• మెరిసే మేఘాలు

    మెరిసే మేఘాలు
  • కురిసే వర్షాలు

    కురిసే వర్షాలు
  • విరిసే పుష్పాలు

    విరిసే పుష్పాలు
  • మురిసే భువనాలు

    మురిసే భువనాలు
  • నాకు

    నాకు
  • కదిలే కావ్యాలు

    కదిలే కావ్యాలు

నేను - నా సైకిలు - భద్రాచలం


ది కొత్తగా నేను ఇంటర్మీడియట్ లో చేరిన నాటి సంగతి.


పదో తరగతి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణున్నై క్లాస్ ఫస్ట్ రావటంతో మా నాన్నగారు హీరో రేంజర్ సైకిలు కొనిచ్చారు నాకు.అంతకుముందు మా నాన్నగారిది పెద్ద సైకిల్ అట్లాస్ ఉండేది.దాన్లో స్కూల్ కి వెళ్ళేవాడిని.ఇప్పుడు నాకంటూ స్వంత వస్తువు రావటంతో చాలా సంబరపడ్డాను.మంగళవారం పూట కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి చిన్నసైజు పూజలు అవీ చేసాను.చీకట్లో కుడా నా పేరు మిలమిల మెరిసేలా రేడియం స్టిక్కర్ అంటించాను. తళాతళాలాడే ఆ కొత్త సైకిల్ పై కూర్చొని,నలిగిపోని పువ్వుల చొక్కా,నిగనిగలాడే బ్యాగీప్యాంటు తొడుక్కుని,బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోలా కలలు కంటూ,యథాశక్తి నాకు వచ్చిన అరకొర విన్యాసాలు చేస్తూ మా కాలేజ్ వెళ్ళేవాడిని.






ఓ రోజు ఇలాగే నా సైకిల్ తీసుకొని లైబ్రరీకి వెళ్ళాను.బయట చాలా సైకిళ్ళు,స్కూటర్లు పార్క్ చెయ్యబడి ఉన్నాయి.నేనూ నా సైకిల్ లాక్ చేసి స్టయిల్ గా లైబ్రరీ లోనికి వెళ్ళాను.అక్కడ దినపత్రికలు తప్ప ఏమీలేవు.వారపత్రికలు లేకపోతే పోయే కనీసం చందమామ,బాలమిత్ర లాంటివి కూడా లేకపొయ్యేసరికి మనకి బోర్ కొట్టింది.ఆ ఉన్న నాలుగైదు దినపత్రికలు చెల్లాచెదురైపోయి,చిరిగిపోయి పదిమంది చేతుల్లో విడివిడిగా దర్శనమిచ్చాయి.అపరాధ పరిశోధకుల్లా అందరూ తమ చేతుల్లోని పేపర్లలో తలమునకలైపోయి,వార్తలతో పాటూ,అందులోని అడ్వర్టైజ్మెంట్లు కూడా చదివివేస్తున్నారు.నాదాకా పేపర్ వచ్చే పరిస్థితి కనిపించలేదు.ఏం చెయ్యాలో పాలుపోక కాసేపు బిక్కమొగంవేసి 'ఓకే లెట్స్ గో హోం' అని నిర్ణయించుకొని బయటికి వచ్చాను.వచ్చి చూద్దును కదా నా సైకిల్ అక్కడ లేదు. గుండె గుభిల్లుమంది.






పధ్నాలుగువందలు పోసి కొన్న సైకిల్ అది.కొని పట్టుమని పదిరోజులు కుడా కాలేదు.నాకు చెమటలు పట్టేశాయి.ఎవరైనా దొంగలించారేమోనని చుట్టుపక్కల వీధులన్ని తిరిగేశాను.ఎక్కడా కనిపించలేదు.
మానవయత్నంతో పాటు దైవయత్నం కూడా ఉండాలని భధ్రాచలం రామున్ని కూడా వేడుకున్నాను.'నా సైకిల్ నాకు దొరికేలా చెయ్యి స్వామీ.సకుటుంబ సమేతంగా వచ్చి నీ దర్శనం చేసుకుంటా' అని మొక్కుకున్నాను.నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ మళ్ళీ లైబ్రరీ దగ్గరికే వచ్చాను.నా అవస్థనంతా చూసిన ఒక పెద్దమనిషి 'ఇందాకే ట్రాఫిక్ పోలీసులొచ్చి కొన్ని సైకిళ్ళు,స్కూటర్లు పట్టుకెళ్ళారు బాబు.ఎందుకైనా మంచిది వెస్ట్ పోలిస్ స్టేషన్లో వెదుకు ' అని ఆపద్భాంధవుడిలా మార్గదర్శనం చేశారు.నాలో ఆశ చిగురించింది.ఆయనకు కృతజ్ఞతలు చెప్పి పోలిస్ స్టేషన్ కి వెళ్ళాను.వెళ్తూ దారిపొడవునా ఆలోచిస్తూనే ఉన్నాను ' నా సైకిల్ ఏమైనా రోడ్డుకడ్డంగా పెట్టానా ' అని.అలాంటిదేమీ లేదు.అక్కడ నా సైకిల్ తో పాటుగా చాలా సైకిళ్ళున్నాయి.వాటిని వదిలేసి నా సైకిల్ మాత్రం ఎలా పట్టుకెళ్తారు అనిపించింది.


వెస్ట్ పోలీస్ స్టేషన్లో నా సైకిల్ కనిపించగానే పోయిన ప్రాణం తిరిగొచ్చింది.
కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళి నా సైకిల్ ఇవ్వమని అడిగాను.ఆయన వయస్సు నలభై - యాభై మధ్యలో ఉంటుంది.బానపొట్ట.నావైపు ఎగాదిగా చూసి మా నాన్నేం పని చేస్తారో కనుక్కొని ' రోడ్డుకడ్డంగా సైకిల్ పెట్టావ్, ఫైన్ కట్టి తీసుకెళ్ళు ' అన్నాడు.' నేనేం సైకిల్ అడ్డంగా పెట్టలేదు ' అని అతనితో వాదించాలని నాకనిపించింది.కాని ధైర్యం చాలలేదు.అవతల పోలిసోడితో వ్యవహారం.నీళ్ళు నమిలి ' నా దగ్గర లేదు సార్ ' అన్నాను. ఆయన ముఖం చిట్లించి అయితే రేపు కోర్టుకొచ్చి జరిమానా కట్టి,సైకిల్ తీసుకు ఫో' అన్నాడు.నాకు ఏడుపు వచ్చినంత పనైయ్యింది.సైకిల్ కోసం మొదటిసారి కోర్టుగుమ్మం ఎక్కాలా దేవుడా,నేను నా పరువు,ఇంటి పరువు ఏం కావాలని అరవ సినిమాలో హీరోలా తెగ కుమిలిపోయాను.


ఇంతలో గజేంద్రుడి మొరవిన్న విష్ణుమూర్తిలా ఎస్సై వచ్చాడు.నేను నాగోడు వెల్లబోసుకున్నాను.ఆయన కానిస్టేబుల్ ని పిలిచి విచారించాడు.నా వైపు తిరిగి ' ఏం బాబు.మీ నాన్న ఆఫీసర్ అని ఏదో పొగరుగా మాట్లాడావట ' అని అడిగాడు.కానిస్టేబుల్ తప్పు కప్పిపుచ్చుకోడానికి చెయ్యని నేరం నామీద వేస్తున్నాడని తెలిసి నాకు ఏడుపు వచ్చేసింది.బావురుమని నేనా పని చెయ్యలేదని విన్నవించుకున్నాను.నా ఏడుపు చూసి ఎస్సై కి విషయం అర్థమయ్యింది.ఆయన కానిస్టేబుల్ ని చీవాట్లు పెట్టి ' అడ్డమైన కేసులన్నీ తీసుకొస్తావ్ గదయ్యా.ఆ సైకిల్ అతనికిచ్చెయ్ ' అని విసుక్కున్నాడు.


సైకిల్ నాకిచ్చేస్తూ ' ఐదు రూపాయిలివ్వు.రిక్షాలో తీసుకొచ్చా ' అన్నాడు కానిస్టేబుల్.నా దగ్గర నయాపైసా లేదు.అదే చెప్పాను.చావు గిరాకీ తగిలిందని గొణుక్కుంటూ ఆయన వెళ్ళిపోయాడు.సైకిల్ దొరికిందన్న ఆనందంతో నేను బయటపడ్డాను.


అయితే నా సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు.గిట్టనోళ్ళు ఎవరు గింజుకున్నారో కానీ,పి.హెచ్.డి చేస్తున్న మా బాబాయ్ నా సైకిల్ తీసుకెళ్ళి పెడల్ విరగొట్టుకొచ్చాడు.ఆ పెడల్ స్క్రూ టైప్.అప్పట్లో కొత్తమోడల్ .మళ్ళీ బిగిద్దామంటే అలాంటి స్క్రూ ఏ సైకిల్ షాప్ లోను విడిగా దొరకలేదు.వెల్డింగ్ చేయించినా పెడల్ తేడాగానే ఉండిపోయింది.


దాంతోపాటు నా భధ్రాచలం మొక్కు కూడా అలానే ఉండిపోయింది .


' తెలుగురత్న' లో నా కథ- బలిపశువులు

  ( ' తెలుగురత్న' లో మార్చి 2 2010న ప్రచురితం)












   

   

కొడిగట్టిపోతున్న కర్షకుల జీవితాల్లా ఆకాశంలోని నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ ఉసూరుమంటున్నాయి.శిథిలమైపోయిన ఊరిబావిలా సగం చిక్కిన చంద్రుడు నిర్వికారంగా చూస్తున్నాడు.కీచురాళ్ళ సొద,అప్పుడప్పుడు ఎక్కడినుంచో దూరంగా వినిపించే కుక్క అరుపు తప్ప అంతా స్తబ్ధుగా ఉంది.

ఊరి పొలిమేరలో !
తన చేను మధ్యలో !

అస్త్రసన్యాసం చేసి అంపశయ్య చేరిన భీష్మపితామహుడిలా నిస్సహాయంగా జారగిలబడి ఉన్నాడు అనంతరామయ్య.చుట్టూ వున్న కటిక చీకటిలాగే అతని గుండెల్లో గుబులు దట్టంగా పరచుకొని ఉంది.నిరాశా నిస్పృహలు దావానలంలా అతని నరనరాన్ని దహించి వేస్తున్నాయి.గురవయ్య విధించిన గడువు నేటితో తీరిపోయింది.జోళ్ళు అరిగేలా ఊళ్ళు తిరిగినా ఎక్కడా అప్పు పుట్టలేదు.ఇక పుట్టదనీ అర్థమైపోయింది.ఆఖరు బస్సుదిగి,ఇంటికి వెళ్ళడానికి మనసొప్పక ఇటువైపు వచ్చాడు.అప్పటికే అతనొక నిర్ణయానికి వచ్చేశాడు.

ఎండిపోయిన వేరుశెనగచేను వైపు పేలవంగా చూసి భారంగా నిశ్వసించాడతను.అతని కళ్ళలో జీవం లేదు.తడారిపోయిన నీటి చెలమల్లా ఉన్నాయి.గెడ్డం కలుపుమొక్కలా ఏపుగా పెరిగిపోయి అక్కడక్కడా నెరసిపోయింది.ముఖంపై ముడతలు ముంచుకొస్తున్న వార్ధక్యానికి సూచికల్లా ఉన్నాయి.చిరుగులు పడ్డ అతని పంచె పేదరికాన్ని మరుగున పెట్టలేక నానా అవస్థలు పడుతోంది.మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన అతని కళ్ళ ముందు మెదలింది.

రేచీకట్లు ముసురుకుంటున్న గోధూళి వేళ.పక్షులన్నీ గూళ్ళకు చేరుకుంటున్నాయి.వయసుడిగిపోయి,వ్యాపకాలు లేని వృద్ధులు రావిచెట్టు క్రింద రచ్చబండ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు.తను పశువులు మేపుకొని అప్పుడే ఇంటికొచ్చాడు.దొడ్లో వాటిని కట్టేసి,వాటికి ఎండుగడ్డి వేసి,కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉండగా అలజడి మొదలైంది.వీధిలోకి వచ్చి చూస్తే వడ్డీవ్యాపారి గురవయ్య,అతని మనుషులు.

గురవయ్య వీధిలోంచే తనకివ్వాల్సిన వడ్డీడబ్బుల గురుంచి గొడవ ప్రారంభించాడు.తను ' ఇంట్లోకి రండి మాట్లాడుకుందాం ' అన్నా వినలేదు.ఈ రభసకు భార్య,కూతురు బయటికి వచ్చారు.నలుగురూ పోగయ్యారు.తాడోపేడో తేల్చుకోడానికి వచ్చినవాడిలా చిందులు తొక్కుతున్నాడు గురవయ్య.'కూతురు పెళ్ళి రెండునెలల్లో ఉంది.పెళ్ళయ్యాక తలతాకట్టు పెట్టైనా అప్పు తీర్చేస్తాను.అంతవరకూ ఆగమ 'ని తను వేడుకున్నా వినిపించుకోలేదు.గారపల్లు బయటపడేలా పెళుసుగా నవ్వి ' మింగ మెతుకు లేనోడికి మీసాలకు సంపెంగ నూనె దేనికిలే ? ఇప్పుడ్నీ కూతురికి పెండ్లికాకపోతే వచ్చే నష్టమేముంది? ' అనేశాడు తేలిగ్గా.తనకు తలకొట్టేసినట్లైంది.అప్పటికీ అక్కడ మూగిన జనంలో కొందరు తన వైపు వకాల్తా పుచ్చుకొని ' కూతురు పెండ్లంటున్నాడు కదా,కొన్ని రోజులు వోపికపట్టు.నీ సొమ్ము యాడికి బోదులే ' అన్నారు. గురవయ్య వాళ్ళ మీద కస్సుమంటూ పైకి లేచాడు.' చాల్చల్లేవయ్యా చెప్పొచ్చారు.పెతివోడూ నీతులు జెప్పేటోడే.మీకేం మీ సొమ్ముకాదు కాబట్టి ఎన్ని కబుర్లైనా చెబ్తారు.అవతల ఈళ్ళ దగ్గర డబ్బులొసూలు చెయ్యలేక నా పేనాలు పొతావుండాయి.ఇప్పటికి మూడ్నెలలు వడ్డీబాకీ.మీరెవురైనా హామీ వుంటానంటే చెప్పండి,ఇప్పుడే వదిలేస్తా ' అని కసురుకున్నాడు.ఎవ్వరూ కిక్కురుమనలేదు.అతను తనకు మూడురోజుల గడువిచ్చి,అది దాటితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి వెళ్ళిపోయాడు.ఇంతటి ఘోరమైన అవమానం తనకెప్పుడూ జరగలేదు.ఎన్నో ఏళ్ళుగా వ్యయప్రయాసలకోర్చి తను నిర్మించుకున్న పరువుప్రతిష్ఠ ఆ రోజు మట్టిలో కలిసిపోయాయి.

సినిమా వదిలేశాక దాన్ని సమీక్షిస్తూ జనం విడిపోయినట్లు,అక్కడ మూగిన జనం కూడా తలోమాట మాట్లాడుకుంటూ చెదరిపోయారు.చేష్టలుడిగిన శిలాప్రతిమలా నడివీధిలో తాను నిలబడిపోతే,శెలవులలో ఇంటికొస్తూ జరిగిన దారుణమంతా చూసిన తన కొడుకు సూర్యం,తనను ఇంట్లోకి తీసుకువెళ్ళాడు.' తనిక డిగ్రీ చదవనని,పట్నంలో ఏదైనా పని చూసుకొని చేతనైన సహాయం చేస్తాన ' ని కొడుకు, ' ఇప్పట్లో పెళ్ళివద్దని ' కూతురు మొండికేశారు.అందరి కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి.తనే వాళ్ళను సమాధానపరచి పట్టు సడలింపచేశాడు.అప్పట్నుంచి ఎక్కడైనా అప్పు దొరక్కపోదా అని తిరుగుతూనే ఉన్నాడు.తన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి.

కూతురిని తలచుకోగానే అనంతరామయ్య హృదయం దుఃఖంతో బరువెక్కింది.పెళ్ళిడొచ్చి ఏళ్ళు కావొస్తున్నా ఇంకా గడప దాటని కూతురు.తన ఈడు పిల్లలంతా తల్లులై సంసారాలీదుతుంటే తను మాత్రం ఇంకా వంటపని,పొలంపని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది.ఇప్పటికైనా ఆమెకు పెళ్ళి చెయ్యకపోతే తను విఫలమైనట్టే అనుకొని తనకున్న పరిమితులలో మంచి సంబంధం చూసి ఖాయం చేశాడు.కట్నకానుకలంటూ పెద్దగా లేకపోయినా కనీస ఖర్చులుంటాయి కదా.అతను అప్పు చేశాడు.వేరుశెనగ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
ఈ సీజన్ లో వర్షాలు కాస్త ఆశాజనకంగానే ఉన్నాయి.ఒక పంటపండినా అతను కాస్త తెరపినపడ్డట్లే.

