మాగ్గావాలె !! (updated)



దంతా మాకు తెల్వద్

మా తెలంగాణా మాగ్గావాలె,
హైద్రాబాద్ మాగ్గావాలె,
పదేళ్ళ హైద్రాబాద్ ఆదాయం మాగ్గావాలె,
ఉద్యోగాలు మాగ్గావాలె,
ప్యాకేజి మాగ్గావాలె,
భద్రాచలం మాగ్గావాలె,
గోదావరి మాగ్గావాలె
కృష్ణా మాగ్గావాలె
మచిలీపట్నం ఓడరేవు మాగ్గావాలె
శ్రీశైలం మాగ్గావాలె
అది గావాలె,  గిది గావాలె, అన్నీ గావాలె, 

విద్యుత్‌కొరత మాత్రం సీమాంధ్ర తీర్చాలె !!






4 comments

Post a Comment

సమైక్య స్ఫూర్తికి జోహార్లు





బంద్‌లు చేసి, రహదారులు దిగ్బంధించి, రాళ్ళతో దాడి చేసినా, భయపడకుండా, సమైక్యతే శ్వాసగా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి రాజధాని నడిబొడ్డులో సమైక్యనాదాన్ని సమర్థవంతంగా వినిపించిన సీమాంధ్ర ఉద్యోగులందరికీ నా జోహార్లు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. రాష్ట్ర రాజకీయాల్లో ఊడలు దిగిపోయిన ఏ రాజకీయ నాయకుడూ గత పదమూడేళ్ళుగా చెయ్యని సాహసాన్ని, కేవలం నెలరోజుల వ్యవధిలో  చేసి  చూపించారు. రాజధానిలో రెండో తరగతి పౌరుడిలా బ్రతుకుతున్న ప్రతి సమైక్యవాది గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపారు.  సీమాంధ్ర జిల్లాల్లో స్వచ్ఛందంగా జరుగుతున్న ఉద్యమానికి కొత్త శక్తినందించారు. ఇది నిజంగా ప్రశంసనీయం .

ఈ సందర్భంగా కొందరు తెలంగాణా వాదులు చేస్తున్న వాదనలు వింటూంటే ఇటువంటి చవకబారు వ్యక్తులా రేపు ఒక నూతన రాష్ట్రం ఏర్పడితే దాన్ని నడిపించబోయేది అన్న జాలి కలుగకమానదు.  రాజధానిలో సమైక్య సభ పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని కొందరు పొగలు కక్కితే, ఇంకొందరు విభజన జరిగిపోయింది కాబట్టి సమైక్య సభ పెడితే అది తెలంగాణా వాదులని రెచ్చగొట్టినట్లే అని తీర్మానించారు. తెరాస సంస్కృతిని నరనరానా జీర్ణించుకున్న ఒక విద్యార్థి నేతేమో 'సీమాంధ్రులు అడుగుపెడితే ఖచ్చితంగా తంతాం' అని తనకు మాత్రమే  బాగా అవగతమైన భాషలో బీరాలు పోయాడు. నాలుకలు చీరేస్తాం అని కొందరు పిల్లిమొగ్గలు వేస్తే  భౌతిక దాడులతో సత్కరిస్తామని మరికొందరు విఱ్ఱవీగారు . ఈ మాటలన్నీ వింటూ ఎంతో ఆశ్చర్యపోయాను .

కేవలం ఒక్క సమైక్య సభ...అదీ సీమాంధ్ర ఉద్యోగులు పెట్టుకుంటామంటే తెలంగాణవాదులకంత ఉలికిపాటు దేనికి? ఏపీ ఏంజీవోలు సభ పెట్టుకుంటామన్న రోజే శాంతియాత్రలకు, బంద్‌లకు పిలుపునివ్వటం  దేనికి సంకేతం ? రకరకాల సాకులు చెప్పి నెలకోసారి తెలంగాణ బంద్ చేసినప్పుడు, మిలియన్‌మార్చ్ పేరిట ట్యాంక్‌బండ్‌పై విధ్వంసం సృష్టించినప్పుడూ, సమైక్యవాదులు తమలో తాము బాధపడ్డారే కానీ ఏనాడూ అడ్డుపడలేదు. నాలుగు జిల్లాల వాదాన్ని నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల ఆకాంక్షగా చిత్రీకరించి, పద్దెనిమిదేళ్ళ ఉద్యమాన్ని(1969-72, 2001-2013) అరవైయేళ్ళ పోరాటంగా అభివర్ణించి డాంబికాలు పలికిన వాళ్ళు ఒక్క సభకే బెదరిపోయారా ? మీ ఉద్యమం నిజంగా ప్రజల గుండెల్లోంచి వస్తే భయపడాల్సిన అవసరం మీకేమిటి ? ఒక్క సమైక్య సభ దాన్ని ఆపగలుగుతుందా ? లేక ఇన్నేళ్ళుగా ఇతరులని మభ్యపెట్టి మాయచేసి నిర్మించుకున్న మృణ్మయ సౌధం కూలిపోవచ్చనే బెంగా ?  ప్రత్యక్ష ప్రసారాలు కూడా అడ్డుకోవాలని పిటిషన్ వేశారే ? దేనికింత అసహనం ? సి.డబ్ల్యూ.సీ తీర్మానం జరిగితే  విభజన జరిగిపోయినట్లేనా? బిల్లు పాసవ్వనక్కరలేదా ? రాష్ట్రపతి ఆమోదముద్ర పడనంత వరకూ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధానే . రాజధానిలో తమ గోడు వెల్లబోసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది.  మిలియన్‌మార్చ్ నిర్వహించుకొనే హక్కు తెలంగాణావాదులకెంత వుందో, సమైక్య సభ పెట్టుకునే హక్కు ప్రతి సమైక్యవాదికీ ఉంది. అది రాజ్యాంగ విరుద్ధం కాదు. వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదు.

సమైక్య సభలో నన్ను ఆకట్టుకున్న అంశలు రెండు. ఉద్యమాల పేరుతో  ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు  సంతాపం ప్రకటిస్తూ  తెలంగాణ ప్రజలకూ తమ సంతాపం తెలియజేసినప్పుడు, రాళ్ళదెబ్బలు తిన్న సభికులు కూడా అభ్యంతరపెట్టలేదు. రాజకీయ విమర్శలు చేసినా, తెలంగాణ ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలనూ ఎవరూ కించపరచలేదు . రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దని నిర్వాహకులు ఆద్యంతం హెచ్చరికలు చేస్తునే వచ్చారు . వేర్పాటువాదులు  సభలోకి జొరబడి చెప్పు చూపించినా సంయమనంతో వ్యవహరిస్తూ హుందాగా ప్రవర్తించడం నిజంగా గొప్ప విషయం. తెరాస - కోదండ శ్రేణుల్లో ఇటువంటి హుందాతనం భూతద్దం వేసి చూసినా కనిపించదు. సీమాంధ్రుల వేషభాషల్ని, సంస్కృతిని, ఆఖరుకి ఆహారాన్నీ వదలకుండా కించపరిచిన కే.సి.యార్‌కు సమైక్య సభలోని వక్తలకు ఎంత తేడా ? కనకపు సింహాసనమున అన్న సామెత బహూశా ఇలాగే ఉద్భవించి ఉంటుంది. సీమాంధ్ర మీద ద్వేషంతో తెలుగు భాష మీద కూడా విషం చిమ్మిన ఘన చరిత్ర తెరాసది. తెలుగు తల్లిని ఎవడికి తల్లి అన్నారు. తెలుగు ముందు పుట్టిందా ? తెలంగాణ ముందు పుట్టిందా ? తెలుగు భాషకు లేని తల్లి తెలంగాణకు ఎక్కడినుంచి వచ్చింది ?  సత్యవాణి గారన్నట్లు వీళ్ళెవరికీ అసలైన తెలంగాణా సంస్కృతి అబ్బినట్లు లేదు. కేసియార్ కుటుంబం విషయంలోనైతే అనుమానాలే అక్కర్లేదు. అసెంబ్లీ సాక్షిగా జే.పీ పై దాడిచేసినవాళ్ళు ఒకరైతే, ఏపీ.భవన్లో దూరి దళిత ఉద్యోగిపై దాడి చేసి, ఇప్పుడు నాలుకలు చీరేస్తామని ప్రగల్భాలు పలికినవాళ్ళు ఇంకొకరు. ఇక సుపుత్రికైతే నాలుగాకులు ఎక్కువే చదివింది. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులంతా తమ ఇంటిగోడలపై ' జై తెలంగాణా ' అని వ్రాసుకోవాలట. అప్పుడే ఈవిడ రాజధానిలో ఉండనిస్తుందట. నా చిన్నప్పుడు ఒక ఆడదెయ్యానికి భయపడి అమాయకులైన కొంతమంది తమ ఇంటిగోడలపై ' ఓ స్త్రీ రేపు రా ' అని వ్రాసుకొనే వాళ్ళు. రాత్రిళ్ళు  వచ్చిన ఆడదెయ్యం గోడలపై నున్న వాక్యాలను చదివి ' రేపు రావాలి కాబోలు ' అనుకొని వెళ్ళిపోయేదట. సుపుత్రిక గారి మాటలు ఆ సంఘటనలను గుర్తుతెప్పించాయి. రాజధానిలో పోటీ చేస్తే ధరావతులు దక్కని పరిస్థితిల్లో ఉన్నా రాజ్ఞి లా ఆదేశాలు జారీ చెయ్యడం ఈవిడకే చెల్లు.

