంటే అదీ లేదు. వాల్మీకి రామయణంలోనే వనవాసం రోజుల్లో రాముడికి మీసాలున్నాయని అనుకోవటానికి ఆధారాలున్నాయి. అరణ్యకాండలో, బంగరులేడిగా రుపుదాల్చకముందు రావణుడికి హితబోధ చేస్తూ మారీచుడు,' శ్రీరాముడు మీసాలు గెడ్డాలు రాని పన్నెండేళ్ళ ప్రాయంలోనే ఒక్క బాణంతో తనను కొన్ని యోజనాల అవతల పడేలా కోట్టాడ'ని చెబుతాడు.ఇక ప్రముఖ సాహితీవేత్త, చరిత్రకారులు కీ.శే.సురవరం ప్రతాపరెడ్డిగారైతే భగవద్గీత బోధించేనాటికి శ్రీకృష్ణుడి వయస్సు దాదాపు ఎనభై యేళ్ళని లెక్కగట్టారు. అలాగే శ్రీరాముడు దాదాపు పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అవతార స్వరూపుడైనా,నరుడిగా ప్రవర్తిస్తూ ధర్మబద్ధంగా గడిపిన రాముడు కూడా ఏ చిత్రపటంలోనూ మీసాలతో కనిపించడు. రవివర్మ లాంటి చిత్రకారుల చిత్రాలే కాదు,ప్రాచీన శిల్పులు మలచిన శిల్పాలు సైతం అలానే ఉన్నాయి. దీనికి కారణాలేమిటో తెలియదు. ఆగమశాస్త్ర నియమాలేమైనా దేవుళ్ళకు మీసాలు,గెడ్డాలు నిషేదించాయేమో తెలియదు. వేదాలేమైనా ఈ ప్రస్తావన చేశాయా అంటే అదీ అనుమానమే. విజ్ఞులైన చదువరులు ఈ విషయమై సమాచారాన్ని పంచుకుంటే సంతోషిస్తాను.
ఈ లోగా రెక్కలు,కాళ్ళు తెగి రక్తమోడుతున్న 60వేల సంవత్సరాల వయోవృద్ధుడు జటాయువును పరామర్శిస్తున్న మీసాల రామలక్ష్మణులను ఇక్కడ చూడండి.
12 comments
భలే ప్రశ్న! :)
Replyమన నాటక రంగమ్మీద ఒక మీసాల కృష్ణుడు ఉండేవారు, పేరు గుర్తు లేదు.
ఒక పిట్టకథ: ఒక జమీందారుగారికి ఇలా మీకొచ్చిన డౌటే వచ్చింది. దాంతో భారత భాగవతాల మీద చాలా పరిశోధన చేసి శ్రీకృష్ణుడికి చక్కగా మీసాలు ఉన్నాయి అని నిర్ధారించుకున్నారు. నిర్ధారించడమేవిటి, ఒక నిలువెత్తు చిత్రపటం తయారు చేయించి తమ దర్బారు హాల్లో పెట్టించారు. ఇహ వచ్చిన ప్రతివాళ్ళూ ఆయన్ని - ఈ పటం ఎవరిదండీ మీ తాతగారిదా, ముత్తాత గారిదా, కిరీటం అదీ పెట్టారు కాబట్టి ఇంకా పూర్వీకులదేమో - అని అడుగుతూ ఉండేవారుట.
రాముడు, కృష్ణుడు వీళ్ళంతా ఉత్తర భారత దేశానికి చెందినవారు కదండీ! అదొక కారణమేమో!
Replyచాలా బాగా వ్రాశారు, సమధానాలు ఉన్నాయో లేదో తెలిని ఇలా౦టి ప్రశ్నలు మనని ఆలోచి౦పచేస్తాయి అనడ౦ లొ స౦దేహ౦ లెదు ...నా అభిప్రాయాలు మరో సారి (వ్యాఖ్య) వ్రాయగలను ..
Replyhttp://kalagooragampa.blogspot.com/2009/09/blog-post_27.html
Replyభగవంతుడు మనకు అర్చనకు అనువుగా ఒక రూపాన్ని అందించాడు. మీసాలు, గడ్డాలు, యవ్వనం, వ్రుధ్ధాప్యం లాంటి శరీర ధర్మాలు ఆయనకు ఉండవు. అందుకని మన పెద్దలు అలా ఊహించి ఉండవచ్చు.
Reply@కొత్తపాళీ గారు,
Replyనిజమేనండి. ఆయన పేరు గుర్తు రావటం లేదు.బళ్ళారి రాఘవ కాదు కదా? దేవుళ్ళ విషయంలో ఒక మూర్తికి అలవాటు పడ్డాక,దానికి కొంత మార్పులు చేర్పులు చేస్తే అంత త్వరగా మనస్సంగీకరించదనడానికి జమిందారు కథ ఒక ఉదాహరణ.చెన్నైలోని పార్థసారథి గుడిలో కూడా శ్రీకృష్ణుడికి మీసాలున్నాయట, ఇందాకే తెలిసింది.
@నీలాంచల గారు,
దశరథుడు,వసుదేవుడు కూడా ఉత్తరభారతీయులే. వారికున్న మీసాలు గెడ్డాలు వారి పుత్రులైన రామకృష్ణులకు ఎందుకు లేవు ?
@ uiyoiu గారు,
ధన్యవాదాలు.
@ అభిషేక్ చౌదరి గారు, మంచి టపా.
ఉషశ్రీ గారు రామకృష్ణులకు మీసాలు,గెడ్డాలు ఉన్నాయని సమాధానం ఇచ్చినట్లు గుర్తు..అయితే వనవాసమయ్యాక రాముడు గెడ్డాన్ని త్యజించాడన్నమాట.
@సంజయ్ గారు,
మిగతా అవతారాల విషయంలో మీ వాదన అంగీకారయోగ్యంగా ఉన్నా రాముడి మాటేమిటి? ఆయన దైవమే అయినా జివితమంతా ఏ మహిమలూ చూపకుండా నరుడిగానే ప్రవర్తించాడు కదా ?
చాలా బాగా వ్రాశారు .. మా ఊరి వేణుగోపాలస్వామికి మీసాలున్నాయి .. అలానే మన అన్నవర సత్యనారాయణ స్వామికి కూడా మీసాలుంటాయి ..
Replyసురేష్ మోహన్ గారు
Replyథాంక్యూ.అన్నవరం సత్యనారాయణ స్వామి గురుంచి మర్చేపోయాను
అప్పుడు చవరం చాల చీపనుకుంటాను . పైగా మీసం గీకేత్తే గడ్డం ఫ్రీ అనే ఆఫర్ కూడా ఉంది ఉండవచ్చు. సో క్లీన్ అండ్ గ్రీన్
ReplySreekanth garu,
ReplyMana divam Tirumala Venkanna ki kooda geddalu meesalu vunnayani grbhagudi lo pooja chese vallu chepparani oka naanudi.Kanni ee prasna ki evaruu samadhanam cheepale except mana cinema vallu.Anduke annamayya meesalatho ika Ramadasu kooda kanapaddaru.
life is beautifull గారు :-)
Replyసుధ గారు,వెంకటేశ్వరస్వామి వారి విగ్రహానికి మీసాలున్నాయన్నే విషయం మొదటిసారి వింటున్నాను.
బహుశా రాముడు,క్రిష్నుడు....మిగతా అవతారాలు తనే అని గుర్తించాడనికి విష్ణువే భక్తులకి ఒక క్లూ ఇచ్చాడేమో...
Reply