పంట ఏపుగా పెరిగి గింజపట్టే దశకు చేరుకొంది.అతని సంతోషానికి అవధుల్లేవు. ' ఇంకో పదును వానపడితే చాలు ' అనుకుంటూండగా పరిస్థితులు మళ్ళీ తిరుగుముఖం పట్టాయి.ఎలక్షన్లలో వాగ్దానాల్లా మెరిపించి మురిపించిన మేఘాలు,గెలిచిన నాయకుడికి మల్లే ముఖం చాటేశాయి.ఎండ తీక్షణత పుంజుకొంది.వేరుశెనగ వాడిపోవడం ప్రారంభించింది.ఊటబావిలోని కాసిని నీళ్ళతో కొన్నాళ్ళు నెట్టుకొచ్చాడు.తర్వాత అదీ ఎండిపోయింది.అతని నెత్తిన బండ పడ్డట్లైంది.గింజపట్టని నీళ్ళకాయలు అతనేం చేసుకోగలడు ?! హతాశుడయ్యాడు.

అనంతరామయ్యది వానాకాలం చదువు.ఉన్న ఆస్తల్లా తాతతండ్రుల ద్వారా సంక్రమించిన ఐదెకరాలే.తండ్రి కాలం చేశాక,తల్లి పోషణభారం కుటుంబబాధ్యతలు భుజానికెత్తుకొని కొన్నేళ్ళపాటూ పొలంలో బంగారమే పండించాడు.ఐదెకరాల ఆస్తికి మరో రెండెకరాలు జతచేసి ఏడెకరాలు చేశాడు. ఆ సమయంలోనే వొక ఇంటివాడై ఇద్దరు పిల్లల తండ్రయ్యాడు.ఒక కూతురు,వో కొడుకు.

రోజులు దొర్లాయి.కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు.ఫెళఫెళకాస్తూ కరువొచ్చింది.అతను నిబ్బరంగా ఎదుర్కొన్నాడు. ' ఒక్క ఏడాదేలే' అనుకున్న కరువు మరో మూడేళ్ళు కొనసాగింది.కురవాల్సిన వర్షాలు సకాలంలో కురవక పొయ్యిమీది పెనంలా పొగలసెగలుపోయింది పుడమితల్లి.ఏనుగుదాహంతో అలమటిస్తున్నట్లు భూములన్నీ నోళ్ళు తెరచిపెట్టుకొని బీటలు వారాయి.అడుసునేలలో పరవళ్ళు త్రొక్కాల్సిన నాగళ్ళు మూలపడ్డాయి.కొమ్ములెగరేసి, కుప్పెలు ప్రదర్శిస్తూ ఠీవీగా తిరిగిన కాడెద్దులు కబేళాలకు తరలిపోతున్నాయి.ఆకాశం పిండినా చుక్కచినుకు రాలేలా లేదు.పాతాళం తవ్వినా పచ్చిగంగ ముట్టేలా లేదు.జీవనోపాధి కరువైన జనం పొట్టచేతబట్టుకొని,

తిరునాళ్ళకెళ్ళినట్లు పొలోమంటూ వలసపోతున్నారు.పుట్టిన మట్టి,దుక్కిన నేలపై మమకారం చావని తత్తిమ్మా జనం అప్పోసప్పో చేసుకొని,కలోగంజో త్రాగుతూ జీవచ్ఛవాల్లా పడి ఉన్నారు.ఒకప్పుడు పిల్లాజెల్లా,ముసలీ ముతకాతో కళకళలాడిన ఊరు ఇప్పుడు వీధులన్నీ బోసిపోయి మరుభూమిలా ఉంది.

అనంతరామయ్య తల్లి జబ్బునపడి మంచంపట్టింది.పిల్లలు పెద్దవాళ్ళయ్యారు.అతని అవసరాలు పెరిగాయి.ఆసుపత్రులకి,మందులకి,బోర్లకి,మోటర్లకి,వాటి రిపేర్లకి తడిసిమోపెడయ్యింది. మునుపటిలా పిల్లలిద్దరినీ చదివించే స్థితిలో లేడు.కూతురు చదువు మానిపించేశాడు.ఖర్చుల కోసం,పంటల కోసం అప్పుచేశాడు.వాటిని తీర్చడానికి రెండెకరాలు అమ్మేశాడు.అలా విత్తుకున్న అప్పు మొక్క,ఏటేటా శాఖోపశాఖలు పరచుకొని కొడుకును కాలేజిలో చేర్పించేనాటికి గాఢంగా వేళ్ళూనిన వటవృక్షంలా రూపాంతరం చెందింది.వాటికి అదనంగా ఇప్పుడు కూతురు పెళ్ళి జతయ్యింది.
నడిసముద్రపు పెనుతుఫానులో చిక్కుకున్న ఒంటరి నావికుడిలా అయిపోయిందతని పరిస్థితి.తుఫాను ఎప్పుడు శాంతిస్తుందో తెలియదు.తీరం ఏవైపుందో తెలియదు.

చేయూతనివ్వడానికి ఎవ్వరూ లేరు.ఎంతకాలమని గుడ్డిగా ఎదురీత ఈదగలడు ?

ఆలోచనలతో అతని మనస్సంతా అతలాకుతలమైపోయింది.

కొడుకుగా,భర్తగా,తండ్రిగా అన్నిరకాలుగా తను విఫలమయ్యాడు.

ఇక మిగిలింది వొక్కటే !

ఆత్మహత్య !!

అతను తనచొక్కాజేబు తడుముకున్నాడు.బస్సెక్కబోతూ టౌనులో కొన్నాడు దాన్ని.అతని చేతికి చల్లగా తగిలింది పురుగులమందు సీసా !

ఒక్కసారి దాన్ని తేరిపార చూశాడు. చీడపురుగుల్ని మట్టుబెట్టడానికి ఉద్దేశించిన ద్రవాన్ని తను త్రాగబోతున్నాడు.తనూ చీడపురుగేనా ? మరి వీళ్ళంతా ఎవరు? మొలకెత్తని విత్తనాలతో మోసం చేసే విదేశీ కంపెనీలు,బ్లాక్ మార్కెట్ కి ఎరువులు తరలించి బ్యాంక్ బాలెన్సులు పెంచుకునే డీలర్లు,అసహాయతను ఆసరా చేసుకొని అధిక వడ్డీలతో పీల్చుకుతినే ఫైనాన్స్ కంపెనీలు,కొనుగోలుదారుడికి,రైతుకి మధ్య సైంధవుల్లా అడ్డుతగిలే దళారులు,పరిశ్రమల పేరుతో వ్యవసాయభూములు కారుచౌకగా కొనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పారిశ్రామికవేత్తలు,ఎగువరాష్ట్రాలు అక్రమంగా నీళ్ళు వాడుకుంటున్నా చోద్యం చూసే రాజకీయనాయకులు,ప్రతి అరగంటకో రైతు బలవన్మరణం చెందుతున్నా సమస్యకు పరిష్కారం కనుక్కోకుండా డబ్బులు విదిలించి వదిలించుకొనే ప్రభుత్వాలు..వీళ్ళనేమనాలి ? కాదు..తను చీడపురుగు కాదు.ఆ మాటకొస్తే రైతనేవాడెవడూ చీడపురుగు కాదు.తామంతా బలిపశువులు.అనుక్షణం దగాపడుతూ,అవమానాల గ్రుక్కిళ్ళు దిగమింగుతూ బ్రతకడం చేతకాని బలిపశువులు.

అతను నిర్వేదంగా నవ్వి మూత తీశాడు !

మొండి ధైర్యంతో సీసాను గొంతులోకి వొంపుకున్నాడు !

మొదట నోరు....తర్వాత గొంతు...భగ్గున మండాయి !

అతను బాధను నొక్కిపట్టాడు.ఇంకెంత కొన్ని నిమిషాలేగా !!


* * *


అనంతరామయ్య ఆత్మహత్య చేసుకున్నాడన్న పిడుగులాంటి వార్తతో ఆ ఊరు తెల్లారింది.శరాఘాతం తగిలిన లేడికూనలా ఆ కుటుంబం నిలువెల్లా వణికిపోయింది.ఒక్కసారిగా వాళ్ళ బ్రతుకులు అంధకారబంధురమైపోయాయి.

తండ్రి శవాన్ని చూడగానే సూర్యం మెదడు మొద్దుబారిపోయింది.
గ్రామస్తుల సాయంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు.రోదనలు మిన్నంటాయి.అనతరామయ్య భార్య దుఃఖంతో సొమ్మసిల్లిపడిపోయింది.
ఆడవాళ్ళు ఆమెకు సపర్యలు చేస్తున్నారు.బంధువులు వొక్కొక్కరుగా వస్తున్నారు.పరామర్శించి వోదారుస్తున్నారు.తమలో ఒకడిగా,తలలో నాలుకలా మెలిగిన అనంతరామయ్యను కడసారిగా చూడ్డానికి చుట్టుప్రక్కల ఊళ్ళనుంచి కూడా తండోపతండాలుగా వస్తున్నారు జనం.అతని విగత శరీరం వొక నగ్నసత్యాన్ని ఆవిష్కరిస్తూ వాళ్ళల్లో భవిష్యత్తుపట్ల భయాందోళనలు రేకెత్తిస్తోంది.

పంచాయితీ పెద్దలకు కబురు వెళ్ళింది.వాళ్ళూ వచ్చారు.రెవిన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే అవకాశాలున్నాయని సూర్యంకు చెప్పారు.అయితే ప్రజాస్వామ్యభారతంలో ప్రతిదానికీ వో రేటున్నట్లే,
ప్రభుత్వాధికారులు,డాక్టర్ల చేతులు తడపడానికీ రేట్లున్నాయని కనీసం ఐదారువేలన్నా అందుకు కావల్సివుంటుందని అనుభవజ్ఞులు కొందరు హెచ్చరించారు.సూర్యంకు అసలు ఆ ప్రతిపాదనే నచ్చలేదు.పోస్టుమార్టం పేరుతో తండ్రి దేహాన్ని ఛిద్రం చేసి,ఆ పై దానికి ' యింత ' అని వెలకట్టడానికి అతనికి మనస్కరించలేదు.

ఈ లోగా విషయం గురవయ్యకు తెలిసింది.అతనితో పాటూ అనంతరామయ్యకు అప్పిచ్చిన మిగతా జనం రెక్కలుకట్టుకొని ఊడిపడ్డారు.ఇటువంటి వ్యవహారాల్లో ఎలా ప్రవర్తించాలో వాళ్ళకు కొట్టిన పిండే.ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని వాళ్ళకు బాగా తెలుసు.ఎప్పటికైనా జరగాల్సిన తతంగమే కాబట్టి పెద్దమనుషులు కొందరు రంగప్రవేశం చేసి సూర్యం ను ప్రక్కకు పిలిపించి మంతనాలు నడిపారు.

అనంతరామయ్యకున్న ఐదెకరాలు తెగనమ్మి అప్పులు తీర్చేలా తీర్మానం చేశారు.కూతురు పెళ్ళికోసం తెచ్చిన డబ్బుకూడా ఆ జాబితాలో కలిసిపోయింది.చివరకు ఆ కుటుంబానికి తలదాచుకోను ఇల్లొక్కటి మిగిలింది.అప్పులవాళ్ళు శాంతించారు.
సూర్యం మస్తిష్కంలో మాత్రం అలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి.

చందాలు పోగయ్యాయి.ఏ మట్టిని నమ్ముకొని,ఎక్కడైతే అసువులు బాశాడో,అక్కడే ఆ సాయంత్రం అనంతరామయ్యకు అంత్యక్రియలు జరిగిపోయాయి.రైతుల పట్ల వివక్ష ప్రభుత్వాలకే కానీ,పంచభూతాలకు కాదన్నట్లుగా అగ్నిదేవుడు అతని దేహాన్ని ఆప్యాయంగా కౌగలించుకొని తనలో ఇముడ్చుకున్నాడు.ఎగసిపడుతున్న ఒక్కో అగ్నిశిఖ వైపు అనిమేషంగా చుస్తూ మనస్సులోనే యిలా ధృఢంగా అనుకున్నాడు సూర్యం.

" బ్రతుకుతెరువు కోసం కొద్దిరోజుల్లో నేను పట్నం వెళ్తున్నాను నాన్నా ! పుట్టినూరిని, కన్నతల్లిని,అక్కని,నానమ్మని..అందరినీ వదలి వెళ్తున్నాను.కడకు స్వంతరాష్ట్రం కూడా విడిచి వెళ్తున్నాను.ఎక్కడికని కదూ నీ ప్రశ్న? బెంగళూరు వెళ్తున్నాను.అక్కడ నా మిత్రులున్నారు.శెలవులలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తూ వేడినీళ్ళకు చన్నీళ్ళు లా తమ చదువుల కోసం డబ్బులు పోగుచేసుకుంటున్నారు.రోజుకి రెండొందల రూపాయులు జీతం.'అయ్యో ! డిగ్రీ చదువుతూ నా బిడ్డ కూలిపని చెయ్యాల్సి వచ్చిందే ' అని కించపడకు నాన్నా.చట్టబద్ధమైన ఏ పనికైనా కష్టపడటంలో తప్పు లేదు.అయినా ఎల్లకాలం కూలీగా ఉండిపోం కదా.స్వంత ఇల్లు తప్ప మనకింకేం మిగల్లేదు.అయినా సరే..నేను భయపడను.నా గుండెల్లో కొండంత ఆత్మవిశ్వాసం ఉంది.సాధించాలన్న కసి ఉంది. త్వరలోనే నేను ప్రయోజకుడినై తిరిగొస్తాను.అక్క పెళ్ళి ఘనంగా చేస్తాను.ఇక్కడే ఉండి వ్యవసాయం చేస్తాను.ఇప్పుడు మనం కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి సంపాదిస్తాను.వ్యవసాయం వొక జూదం కాదని నిరుపిస్తాను.నిరాశా నిస్పృహలతో నీలా ఇంకొకరు ప్రాణాలు తీసుకోకుండా,వాళ్ళకు ప్రేరణలా నిలుస్తాను.నన్ను ఆశీర్వదించు."


తెలుగురత్న లంకె


ఈ అవమానాలు మనకు కొత్తా ?!

      

      మొన్నటికి మొన్న కడప జిల్లా మైదుకూరులో, తెలుగులో మాట్లాడిన ఇద్దరు విద్యార్థుల మెడలో 'నేను తెలుగులో మాట్లాడను ' అని వ్రాసున్న పలకలు వేలాడదీయించి స్కూలంతా తిప్పించిన ఉపాధ్యాయుని ఉదంతం విన్నాం.అది మర్చిపోకముందే దాన్ని మించిన దారుణం విజయవాడలో నిన్నతొంగిచూసింది.

పాఠశాలలో ఉపాధ్యాయురాలు అడిగిన ప్రశ్నకు తెలుగులో సమాధానమిచ్చిన నేరానికి,ముగ్గురు పిల్లలు తమ బట్టలు విప్పి బయట నిలబడాల్సి వచ్చింది.అవమానం భరించలేక ఓ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటే అప్పుడు విషయం బయటికి పొక్కింది.మొదట బెట్టు చేసిన యాజమాన్యం,వెల్లువెత్తిన నిరసనలకు,ఒత్తిళ్ళకు తలొగ్గి ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది.యథాప్రకారంగా తప్పులన్ని టీచర్ల పై నెట్టి,తమకేమీ తెలియదని తప్పించుకుంది.అయితే తమకు జీతమిచ్చే యాజమాన్యం అదేశాలకు అనుగుణంగానే సదరు ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు అలా చెయ్యాల్సి వస్తున్నారు గాని,అదంతా తెలుగుభాష పై వాళ్ళకున్న అకారణ ద్వేషం అనుకోలేం.మైదుకూరులో సెయింట్ జోసెఫ్ స్కూల్,విజయవాడలో సెయింట్ ఆన్స్ స్కూల్..వెలుగులోకి వస్తున్న ఇటువంటి సంఘటనలు క్రిస్టియన్ మిషినరీ స్కూల్లల్లోనే జరుగుతూండటం కొసమెరుపు.కేవలం ఆ పాఠశాలల్లోనే ఈ దురాగతాలు జరుగుతాయని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ,మిషినరీ స్కూల్లు ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివాయని మాత్రం ఘంటాపధంగా చెప్పగలను.

