చాన్నాళ్ళ తర్వాత నా బాల్యమిత్రుడు దివాకరం హైదరాబాద్ వచ్చాడు.కోల్ కత్తాలో ఉద్యోగం.ఏదో పని మీద హైదరాబాద్ వచ్చి పొద్దున్నే ఫ్లైటు దిగేశాడు.వారం రోజులు ముందే వస్తున్నానని చెప్పేశాడు కాబట్టి తప్పించుకోడానికి వేరే దారిలేక శంషాబాద్ దాకా కారులోపోయి అతన్ని రిసీవ్ చేసుకొని మా ఇంటికి తీసుకొచ్చాను.
దివాకరం సత్తెకాలపు మనిషి.తనేదో,తనపనేదో అన్నట్లు ఉంటాడు.బాహ్య ప్రపంచంతో తనకెంత అవసరమో అంత మేరకే సంబంధబాంధవ్యాలు పెట్టుకొని,మిగతా సమయాల్లో,శత్రుభయం కలిగినప్పుడు డిప్పలోకి శరీరాన్ని లాక్కొనే కూర్మంలా తన లోకంలోకి జారిపోతాడు.ఆ తర్వాత,ఇల్లు కూలిపోతున్నా,ప్రపంచం తలక్రిందులైపోతున్నా అతనికి పట్టదు.పట్టించుకోవాలన్న ఆసక్తి ఉండదు.అంచేత కరెంట్ అఫైర్స్ లో కొంచెం వీకే.
స్నానాలు చేసి,టిఫన్లు గట్ర ముగించాక 'బ్రేవ్' మని తేంచి
"ఊళ్ళో మాంచి సినిమా ఎదైనా ఉంటే చెప్ప రా, చూసి చాన్నాళ్ళయ్యింది.వెళ్దాం" అన్నాడు హఠాత్తుగా.
నాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.
"సినిమానా..ఇప్పుడా?..కుదరదు" అన్నాను తమాయించుకొని.
"అవున్లే.అసలే ఎండలు మండిపోతున్నాయి.దానికి తగ్గట్లు ఇప్పుడొచ్చే సినిమాల్లో కొత్తదనం ఉండటం లేదు.రోట్లో తలదూర్చి రోకలిపోటుకి ఏడవడమెందుకు? చల్లగా ఇంటిపట్టునే ఉండి సాయంత్రం అలా టాంక్ బండ్ వైపో రవీంద్రభారతి వైపో వెళ్దాం.కాస్త కాలాక్షేపం గా ఉంటుంది."
"అదీ కుదరదు !"
"అదీ కుదరదా? అదేమిట్రా అలా అంటావ్? హఠాత్తుగా ఊడిపడి నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నానా ?"
"ఎంతమాటనేశావ్ రా! స్నేహగుణంలో కర్ణుడి లాంటి వాన్ని.నన్నే శంకిస్తావా?"
"శంకించక ఏం చెయ్యమంటావ్? ఆర్నెళ్ళ క్రితం హైదరాబాదు వస్తే అప్పుడూ ఇలానే అన్నావు.ఇప్పుడూ అదే అంటున్నావ్.మళ్ళీ కర్ణుడినంటూ కబుర్లు.అసలు నీకు నాతో సరదాగా సమయం గడపాలనుందా లేదా?"
"అదా నీ అనుమానం.ఏం చెయ్యమంటావ్రా బాబు? మా ఖర్మ అలా తగలడింది.అప్పుడేమో మాహానుభావుడు చిదంబరం నిప్పురాజేశాడు.రోజు మార్చి రోజు బందులతో సతమతమయ్యి చచ్చాం.తుమ్మితే బందు,దగ్గితే బందు.వాళ్ళకేం దుక్కలా పుష్టిగా బానే ఉంటారు.కూలీనాలీ చేసుకునే కార్మికులే మధ్యలో ఖర్చైపోతున్నారు.ఇప్పుడేదో కాస్త ప్రశాంతంగా ఉందనుకుంటే ఓదార్పుయాత్రల వల్ల మళ్ళీ బందులు మొదలయ్యాయి."
"ఓదార్పుయాత్రా? తీర్థయాత్రలు,దండయాత్రలు విన్నాం కానీ ఈ ఓదార్పుయాత్ర ఏంట్రా,ఎప్పుడూ వినలేదు."
