వసంతం అంటేనే కొత్త శోభ, కొత్త ఉత్సాహం. అది అందరిదీ. చిగురించే మొక్కలోని కోమలత్వాన్ని , విరబూసిన పువ్వులలోని స్వచ్ఛతని, మత్తెక్కిన కోయిల సుస్వరాలని ఎవరు మాత్రం ఆస్వాదించాలనుకోరు ? వసంతం, విషాదం ప్రతి మనిషి జీవితంలో ఉన్నాయి. అయితే అందరి అనుభూతులు మాత్రం ఒకేలా పరిగణింపబడటం లేదు. కులం పేరుతో మనుషుల్ని వెలివేసి వాళ్ళ సంస్కృతిని కించపరచి, హక్కుల్ని కబళించి, ఆనందాలని కాలరాస్తే అదే అంటరాని వసంతమవుతుంది.
ఎల్లన్నది ఎన్నెలదిన్నె అనే కుగ్రామం. అత్త పర్యవేక్షణలో ఆటపాటలతో పెరుగుతూంటాడు. అక్షరాలు వ్రాయడం రాకపోయినా స్పందించే హృదయం, ఉప్పోంగే రక్తం అతనికి పదాలు కూర్చడం, ఆ కూర్చిన పదాలకి అలవోకగా చిందులు వెయ్యడం నేర్పాయి. వీధినాటకాలాడే ఎర్రగొల్లలు ఆ గ్రామానికి వచ్చి రాత్రిళ్ళు ప్రదర్శనలిస్తూంటే, ఆటపాటల మీదున్న ఆసక్తి కొద్దీ వాళ్ళని కాస్త దగ్గరినుంచి చూడాలనుకుంటాడు. అత్త వద్దని వారిస్తుంది. ఆమెకు తెలియకుండా ఒకరోజు ప్రొద్దున్నే ఊరిబయటనున్న ఎర్రగొల్లల డేరాలకు వెళ్తాడతను. అతని కులం అక్కడ పరిచయమవుతుంది.
ఆ గ్రామంలో కట్టుబాట్ల ప్రకారం కేవలం కరణాలు, కాపులు మాత్రమే ప్రదర్శనకు దగ్గరగా కూర్చునేవాళ్ళు. వారి వెనుక మంగలి, కుమ్మరి మిగత కులాల వాళ్ళు కూర్చునేవాళ్ళు. వీళ్ళందరికీ దూరంగా వెనుకున్న మాల దిబ్బ పై మాలవాళ్ళు, మాదిగ దిబ్బపై మాదిగలు కూర్చునేవారు. కరణం వచ్చిన తర్వాతే వీళ్ళందరూ దిబ్బలపైకి రావాలి. ప్రదర్శన కనిపించకపోయినా కూర్చునే చూడాలి తప్ప నిలబడి చూడకూడదు. అటువంటిది ఒక మాలపిల్లవాడు ఏకంగా డేరాల్లోకే రావటం అక్కడున్న గుంపులో కలకలాన్ని సృష్టిస్తుంది. రాళ్ళతో వెంటపడతారు . అర్థంకాకపోయినా అనాలోచితంగానే పరుగు తీసిన ఎల్లన్న పొదలు దూకి, కంపచెట్లను దాటి, బండరాళ్ళు తగిలి బోర్లాపడి, పైకిలేచి, రక్తమోడుతూనే ఏటికి ఎదురీది, ఊరుకి ఆవలిగట్టు చేరుకుంటాడు . అయినా నడక ఆపలేదు. భయంతో మొదలుపెట్టిన నడక చీకటయ్యాక, చీకటిలో తననెవరూ గుర్తుపట్టలేరని నిర్ణయించుకున్నాక ఆపుతాడు . అత్త ఎందుకు వద్దందో అప్పుడర్ధమయ్యింది. ఇంటికి వెళ్ళిపోయి ఇంకెప్పుడూ అలా చెయ్యనని చెప్పాలనుకుంటాడు. చీకట్లో ఊరికి ఎంతదూరం వచ్చేశాడో, ఎటువైపు వెళ్ళాలో తెలియలేదు. తెల్లవారాక వెళ్ళాలనుకుంటాడు. ఎక్కడి నుంచో గాలి మోసుకొచ్చిన లయబద్దమైన శబ్దం అలసిపోయి నొప్పులతో బాధపడుతున్న అతని పాదాలకు తిరిగి సత్తువనిచ్చి ఉరుముల నాగన్న వద్దకు చేరుస్తుంది.