అయితే ఈ అవమానాలు మనకు కొత్త కాదు.తెలుగులో మాట్లాడరాదని హుకుం జారీ చేసి,మాట్లాడితే జరిమానాలు, శిక్షలు విధించే పాఠశాలలు మన రాష్ట్రంలో కోకొల్లలు.సెయింట్ ఆన్స్ స్కూల్లోని ఈ నిబంధనలు ఈ మధ్య కొత్తగా ప్రవేశపెట్టినవి కావు.ఎన్నో ఎళ్ళుగా అమల్లో వున్నవే.మనకు చుచాయిగా అయినా తెలిసిన విషయాలే.కాబట్టి ఇప్పుడు కొత్తగా 'హవ్వ హవ్వ ' అని బుగ్గలు నొక్కుకొని మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.కాకపోతే ఇటువంటి పెడ ధోరణులు అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవల్సిన అవసరం చాలా వుంది.ఊహ తెలిశాక పిల్లలు తమ భావాల్ని వ్యక్తపరిచేది మాతృభాషలోనే.ఆ భాషని చిదిమేసి,పదజాలాన్ని రూపుమాపి,' అమ్మా' అనే బిడ్డ ఏడుపుని కూడా,తెలుగులో కాక ఇంగ్లీష్ లోకి అనువదించి,మార్చి ' ఓ మై గాడ్ ' అనేలా చేయాలనే తపన ప్రైవేటు పాఠశాలల్లో మితిమీరిపోతోంది. ఆ దుస్థితికి మనం దిగజారిపోకుండా చూసుకోవాలి.చిన్ననాటి నుండే తెలుగు భాష ఔన్నత్యాన్ని పిల్లల్లో పెంపొందించి,తెలుగు లో మాట్లాడటం,ఆలోచించటం,పుస్తకాలు చదవటం నేర్పించాలి.మనకు మాత్రమే సొంతమైన కమ్మని పద్యాలని కొన్నైనా కంఠతా పట్టించాలి.' మా తెలుగు తల్లికి మల్లేపూదండ ' పాట వింటే గర్వంతో గుండె ఉప్పొంగి,ఉద్వేగంతో కళ్ళలో నీళ్ళు తిరిగే అభిమానం పిల్లల్లో కలగాలి.ఆ బాధ్యత తల్లిదండ్రులందరి మీదా ఉంది.దురదృష్టవశాత్తూ ఇద్దరు చదువుకున్న తెలుగువాళ్ళు ఒకరికొకరు తారసపడినా ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు.ఈ జాడ్యాన్ని తొలగించుకోవాలి.మన భాషను మనమే గౌరవించుకోకపొతే పలుచనైపోతాం.కన్నతల్లిని,సొంత ఊరిని,మాతృభాషని అవమానించేవాళ్ళు పశువులతో సమానం.

ఎన్ని అవమానాలు జరిగినా,దున్నపోతు మీద జడివాన కురిసినట్లు కొన్ని సంవత్సరాలుగా తెలుగుభాష విషయంలో నిస్తేజంగా వున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యే కళ్ళుతెరిచి కలయచూసే ప్రయత్నం చేస్తోంది.పాఠశాలల్లో ' మా తెలుగుతల్లికి మల్లెపూదండా ' పాడాలనే నిబంధన విధించింది.విద్యార్థులను దండించిన ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకుంటూ సంఘటన పునరావృతమైతే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది.ఇది ముదావహం.అప్పుడే భవిష్యత్తులో మరే పాఠశాల ఇటువంటి దుస్సాహసానికి పూనుకోదు.ఈ చొరవను అధికార కార్యకాలాపాలను తెలుగులో జరిపే విషయంలో కుడా చూపించాలి.తెలుగుతల్లి విగ్రహాలు ధ్వంసం చేసి,' మా తెలుగు తల్లికి ' పాటని అడ్డుకొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవలి.ప్రాచీనభాష హోదా విషయమై న్యాయస్థానంలో ఉన్న పేచిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి.అప్పుడే తెగులు పట్టిన తెలుగుజాతికి విముక్తి.

జై తెలుగుతల్లి !



గోనగన్నారెడ్డి వాల్ పేపర్

సింహ షూటింగ్ లో ఆ మధ్య నందమూరి బాలకృష్ణ, గుణశేఖర్ దర్శకత్వంలో తను గోనగన్నారెడ్డి సినిమా చెయ్యబోతున్నట్లు చెప్పారు.గోనగన్నారెడ్డి అడవిబాపిరాజు గారి చరిత్రాత్మక నవల.కొంతకాలంగా ఈ సినిమా హీరో ఎన్.టీ.ఆర్ అని నాగార్జున అని వెబ్ సైట్స్ లో ఉహాగానాలు జరిగి తర్వాత నిలిచిపోయాయి.వాటికి తెరదించుతూ ఆ సినిమా తనే చెయ్యబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు.ఒక ప్రసిద్ధమైన చరిత్రాత్మక నవలని తెరకెక్కించే ప్రయత్నం జరగటం సినీప్రియులందరూ సంతోషించాల్సిన విషయం.గోన గన్నారెడ్డి గా బాలయ్యని ఊహిస్తూ వాటర్ కలర్స్ తో నేను వేసిన చిత్రం ఇది.



మధురాంతకం రాజారాం కథలు




పుస్తకాల కోసం విశాలాంధ్ర బుక్ హౌస్ సందర్శించిన ప్రతిసారీ ఈ పుస్తకం చూసి కొనాలనుకోవడం,తర్వాత అనేక కారణాలతో దాన్ని వాయిదా వేసి పాపులర్ రచయితల నవలలు కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళడం నాకు పరిపాటి. పాపులర్ అన్న పదం వాడినందుకు సాహితీ అభిమానులు క్షమించాలి. ఇక్కడ నా ఉద్దేశ్యం మధురాంతకం రాజారాంగారి పేరుప్రఖ్యాతులని తక్కువచేసి చూపడం కాదు. రాజారాంగారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకొని వుండవచ్చు. గౌరవ డాక్టరేట్లు,మరెన్నో సత్కారలు పొందివుండవచ్చు. కానీ ఈతరం కుర్రకారుకి, వారపత్రికల పాఠకులకి ఒక యండమూరి వీరేంద్రనాథ్, ఒక మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఒక యద్దనపూడి సులోచనారాణి తెలిసినంతగా ఆయన గురుంచి తెలియదన్నది నిర్వివాదాంశం. అలాంటి పాఠకులలో ఒకడినైన నేను, ఇలాక్కాదనిచెప్పి ఓ రోజు ఎలాగైతేనేం మొదటి భాగం కొనేశాను.కొన్నతర్వాత అందులోని కథలు చదువుకొని ఆశ్చర్యపోయాను. రుచికరమైన పదార్థం తిన్నాక దానికోసం మరింత అర్రులుచాచినట్లు మిగతా నాలుగు భాగాలు కూడా కొని గుక్కతిప్పుకోకుండా చదివేశాను.
 



 రాజారాంగారి కథలు పంచదారగుళికల్లాంటివి. నోట్లో వేసుకోగానే కరిగిపోయినట్లు చదవగానే అందులోని సారమంతా అంతరాంతరాల్లో ఇంకిపోయి, మనసంతా ఒకరకమైన హాయిని చేకురిస్తాయి. చిన్నప్పుడు పండువెన్నెల్లో ఆరుబయట పక్కలు పరుచుకొని, బామ్మ కథలు చెబుతూంటే ఆ కథలలోని పాత్రలను ఊహించుకొంటూ, ‘ఊ’కొడుతూ ప్రశాంతంగా నిదరోయినట్లు రాజారంగారి కథలు చదువుతూ స్వాప్నిక లోకాలలో తేలిపోతాం. వారి శైలి విలక్షణమైనది. అది అందమైన తెలుగు నుడికారాలు, మనం మరిచిపోయిన ఉపమానాలు, సామెతలు ప్రోదిచేసి సునిశిత హాస్యం రంగరించి, చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా పాఠకుల హృదయల్లోకి బట్వాడా చేస్తుంది.

ఆయన రచనావ్యాసంగానికి వారి వృత్తి కూడా ఎంతో దోహదం చేసిందనే చెప్పాలి. అచ్చమైన గ్రామీణ వాతవరణంలో పుట్టిపెరిగి,స్కూలుటీచరుగా పల్లెటూళ్ళు, పేటలు తిరుగుతూ, పలురకాల మనుషుల్ని, భిన్న మనస్తత్వాలని తరచిచూసే అవకాశం ఆయనకు కలిగింది. ఆ అనుభవాలనే సాకల్యంగా కథల రూపంలో విడమరిచి చెప్పి గ్రామీణజీవితానికి, మధ్యతరగతి మానవుల మానసిక వికారాలకి, ప్రవృత్తులకి, సగటు మనిషి సమస్యల వైచిత్రికి నిలువుటద్దం పట్టి ‘మరేం పర్లేద’ని భరోసా ఇస్తారు. చాలా కథలలో రచయితే సూత్రధారై కథను నడిపిస్తాడు. ‘సర్కసుడేరా’ కథలో సర్కసు ఫీట్లకు విస్తుబోయిచూస్తుంటే నిజజీవితంలో కడుపు కోసం అనేకమంది అభాగ్యులు అంతకంటే ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారని చెప్పే నాగులు,’ ఎడారికోయిల’ లో, విదేశాలలో స్థిరపడి తండ్రి మరచిపోయిన తన గ్రామీణ మూలాలు వెదుక్కుంటూ వెళ్ళే రవిబాబు,’ గ్రూప్ ఫోటో ‘ లో మనుషులంటే గిట్టక ఊరికి దూరంగా బ్రతుకుతూ చివరికి ఆ ఊరివారివల్లే బ్రతికిబట్టకట్టి మారిపోయే కోదండం, ‘కామదహనం’ లో మారుపేరుతో బూతుసాహిత్యం వ్రాస్తూ పెళ్ళయ్యాక మారిపోయే చలపతి,’ పులిపైనస్వారీ ‘ లో సినిమా ప్రొడ్యూసరుకి జ్యోతిష్యునిలా నమ్మించి బురిడీ కొట్టించే పిచ్చి కిష్టయ్య,’ కొండారెడ్డి కుతురు ‘ లో భర్తను హతమార్చడానికి వచ్చిన కసాయివ్యక్తులకి తిండిపెట్టి,వాళ్ళను మార్చి క్షమించే నాగతులసి, ‘ఓటుకత’ లో ఓటరు లిస్టులో తన పేరు ఉండి కూడా ఒక్కసారి కూడా ఓటు వెయ్యలేకపోయిన పశువులు మేపుకొనే గంగన్న,’మిస్ ఎమెరాల్డా ఫ్రం ఫ్రాన్స్ ‘ లో తల్లితండ్రుల ప్రేమకు నోచుకోక అనాథలా పెరిగి భారతదేశంతో అనుబంధాలు పెంచుకొనే ఎమెరాల్డా, ‘స్వస్థానం ‘ లో అనవసర ఆడంబరాలకుపోయి అవమానాలపాలైన నీరజ, ’జగమేలే పరమాత్మ’ లో గొప్ప సంగీతవిద్వాంసుడై వుండి కూడా, తగినంత సొమ్ము ఇవ్వలేదని నిర్వాకులని సంస్కారహీనంగా చూసే దేవకోట అనంతనారయణ శాస్త్రి,ఆయనకు బుద్ధిచెప్పే నిర్వాహకుడు శ్రీనివాసమూర్తి,…ఒక్కటేమిటి ఇలా ఎన్నో ఎన్నెన్నో పాత్రలు,వాటి స్వాభావాలు,యోగవియోగాలు పాఠకులని కట్టిపడేస్తాయి.పెద్దబాలశిక్ష లా ప్రపంచ జ్ఞానాన్ని బోధిస్తూ,పంచతంత్రం లా చిన్న చిన్న కథలలో జీవితసారాన్ని వడ్డిస్తాయి. వ్యక్తుల్ని,సన్నివేశాల్ని,రాగద్వేషాల్ని,ఈతిబాధల్ని,జీవనదృక్పథాన్ని ఇంత అద్బుతంగా,ఇంత కూలంకషంగా విశదపరిచిన రచయితలు తెలుగులో బహుకొద్దిమంది మాత్రమే.వారిలో రాజారాం ప్రథమశ్రేణిలో వుంటారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.ప్రతి సహిత్యాభిలాషి ఇంట్లో,ముఖ్యంగా వర్థమాన రచయితల గ్రంథాలయాల్లో ఉండవలసిన పుస్తకాలు ఇవి. ఇది మన సంస్కృతి. ఇది మన నాగరికత.

ప్రతులకు విశాలాంధ్ర బుక్ హౌస్ ని సంప్రదించవచ్చు.


పుస్తకం.నెట్ లో ప్రచురితం


బెంగుళూరులో భోగి

ప్రతిసారీ సంక్రాంతి పండక్కి తిరుపతి వెళ్ళడం రివాజు.భోగిమంటలు తిరుపతిలోనో,లేదా మా తాతయ్య వాళ్ళ పల్లెటూరులోనో వేస్తాం.ఈ సారి వీలు కుదరలేదు.దాంతో భోగిపండుగ బెంగుళూరులోనే జరుపుకుందాం అని నేను మా ఆవిడ నిర్ణయించుకున్నాం.

ప్రొద్దున్నే ఐదున్నరకి లేచి ముందే పోగుచేసుకున్న కార్టన్ బాక్సులు,కొబ్బరిపీచుతో చేసిన డోర్ మాట్లు చేతబట్టుకొని వీధిలోకి వచ్చాం.బెంగుళూరులో జరుపుకోవటం మొదటిసారి కావటంతో మాకు ఉత్సాహంగానే ఉంది.వీధిలో తెలుగువాళ్ళు చాలా మందే వున్నా ఎవరూ లేచి భోగిమంటలు వేసిన ఆనవాళ్ళు లేవు.మేము మంట వేస్తూంటే జాగింగ్ వేళ్ళేవాళ్ళు,మార్నింగ్ వాక్ వెళ్ళేవారు,పాలవాళ్ళు వింతగా చూసుకుంటూ వెళ్ళిపోయారు.ఇంకొంతమంది మేమేంచేస్తున్నామా అని కిటికీల్లోంచి కుతూహలంగా చుశారు.మాకు తోడుగా మంటలు ఎవరైనా వెస్తారేమోనని చుశాం కానీ ఎవరూ వెయ్యలేదు.నగరవాసం దాన్ని నామోషి పనిగా మార్చివేసిందేమో తెలియదు.




మొత్తానికి ఈ భోగి ఒక కొత్త అనుభూతిని మిగిల్చింది.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.


తెలుగురత్నలో నా కవిత - అమ్మ

                                  
          http://teluguratna.com/content/view/281/26/

విశ్వసృష్టికి
విరించి వొసగిన
విలువైన వరం అమ్మ !

నవమాసాలు నిండుగ మోసి
రుధిరం పంచి రూపం నింపి
ప్రాణం తోడే ప్రతిసృష్టిలో
ఆయువునిచ్చే అద్భుతక్రియలో
తనువును తుంచి తనూ తరించే
మహనీయురాలు మాతృమూర్తి
బ్రహ్మకున్నదా ఇంతటి నేర్పు ?
ఒక్క అమ్మకే ఇంతటి ఓర్పు !

అమ్మేరా మన మొదటి గురువు
ఆకలి తీర్చే కల్పతరువు
ప్రేమత్వానికే ఆమె నెలవు
పిల్లలెన్నడూ కారు బరువు
అహర్నిశలూ ఆమె ఆశలు
తనయుల కోసం తపిస్తాయి
తనక్షేమం విస్మరిస్తాయి
అమ్మజోలలో అఖిలజగాలు
ఆదమరచీ నిద్రపోతాయి

అమ్మను మించు దైవం కరువు
ఆమె సౌఖ్యమే అసలు పరువు
మూఢత్వంతో పిల్లలు కొందరు
ముప్పుల తప్పులు తలపెట్టినా
అవమాన గరళం దిగమ్రింగి
ఆశీస్సుల అమృతం పంచే
కారుణ్యహృదయ కన్నతల్లి
అమ్మప్రేమకు అంతమే లేదు 
అంబరం కుడా సాటి రాదు

వేదశాస్త్రాలు వినుతించే
విశ్వమంతా వినిపించే
ఏకైక ఇంపైన నాదం అమ్మ !
దివిలోనైనా భువిలొనైనా
అమ్మ స్థానం అమూల్యమైనది !
అన్యులెవ్వరూ పొందలేనిది !




కలవరమాయే మదిలో..(కథ)



(2001-2002 కాలంలో వ్రాసిన కథ యిది)

తెల్లవారిందగ్గర్నుంచి అలేఖ్య మనస్సు ఆమె ఆధీనంలో లేదు!

ప్రహసిత్ ఆ రోజు అమెరికా నుంచి వస్తున్నాడని తెలియడమే దానికి కారణం.వారం రోజుల క్రితం ఆమె అతనింటికి వెళ్తే మాటల సందర్భంలో అతని తల్లి ఆ విషయం చెప్పింది.అప్పట్నుంచి 'ఎప్పుడెప్పుడు ప్రహసిత్ వస్తాడా,ఎప్పుడెప్పుడు అతన్ని పలుకరిద్దామా' అన్న ఉద్విగ్నతతో ఆమె మనసంతా నిండిపోయింది.

ఆ రోజు ఆమె దినచర్యే మారిపోయింది.పెందరాళే లేచి తలారస్నానం చేసింది.దగ్గర్లోని గుడికి వెళ్ళి ప్రహసిత్ పేరున అర్చన చేయించింది.తల్లి చేసిన టిఫన్ హడావుడిగా ముగించుకొని ప్రహసిత్ ఇంటికి బయలుదేరింది.మాములుగా అయితే ఆమె ఆ రోజు కాలేజ్ కి వెళ్ళాలి.ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తోందామె.కానీ ఈవాళ మాత్రం ఏవో సాకులు చెప్పి లీవ్ పెట్టింది.ఎప్పుడో రెండేళ్ళ క్రితం చివరిసారిగా కలిసింది ప్రహసిత్ ని.పైచదువుల నిమిత్తం అమెరికా వెళ్ళాడతను.తర్వాత ఇదే రావటం.సరస్సులోని కలువభామ శరత్చంద్రుడి కోసం వేచిచూసినట్లు ఆమె యింతకాలం అతనికోసం ఎదురుచూసింది.ఇప్పుడతను వస్తున్నాడని తెలియగానే సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యింది.

అలేఖ్య ప్రహసిత్ ల ప్రేమాయణానికి ఆరేళ్ళ చరిత్ర ఉంది.