"నువ్వే కాదు,మొన్నటిదాకా ఎవరూ వినలేదు.ఇదో కొత్తసీసాలో పాతసారాయి టైపు కాన్సెప్టు లే.దుఃఖం లో ఉన్న వాళ్ళని ఓదార్చి రావటం,వీలైతే వాళ్ళకేదైనా నష్టపరిహారం ఇవ్వడం అన్నమాట.చెప్పుకోడానికి సింపుల్ గానే ఉన్నా, ఆచరణలో మాత్రం ఇందాక నువ్వు లిస్టు చేసిన రెండు యాత్రలలో,రెండో దానికి కాస్త దగ్గరగా ఉంటుంది."
"అంతా అయోమయంగా ఉంది.దుఃఖం లో ఉన్న వాళ్ళని ఓదార్చి రావటామా? ఎవరు దుఃఖంలో ఉన్నారు? ఎవరు ఓదారుస్తున్నారు? కాస్తా అర్థమయ్యేలా చెప్పరా బాబు"
"ఇదిగో ఇదే నీతో వచ్చిన చిక్కు.మునీంద్రుడిలా ముక్కుమూసుకొని నీ లోకంలో నువ్వు తప్పస్సు చేసుకోకుండా అప్పుడప్పుడూ జన జీవనస్రవంతిలోకి రా.అన్ని విషయాలూ అవగతమవుతాయి.నాకీ కంఠశోష తప్పుతుంది.ప్రస్తుతానికి తప్పదు కాబట్టి ,చెప్తాను విను.పొయిన సంవత్సరం సెప్టంబరులో జరిగిన ఘోర ప్రమాదంలో వైయస్సర్ దుర్మరణం పాలయ్యారు కదా ?"
"అవున్రా పాపం.అంత అర్థాంతరంగా పోతారని ఎవరూ ఊహించలేదు."
"మరే.'అయ్యో! ఇలా జరిగిందేమిట'ని అప్పుడు అంతా బాధపడ్డారు.తట్టుకోలేని అభిమానులు గుండెలాగిమరణిస్తే,ఇంకొంత మంది ఆత్మహత్య చేసుకున్నారు.కూలీనాలీ చేసుకునే శ్రామికుల దగ్గర్నుంచి కార్లలో తిరిగే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు దాక,అనకాపల్లి నుంచి అమెరికా దాక ఇదే తంతు అనుకో."
"జనాదరణ ఉన్న నాయకుడు కదా,హఠాత్తుగా పోయేసరికి జీర్ణించుకోవడం కష్టమయ్యుంటుంది.అయినా నీ పిచ్చిగానీ అభిమానానికి ఎల్లలేమిట్రా?"
"నిజమే.ఆ అభిమానం శృతిమించే ఆరొందల మంది ప్రాణాలు కోల్పోయారు."
"ఆరొందల మందే !!!!"
"అవున్రా.పదో పరకో కాదు,యాభైయ్యో వందా కాదు.అక్షరాలా ఆరొందల పైచిలుకు మంది అశువులు బాసారు !".
"ఏంట్రా నువ్వనేది ?! మనుషులనుకున్నావా,పిట్టలనుకున్నావా? అరోందల మందేంటి,ఉట్టి పుణ్యానికి ప్రాణాలు కోల్పోవడం ఏంటి? గాంధీ నెహ్రూ లాంటి దేశనాయకులు,మదర్ థెరీసా లాంటి మనవతామూర్తులు చనిపోయినప్పుడే అంతమంది మరణించలేదు.వినడానికే విడ్డూరంగా ఉంది.యావరేజి సినిమాకి చూపించే హైప్డ్ కలెక్షన్స్ లా ఉన్నాయి ఈ లెక్కలు.నిజంగా అంతమంది పోయారంటావా?"
"ఇదిగో నువ్వలా భేతాళ ప్రశ్నలు వేస్తే నేను చెప్పనంతే."
"బాబ్బాబు.అంత మాటనకు."