నాగన్న ఉరుముల నృత్యం ఆటగాడు. పక్కలదిన్నె అనే గ్రామంలో తన బృందంతో కలిసి ప్రదర్శనకు వచ్చినతను ఎల్లన్నలోని మెరుపుని అసహాయతను గుర్తించి అతన్ని చేరదీసి వివరాలు కనుక్కుంటాడు. గత జ్ఞాపకాలు అతని గుండె తలుపులు తట్టి మనసుని వికలం చేస్తాయి. నాగన్నదీ ఎన్నెలదిన్నే. అతనూ అక్కడినుంచి వలసపోయినవాడే. మాలాడు, మాదిగాడు వెట్టి చెయ్యకపోతే బ్రతకలేని ఊరు ఎన్నెలదిన్ని. మధ్యాహ్నం కూడు తప్ప మరో కూలి వుండేది కాదు. దాని కోసం కూడా కొట్టుకు చచ్చేవాళ్ళు. కరణం పరమ క్రూరుడు. ' మీ కులం అంత గొప్పది ఇంత గొప్పది ' అని రెచ్చగొట్టి మాలల పైకి మాదిగల్ని, మాదిగల పైకి మాలల్ని ఉసిగొల్పేవాడు. అతని మాటకు ఎదురుతిరిగినివాళ్ళ బ్రతుకులు తాటితోపులో తెల్లారిపోయేవి. వరదలొచ్చినప్పుడల్లా ఏటికి దగ్గర్లో ఉన్న మాలపల్లి, మాదిగపల్లి మునిగిపోయేవి. ఊరికి పై భాగాన ఉన్న దిబ్బపై ఇళ్ళు కట్టుకోవాలని చూస్తే అంటరాని వాళ్ళు తలభాగాన ఉండరాదని అగ్రవర్ణాల వాళ్ళు హుకుం జారీ చేస్తారు . ఓ సారి వరదలొచ్చి,ఇళ్ళు తుడిచిపెట్టుకుపోయినప్పుడు నాగన్న తండ్రి ధైర్యం చేసి గొడ్డలి భుజాన వేసుకొని అందరినీ దిబ్బలపైకి తీసుకు వెళ్తాడు . అగ్రవర్ణాల ఇళ్ళ మధ్య నుంచి, ఊరి మధ్యనుంచి, దేవాలయాల సందుల నుంచి దిబ్బలపైకి జనాన్ని తీసుకువెళ్తాడు . తిండిలేక పిల్లలు అలమటిస్తూంటే షావుకారు కొట్టు తాళం పగలకోట్టి ధాన్యం బస్తాలు తెచ్చుకుంటారు. రెండ్రోజుల తర్వాత అతని శవం అదే దిబ్బపై కనబడుతుంది . బిక్కచచ్చిన జనం వానవెలిసాక మళ్ళీ పాతచోటే గుడిసెలు వేసుకుంటారు. అప్పుడు తల్లితో పాటు ఊరుదాటిన నాగన్న మళ్ళీ ఇన్నాళ్ళకి తన ఊరి పేరు వింటాడు. మనుషులు మారుతున్నారు తప్ప మనుగడలో మార్పు లేదని ఎల్లన్న కథతో తెలుసుకుంటాడు . ఎల్లన్న చెయ్యి పుచ్చుకుని ఎన్నెలదిన్ని మాలపల్లిలో అడుగుపెడతాడు.
