ముందుగా నేను గీసిన శాలివాహన చిత్రం చూడండి.
తర్వాత ఈ క్రింది వీడియోలోని ఆంధ్రప్రదేశ్ థీంసాంగ్‌ని జాగ్రత్తగా చూడండి.0:52 నిమిషాల దగ్గర నా పెయింటింగ్ కనిపిస్తుంది.
ఈ వీడియోను ఎవరు కంపోస్ చేశారా అని వెదికితే ఈ వివరాలు కనిపించాయి.
గేయ రచయిత :సాహిత్య సాగర్
సంగీతం:నరేష్
గాయనీ గాయకులు:అంజనా సౌమ్య, శ్రావణ భార్గవి, పవన్
ఎడిటర్:వంశీ
దర్శకుడు:వాసు
నిర్మాణం:టీంవర్క్స్
ఈ సంగతి నాకు ఆలస్యంగా,అదీ కాకతాళీయంగా తెలిసింది. ఫేస్‌బుక్‌లో మా తమ్ముడు పెట్టిన వీడియోల్లో ఇదొకటి. ఏమిటా అని చూస్తే పాట మొదట్లోనే నేను గీసుకున్న బొమ్మ కనిపించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. నేనెవరో తెలియకపోయినా, నేను గీసిన బొమ్మను ఈ వీడియో పుణ్యమా అని కొన్నివేలమంది చూడగలిగారు. ఉబుసుపోక నేను గీసుకున్న చిత్రాన్ని, బ్లాగ్‌లోంచి ఏరుకొని, ఆ చిత్రానికి మనరాష్ట్రానికి చెందిన థీంసాంగ్‌లో స్థానం కల్పించి, దానికొక గౌరవాన్ని కల్పించిన వారికి నా కృతజ్ఞతలు.
పాటలు విని మమకారం పెంచుకున్న సినిమాల్లో రాధాకళ్యాణం ఒకటి. ఆ రోజుల్లో ఇంటింటికీ టి.వీలు గట్రా ఉండేవి కావు కాబట్టి అన్నిటికీ టేప్‌రికార్డరే దిక్కు. మా ఇంట్లో మర్ఫీ కంపేని వారి టేప్‌రికార్డర్ ఉంది. దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని శతృదుర్భేధ్యమైన కోటలాగా అదింకా పనిచేస్తూ పాటలు వినిపిస్తూనే ఉంది. ఒకట్రెండు సార్లు రిపేర్ల పేరుతో దండయాత్రలు జరిగాయి కానీ అవేవీ మూలాన్ని సమూలంగా నాశనం చెయ్యలేకపోయాయి. అప్పట్లో మా నాన్నగారి దగ్గర మంచి పాటల కలెక్షన్ ఉండేది. ఆయనకి నటీనటులతో సంబంధం లేదు. సంగీతం సాహిత్యం సమపాళ్ళలో కలిసిపోయిన మంచి పాటేదైనా వినబడితే వెంటనే రికార్డు చేయించి పట్టుకొచ్చేవారు. అలా పోగైన క్యాసెట్లన్నీ ఒకదాని మీదొకటి పేర్చి ఒక అరలో అందంగా అమర్చేవారు. నాకు పాటలు వినాలనిపించినప్పుడల్లా వాటినన్నిటినీ తీసి ముందేసుకొని కొత్తపాటలు, వినని పాటలు ఏవైనా ఉన్నాయాని వెదికేవాన్ని. వేరుచేసిన క్యాసెట్లను ఒక్కక్కటే ప్లే చేస్తూ ప్రతి పాటలో పల్లవులు వినేవాన్ని. ఆకట్టుకొనేలా ఉంటే అది ఆటోమేటిక్‌గా నా ప్లేయింగ్ లిస్ట్‌లోకి వెళ్ళిపోయేది. అలా పరిచయమైన పాటలతో ఇష్టాన్ని పెంచుకున్న సినిమా ఇది. పరిచయమైన చాలా కాలానికి ఈ సినిమాని చూశాను. నిన్న మళ్ళీ చూశాను.