ఎంసెట్ కౌన్సిలింగ్ లో అలేఖ్యకు తిరుపతి ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీటు వచ్చింది.కంప్యూటర్స్ ఆమెకిష్టమైన సబ్జెక్ట్.అందులోనే సీటు లభించింది.యాధృచ్చికంగా అదే సమయంలో ఆమె నాన్నగారికి తిరుపతి ట్రాన్స్ఫర్ అయ్యింది.దాంతో వాళ్ళ కుటుంబం మొత్తం తిరుపతి రావల్సి వచ్చింది.ప్రహసిత్ వాళ్ళుంటున్న కాలనీలోనే అద్దెయిల్లు దొరికింది.వచ్చిన కొత్తలో వారికి ప్రహసిత్ కుటుంబం చేదోడువాదోడుగా ఉండేది.రెండిళ్ళ మధ్య నాలుగిళ్ళే దూరం.దాంతో రాకపోకలు పెరిగి పరిచయాలు మెరుగయ్యాయి.కొద్దిరోజుల్లోనే రెండు కుటుంబాల వాళ్ళూ మంచి మిత్రులైపోయారు.అలేఖ్య కాలేజ్ లో జాయినైన తొలిరోజే ఆమెకు తారసపడ్డాడు ప్రహసిత్ !

        ప్రహసిత్ ఆమె క్లాస్మేట్.ఎప్పుడూ అల్లరిచేస్తూ హుషారుగా ఉండేవాడు.అలేఖ్య కాలేజ్ లో జాయినైన తొలిరోజుల్లో 'ఎవరీ వడ్డాది పాపయ్య శాస్త్రి చలితవర్ణ చిత్రం' అని ఆమెను కన్నార్పకుండా చూసేవాడు.ఆరా తీశాక ఆమె తన కాలనీకి వచ్చిన కొత్తమ్మాయి అని తెలిసి విస్తుబోయాడు.ఆమెను గురుంచి తల్లి చెబుతూండగా విన్నాడు కానీ చూడటం యిదే మొదలు.చూసే అవకాశం కూడా లేదు.నెల్లూరులో మావయ్యగారింట వుంటూ ఇంటర్ పుర్తిచేశాడతను.ఎంసెట్ కూడా అక్కడే వ్రాసి రెండునెలల క్రితమే తిరుపతి వచ్చాడు.ఇంతకాలం ఆ అమ్మాయిని చూడనందుకు తనను తానే నిందించుకుని,ఆమె దృష్టిలో పడటానికి నానాపాట్లు పడ్డాడు.ఒక్కటీ ఫలించలేదు.అతనిలో పట్టుదల ఎక్కువైంది.ఆమెను నిశితంగా గమనించటం మొదలుపెట్టాడు.

   అలేఖ్యకు కాలేజ్ లో డౌట్స్ అడగటం అలవాటు.చాలాసార్లు ఆమె సందేహాలు సహేతుకంగా ఉన్నా,కొన్నిసార్లు ప్రొఫేసర్ చెప్పేది పూర్తిగా వినకుండా ఆమె డౌట్స్ అడిగేది.కొంతమంది విద్యార్థులకు ఈ సందేహాలు విసుగ్గా అనిపించేవి.అయితే ఆమె ధైర్యంగా డౌట్స్ అడగటం ప్రహసిత్ కు ముచ్చటేసింది.ఆమెకు 'డౌట్ బేబీ' అని నిక్ నేం తగిలించాడు.ఆపేరు కాస్తా క్లాసులో పాపులరైపోయి ఈ విషయం అలేఖ్యకు తెలిసింది.ఆమెకు అతనిమీద కోపం వేసింది.ప్రహసిత్ తల్లితో ఆమెకు మంచి పరిచయం ఉండటంచేత అతన్ని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది.

             ఓ రోజు ఎప్పటిలాగే ఆమె క్లాసులో డౌట్ అడిగింది.ప్రహసిత్ కు నవ్వొచ్చింది.ప్రొఫెసర్ ఆమె ప్రశ్నకు జవాబిస్తూండగా అతను 'హు!డౌట్ బేబి!' అని నిట్టూర్చాడు.అతను మెల్లగానే గొణిగినా  క్లాసంతా సైలెంట్ గా ప్రొఫెసర్ గారి వివరణ వింటూండటంతో అది గట్టిగా వినబడింది.స్టూడెంట్స్ అంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు.వాళ్ళ నవ్వుతో ప్రొఫెసర్ కూడా సరదాగా గొంతుకలపడంతో ఆమెకు అవమానమైపోయింది.

క్లాసయ్యాక ఆమె ప్రహసిత్ తో గొడవపడింది.డౌట్స్ తీర్చుకోవడంలో తప్పేముందని నిలదీసింది.

"తప్పేంలేదు.కానీ ఈ మధ్య నీ డౌట్లు వర్షానికి పేలని దీపావళి ఔట్లులాగా తుస్సుమంటున్నాయి.వాటిలో బలం లేదు.కేవలం ప్రొఫెసర్లను కాకాపట్టాలన్న తాపత్రయమే తప్ప విషయం కనిపించటం లేదు " అన్నాడతను తొణకకుండా.

చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ పక్కుమన్నారు.ఆమె అతని వంక కొరకొరా చూసి విసురుగా వెళ్ళిపోయింది.

    అప్పట్నుంచి అలేఖ్య డౌట్స్ అడగటం తగ్గించేసింది.ప్రహసిత్ కంగారుపడ్డాడు.ఇలా అయితే మొదటికే మోసం వచ్చేలా వుందని అతనికనిపించింది. ఆమెకు క్షమాపణలు చెప్పుకొని ప్రసన్నం చేసుకోవటానికి ఓ ప్లాను ఆలోచించాడు.

ఓ రోజు కావాలనే ముఖ్యమైన క్లాసులు ఎగ్గొట్టి,సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళి ఆ రోజు నోట్స్ అడిగాడు.ఆమె అతనివైపు అదోలా చూసి,తర్వాత ఏమనుకుందో అతనికి నోట్స్ ఇచ్చింది.ప్రహసిత్ తను క్లాసులో చేసినదానికి 'సారీ' చెప్పాడు.ఆమె ఒక్కసారిగా ఎక్సైటయ్యి 'అల్లరి చెయ్యడంలో చూపించే హుషారు చదువులో చూపించు! బాగుపడతావ్' అంది.ఆ  మాటలు అతన్నిసూటిగా తాకాయి.మౌనంగా నోట్స్ తీసుకొని వెళ్ళిపోయాడు.

ఆ సంఘటన ప్రహసిత్ ప్రవర్తనలో మార్పులు తెచ్చింది.పదిమందినీ ఆటపట్టిస్టూ పట్టనట్లుండేవాడు ఒక్కసారిగా పెద్ద బుద్ధిమంతుడిలా మారిపోయాడు.స్నేహితులు,షికార్లకు ఫుల్ స్టాప్ పెట్టి సక్రమంగా క్లాసులకు రావటం అలవర్చుకున్నాడు.ఆ విషయం అలేఖ్య గమనించకపోలేదు.రెండురోజుల తర్వాత ఆమె నోట్స్ తిరిగిచ్చేశాడతను.

నెలరోజుల తర్వాత కాలేజ్ లో సెమినార్ ఏర్పాటు చేశారు.'కంప్యూటర్ సిస్టంస్ అండ్ ప్రొగ్రామింగ్' సెమినార్ టాపిక్.సెమినార్ కు సంబంధిత లెక్చరర్లు,ముఖ్యఅతిథి వచ్చారు.సీనియర్స్ తో పాటూ జూనియర్స్ కూడా అందులో యాక్టివ్ గా పాలుపంచుకున్నారు.అలేఖ్య కూడా ఉత్సాహంగా పాల్గొని స్పీచ్ ఇచ్చింది.అయితే సెమినార్ కే వన్నే తెచ్చిన స్పీచ్ మాత్రం మరొకరిదే.అది  ప్రహసిత్ ది.

ప్రహసిత్ స్పీచ్ స్టూడెంట్లనే కాక లెక్చరర్లని సైతం  ఆకట్టుకొంది.టాపిక్ ని ఆమూలాగ్రం కవర్ చేస్తూ అతను సమగ్రంగా ప్రజంటేషన్ యిచ్చాడు.మధ్యలో కొంతమంది డౌట్స్ అడిగారు.అతను వాటికన్నిటికీ వోపికగా ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇచ్చాడు.అతని స్పీచ్ సెమినార్ కే హైలైట్ అయ్యింది.ముఖ్యఅతిథి చివర్లో ప్రసంగిస్తూ ప్రహసిత్ పేరును ప్రస్తావించి అతన్ని ఘనంగా  ప్రశంసించారు.

అలేఖ్య అప్రతిభురాలైపోయింది.ప్రహసిత్ లో అంత టాలెంట్ ఉంటుందని ఆమె ఊహించలేదు.

సెమినార్ ముగిసింది.స్టూడెంట్స్ అంతా చెదిరిపోతూండగా అలేఖ్య స్నేహితురాళ్ళు కొంతమంది ప్రహసిత్ ని అభినందించడానికి వెళ్ళారు.ఆమె మాత్రం దూరంగా నిలబడిపోయింది.

ప్రహసిత్ అభినందనలు అందుకుంటూనే కళ్ళతో అలేఖ్య కోసం వెదికాడు.దూరంగా ఒంటరిగా నిలబడి ఇటే చూస్తోందామె.అతను తన వైపు చూడగానే చూపు మరల్చుకొంది.ప్రహసిత్ పెదవులపై చిరునవ్వు లాస్యం చేసింది.అటువైపు అడుగులేసి నవ్వుతూ పలుకరించాడు ఆమెను.

ఎటో చూస్తున్న అలేఖ్య అతని పలుకరింపుకి తత్తరపడి 'హాయ్' అంది ముఖాన నవ్వు తెచ్చిపెట్టుకొని.

"ఎలా ఉందండి నా ప్రజంటేషన్?" ఎటువంటి సంకోచం లేకుండా అడిగాడతను.

"బావుంది" అందామె క్లుప్తంగా.

"థాంక్స్! దీనికంతటికీ కారణం మీరే!"

"నేనా?!"

"యస్! ఆ రోజు మీరిచ్చిన నోట్స్ సెమినార్ కు చాలా ఉపయోగపడింది.నేను మిమ్మల్ని అల్లరిపెట్టినా,మీరు క్షమించి నోట్స్ ఇచ్చారు.నా లాంటి వాడికి నోట్స్ ఎవరిస్తారు చెప్పండి? ఆ నోట్సే లేకుంటే ఈ రోజు నా స్పీచ్ ఇంత బాగా వచ్చేది కాదు" మాటల్లో ఎక్కడా వ్యంగ్యం దొర్లకుండా జాగ్రత్తగా అన్నాడతను.

ఆమె 'ఓహ్' అంది 'అలాగా' అన్నట్లు.

కొన్ని సెకన్లు నిశ్శబ్దం రాజ్యమేలింది.

"ఆ రోజున నేనన్న మాటలకు బాధపడ్డారా?" నెమ్మదిగా అడిగింది.

"అబ్బే! అలాంటివన్నీ నాకు మాములే ! ఓ చెవితో విని మరో చెవితో వదిలేస్తూంటాను" నవ్వేశాడతను.

నిజానికి నోట్సిస్తూ ఆ రోజు ఆమె అన్న మాటలు అతన్ని చెర్నాకోలలా తాకాయి.అతనిలో పౌరుషం పెల్లుబికింది.అతనేమీ మొద్దబ్బాయి కాదు.ఫస్ట్ క్లాస్ స్టూడెంటే.అయితే ఆ మధ్య స్నేహితులు,షికార్లు ఎక్కువై చదువుపై శ్రద్ధ తగ్గింది.ఎలాగైనా బాగా చదివి ఆమె మెప్పు పొందాలనుకున్నాడు.అనుకోని అవకాశం లా సెమినార్ వచ్చింది.దీన్ని బాగా ఉపయోగించుకోవాలని పట్టుదలగా సెమినార్ కు ప్రిపేరయ్యాడు.

ఆమె మనసు తేలికపడింది.ఆ విషయం అతను గ్రహించాడు.కొండంత భారం దిగిపోయినట్లైంది.

ఇంతలో కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి "మాంచి ప్రజంటేషన్ యిచ్చి మార్కులు కొట్టేశావు కాబట్టీ ఓ పార్టీ యివ్వు" అన్నారు.

ప్రహసిత్ వప్పుకొని అలేఖ్య వైపు తిరిగి "మీరు కూడా వస్తే బావుంటుంది" అన్నాడు అభ్యర్థనగా.

ఆమె తటపాయించి 'సరే'నంది.

వాళ్ళిద్దరి స్నేహానికి పునాది అలా పడింది.

అలేఖ్య ప్రహసిత్ త్వరలోనే మంచి ఫ్రెండ్సయ్యారు.కాలేజ్ లో ఎంత క్లోజ్ గా కబుర్లు చెప్పుకుంటూ కామెంట్స్ చేసుకునే వాళ్ళో,ఇంటిదగ్గర కూడా అలానే వుండేవారు.రెండు కుటుంబాల పెద్దలూ,వాళ్ళ స్నేహాన్ని మాములుగానే తీసుకున్నారు.అలేఖ్య తల్లికి కాస్త సందేహం కలిగినా ఆవిడ దాన్ని బయటపడనివ్వలేదు.ఒకవేళ అలేఖ్య ప్రహసిత్ మధ్య ఉన్నది స్నేహమే అయితే,తను అనవసరంగా రాద్ధాంతం చేసి వాళ్ళ మనస్సులో లేని భావాల్ని చొప్పించినట్లవుతుంది.అందుకని ఆమె మౌనం వహించింది.

వర్షాకాలం అప్పుడప్పుడే ప్రవేశిస్తున్న రోజులవి.వర్షం వెలసి,ఇంధ్రధనస్సు విరిసిన ఓ సంధ్యా సమయాన,ఐస్ క్రీం పార్లర్లో అలేఖ్యను ప్రేమిస్తున్న విషయం ఆమె ముందుంచాడు ప్రహసిత్.ఆమె వెంటనే తన నిర్ణయాన్ని చెప్పలేకపోయింది.అతనంటే ఆమెకీ ఇష్టమే.కొన్ని రోజుల సందిద్గావస్థ తర్వాత అతని ప్రేమని అంగీకరించింది.అలా ఫస్టియర్లో మొగ్గతొడిగిన వాళ్ళ ప్రేమ ఫైనలియర్ అయ్యేసరికి గాఢంగా వేళ్ళూసుకున్న వటవృక్షంలా రూపాంతరం చెందింది.

ఫైనలియర్లో వుండగా ప్రహసిత్ టోఫెల్,జి.ఆర్.ఈ పరీక్షలు వ్రాశాడు.మార్కులు బాగానే వచ్చాయి.అతనో ప్రైవేట్ కన్సల్టెంట్సీ ద్వారా అమెరికన్ యూనివర్సిటీస్ లో మాస్టర్స్ కు అప్లై చేశాడు.ఓ యూనివర్సిటీకి సెలెక్ట్ కావడం,వీసా రావడం జరిగిపోయాయి.ఒక్కగానొక్క ఆడపిల్లను ఉన్నతవిద్య కోసం విదేశాలకు పంపడానికి అలేఖ్య తల్లిదండ్రులు వెనుకంజ వేశారు.

ప్రహసిత్ అమెరికా బయలుదేరే ముందు,అలేఖ్య అతన్ని కలిసింది.తనను వీడి దూరంగా వెళ్తూన్నాడన్న బాధ మనస్సును తొలిచేస్తున్నా,నవ్వుతూ కంగ్రాట్స్ చెప్పింది.

అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని "బాధపడకు అలేఖ్య! మనుషులు దురమైనంత మాత్రాన మమతలు మాసిపోవు.ఈ దూరం తత్కాలికమే.మన ప్రేమ శాశ్వతం.రెండు సంవత్సరాల తర్వాత నేను తప్పకుండా తిరిగి వస్తాను.అప్పుడు మనల్ని
ఎవరూ వేరు చెయ్యలేరు" అన్నాడు.

ఆమె కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి.అతను అమెరికా వెళ్ళిపోయాడు.

అతను దూరమైనా అతని జ్ఞాపకాలు ఆమెను వీడిపోలేదు.ఆలోచనల నుండి దృష్టి మరల్చుకోవడానికి ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించింది.ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా జాబ్ సంపాదించింది.ఇంటర్నెట్ పుణ్యమా అని ఆమె వియోగబాధ కొంతవరకు తగ్గింది.

అమెరికా వెళ్ళిన కొత్తలో ఆమెకు రోజూ అతని దగ్గర్నుంచి పెద్ద పెద్ద ఈమెయిల్స్ వచ్చేవి.నిత్యం ఛాటింగ్ కి వచ్చేవాడు.కాలం గడిచేకొద్దీ ఆ మెయిల్స్ సంఖ్య,నిడివి క్రమంగా తగ్గిపోయింది.ఛాటింగ్ లో కనపడ్డం మానేశాడు.ఆమెకు కోపం వచ్చేది.రెగ్యులర్ గా మెయిల్ చెయ్యనందుకు అతనిపై విసుక్కొనేది.ఆ విసుగూ కోపం అంతా అతని దగ్గర్నుంచి మెయిల్ వచ్చేంతవరకే.తర్వాత మళ్ళీ మాములైపోయేది.కేవలం అతని మెయిల్ కోసం అంతగా తపించిన ఆమె,ఇప్పుడు అతన్నే ప్రత్యక్షంగా చూడబోతోంది.