నాగన్నని పోల్చుకున్న ఊరు అతన్ని అతని నృత్యాన్ని ఆదరిస్తుంది . ఏ దిబ్బపై తన తండ్రిని చంపారో అదే దిబ్బపై ఆ మరణానికి కారకుడైన కరణాన్ని గుట్టుచప్పుడు కాకుండా మాదిగ మాతయ్య నరికేశాడని, ఇప్పుడంతా పిల్ల కరణం చెప్పుచేతుల్లో నడుస్తోందని తెలుసుకుంటాడు. ఎల్లన్నకి పాటలు, నృత్యం నేర్పించి అతని ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనుకుంటాడు.
నాగన్న చొరవతో పెద్దలను ఇరుకున పడేసి దెయ్యాల దిబ్బను సాగులోకి తెచ్చుకుంటారు మాలమాదిగలు. అగ్రవర్ణాలకు ఆవేశాలు రగిలినా అంతకు ముందు లేని ఐక్యత ఇప్పుడు మాలమాదిగల్లో కనబడేసరికి కక్కలేక మింగలేక మిన్నకుండిపోతారు. నాగన్న తర్ఫీదులో ఎల్లన్న రాటుదేలి గొప్ప కళాకారుడిగా పేరు తెచ్చుకుంటాడు. అతను వేషం కడితే చూడ్డానికి చుట్టుపక్కల మాల మాదిగ పల్లెలు ఎగబడేవి. ఆటకు ముందు కరణం ,ఇతర పెద్దలు వచ్చారో లేదో తెలుసుకుని అప్పుడు మొదలెట్టడం ఆనవాయితీ. దాన్ని ధిక్కరించి 'ఘనత వహించిన పెద్ద మాల, అంతే ఘనత వహించిన పెద్ద మాదిగ తమ స్థానాలు అలంకరించారా లేదా' నని తెలుసుకొని అప్పుడు ప్రదర్శన మొదలుపెట్టడం ప్రారంభిస్తారు . అగ్రవర్ణాలకు ఈ పరిణామం మింగుడుపడక నాగన్నని, ఎల్లన్నని పిలిపించి ఆటకు ముందు అలా పిలవకుండా ప్రదర్శనలిచ్చుకోమని లేకపోతే రెండు ఊళ్ళూ బూడిదవుతాయని హెచ్చరిస్తారు. ఏం చెయ్యాలో తోచక నాగన్న తనవాళ్ళతో చర్చిస్తాడు. ఆత్మగౌరవం కోసం తెగించి పోరాడే ధృడచిత్తం కరువయ్యేసరికి నిరాశపడి ఆ దిగులుతోనే మరణిస్తాడు.
నాగన్న మాటలే మననం చేసుకుంటూ భార్యా పిల్లలను, గ్రామాన్ని విడిచిపెట్టి ఊళ్ళుపట్టిపోతాడు ఎల్లన్న. పెరిగే పైరు మీద, నాట్లు వేసే కూలీల కష్టం మీద, నేల మీద జరిగే ప్రతి విన్యాసం మీద పాటలల్లి పాడతాడు. భార్య పేరుని పల్లవిగా చేసుకోని పాడతాడు. మాలబైరాగిగా పేరు గడిస్తాడు. పెదకోటేశ్వరుడు అనే కుమ్మరి పోతులూరి వీరబ్రహ్మం గారిపై ద్విపద పద్యాలు వ్రాసి కులాల హెచ్చుతగ్గుల్ని నిరసిస్తూంటాడు . అతని కులం అతన్ని వెలివేస్తుంది. తాళపత్ర గ్రంథ సేకరణ కోసం బ్రౌన్‌దొర నియమించిన వాయసగాళ్ళు, పండితులు అతన్ని, అతని రచనలని అవహేళన చేస్తారు. పెదకోటేశ్వరుడు ఏ మాత్రం చలించకుండా బసవడిని, వీరబ్రహ్మాన్ని కలిపి ద్విపదలు రూపొందిస్తాడు. ఎల్లన్న గురుంచి విని అతన్ని కలుసుకోవాలని బయలుదేరుతాడు. రాజవీధిలో వెళ్తున్న అతన్ని బ్రాహ్మణుడొకడు గుర్తించి అవమానించి కొట్టబోతాడు. పెదకోటేశ్వరుడు తన కాలికంటిన మట్టి విదిలించి, నేల మీద ఖాండ్రించి ఉమ్మి, ' నా చేత అపవిత్రమైన దీన్ని మీరు పవిత్రం చెయ్యండి' అని వెళ్ళిపోతాడు. ఎల్లన్నని కలిసి, అతని నేపథ్యం సాహిత్యం విని, తన రాతప్రతులను అతనికి అప్పగించి పులకరించిపోతాడు. తిరిగివెళ్తూ అగ్రవర్ణాల చేతిలో దారుణహత్యకు గురవుతాడు. అతని సమాధి ఒక సందర్శనీయ స్థలమవుతుంది.
