బెంగుళూరులో అక్షరాభ్యాసం

క్షరాభ్యాసం!

అసలు ఆ ప్రక్రియే నాకు కొత్త !

దీని గురుంచి ఎవరో చెబితే వినటం,సినిమాల్లో చూడటమే తప్ప ప్రత్యక్షంగా అందులో పాల్గొన్నది ఎప్పుడూ లేదు.మాది రాయలసీమ గ్రామీణ నేపథ్యమున్న కుటుంబం కావటమే అందుకు ప్రధాన కారణం.ఇటువంటి ఆచారాలు పట్టింపులు మా పల్లెటూర్లో లేవు.ఏ మూడేళ్ళకో,ఐదేళ్ళకో మొక్కుబడిగా బళ్ళో చేర్పించడం తప్ప,దానికోసం ప్రత్యేకంగా అక్షరాభ్యాసం లాంటి పూజా కార్యక్రమాలు చెయ్యటం ఎవరికీ అలవాటు లేదు.అయితే ఇలాంటి పండుగకొకటి మా ఇంట్లోనూ జరిగితే బావుంటుందని నేను అనుకునేవాన్ని.మనకు అలవాటు లేకపోయినా,మంచి ఎక్కడున్నా స్వీకరించమని పెద్దలు చెప్పారు కదా.

ఆ రోజు రానే వచ్చింది.మా పాపకు అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించుకున్నాం,బాసరలో కాకుండా,బెంగుళూరులో.బెంగుళూరులో సరస్వతీదేవి ఆలయాలు ఉన్నాయా,కనీసం చిన్న గుడైనా వుందా, ఉంటే ఎక్కడుందో చెప్పమని మా కోలీగ్స్ ని ఆరాతీశాను.మిత్రులు నాలుగైదు గుళ్ళ పేర్లు చెప్పారు కానీ,నా మనస్సు మాత్రం ఒక గుడి చుట్టునే పరిభ్రమించింది.

అది చామరాజపేటలోని శ్రీ శారదాంబ గుడి.శివాంశ సంభూతుడైన ఆదిశంకరాచార్యులు శృంగేరి లో స్థాపించిన శారదా పీఠానికి అనుబంధ శాఖ ఈ గుడి.అమ్మవారి విగ్రహం దివ్యంగా ఉంటుంది.అలంకరణ విశేషంగా ఉంటుంది.శారదాంబతో పాటు,ఆదిశంకరునికి కూడా ఓ ఆలయం ఉందిక్కడ.చారిత్రాతక ప్రాశస్త్యమున్న ఆలయశాఖలో అక్షరాభ్యాసం చేయిస్తే శుభప్రదంగా ఉంటుందని భావించి అక్కడే చేయించాము.

లింకు

ఆక్షరాభ్యాసం చేయించాలనుకున్నవారు ముందుగా గుడికి వెళ్ళి,శారదాంబ ఆలయంలోని పూజారిని కలిసి తమ పిల్లల జన్మనక్షత్రాలు చెప్పి,వాటికి అనుకూలమైన మంచి రోజు చెప్పమని అడగాలి.ఈ వివరాలు ఫోన్లో వెల్లడించరు.పంచాంగం చూసి ఆయనొక తేదీ నిర్ణయించాక ఆలయ ప్రాంగణంలో ఆ తేదీకి టికెట్ కొనుక్కోవాలి.ధర 100 రూపాయిలు.టికెట్ తో పాటూ పూజకు కావల్సిన సరంజామా ఏంటొ ఒక లిస్టు యిస్తారు నిర్వాహకులు.ఆక్షరాభ్యాసం రోజు ఆ సామాన్లన్నీ పట్టుకొని అలయానికి హాజరైతే,మనం యిచ్చిన టోకెన్ల ప్రకరం పూజ నిర్వహిస్తారు.అరగంటసేపు పూజ కొనసాగుతుంది.రెండేసి జంటలను గర్భగుడి పక్కన కూర్చోబెట్టి పూజ చేయిస్తారు.మగవారు పంచెకట్టులోను(బనియన్ కి కూడా మినహాయింపు లేదు),ఆడవారు చీరలోను రావాలి.ఈ విషయంలో ఖచ్చితంగా ఉంటారు.లిస్టులో ఇచ్చిన పూజాసామగ్రి మొత్తం మీరు తీసుకెళ్ళకపోయినా,దక్షిణ కొంచెం తక్కువైనా ఎవరూ కోపగించుకోరు.ఉదయం 8-11 వరకు,సాయంత్రం 5-8 వరకు పూజారులు అందుబాటులో ఉంటారు.

శారదాంబ ఆలయానికి పక్కనే శృంగేరి పీఠం వారి బుక్ ట్రస్టుంది.ఆధ్యాత్మిక పుస్తకాల పట్ల అభిరుచి గల పాఠకులకు అక్కడ అనేక పుస్తకాలు లభ్యమవుతాయి.

చామరాజపేటకు మెజస్టిక్ నుంచి చాలా బస్సులున్నాయి.అక్కడినుంచి ఆటోలో వెళ్ళినా 20 రూపాయిల కంటే ఎక్కువ కాదు.


4 comments

శుభమస్తు!

Reply
June 9, 2010 at 11:44 PM

అంతా బాగా చెప్పారు కానీ, మీ పాప పేరు మాత్రం చెప్పలేదు :(
మీ పాపకి నా దీవెన.. సకల విద్యావిజ్ఞాన ప్రాప్తిరస్తు! :-)

Reply

మీ పాపాయి బోలెడు మంచి చదువులు చదవాలి శారదా దేవి ఆశీర్వాదంతో!

బెంగుళూరు(కర్నాటక మొత్తమూనూ)గుళ్ళలో పూజలు చక్కగా చాలా సేపు సంప్రదాయ బద్ధంగా చేస్తారు. వీళ్ళ పూజ అయిపోతే తర్వాత వాళ్ళదికానివ్వచ్చు అనే తొందరపాటు అక్కడ నేను ఎప్పుడూ చూళ్ళేదు.

చామరాజ పేటలోని ఆ గుడికి ఒకసారి వెళ్ళాను. నిజంగానే అమ్మవారు జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది.

Reply

మందాకిని గారు,మధురవాణి గారు,సుజాత గారు కృతజ్ఞతలు.

@మధురవాణి గారు మా పాప పేరు అక్షయ.

Reply
Post a Comment