భావోద్వేగాలు, రెచ్చగొట్టడం లాంటి పదాలకు తెలంగాణావాదులు కొత్త అర్థాలు సృష్టించారు. వీళ్ళు ట్యాంక్ బండ్ పై విధ్వంసం సృష్టించి, సీమాంధ్రుల ఆస్తుల పై దాడి చేసి, బలవంతపు వసూళ్ళకు పాల్పడి, సినిమా షూటింగులకు అంతరాయం కలిగిస్తే అది భావోద్వేగం. తెలంగాణా ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని సీమాంధ్రనేతలు ఎవరైనా అంటే అది రెచ్చగొట్టుడు. ' ఆంధ్రా బ్యాంకు' అని పేరెట్టుకున్నందుకు ఆంధ్రా బ్యాంకు ఏ.టి.ఏం.లు ధ్వంసం చేశారు. చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమలపైనో, జూనియర్ ఎంటియార్ సినిమాలపైనో దాడి చేస్తేనో ఆయా రాజకీయ నేతల యూటర్న్ కారణంగా దాడి చేశారని సరిపెట్టుకోవచ్చు.అల్లరి నరేష్, సునీల్ ఆఖరుకి నితిన్‌లని వదిలిపెట్టలేదంటే వీళ్ళకున్నది వసూళ్ళ పై ధ్యాసే కానీ తెలంగాణా అభివృద్ధి పట్ల కాదన్న మాటేగా ? తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ప్రశ్నలడిగిన జర్నలిస్టుని పట్టుకొని ' బాడఖోవ్, నీయమ్మ ' అని దుర్భాషలాడితే అది తెలంగాణా భాషలో భావ వ్యక్తీకరణ. తిరగబడితే అది దాడి. సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి సీ.యం రాజీనామా చెయ్యాలి. సీమాంధ్రులు కూడా కట్టిన పన్నులతోనే జీతభత్యాలు పుచ్చుకుంటూ , మొత్తం రాష్ట్రానికి జవాబుదారీతనం వహించాల్సిన ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులు మాత్రం తెలంగాణాకు మాత్రమే మంత్రులుగా వ్యవహరించవచ్చు. ఎంత హాస్యాస్పదం. నవ్విపోదురు గాక నాకేటిమి సిగ్గు అన్నట్లు చివరికి కోదండరాందీ ఇదే డిమాండు. సమైక్యవాదులు సభపెట్టుకుంటే అది రెచ్చగొట్టుడు, దండయాత్ర వగైరా వగైరా. ఎ.పి.ఎంజీవోలు తమ కార్యాలయాల్లో సమావేశాలు పెట్టుకుంటే  తెలంగాణా ఉద్యోగులు వెళ్ళి గొడవలు చెయ్యొచ్చు . విశాలాంధ్ర  సభ్యులపై భౌతిక దాడులు చెయ్యచ్చు. కళాశాలల్లో ప్రొఫెసర్లని, మెరిట్ విద్యార్థులని బెదిరించి పంపేయవచ్చు. అది తెలంగాణ వాదాన్ని వినిపించటం. గొంతు కోస్తామని సైగ చేసిన ఆంధ్రా ఉద్యోగి కసబ్ అయితే, రాళ్ళతో కొట్టిన వాళ్ళు, రక్తపాతం సృష్టిస్తామన్న వాళ్ళు, నాలుకలు చీరేస్తామన్న వాళ్ళు జాతిపితలు. ఈ ప్రశ్నలన్నీ సూటిగా సంధిస్తే సరైన సమాధానమిచ్చిన తెలంగాణా నేతని ఇంతవరకూ వినలేదు, కనలేదు. ఎంతసేపూ నోరేసుకొని సీమాంధ్ర దోపిడీ, మా ప్రాంతం, మా చావులు అంటూ అవతలి వారి నోరు నొక్కేసి నెట్టుకొచ్చిన వాళ్ళే . గల్లీ నుంచి లోక్‌సభల వరకూ ఇదే తంతు. వీళ్ళు వాదించేటప్పుడు అవతలి పక్షం ఓపికగా వినాలి. అవతలి పక్షం వాదనలు మాత్రం వీళ్ళు వినరు. తమను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు ఎవడైనా సంధిస్తే వాడు సీమాంధ్రా అహంకారి. మెడమీద కత్తి పెట్టి తెలంగాణా వాదాన్ని బలవంతంగా రుద్దిన వీళ్ళా నేడు నీతులు చెప్పేది ?

విభజన ప్రకటన వెలువడిన దగ్గర్నుంచి విశ్రాంతి లేకుండా పోరాడుతున్న సీమాంధ్ర ప్రజలకు ఒక్కటే నా విన్నపం. సమైక్య శంఖారావాలు, బస్సుయాత్రల పేరిట మీ ముందుకొచ్చే రాజకీయ నాయకుల శుష్కవాగ్దానాల పట్ల అప్రమత్తంగా ఉండండి. 2009లో ఒకసారి ఇలాగే మోసపోయారు. అప్పటి మీ ప్రతిస్పందన చూసైనా నాయకులు కళ్ళు తెరవకపోవడం శోచనీయం. ఇప్పటికీ ఒక స్పష్టమైన వైఖరి లేకుండా ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోసుకుంటూ వోట్లకు గాలాలు వేస్తున్నారు.  మీరు తగలబడిపోతుంటే వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇటువంటి నేతలను చూసీ చూడనట్లు వదిలేయకండి. ఉరకలేస్తున్న మీ చైతన్యాన్ని వృథాగా  పోనివ్వకండి. నిలువరించి నిలదీయండి. సమైక్యమా, విభజనా స్పష్టమైన విధానం కావాలని ప్రతిఘటించండి. రానున్న రోజుల్లో రాష్ట్రం ఒక్కటిగా ఉన్నా, ముక్కలై వేరైనా భవిష్యత్తులో ఇటువంటి గోడ మీద పిల్లుల బెడద తగ్గి ప్రజలు హాయిగా జీవిస్తారు.


5 comments

Post a Comment

హంసినిలో నా కవిత

నిశ్చల గీతం

(ఆగష్టు 2013 సంచిక  లో  నా కవిత ప్రచురించినందుకు హంసిని యాజమాన్యానికి నా కృతజ్ఞతలు )





గళ్ళంతా పొట్టకూటికై పరిచర్యలు చేసి చేసి
రాత్రిళ్ళు రహస్య సుఖాల పరిష్వంగంలో అలసి సొలసి
ఆదమరచిన నా అస్తిత్వాన్ని
అలలు అలలుగా తట్టిలేపుతూ
నిశ్చల గీతం వినిపిస్తోంది !
నిద్రిత మనోసీమలలో !!

బలవంతుడి దమననీతి బరితెగించిన అవినీతి
నిరుపేదల డొక్కల రోదన 'నిర్భయ'ల మృత్యు వేదన
పేట్రేగిన తీవ్రవాదం ప్రభుత్వాల పలాయనవాదం
నలువేపులా కమ్ముకొని దేశాన్ని నిర్వీర్యం చేస్తూంటే
ప్రహరీలు కట్టుకుని పరదాలు మూసుకుని
అభిమాన తారల్ని అశ్లీలగీతాల్ని అలౌకిక హుక్కాగా ఆఘ్రానించి
కైపెక్కించే కలెక్షన్లని కులమతాల కొవ్వుని పీకల్దాకా పట్టించి
బాధ్యతల్ని భావితాశల్ని బాత్రూంగదిలో వాంతి చేసుకుని
నాదైన లోకంలో నిసిగ్గుగా  విహరించి
నిద్దురలో జోగే హద్దులులేని నా మూర్ఖత్వాన్ని
నిరసిస్తూ నిగ్గదీస్తూ
నిశ్చలగీతం వినిపిస్తోంది !
నిద్రిత మనోసీమలలో !!

మస్తిష్కపు మత్తిలిన పొరలమాటున 
మరుగునపడిపోయిన ధిక్కార స్వరం వొకటి
వ్యాధున్ని వాల్మీకిని చేసిన శోకంలా
మెల్లగా ఇన్నాళ్ళకు మృదుగీతమై బయల్పడి
శ్రుతి పెంచి, ధృతి పెంచి ప్రణవమై పరమేష్ఠి కేకై
దేహమంతా ప్రతిధ్వనించింది !
దశాబ్దాలుగా పేరుకున్న నిర్లిప్తతా  తుప్పు వదిలిపోతూంటే
అణువణువూ శ్రవణేంద్రియమై
ఆత్మగీతాన్ని రిక్కించి వింది !
అప్పుడే నాకోక జీవనవేదం బోధపడింది !!

ప్రాథమికంగా నేను బుద్ధిజీవిని
పరిణామక్రమంలో ఉత్కృష్ట జీవిని
సంఘహితం కోరి సంఘర్షించిన రోజు - విశుద్ధాత్మని, వామనున్ని !
స్వార్థచింతనతో శక్తులుడిగిన నాడు - పక్కలో నల్లిని, పేడ పురుగుని !!

సామాజిక స్పృహ శరీరమంతా పొటమరిస్తూంటే
గీతా సారం విన్న ధనుంజయున్నై దిగ్గున లేచి కూర్చున్నాను !
ప్రభాత కర్పూరం వెలిగించి
ప్రకృతి మాత నాకు దిష్టి తీసింది !!



2 comments

Post a Comment

తిలా పాపం తలా పిడికెడు


మా తెలుగుతల్లి మూగబోయింది.

జాతి కోసం జ్యోతిలా వెలిగిపోయిన పొట్టి శ్రీరాములుగారు.. మీ త్యాగస్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చేశారు.

ఒక తాగుబోతుని, వదరుబోతుని, మనుషుల రవాణా కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మీ సరసన సింహాసనం వేసి మరీ రాజ్యాభిషక్తున్ని చేస్తున్నారు.

