• మెరిసే మేఘాలు

    మెరిసే మేఘాలు
  • కురిసే వర్షాలు

    కురిసే వర్షాలు
  • విరిసే పుష్పాలు

    విరిసే పుష్పాలు
  • మురిసే భువనాలు

    మురిసే భువనాలు
  • నాకు

    నాకు
  • కదిలే కావ్యాలు

    కదిలే కావ్యాలు

రాధా కళ్యాణం





పాటలు విని మమకారం పెంచుకున్న సినిమాల్లో రాధాకళ్యాణం ఒకటి. ఆ రోజుల్లో ఇంటింటికీ టి.వీలు గట్రా ఉండేవి కావు కాబట్టి  అన్నిటికీ టేప్‌రికార్డరే  దిక్కు. మా ఇంట్లో మర్ఫీ కంపేని వారి టేప్‌రికార్డర్ ఉంది. దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని శతృదుర్భేధ్యమైన కోటలాగా అదింకా పనిచేస్తూ పాటలు వినిపిస్తూనే ఉంది. ఒకట్రెండు సార్లు రిపేర్ల పేరుతో దండయాత్రలు జరిగాయి కానీ అవేవీ  మూలాన్ని సమూలంగా నాశనం చెయ్యలేకపోయాయి. అప్పట్లో మా నాన్నగారి దగ్గర మంచి పాటల కలెక్షన్ ఉండేది. ఆయనకి నటీనటులతో సంబంధం లేదు. సంగీతం సాహిత్యం సమపాళ్ళలో కలిసిపోయిన మంచి పాటేదైనా వినబడితే వెంటనే రికార్డు చేయించి పట్టుకొచ్చేవారు. అలా పోగైన క్యాసెట్లన్నీ ఒకదాని మీదొకటి పేర్చి ఒక అరలో అందంగా అమర్చేవారు. నాకు పాటలు వినాలనిపించినప్పుడల్లా వాటినన్నిటినీ  తీసి ముందేసుకొని కొత్తపాటలు, వినని పాటలు ఏవైనా ఉన్నాయాని వెదికేవాన్ని.  వేరుచేసిన క్యాసెట్లను ఒక్కక్కటే ప్లే చేస్తూ ప్రతి పాటలో పల్లవులు వినేవాన్ని. ఆకట్టుకొనేలా ఉంటే అది ఆటోమేటిక్‌గా నా ప్లేయింగ్‌ లిస్ట్‌లోకి వెళ్ళిపోయేది. అలా పరిచయమైన పాటలతో ఇష్టాన్ని పెంచుకున్న సినిమా ఇది. పరిచయమైన చాలా కాలానికి ఈ సినిమాని చూశాను. నిన్న మళ్ళీ చూశాను.

చంద్రమోహన్, రాధిక, శరత్‌బాబు నటించిన ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రానికి స్వర్గీయ ముళ్ళపూడి వెంకటరమణ సంభాషణలు సమకూరిస్తే, బాపు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మాతృక కే.భాగ్యరాజా నటించి దర్శకత్వం వహించిన తమిళ చిత్రం  అంత ఎజు నాట్కళ్.  శోభనపు గదిలో విషం తాగి ఆత్మహత్యాప్రయత్నం చేసిన రాధ (రాధిక)ను, డాక్టరైన ఆమె భర్త ఆనంద్ (శరత్‌బాబు)రక్షిస్తాడు. తోలిరాత్రి ఒక ఆడపిల్ల చావడానికి సిద్ధపడిందంటే దానికి పెళ్ళంటే ఇష్టం లేకపోవటమే ఏకైక కారణమని, స్నేహితుడిలా భావించి జరిగిందంతా తనతో చెప్పమని అడుగుతాడు ఆనంద్. రాధ తన కథను చెప్పటం మొదలుపెడుతుంది.

