బాలకృష్ణ - కె.విశ్వనాథ్ ల జననీ జన్మభూమి


రస్పర భిన్నధృవాలైన నందమూరి బాలకృష్ణ,కె.విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన ఏకైక చిత్రం జననీ జన్మభూమి.బాలనటుడిగా తెరంగేట్రం చేసి అడపాదడపా స్వంత సినిమాలలో ప్రాధాన్యమున్న పాత్రలలో తళుక్కున మెరిసిన బాలకృష్ణ సోలో హీరోగా తన ప్రస్థానం ప్రారంభించాక వచ్చిన మూడవ సినిమా ఇది.ఒకరు కళాత్మక చిత్రాలను అందంగా ఆవిక్ష్కరించిన దర్శకుడైతే,ఇంకొకరు విశ్వవిఖ్యాతనటుడికి నటవారసుడైన మాస్ హీరో (నిజానికి అప్పటికి ఏ ఘనవిజయాలు బాలయ్య స్వంతం కాకపోయినా,ఎన్.టి.యార్ కున్న పుష్కలమైన మాస్ ఇమేజ్, కొడుకుగా అతనికీ సంక్రమించింది).ఇటువంటి వ్యక్తుల కలయికలో సినిమా అంటే సినీప్రియులు ఉట్కంఠతతో ఎదురుచూడటం సహజం.అయితే ఈ చిత్రం సాదాసీదాగా సాగిపోయి అటు అభిమానుల్ని,ఇటు సగటు ప్రేక్షకుడిని నిరుత్సాహపరుస్తుంది.అసలు వీరి కాంబినేషన్లో ఒక సినిమా ఉందనే విషయం కుడా చాలామందికి తెలియదంటే అందులో వింతేమీ లేదు.

సినిమా అక్కడక్కడా బావుంటుంది.ప్రధానంగా ఆత్మ లోపించింది.పాశ్చత్య పోకడలు వంటబట్టించుకుని,ఏ పనీ పాటా లేకుండా సరదాగా గర్ల్ ఫ్రెండ్(సుమలత)తో గడిపే ఓ బిజినెస్ మాగ్నెట్ కొడుకు(బాలకృష్ణ),పై చదువుల కోసం అమెరికా వెళ్ళి,పూర్తిగా మారిపొయి స్వదేశం వచ్చి తమ వ్యాపారాల్లో మోసాల వల్ల ఇక్కట్లపాలౌతున్న నిరుపేద కుటుంబాలలో చైతన్యం తీసుకొచ్చి,తండ్రి (సత్యనారాయణ)కళ్ళు తెరిపించడం చిత్ర ఇతివృత్తం.ముఖ్యంగా నిరుద్యోగులైన యువతీయువకులకు సందేశాన్నివ్వాలనే సదుద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే కథనంలో లోపాల వల్ల అనుకున్న కార్యం నెరవేరలేదు.అల్లరి చిల్లరిగా ఉండే యువకుడు అమెరికా వెళ్ళి అకస్మాత్తుగా ఎందుకు మారిపోయాడన్నదానికి సరైన కారణం లేదు.విదేశీయులు సైతం తనదేశం గురుంచి గొప్పగా చెబుతూంటే విని మారిపోయానంటాడు హీరో.అక్కడే కథ తేలిపోయింది.తండ్రిలాగా కోడుకులు ఎక్కడ పూర్తిగా వ్యాపార ధోరణి అలవర్చుకుంటారో అని తల్లడిల్లే తల్లి(శారద),తన పెద్దకొడుకులో వచ్చిన మార్పుకి సంతోషించి,తండ్రి బాధ్యతలు చేపట్టేముందు, ప్రజల కష్టనష్టాలు తెలియాలంటే ఊళ్ళు చుట్టాలని సలహా యిస్తుంది.అలా జనరల్ కంపార్టుమెంట్ లో తన ప్రయాణం ప్రారంభించిన కథానాయకుడు ఒక పల్లెటూరు చేరుకొని,ఆ ఊరిని బాగుచెయ్యాలని నిర్ణయించుకోవడం,తనలాగే జులాయైన తమ్ముడికి(శుభలేఖ సుధాకర్) జ్ఞానోదయం కలిగించి అతనితో కలిసి అనేక కార్యక్రమాలలో పాల్గొని చైతన్యం తీసుకురావడం,ఊరి ప్రజల ఆదరాభిమానాలతో పాటు ఒక చేనేత కార్మికురాలి(రాజ్యలక్ష్మి) ప్రేమను సంపాదించటం,తండ్రికి తనకి మధ్య జరిగిన పోరాటంలో తమ్ముడిని కోల్పోవటం ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు. చిన్నకొడుకు మరణంతో కుమిలిపోయిన తండ్రి తన తప్పు తను తెలుసుకోవటంతో సినిమా సమాప్తమవుతుంది.