ఈ పాపం ఎవరిది ?

శుష్కవాదనలతో రంగుల లోకం సృష్టించి విద్యార్థులను రెచ్చగొట్టి వారి బలిదానాలకు, రాజకీయ అస్థిరతకు కారకులైన రాజకీయ రాబందులదా, నిరుద్యోగులదా ?

ఏ వాదమూ వినిపించని 2000లోనే కేవలం చంద్రబాబుని, బి.జె.పి.ని రాజకీయంగా ఎదుర్కోవటానికి ప్రత్యేక తెలంగాణ తీర్మానంపై సంతకం పెట్టి తెలుగు జాతి సమైక్యతకు తూట్లు పొడిచిన  వై.యస్.ఆర్ దా ?

స్వార్థప్రయోజనల కోసం రెండు ప్రాంతాల ప్రజల మధ్య సాంస్కృతిక, మానసిక వైషమ్యాలను ఎగదోసి సంబరాలు జరుపుకుంటున్న కే.సి.యార్ దా? 

వ్యాపార ప్రయోజనాల కోసం సమైక్యవాణిని నొక్కిపట్టి పనికిమాలిన విషయాలపై పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వ్రాసి, విశ్లేషణలు జరిపి కాలం వెల్లబుచ్చిన పత్రికా యాజమాన్యాలదా ?

ముఖ్యమంత్రి పీఠంపై మరులు పెంచుకొని సిద్ధాంతాల్లేని పార్టీని స్థాపించి, అనవసర రాజకీయ సమీకరణలకు కారకుడై, ప్రజాభిమానం నవ్వులపాలేయ్యేలా పార్టీని విలీనం చేసిన చిరంజీవిదా ?

తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పడిన పార్టీని అధికారవ్యామోహంతో తెలంగాణా వాదానికి తాకట్టు పెట్టి, తెలుగుదేశానికి తలకట్టు లేకుండా 
చేసిన విఫల ప్రతిపక్ష నేత చంద్రబాబుదా ?

రాజకీయ మనుగడ కోసం రాష్ట్రాలను ముక్కలుగా చీల్చి జైఆంధ్ర లాంటి నిర్జీవ ఉద్యమాలను లేవదీస్తున్న బి.జె.పి దా ?

అసెంబ్లీ సాక్షిగా దాడులు చేసి మరీ తెలంగాణవాదం తలకెక్కిస్తూంటే అదేమిటనే ధైర్యం చెయ్యలేక  దద్దమ్మల్లా కూర్చున్న సీమాంధ్ర నాయకులదా ? సమైక్యవాదులదా ?

బానిసత్వపు బొమికలతో తయారై అధినేత్రి కృపాకటాక్షం కోసం అనుక్షణం అంగలారుస్తూ వంగి వంగి దణ్ణాలు పెట్టి పారిశ్రామిక అవసరాల కోసం పూటకో మాటమాట్లాడే సీమాంధ్ర కాంగ్రెస్  శాసనసభ్యులదా, ఎం.పి.లదా ?

ఒక కీలకమైన ప్రకటన చేస్తున్నప్పుడు సమగ్ర అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితులను  తెలుసుకోవాలన్న కనీసం ఇంగిత జ్ఞానం లేని గృహమంత్రి చిదంబరానిదా ?

అఖిలపక్షంలో నిర్భయంగా నిజం చెప్పలేక నీళ్ళు నమిలి గోడమీద పిల్లి వాటం ప్రదర్శించిన  సీమాంధ్ర  శాసనసభ్యులదా?

ఆరంభ శూరత్వం అలసత్వమే తప్ప అంతిమ కార్యాచరణ లేని సమైక్య ఐకాసలదా ? 

 యాభైయేళ్ళ పాటూ వెన్నుదన్నుగా నిలిచిన ఒక రాష్ట్రాన్ని, ఎం.పి.సీట్ల కోసం, ఆ రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో నిమిత్తం లేకుండా, ఆ ప్రాంతపు సమస్యలపై ప్రాథమిక అవగాహన కూడా లేని ఇతర రాష్ట్రాల నాయకుల అంగీకారంతో ముక్కలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సోనియా గాంధీ దా? తను ప్రధానమంత్రో డూ డూ బసవన్నో తేల్చుకోలేని మన్మోహన్‌సింగ్‌దా?

ఇన్ని జరుగుతున్నా ఎప్పట్లాగే సిద్ధాంతాలతో పనిలేకుండా కులం కోసం, మతం కోసం, సినిమా గ్లామర్ కోసం  కుత్తుకలు తెగ నరుక్కొని, నోట్ల మత్తులో వోట్లు తనఖా పెట్టి అసమర్థ ప్రజా ప్రతినిధులను అందలాలెక్కించి ఆ తర్వాత ఈసురోమంటున్న సీమాంధ్ర ప్రజలదా ? వాళ్ళ అజ్ఞానానిదా ?

ఈ పాపం అందరిదీ.

తిలా పాపం తలా పిడికెడు.






7 comments

Post a Comment

సరసిని



ల్లున అందెలు కదల్చనీక
మెల్లన దరిచేరి మాటునదాగి
కళ్ళను నీ మృదుకరముల గప్పి
అల్లరి చేతల నలరింతు వీవు 

చక్కని చుక్కగ చెంతకు చేరి
చక్కిలిగింతల చిక్కులు రేపి
చెక్కిలి నొక్కగ చేయి చాపితే
చిక్కక చల్లగా జారుకొనేవు

పట్టుకోవాలని పైకిలేవగానే
పిట్టవోలే బెదరి పారిపొయేవు
పట్టుకోలేనని పకపకా నవ్వి
బెట్టుతో నిలువెల్ల పొంగిపొయేవు

అల్లంత దూరన అప్సరవోలె
కళ్ళింతచేసి కవ్వింతువీవు
ఎలకోయిల వలె ఎలుగెత్తి పిలిచి
కలహంస నడకల కదలిపోయేవు

తొణికిసలాడేటి తొలిప్రాయమందు
తనరారు నీ మేను తూగాడిపోవ
కనరానియందాల కనువిందు జేసి
మనసులో చెరగని ముద్రవేసేవు

దుడుకు కోర్కెల నాలో తలపింపజేసి
ఉడికించి ఊరించి ఉరకలేయించి
కడగంటి చూపుల్లో కొసరేటి-వలపు
వేడిమిలో నేను వేగిపోవంగ

సుడిగాలిలా వచ్చి చుట్టేసి -ప్రేమ
జడివానలో నన్ను ముంచెత్తివేసేవు

(పాతికేళ్ళ క్రితం  మా నాన్నగారు వ్రాసిన కవిత )


4 comments

Post a Comment

నివేదన






వరు నువ్వంటే ఏమని చెప్పను?

నవ్యనాగరికతా దివ్య దీప్తుల
చూడలేక నా కళ్ళు చూద్కిపోయె
నింగికెగబ్రాకు విజ్ఞాన శిఖరాల
అందుకొనలేక నా వొళ్ళు అలసిపోయె

దయాధర్మరహిత దౌర్జన్య కౄర
కబంధ హస్తాల నా బ్రతుకు చితికిపోయె
ప్రేమాభిమాన విహీన పైశాచికారముల
విని విని నా మనసు మూగవోయె

ఆశల వెలుగేలేని అంధకారములోన
ఘోర భీకర దుర్భర జీవితారణ్యమున
కఠిన పాషాణ కంటకావృతముల బడి
దారి తెన్నులేక తిరుగాడు దీనుడను నేను

పంచభక్ష్య పరమాన్నములు తిని
విసరి పారవేసిన ఎంగిలాకులకై
ముసిరిన కాకుల మూగిన కుక్కల
విసిరి తరుమలేక కసరి కొట్టలేక
కాలే కడుపును కన్నీట తడుపలేక
చావలేక బ్రతుకుతున్న సజీవిని నేను

బంగారు భవనాల పారుగోడల నీడ
ఉప్పొంగి ప్రవహించు మురికి కాల్వ చెంత
నడిరోడ్డు దుమ్ము నిండు కౌగిలిలోన
అందరాని ఆనంద తీరాల
అందుకోజూస్తున్న అల్పజీవిని నేను

గుండెలవిసే మండుటెండలో
వొళ్ళు చివికే వడగళ్ళవానలో
ఎండుమాకుల చెంత ఇంటిచూరుల కింద
బితుకు బితుకుమను గుండెలు
పిడికిట బిగబట్టి
తలదాచుకోనింత చోటులేక
చీకుచింతాలేని చెట్టుచేమల జూచి
బాధలెరుగని బండరాళ్ళను చూచి
ఓర్వలేక  వగరుస్తున్న మనిషిని నేను 

కుక్కనై పుట్టినా కూడుతినేవాన్ని
గువ్వనైపోయినా గూడు కట్టుకొనేవాన్ని
మనిషినై పుట్టి మనిషిగా మసలలేక
నిత్యం చస్తున్న నిర్భాగ్యుడిని నేను
చచ్చి బ్రతుకున్న సౌభాగ్యుడను నేను

విసురు కసురులేక ఓపికతో విన్నావు
ఎంత సౌమ్యుడవీవు? ఎవరు నీవు ?

అరెరె ! అది ఏమి !..

ఉబికి ఉప్పొంగు దు:ఖమ్ము
వెక్కిళ్ళ వెలిగ్రక్క వినవచ్చె !
కడలిఘోషల దాగు బడబాగ్ని బాధ
నీ గుండె కుత్తులోన ఘూర్ణిల్ల సాగె !

ఏమి ? నీవూ నా బోటివాడవేనా ??
అంతుపొంతులేని మన బ్రతుకులొక్కటేనా ??

