నా ఉప్మా ప్రహసనం !!


' ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్ '  అని ముక్క తిమ్మన అన్నాడు గానీ నిజానికి ఏ ముద్దూ మురిపెం లేకపోయినా ఎటువంటి విద్యనైనా చాలా వీజీగా ఔపోసన పట్టేసే ధీరోదాత్తులు కార్యశూరులు మగవాళ్ళని నా ప్రగాఢ విశ్వాసం. అలాంటిది వంట విషయమైతే ఇక చెప్పక్కర్లేదు. మగపుంగవుల సామర్థ్యత ముందు ఆడవాళ్ళ నైపుణ్యం ఏ పాటిది? పైగా దానికి తిరుగులేని సాక్ష్యాధారాలు మనకి ఉండనే ఉన్నాయి. నలభీమపాకం అన్నారు గాని సీతా, ద్రౌపదీ పాకాలని ఎవరూ అనలేదు కదా? అసలంతవరకూ దేనికి? తెలుగు టి.వీ. ఛానాల్స్‌లో మధ్యాహ్నమయ్యేసరికి సహజ కవచ కుండలాల్లాంటి తెల్లటి కోటు, తలపై కిరీటం లాంటి టోపీ పెట్టుకొని దండయాత్ర చేసి వచ్చిన వీరాగ్రేసరుల్లా మగవాళ్ళు నోరూరే రకరకాల వంటలు ఎలా చెయ్యలో నేర్పుగా చేసి చూపెడుతూంటే, పక్కనే నిలబడి పళ్ళికిలిస్తూ మధ్య మధ్యలో ' బాణలిలో నూనె వెయ్యాలా లేక నూనెలో బాణలి వెయ్యాలా ' లాంటి చొప్పదంటు ప్రశ్నలేసి ' రెండూ నా మీద వెయ్యి ' అని ప్రేక్షకుడు విసుక్కోకముందే ' బ్రేక్ ' అంటూ విరామం తీసుకొని, తీరా వంట మొత్తం పూర్తయ్యాక లోట్టలేసుకుంటూ తినే వంట రాని మహిళా యాంకర్స్‌ని మనం చూస్తూనే ఉన్నాంగా ?




ఈ మాటే ఓ సారి యథాలాపంగా మా ఆవిడతో అంటే ' ఊరికే కబుర్లెందుకు చెబుతారు ? మీరు చెయ్యరాదూ ఈ పూట  వంట ' అనేసింది. ఈ ఆడవాళ్ళున్నారు చూశారు .వీళ్ళు మహా  గడుసరులు సుమండి. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకీ బోలెడు అర్థాలుంటాయి. ఆచితూచి అడుగెయ్యకపోయారో అట్లకాడెతో అప్పడాన్ని వేయించినట్టు వేయించేస్తారు.  సామన్య మగమాత్రుడైతే వెంటనే అవేశపడిపోయి ' నువ్వలా కూర్చో. చూద్దువు గానీ నా ప్రతాపమేంటో ' అని హూంకరించి ఆపసోపాలు పడి అమాయాకంగా వంట మొత్తం చేసేసి కాలరెగరేసేవాడు.  ఆ తర్వాతే వస్తుంది అసలు చిక్కంతా . వంట ఏ మాత్రం బావున్నా  మొగుడనే  ఆ మానవమాత్రుడు ఇక చచ్చాడన్న మాటే. గోముగా గుండె మీద గోకి మెల్లగా  వంటింటి బాధ్యతను కూడా నేర్పుగా మొగుళ్ళకు బదలాయించేస్తారు పెళ్ళాలు . నేను గట్టిపిండాన్ని కాబట్టి ప్రమాదాన్ని పసిగట్టి ' కాలేజి రోజుల్లో మేం కూడా చేశాం లేవోయ్. నేను నాన్‌వెజ్ వండితే నాలుగు క్యాంపస్‌ల దాకా ఘుమఘుమలాడేది. అయినా నేను వంట చెయ్యాలంటే ఆ రోజుకొక ప్రత్యేకతుండాలి . ఆషామాషీగా వంట చేసెయ్యడం నాకిష్టం లేదు ' అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాను. ' మీరు వంట చేశారా ? I can imagine ' అని ఆ రోజంతా మా ఆవిడ పగలబడి నవ్వుతూనే ఉంది. ఇది ఇంకొక వెరైటి రెచ్చగొట్టే ప్రోగ్రాం అనుకొని నేను మిన్నకుండిపోయాను.