*         *            *            *            *

అలేఖ్య వెళ్ళేసరికి ప్రహసిత్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని టిఫన్ చేస్తూ కనిపించాడు.అతని తల్లి జానకి ప్రక్కనే కూర్చుని కబుర్లు చెబుతోంది.

ప్రహసిత్ ని చూడగానే సంతోషంతో అలేఖ్య ముఖం ప్రఫుల్లమైంది.ఉద్వేగం అధికమై కాళ్ళు చేతులలో సన్నగా ప్రకంపనం బయలుదేరటం తెలుస్తూనే ఉంది.

కుశల ప్రశ్నలు మర్యాదలు పూర్తయ్యాయి.

అలేఖ్య ప్రహసిత్ తో మాటల్లో పడింది. ఆ మాటల్లోనే అతనికి అక్కడ వో ఎమ్మెన్సీ కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చిందని.రెండు నెలలు తర్వాత అతను జాయినవ్వాలని ఆమెకు తెలిసింది.ఒక్కసారిగా ఆమె ఆశలపై నీళ్ళు కుమ్మరించినట్లైంది.' రెండు నెలల టైముందిగా ఈ లోగా ప్రేమ విషయం తేల్చేయవచ్చు' అని తనకు తానే సమాధానం చెప్పుకొంది.

ప్రహసిత్ ప్లేట్ లో టిఫన్ ఖాళీ అవటం గమనించి జానకి అతనికి ఇంకాస్త వడ్డించబోయింది.అతను మృదువుగా వారించాడు.

అలేఖ్య అందుకుని "వద్దన్నప్పుడు వదిలేయండి ఆంటీ ! పాపం మీ అబ్బాయి డైటింగ్ చేస్తున్నాడేమో" అంది ఆటపట్టిస్తున్నట్లు.

జానకి నవ్వి " వాడి సంగతేమో కానీ నువ్వు మాత్రం డైటింగ్ చేస్తున్నట్లున్నావు.బాగా సన్నబడ్డావు.ఇంకాస్త సన్నబడ్డావంటే పెళ్ళికొడుకు దొరకటం కష్టమే" అంది సరదాగా.

ప్రహసిత్ పక్కున నవ్వాడు.అలేఖ్య కూడా శ్రుతి కలుపుతూ అతన్ని కొంటెగా చూసి"వెతుక్కోవలసిన అవసరం నాకేంటి ఆంటీ ! అతనే నాకోసం వెతుక్కుంటూ రావాలి కానీ" అందామెతో.

ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.ప్రహసిత్ ఫ్రెండ్స్ కొందరు హడావుడిగా లోనికి వచ్చారు.అతను నవ్వుతూ వాళ్ళను పలుకరించాడు.

" పదరా వెళ్దాం! మనవాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు" అన్నాడు వాళ్ళలో వొకడు.
అతను 'సరే' నని పది నిమిషాలలో రెడీ అయ్యి వచ్చాడు.అలేఖ్య మౌనంగా చూస్తోంది.అతను శెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.

ఆమెకు అసంతృప్తిగా అనిపించింది.కాలం ఆగిపోయేదాకా అతనితో కబుర్లు చెప్పాలని ఆశించింది.కాలం ఆగకుండానే అతను వెళ్ళిపోయాడు.ఆమె అక్కడి నుంచి వచ్చేసింది.

ఆ తర్వాత చాలాసార్లు అలేఖ్య అతనితో మాట్లాడాలని ట్రై చేసింది.అతను ఇంటి దగ్గర దొరకడమే గగనకుసుమమైపోయింది. బంధువులని,స్నేహితులని,ఎదో పని వుందని ఎప్పుడూ హడావుడిగా తిరుగుతూండేవాడు.ఇలా అయితే కొంతసేపయినా అతనితో మనస్ఫూర్తిగా గడిపేదెట్లా అని ఆమెకు దిగులు పట్టుకొంది.ఆమె దిగులును ద్విగుణికృతం చేసే సంఘటన మరుసటి రోజే జరిగింది.

ఆ సాయంత్రం జానకితో కలిసి అలేఖ్య,ఆమె తల్లి కోదండరామాలయం వెళ్ళారు.భక్తుల రద్దీ పెద్దగా లేకపోవటంతో దర్శనం త్వరగా పూర్తయ్యింది.ముగ్గురూ ఆవరణలో కాసేపు కూర్చొని ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్నాక,జానకి తన కొడుకు గురుంచి చెప్పింది.అతను అమెరికా వెళ్ళేలోగా మంచి అమ్మాయిని చూసి అతనికి పెళ్ళి చేయాలని అనుకుంటున్నట్లు,అందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది.

అలేఖ్యకు నోటమాట రాలేదు ! స్థాణువులా ఉండిపోయింది !!

ఆ రాత్రంతా ఆలోచనలతో ఆమెకు నిద్రపట్టలేదు.గుళ్ళో జానకి అన్న మాటలే పదేపదే గుర్తుకు వస్తున్నాయ్.ప్రహసిత్ కు పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారా? ఈ విషయం అతనెందుకు తనతో చెప్పలేదు? మూడు రోజుల క్రితం తెల్లగా కుందనపు బొమ్మలా వున్న ఒక అమ్మాయి,ఒక నడివయస్సు జంట అతనింట్లో కోలాహలం గా తిరుగాడుతూ వుంటే చూసింది.తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు.వాకబు చెయ్యగా తెలిసింది.ఆ అమ్మాయి ఎన్నారై.అక్కడ అతని క్లాస్మేట్ అట.శెలవులలో తల్లిదండ్రులతో మాతృదేశం వచ్చి,పుణ్యం కూడా కలిసొస్తుందని తిరుపతి వచ్చిందట.కొంపదీసి ఆ అమ్మాయిని కానీ చూడటంలేదు కదా? అసలు ప్రహసిత్ తీరే మారిపోయింది.అమెరికా వెళ్ళాక అన్నీ మర్చిపోయాడా?ఎన్నారై అమ్మాయిని పెళ్ళి చేసుకొని శాశ్వతంగా అక్కడే వుండిపోతాడా? ఆలోచనలు ఉత్తుంగ తరంగాలై ఆమె మనోసాగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి.

ఆమె ప్రహసిత్ విషయం మీద అంతగా ఆలోచించడానికి కారణం ఉంది.ఆమె ప్రాణస్నేహితురాలొకరు తనలాగే వో అబ్బాయిని గాఢంగా ప్రేమించింది.ఆ అబ్బాయేమో ఉద్యోగనిమిత్తం విదేశాలు వెళ్ళి అక్కడే ఉండిపోయాడు.అక్కడికి వెళ్ళాక అతనికి ఈ అమ్మాయి పాతచింతకాయపచ్చడిలా అనిపించిందట.పైగా విదేశీ వనితని చేసుకుంటే పౌరసత్వం కలిసొస్తుందని అక్కడి అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడట. విషయం తెలిసి ఆ అమ్మాయి మనస్సు వెయ్యివ్రక్కలైంది.ఆత్మహత్యాప్రయత్నం చేసుకుంటే అతికష్టం మీద కాపాడగలిగారు డాక్టర్లు.

ప్రేమ విషయంలో ప్రాణస్నేహితురాలికే అలా జరిగేసరికి అలేఖ్య బాగా కదలిపోయింది.తన ప్రేమ అలా కాకూడదని గట్టిగా నిశ్చయించుకుంది.ప్రహసిత్ దగ్గర్నుంచి సకాలంలో ఈమెయిల్స్ రాకపోవటంతో ఆమె మనస్సులో మొదటి
అనుమానపుబీజం పడింది.ఇప్పుడతని ప్రవర్తన,ఆమె నమ్మకాన్ని చాచికొట్టి సవాల్ చేస్తున్నట్లుగా వుంది.ఎలాగైనా ఈ విషయం అడిగి అతన్ని గట్టిగా నిలదీయాలని అనుకొంది.ఆమె కోర్కె తీరేరోజు నాలుగురోజుల అనంతరం వచ్చింది.

ఆ వేళ ప్రహసిత్ వొక్కడే ఇంట్లో దొరికాడు.అలేఖ్య వెళ్ళేసరికి హాల్లో కూర్చొని ఎంటీవీలో సాంగ్స్ చూస్తూ ఉల్లాసంగా కనిపించాడు.ఆమె ఉపోద్ఘాతమేదీ లేకుండా నేరుగా టాపిక్ లోకి వచ్చింది.

"నీకు సంబంధాలు చూస్తున్నారట ?! "

"ఓహ్..అదా !"

"నిజమేనా ? "

"నిజమే ! నాకెలాగూ యూఎస్ లో జాబ్ వచ్చింది.ఇప్పుడు వెళ్ళానంటే మరో రెండు మూడేళ్ళ వరకు రాను.'అంతవరకు ఉపేక్షించటం ఎందుకు,ఇప్పుడే వీడికో అమ్మాయిని చూసి ముడిపెట్టేస్తే పోలా' అని మా వాళ్ళు అంటున్నారు.
వాళ్ళ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి ? అందుకే సరేనన్నాను" అన్నాడు నవ్వుతూ.

ఆమె ఖిణ్ణురాలైంది !!

"మరి మన ప్రేమ విషయం ఏం చేశావ్ ? " అంది.ఆమె గొంతు ఆమెకే బేలగా అనిపించింది.

అతను ఆమె వంక వింతగా చూసి గట్టిగా నవ్వి
"ప్రేమా? చరిత్రలో ప్రేమికులు కలిసి జీవించారని ఎప్పుడైనా చదువుకున్నామా? అయినా తెలిసీ తెలియని వయస్సులో సవాలక్ష అనుకుంటాం.అన్నీ జరుగుతాయా? డోంట్ బీ సిల్లీ" అన్నాడు తాపీగా.

కాళ్ళక్రింద భూమి ముక్కలుగా చీలి,అందులోకి తను జారిపోతున్నట్టు ఆమెకు అనిపించింది.అటువంటి సమాధానం అతని నోట వినాల్సి వస్తుందని ఆమె ఎక్స్పెక్ట్ చెయ్యలేదు.ఇంతకాలం తనను ప్రేమించి( ప్రేమించినట్లు నటించి? ) ఇప్పుడు ఏమి తెలియనట్లు మరో అమ్మాయిని పెళ్ళిచేసుకోవడానికి సిద్ధంగా వున్నాడతను.ఇటువంటి వ్యక్తినా తను గుడ్డిగా ఆరాధించింది? ఇతని రాక కోసమా తను కళ్ళలో వత్తులు వేసుకొని కోరికల సౌధం వాకిట నిరీక్షించింది?! ఆమెకు ఒక్కసారిగా కోపం,దుఃఖం ముంచుకొచ్చాయి.

"నువ్వు చాలా మారిపోయావ్ ప్రహసిత్! ఇలాంటివాడివని ఊహించలేక మూర్ఖంగా నిన్ను ప్రేమించి నేనే మోసపోయాను. థాంక్ గాడ్ ! ఇప్పటికైనా నీ నిజస్వరూపం తెలిసింది.గుడ్ బై " అంటూ విసురుగా వెనుదిరిగింది.

అతను "అలేఖ్యా..." అంటూ ఏదో చెప్పబోయాడు.

ఆ సరికే ఆమె వీధిలోకి వచ్చేసింది.

గొడవైతే పడింది కానీ అతన్ని అంత సులువుగా మరచిపోలేకపోయిందామె.అతనితో పరిచయం జరిగింది మొదలు,తగాదాపడేదాకా జరిగిన సంఘటనలు అన్నీ రీళ్ళలా ఆమె కళ్ళ ముందు మెదిలాయి.మనసంతా అతలాకుతలమైపోయి మూర్తిభవించిన శొకదేవతలా తయారైంది.గుండె దిటవు చేసుకొని కాస్త తెరపిన పడటానికి కొన్ని రోజులు పట్టింది.అలేఖ్య ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన కొద్దిరోజులకే ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం సంబంధాలు చూస్తామన్నారు. ప్రహసిత్ తో పీకలలోతు ప్రేమలో ఉన్న ఆమె'యిప్పుడే పెళ్ళెందుక'ని వాళ్ళ ప్రయత్నాలు వాయిదా వేయించింది.కానీ ఈ సారి అటువంటి అవసరం కలగలేదు.పెళ్ళియత్నాలు చేస్తున్నామని తల్లిదండ్రులు చెప్పగానే ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది.మౌనం అర్థాంగీకారం కాబట్టి ఆమె తల్లిదండ్రులు తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు.

ఓ రోజు పెళ్ళిచూపులంటూ మగపెళ్ళివారు ఆమె ఇంటికి రానే వచ్చారు.తల్లి అందంగా ముస్తాబు చేసి తీసుకొచ్చింది.అసలీ విషయం మీద అలేఖ్యకు ఏ మాత్రం ఆసక్తి లేదు.కానీ ప్రహసిత్ మీదున్న కసికొద్దీ వొప్పుకుంది. 'ఈ తతంగమంతా
త్వరగా ముగిస్తే బావుణ్ణు! " అనుకొంది.వంచిన తల ఎత్తకుండా కూర్చొంది.ప్రేమ విఫలమయ్యాక పెళ్ళికొడుకు ఎవరైతేనేం?

....ఎంతసేపలా కూర్చొందో కానీ

"అలా తలవంచుకు కూర్చుంటే మావాడు నీ మొహం చూసేదెలా అమ్మాయ్ ?!" అన్న పిలుపు విని ఆమె ఉలిక్కిపడింది.

ఆ గొంతు..ఆమెకు బాగా సుపరిచితమైనదే !

మదిలో ఒక చిన్న అనుమానం చినుకుగా రాలి,జడివానై ఉక్కిరిబిక్కిరి చేస్తే ఆమె చివ్వున తలెత్తి చూసి సంభ్రమాశ్చర్యాలతో తలమునకలైపోయింది.

ఎదురుగా ..జానకి..ప్రహసిత్ తల్లి !
ఆవిడకు చెరో వేపున ఆవిడ భర్త,కొడుకు కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నారు !!

అలేఖ్యకు యిదంతా కలో నిజమో అర్థం కాలేదు,అర్థమయ్యేలోగా ప్రహసిత్ తో ఆమె వివాహం వైభవంగా జరిగిపోయింది.

తొలిరాత్రి ఆమెను చేతుల్లోకి తీసుకొని సందేహ నివృత్తి చేస్తూ "పిచ్చిదానా ! మొత్తానికి 'డౌట్ బేబి' అన్న నిక్ నేం సార్థకం చేసుకున్నావు.నమ్మకమే ఆలంబనగా నడిపించేది ప్రేమ.అటువంటి ప్రేమ ఒక్కసారి ఎర్పడ్డాక ఎటువంటి ఎల్లలూ దాన్ని
వేరు చెయ్యలేవు.ఆ రోజు నువ్వు నన్ను నిలదీయటానికి వచ్చినప్పుడు నేను నిన్ను సరదాగా ఆటపట్టిద్దామనుకొన్నాను.కానీ నువ్వు సీరియస్ గా తీసుకొని బాధపడి వచ్చేశావు.గాయపడ్డ నీ హృదయానికి మాటలతో స్వాంతన చేకూర్చడం కంటే అదే విషయాన్ని నీకు థ్రిల్లింగ్ గా చెప్పాలనిపించింది.అందుకే ఏకంగా మా పేరెంట్స్ ను వొప్పించి వెంటబెట్టుకొని వచ్చాను.ఈ విషయం రహస్యం గా వుంచమని నేనే అత్తయ్యకు చెప్పాను..అయినా ఇన్ని ఏళ్ళుగా ఎన్నో అనుభూతులు,ఆనందాలు నీతో కలసి పంచుకొని,అన్నీ మరచిపోయి మరో అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానిస్తానని ఎలా అనుకున్నావు.ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ? " అన్నాడతను చిలిపిగా.

కరిమబ్బులా అలేఖ్యను కమ్ముకున్న కలవరం,దూదిపింజలా ఎగిరిపోయింది.మేలిముత్యం లాంటి ప్రహసిత్ వ్యక్తిత్వం ఆమెకిప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.అతని మీదున్న ప్రేమాభిమానాలు మిక్కుటమై,అపరాధభావంతో బుగ్గలు కెంపులవుతూంటే 'క్షమించు ప్రహీ' అంటూ అతని కౌగిలిలో వొదిగిపోయిందామె


విశ్వనాథ - వేయిపడగలు - సమీక్ష - రెండవ భాగం


ర్మారావు బి.ఏ చదువుతుండగా కృష్ణమనాయుడు పరలోకగతుడవుతాడు. అతని పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. చదువు నిలిచిపోతుంది.

రంగారావు ఆంగ్ల విద్యలో పట్టభద్రుడు. తండ్రి కాలం చేసిన వెంటనే అతను పెను మార్పులకు శ్రీకారం చుడతాడు. రకరకాల దేశీయ విద్యలని,కళాకారులని ఉదారంగా పోషించే విధానానికి స్వస్తి చెప్పి,అప్పటివరకు వసూలుకాని పన్నులన్ని,ఆస్తులు జప్తు చేసి మరీ వసూలు చేయిస్తాడు. అనవసరమైన ఉద్యోగులనందరినీ తొలగించి, పూచికపుల్ల కు కుడా లెక్కలు చూపుతాడు.పెత్తనమంతా తన పెద్దమ్మ కుమారులకు, మేనత్త కుమారులకు అప్పగిస్తాడు. అతని పెద్దమ్మ కుమారులలో ప్రముఖుడు రామేశ్వరం.