"అయితే విను.తండ్రి కోసం ప్రాణాలు తృణప్రాయంగా వదిలేసిన వీరాభిమానుల్ని చూసి జగన్ మనస్సు క్షోభించింది.చనిపోయిన ఆభిమానుల కుటుంబాలనన్న్నిటినీ పరామర్శించి,వాళ్ళను ఓదార్చి,బుగ్గలు నిమిరి,ఆత్మవిశ్వాసం నింపిరావాలని కంకణం కట్టుకున్నారు.అందుకే ఈ ఓదార్పుయాత్ర.ఎండా వానా లెక్కచెయ్యని మొండి బాటసారిలా గత వారం రోజులుగా ఆయన ఊళ్ళన్నీ చెడామడా తిరిగేస్తున్నారు.అందులో భాగాంగా తెలంగాణలో అడుగుపెట్టారు."
"తండ్రికి తగ్గ తనయుడన్నమాట.మంచిదే కదా ?!"
"ఏం మంచో ఏమో కానీ,గిట్టని వాళ్ళు చాలా అనుకుంటున్నారు."
"గిట్టని వాళ్ళెప్పుడూ ఏదో ఒకటి అంటార్లే.లోకులు కాకులు అన్నారు కాదా.ఏమనుకుంటున్నారింతకీ ?"
"ఏముంది? 'ఓదార్పుయాత్రకింత మందీ మార్బలం దేనికి? హంగామా,మీడియా కవరేజి దేనికి? రాజకీయ ప్రసంగాలు దేనికి? ఇది ఓదార్పుయాత్రా,ఎన్నికల పర్యటనా? నిజంగా ఓదార్చాలనుకున్న వాళ్ళెవరూ ఇంత పబ్లిసిటీ ఇచ్చుకోరు.ఓదార్చాలనుకున్నవాడు తన స్థాయికి తగ్గట్టు ఏ విమానంలోనో, హెలికాప్టర్లోనో, అధమపక్షం స్వంతవాహనాల్లోనో రాక,ఇలా రైలుపెట్టెల్లో తిరిగి,సాధారణ ప్రజానీకాన్ని ఇబ్బందులపాలు చెయ్యడం దేనికని' చెవులు కొరుక్కుంటున్నారు."
"పాయింటే!అయితే దానికీ,తెలంగాణకీ,ఇప్పుడీ బంద్ కీ సంబంధం ఏమిటి? "
"అక్కడికే వస్తున్నా.జగన్ సమైక్యవాది కదా.తెలంగాణలో వచ్చి ఆయన ఓదార్పేదో ఆయన చేసుకోకుండా ఎక్కడ సమైక్యవాదాన్ని ప్రచారం చేస్తాడో అని తెలంగాణవాదులు భయపడుతున్నారు.ప్రత్యేక తెలంగాణ కోసం టీఆరెస్ ఎమ్మెల్యేలు,ఎంపీలు బోలెడన్ని నిరాహారదీక్షలు,ధర్నాలు చేసి రాజీనామాలు చేసేశారు కదా."
"తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి టీఆరెస్ రాజీనామాల కేంలే.పదవిలో ఉండి వాళ్ళు పొడిచిందేమీ లేదు.కార్మికశాఖా మంత్రిగా కేంద్రంలో కేసియార్ నిర్వాకం చుశాం కదా.తప్పిపోయాడని వాళ్ళ పార్టీ వాళ్ళే పోలీస్ స్టేషన్లో రిపోర్టులిచ్చుకున్నారు.వాళ్ళ సంగతి చెప్పకు.నిరాహార దీక్షలు,ధర్నాలు అంటున్నావు.ఎవరైనా పోయారా?"
"నాయకులెవరూ పోలేదు కానీ,విద్యార్ధులు చాలా మంది అత్మహత్యలు చేసుకున్నారు"
"అరెరె...విద్యార్థులు చనిపోయారా? కామన్ సెన్స్ ఉన్నవాడెవడు కేసియార్ ని నమ్మడే.వాళ్ళెలా ఈ చట్రంలో ఇరుక్కున్నారు ?"