అయితే నేను వంట చెయ్యాల్సిన రోజు రానే వచ్చింది.


వేసవి సెలవులివ్వడంతో పాపను తీసుకొని మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. మా ఆవిడున్నప్పుడు పది సార్లు పిలిచినా భోజనానికి కదిలే వాన్ని కాదు. ఆ పనీ ఈ పని అంటూ సమయం వృధా చేసి తీరా తను టేబుల్ మీద ప్లేట్ పెట్టి అందులో అన్నీ వడ్డించేసాక తీరిగ్గా అప్పుడు పైకి లేచి పాదప్రక్షాళనం ,హస్త ప్రక్షాళనం, ముఖ ప్రక్షాళనం చేసుకొని అప్పుడు తినడానికి వెళ్ళేవాన్ని. ఇప్పుడు అంత సౌలభ్యం లేదు కాబట్టి నా ఏర్పాట్లేవో నేనే చేసుకోవాలి. అప్పటికీ చాలా రోజులు బయటి తిండి తింటూనే వచ్చాను.  కాస్త తేడా అయ్యి రెండు రోజులు కిందా మీదా అయ్యేసరికి, విజయదశమికి శాపగ్రస్తుడైన అర్జునుడు జమ్మి చెట్టు మీంచి గాండీవాన్ని తీసి టంకారావం చేసినట్లు నా పాకశాస్త్ర పాండిత్యాన్ని కూడా ప్రపంచానికి ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని నిర్ణయించుకున్నాను. ప్రొద్దున్నే టిఫన్ స్వయంగా చేసుకోవాలని అనుకున్నాను.




 నిజానికి ఇంత కష్టపడకుండా మా ఇంటిదగ్గర్లోనే ఒక టిఫన్స్ సెంటరుంది. అక్కడికి వెళ్ళి ఏ ఇడ్లీయో దోశెనో తిని మెల్లగా నడుచుకుంటూ వచ్చేయచ్చు. కానీ మిన్ను విరిగి మీద పడినా ఆ హోటల్‌లో మాత్రం కాలు పెట్టనని ముందే భీషణ ప్రతిజ్ఞ చేసేశాను. దానికో కారణముంది. ఓ సారి ఇలాగే వెళ్ళి ఇడ్లీ సాంబార్ ఆర్డరిచ్చాను. అదేం కర్మమో ఆ రోజు పని వాళ్ళు లేక ఓనరే సర్వింగ్ చేస్తున్నాడు. ఆర్డరిచ్చేటప్పుడు ' ఇడ్లీ మీద సాంబార్ కుమ్మరించకు. చెట్నీ మాత్రం సెపరేట్ గా ఇవ్వు చాలు ' నన్నాను. కన్నడిగులు సాంబార్లో బెల్లం వేస్తారు. అది నాకు నచ్చదు. ఓనరు నేను చెప్పినప్పుడు అన్నిటికి తలాడించి, సర్వింగ్ చేసేటప్పుడు మాత్రం తాను మైండ్‌లో దేనికి ఫిక్సయ్యాడో అలానే చేశాడు. ఇడ్లీల మీద గిన్నెల కొద్దీ సాంబార్ కుమ్మరించి తీసుకొచ్చాడు. ' నాకిలా వద్దు'  అంటే,  ' ఇప్పుడు ఇడ్లీ మీద సాంబార్ పోసేసాగా తీసుకో ' అన్నాడు. వాదనలు కొనసాగి నాకు తిక్క రేగి ' నీ హోటల్‌లో మళ్ళీ అడుగుపెడితే అప్పుడడుగు ' అని చెప్పి తినకుండానే వచ్చేశాను. అప్పటి నుంచి  ఆ హోటల్ గడప తొక్కటం లేదు.  