రంగారావు జమిందారుగా పట్టాభిషిక్తుడవుతాడు. సుబ్బన్నపేటలో విద్యుద్దీపాలు, వీధివీధికీ కుళాయులు వెలుస్తాయి. పట్టాభిషేక మహోత్సవానికీ ప్రముఖులందరికీ కబురు వెళ్తుంది.ధర్మారావుకి మాత్రం కబురు వెళ్ళదు.ఉత్సవాలు రోజుల తరబడి జరుగుతాయి.తనకు ఆహ్వానం లేకపోయినా, ఆ వంశం మీద గౌరవం తో  ధర్మారావు తండ్రిగారి భొగాంగన కూడా పాల్గొని నృత్య ప్రదర్శన యిస్తుంది.ఆమెకు వయసుకు వచ్చిన కూతురొకటి వుంటుంది.ఆమె దేవదాసి.నిరంతరం శ్రీకృష్ణున్ని ధ్యానిస్తూ,ఉపవాసాలుంటూ అతన్నే భర్తగా భావిస్తూ వుంటుంది. రామేశ్వరంకు ఆమె మీద కన్నుపడుతుంది. ఆమెను పిల్చుకురమ్మని భటులను పంపుతాడు. దేవదాసి పరిగెత్తుకొని వెళ్ళి ధర్మారావు శరణు కోరుతుంది. ధర్మారావు ఆమెకు అభయమిచ్చి ఆమె రాదని చెప్పి భటులను తిప్పి పంపిస్తాడు. రామేశ్వరానికి తలకొట్టినట్లవుతుంది.

రంగారావు యిదంతా పట్టించుకోడు. అతనికి సుబ్బన్నపేట కంటే చెన్ననగరం (ఇప్పటి చెన్నై) బాగా నచ్చుతుంది. అక్కడికి వలసపోయి అధికారులతో,ఆంగ్లేయులతో కలిసిపోయి,పార్టీలకు సినిమాలకు తిరుగుతూ,అప్పుడప్పుడు సుబ్బన్నపేటకు వస్తూంటాడు. నిరాదరణకు గురైన ధర్మారావు కుటుంబాన్ని రంగారావు గారి తల్లి ఆదరిస్తుంది. ధర్మారావు ఆవిడకు పురాణ ప్రవచనం చేస్తూ ఆమె కృపకు పాత్రుడవుతాడు.

ధర్మారావు భార్య అరుంధతి. ఇద్దరికీ చిన్ననాటే వివాహం జరిగినా  పెద్దమనిషియ్యేంత వరకు తల్లిదండ్రుల వద్దే వుంటుంది .అల్లుడికి ఆస్తిపాస్తులు లేవని,అతని మీదా,అతని వంశం మీదా లేనిపోనివన్ని చెప్పి ఆమె మనసు విరిచేస్తారు అత్తమామలు. ధర్మారావు ఆమెను కాపురానికి తీసుకొస్తాడు.మొదట్లో ఆమెకు ఏమీ నచ్చకపోయినా,అక్కడి మనుషులు తన భర్త గురుంచి,మామ గురుంచి గొప్పగా చెప్పుకోవటం విని ఆమె మనసు మర్చుకుంటుంది. అతను గుంటూరులో కళాశాలలో చేరి,కొన్నిరోజుల తర్వాత తన కుటుంబాన్ని కూడా అక్కడికి తరలిస్తాడు.

రంగారావు భార్య గొప్ప దైవభక్తురాలు. సుబ్బన్నపేటలోనే వుంటూ,నిత్యం పూజలు,వ్రతాలు చేస్తూ భర్తను దైవంలా కొలుస్తూంటుంది. ఆమె అలవాట్లు,పద్ధతులు ఆధునిక భావాలు కల రంగారావుకి నచ్చవు.వారిద్దరి కొడుకు హర్రప్ప. అతను చిన్నపిల్లవాడు. రంగారావుకి భార్యాపిల్లలతో సంబంధ బాంధవ్యాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. అతని తల్లి మంచం పడుతుంది.ధర్మారావుకి ఆర్థిక సహాయం నిలిచిపోతుంది. స్నేహితులే అతన్ని ఆదుకుంటూంటారు.ఆమెను పరామర్శించడానికి కోటకు వెళ్తే ధర్మారావును అవమానించి పంపేస్తారు రామేశ్వరం,అతని మనుషులు.రంగారావు భార్య కూడా జబ్బున పడుతుంది. కొన్నిరోజుల తర్వాత అత్తా కోడళ్ళు యిద్దరూ చనిపోతారు. దహనక్రియలు చేసిన రంగారావు కర్మకాండ చేయటాన్ని వ్యతిరేకిస్తాడు. అవన్నీ బ్రాహ్మణుల కుత్సిత వృత్తులని నిందిస్తాడు. చనిపోయిన తన తల్లి కోరిక మేరకు, ధర్మారావు దగ్గర చదువుకోవాలని పట్టుబడతాడు హర్రప్ప. అతని సంతోషమే ప్రధానంగా భావించి రంగారావు దానికి అడ్డుచెప్పడు. నయాపైసా జీతం యివ్వకపోయినా ధర్మారావు కోటకు వెళ్ళి పిల్లవాడికి పాఠాలు చెబుతూంటాడు .రంగారావు పిల్లవాన్ని దాసీల పర్యవేక్షణలో ఉంచి ఇంగ్లండు వెళ్తాడు.అక్కడ హోటెల్లో పనిచేసే అమాయకురాలైన ఒక పేద విదేశీ వనితను ప్రేమించి పెళ్ళిచేసుకొని తీసుకువస్తాడు. ఆమెకు కూడా సుబ్బన్నపేట నచ్చుతుంది.

సుబ్బన్నఫేటలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. కోటలో ఒక్క ఏనుగు, గుర్రం మిగలదు. కోటను ఆధునీకరిస్తారు. క్రిస్టియన్ మిషినరీలు ఊళ్ళో అడుగుపెడతాయి. రైల్వేస్టేషన్, పోలీస్ స్టేషన్ వస్తాయి. రంగారావు ప్రొత్సాహంతో మున్సిపల్ కార్పోరేషన్, కళాశాల ఏర్పాటవుతాయి. వాటి జమాఖర్చులు సవ్యంగా ఉండవు. దేశ సంస్కృతిని,వృత్తివిద్యలని బోధించే జాతీయ కళాశాల, ఆంగ్లవిద్య బోధిస్తూ విద్యార్థులకు ఉపకారవేతనాలందించే రంగారావు కళాశాల ముందు వెలవెలబోతుంది. కుటుంబ పోషణార్థం ధర్మారావు కుడా రంగారావు కళాశాలలో అధ్యాపకుడిగా చేరుతాడు.

(మిగతా మూడవ భాగంలో..)


విశ్వనాథ - వేయిపడగలు - సమీక్ష - మొదటి భాగం



విసమ్రాట్ అన్న బిరుదానికి కొత్త సొబగులు అద్ది దానికి పరిపూర్ణత చేకూర్చిన వారు విశ్వనాథ సత్యనారాయణ. సంస్కృతాంధ్ర,ఆంగ్ల భాషల్లో అనేక రచనలు చేసి మేరుసమానమైన ఖ్యాతి పొందారు. విద్వత్తులో,ఆయనతో పోల్చదగిన వారు ఆ కాలంలోనే కాదు, ఈ రోజుల్లో కూడా అంధ్రదేశంలో పుట్టలేదంటే అతిశయోక్తి లేదు. ఆయనకు అజారమరమైన కీర్తిని సంపాదించి పెట్టిన వాటిలో వేయిపడగలు ప్రముఖమైనది. ధర్మశాస్త్రానికి ప్రతీకలా భాసించే ఈ పుస్తకానికి వేయికి పైగా పేజీలు,37 అధ్యాయాలు. ప్రఖ్యాత రష్యన్ రచయిత లియో టాల్ స్టోయ్ 'వార్ అండ్ పీస్' రచనతో పాటూ సమానహోదా అందుకున్న ఈ పుస్తకం గురుంచి నేటి తరం పాఠకులకి తెలిసింది చాలా తక్కువ. (నిజానికి పుస్తకం చదివేంత వరకు నాకు దీని గొప్పదనం తెలియలేదు). ఆ ఉద్గ్రంథం ఔన్నత్యాన్ని తెలియచేసే చిరుప్రయత్నమే యిది. రచన మొత్తం గ్రాంథిక భాషలోనే సాగుతుంది.

కథ:

సుబ్బన్నపేట మూడువందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ఊరు. మూడువందల సంవత్సరాల క్రితం ఈ సుబ్బన్నపేట ఒక మహారణ్యం. ఆ అడవిలో ఒక చిన్న పల్లెలో,ఒక పెదకాపు కట్టెలు కొట్టుకుంటూ తన భార్యా,కూతురుతో జీవనం సాగించేవాడు. అతనికి కామధేనువు లాంటి ఒక ఆవు ఉండేది. ఆ ఆవు రోజూ బిందెల కొద్దీ పాలిస్తుండేది.అలాంటి ఆ గోవు హఠాత్తుగా పాలివ్వటం మానేస్తుంది. పాలు పితకబోయిన కాపు ని అతని భార్యని తంతుంది. మేతకు తీసుకెళ్ళినప్పుడు ఎవరో దొంగతనంగా పాలు పితికేస్తున్నారని సందేహంతో కాపు తనే ఆవు వెంట వెళ్తాడు. ఆవు తన కనుగప్పి ఒక పెద్ద పుట్టలో పాలు పోయటం.ఆ పుట్ట లో నుంచి వేయి పడగల పాము ఒకటి వెలుపలకి వచ్చి ఆవు పాలు పూర్తిగా తాగెయ్యటం చూసి మూర్ఛపోతాడు. తర్వాత తెప్పరిల్లి ఇంటికి వెళ్ళి విషయం భార్యతో చెప్తాడు.ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా వ్యాపిస్తుంది. ఆ రాత్రి కాపు కలలో సుబ్రమణ్యేశ్వరుడు కనిపించి తను పాలు త్రాగిన స్థలం లో గుడి కట్టించమని చెప్తాడు. ఆ సంగతి గ్రామస్తులకు చెబుతాడు కాపు. కాని గుడి నిర్మాణానికి అవసరమైన ధనం వారి దగ్గర వుండదు.

సుబ్రమణ్యేశ్వరుని మహిమ వలన ఆ ఊరిలో ప్రజల చిరకాల సమస్యలన్నీ పరిష్కారమవుతుంటాయి.స్వామి మహత్తు చుట్టుప్రక్కల ప్రాంతాలకూ వ్యాపిస్తుంది.ప్రక్క ఊరిలోని ఒక బ్రాహ్మణుడు తనకు సంతానం కలిగితే స్వామి సన్నిధిలోనే వుంటానని మ్రొక్కుకుంటాడు.అతనికి పండంటి కొడుకు పుడతాడు.బ్రాహ్మణుడు భార్యాపిల్లలతో వచ్చి స్వామి కి సేవలు చేసుకుంటూంటాడు .ఆంగ్లేయులు దేశంలో తమ పట్టును పెంచుకుంటున్న కాలంలో,వ్యాపారంలో అనుహ్య సంపద పొందిన వీరన్ననాయుడనే భాగ్యవంతుడు ఒక కోట కట్టి, జమిందారుగా వెలగాలని అందుకు అనువైన స్థలం చూపమని అతన్ని అడుగుతాడు. బ్రాహ్మణుడు కోటని ఆ ఊరిలోనే కట్టమని,ఆ ప్రాంతం మూడువందల యేళ్ళవరకు సుభిక్షంగా వుంటుందని చెప్పి అతన్ని వొప్పిస్తాడు. అలా సుబ్బన్నపేట పేరుతో,ఆ ప్రాంతం అభివృద్ధి చెంది,ఎందరో వచ్చి అక్కడ స్థిరపడతారు.వీరన్న నాయుడు ఆ ఊళ్ళో శివలింగం ప్రతిష్ఠించి,నాగేశ్వరాలయం, సుబ్రమణ్యేశ్వరాలయం,వేణుగోపాలస్వామి ఆలయం నిర్మిస్తాడు. ఆయనికి దివానుగా బ్రాహ్మణుడు నియమింపబడతాడు.

ఏ ఆవు పాలు సుబ్రమణ్యేశ్వరుడు త్రాగాడో,ఆ ఆవు యజమానైన కాపు కి ఒక్క కూతురుంటుంది. ఆమెకు ఎప్పుడు పెళ్ళి చేయ నిశ్చయించినా సుబ్రమణ్యేశ్వరుడు ఆమెను పూనే వాడు. గ్రామస్తులంతా 'తప్పు తప్పు' అని లెంపలు వేసుకొనేవారు. అలా ఆ వంశంలో ఒక్కటే ఆడపిల్ల పుట్టం, ఆమె అవివాహితగా, గణాచారిగా మిగిలిపోవటం ఆనవాయితీగా మారిపోతుంది.స్వామి వారు,స్వామి కి ప్రతినిధులుగా వీరన్ననాయుని వంశీకులు ,ప్రచారకులుగా బ్రాహ్మణ వంశీయులు, వ్యాఖ్యాతలుగా కాపు వంశీయులు ఉంటూ ప్రజలను ధర్మబద్ధంగా పాలిస్తూ ఆ ఊరికి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటూంటారు.

మూడువందల యేళ్ళు గడుస్తాయి.బ్రాహ్మణుడు చెప్పినట్లుగానే సుబ్బన్నపేట నాశనానికి బీజం పడుతుంది.

వీరన్ననాయుని వంశం నుంచి కృష్ణమనాయుడు జమిందారుగా వున్న కాలంలో, బ్రాహ్మణ వంశంలో ఐదవ తరం వాడైన రామేశ్వరశాస్త్రి దివానుగా ఉండేవాడు. ఆయనకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులముల నుండి నలుగురు భార్యలు, రత్నగిరి అనే భోగాంగన ఉండేవారు. రామేశ్వరశాస్త్రి విద్వాంసుడు,ధీరోదాత్తుడు, ఉదార స్వభావుడు,గొప్ప దాత. ఆయన దానగుణం వికటించి ఆస్తి మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. ఆయన మోచేతి నీళ్ళపై ఆధారపడి జీవితంలో స్థిరపడ్డ ఎందరో,ఆయనకే వడ్డీలకిచ్చి,చివరి రోజులలో డబ్బు కోసం పీక్కు తింటారు. దరిద్ర దేవత సహస్ర హస్తాలతో కబళించినట్లై, కట్టుకున్న బట్టలు కూడా దానం చేసి, తిండికి కూడా నోచుకోని స్థితిలో,ఆయన, తనకంటే దరిద్రుడైన ఆ ఊరి నాగేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడే తుదిశ్వాస విడుస్తాడు. ఆయన మరణంతో శాస్త్రి గారి ధర్మపత్ని,పదహారేళ్ళ కొడుకు ధర్మారావు వీధిన పడతారు.వారిని ఆదుకోటానికి బంధుమిత్రులెవ్వరూ ముందుకు రారు.

జమిందారు కృష్ణమనాయుడు,రామేశ్వరశాస్త్రి గొప్ప స్నేహితులు. ధర్మారావు దీన పరిస్థితిని తన సేవకుని ద్వారా తెలుసుకున్న ఆయన,అప్పులవారి బాధ నుండి అతన్ని రక్షించి, స్కూలులో చేర్పించి అతని బాగోగులు చూసుకోవటం మొదలుపెడతాడు.ఇదంతా నాయుడి కొడుకు రంగారావుకి నచ్చదు.


(మిగతా రెండవ భాగంలో..)


నా మొదటి కథ - కామేశం కవితాపారాయణం

(ఆంధ్రభూమి మాసపత్రికలో 2001-2002 మధ్యకాలం లో ప్రచురితం అయ్యింది.దురదృష్టవశాత్తూ అ కాపీని పోగొట్టుకున్నాను.అందుకే ప్రచురితమైన నెల,సంవత్సరం వివరాలు సరిగ్గా గుర్తులేవు.నా దగ్గరున్న కథ రఫ్ కాపీ నుంచి యిక్కడ పెడుతున్నాను)

కామేశం చిన్నప్పటినుంచి అంతే !

ఏదైనా ఆలొచన వస్తే దాన్ని అమలు జరిపేంతవరకూ ఊర్కోడు.ఆ విషయంలో పట్టూవిడుపులుండవు.తద్వారా ప్రళయం రావచ్చు,ప్రపంచమే తలక్రిందులవచ్చు,ప్రాణ సంకటం కలగవచ్చు.కానీ అతనవేం పట్టించుకోనే రకం కాదు !

అటువంటి కామేశానికి హఠాత్తుగా పెద్ద కవినైపోవాలనే కోరిక పుట్టింది !
మహాత్ముల మస్తిష్కాలలో మాములుగా పుట్టవు కదా ఆలొచనలు.అతనికి ఈ అలోచన రావటం వేనుకా వో రీజనుంది.

సదానందం సాధారణ ప్రభుత్వోద్యోగి.కామేశం అతని మేనేజరు.