చంద్రమోహన్, రాధిక, శరత్‌బాబు నటించిన ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రానికి స్వర్గీయ ముళ్ళపూడి వెంకటరమణ సంభాషణలు సమకూరిస్తే, బాపు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మాతృక కే.భాగ్యరాజా నటించి దర్శకత్వం వహించిన తమిళ చిత్రం అంత ఎజు నాట్కళ్. శోభనపు గదిలో విషం తాగి ఆత్మహత్యాప్రయత్నం చేసిన రాధ (రాధిక)ను, డాక్టరైన ఆమె భర్త ఆనంద్ (శరత్‌బాబు)రక్షిస్తాడు. తోలిరాత్రి ఒక ఆడపిల్ల చావడానికి సిద్ధపడిందంటే దానికి పెళ్ళంటే ఇష్టం లేకపోవటమే ఏకైక కారణమని, స్నేహితుడిలా భావించి జరిగిందంతా తనతో చెప్పమని అడుగుతాడు ఆనంద్. రాధ తన కథను చెప్పటం మొదలుపెడుతుంది.
తమిళ బ్రాహ్మణుడైన పాల్ఘాట్ మాధవన్ (చంద్రమోహన్) మ్యూజిక్ డైరెక్టరవుదామని పొట్టచేతబట్టుకొని హైదరాబాదులో దిగుతాడు. ' తాదూర సందులేదు మెడకో డోలన్నట్లు ' అతనికి తోడు శిష్యుడైన ఒక చిన్నపిల్లవాడు. ఇద్దరూ కలిసి ఇల్లు కోసం వెదుక్కుంటూ వచ్చి రాధ వాళ్ళింట్లో మేడ మీద గదిలో అద్దెకు దిగుతారు. రోజూ అవకాశాల కోసం కాళ్ళచెప్పులరిగేలా తిరిగి తిరిగి అరకొర తిండితో నెట్టుకొస్తూ రాత్రికి ఇల్లు చేరుతూంటారు . రాధ పేదింటి పిల్ల. తండ్రి ఇల్లులొదిలేసి వెళ్ళిపోతే, తల్లి, చెల్లెలు, తమ్ముళ్ళలో కలిసి తాత పంచనే ఉంటూ కాలం వెళ్ళదీస్తూంటుంది. మంచివాడు, అమాయకుడు తనలాగే నిరుపేదైన మాధవన్ వ్యక్తిత్వం ఆమెను ఆకట్టుకుంటుంది. అతని కష్టాలకు జాలిపడి తన బంగారు గాజు తాకట్టు పెట్టి సాయం చేయబోతుంది. మాధవన్ తన వాచినమ్మి ఆమె గాజును విడిపిస్తాడు. తన పేదరికం కారణంగా ఆమె ప్రేమను పట్టించుకోనట్లు మొదట నటించినతను ఆమె నిజాయితీకి మనస్సు మార్చుకుని తనూ ప్రేమించడం మొదలుపెడ్తాడు.
విధురుడై (భార్యను కోల్పోయి) ఆరేళ్ళ పాపకు తండ్రైన డాక్టర్ ఆనంద్‌తో రాధకు పెళ్ళి నిశ్చయం చేస్తాడు ఆమె తాత. రాధ ఎదురు తిరిగి దెబ్బలు తింటుంది. లేచిపోడానికి సిద్ధమైతే మాధవన్ ఆమెను ఓదార్చి ' రాత్రి రహస్యంగా దేవాలయంలో పెళ్ళిచేసుకుని తిరిగి వచ్చి ప్రొద్దున్న అంతా చెప్పి పెద్దల ఆశీస్సులు తీసుకుందా' మని చెబుతాడు. ఇద్దరూ దేవాలయంలో ఉండగా, మనుషులతో మాధవన్ పై దాడిచేయించి రాధను తీసుకువెళ్తాడు ఆమె తాతయ్య. గుట్టుచప్పుడు కాకుండా ఆమె పెళ్ళి ఆనంద్‌తో జరిగిపోతుంది.
రాధ కథనంతా విన్న డాక్టర్ ఆనంద్, ఆమెను మళ్ళీ మాధవన్‌తో కలిపే బాధ్యతను తన భుజాన వేసుకుంటాడు. చావుబ్రతుకుల మధ్యనున్న తన తల్లి కోరిక మేరకే తను మళ్ళీ వివాహం చేసుకున్నానని, ఆమె మరణించేవరకూ ఆమె మనస్సు నొప్పించకుండా కోడలిగా మసలుకొంటే చాలని చెబుతాడు. తాకట్టులో ఉన్న రాధ వాళ్ళింటిని విడిపించి ,ఆమె చెల్లెలికి ఉద్యోగం ఇప్పించి, అవిటివాడైన తమ్ముడికి కృత్రిమ కాలుని ఏర్పాటు చేయిస్తాడు. క్రమక్రమంగా ఆరేళ్ళ పాపకు, అత్తకు రాధ దగ్గరవుతుంది. గాయాల నుంచి కోలుకొని మళ్ళీ అవకాశాల వేటలో రోడ్డున పడ్డ మాధవన్‌ను సినిమా తీసే నెపంతో ఆనంద్ చేరదీసి తన గెస్టవుస్‌లో ఆశ్రయం కల్పిస్తాడు. తమ ముగ్గురి కథనే సినిమా కథగా చెబుతూ క్లైమాక్స్ ఎలా ఉంటే బావుంటుందని అడుగుతాడు. భర్తతో ఉండిపోతేనే బావుంటుందని మాధవన్ చెబితే, ప్రేమించిన ప్రియుడి దగ్గరికి చేరడమే ఉత్తమ పరిష్కారమని ఆనంద్ వాదిస్తాడు.