టిఫన్ చెద్దామని నిర్ణయించున్నాక ఉప్మా అయితే త్వరగా పూర్తవుతుందని, మా ఆవిడకు ఫోన్ చేసి ఎలా చెయ్యాలో కనుక్కున్నాను. అంతకు ముందెప్పుడూ ఉప్మా చేసిన అనుభవం లేదు కాబట్టి ఆ మాత్రం జాగ్రత్త తప్పలేదు. అవతల్నించి మా ఆవిడ కంఠంలో తలమునకలయ్యేంత ఆశ్చర్యం తన్నుకొచ్చి ఇవతల నా చెవులను తాకుతోంది. నేను నింపాదిగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ మా ఆవిడ చెప్పేది పూర్తిగా వినిపించుకోకుండా ' ఈ మాత్రం చాలు. ఇక చెలరేగిపోతా ' అని భరోసా ఇచ్చి ఫోన్ పెట్టేశాను. స్టవ్ వెలిగించి ముందుగా రవ్వ ఫ్రై చేశాను. మరో వైపు ఇంకో పాత్రలో నీళ్ళు వేడి చేశాను.ఈ రెండూ జరుగుతూండగానే సవ్యసాచిలా ఉల్లిపాయలు కట్ చేశాను. నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్న సన్నివేశం చూసి మా పనిమనిషి పాత సినిమాలో నౌకర్లా ' బాబు గారూ ' అని తెగ ఎమోషనల్‌గా ఫీలయిపోయినా పట్టించుకోలేదు.  పక్షి కన్ను తప్ప పరిసరాలు పట్టించుకోని పార్థునిలా ఫ్రై చేసిన రవ్వని ఒక పాత్రలో పోసుకొని, బాణలిలో వేడి నీళ్ళు పోసి అందులోకి రవ్వని షిఫ్ట్‌చేశి ఉప్పు వేశాను. వేయించిన ఉల్లిపాయల్ని కుడా కలిపాను. కరివేపాకు  కొత్తిమీర  కనిపించలేదు కాబట్టి వదిలేశాను .  ఏ జానర్ సినిమా అయినా రాయలసీమ శైలిలోనే సంభాషణలు పలికే జయప్రకాష్‌రెడ్డిలా, వంటేదైనా కారం తగలాలని పచ్చి మిరపకాయలు కట్ చేసి, సరిపోదేమో అని కొంచెం కారంపొడి కూడా చివర్లో వేశాను.  రిలాక్సై హాల్లోకొచ్చి టీ.వి చూస్తూ  ' ఇక అయిపోయినట్లే ' అని గర్వంగా కూర్చున్నాను. ఇంకా ఎన్ని అకృత్యాలు చూడాల్సి వస్తుందనేమో మా  పనిమనిషి అప్పటికే చెప్పా పెట్టకుండా పరారైపోయింది.   




ఉప్మా పూర్తయ్యింది . వేడి వేడిగా దించి ప్లేట్‌లో వేసుకొని నోట్లో ఒక్క ముద్ద పెట్టుకున్నాను కదా . పొలమారి కడుపులో రసాయనిక చర్యలు బయలుదేరాయి. రెండో ముద్ద వేసుకోవడానికి ధైర్యం చాలక కళ్ళు తిరిగినంత పనైంది.


కాలుజారి పడ్డ సుయోధనుడనై,
ఖిన్నుడనై,
దీనికి కారణంబేమిటి  అని పరిపరివిధాలా ఆలోచిస్తూ మా ఆవిడకి ఉప్మా ఫోటో పంపి, ఫోన్ చేస్తే ' ఉప్మా లో కారప్పొడి వెయ్యాలన్న వెరైటీ ఆలోచన మీకెలా వచ్చినది ఆర్యపుత్రా ? ' అని సమాధానం వినిపించినది.


అవతల్నుంచి మా పాప 'వావ్! నాన్న కేక్ చేశారు ' అంటొంది ఫోటో చూస్తూ. మా బామ్మర్దేమో ' హల్వా నా ?!  ' అని అమాయకంగా అడుగుతున్నాడు వాళ్ళక్కని.