ఈ సినిమాలో హీరోయిజం లేదు.హీరోయిజం అంటే డాన్సులు,ఫైట్లు కాదు.క్యారేక్టర్ ఎలివేషన్ లేదు.అలాగే ఏ గ్లామర్ లేని రాజ్యలక్ష్మిని ప్రధాన కథానాయిక చేసి,సుమలత ని సైడ్ హీరోయిన్ కి పరిమితం చెయ్యటం ఇంకో తప్పు.చెప్పదల్చుకున్న విషయమేదో పూర్తిగా చెప్పకపోవడం(చేనేత కార్మికుల సమస్యలు,నిరుద్యోగుల సమస్యలు,అసాంఘిక శక్తుల చేతిలో పడి వారు సృష్టించే విధ్వంసం)మరో తప్పు.బలమైన ప్రతినాయకుడు లేకపోవటం తప్పున్నర తప్పు.సత్యనారాయణ విలన్ అన్నట్లు చెబుతారు కానీ,అతని విలనిజాన్ని ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు ఏమీ లేవు ఇంజనీర్లకు లంచాలివ్వడం తప్ప.గోకిన రామారావు పల్లెటూర్లో ఆకురౌడీ.అతనే శుభలేఖ సుధాకర్ చావుకు కారకుడవుతాడు.ఎంతో హోంవర్కు చేసి గాని సినిమా ప్రారంభించని కె.విశ్వనాథ్ గారు,ఈ సినిమా సబ్జెక్ట్ మీద ఇంకొంచెం పరిశోధన చేసివుంటే,వీరిద్దరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వచ్చుండేవేమో.

సామాన్యంగా విశ్వనాథ్ గారి సినిమాలలో సంగీతానికి పెద్ద పీట వేస్తారు.ఈ సినిమాలో పాటలు కూడా అంతంతమాత్రమే.ఇక ప్రధాన తారగణం నటన పాత్రోచితంగా ఉంది.ముఖ్యంగా బాలకృష్ణ నటన విస్మయపరుస్తుంది.సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమైనా ఉందంటే అది బాలకృష్ణ నటన ఒక్కటే.ఎంతో కంట్రోల్డ్ గా ఉండే ఆయన హావభావాలు,ఆయన నటనలోని మరో కోణాన్ని చూపుతాయి.మిగిలిన సినిమాలలోని నటనంతా ఒక ఎత్తు,ఇందులోని నటన ఇంకొకెత్తు అన్నట్లుంటుంది.ఇప్పుడు మనం చూస్తున్న బాలయ్య వేరు,ఈ సినిమాలోని బాలయ్య వేరు అన్నమాట.తర్వాత వచ్చిన 'మంగమ్మ గారి మనవడు' కంటే ముందు ఈ సినిమా హిట్టైయ్యుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదేమో.


సినిమాలోంచి ఒక సన్నివేశం ఇక్కడ.




11 comments

June 17, 2010 at 1:35 AM

లోకేష్ గారూ !
నిజంగా మీరు చెప్పినట్లు ఈ సినిమా గురించి చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు మరచిపోయుంటారు. మీరు రాసినవన్నీ నిజాలే ! ఆ చిత్ర నిర్మాణంలో పాల్గొన్న ఒకడిగా కొన్ని విషయాలు...
ఈ చిత్రానికి విశ్వనాథ్ గారు హోం వర్క్ చెయ్యకపోలేదు. నిర్మాణానికి చాలా యేళ్ళకు ముందే డి.వి. నరసరాజు గారు తోలి స్క్రిప్ట్ తయారు చేశారు. అనివార్య కారణాలవల్ల అపుడు నిర్మాణం జరుగలేదు. టైటిల్స్ లో నరసరాజు గారి పేరు వున్నా అసలు నిర్మాణ సమయంలో మార్పులు చేసినది కొంపెల్ల విశ్వం గారు. అప్పుడు పరిస్థితులను బట్టి చాలా భాగం స్క్రిప్ట్ మారింది.
మరో విషయం. ప్రతిరోజూ ఉదయం ఆ రోజు తీయాల్సిన సీన్స్ గురించి సంపూర్ణ అవగాహనతో షూటింగ్ కి వచ్చే దర్శకులు... ఈ రోజు ఏం తియ్యాలో అర్థం కావడం లేదనే మాట అన్న రోజులు నిర్మాణ సమయంలో ఎన్నో ! దీన్ని బట్టి మీకర్తమై వుంటుంది... ఆయన తియ్యాలనుకున్నది వేరు, తీసినది వేరు అని.
మరుగున పడిపోయిన చిత్రాన్ని వెలికి తెచ్చి మరుగున పడిపోయిన నా అనుభవాలను గుర్తు చేశారు. ధన్యవాదాలు.