సదానందం ఉబుసుపోక కవితలంటూ ఏవో వ్రాస్తూంటాడు.మొన్నామధ్య ఏదో సంఘం వాళ్ళు జిల్లా స్థాయి కవితా సమ్మేళనం నిర్వహించారు.అందులో మనవాడు పాల్గొని ఏకంగా మొదటి ఫ్రైజు కొట్టేశాడు.ఫ్రైజ్ మనీ ఐదువేలు.దాంతో వొక్కసారిగా ఆఫీసులో హీరో అయిపోయాడు.ఆఫీస్ స్టాఫ్ అతన్ని పొగడని రోజంటూలేదు.హఠాత్తుగా అతనికి లభిస్తున్న గౌరవానికి తలమునకలైపోయాడు కామేశం.నిన్నటిదాకా ఆఫీసులో తన కరిస్మాకు ఎదురులేదు.తను అవునంటే అవును,కాదంటే కాదు,అలాంటిది,ఇప్పుడు తన పాపులారిటికీ ప్రతిబంధకంగా సదానందం సాక్షాత్కరించాడు.

సదానందం పెద్దగా చదువుకోలేదు.తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు.సాధారణ చదువులు చదివిన సదానందమే సొంత కవిత్వం వ్రాయగాలేంది,పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తను ప్రబంధం వ్రాయలేడా అనుకున్నాడు.అందుకే కవిత్వం వ్రాయాలని నిర్ణయించుకున్నాడు.ముఖ్యంగా కవిత్వం వ్రాయటం పెద్ద గొప్ప విషయమేం కాదని నిరూపించదలచుకున్నాడు.అందుకు కావల్సిన సరంజామా అంతా సిద్ధం చేసుకున్నాడు.అయితే ఏ విషయం మీద కవిత్వం వ్రాయాలనే సందేహం కలిగింది.సడెన్ గా పాపులారిటీ పెరిగిన సదానందం మీద అసూయ కలిగింది.అతని మీద కసిగా వ్రాద్దామనుకున్నాడు.కానీ అతనేనాడు తనకు బదులు చెప్పింది లేదు.కయ్ మన్నా,గయ్ మన్నా కామ్ గా పడి వుంటాడు.'పాపం' అనిపించి ఆ ఆలోచన విరమించుకున్నాడు.అంతలోనే 'కుక్కపిల్లా,సబ్బుబిళ్ళా..కాదేదీ కవితకనర్హం' అన్న శ్రీశ్రీ కవిత గుర్తుకు వచ్చింది.వెంటనే తను మెచ్చిన,తనకు నచ్చిన సంగతుల మీద కవితలు వ్రాయటం మొదలుపెట్టాడు.అలా పుంఖానుపుంఖాలుగా పేజీలు నింపాక,తనివితీరా వాటిని చదువుకుని ఎవరెస్ట్ ని యెక్కినట్లుగా ఫీలైపోయాడు.

కవిత్వం వ్రాస్తే సరిపోదు.వ్రాసినట్టు అందరికీ తెలియాలి.అందుకే కామేశం వో ఉపాయం అలోచించాడు.ఓ సండే సాయంకాలం తన ఇంట్లో చిన్న పార్టీ అనౌన్స్ చేశాడు.పార్టీ చివర్నో సర్ ప్రైజ్ వుంటుందని కుడా సెలవిచ్చాడు.పిల్లికి బిచ్చంపెట్టని కామేశం పిలిచి పార్టీ యిస్తాననేసరికి,ఆఫీస్ స్టాఫ్ అంతా మొదట్లో అదిరిపడినా,తర్వాత తేరుకొని హుషారుగా వచ్చారు.పార్టీ కోసం కాకపోయినా,చివర్న ప్రకటించబడే 'సర్ ప్రైజ్' కోసం కొంతమంది కుతూహలజీవులు కాళ్ళీడ్చుకుంటూ వచ్చారు.అతిథి మర్యాదలు అద్భుతంగా జరిగాయి.అందరు సుష్టుగా లాగించి తీరిగ్గా ఆసీనులయ్యాక,గొంతు సవరించుకుని,ఓ పేపర్ కట్టతో వారి ముందు ప్రత్యక్ష్యమయ్యాడు కామేశం.

"మరేం లేదు! నేను కొన్ని కవితలు వ్రాశాను.వాటిలో మచ్చుకు కొన్ని మీకు వినిపించాలని నా కోరిక" అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు.

ఊహించని ఈ ఉత్పాతానికి అంతా ఉలిక్కిపడి ఒకరినొకరు చూసుకున్నారు !

టీవీ కొన్నాక అడ్డమైన సీరియల్స్ భరించక తప్పదు.అందరూ ధైర్యం చిక్కబట్టుకొని తప్పదన్నట్లుగా కుర్చున్నారు.

కామేశం ఈలోగా కాగితపు కట్టను దులిపి మొదటి పేజిని అందుకున్నాడు.
"వేయించి తిన్నాక దొండ
తాగాలి నీళ్ళు వో కుండ" అన్నాడు.

వెంటనే ధభీమన్న శబ్దం వినపడింది.వెనుక వరుస లో కూర్చున్న వామనరావు వెల్లకిల్లా విరుచుకుపడిపోయాడు.బిత్తరపోయి అంతా అటువైపు చూశారు.

"అబ్బే ఏంలేదు.నేను యింత అద్భుతంగా కవిత్వం వ్రాస్తానని అతను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు.అందుకే ఆనందాతిశయంతో స్పృహ కోల్పోయాడు.అల్పజీవి కదా " తేల్చేశాడు కామేశం.

స్టాఫ్ కు ముచ్చెమటలు పట్టేశాయ్.

కామేశం మరో లైను అందుకున్నాడు
"శ్రీరాముని భార్య సీత !
సముద్ర తీరాన పీత !! " అన్నాడు.

మధ్యవరుసలో కూర్చున్న మాణిక్యానికి మతి స్థిమితం తప్పింది.సంధి ప్రేలాపనలు ఆరంభించి చేతికందిన వస్తువులు క్రిందవేస్తూ చిందులు తొక్కడం మొదలు పెట్టాడు.అతన్ని కంట్రోల్ చేసేసరికి ఆఫీస్ స్టాఫ్ కి తలప్రాణం తోకకొచ్చింది.

ఇంత జరుగుతున్నా కామేశంకు చీమ కుట్టినట్లు కూడా లేదు.మరో గంట నిర్విఘ్నంగా కవితాపారాయణం సాగించాడు.అతని కవిత్వం ధాటికి ఆఫీస్ స్టాఫ్ అంతా కుదేలైపోయారు.కొంతమంది ఎలాగోలా మెల్లగా జారుకుని,ఆ కంగారులో,గేటు తెరిచే వున్నా గోడ దూకి పారిపోయారు.మరికొందరు పక్షవాతం వచ్చిన రోగుల్లా కుర్చీలకు అతుక్కుపోయారు.
మొత్తానికి ఆ రోజు ప్రాణాలతోనే బయటపడ్డారు అందరు.

కామేశం చేపట్టిన కవితా వ్యాసంగం ఆ ఆదివారంతో ఆగిపోలేదు.
ఆంజనేయుడి తోకలా అలా సాగుతూపోయింది.ప్రతి ఆదివారం యిలా స్టాఫ్ నో,బంధువులనో,ఫ్రెండ్స్ నో ఎవరినో పిలవటం వాళ్ళకు తన కవితలు వినిపించి హడలుకొట్టటం అతనికి రివాజు గా మారిపోయింది.వచ్చిన వాళ్ళకు వండిపెట్టలేక,ఆ పై వాళ్ళు చేసే హాహాకారాలు భరించలేక అతని భార్యకు చిర్రెత్తుకొచ్చేది.అతని సంగతి తెలిసి ఆ యింటివైపు రావటం మానేశారు చాలా మంది.ఇది చాలదన్నట్లు కామేశం పదేళ్ళ పుత్రరత్నం అతని కవితలు కంఠతా పట్టేసి వాటిని బడిలో పిల్లలపై ప్రయోగించటం మొదలుపెట్టాడు.ఇవేవో కొత్త రకం తిట్లనుకొని పిల్లలు జడుసుకొని స్కూలుకు రావటం మానేశారు.ప్రిన్సిపల్ కి విషయం తెలిసి అతని తల్లిని పిలిపించి 'పిల్లాడి చేత ఆ పాడు మాటలు మానిపించేంతవరకు స్కూలుకి పంపకండని ' ముక్కు చీవాట్లు పెట్టాడు.ఆమెకు సహనం నశించి ఆ రాత్రి కామేశంతో తగువులాడి ,పిల్లాడితో సహా పుట్టింటి రైలుబండి ఎక్కేసింది.

పిడుగులు పడి,జడివానలు కురిసినా భగీరథుడు తన తపస్సు వదలనట్లు,కామేశం యివేవి మనసులో పెట్టుకోకుండా తన కవితా యజ్ఞం కొనసాగించాడు.అతని దెబ్బకు కొంతమందికి అదివరకు ఎన్నడూ లేని గుండె దడ ఆయాసం లాంటి అవలక్షణాలు పొడసూపాయి.ఇంకొంతమంది ఫైల్స్ లో ఆఫీస్ విషయాలకు బదులు అన్నమయ్య కీర్తనలు వ్రాయటం స్టార్ట్ చేశారు.ఇలా అయితే లాభం లేదని సదానందం వో మార్గం ఆలోచించి,ధైర్యం చేసి కామేశం కేబిన్లో దూరాడు.

అతన్ని చూడగానే కవితలు వ్రాసుకుంటున్న కామేశం సంతోషంతో మీదపడిపోయి కౌగిలించుకున్నంత పని చేశాడు."రావోయ్ సాదానందం.సరిగ్గా సమయానికొచ్చావ్.ఇప్పుడే వొక బ్రహ్మాండమైన కవిత వ్రాశాను.విసరమంటావా? " అన్నాడు

పెనంలోంచి పొయ్యిలోకి పడ్డట్లుగా అయిపోయింది సదానందం పరిస్థితి.అనవసరంగా లోపలికి వచ్చాననుకొని తనను తానే తిట్టుకొని "వద్దు సార్,ఇప్పుడు లంచ్ టైం.తర్వాత వినిపించండి" అన్నాడు ప్రాధేయపడుతున్నట్లుగా.

కామేశం శాంతించి,అప్పుడే ఏదో వెలిగినవాడిలా

"ఈ మధ్యకాలం లో నేను ఎడాపెడా కవితలు వ్రాసేశాను.అన్నీ అద్భుతమైనవేననుకో ! కానీ వాటిలో అత్యద్భుతమైనవి,పత్రికల వాళ్ళ పల్స్ కు అనుగుణంగా వుండేవి పంపిస్తే బావుంటుంది కాదా.అందుకే నువ్వీ ఆదివారం మా ఇంటికి రావాలి" అన్నాడు.

అప్పుడే సున్నం కొట్టిన గోడ లా సదానందం మొహం తెల్లగా మారిపోయింది.కామేశం కవితల కట్టలు తలచుకోగానే అతని నాలుక తడారిపోయింది.తప్పించుకోకపోతే తనకీ భూప్రపంచంతో సంబంధాలు మిగలవని అనుకున్నాడు.చిన్నప్పుడెప్పుడో చనిపోయిన తాతయ్య ఈ మధ్యే హరీమన్నట్లు కథనల్లి ఈ ఆదివారం పెద్దకర్మ చేస్తున్నట్లు చెప్పి బావురుమన్నాడు.రాలేనని మొరపేట్టుకున్నాడు.

"మరైతే నా కవితల సంగతి ?!?" అడిగేడు కామేశం.

"మీకు ఏవి బాగా నచ్చితే అవే పంపండి సార్ ! మళ్ళీ నేనెందుకు" అన్నాడు సదానందం.

"అలాక్కాదోయ్ సదానందం.పోస్ట్ లో కవితలు పంపడం కాదు.పర్సనల్ గా మనమిద్దరమే వెళ్ళి పత్రికల వాళ్ళను కలుద్దాం.నా కవిత్వాన్ని నువ్వొక్కడివే బాగా అర్థం చేసుకున్నావు.నా సంక్లిష్ట భావాలు,కఠిన సమాసాలు ఒకవేళ ఎడిటర్ కి అర్థం కాకపోతే అతనికి విషయం విడమరచి చెప్పగల ఏకైక వ్యక్తివి నువ్వే.అందుకే నువ్వు తప్పకుండా నాతో రావాలి." అన్నాడు కామేశం.

"నీ బొంద !" నీరసంగా అనుకున్నాడు సదానందం.అతనికి వొప్పుకోక తప్పింది కాదు.

ఓ రోజు సాయంకాలం ఇద్దరూ పత్రికాఫీసు కు వెళ్ళారు.ఎడిటర్ తో సదానందానికి మంచి పరిచయం వుంది.నేరుగా ఆయన కేబిన్లోకి వెళ్ళిపోయారు.కామేశాన్ని పరిచయం చేసి వచ్చిన విషయం విశిదం చేసాడు సదానందం.

ఆయన సంతోషించి కామేశం వైపు ఎగాదిగా చూసి
"ఓహో అలాగా !ఏవి మచ్చుకు కొన్ని కవితలు వినిపించండి" అన్నాడు.

అనడమే ఆలశ్యం అన్నట్లు కామేశం తన సంచిలో నుంచి ఓ కట్ట ను బయటికి లాగి
"దురదగా వుంటుంది కంద !
నా జేబులో వుంది ఓ వంద !!" అన్నాడు.

వెంటనే ఎడిటర్ ముఖవళికలు మారిపోయాయి.నీళ్ళు నములుతూ సదానందం వైపు చుశాడు.విచిత్రంగా అతని మొహం చిరునవ్వుతో వెలిగిపోతోంది.

కామేశం రెండో కవిత అందుకున్నాడు.
"ముప్పుటలా మేస్తాను ములక్కాయ!
అప్పుడప్పుడు తింటాను ఆవకాయ!" అన్నాడు.

లాగిపెట్టి ఒక్కటిచ్చుకొని 'దీన్నంటారు లెంపకాయ '' అందామన్నంత కోపం వచ్చింది ఎడిటర్ కి.

కామేశం తన లోకంలో పడిపోయి 'కూరలో కావాలి టమోటా,నాకేమో యిష్టం సపోటా, వంటకి కావాలి గ్యాసు,బస్సులో వుండాలి పాసు లాంటి కవితలు తన్మయత్వంతో చెప్పుకుంటూపోతున్నాడు.

ఎడిటర్ కు ఏంచెయ్యాలో అర్థంకాలేదు.కుర్చీలో అసహనంగా కదిలాడు.గ్లాసులో నీళ్ళు ఖాళీ చేసి గట్టిగా దగ్గాడు.కాసేపు పైకిలేచి గదిలో అటూఇటూ పచార్లు చేశాడు.కొంతసేపు కుర్చీని టేబుల్ ను బరబరా యిడ్చాడు.చివరికి తిక్కరేగి పేపర్ వేయిట్ తీసి నేలకేసి విసిరికొట్టాడు.

..అయినా కామేశం కవితాపారాయణం ఆగలేదు.హతాశుడైపోయిన ఎడిటర్ కామేశం రెండు చేతులు పట్టుకొని "మహా ప్రభో! ఆపండి,దయచేసి ఇక ఆపండి." అంటూ వేడుకున్నాడు.

అప్పటికి కామేశం ఉపశమించాడు.

మరో గ్లాసు నీళ్ళు త్రాగేక కానీ మాములు మనిషి కాలేకపోయాడు ఎడిటర్.సదానందం తన చెవులలోంచి దూదిపింజలు తియ్యటం అప్పుడు గమనించాడతను.ఒళ్ళుమండి అతని కాలర్ పట్టుకొని
"ఏమయ్యా! దినీకంతటికీ కారణం నువ్వు కాదు?పోనీలే బాగా వ్రాస్తావని చనువిస్తే ఈ పిల్లినొకటి చంకనేసుకుని వస్తావా?ఇంకో సారి యిలా చేశావంటే నీ కవిత కాదు,కర్మకాండ ప్రచురిస్తాను" అంటూ హెచ్చరించాడు.

సదానందం భయంతో బిక్కచచ్చిపోయాడు.

కామేశానికి అవేశం వచ్చింది.
"మీకర్థం కాకపోతే మానేయండి! అంతే గానీ నా కవితల్ని యిన్సల్ట్ చెయ్యద్దు" అన్నాడు.

ఎడిటర్ కోపం నషాళానికి అంటింది.
"నోర్ముయ్! ఇవి కవితలా! నువ్వు రోజు తినే కూరగాయలు,నలుగురికీ తెలిసిన సంగతులు వాక్యాలుగా పేర్చి కవితలంటావా?..ఏమిటీ ?..'దురదగా ఉంటుంది కంద,నీ జేబులో వుంది వో వందా?'..నీ బొంద..వెళ్ళు.ముందు బయటికి వెళ్ళు..ఇంకోసారి ఈ పరిసర ప్రాంతాలలో తచ్చాడుతున్నాట్టుగా తెలిసిందో..న్యూసెన్స్ కేసు కింద జైళ్ళో వేయిస్తాను.జాగ్రత్త" అంటూ దులిపేశాడు.