"పిచ్చివాడా! ఏ ఉద్యమంలోనైనా బలిపశువులయ్యేది కార్యకర్తలు,విద్యార్థులే.పథకం రూపొందించటం నాయకుల వంతైతే,ఆ నాయకుల్ని గుడ్డిగా నమ్మి వాళ్ళ కోసం,జీవితాలని పణంగా పెట్టేది కార్యకర్తలూ,విద్యార్థులే.తన అస్థిత్వం నిలుపుకోవడం కోసం కేసియార్ మొదలుపెట్టిన రాజకీయ డ్రామా,విద్యార్థుల రంగప్రవేశంతో సీరియస్నెస్ సంతరించుకొని ఇప్పుడు అతన్నే ధిక్కరించే స్థాయికి చేరుకొంది.విద్యార్థుల భవిష్యత్తుకు దిక్సూచి కావల్సిన విద్యారంగం బ్రష్టుపట్టిపోయింది.కోదండరాం లాంటి ప్రొఫెసర్లు,లెక్చరర్లు ఉన్నవీ లేనివి చెప్పి విద్యార్థుల భావావేశాలు రెచ్చగొట్టి, నిస్సుగ్గుగా వినోదం చూస్తున్నారు."
"ఏమిటేమిటీ ? గురువులే ఉన్నవీ లేనివీ చెప్పి విద్యార్థులను ఉసిగొల్పుతున్నారా? ఏం చెబుతున్నారు?"
"చాలా చెబుతున్నార్లే! మచ్చుకొకటి.తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయట."
"అదెలా సాధ్యం? తెలంగాణా వారికే ఉద్యోగం ఇవ్వాలనుకున్నా ఇప్పుడు తెలంగాణ జనాభా ఎంత? వాళ్ళలో తాతముత్తాతల కాలం నుంచీ తెలంగాణలో ఉంటున్నదని ఎందరు? వలసవాదులెంతమంది? ఉన్న ప్రభుత్వోద్యోగాలు ఎన్ని? తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రులని ఏం చెయ్యమంటున్నారు కదా,మరి వాళ్ళ ఉద్యోగాల సంగతేంటి? అసలిది జరిగేపనేనా ?"
"చంపావు ఫో! అన్ని తెలివితేటలు ఎవరికి ఏడ్చాయి.ఎవడి అజెండా వాడు విద్యార్థుల మీదకు రుద్దుతున్నాడు.శివాలెత్తిన విద్యార్థులు విచక్షణాజ్ఞానం కోల్పోయి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు.ప్రజాప్రతినిధుల్ని రాజీనామా చెయ్యమని బెదిరిస్తున్నారు"
"ఇంతకీ అసలైన వాళ్ళు రాజీనామా చేశారా? "
"అసలైన వాళ్ళా ? వాళ్ళెవరు ? "
"తెలంగాణ పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులుగా తమను తాము గ్లోరిఫై చేసుకున్నకోదండరాం,ఆయనతో పాటూ ఉద్యమాలు చేస్తున్న ఇతర ప్రొఫెసర్లు,లెక్చరర్లు"
"లేదు"
"మరి ఏ అర్హతతో ఇతరులను రాజీనామా చెయ్యమని బెదిరిస్తున్నారు? ఇతరులకు చెప్పడానికేనా నీతులు?"
"నీ బుర్రకివాళ ఏదో అయిందిరోయ్."
"జగన్ విషయం మధ్యలోనే వదిలేశావు."
"వదిలేయ్యలేదు.అది చెబుతూంటేనే యక్ష ప్రశ్నలతో నువ్వు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశావు.టీఆరెస్ నాయకులంతా రాజీనామాలు చేసేశారు.ఇతరులెవ్వరూ తమకు ఎదురుగా పోటికి నిలబడరాదని,నిలబడితే తెలంగాణా ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.వేరుపడాలన్న కాంక్ష ప్రజల గుండెల్లో బలంగా రగులుతున్నంతవరకూ వాళ్ళ ఆటలు సాగుతాయి.ఆ మంటలు చల్లారిపోకుండా అప్పుడప్పుడు సినిమా షూటింగ్స్ పైనో,థియేటర్ల పైనో, లేక కాలేజీల పైనో దాడి చేసి ప్రజల్ని రెచ్చగొడుతూంటారు.త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.ఇలాంటి సమయంలో జగన్ వచ్చి సమైక్యవాదం ప్రచారం చేస్తే,జనాల మనస్సు ఏకొంచెమైనా మారితే, తమ పని రెంటికీ చెడ్డ రేవడి లా తయారవుతుందని అతని ఫ్లెక్సీలు,బ్యానర్లు దగ్ధం చేసి,రావటానికి వీళ్ళేదని అల్టిమేటం జారీ చేశారు."