Reply
June 17, 2010 at 8:36 AM

బాగా రాసారు. "ఘల్లు ఘల్లున కాళ్ళ" అన్న పాట ఒకటి బావుంటుంది.

Reply
June 17, 2010 at 12:13 PM

నిజమేనండీ మీరు చెప్పింది. ఇప్పుడే ఆ పాట చూసాను. బాలకృష్ణది ఇలాంటి నటన నేను చూస్తానని కలలో కూడా అనుకోలేదు...భలేగా ఉంది, అస్సలు ఒవర్ ఏక్షన్ లేకుండా, చాలా బావుంది. ఈ సినిమా గురించి చెప్పినందుకు థాంక్సండీ. నిజమే ఈ సినిమా గనక హిట్ అయ్యుంటే ఈరోజు బ్లాగుల్లో బాలకృష్ణ నవ్వులపాలు అయ్యొండేవాడు కాదు.

Reply
Anonymous
June 17, 2010 at 2:13 PM

మంచి సినిమా గుర్తు చేసారు. విశ్వనాథ్ సినిమాలు ఏదీ వదలకుండా చూసే నేను ఈ సినిమా కూడా చూసాను.
నిజమే, బాలకృష్ణ చాలా బాగా చేసిన కొద్ది సినిమాలలో ఇది ముందుగా చెప్పుకోవాలి.
విశ్వనాథ్ ఏ నటుడితోనైనా బాగా నటింపచేయగలరనడానికి ఇది ఒక ఉదాహరణ.
ఈ సినిమా ఫ్లాపయినా నాకు మాత్రం నచ్చింది. మహదేవన్ సంగీతం బాగుంటుంది.
నిజానికి ఇది విశ్వనాథ్ టైపు సినిమా కాదు. సినిమా పేరు కూడా ఆయన సెంటిమెంటుకు తగ్గట్టు శ తో ప్రారంభమవలేదు.
ఈ సినిమాకి పబ్లిసిటీ కూడా సరిగా జరగలేదు.

మన తెలుగువాళ్ళకి ఇలాంటి సోషలిజం టైపు సినిమాలు నచ్చవనుకుంటాను.
ఇలాంటి కథతోనే దాసరి, NTR తో విశ్వరూపం తీసారు. ఫ్లాపయింది.
చిరంజీవి రుద్రవీణ తీస్తే అవార్డులు వచ్చాయికాని. సినిమా ఆడలేదు.

Reply
June 17, 2010 at 2:52 PM

"మిగిలిన సినిమాలలోని నటనంతా ఒక ఎత్తు,ఇందులోని నటన ఇంకొకెత్తు అన్నట్లుంటుంది."
నిజమండి. ఈ సినిమా మొదటిసారి చూసినపుడు చాలా ఆశ్చర్యపోయాను. అతను బాలకృష్ణేనా అని. మీరన్నట్టు ప్రతీ ఎక్స్ప్రెషన్ చాలా కంట్రోల్డ్ గా ఉంటుంది.

Reply

@SRRao గారు,
సినిమాకు సంబంధించి మీ విలువైన అనుభవాలను పంచుకున్నందుకు కృతజ్ఞతలు.ఆ సినిమాతో ప్రత్యక్ష అనుభవమున్న మీనుంచి కామెంట్ రావటం చాలా సంతోషాన్ని కలిగించింది.