కామేశానికి పౌరుషం పొడుచుకొచ్చింది.
"చాల్చాల్లేవయ్య ! నీ పత్రిక కాకపోతే,దాన్ని మించింది యింకొకటి' అంటూ తన కవితల సంచి తగిలించుకుని బయటికి వచ్చేశాడు.

సదానందం ఎడిటర్ కాళ్ళావేళ్ళాపడి క్షమాపణ కోరుకుని 'బ్రతుకు జీవుడా ' అంటూ బయటపడ్డాడు.

కొసమెరుపు: సదానందం వేరే బ్రాంచికి ట్రాన్స్ఫర్ చేయించుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు.కామేశం మాత్రం విరామెరుగని ధరిత్రిలా,పట్టువదలని విక్రమార్కుడిలా కవితల సంచి పట్టుకుని పత్రికల ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.

అతని కోరిక ఫలించాలని ఆశిద్దామా ?!?



ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు -2

భాగవతం, మహాభారతం


  1. 1.   మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.

  2. 2.   నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.

  3. 3.   జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.

  4. 4.   మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్


  1. 5.   శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా

  2. 6.   పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం

  3. 7.   మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా

  4. 8.   నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్

  5. 9.   వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్

  6. 10.   నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

  7. 11.   వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్

  1. 12.   ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.

  2. 13.   సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.

  3. 14.   హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.

  4. 15.   మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.

  5. 16.   వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.

  6. 17.   కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.

  7. 18.   మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.

  8. 19.   ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.

  9. 20.   గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.

  10. 21.   కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).

  11. 22.   పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.

  12. 23.   కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.



  1. 24.   శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.

  2. 25.   హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.

  3. 26.   విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర

  4. 27.   కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర

  5. 28.   చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.

  6. 29.   కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.

  7. 30.   ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.

  8. 31.   కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.


  1. 32.   పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.

  2. 33.   కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.

  3. 34.   జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.

  4. 35.   కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.

  5. 36.   మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.

  6. 37.   విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్

  7. 38.   శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.

  8. 39.   ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.

  9. 40.   నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.

  10. 41.   జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.



  1. 42.   కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.

  2. 43.   బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.

  3. 44.   గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.


ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు -1

రామాయణం



  1. 1.   భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్

  2. 2.   కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్

  3. 3.   కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).

  4. 4.   రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా

  5. 5.   పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
  6. 6.   సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్

  7. 7.   మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్

  8. 8.   కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం

  9. 9.   దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.

  10. 10.   సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.

  11. 11.   ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.

  12. 12.   తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్

  13. 13.   అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్

  14. 14.   కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్

  15. 15.   గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర

  16. 16   దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.

  17. 17.   చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.

  18. 18.   పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.


  1. 19.   కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.

  2. 20.   శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.

  3. 21.   హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.

  4. 22.   ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక

  5. 23.   విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.

  6. 24.   శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు

  7. 25.   రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.

  8. 26.   అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక

  9. 27.   శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక

  10. 28.   సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.

  11. 29.   వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.

  12. 30.   కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.

  13. 31.   లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్

  14. 32.   తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్

  15. 33.   పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్


రుక్మిణీ కళ్యాణం

శ్రీమద్భాగవతంలోని అనేకమైన రసవద్ఘట్టాలలో రుక్మిణీ కళ్యాణం వొకటి.భక్తితో పాటూ,ప్రేమ,అరాధన,అనుబంధాలు ఇందులో ఒకదానితో వొకటి పెనవేసుకొని ఉన్నాయి.పరమాత్వతత్వంతో పాటూ,జీవిత సత్యం కూడా పొందుపరచబడి ఉన్న ఈ మధుర ఘట్టాన్ని,మారుతున్న కాల పరిస్థితులను,రంగస్థల ప్రదర్శనానుకూలతను దృష్టిలో వుంచుకొని,సరళమైన పద్య సౌందర్యంతో,సర్వజనామోదయోగ్యమైన నాటకంగా తీర్చిదిద్ది,తెరకెక్కించే ప్రయత్నం చేశారు మా నాన్నగారు..

రుక్మిణీ కళ్యాణం నాటిక పై అవధాన చక్రవర్తి,శతావధాన సార్వభౌమ డాక్టర్ మేడసాని మోహన్ ,శతాధిక నాటకకర్త,నాటక నవరత్నం కొడాలి గోపాలరావు వంటి ప్రముఖుల అభిప్రాయాలు ఇక్కడ జత చేస్తున్నాను.



ఈ నాటకంలోని కొన్ని రమ్యమైన పద్యాలు:

జగన్నాటక సూత్రధారియైన శ్రీకృష్ణుని ప్రేమకై అపర లక్ష్మీదేవియైన రుక్మిణి తపించి దుఃఖించే సందర్భంలో వచ్చే సీస పద్యం.

సీ||

సరసిజనాభ ! నీ శౌర్యార్చనార్పిత
ధామమ్ము కాని సౌందర్యమేల ?
పావన చరిత ! నీ ప్రణయానురాగాల
పులకించని పరువంపు తనమేల ?
మోహనాకార ! నీ మోవిపై మురళియై
మధుర శ్రుతులిడని మనుగడేల ?
దురితాపహార ! నీదు పదసన్నిధిలోన
ప్రమిదనై వెలుగని భాగ్యమేల ?

ఆ||

ఆశ్రిత జనపాల ! అంచిత గుణశీల !
పుణ్య హృదయలోల ! భువనపాల !
వేణుగానలోల ! వినవేల ! వేయేల !
నీవులేని బ్రతుకు నిలుపఁ జాల !

తన ప్రేమ రాయబారాన్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని కడకు తీసుకువెళ్ళిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడు యెంతకీ తిరిగి రాకపొయేసరికి 'ఏమైనదో ఏమో'నని రుక్మిణీదేవి మనస్సు పలుపలు విధాలుగా అలోచిస్తూ,చింతించే సమయంలో వచ్చే మరొక సీస పద్యం.

సీ||

ఏల నాస్వామి రాడేమి కతమొ ? భూసు
రేంద్రు డగ్నిద్యోతు డేగె, వృద్ధు
డాయసపడి, దుర్గమారణ్య మార్గమున్
గడచెనో? కడిచినా, కడలినధిగ
మించి ద్వారకపురమేగెనో? యేగిన
మాధవు దర్శన మతనికాయె
నో ! లేదో ! వినియేమను కొనెనో మనమున,
దయచేయతలచునో,తలుపడేమొ,

గీ||

కలికి ! శ్రీగౌరి యేరీతి కరుణ గొనునో ?
వ్రాలు నాతలనేమని వ్రాయబడెనో ?
తెల్లవారె లగ్నము,వచ్చిరెల్లవారు,
ఎట్లు తెల్లవారునో బ్రతుకేమి జేతు.

రుక్మిణీదేవి లేఖను చదివి,తాను తక్షణమే వచ్చి ఆమెను పెళ్ళి చేసుకుంటానని అగ్నిద్యోతునికి అభయం యిస్తూ శ్రీకృష్ణుడు వెల్లడించే సన్నివేశంలో వచ్చే పద్యం.

కు||

చెచ్చెర నేనచ్చోటికి
వచ్చెద,శిక్షించెద తులువలనెల్ల,జనుల్
మెచ్చగ నారీ రత్నము
దెచ్చెద,చేపట్టెద ప్రియ దేవేరియనన్ ||



నాన్నగారి పుస్తకాలు - ప్రదర్శనలు

న్నో నాటికలు,గేయాలు వ్రాసినా, ప్రచురింపబడ్డ పుస్తకాలు రెండు.
అవి రుక్మిణీ కళ్యాణం(1991) ,అరోగ్యగీత(2002).






2003(మే-జూన్) లో రాష్త్ర ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవం-2002 పోటీలకు చిత్తూరు జిల్లా నుంచి ఎంపికై ప్రదర్శింపబడ్డ ఎకైక నాటిక 'దర్పణం' .



అదే సంవత్సరం(నవంబర్- డిసెంబర్) లో కిన్నెర, హైదరాబాద్ వారు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ నాటకోత్సవాలలో కూడా ఈ నాటిక ప్రదర్శింపబడింది(బాక్స్ ఐటెం).




చలం -మైదానం - రెండవ భాగం



మైదానం(The open plain) ఒక సర్రియలిస్టిక్(surrealistic) నవల.

సర్రియలిజం అంటే సబ్-కాన్షియస్ మైండ్ ఆలోచనలకు భావాలకు ఒక రూపం యిస్తూ అంతర్లీనంగా ఒక సందేశాన్నిజోడించి చెప్పే ఒక కళ. 1920లలో ఫ్రెంచిలో ఊపిరిపోసుకున్న ఈ సాహిత్య ఉద్యమానికి ఆద్యుడు, మేనిఫెస్టో రచయితైన ఆండీ బ్రెటన్ మాటల్లో సర్రియలిజం అంటే



"ఎవరి అదుపాజ్ఞలు లేనప్పుడు,ఎటువంటి తర్కానికి కానీ,సాంఘిక కట్టుబాట్లకు కానీ,ఆచార వ్యవహారాలకు కానీ,నీతి నియమాలకు కానీ లొంగకుండా,మాటల ద్వారా కానీ,వ్రాతల ద్వారా కానీ,మరే విధాల ద్వారా కానీ,తన మస్తిష్కం లో రేగే అలోచనలు ఉన్నది ఉన్నట్లుగా వెల్లడించే ప్రక్రియ"

సర్రియలిజం మూలాలు 1916 కాలంలో స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ లో మొదలైన దాదా ఉద్యమం(Dadaism)లో ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరగటానికి ప్రధాన కారణం అప్పటి అప్పర్ మిడిల్ క్లాస్ యొక్క కాపిటలిస్ట్ రీజనింగ్,అలోచనా విధానాలు అని గాఢంగా నమ్మిన కొంతమంది, వాటికి వ్యతిరేకంగా ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటివరకు ఉన్న అలోచనా శైలి,నాగరికత మీద విశ్వాసం సన్నగిల్లి, ప్రజల విచక్షణా జ్ఞానాన్ని, అభిప్రాయాలను, విద్యా వ్యవస్థను,మంచీ-చెడులను..ఇలా ఒక్కటేమిటి మొత్తం వ్యవస్థనే సవాల్ చేసి, ఉలిక్కిపడి నిశ్చేష్ఠుల్ని చేసే సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది Anti-Art. ఇటువంటి Art (రచనలు కానీ,చిత్రాలు కానీ) చాలాసార్లు లాజిక్ వుండదు. ఉన్నా అందులో దాగున్ననిగూడార్థం సగటు పాఠకుడికి అర్థం కాదు. ఈ తరహా సాహిత్య ప్రక్రియని తెలుగు సాహిత్యంలో కొద్దిమందే అడపాదడపా అనుకరించారు.అటూవంటివాళ్ళలో చలం వొకడు.

సర్రియలిజం అనే కోణంలో చూసినప్పుడు మైదానం ఒక అద్భుతమైన నవల.ఇందులోని ప్రధాన పాత్రలు రాజేశ్వరి,అమీర్,మీరా. కథనంతా రాజేశ్వరి చుట్టూనే తిప్పుతూ,ఆమె ద్వారానే వివరిస్తాడు రచయిత. తన కథను సాటి స్త్రీతోనో, లేక పాఠకురాలితోనో, లేక సమాజంతోనో చెప్పుకుంటున్నట్లు కథనం సాగుతుంది. ఈ పాత్రల అలోచనాశైలి,మనస్తత్వ ధోరణులు ఏవీ తర్కానికి అందవు. ప్రస్తుత సమాజపు కట్టుబాట్లను, ఆచార వ్యవహారాలను ప్రశ్నిస్తూ,పూర్తి విప్లవాత్మక పద్ధతుల్లో ప్రవర్తిస్తాయి.

కథానాయిక మస్తిష్కమే ఇక్కడొక సువిశాలమైన మైదానం !

ఒక సువిశాలమైన మైదానం చూడగానే మనకి ఏమనిపిస్తుంది? కాసేపు ఆడుకోవాలని,ఇంకాసేపు గెంతులేయాలని,స్వేచ్ఛగా చుట్టూ కలయతిరగాలని అనిపించదూ? అలాగే తన మస్తిష్కమనే మైదానంలో, ఆమె కలయతిరుగుతూ,తనలో రేగే రకరకాల అలజడులకు స్వేచ్ఛారూపం యిస్తే,అప్పుడు జరగబోయే విపరీత పరిణామాలకు,వాటి దుష్ఫలితాలకు దర్పణమే ఈ పుస్తకం. ఇప్పుడు మనకు కొత్తగా అనిపిస్తున్న సహజీవనం అనే concept ని,ఆ concept ఒక గృహిణి తన స్వేచ్ఛాస్వాతంత్ర్యాల కోసం అన్వయించుకొంటే, ఆమెకు ఎదురయ్యే దుస్థితులని చలం ఆనాడే ఇందులో చర్చించారు. అలాగే వివాహ వ్యవస్థ మీద కూడా కొన్ని పదునైన వ్యాఖ్యలు చేశారు. మనస్తత్వాలు, శరీరధర్మాలు పొసగని ఎన్నో పెళ్ళైన జంటలు కేవలం సంఘానికి భయపడి తమ బ్రతుకు బండిని లాగించటం మీద విమర్శలు ఉన్నాయి. తన పసితనంలో తనను లొంగదిసుకోవటానికి విఫలయత్నాలు చెసి ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్పే మావయ్యను, అంతర్లీనంగా ఎంత కుళ్ళున్నా ఏనాడూ బయటపడకుండా గుట్టుగా కాపురాలు చేస్తూ నెట్టుకొచ్చే మనుషుల ద్వంద ప్రవృత్తులను, అటువంటి సమాజాన్ని రాజేశ్వరి పాత్ర 'ఛీ' కొడుతుంది. పురుషులతో సమానమైన శారీరక స్వాతంత్ర్యాన్ని కోరుకుంటుంది.

ఐతే,ఏ కళైనా సమాజ హితం కోరుకునే విధంగా ఉండాలి. అప్పుడే అ కళకొక అర్ధం పరమార్థం. మన సమాజంలో సర్రియలిజం గురుంచి ఎంతమందికి తెలుసు? మహా మహా మెధావులకే ఓ పట్టాన అర్థం కాని ఈ ప్రక్రియ ఇంక పామర జనులకు ఏం అర్థం అవుతుంది? తద్వారా వొరిగే ప్రయోజనం ఏమిటి? తను చెప్పదలచుకున్న విషయం పాఠకుడికి,లేదా వీక్షకుడికి సులభంగా అర్థమవ్వాలని ఒక రచయిత లేదా చిత్రకారుడు కోరుకుంటారు. అంతే కానీ తమ రచనలు చదివి,చిత్రాలు చూసి విషయం బోధపడక,వాటి సారాంశం తెలుసుకోడానికి ప్రత్యేక పరిశోధనలు చెయ్యాలని ఎవరూ అనుకోరు. పరిశోధన చేసి అర్థం చేసుకొనే వోపిక, తీరిక అందరికీ ఉండవు. ఒకవేళ ఉన్నా ఒక్కో వ్యక్తి ఒక్కో అర్థాన్ని తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు మంచి కంటే చెడు జరిగే అవకాశాలే ఎక్కువ. అందరి మనఃస్థితి ఒకేలా ఉండదు కదా. చలాన్ని,చలం రచనలని సమాజంలోని ఒక వర్గం బహిష్కరించడానికి ఇదొక కారణం.

సర్రియలిజం గురించి తెలియని సగటు పాఠకుడి దృష్టిలో మైదానం ఒక చవుకబారు నవల. మైదానం అంటే కథలో నాయిక నివసించే స్థలమని, ఇందులోని పాత్రలకు వ్యక్తిత్వం లోపించిందని,విశృంఖలత్వాన్ని రచయిత ప్రేరేపిస్తున్నాడని అనుకొనే ప్రమాదం కూడా ఉంది. అయితే, ముందే చెప్పినట్లు దీనికి కారణం,తన అభిప్రాయాల్ని వ్యక్తం చెయ్యడానికి చలం ఎన్నుకొన్న సాహితీ ప్రక్రియ, ఆనాటి కాల పరిస్థితులు. అది అర్థం కానప్పుడు ఆయన రచనలూ అర్థం కావు. సాధారణ పాఠకుడు ఈ పుస్తకాలను తన ఇంట్లొ పెట్టుకోడు. తను అర్థం చేసుకోగలిగినా తన పిల్లలు సరిగ్గా అర్థం చేసుకుంటారో లెదోనన్న బెంగ. ఇంకొకరిని చదవమని ప్రోత్సాహించడు. ఇతరులు ఏమనుకుంటారోనని భయం.అందుకే ఇటువంటివి విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా, గ్రంథాలయాల్లో పి.హెచ్.డి విద్యార్థులకి పరిశోధనాంశంగా మగ్గిపోతూంటాయి. ఆనాడు చలం ప్రస్తావించిన సమస్యలు,లేవనెత్తిన ప్రశ్నలు నేటికీ సమాజంలో సజీవమై ఉన్నాయి. ఎందరు ఎలా అనుకున్నా,తెలుగు సాహిత్యం ఉన్నన్నాళ్ళు చలం మీదా,చలం రచనల మీదా చర్చలు జరుగుతూనే వుంటాయి.మైదానం అజరామరమై నిలిచి ఉంటుంది.