తమిళ బ్రాహ్మణుడైన పాల్ఘాట్ మాధవన్ (చంద్రమోహన్) మ్యూజిక్ డైరెక్టరవుదామని పొట్టచేతబట్టుకొని హైదరాబాదులో దిగుతాడు. ' తాదూర సందులేదు మెడకో డోలన్నట్లు ' అతనికి తోడు శిష్యుడైన ఒక చిన్నపిల్లవాడు. ఇద్దరూ కలిసి ఇల్లు కోసం వెదుక్కుంటూ వచ్చి రాధ వాళ్ళింట్లో మేడ మీద గదిలో అద్దెకు దిగుతారు. రోజూ అవకాశాల కోసం కాళ్ళచెప్పులరిగేలా తిరిగి తిరిగి  అరకొర తిండితో నెట్టుకొస్తూ రాత్రికి ఇల్లు చేరుతూంటారు . రాధ పేదింటి పిల్ల. తండ్రి ఇల్లులొదిలేసి వెళ్ళిపోతే, తల్లి, చెల్లెలు, తమ్ముళ్ళలో కలిసి తాత పంచనే ఉంటూ కాలం వెళ్ళదీస్తూంటుంది. మంచివాడు, అమాయకుడు తనలాగే నిరుపేదైన మాధవన్ వ్యక్తిత్వం ఆమెను ఆకట్టుకుంటుంది. అతని కష్టాలకు జాలిపడి తన బంగారు గాజు తాకట్టు పెట్టి సాయం చేయబోతుంది. మాధవన్ తన వాచినమ్మి ఆమె గాజును విడిపిస్తాడు. తన పేదరికం కారణంగా ఆమె ప్రేమను పట్టించుకోనట్లు మొదట నటించినతను ఆమె నిజాయితీకి మనస్సు మార్చుకుని తనూ ప్రేమించడం మొదలుపెడ్తాడు.

విధురుడై (భార్యను కోల్పోయి) ఆరేళ్ళ పాపకు తండ్రైన డాక్టర్ ఆనంద్‌తో  రాధకు పెళ్ళి నిశ్చయం చేస్తాడు ఆమె తాత. రాధ ఎదురు తిరిగి దెబ్బలు తింటుంది. లేచిపోడానికి సిద్ధమైతే మాధవన్ ఆమెను ఓదార్చి ' రాత్రి రహస్యంగా దేవాలయంలో పెళ్ళిచేసుకుని తిరిగి వచ్చి ప్రొద్దున్న అంతా చెప్పి పెద్దల ఆశీస్సులు తీసుకుందా' మని చెబుతాడు. ఇద్దరూ దేవాలయంలో ఉండగా, మనుషులతో మాధవన్ పై దాడిచేయించి రాధను తీసుకువెళ్తాడు ఆమె తాతయ్య. గుట్టుచప్పుడు కాకుండా ఆమె పెళ్ళి ఆనంద్‌తో జరిగిపోతుంది.

రాధ కథనంతా విన్న డాక్టర్ ఆనంద్, ఆమెను మళ్ళీ మాధవన్‌తో కలిపే బాధ్యతను తన భుజాన వేసుకుంటాడు. చావుబ్రతుకుల మధ్యనున్న తన తల్లి కోరిక మేరకే తను మళ్ళీ వివాహం చేసుకున్నానని, ఆమె మరణించేవరకూ ఆమె మనస్సు నొప్పించకుండా కోడలిగా  మసలుకొంటే చాలని చెబుతాడు. తాకట్టులో ఉన్న రాధ వాళ్ళింటిని విడిపించి ,ఆమె చెల్లెలికి ఉద్యోగం ఇప్పించి, అవిటివాడైన తమ్ముడికి కృత్రిమ కాలుని ఏర్పాటు చేయిస్తాడు. క్రమక్రమంగా ఆరేళ్ళ పాపకు, అత్తకు రాధ దగ్గరవుతుంది. గాయాల నుంచి కోలుకొని మళ్ళీ అవకాశాల వేటలో రోడ్డున పడ్డ మాధవన్‌ను సినిమా తీసే నెపంతో ఆనంద్ చేరదీసి తన గెస్టవుస్‌లో ఆశ్రయం కల్పిస్తాడు. తమ ముగ్గురి కథనే సినిమా కథగా చెబుతూ క్లైమాక్స్  ఎలా ఉంటే బావుంటుందని అడుగుతాడు. భర్తతో ఉండిపోతేనే బావుంటుందని మాధవన్ చెబితే, ప్రేమించిన ప్రియుడి దగ్గరికి చేరడమే ఉత్తమ పరిష్కారమని ఆనంద్ వాదిస్తాడు.