అవునులే ! మనముగాక మనకున్న దిక్కెవరు !
మనగోడు విని కడతేర్చు నాథుడెవ్వరు !!

(పాతికేళ్ళ  క్రితం  మా నాన్నగారు వ్రాసిన  కవిత)



రాగం పలికింది

(దాదాపు ఇరవైయేళ్ళ క్రితం మా నాన్నగారు వ్రాసిన కొన్ని భావగీతాలు ఆకాశవాణిలో వచ్చేవి. వాటిలో నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఇదొకటి.)



రాగం పలికింది -నాలో 
అనురాగం వొలికింది
                                                 || రాగం పలికింది 

విరుల సరులలో తురీరవములో
ఝరుల వగలులో గిరుల నగవులో
అంతులేని ఆనందలహరిలో
పొంగి పొరలు రసతరంగిణియై
                                                || రాగం పలికింది  

శరదిందుచంద్రికా చిద్విలాసమున
విరిగంధ వీచికా విరహతాపమున
మదన మనోహర మోహనాట్యమున
చిందులేయు చెలి అందెల రవళియై

                                                 || రాగం పలికింది   


6 comments

Post a Comment

మా ఊరి వేసవి కబుర్లు


వేసవి అంటేనే పిల్లలకు ఆటవిడుపు బోలెడన్ని శెలవులు,బోల్డంత కబుర్లు బోలెడంత హంగామా.మా బాబాయిలు, వాళ్ళ పిల్లలు అందరూ పల్లెలోనే ఉండేవారు. దాంతో వార్షిక పరిక్షలైపోయిన దగ్గర్నుంచి ఎప్పుడెప్పుడు మా ఊరు వెళ్దామా అని ఉబలాటంగా ఉండేది.

పొద్దున్నే చెఱువు గట్టుకు వెళ్ళడంతో దినచర్య మొదలయ్యేది (హి..హి..హి. ఆడువారి మాటలకు అర్థాలే వేరు లో వెంకటేష్ లా అన్నమాట). వస్తూ వస్తూ ఏ వేపపుల్లనో, కానుగ పుల్లనో నోట్లో ఆడిస్తూ,  ఆకాశం కడుపున అప్పుడే పుట్టిన పండటి ఎర్రటి సూరీన్ని  ముచ్చటపడి నీటి పొత్తిళ్ళలో పొదువుకున్న మా ఊరి చెఱువుని తిలకిస్తూ  , ఈ వార్తని వాడవాడలా వెల్లడించాలన్న ఉద్విగ్నతతో పంట పొలాల మీదుగా ఎగిరిపోతున్న కొంగలబారును పరికిస్తూ , చేదబావి గిలక చప్పుడు వింటూ మెల్లగా ఇంటికి చేరేవాళ్ళం. 

పెరట్లో స్నానాలు చేసి ఉపాహార వేళకు  పిల్లలందరం గిన్నెలు ముందేసుకు కూర్చుంటే నాయనమ్మో (నాన్నమ్మ) , పిన్నమ్మో (పిన్ని) వేడివేడిగా దోశెలు వడ్డించేది. దాన్లోకి రోట్లో చేసిన చట్నీ వేసుకొని ఆవురావురంటూ తినేవాళ్ళం. చట్నీలోకి చిన్న చిన్న ఉల్లిపాయాలు వాడేవాళ్ళు. ఇవి మాములు ఉల్లిపాయల కంటే చాలా చిన్నవిగా ఉన్నా అమోఘమైన రుచినిచ్చేవి. టిఫన్ల పట్ల మొహం మొత్తితే ఊరిబిండి (రోటితో చేసిన పచ్చడి) వేసుకుని చద్దన్నం తినేవాళ్ళం.

వీధిలో ఇతర పిల్లలు కనిపిస్తే జిల్ల - కోడి ఆడేవాళ్ళం (గోటీ - బిళ్ళ లేదా బిల్లంగోడు). లేకపోతే చిన్నాన్న పిల్లలతో కలిసి దగ్గర్లోని గుట్టల్లోకి పశువులను మేతకు తీసుకెళ్ళేవాళ్ళం. తలా కొన్ని పశువుల్ని పట్టుకొని, వాటిని అదిలిస్తూ గుట్టల్లోకి చేరేసరికి, ఊళ్ళో మాయమైన పిల్లగ్యాంగ్ అక్కడ ప్రత్యక్షమయ్యేది. ఎవరి దగ్గరైనా బాలూ బ్యాటూ ఉంటే క్రికేట్ క్రీడకు చక చకా సన్నాహాలు జరిగిపోయేవి. గుట్టలకు దగ్గర్లోని చేలల్లో పశువులను వదిలేసి అక్కడే కాస్త చదునైన ప్రదేశంలో ఆటను మొదలుపెట్టేవాళ్ళం. మా ఊళ్ళో అంగళ్ళేమీ లేవు. కూతవేటు దూరంలో మరో పల్లె ఉంది. అక్కడ ఒకటి రెండు అంగళ్ళుండేవి. అక్కడి నుంచి రబ్బరు బాలును కొనుకొచ్చేవాళ్ళు. అక్కడ దొరకలేదంటే సైకిలెక్కి ఐదుమైళ్ళు  ప్రయాణించి పేట(అమ్మమ్మ వాళ్ళ ఊరు) లో బంతిని కొనుకొచ్చేవాళ్ళు. బ్యాటు మాత్రం చెక్కతో ఇంట్లోనే తయారు చేసుకొనేవాళ్ళు. బుర్ర మీసాలు సవరించుకుంటూ కొడవలితో చెక్కలు కొట్టి మా తాత ఎన్నో సార్లు బ్యాట్లను తయారు చేసి ఇచ్చేవాడు. అవి విరిగిపోతే ఎండిపోయిన కొబ్బరి మట్టలే మాకు దిక్కు. 

కాసేపటికి ఇంటిదగ్గర్నుంచి బాబాయో, పిన్నమ్మో ఎవరో ఒకరు పశువుల వద్దకు వచ్చేవాళ్ళు. మేం ఇంటికి తిరిగివెళ్తూ మా తోటలోని మామిడికాయలను కొన్ని తెంపుకొని, పొలంలోంచి పచ్చి మిరపకాయలను కోసుకొని వెళ్ళేవాళ్ళం. ఇంటికెళ్ళి రోట్లో మామిడికాయలు, పచ్చి మిరప, రాళ్ళ ఉప్పు వేసి దంచి, ఆ దబ్బలును నోట్లో వేసుకుంటుంటే అద్భుతంగా ఉండేది. దట్టించిన కారం కళ్ళలో నీళ్ళు తెప్పిస్తూంటే దాన్నుంచి తప్పించుకోవటానికి చెంబులకొద్దీ నీళ్ళు తాగేవాళ్ళం. అప్పటికీ తగ్గేది కాదు. ఏ పంచదారో, బెల్లం ముక్కో నోట్లో వేసుకొన్నాక కాస్త తెరిపిన పడ్డట్లయ్యేది.

మధ్యహ్నాలు బెండుముక్కలు కట్టుకొని చెఱువులోకో బావిలోకో భయం భయంగా దిగేవాళ్ళం. లోపలికి వెళ్ళే ధైర్యం లేదు కాబట్టి గట్టు మీద చేతులుంచి నీళ్ళలో కాళ్ళు తపతపలాడించేవాళ్ళం. చెఱువు మొరవబోతే (పొంగితే. ఎప్పుడో గానీ మా ఊరి చెఱువు పొంగదు. పొంగితే మా సంబరానికి అంతుండేది కాదు ) చిన్న చిన్న కాలువల్లోకి నీళ్ళు వచ్చేవి. వాటిలో దిగి నడుము లోతు నీళ్ళలో కూర్చొని ఈత నేర్చుకోటానికి నానా తంటాలు పడేవాళ్ళం. కొన్ని సార్లు కాలువల్లోంచి పంటలకు గూడలేసేవాళ్ళు. మేమూ ఓ చెయ్యి వేసి సంతోషపడి పోయేవాళ్ళం.

 తగినన్ని నీళ్ళు లేకపోతే ఇంటిపట్టునే ఉండి పెద్దలు పిల్లలు జట్లు జట్లుగా విడిపోయి సరదాగా దాయాలు ( పాచికలు ) లేదా రాజు-రాణీ-దొంగ-పోలీస్ లాంటి ఆటలు ఆడేవాళ్ళం. వేసవిలోనే గానుగ ఆడేవాళ్ళు. అలాంటప్పుడు మా మకాం ఇక చెఱుకు తోటల్లోనే. ఓ వైపు మేం నోట్లో చెఱుకులు పరపరలాడిస్తూ మరో వైపు ఎద్దులు గానుగ యంత్రాన్ని తిప్పుతూంటే బెల్లం తయారు చేసే విధానాన్ని ఆసక్తిగా గమనించేవాళ్ళం ఎండలు మండిపోతూంటే మా వాళ్ళు కొబ్బరిబోండాలు కొట్టేవాళ్ళు. అవి తాగి సేదతీరేవాళ్ళం. 

గోధూళి వేళ ఊళ్ళో పెద్దలంతా మా ఊరి రాముడి దేవళం (చిన్న గుడి) ముందున్న కానుగ చెట్టు క్రింద సమావేశమయ్యేవాళ్ళు. అదే మాకు రచ్చబండ. పలకరింపులు పరాచికాలు బాగా ఉండేవి. దేవళం ప్రక్కనే మా తాతయ్య ఇల్లు కాబట్టి మేము అక్కడే పోగయ్యేవాళ్ళం. పట్నం నుంచి వచ్చిన మమ్మల్ని చూసి ' ఓరొరే ! మీరు పెద్దోడి కొడుకులు కూతుర్లా ' అని ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. ఓ సారి గుడి ముందు చిన్న తెరకట్టి లవకుశ సినిమా వేశారు. అప్పుడు నేను చాలా చిన్నవాన్ని అన్నమాట. చాలా గమ్మత్తుగా అనిపించింది.

