పెట్రోలు రాజకీయాలు..కాదంటారా ?!



నం నెత్తిన మళ్ళీ పెట్రోబాంబు పడింది. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 7.50 రూపాయిలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నింగినంటిన నిత్యావసర వస్తువుల ధరలకు నిచ్చెన వెయ్యలేక కాళ్ళు విరగొట్టుకున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది పిడుగుపాటు. షరా మాములుగా సవరించిన ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా వినియోగదారులంతా పెట్రోల్ పంపుల ముందు బారులు తీరి బూతులు తిట్టుకుంటూ నానా అవస్థలు పడ్డారు.   రాజకీయాలను బాగా వంటబట్టించుకున్న చమురు కంపెనీలు ధరల పెంపుదల విషయాన్ని సాయంత్ర వేళ బహిర్గతపరచి ప్రతిపక్షానికి వెనువెంటనే ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు చేసుకునే అవకాశం లేకుండా చేసి కొంతవరకూ సఫలీకృతమైనా, పెంచిన ధరల విషయంలో అవి ఎంత వరకూ తమ మాట నిలబెట్టుకుంటాయో వేచి చూడాలి. డీజల్ ధరను 5 రూపాయల వరకు, గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయల వరకు పెంచే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. ఇంధన ఛార్జీలు పెంచితే రవాణా ఛార్జీలు తడిసి మోపెడై నిత్యావసర వస్తువుల ధరలు మరింత ప్రియమవుతాయి. పెనంలోంచి పొయ్యిలోకి పడినట్లవుతుంది అప్పుడు పరిస్థితి. ఏతావాతా సగటు మనిషి కష్టాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

 సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 73.14 రూపాయిలు. ఆ ధర నిర్ణయింపబడే క్రమం ఇంచుమించుగా ఇదీ .

అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక బ్యారెల్ ముడిచమురు ధర 106.02 డాలర్లు అనుకొందాం (ప్రస్తుత రేటు)


1 బ్యారెల్ = 106.02 డాలర్లు
1 డాలరు = 55.39 రూపాయిలు.


1 బ్యారెల్ = 106.02 * 55.39 = 5872.44 రూపాయిలు

1 బ్యారెల్ = 158.97 లీటర్లు

1 లీటరు = 36.94 రూపాయిలు (5872.44 / 158.97)
 
ఎక్సైజ్ డ్యూటీ      = 14.45 రూపాయిలు

ఎడ్యుకేషన్ టాక్స్ = 0.43 రూపాయిలు
డీలర్ కమీషన్     = 1.05 రూపాయిలు
రిఫైనింగ్               = 0.52 రూపాయిలు
క్యాపిటల్ కాస్ట్ }
ఆఫ్ రిఫైనరి          = 6.00 రూపాయిలు
వ్యాట్                   = 5.5 రూపాయిలు
క్రూడ్ ఆయిల్ }
కస్టం డ్యూటీ        = 1.1 రూపాయిలు
పెట్రోలు కస్టం      =  1.54 రూపాయిలు
రవాణా ఛార్జీలు   =  6.00 రూపాయిలు

మొత్తం 73.53 రూపాయిలు. పన్నులు లేని పక్షంలో లీటరు పెట్రోలు ధర 49.46 రూపాయిలు. గత కొద్ది నెలలుగా మార్కెట్లో బ్యారెల్ ధర తగ్గుతూనే వస్తోంది. మార్కెట్లో బ్యారెల్ ధర 140 డాలర్లు పలికినప్పుడు కూడా ఇప్పుడున్నంత ధరలు లేవు. పైగా ఇండియన్ ఆయిల్ కంపెనీలకు కొనుగోళ్ళలో డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి పెట్రో ధరలు ఇంకా తక్కువగా ఉండాలి.పాకిస్తాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లో కంటే మనదేశంలోనే పెట్రో ఛార్జీలు అధికంగా ఉండటం గమనార్హం. డాలర్ రేటు పెరగటం వలన తామెంతో నష్టపోతున్నామని ఆయిల్ కంపెనీలు నమ్మబలుకుతున్నా, ఏటేటా పెరుగుతున్న లాభాలు, ఇరవై శాతం పడిపోయిన బ్యారెల్ ధరలు అదంతా కట్టుకథేనని తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు 2009-10 సంవత్సరానికి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీ లాభాలు పన్నులు పోగా 1301.37 కోట్లు కాగా, 2010-11 సంవత్సరాంతానికి 1539.01 కోట్లు.  అలాగే సబ్సిడీ ఇస్తున్నామని ఉదరగొట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రభుత్వాలు ఎన్ని పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నాయో పై క్యాలిక్యులేషన్ ద్వారా అర్థమవుతుంది.