ఆనంద్ తల్లి మరణిస్తుంది. అడ్వాన్సిచ్చే నెపంతో మాధవన్‌ని ఇంటికి పిలిపిస్తాడు ఆనంద్. రాధను ఆ ఇంట్లో చూసిన మాధవన్‌కి విషయం అర్థమవుతుంది. ఆమె అతనితో ఉండటమే ఉత్తమమని, సినిమాలు వేరు జీవితం వేరని చెబుతాడు.ఆనంద్ మొండిగా వాదిస్తే కట్టిన తాళిని విప్పేస్తే ఆమెను తనతో తీసుకువెళ్తానంటాడు. బలవంతంగా తాళి తియ్యబోయిన ఆనంద్‌ను రాధ ప్రతిఘటిస్తుంది. 'ఇదే మన కథ. మన జాతి కథ. నీతి కథ ' అని చెప్పి నిండు మనస్సుతో ఆశీర్వదించి వెళ్ళిపోతాడు మాధవన్. రాధ ఆనంద్ ఒక్కటవ్వంతో కథ ముగుస్తుంది.
విజయవంతమైన తమిళ కథను తెలుగులో చక్కగా తీర్చిదిద్దారు బాపు గారు. బాపు బొమ్మగా రాధిక, తమిళ బ్రాహ్మణుడిగా చంద్రమోహన్, డాక్టర్‌గా శరత్‌బాబు పోటిపడి నటించారు. ముళ్ళపూడి వారి మాటలు తూటాల్లా పేలాయి. ముగింపులో మాధవన్ పాత్రలో చంద్రమోహన్ చెప్పే డైలాగ్ నాకు బాగా నచ్చింది.' పెళ్ళి కాని అమ్మాయి మనస్సు అద్దం లాంటిది. అందులో చానా మూఖాలు కనిపిస్తాయి.కాని తనకి తాళి కట్టిన తర్వాత అదే మనస్సు పటం గా మారిపోతుంది .అందులో ఒకే దేవుడు. భర్త. అది మీరు .మన కథకు ఇదిదా కరక్టు క్లైమాక్సు .ఇది ఓల్డు కావచ్చు కానీ ఇదిదా గోల్డు.' ఎంత అమూల్యమైన మాటలివి.
కే.వి.మహాదేవన్ స్వర గాంధర్వాలకు అందమైన సాహిత్యాన్ని సమకూర్చి పాటలను అజరామరం చేశారు సి.నారాయణరెడ్డి గారు,జ్యోతిర్మయి గారు.చిటికెయ్యవే చినదాన, చేతికి గాజుల్లా, కలనైనా క్షణమైనా, ఏం మొగుడో..ఇలా ప్రతి పాటా ఆణిముత్యమే. ' చేతికి గాజుల్లా, కళ్ళకు కాటుకలా, నుదుటికి తిలకంలా, రాధకు మాధవుడు' అన్న వాక్యాలు విని ఇది ఖచ్చితంగా వేటూరి గారే వ్రాసుంటారని అనుకున్నాను. జ్యోతిర్మయి గారని తెలిసి తెల్లబోయాను.
తెలుగులో కూడా ఘనవిజయం సాధించిన ఈ సినిమాను బాపుగారి దర్శకత్వంలోనే 'వో సాత్ దిన్' అనే పేరుతో హిందిలో పునర్నిర్మించారు. పద్మినీ కొళాపురి, అనిల్‌కపూర్(చంద్రమోహన్), నసీరుద్దీన్‌షా ముఖ్యభూమికలు పోషించారు.అక్కడ కూడా విజయ కేతనం ఎగరవేసింది.
Subscribe to:
Posts (Atom)
5 comments