రాత్రిళ్ళు వెన్నెల్లో కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసేవాళ్ళం. అదయ్యాక మళ్ళీ ఆటలు. అలసిపోయాక పిల్లందరం మిద్దే పైనే చాపలు, దిండ్లు పరుచుకొనేవాళ్ళం. మాకు తోడుగా కొంత మంది పెద్దవాళ్ళు వచ్చి పడుకొనేవాళ్ళు. రాత్రి పూట వెన్నెల్లో వెల్లకిల్లా పడుకొని , చల్లగా గాలి వీస్తూంటే, ఆ గాలికి కొబ్బరాకులు ఊగుతూంటే, ఆకాశంలో మబ్బుల వెనుక నక్కి తారలతో దాగుడుమూతలాడుతున్న చంద్రున్ని చూస్తూ తన్మయత్వంతో మెల్లగా నిద్రలోకి జారుకుని ఆ రోజుకి వీడ్కోలు పలికేవాళ్ళం.


వేసవి శెలవుల్లో మరో ముఖ్యమైన అంకం మహాభారత ఉత్సవాలు. మా పల్లెకు నాలుగు మైళ్ళ దూరంలో రహదారిని ఆనుకొని ఒ పల్లెటూరుంది. అక్కడ ప్రతి వేసవిలోనూ పద్దెనిమిది రోజుల పాటూ మహభారత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.  ఏటా ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా కలిగి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని ఓ నమ్మకం. వరుసగా ఐదేళ్ళు అనావృష్టి తాండవిచ్చినప్పుడూ ఈ విశ్వాసం చెక్కుచెదరలేదు .

ఆ ఊళ్ళో ద్రౌపది సమేత ధర్మరాజ దేవాలయం ఉంది. పద్దెనిమిది రోజులు సాగిన మహాభారత యుద్ధానికి  సంకేతంగా అన్నట్లు పద్దెనిమిది రోజుల పాటూ అక్కడ మధ్యాహ్నాలు హరికథా కాలక్షేపం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పేరొందిన హరికథా విద్వాంసులు  భుక్తాయాసంలో సైతం అలవోకగా పద్యాలు పాడుతూంటే, వాద్యగాళ్ళు తాళయుక్తంగా హార్మోనియం, తబలా, మ్రోగిస్తూంటే ముసలీ ముతకా, పిల్లా జెల్లా ఆలయ మండపంలో కూర్చొని ఒళ్ళంతా చెవులు చేసుకొని మంచిని వంటబట్టించుకొనే ప్రయత్నం చేసేవాళ్ళు.

హరికథలో వివరించిన ఘట్టాలనే కళాకారులు రాత్రిళ్ళు స్టేజి మీద ప్రదర్శించేవాళ్ళు. ఈ ప్రదర్శన రాత్రంతా కొనసాగేది . చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు బళ్ళు కట్టుకొని మరీ వచ్చేవాళ్ళు. చాపలు దుప్పట్లు తెచ్చుకొని వేదిక ముందున్న విశాలమైన మైదానంలో పరుచుకొని వీక్షణకు ఉపక్రమించేవాళ్ళు. తీరిక చిక్కిన ఆడవాళ్ళు తాంబూలం నములుతూ ఇరుగమ్మ పొరుగమ్మలతో కబుర్లలో పడితే చిన్న పిల్లలు మైదానం నలు వైపుల పరుగులు తీస్తూ ఆటలు ఆడేవాళ్ళు. ఈ గోలలో తొమ్మిది-పది గంటల మధ్య ప్రదర్శన మొదలయ్యేది. ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు.. ఇలా పాత్రలు ప్రవేశించేవి. నడిరాత్రి నిద్రలో జోగుతున్న ప్రజలని మేల్కొల్పటానికి మేళతాళాలతో  హాస్యగాడు రంగప్రవేశం చేసేవాడు. అతను రాగానే మళ్ళీ కలకలం మొదలయ్యేది. రాగయుక్తంగా  పద్యాలు పాడి మంచి నటన కనబరిచిన నటులకు (సాధారణంగా ఈ ట్రూపులో అంతా మగవాళ్ళే ఉంటారు) నోట్ల దండలతో తక్షణ గుర్తింపు లభించేది. ఒకవైపు ఈ తతంగం సాగుతూంటే  మరో వైపు మైదానం దగ్గర్లో వెలసిన తాత్కాలిక దుకాణాల వద్ద తినుబండారాలు , ఆట బొమ్మల వ్యాపారం జోరుగా సాగేది. తాగుబోతుల కోలాహలం చెప్పనక్కర్లేదు . బకాసుర వధ, వస్త్రాపహరణ, అర్జున తపస్మాను, ఉత్తర గోగ్రహణం, దుర్యోధన వధ ప్రదర్శించే రోజులలో ఇసుక వేస్తే నేలరాలనంత జనం పోగయ్యేవారు. ఇప్పుడంటే లెక్కలేనన్ని ఛానలున్నాయి కానీ దూరదర్శన్ తప్ప దిక్కులేని రోజుల్లో ప్రజలకు అదే పెద్ద వినోదం.  

ప్రదర్శన చూడాలనుకున్న రోజు రాత్రి పిల్లలందరం జట్టుగా ఏర్పడి బయలుదేరేవాళ్ళం. దారిలో మమ్మల్ని మేము కాపాడుకోవటానికన్నట్లు చేతిలో టార్చిలైటు, చంకలో చాపలు, చేతుల్లో కఱ్ఱలు పట్టుకోని గట్టిగా పాటలు పద్యాలు పాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం.స్వాతంత్ర్యం వచ్చిన అరవై ఏళ్ళకు మా ఊరికి తారురోడ్డొచ్చింది కానీ ఒకప్పుడది రాళ్ళు రప్పలతో నిండిన మట్టిబాటే. ప్రదర్శన జరుగుతూండగా నిద్రోస్తే పక్కనే ఉన్న మా పిన్ని వాళ్ళ ఊరికెళ్ళి అక్కడ పడుకొనేవాళ్ళం. 

అమ్మమ్మ వాళ్ళింట్లో పెద్దగా పొద్దుపోయేది కాదు. నా కంటే కేవలం సంవత్సరమన్నర పెద్దాడైనా, మా మామ మాతో పెద్దగా ఆడేవాడు కాదు. మరదళ్ళకు కాస్త తీరిక దొరికితే అచ్చంగాయలు, నేల - బండ (ఆంగ్లంలో మడ్ అండ్ స్టోన్) లాంటి ఆటలు ఆడేవాళ్ళు. 

ఆ ఊళ్ళో ఒక సినిమా టెంటుండేది. ఒక పొడవాటి కొట్టంలో తెల్లటి వస్త్రాన్ని కట్టి ప్రొజెక్టరులోంచి సినిమాని తెరపైకి ప్రసరింపజేసేవాళ్ళు. నేల క్లాసు, బెంచి అని రెండు తరగతులుండేవి. ఒక బండిలో పోస్టర్లు వేసుకొని చుట్టు పక్కల గ్రామాలకు వెళ్ళి వాల్‌పోస్టర్లు అంటించి ప్రచారం చేసి వచ్చేవాళ్ళు. సాయంత్రం ముస్లింల నమాజు పూర్తయ్యాక ప్రదర్శన ప్రారంభమయ్యేది. జనంతో హాలు కిటకిటలాడిపొయ్యేది. ఎక్కువగా ఎంటివోడు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వేసేవాళ్ళు. అన్నీ పాతసినిమాలే. కొండవీటి సింహం, అగ్నిపర్వతం, అడవి దొంగ, సాహస సామ్రాట్ లాంటివన్నమాట. మసాలా బొరుగులు (మరమరాలు) తింటూ పల్లెటూరి జనం మధ్య కూర్చొని వాళ్ళ ఈలలు కేకలు, వ్యాఖ్యానాల మధ్య సినిమా చూట్టం మంచి అనుభూతి. రాత్రి పూట సినిమా కార్యక్రమం లేకపోతే మా అమ్మమ్మే మా పక్కన పడుకొని పాత పౌరాణిక తెలుగు సినిమాల కథలు (శ్రీ కృష్ణావతారం, శ్రీ కృష్ణపాండవీయం లాంటివి) చెప్పేది. అది వింటూ నిద్రపోయేవాళ్ళం.


ఆ రోజులన్ని ఇప్పుడు తలచుకొంటూంటే అదొక స్వర్ణయుగంలా అనిపిస్తుంది. బాల్యం బాల్యమే.


5 comments

Post a Comment

రుద్రవీణ





నేను సైతం విశ్వవీణపు తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను

                                     -మహకవి శ్రీశ్రీ , జయభేరి.

వయసుడిగిపోయి చిక్కిశల్యమైన ఒక అంధురాలు, కోనేటి మెట్ల పై కూర్చొని బిచ్చమెత్తుకుంటోంది.

అటుగా వెళ్తున్న బ్రాహ్మణుడొకడు దయతలచి ' ఇదిగో అరటిపండు ' అంటూ ఒక అరటిపండును ఆమె ముందు పెట్టి వెళ్ళిపోయాడు. అంధురాలు దాన్ని అందుకోబోతే అది జారి క్రింది మెట్ల పై పడిపోయింది. చేతిదాకా వచ్చిన తిండి నోటి దాకా రాకపోయేసరికి అంధురాలు ఆందోళన చెంది, శరీరాన్ని మరింత వంచి  పటుత్వం లేని చేతులతో తడుముకుంటూ వెదుకుతోంది.