ఇంధన వనరుల పై ప్రభుత్వాలకు మొదటి నుంచి సరైన అవగాహన, శ్రద్ధ లేదు. ఎన్ని నిక్షేపాలు కనుగొని, బేసిన్ల కొద్దీ బావులు తవ్వుకున్నా శాశ్వతమైన, సూర్య శక్తికి అవి ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాలేవు. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించి, పరిశోధనలు జరిపించి , ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడం విడ్డూరం. ఆకు పసరులతోను, నీళ్ళతోనూ, గాలితోను, సౌర శక్తితోను వాహనాలు నడిపి చూపించిన యువ శాస్త్రజ్ఞులకు దక్కిన గుర్తింపేది? భారత ఆర్థిక ములాలను శాసిస్తున్న కంపెనీలపై చూపించే అవ్యాజమైన ప్రేమాభిమానాల్లో ఆవగింజంతైన వారిపై చూపించారా?


  పెరుగుతున్న జనాభాకు భవిష్యత్ తరాలకు సరిపడే ఇంధన నిల్వల గురుంచి ఆలోచించరు. సరైన రోడ్లుండవు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సవ్యంగా ఉండదు. ఉన్నా అన్ని రూట్లలో తిరగదు. ఇవేమీ లేకున్నా ఇబ్బడి ముబ్బడిగా కార్ల కంపెనీలకు, మోటారు వాహనాల పరిశ్రమలకు పర్మిట్లు మాత్రం ఇచ్చేస్తారు. అవన్నీ రోడ్ల పైకొచ్చి ఉన్న చమురంతా అరాయించుకొని, కాలుష్యాన్ని వెదజల్లుతూంటే, ఆ తర్వాత సబ్సిడీలని నష్టాలని ధరలు పెంచి, రెట్టింపు ధరలు చెల్లించి దిగుమతులు చేసుకుని, పైపులు తవ్వుకొని పక్క దేశాల దయా దాక్షణ్యాలపై అధారపడతారు. అమెరికా తుమ్మినా అదిరిపడటం నేర్చుకున్నారు కాబట్టి ఇతర దేశాలతో ఏవైనా చమురు ఒప్పందాలవీ చేసుకున్నా అవి సఫలమయ్యే ఛాన్సులు లేవు. అమెరికా వద్దంటే కిక్కురుమనకుండా ఒప్పుకోవాల్సిందే.( ఈ మధ్యే ఇరాన్ విషయంలో జరిగిన సంఘటనే దానికి ఉదాహరణ. అమెరికా ఒత్తిళ్ళకు తలొగ్గి మనదేశం 11% శాతం దిగుమతులు తగ్గించుకోవడానికి ఒప్పుకొంది). ప్రపంచ చమురు సంక్షోభానికి భారత్ కారణం అని అమెరికా అంటే నంగి నంగిగా నీళ్ళు నమలటం తప్ప నోరు పెగల్చే సాహసం కూడా చెయ్యరు. కులం పేరుతో, మతం పేరుతో, కుటుంబం పేరుతో, సినీ అభిమానం పేరుతో వేలం వెర్రిగా రాజకీయ నాయకులని ఎన్నుకొనే ప్రజలకు అంతకంటే గొప్ప పాలకులని ఆశించటం తప్పేమో? అయినా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు ఈ తంతుని నిర్లిప్తంగా మనకేమి పట్టనట్లు గమనించలేదు. మహా అయితే వారం పది రోజులు గుండెలు బాదుకుంటాం. తర్వాత మళ్ళీ మాములే. ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర ఇంజను స్విచాఫ్ కూడా చెయ్యం.  కాదంటారా?



4 comments

బాగా చెప్పారు. మిగతా ఏదేశంలోనూ లేని విధంగా మనదేశం లో ఇలా ఎందుకు ఉందో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి.
ప్రభుత్వం సాయం చెయ్యకపోయినా, ప్రైవేట్ గా తక్కువ ఖర్చులో ఎవరింట్లో వారు ఇంధనప్రత్యామ్నాయాలను ఉపయోగించడం(Not about petrol) తెలుసుకునేలా చెయ్యగలిగితే వేరే గత్యంతరం లేక ప్రభుత్వం కూడా వీటి వైపు దృష్టి సారించ వచ్చు.

Reply

మనోహర్ గారు,

స్వాగతం.నా టపా మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు

Reply
May 24, 2012 at 7:16 PM

"కులం పేరుతో, మతం పేరుతో, కుటుంబం పేరుతో, సినీ అభిమానం పేరుతో వేలం వెర్రిగా రాజకీయ నాయకులని ఎన్నుకొనే ప్రజలకు అంతకంటే గొప్ప పాలకులని ఆశించటం తప్పేమో?" - అది సంగతి.

Reply

తెలుగుభావాలు గారు,

మీ స్పందనకు కృతజ్ఞతలు

Reply
Post a Comment