"ఇదేం అన్యాయంరా ? తెలంగాణ ఏమైనా పాకిస్తానా? అక్కడికి వెళ్ళడానికి పాస్ పోర్టు,వీసా కావాలా? దేశంలో ఎక్కడైనా,ఎప్పుడైనా తిరిగే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది.తెలంగాణవాదులు సీమాంధ్రలలో పర్యటించి తమ వాదాన్ని ప్రచారం చేసుకోవచ్చు.సమైక్యవాదులెవరైనా తెలంగాణ వచ్చి తమ గోడు వెల్లబోసుకోవచ్చు.
కాదనడానికి వీళ్ళెవరు? వీళ్ళకేం హక్కుంది? సినిమా షూటింగ్స్ పైన,కాలేజీల పైన దాడి చెయ్యడమేంటి? సినిమాలు రిలీజైతే థియేటర్ల మీద పడటం ఏంటి? చూడాలనుకున్న వాడు సినిమా చూస్తాడు.ఇష్టం లేనివాడు ఇంట్లో కూర్చుంటాడు.మధ్యలో వీళ్ళ పెత్తనమేమిటి? అంటే సినిమాలు చూస్తేనో,ఫలానా కాలేజిలో చదువుకుంటేనో తెలంగాణా ఉద్యమం నీరుగారిపొతుందా? అంత బలహీనమైనదా ఉద్యమం ? అటువంటప్పుడు దాన్ని మొయ్యటం దేనికి? ఇతరులెవ్వరు ఎన్నికల్లో పోటీ చెయ్యరాదా ? ఏం పోటికి దిగితే గెలవలేమని భయమా? ఇంత జరుగుతూంటే లాయర్లు,పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఎలా చూస్తూ కూర్చొంది?"
"ఒరెయ్ ఒరెయ్ అంతలా ఆవేశపడకు.నిదానించు.వ్యవస్థను సమూలంగా పెల్లగించేసే ప్రాథమిక ప్రశ్నలే లేవదీశావు కానీ నా దగ్గర జవాబులు లేవు.లాయార్లు,పోలీసులు మాత్రం మనుషులు కారా? వాళ్ళకూ ఇష్టాయిష్టాలు ఉండవా? ప్రభుత్వమా? భలేవాడివే.ఆయనే ఉంటే మంగలి దేనికని ప్రభుత్వమంటూ ఒకటేడిస్తే ఈ దుస్థితి దేనికి? నిన్న జరిగిన ఓదార్పుయాత్రలో తెలంగాణవాదులు,జగన్ వర్గీయులు ఇష్టమొచ్చినట్లు కొట్టుకుంటే,పదుల సంఖ్యలో నిలిచిపోయిన ట్రైన్లలో తిండీ నీళ్ళు దొరక్క అమాయకజనం అలమటించిపోయారు.కొంతమందికి బుల్లెట్ దెబ్బలు తగిలి విలవిలలాడిపోయారు.జగన్ కారణంగా గొడవలు జరిగి జనం గాయపడ్డారని ఇటు తెలంగాణలో,జగన్ ని అరెస్టు చేశారని అటు సీమలో బలవంతంగా బంద్ చేయిస్తున్నారు.కొంతమంది రైళ్ళకు నిప్పు పెట్టారు.ఇట్లాగే గత డిసెంబరులో,అటు తెలంగాణలో,ఇటు సీమాంధ్రలో, బస్సులు ధ్వంసం చేసి నిప్పు పెడితే,నష్టాలు పూడ్చుకోలేక ఆర్టిసీ రేట్లు పెంచి ప్రజల నడ్డివిరిచింది.ధ్వంసం చేసిందెవరు,శిక్ష అనుభవిస్తున్నదెవరు ?ఎవరు చేసుకున్న పాపం ఇది ? "
"దారుణం! అసలిది ప్రజాస్వామ్యమా లేకా నిరంకుశత్వమా ? ఆపత్కాలంలో నిజానిజాలు వెలికితీసి ప్రజలకు సత్యం బోధపరచి చైతన్యవంతుల్ని చెయ్యాల్సిన మీడియా ఏం చేస్తోంది ? "
"సరిపోయింది.అడగాల్సిన దాని గురుంచే అడిగావులే.మీడియా అంటేనే మాయాజాలం.నిజాన్ని నిర్భయంగా వెల్లడించే రోజులు ఎప్పుడో పోయాయి.