మంత్ర జపం చేసుకుంటూ  వెళ్తున్న పిల్లవాడొకడు ఆ దీనావస్థను చూశాడు. శిలలా బిగుసుకుపోయి చూస్తూన్నాడు కానీ సాయం చెయ్యాలన్న ఆలోచన కలుగలేదు.

దూరం నుంచి ఈ తతంగాన్నంతా కాసేపు గమనించిన తత్వాలు పాడుకొనే వృద్ధుడొకడు పైకిలేచి అరటిపండును అంధురాలికి అందజేశాడు. వెళ్ళిపోతున్న పిల్లవాన్ని ఆపి కళ్ళముందే అవస్థపడుతున్న అంధురాలికి సాయం చెయ్యలేదేమని ప్రశ్నించాడు. భగవంతుడు మనకిచ్చిన రెండు చేతులలో ఒకటి మనకి ఇంకొకటి పొరుగువాడి చేయుతకి  అని బోధించాడు.

ఇది ఉపోద్ఘాతం !

                *                                             *          

పచ్చని తివాచీ పరిచినట్టున ఓ అచ్చమైన పల్లెటూళ్ళోకి ఎక్కడినుంచో ఒక తెల్లటి అంబాసిడర్ కారోచ్చి ఆగింది. కార్లోంచి ఎం.పి గారి వ్యక్తిగత సహాయకుడు హడావుడిగా క్రిందకి దిగి చెట్టు క్రింద కూర్చోనున్న ఓ వ్యక్తిని
" ఏవయ్యా ! ఇట్రావయ్య " అంటూ పిలిచాడు.
ఆ వ్యక్తి పరుగులాంటి నడకతో వచ్చి నమస్కరించి వినయంగా చేతులు కట్టుకున్నాడు.
" ఏ ఊరిది ? "
" రామాపురమండి "
" అవునూ, ఈ ఊర్లో పోలీస్‌స్టేషన్ ఎక్కడుంది? ఫోన్ చేయ్యాలి. కార్లో ఎం.పి గారున్నారు".
ఆ వ్యక్తి కారువేపు వినయంగా వంగి నమస్కరించి " ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ లేదండి " అన్నాడు.
" పోనీ ఈ చుట్టుపక్కలెక్కడైనా పోలీస్ స్టేషన్లున్నాయా ? "
" పాతిక మైళ్ళ దూరంలో పోలీస్ స్టేషన్ ఉండదండి ."
" ఏమిటి ?! పోలీస్ స్టేషనే లేదా ? అయితే ఇది బాగా వెనుకబడిన ప్రాంతంలా ఉందే ! "
" కాదండి. కాదండి. ఈ ఊళ్ళో ఏదైనా నేరాలు జరిగితేనే కదండి పోలీస్ ‌స్టేషన్లు కావాలి. అట్టాంటివన్నీ ఇక్కడ జరగవండి."
అప్పటిదాకా వింటూన్న ఎం.పి గారు  విస్మయాన్ని ఆపుకోలేక కార్లోంచి  క్రిందకు దిగి పల్లెటూరి వ్యక్తిని దగ్గరికి పిలిచారు .
" ఈ ఊర్లో నేరాలే జరగవా? "
" జరగవండయ్యా "
ఇంతలో ఎం.పి గారి మరో సహాయకుడు కలుగజేసుకొని  " పోనీ టౌనుకెళ్ళి ఫోను చేసుకుందాం " అని సలహా ఇచ్చాడు. ఎం.పి గారికి అది రుచించలేదు .
" నువ్వండవయ్యా. ఈ ఊరు వరస చూస్తూంటే చాలా విచిత్రంగా ఉంది."
" ఇదే కాదండి .ఇట్టాంటి చిత్రాలు శానా ఉన్నాయండి మా ఊళ్ళో  "

వీళ్ళిలా మాట్లాడుతుండగానే ప్రక్కన  కలకలం రేగింది.  మద్యం సీసాలో ఎం.పి గారి సహాయకుడు తెచ్చుకున్న మంచి నీళ్ళను మద్యం గా భావించిన జనం ఆ సీసాని ఒడిసిపట్టుకొని ఊళ్ళో మద్యం తాగడానికి వీళ్ళేదని, ఎవరినీ తాగనీయమని భీష్మించారు. మద్యం కాదు నీళ్ళేనని రుజువు చేశాక పంతం విడిచిపెట్టి వెళ్ళిపోయారు.

ఎం.పి గారు ఊరివాళ్ళతో కలిసి నడుస్తూ
" ఈ ఊళ్ళో పోలీస్ స్టేషనే లేదట. ఎవ్వరూ నేరాలే చెయ్యరట. ఎవ్వరూ తాగరట. ఎవ్వరినీ తాగించరట. అయితే పార్టీ బాగానే పనిచేస్తోందనమాట. ఈ ఊళ్ళో ఏ పార్టీ బాగా స్ట్రాంగ్‌గా ఉందయ్యా ? కాంగ్రెస్సా ? " అని ఆడిగాడు.
"కాదండి."
" తెలుగుదేశమా ?"
" కాదండి."
" జనతా నా ? "
" కాదండి. ఇండిపెండెంటండి "
" ఇండిపెండెంటా? "
" అవునండి. అందరు చినబాబు పార్టీయేనండి "
" ఎవ్వరయ్యా చినబాబు ? ".
శిథిలావస్థలో ఉన్న ఆలయ గోపురంపై పిచ్చి మొక్కలు పీకేస్తున్న ఒక వ్యక్తిని చూపించి
" ఆరేనండి చినబాబు గారు " అన్నాడు ఊరతను .
"దేవుడి  కన్నా ఎత్తులో నిలబడ్డాడే " ఆశ్చర్యపోయారు ఎం.పి గారు.
" మా ఊరికి ఆయనే దేవుడండి "

 సమాజమే దేవాలయం అనుకుంటే అందులోని రుగ్మతలను ఏరిపారేసేవాడు దేవుడే ! ఇది ప్రారంభం.
                                                           *                                                     * 

సినిమాలు రెండు రకాలు - మనస్సుకు హత్తుకునేవి, మదిని మెలిపెట్టేవి.

రుద్రవీణ మొదటి కోవకు చెందిన సినిమా. చిరంజీవి, బాలచందర్, ఇళయరాజా, గణేష్‌పాత్రో, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి హేమాహేమీల కలయికలో వచ్చిన క్లాసిక్ మూవీ . మహరాష్ట్రలో రాలెగావ్‌సిద్ధి అనే గ్రామాన్ని సంస్కరించిన అన్నాహజారేని, ఆంధ్రదేశంలో ఒక ఐ.ఏ.యస్ అఫీసర్ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని అల్లుకున్న కథ. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడైన బిలహరి గణపతిశాస్త్రి తనయుడిగా జన్మించి, ఓ వైపు సాంప్రదాయరీతులలో సంగీతాన్ని అభ్యసిస్తూ, మరో వేపు సమాజంలోని అపసవ్య ధోరణులకు ఆవేదన చెందుతూ, అటు తండ్రిని ధిక్కరించలేక, ఇటు అంతఃకల్లోలాన్ని అణుచుకోలేక సతమతమవుతూ చివరికి తెగించి తిరుగుబాటు చేసి నవసమాజ నిర్మాణం వేపు అడుగులు వేసి, సామజిక చైతన్యం తీసుకొచ్చిన యువకుడి చరిత్రే  రుద్రవీణ.  

ఉదాత్తమైన కథకు ఊపిరిపోయాలంటే అందుకు తగ్గ నటీనటులు కుదరాలి.  అటువంటి వాళ్ళందరూ ఈ చిత్రానికి సరిగ్గా అమరిపోయి పదికాలాల పాటూ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రానికి ప్రాణప్రతిష్ట చేశారు. సాంప్రదాయాన్ని సంగీతాన్ని రెండు కళ్ళుగా భావించే తండ్రిగా జెమినీ గణేశన్, సంఘంలో మార్పు కోసం నిత్యం రగిలిపోయే నిప్పుకణిక లాంటి యువకుడిగా చిరంజీవి పోటీపడి నటించారు. వీరిద్దరి కలయికలో వచ్చే సన్నివేశాల్లో సంభాషణలు, భావోద్వేగాలు అద్భుతంగా పండాయి. చిరంజీవి స్వతహాగా చక్కని నటుడు. బాలచందర్ లాంటి మేటి దర్శకుల చేతిలో పడితే ఇక చెప్పేదేముంది. సంగీత సాధన చేస్తూ దీనురాలి ఆకలి కేకలు విని ఏకాగ్రత చెదిరే సన్నివేశాల్లో ,' అలగా జనానికీ ఆటపాటలు కావాలి నాన్నా'  అని వాదిస్తున్నప్పుడు ,'  మానవసేవ ద్రోహమా ? ' అని తండ్రిని ధిక్కరించి కచేరిలో పాడినప్పుడు, ఎలక్ట్రిషియన్ చావుకు కారణమైనప్పుడు,  ' నేను మీ కొడుకు మాత్రమే కాదు , మీ శిష్యున్ని, పెద్ద అభిమానిని కూడా, ఇంతగా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బిలహరి గణపతి శాస్త్రి గారు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంజరంలో బందీ కావటమే నాకు నచ్చలేదు. అదే నన్ను బాధిస్తోందని ' అని బాధపడినప్పుడు, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు, ఊరిబాగు కోసం వివాహాన్ని రద్దు చేసుకొనే సన్నివేశాల్లో సూర్యనారాయణ శాస్త్రి కనిపిస్తాడు కానీ చిరంజీవి కనిపించడు.

శోభన కళ్ళతోనే నటించిన సన్నివేశాలు రెండు. అంటరానిదానివి కదూ అని ప్రశ్నింపబడినప్పుడు ఒకసారి, వివాహాన్ని త్యజించబోతూ వరుడైన కథానాయకుడు తన అభిప్రాయం కోరినప్పుడు మరోసారి, కళ్ళతోనే అద్భుతమైన భావాలను పలికించి శభాషనిపించుకుంది. 

బాలచందర్ దర్శకత్వ ప్రతిభ గురుంచి చెప్పాలంటే మరో టపా వ్రాయొచ్చు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ' ఎవరిమాట విన్నావో, రావో, ఇందు లేవో, భళి, భళి  ' అన్న త్యాగరాజ కృతిని సందర్భానుసారంగా వాడుకున్నారు దర్శకుడు. ఎవరి సలహా విని నా వద్దకు రాకుండా ఉన్నావో, అసలున్నావో లేవో అంటూ త్యాగరాజు శ్రీరామున్ని విమర్శిస్తూ అల్లిన కృతి అది. ఆ కృతిని తండ్రితో కలిసి సాధన చేస్తూంటే బిచ్చగత్తె అన్నం కోసం అరుస్తూంటుంది. ఏకాగ్రత కోల్పోయిన సూర్యాన్ని తండ్రి కోప్పడి సంగీతం మీదే మనస్సు లగ్నం చెయ్యమంటాడు. ఇక్కడ బిచ్చగత్తె (సమాజం) అన్నం (సాయం) కోసం ప్రార్థిస్తోంది . కథానాయకుడికి సమాజ సేవ చెయ్యాలనే తపన ఉంది. కానీ తండ్రి అడ్డుపడుతూ సలహాలిస్తున్నాడు. ఇలా త్యాగరాజ కృతిని అటు సంగీతానికి ఇటు సన్నివేశానికి తగ్గట్టుగా వాడుకోవడం డర్శకుని ప్రతిభా పాటవాన్ని తేటతెల్లం చేస్తోంది. అలాగే, ప్రమాదంలో గాయపడి చావుబ్రతుకుల్లో ఉన్న విద్యుత్‌కార్మికున్ని, కథానాయకుడు కారులో కచేరీకి వెళ్తూ చూసే సన్నివేశం నాకు గౌతమ బుద్ధుని కథను జ్ఞప్తికి తెచ్చింది.

గణేష్‌పాత్రో సంభాషణలు ఈ చిత్రానికి ఆయువుపట్టు. ప్రటి మాటా శక్తివంతంగా ఉంది. కొన్ని సంభాషణలిక్కడ పొందుపరిచాను.

ఆకలి కేకలు నిన్నాకట్టుకోడానికి అవేమన్నా ఆలాపనలా ఆవృత్తాలా, అపశృతులు.
      దీనుల వేదనని అపశృతులనకండి నాన్నా.
ముష్టిదాని అరుపు నీకు మృష్టాన్నభోజనంలా ఉంటే సంగీతామృతం నీ జిహ్వకు సరిపడదు.
    గోదావరిలో  గొట్టికాలువ కలిస్తే అది సంగమం కాదు రా సంకరమే. 

   అమ్మనే  అమ్ముకు తిరిగేవాడికి పుట్టగతులుండవు. అది అపచారం
  కాదురా వ్యభిచారం.
నేను అమ్మను అమ్ముకునేవాన్ని కాదు నాన్నా. అమ్మ అందరికీ అమ్మే అని నమ్మినవాన్ని.
     మన గుమ్మంలోకొచ్చి శుభవార్త చెప్పినవారికి దారి ఖర్చులివ్వటం
     ఆనవాయితీ.
ఆయన నోటికే చిల్లుపడిందనుకున్నాను. నోటుకీ చిల్లు పడింది. చిల్లు పడినవి చెల్లవండి.
సీతారామశాస్త్రి సృజించిన సిరివెన్నలలో సాహితీప్రియులందరూ తేలి వివశులయ్యారు. బంగారానికి తావి అబ్బినట్టు ఇళయరాజా సంగీతం, కే.జే.జేసుదాస్, బాలు, చిత్ర ల గానమాధుర్యం తోడై ఈ చిత్రంలోని పాటలని అజరామరం చేసాయి. నాకు నచ్చిన కొన్ని వాక్యాలు.
తరలిరాదా తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
గగనాల దాకా అల సాగకుంటే
మేఘాల రాగం ఇల చేరుకోదా


వెన్నెల దీపం కొందరిదా
అడవికి సైతం వెలుగు కదా
బ్రతుకున లేని శృతి కలదా
ఎద సడి లోనే లయ లేదా

కూసే కోయిల పోతే కాలం ఆగిందా
పారే ఏరే పాడే మరో పదం రాదా
మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలుకదు కదా


ఆకాశం తాకే ఏ నేలకైనా ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను
నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏ నాటికీ
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
ఏ హాయీ రాదోయి నీ వైపు మరువకు


శీతాకాలంలో ఏ కోయిలైనా
రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక
విరిసే నవ్వులు లేక
మురళికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే 
పండుగ కాదా

ఆనాడు వాసంత గీతాలు పలుకును

కరుణను మరపించేదా  చదువు సంస్కారం అంటే
తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే


లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని (కథానాయుక పేరు లలిత)
ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జలధిని

తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజా కుసుమం


ఈ పాటలన్నీ ఒక ఎత్తైతే మహాకవి శ్రీశ్రీ పదాలను ప్రేరణగా తీసుకొని వ్రాసిన  ' చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ' పాట మరొక ఎత్తు. సంగీతం నేర్చుకుంటూ వచ్చీరానీ సంగీత జ్ఞానంతో ఈ పాటను ఎన్ని సార్లు పాడుకొన్నానో గుర్తులేదు. ఎప్పుడు విన్నా ఏదో తెలియని అనుభూతి.
ఒక ముసలివాడు ఒంటరిగా ఉలి చేతబట్టి కొండను తొలచి తన ఊరికి  రహదారిని నిర్మించాడన్న వార్త విన్నప్పుడో, చిన్న మొక్క మొలవని ప్రాంతంలో ఒక వ్యక్తి, అన్నీ తానే అయ్యి, ముప్పైఏళ్ళు కష్టపడి 1360 ఎకరాల్లో అడవిని సృష్టించాడని తెలిసినప్పుడో కలిగే స్పందన.
 అనిర్వచనీయమైన ఆవేదనతో మనస్సంతా నిండిపోయి ఆ ట్రాన్స్‌లో నుండి రావటానికి కొంత సమయం పడుతుంది. సంఘజీవిగా నా బాధ్యతను గుర్తుచేస్తుంది. నా కంటే చిన్నవాళ్ళు, నేనెరిగిన వాళ్ళు సమాజానికి తమ వంతుగా ఎంతో చేస్తున్నారు.

వాళ్ళు చేసేదానిలో పదో వంతు చేసినా నా జన్మ ధన్యమైనట్లే.


*                                                              *

ఈ సినిమాని తమిళంలో పునర్నిర్మించారు. సీత, కమలహాసన్ నాయికానాయకులు. తమిళ శైలికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అన్నా చెల్లెళ్ళ బాంధవ్యాన్ని బలోపేతం చేశారు.' రండి  దయచేయండి, చెప్పాలని ఉంది' పాటలు లేవు. కథానాయకుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూంటే అక్కడ నాయిక పరిచయం అవుతుంది. పాటలలో డాన్సులు అవీ పెట్టారు. తెలుగువాన్ని కాబట్టి నాకు తెలుగు సినిమానే నచ్చినా తమిళం కూడా ఫర్వాలేదనిపించింది.

రుద్రవీణ జాయాపజయాల మీద చర్చ అనవసరం. అప్పుడున్న సమస్యలు ఇప్పుడూ ఉండవచ్చు. నా లాంటి వాళ్ళపై ఈ సినిమా చూపిన ప్రభావం చాలు కలకాలం నిలిచిపోడానికి. అవార్డులు రివార్డులు అన్నీ తర్వాతే.

మానవవాదానికి ముగింపు లేదు.


5 comments

Post a Comment

పృథ్వీరాజ్ చౌహాన్‌ది ధృతరాష్ట్రుని అంశా?






రాక్రమవంతుడైన పృథ్వీరాజ్ చౌహాన్ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఢిల్లీ -అజ్మీర్‌లను రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేసిన ఆఖరి హైందవరాజు, రాజపుత్ర యోధుడు అతను. అతని భార్య సంయుక్త. వారిద్దరి ప్రేమ, పరిణయం చాంద్‌బార్దాయ్ వ్రాసిన 'పృథ్వీరాజ రాసో ' సాక్షిగా జగద్వితం. మహమ్మదీయుల దండయాత్రను సమర్థవంతంగా తిప్పిగొట్టి తుదకు మళ్ళీ అదే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన పృథ్వీరాజ్ ధీరోద్ధాత్తత గురుంచి రకరకాల గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భవిష్యపురాణంలోనూ ఈ చారిత్రక పురుషుడి ప్రస్తావన ఉంది.