పిల్లకరణం పట్నం వెళ్ళిపోతూ బంజరంతా మాలమాదిగలకు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ భూమిని ఆక్రమిద్దామనుకున్న అచ్చిరెడ్డికి ఇది ఆశనిపాతమవుతుంది. ఎన్నెలదిన్నెలో ముందు కరణం పొలాలు తడపాలి, తర్వాత పెద్ద రెడ్లు, సన్న రెడ్లు, ఇతరకులాలవి. మాలామాదిగల పొలాల వంతు వచ్చేసరికి నీళ్ళు మిగిలేవి కావు. గత్యంతరం లేక ఓ సారి నీళ్ళు దొంగలిస్తే మనుషుల్ని పంపించి చావగొట్టిస్తాడు అచ్చిరెడ్డి. ఎల్లన్న భార్య సుభద్ర తిరగబడి కాళికావతారం ఎత్తటంతో ఆమెను 'దేవత ' ఆవహించిందని, అందుకే ఆమెకంత ధైర్యమొచ్చిందని భయపడతారు ఊరివాళ్ళు.
రాళ్ళను సైతం అరాయించుకునే కరువు రాచి రాంపాన పెడుతూంటే, పొట్ట చేతబట్టుకుని ఊళ్ళకు ఊళ్ళకు వలసపోతూంటారు. ఆ గుంపుతో పాటూ ఎన్నెలదిన్నె ఎగిరివచ్చిన పండుటాకు లాంటి ఎల్లన్నని చూసి అతని భార్యాపిల్లలు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ఎల్లన్న, సుభద్ర మరణిస్తారు. కొడుకు శివయ్య వాళ్ళను అక్కడే సమాధి చేసి భార్యను వెంటబెట్టుకొని బకింగ్‌హాం కాల్వ కూలిపనులకు వెళ్తాడు .మాలవాడు పనికోసం వచ్చాడని ఆగ్రహించి అక్కడ పనిచేస్తున్న జనం వాళ్ళ మీద దాడిచేస్తారు. చాలా దూరం పారిపోయి జీవచ్ఛవాల్లా పడిపోయిన శివయ్యను అతని భార్యని క్రైస్తవ మతం చేరదీస్తుంది. శివయ్య సీమోను అవుతాడు. అతనికి ఆశ్రయం ఇచ్చిన మార్టిన్‌దీ అటువంటి నేపథ్యమే.
ఇక్కడి నుంచి కథ రకారకాల మలుపులు తిరిగి సీమోను కొడుకు రూబేను, రూబేను కొడుకు ఇమ్మాన్యుయెల్, అతని కొడుకు జెస్సీ జీవితాలని, అంతః సంఘర్షణను స్పృశిస్తూ జెస్సీ నక్సలైట్‌గా రూపాంతరం చెందడం వరకు సాగుతుంది. అజ్ఞాతంలో ఉన్న మనవడిని చూడ్డానికి వెళ్తాడు రూబేను. అతని భార్య మరియు జెస్సీ నాన్నమ్మ అయిన రూతు, మనవడి విజయాన్ని ఆకాక్షిస్తూ ఉత్తరం వ్రాయటంతో నవల పరిసమాప్తమవుతుంది.