ఆనంద్ తల్లి మరణిస్తుంది. అడ్వాన్సిచ్చే నెపంతో మాధవన్‌ని ఇంటికి పిలిపిస్తాడు ఆనంద్. రాధను ఆ ఇంట్లో చూసిన మాధవన్‌కి విషయం అర్థమవుతుంది. ఆమె అతనితో ఉండటమే ఉత్తమమని, సినిమాలు వేరు జీవితం వేరని చెబుతాడు.ఆనంద్ మొండిగా వాదిస్తే కట్టిన తాళిని విప్పేస్తే ఆమెను తనతో తీసుకువెళ్తానంటాడు. బలవంతంగా తాళి తియ్యబోయిన ఆనంద్‌ను రాధ ప్రతిఘటిస్తుంది. 'ఇదే మన కథ. మన జాతి కథ. నీతి కథ ' అని చెప్పి నిండు మనస్సుతో ఆశీర్వదించి వెళ్ళిపోతాడు మాధవన్. రాధ ఆనంద్ ఒక్కటవ్వంతో కథ ముగుస్తుంది.

విజయవంతమైన తమిళ కథను తెలుగులో చక్కగా తీర్చిదిద్దారు బాపు గారు. బాపు బొమ్మగా రాధిక, తమిళ బ్రాహ్మణుడిగా చంద్రమోహన్, డాక్టర్‌గా శరత్‌బాబు పోటిపడి నటించారు. ముళ్ళపూడి వారి మాటలు తూటాల్లా పేలాయి. ముగింపులో మాధవన్ పాత్రలో చంద్రమోహన్ చెప్పే డైలాగ్ నాకు బాగా నచ్చింది.' పెళ్ళి కాని అమ్మాయి మనస్సు అద్దం లాంటిది. అందులో చానా మూఖాలు కనిపిస్తాయి.కాని తనకి తాళి కట్టిన తర్వాత అదే మనస్సు పటం గా మారిపోతుంది .అందులో ఒకే దేవుడు. భర్త. అది మీరు .మన కథకు ఇదిదా కరక్టు క్లైమాక్సు .ఇది ఓల్డు కావచ్చు కానీ ఇదిదా గోల్డు.' ఎంత అమూల్యమైన మాటలివి.

కే.వి.మహాదేవన్ స్వర గాంధర్వాలకు అందమైన సాహిత్యాన్ని సమకూర్చి పాటలను అజరామరం చేశారు సి.నారాయణరెడ్డి గారు,జ్యోతిర్మయి గారు.చిటికెయ్యవే చినదాన, చేతికి గాజుల్లా, కలనైనా క్షణమైనా, ఏం మొగుడో..ఇలా ప్రతి పాటా ఆణిముత్యమే. ' చేతికి గాజుల్లా, కళ్ళకు కాటుకలా, నుదుటికి తిలకంలా, రాధకు మాధవుడు' అన్న వాక్యాలు విని ఇది ఖచ్చితంగా వేటూరి గారే వ్రాసుంటారని అనుకున్నాను. జ్యోతిర్మయి గారని తెలిసి తెల్లబోయాను.

తెలుగులో కూడా ఘనవిజయం సాధించిన ఈ సినిమాను బాపుగారి దర్శకత్వంలోనే 'వో సాత్‌ దిన్' అనే పేరుతో  హిందిలో పునర్నిర్మించారు. పద్మినీ కొళాపురి, అనిల్‌కపూర్(చంద్రమోహన్), నసీరుద్దీన్‌షా ముఖ్యభూమికలు పోషించారు.అక్కడ కూడా విజయ కేతనం ఎగరవేసింది.





విశ్వనాథ సత్యనారాయణ - వేయిపడగలు - విశ్లేషణ


విసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు ఆశువుగా చెబుతూండగా, వారి తమ్ముడు వెంకటేశ్వర్లు గారు వ్రాసిన నవల వేయిపడగలు. కేవలం 29 రోజుల్లో వేయిపేజీల ఉద్గ్రంథాన్ని వెలువరించడం విశ్వనాథ వారి పాండితీ ప్రకర్షకు నిదర్శనం. 1934లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన పోటీకోసం వ్రాయబడి అడవి బాపిరాజు గారి 'నారాయణరావు'  నవలతో పాటూ ప్రథమ బహుమతి పంచుకున్న ఈ నవల ఆయనకు విశేష ఖ్యాతినార్జించి పెట్టింది. 1968-70ప్రాంతాలలో బహుభాషాకోవిదుడైన దివంగత ప్రధానమంత్రి శ్రీ పి.వి.నరసింహారావు ఈ నవలను  హిందిలోకి అనువదించి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డునందుకొన్నారు. ఈ అనువాదం ఆధారంగా నిర్మితమైన 'సహస్రఫణ్ ' అనే ధారావాహిక హిందీ మొదలైన అనేక భారతీయభాషలలో దూరదర్శన్ ద్వారా ప్రసారమైంది.