భవిష్యపురాణం ప్రకారం ఇంద్రప్రస్థాన్ని పరిపాలిస్తున్న అనంగపాలుడనే రాజుకు చంద్రకాంతి, కీర్తిమాలిని అని ఇద్దరు కూతుళ్ళు. చంద్రకాంతిని కన్యాకుబ్జాన్ని ఏలుతున్న రాష్ట్రపాలుని వంశీయునికిచ్చి పెళ్ళి చేస్తే, కీర్తిమాలినిని చవహని వంశస్థుడైన సొమేశ్వరునికిచ్చి వివాహం జరిపిస్తాడు.చంద్రకాంతికి జయచంద్రుడు, రత్నభానుడనే పిల్లలు కలుగుతారు. కీర్తిమాలినికి ముగ్గురు పిల్లలు పుడతారు -ధుందుకారుడు,కృష్ణకుమారుడు, పృథ్వీరాజు. వీళ్ళలో పృథ్వీరాజుది ధృతరాష్ట్రుని అంశ. అమిత బలపరాక్రమాలు కలవాడు. పన్నెండేళ్ళ ప్రాయంలోనే సింహంపై స్వారీ చేస్తాడు. మనవడి శౌర్య సంపత్తికి మెచ్చిన తాత అనంగపాలుడు అతన్ని దత్తత్త తీసుకొని రాజ్యాన్ని కట్టబెట్టి హిమాలయాలకు వెళ్ళిపోతాడు.



సోదరులిద్దరూ తనకు శతృవులని భావించిన పృథ్వీరాజు, తాత పరమపదించగానే వాళ్ళను రాజ్యం నుండి వెళ్ళగొడతాడు.వాళ్ళు తమ తమ మంత్రులని వెంటబెట్టుకొని కన్యాకుబ్జాన్ని పాలిస్తున్న జయచంద్రున్ని శరణు వేడుతారు.అతడు ఆభయమిచ్చి ఆశ్రయం కల్పిస్తాడు. జయచంద్రునికి అగమ, మలన అని ఇద్దరు చెల్లెళ్ళు. అగమను పృథ్వీరాజుకిస్తారు. మలనను ధుంధుకారుని మంత్రైన ప్రద్యోతనునికిచ్చి పెళ్ళి జరిపిస్తాడు. పృథ్వీరాజు కొత్త దుర్గాన్ని నిర్మించి దాని గుమ్మాన్ని ఎత్తిస్తాడు. ఆ గుమ్మం భాగ్యప్రదాత అని భావించి దానికి దేహలి అని నామకరణం చేస్తాడు (అదే నేటి ఢిల్లీ). కొంతకాలానికి ' తాత ఆస్తిలో తనకూ భాగముందని, తన భాగం తనకు వదిలిపెట్ట ' మని వర్తమానం పంపుతాడు జయచంద్రుడు. పృథ్వీరాజు తిరస్కరిస్తాడు. వైరం మొదలవుతుంది.

జయచంద్రుని తమ్ముడైన రత్నభానుడు (ఇతని కొడుకే నకులాంశ సంభూతుడు లక్షణుడు) పృథ్విరాజు పాలనలో ఉన్న కొంత ప్రాంతాన్ని హస్తగతం చేసుకుంటాడు. జయచంద్రునికి పిల్లలు కలుగరు. దాసీదాని మీద మనసు పడి ఆమె ద్వారా సంయుక్త అనే పుత్రికకు తండ్రవుతాడు. ఆమె యుక్తవయస్సుకు రాగానే స్వయంవరం ప్రకటిస్తాడు. పృథ్వీరాజు ధైర్యసాహసాలు విన్న ఆమె స్వయంవర మంటపంలో అతని బంగారు ప్రతిమను పుష్పమాలాంకృతం చేస్తుంది. ధైర్యముంటే వచ్చి తీసుకెళ్ళమని పృథ్వీరాజుకు సవాలు విసురుతాడు జయచంద్రుడు. పృథ్విరాజు ససైన్యంతో వచ్చి సంయుక్తను తీసుకెళ్తాడు. హోరాహోరీగా జరిగిన యుద్ధంలో రత్నభానుడు నిహతుడవుతాడు.


పృథ్వీరాజు లక్ష చండీయాగం చేస్తే దేవి ప్రసన్నురాలై కౌరవుల అంశతో కుమారులను, ద్రౌపది అంశతో కూతురును అనుగ్రహిస్తుంది. అయితే వీరు సంయుక్త ద్వారా కలిగిన సంతానమో మరెవరి ద్వారా కలిగిన సంతానమో తెలియదు.కూతురు పుట్టగానే భూమి కంపించి, రక్తమాంస వర్షం కురిసి, ఆకాశం నుంచి చండిక వికటాట్టహాసం చేస్తుంది.ఆమె పేరు ఏల. పన్నెండేళ్ళ ప్రాయంలో ఆమె తండ్రిని పిలిచి మండపంలో రక్తధారలతో తనకు అభిషేకం చేయించేవాడు, ద్రౌపది నామధేయంతో నగలను సమర్పించేవాడు తనకు నాథుడవుతాడని చెబుతుంది. పృథ్వీరాజు ఆ విధంగా శాసనం వ్రాయించి, కర్ణాంశ సంజాతుడైన తన కొడుకు తారకునిచ్చి, ఒక లక్ష సైన్యంతో దేశం మీదకు పంపుతాడు. రాజులందరూ వెనుకంజ వేస్తే అర్జునాంశ సంజాతుడైన బ్రహ్మానందుడు అందుకు సంసిద్ధుడౌతాడు.(ఇతను మలన కుమారుడు.ఇతని స్నేహితుడు కృష్ణుని అంశలో పుట్టిన జయసింహుడు). వివాహానికి ఎక్కడెక్కడి రాజులూ సైన్యంతో వస్తే పృథ్వీరాజు ఆశ్చర్యపోయి వారికి శిబిరాలు ఏర్పాటు చేస్తాడు. వివాహమైన వెంటనే తారకాదులు చెలరేగి యుద్ధం చేస్తే జయసింహుడు ఖడ్గధారియై దూకి తన వారిని ఆదుకుంటాడు.సకలవిద్యాపారంగతుడైన పృథ్వీరాజు రెండవ కురుక్షేత్ర యుద్ధంలో (రెండవ తైరైను యుద్ధంలో) మహమ్మదు ఘోరీ చేతిలో అపజయం పాలై మరణిస్తాడని,అంతటితో అతని వంశం క్రమంగా అంతరిస్తుందని, నకులాంశ సంభూతుడైన లక్షణుడు కూడా ఈ యుద్ధంలో మరణిస్తాడని భవిష్య పురాణం తెలియజేస్తోంది.

పురాణాల్లో ఇలా ఉంటే చరిత్రకారుల భాష్యం మరోలా ఉంది. అనంగపాలుడనే తాత పృథ్వీరాజుకున్నా, ఆ తాతయ్య కూతుళ్ళ పేర్లు మాత్రం రూపసుందరి, కమలాదేవి. సోమేశ్వరరాజు (తండ్రి పేరు సరిపోయింది) -కమలాదేవిల తనయుడు పృథ్వీరాజ్ చౌహాన్. పృథ అనే చెల్లేలు మాత్రం ఉంది.చిత్తోడ్ రాజైన సమర్‌సింగ్ ఈమె భర్త . రెండవ తైరైను యుద్ధంలో అన్నయ్య ఓడిపోవటం, భర్త, కన్నకొడుకూ వీరమరణం పొందటంతో అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటుంది. పృథ్వీరాజుకు హరిరాజనే సోదరుడున్నట్లు కొంత సమాచారముంది. పృథ్వీరాజు మరణాంతరం, అతని కుమారుడైన గోవిందరాజుని అజ్మీర్ సామంత రాజుగా ప్రకటిస్తారు ముసల్మానులు. హరిరాజు అతన్ని పడగొట్టి రాజ్యాన్ని కైవసం చేసుకుంటాడు. తురుష్కులపై తిరుగుబాటు చేసి కొంతమేర సఫలీకృతుడై చివరికి పరాజితుడై ఆత్మార్పణ చేసుకుంటాడు. పృథ్వీరాజుకు చాలామంది సంతానమున్నట్లు, వీరిలో కొందరు ఇస్లాం మతం పుచ్చుకున్నట్లు కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు గానీ ఎక్కడా ఏల తారకుడిల ప్రస్తావన లేదు. అలాగే జయచంద్రుడు - పృథ్వీరాజ్ అన్నదమ్ములన్న విషయం రూఢియైనా , జయచంద్రుని తమ్ముడైన రత్నభానుడి విషయంలో సమాచారం లేదు. సంయుక్త జననంలోనూ స్పష్టత లేదు.

భవిష్యపురాణంలో వివాస్పద అంశాలు చాలా ఉన్నాయి. ఏది వ్యాసకృతమో, ఏది ఇతరుల కల్పనో తెలియదు. వాటిలో పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్ర ఒకటి. ధృతరాష్ట్రాంశతో జన్మించిన పృథ్వీరాజు వరుసకు అన్నకూతురైన సంయుక్తను లేవదీసుకొని వివాహమాడటం ఏమిటో అంతుపట్టకుండా ఉంది. జయసింహుని లీలలు, చరిత్ర దాదాపుగా శ్రీకృష్ణుని చరిత్రను పోలివున్నాయి. ఇంతటి ప్రఖ్యాతి వహించిన రాజు నిజంగా పృథ్వీరాజు కాలంలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లేవు.నకులాంశతోనూ, కర్ణాంశతోను ద్రౌపద్యాంశతోనూ పుట్టిన వాళ్ళు, ఇతర దివ్యాంశ సంభూతులు అనామకులుగా మరణించటమేమిటో అర్థం కాకుండా ఉంది. ఏ ప్రయోజనమూ నెరవేరనప్పుడు మహాత్ములు మళ్ళీ పుట్టడం దేనికి? ఇన్ని సందేహాల మధ్య అసలు భవిష్యపురాణంలో పేర్కొన్న పృథ్వీరాజు, మాములు జనానికి తెలిసిన పృథ్వీరాజు ఒక్కరేనా అన్న అనుమానం కలుగక మానదు.



4 comments

Post a Comment