మగబ్లాగర్లారా .అధైర్యపడకండి. ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపించే భిన్నత్వంలో ఏకత్వం లాంటి పరమాత్మ స్వరూపమైన ఉప్మా తయారు చెయ్యడం అంత సామన్యమైన విషయమేమి కాదు. ఆ విధంగా నేను విజయం సాధించినట్లే లెక్క.


అంతటి ఉప్మా ఫోటో ని మీకు చూడాలనుందా?


అయితే..క్రిందకు స్క్రోల్‌చెయ్యండి  
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.






7 comments

January 8, 2012 at 4:14 AM

లోకేష్ గారూ 'రాదు' అంటే ఎంచక్కా ఆవిడే నేర్పేవారు కదండీ...అయినా ఉప్మా చెయ్యడమంటే కవితలు వ్రాయడమంత తేలికనుకున్నారా...

Reply
January 8, 2012 at 7:11 AM

హహహ దీనిని ఉప్మా అని ఏ ఊరి, ఏ పరిభాషలో అంటారు మాష్టారూ? నా వోటు మీ బావమరిది గారికే నాకు కూడా హల్వాలానే తోస్తోంది మరి!

Reply
January 8, 2012 at 7:16 AM

చాలా బాగుంది.
ఉప్మా కాదండీ... పోస్టు.

మగవాళ్ళందరూ వంటకి ఓం ప్రధంగా ఉప్మానే ఎందుకు ఎంచుకుంటారబ్బా...?

ఉప్మా చూశాక అర్థమైందండీ... మీరు నాన్వెజ్ ఇంకెంత బాగా చేయగలరో... just kidding :))

Reply
January 8, 2012 at 8:57 AM

మీరు మొత్తం మీద

టపా పాటస్య కేకః
ఉప్మా పాటస్య ఫ్లాపః

అన్న మాట !

అందుకేనండోయ్, షడ్రుచులు అప్పుడప్పుడూ క్లిక్కేస్తూ
ఉండాలి !

చీర్స్
జిలేబి.

Reply
Anonymous
January 8, 2012 at 9:41 AM

Good experience. try again u will succeed

Reply
January 8, 2012 at 10:43 AM

@గీతిక గారు,

>>>మగవాళ్ళందరూ వంటకి ఓం ప్రధంగా ఉప్మానే ఎందుకు ఎంచుకుంటారబ్బా...?
..

చాలా సింపుల్ అండి. ఆడవాళ్ళు ఓ మూడు నిముషాల్లో ఉప్మా చేసి పడేస్తారు. అది చూసి ఓస్ ఇంతే కదా ఉప్మా అనుకుని శ్రీవారలు ఉప్పులో కాలేసి రవ్వ లో చెయ్యేసి మొత్తం మీద కడుపు కాల్చేసుకుని, శ్రీమతి కి 'కాల్' జేసి, ఇంకా చెప్పాలంటారా ... శ్రీ మతి వారు వూరేళితే శ్రీ వారి అగచాట్లు ! అదే మా వారు వూరెళ్ళితే అని ఆ మధ్య ఓ బ్లాగరి గారు జామ్మని ఏమి వంట చేసారండీ బాబూ !

జేకే!

చీర్స్
జిలేబి.

Reply

@ జ్యోతిర్మయి గారు,

వంట చెయ్యడం కంటే కవితలు వ్రాయడం తేలికంటున్నారా ? అదీ మీరు కూడా ఒక కవయిత్రై ఉండి. హతవిధీ.

@ రసజ్ఞ గారు,
ఫోటోలో క్లారిటీ మిస్సయ్యింది.నా కళ్ళతో చూడండి మీకు ఉప్మా కనిపిస్తుంది :-)

@ గీతిక గారు,
థాంక్యూ.

@ కష్టేఫలే గారు,
థాంక్యూ.

@ జిలేబి గారు,

నిజామేనండోయ్. కారం మీద మమకారం తగ్గించుకుంటే కడుపుకి కూడా మంచిదే. మీ రెండో కామెంటును నేను అంగీకరించను గాక అంగీకరించను. మొదటిసారికే ఉప్మా ఇలా వచ్చిందంటే రెండో సారి ఇక అద్భుతమే.

Reply
Post a Comment