ఇంతకుముందు వేయిపడగలు కథను సంక్షిప్తంగా మాత్రమే  చెప్పడం జరిగింది.  అది కాక ఎన్నో పిట్టకథలు, సహాయపాత్రలు ఉన్నాయి.  అన్నింటినీ గుదిగుచ్చడం కష్టం కాబట్టి ప్రధానమైన కథనే ఇక్కడ ప్రస్తావించాను.  ఇక్కడ ఒక ఇబ్బంది కూడా ఉంది. ఒకే పేరు గల పాత్రలు, ఒకే అక్షరంతో మొదలయ్యే పాత్రలు నవలలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు ధర్మారావు తండ్రి పేరు, కొడుకు పేరు రామేశ్వరమే.  వీళ్ళు కాకుండా ప్రతినాయకులలో ఒకడైన రామేశ్వరం ఉండనే ఉన్నాడు.  ఇంకొన్ని పాత్ర పేర్లు ఇలా ఉన్నాయి రామక్రిష్ణారావు, రంగాజమ్మ, రామచంద్రరాజు, రథంతరి, రుక్మిణమ్మారావు, రాజ్యలక్ష్మి...ఇలా సాగుతుంది వరస.  పొరపాటున మధ్యలో కొన్నిరోజులు విరామం ఇచ్చారంటే మళ్ళీ చదవడం మొదలుపేట్టేటప్పుడు ఎవరు ఎవరో గుర్తురాక గందరగోళానికి గురవ్వక తప్పదు.  కానీ ఒకసారి నవల మీద స్పష్టత వచ్చాక ముఖ్యమైన ప్రతిపాత్రా మనస్సులో గుర్తుండి పోతుంది.  అంత వివరణాత్మకంగా పాత్రలను మలచారు.

వేయిపడగలంటే సనాతన భారతీయ ధర్మాలు సంప్రదాయాలని అర్థం. సుబ్బన్నపేట దేవుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హర్రప్ప వంశీకులు,ధర్మారావు వంశీకులు, గణాచారి- వీరు నలుగురు ధర్మానికి నాలుగుస్తంభాలుగా నిలిచి ధర్మార్థకామమోక్షాలను పరిరక్షిస్తూ ప్రజలకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిన రంగారావు ప్రాచీన ధర్మాలకు తిలోదకాలిచ్చి హంగూ ఆర్భాటాలను వంటబట్టించుకొని విచక్షణారహితమైన నిర్ణయాలు తీసుకుని ప్రజాధనం వృధా చేస్తాడు.  ఫలితంగా ఖజానాపై అప్పుల భారం పెరిగి పరిపాలన కుంటుపడుతుంది. కొన్ని వందలఏళ్ళుగా అన్నం పెట్టిన వృత్తివిద్యలు కనుమరుగైపోయి ప్రజలు దిక్కులేనివాళ్ళవుతారు.  విదేశీ విద్యనే మహత్తరమైనదని, స్వజాతి సంస్కృతి ఆచారాలు అనాగరికమనే భావన ప్రబలుతుంది.  ప్రజలందరూ స్వధర్మం మరచిపోయి పరధర్మాల వైపు ఆకర్షితులై, అవే ఉత్తమమని నమ్మి, వాటిని అక్కున చేర్చుకోవటంతో సనాతనధర్మాలకి ప్రతీకైన సుబ్రహ్మణ్యేశ్వరుడు క్రమక్రమంగా తన పడగలన్నీ కోల్పోయి, కళావిహీనమై చివరికి రెండే పడగలతో మిగిలిపోతాడు. ఆ రెండు పడగలే ధర్మారావు, అరుంధతి.

ఇందులో ప్రధానంగా మూడు తరాల జీవన విధానాల్ని, పాశ్చాత్యుల దురాక్రమణ తర్వాత చోటుచేసుకున్న మార్పులు చేర్పులని, తద్వారా ఎదురవుతున్న సమస్యలని చర్చించారు. ఒక రకంగా ఇది విశ్వనాథ సత్యనారాయణ గారి స్వీయచరిత్ర అనుకోవచ్చు. వారి పూర్వీకులు కాశీ వెళ్ళి అక్కడినుంచి శివలింగం తెచ్చి కృష్ణా నదీతీరంలోని ఒక గ్రామంలో ప్రతిష్ఠించారట. అలా ఆ గ్రామం విశ్వనాథపల్లై అదే వారింటి పేరుగా స్థిరపడిపోయింది. ఆ తర్వాత వీరు నందమూరు వలస వచ్చారు. విశ్వనాథవారి నాన్నగారు అక్కడ కూడా కాశీ నుంచి తెప్పించిన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. తెలుగు బోధకులుగా విజయవాడ, కరీంనగర్ కళాశాలల్లో పనిచేసిన విశ్వనాథ వేయిపడగలను నవలను కూడా ఆ విశ్వనాథునికే అంకితమిచ్చి తన శివభక్తిని చాటుకున్నారు. వారికి రెండు పెళ్ళిళ్ళయ్యాయి. మొదటి భార్య గతించాక మరో అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఆమెను కూడా అదే పేరుతో పిలిచేవారు.

