'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా' అని మనుస్మృతి చెబుతోంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారని దీని భావం. మన దేశం గురించి మన సంస్కృతి గురించి గొప్పగా ఎన్ని బాకాలు ఊదినా దేశ రాజధానిలోనే ఒక స్త్రీ మానప్రాణాలకు రక్షణ లేనప్పుడు అదంతా అపహాస్యం కాకమానదు.
ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఉదంతాన్ని తలచుకుంటేనే నెత్తురు మరిగి మనస్సు విచలితమవుతోంది. మృగత్వం మూర్తీభవించిన ఆరు మంది మగాళ్ళు పశువాంఛతో ఒక అమ్మాయిని దారుణంగా మానభంగం చేసి ఆమెను, ఆమె స్నేహితున్ని ఇనుపరాడ్‌తో తీవ్రంగా గాయపరచి కదులుతున్న బస్సులోంచి నగ్నంగా నడిరోడ్డు మీదకు విసిరేశారు. ఆదుకొనే నాథుడు లేక అచేతనావస్థలో వారిద్దరూ ఎంతసేపలా పడిపోయారు తెలియదు. తగిలిన గాయాలలాంటివి. ఆ అమ్మాయి దయనీయ స్థితి వింటే మానవమాత్రుడికెవరికైనా కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరక్క మానదు. జరిగిన ఘోరం కారణంగా ఆమె ప్రేవులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బ్రతికినా భవిష్యత్తులో పెళ్ళి చేసుకొని సంసారం చెయ్యలేని దుస్థితి. ప్రేవులు దెబ్బతిన్న కారణంగా ఆహారాన్ని సైతం నరాల ద్వారా అందిస్తున్నారు వైద్యులు. హేయమైన కార్యానికి పాల్పడ్డ నేరస్తులు బాధితుల దుస్తులు కాల్చివేసి, బస్సును క్లీన్ చేసి నింపాదిగా యథావిధిగా మరుసటిరోజు విధులకు హాజరయ్యారు.
ఇంతటి ఘోరానికి పాల్పడ్డ నేరస్తులకి ఏ శిక్ష సరిపోతుంది? అసలు భారతీయ శిక్షా స్మృతిలో ఇటువంటి నేరాలకు శిక్ష ఉందా? కేవలం ఐదు నిమిషాల్లో దేహ బాధ నుంచి విముక్తి చేసే ఉరి, ఆ అమ్మాయి జీవితకాలం అనుభవించే మానసిక క్షోభకు సరితూగుతుందా?
దేశంలో కీచక సంతతి నానాటికీ ఎక్కువవుతోంది. ఒక్క ఢిల్లీలోనే ఈ సంవత్సరం 572 రేపులు నమోదయ్యాయి. మిగతా మహానగరాలన్నిటిలో నమోదైన కేసుల సంఖ్య కంటే ఇదెక్కువ. గ్యాంగ్‌రేప్ జరిగిన తర్వాత దేశ రాజధానిలో మహిళల భద్రత గురుంచి కవర్ చెయ్యటానికి వెళ్ళిన ఆజ్‌తక్ మహిళా జర్నలిస్టు కెమేరా సాక్షిగా ఈవ్ టీజింగ్‌కి గురయ్యారు. ఒకవైపు దేశం అట్టుడికి పోతున్నా, మరోవైపు ఎవడేం చేస్తాడన్న ధీమాతో కెమేరా సాక్షిగా ఈవ్ టిజీంగ్ పాల్పడటం ఘనత వహించిన మనదేశ రాజధాని నేరచరిత్రకు పరాకాష్ఠ. వాళ్ళనని లాభం లేదు. యాథా రాజా తథా ప్రజా అన్నారు కదా. అనేక మోసాలు, నేరాలు చేసిన నిందితులు నాయకమాన్యులవుతున్న దేశంలో ప్రజలు అలా కాక మరోలా ఎలా ఉంటారు?
చెక్ రిపబ్లిక్, పోలాండ్, జర్మనీ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కెమికల్ కాస్ట్రేషన్ అవలంబిస్తారు. మందుల ద్వారా నేరస్తుల వాంఛలు తగ్గించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇది దీర్ఘకాలిక ప్రణాళిక లాంటిది. నేరస్తుడి పై నిఘా వుంచి సమయానుకూలంగా మందులు వేస్తూండాలి. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సడలిపోయి నోరున్నవాడిదే రాజ్యమవుతున్న రోజులివి. తమ చేతకానితనానికి సహనమనే అందమైన ముసుగు తొడుక్కొని, మిన్ను విరిగి మీదపడిపోతున్నా మరేం పర్లేదన్నట్టు ప్రతి రోజూ ఒకేలా నిబ్బరంగా గడపగల భారతీయ ప్రజలలో చైతన్యం జ్వలించాలంటే ఇటువంటి సున్నితమైన శిక్షలు సరిపోవు.
అనెస్తీషియా ఇవ్వకుండా అంగవిచ్ఛేదన చెయ్యాలి.
అరబిక్ దేశాల్లో అమలయ్యే ఆటవిక శిక్షలు కావాలి. రాళ్ళతో కొట్టి చంపడం, బహిరంగ శిరచ్ఛేదన లాంటివి.
అప్పుడే అమ్మాయి మీద చెయ్యివెయ్యాలనుకున్న ప్రతి ఆగంతకుడికి వెన్నులో వణుకు మొదలవుతుంది.
ఏటా ఎంతోమంది ఆయేషాలు, శ్రీలక్ష్మిలు, మరెంతో మంది అబలలు దారుణకృత్యాల బారినపడి దగ్ధమవుతున్నా, జడివానలో దున్నపోతులా ఏ మాత్రం స్పందించని ప్రభుత్వ యంత్రాంగాలు ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు చేబడుతాయా లేక కీచక సంతతికి దేశాన్ని చేజేతులా సమర్పించుకుంటాయా ?
4 comments