@ప్రసీద గారు,
అవునండి.ఆ పాటొక్కటే వినగానే హత్తుకుంటుంది

@సౌమ్య గారు,
సమరసింహారెడ్డి,నరసింహనాయుడు చిత్రాలు సాధించిన ఘనవిజాయలు ఒక రకంగా బాలయ్యకు కీడే చేశాయని చెప్పాలి.ఆ సినిమాల తర్వాత బాలయ్య దర్శకులు నేలవిడిచి సాము చెయ్యబట్టే పలనాటి బ్రహ్మనాయుడు,విజయేంద్రవర్మ లాంటి చిత్రాలొచ్చాయి.

@బోనగిరి గారు,
ఈ సినిమాలో చాలా లోపాలున్నాయి.అందుకే ఒక ఫెయిల్యూర్ గా మిగిలిపోయిందని నా ఆబిప్రాయం.కథనం పక్కగా ఉండి ఉంటే,కమర్షియల్ గా ఫ్లాపైనా మంచి చిత్రం చుశామన్న అనుభూతి మిగిలేది.రుద్రవీణలో చెప్పదలుచుకున్న విషయం మీద దర్శకుడికి క్లారిటీ వుంది.ఈ సినిమాలో అది లోపించింది.

@శిశిర గారు,
నిస్సందేహంగా అది బాలకృష్ణే.ఆయన నటనలోని ఇతర పార్శ్వాలను స్పృశించిన అతికొద్ది సినిమాలలో ఇదొకటి .

Reply
June 19, 2010 at 6:38 PM

Very nice.

Reply

రాంనర్సింహ గారు కృతజ్ఞతలు

Reply
June 21, 2010 at 12:23 AM

అందరు మరచిపోయిన ఒక మంచి చిత్రాన్ని గుర్తు చేసారు..ధన్యవాదాలు..! మీరన్నట్లు ఈ చిత్రం తీసేసమయానికి బాలకృష్ణకి ఒక ఇమేజ్ అంటూ లేదు..ఇంకా తండ్రి చాటు నటుడే, కాకపోతే ఆ సమయంలో ఆయన నటన అలానె ఉండేది..ఉదా: సాహసమే జీవితం, డిస్కోకింగ్..ఇలా..! మరో విషయం యన్.టి.ఆర్ గారికి కూడ మీరన్నట్లు మాస్ అన్న ఒక్క ఇమేజ్ మాత్రమే లేదు..అప్పటికే ఆయన మహానటుడి స్థాయికి చేరుకున్నారు..కావున మీరు కేవలం ఒక్క మాస్ ఇమేజ్ అంటూ చట్రం గీయకండి.. ఈ" మాస్ " అన్న పదం ఇప్పుడున్నంతగా పాపులర్..ఆ కాలం లో లేదు..! అసలు " మాస్ " అన్న పదానికి అర్థమే మార్చివేసారు మన సినీజీవులు. ఇక తప్పులా అవి ప్రతి సినిమాలోనూ ఉంటాయి..అలాగే ఈ సినిమాలోనూ..! నాకు అప్పట్లో పిచ్చి పిచ్చిగా నచ్చింది..! చాలా కూల్ గా చూస్తూ కూర్చున్నా ఈ సినిమాని థియేటర్‌లో

Reply
June 21, 2010 at 8:18 AM

నిజమే మంచి సినిమా ఇంకా చాలా వివరాలు ఇచ్చారు అందరు. విశ్వనాధ్ గారు ఎన్టీర్ గారి మాట తీసి వెయ్యలేక తీసేరు కాని ఆయన ఆసక్తి తో తీయలేదని అంటారు కదా.

Reply

@కమల్ గారు,

ధన్యవాదాలు.

ఎన్.టి.యార్ మహానటుడే.అందులో అణుమాత్రం సందేహం లేదు.కానీ మిగాతా మహానటులతో ( ఏఎన్నార్ మొదలైన వాళ్ళు) పోల్చితే ఆయనకు మాస్ ప్రేక్షకుల ఆదరాభిమానాలు దండిగా ఉన్నాయి.ఆయన నటవారసుడిగా బాలకృష్ణకు ఆ బలగం అండ దండ కూడా ఉండేది.

@భావన గారు,
విశ్వనాథ్ గారు ఈ సినిమా ఒప్పుకోకపోవటానికి కారణం నాకైతే తట్టటం లేదు.ఇవన్నీ ఊహాగానాలేనని నా నమ్మకం.

Reply
Post a Comment