తరతరాలుగా అలగాజనంగా ముద్రపడ్డ మాలమాదిగల బ్రతుకు పొరాటానికి నిలువెత్తు దర్పణం అంటరాని వసంతం. కల్యాణరావుగారి శైలి చాలా సరళంగా శక్తివంతంగా ఉంది. మామూలు మాటలతోనే మనసులోతుల్ని స్ఫృశిస్తారు .మాలమాదిగల జీవనశైలిని, వారి దైన్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. చచ్చిన గొడ్డు మాంసం తింటూ గొడ్డిచ్చిన పెద్దలకి దాన్ని చర్మంతో చెప్పులు కుట్టడం నుంచి, ఏ కులమూ తాకని తన దేహాన్ని ఒక తెల్లవాడు తాకి ' క్రీస్తుకు అంటరానితనం లేదు ' అన్నప్పుడు ఆత్మగౌరవం కోసం క్రైస్తవ మతాన్ని అందిపుచ్చుకోవటం వరకూ, కాలిక్రింద చెప్పు నుంచి కొడవలిగా ఎదిగే వరకూ, మాలమాదిగల జీవితాల్లో వచ్చిన మార్పులను, అంతర్మథనాలను చక్కగా విశ్లేషించారు. కులం కారణంగానే మాలమాదిగలకు దక్కాల్సిన ఎన్నో గౌరవాలు దక్కలేదని, రవివర్మ, రాజమన్నారు, నండూరి వంటి వాళ్ళు వెలయించిన సాధారణ చిత్రాలని, రచనలని మాత్రం నెత్తిన పెట్టుకున్నారని ఆక్షేపిస్తారు. ప్రేరిణీ శివతాండవం కంటే ఉరుముల నృత్యంలో సహజత్వం ఉందని, పురాణాలను మంత్రాలను సైతం మహాకావ్యాలుగా ఆకాశానికెత్తిన పండితులు అంటరాని కులాలు పాడిన గీతాలు, ఆడిన వీధిభాగవతాల్లో గొప్పదనాన్ని గుర్తించలేకపోయారని ఎద్దేవా చేస్తారు. ఎంకి పాటలు నేను చదవలేదు కానీ ఈ మాటల్లో కొంత నిజం లేకపోలేదు. ఆత్మగౌరవం కోసం పరమతాన్ని పుచ్చుకున్న మాలమాదిగల్ని సమర్థిస్తూనే ధనం కోసం మతం మార్చుకున్న అగ్రవర్ణాలను చూసి నవ్వుతారు. గాంధీజీ చేపట్టిన హరిజనోద్ధరణ, దేవాలయాల ప్రవేశం లాంటి కార్యక్రమాలని హిందూ మతచట్రంలో మాలమాదిగల్ని బంధించే ప్రయత్నమని, అందుకే అంబేద్కర్ వంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకించారని చెప్పి ఆయా కార్యక్రమాలలోని డొల్లతనాన్ని వివరించి ఆశ్చర్యపరుస్తారు .
నవలలో ప్రస్తావించిన చాలా సంఘటనలు మనసుని మెలిపెట్టి బాధపెట్టేవే. కొన్ని విషయాలు మాత్రం కొత్తగా ఉన్నాయి . చెన్న పురాణం, జాంబ పురాణం అన్నపేర్లు చదివి ఇటువంటి పురాణలు కొన్ని ఉన్నాయా అని ఆశ్చర్యపోయాను. అప్పటిదాకా వ్యాస భగవానుడు వ్రాసిన పద్దెనిమిది పురాణాల గురుంచి మాత్రమే విని ఉండటం చేత ఈ కొత్త పురాణాలేమిటి, వాటిని ఎవరు వ్రాశారన్న జిజ్ఞాస బయలుదేరింది. అంతర్జాలాన్ని శోధించాక వీటిని కుల పురాణాలంటారని ఇటువంటి పురాణాలు ఇంకా అనేకం ఉన్నాయని అర్థమయ్యింది. ఎవరు ఎలా వ్రాశారో ఇతిమిత్థంగా తెలియకపోయినా కులాల పుట్టుకలు, చరిత్రలు, వాటి అనుబంధ కథలు తెలిపే కులపురాణాలు, కొన్నైనా ఆయా కులాల్లో (లేదా ఇతర కులాల్లో) బాగానే ప్రాచుర్యం పొందినట్లున్నాయి. కేవలం నోటిమాటలు, ఆటపాటల ద్వారా ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయిపోయే ఈ పురాణలలో చెన్న పురాణం మాలలది. జాంబ పురాణం మాదిగలది (ఈ మధ్యనే జాంబపురాణం అనే పుస్తకాన్ని విడుదల చేశారు. దీనిపై దార్ల వారి వ్యాసం కూడా చదివాను). వీటిలో కథలు కొత్తగా ఉంటాయి. ఎప్పుడూ వినని, చదవని కథలు. (ఈ పురాణ కథల గురుంచి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్‌చెయ్యండి .) ఎవరో జడల ఋషి వ్రాసింది చరిత్ర ఎలా అవుతుందని సామాజిక మూలాలను ప్రశ్నించిన రచయిత, కనీసం ఎవరు వ్రాశారో తెలియని పురాణాలని పట్టుకొని మాలా మాదిగలు అంటరానివారెలా అయ్యారని ప్రశ్నించుకొని ఉంటే సమాధానం అందులోనే దొరికేది. తేడా మతంలో లేదు. దాన్ని బోధించే మనుషుల్లో ఉంది.
పుట్టుకతో ఎవారూ ఫలానా కులానికి చెందరని, కర్మానుసారమే బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని భగవానువాచ . నేను హిందువునేనయినా, హిందూమతం గురుంచి నాకున్న అవగాహన స్వల్పమే అయినా, 'బ్రాహ్మణత్వం' ' చాతుర్వర్ణ వ్యవస్థ ' వంటి పదాలకు తీసిన పెడార్థాలు మరే పదాలకీ తీయలేదని నిశ్చయంగా చెప్పగలను. కుహానా పండితులు, మేధావుల కారణంగా సంఘానికి, తద్వారా హిందూ మతానికి ఎనలేని నష్టం జరిగింది. ఎందరో గురువులు, సాధకులు తమ బోధనలతో నయం చేసే ప్రయత్నం చేసినా, ఇంకా చేస్తున్నా అంటరానితనం అనే వ్యాధి ఇంకా పూర్తిగా సమసిపోలేదు. అప్పటికీ ఇప్పటికీ మనుషుల మనస్తత్వాలలో చాలా మార్పులొచ్చినా అంటరానితనం పేరుతో దళితులని అవమానించటం లాంటి సంఘటనలు ఇప్పటికీ అడపాదడపా మనం వింటూనే ఉన్నాం. అలాగే బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా శబరిమలై లాంటి సుప్రసిద్ధ ఆలయాలలో అర్చక పదవులు నిర్వహించడం చూస్తున్నాం. ఆత్మగౌరవం మాటెలా ఉన్నా ఆర్థికంగా మాత్రం మాలమాదిగలు అర్చక స్వాముల కంటే ఇప్పుడొక మెట్టు పైనే ఉన్నారు. చరిత్రకెక్కిన రాజులని, మహాపురుషులని తమ కులానికి చెందిన వాళ్ళుగా ప్రకటించుకోవటం సర్వసాధారణం కాబట్టి, మాలమాదిగల చారిత్రక ప్రశస్తి మీద మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో తవ్వాల్సింది పూడ్చాల్సింది చాలానే ఉంది.
ఈ నవలని తెలుపు.కాం వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.
వెల 70 రూపాయిలు .
3 comments
Kula vyavastha loni krurathvaanni, daani valana peedichabadina vaalla baadha ni baagaa cheppaadu rachayitha. Kaani novel raase skill maatram ledu writer ki. Adhbuthamaina concept vundi , poor screenplasy tho cinema thisthe yelaa vuntundo, alaa vundi yi navala. Novala raase naipunyam vundi vunte oka classic novel laagaa migilipoyedi.
Replyఅశ్వత్థామ గారు, మీ విలువైన అభిప్రాయాన్ని వెల్లడించినందుకు కృతజ్ఞతలు
ReplyIt is the master piece of dalit literature in Andhra Pradesh.
Reply