ఇప్పుడున్నదంతా స్వార్థం.ఒకళ్ళ మీద ఒకరికి బురదజల్లుకోడానికే తీరిక లేదు,ఇక వార్తలు సేకరించేదెవరు? ఏ వార్తయినా ఒకేవిధంగా అన్ని పేపర్లలోనూ,ఛానళ్ళలోనూ రావడం చూశావా? ఒక్కోక్కరిది ఒక్కో వర్షన్. ఏది నిజమో,ఏది అబద్ధమో ఎవడికి తెలుసు? "
"వ్యవస్థలన్నీ నాశనమైపోయాయన్నమాట.లాభం లేదు. నాకొక్కటే ఉపాయం కనిపిస్తోంది."
"ఏమిట్రా అది?"
"తాటిమట్ట లాంటి నాలుకలతో రెచ్చగొట్టే ప్రకటనలు చేసే నాయకులను,వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్టు చేసి జైల్లో వెయ్యాలి.విద్యార్థుల ఉద్వేగాలతో ఆడుకుంటూ ఉద్యోగాలు చేసుకునే లెక్చరర్లను,ప్రొఫెసర్లని విధుల నుంచి తొలగించి ఇతరులతో రిప్లేస్ చెయ్యాలి.రాష్ట్రంలో నిరుద్యోగం ఆ విధంగానైన కొంత తగ్గుతుంది.ఇక ప్రభుత్వ ఆస్తులను,ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తే,కఠిన కారాగార శిక్ష విధించి,నష్టపరిహారం నిందితుల దగ్గర్నుంచే ముక్కుపిండి వసూలు చెయ్యాలి.ఉద్యమాలంటూ ఉన్మాద ప్రవృత్తితో ప్రవర్తించే విద్యార్థులను రెండు మూడు వార్నింగులిచ్చి,రిపీటయితే కళాశాల నుంచి డీబార్ చెయ్యాలి.కళాశాలలు సంఘవిద్రోహ శక్తులకు వసతిగృహాల్లా మారిపోకుండా డేగకళ్ళతో పర్యవేక్షించాలి."
"ఒరేయ్ ఒరేయ్ నన్ను కాస్త ఊపిరిపీల్చుకోనియ్యి.ఇదంతా చెబుతోంది నువ్వేనా? ఏమీ పట్టనట్లుండే నీలో ఇంతటి ఆవేశమా ?"
"ప్రజలు కూడా నాలాంటి వాళ్ళేరా.వాళ్ళు కూడా అన్నీ గమనిస్తూ మౌనంగా ఉంటారు.సహనం నశించి తిక్కరేగితే మెత్తటి చెప్పుతో గట్టిగా బుద్ధిచెబుతారు"
"ఏదో నీ తాపత్రయం కానీ,ఆ రోజొస్తుందంటావా?"
"రాకపోతే మన రాష్ట్రం ఇంకో పాతికేళ్ళు వెనక్కిబడిపోయి,బీహార్ లా తయారవుతుంది."
"సర్లే! మాంచి వేడిమీదున్నట్లున్నావ్.టీవీ పెడతాను.కొంచెం చల్లబడు"
"ఆగాగు.ఏంటో బ్రేకింగ్ న్యూసట.స్క్రోలింగ్ వేస్తున్నారు...సరిగ్గా కనిపించడం లేదు"
"మరేం లేదు.జగన్ ఓదార్పుయాత్ర రద్దయిందని తెలిసి గుండె ఆగి కొంతమంది అభిమానులు మరణించారట..అరె..అదేమిట్రా అలా కూలబడిపోయావ్.ఏమయింది? "
" ఉన్నట్లుండి గుండె పట్టేసినట్లుంది."
"గుండెలో పట్టేసిందా! ఒక్క నిమిషం ఓపికపట్టరోయ్.యువ ఎంపి గారి ఓదార్పు లిస్టు అప్డేటు చెయ్యాలి.సమయానికి నా మొబైల్ ఫోను ఎక్కడ చచ్చిందో ఏంటో"
"హతోస్మి!! "
3 comments
Good one! :-D :-D
Replysuper!!
Replyమధురవాణి గారు,మందాకిని గారు కృతజ్ఞతలు
Reply