వేయిపడగలులో కథానాయకుడు ధర్మారావు కూడా అంతే. అతను కవి,జాతీయ కళాశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. తరతరాలుగా అతని పూర్వీకులు సేవించుకుంటున్న నాగేశ్వరాలయం లోని శివలింగం కాశీ నుంచి తెప్పించి ప్రతిష్ఠించినదే.  తన భార్య చనిపోయాక ధర్మారావు కూడా మరో పెళ్ళిచేసుకుంటాడు. ఆమె పేరు కూడా అరుంధతి. ధర్మారావుకు సనాతనధర్మాల మీద సమున్నత విశ్వాసముంది. వాటికి ఆచరణకు అవరోధాలు కలిగినప్పుడల్లా విలవిలలాడిపోతాడు. స్వతహాగా సాత్వికుడు కానీ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు నిర్మొహమాటంగా వెల్లడించే స్వభావమున్నవాడు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పగలడే కానీ, నచ్చనివాటి మీద ఉద్యమాలు లేవదీసి పోరాటాలు చేసే తత్వం అతనికి లేదు. అన్నిటికీ సాక్షీభూతుడు కానీ దేనికీ ప్రత్యక్ష కారకుడు కాదు. Passive hero.

కథానాయిక అరుంధతి భర్తను రెండవ పెళ్ళి చేసుకోమనేటంత ఉదాత్తురాలు.  ప్రాచీన భారతస్త్రీ స్వభావానికి ప్రతీక. దేవదాసి భగవంతున్నే నమ్ముకుని ఆ మూర్తితో వివాహం కోసం పరితపించే పవిత్రమూర్తి. ఈమె పాత్ర సమాజంలో దేవదాసీలంటే ఉన్న చులకనభావాన్ని రూపుమాపి వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పడానికే సృష్టించబడిందనుకోవచ్చు. రంగారావు, మంగమ్మ లాంటి వాళ్ళు మొదట కొన్ని వ్యామోహాలకు లొంగినా జీవిత చరమాంకంలో తమ తప్పులు తెలుసుకొని మారిపోతారు. రామేశ్వరం, రాధాపతి, దివాను నాగేశ్వరరావు లాంటి వాళ్ళు పాశ్చాత్య సంసృతిని పూర్తిగా జీర్ణించుకుని పెడత్రోవలు తొక్కి పతనమైపోతారు. ధర్మారావు, అరుంధతి, హర్రప్ప లాంటి వారు ఎన్నిఆటుపోట్లు ఎదురైనా పూర్వాచార పరాయణులుగానే మిగిలిపోతారు.

ఈ పుస్తకం చదువుతూంటే నాకు అప్రయత్నంగా భారత,భాగవతాలు గుర్తొచ్చాయి. అందులో ఉన్నట్లే ఇందులో కూడా ప్రతిపాత్రని వంశవృక్షంతో సహా వివరిస్తూ వెళ్తారు రచయిత. తెరమీది బొమ్మల్లా రకరకాల పాత్రలు వచ్చిపోతూ తమ వ్యక్తిత్వాల ద్వారా మన మనస్సులో స్థానాలేర్పరచుకొని వెళ్తాయి.రామేశ్వరశాస్త్రి దాతృత్వం, రత్నగిరి ఆత్మగౌరవం, లక్ష్మణస్వామి(ఏనుగు)స్వామిభక్తి,నాగేశ్వరశాస్త్రి నక్క వినయం, సుసానీ అవిధేయత చెదరని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు సమాజం పరుగులుపెడుతున్నపుడు, ఆ రథచక్రాల ఇరుసులలో ఇరుక్కొని నలిగిపోయిన సామాన్యుల వెతల్ని చక్కగా ఆవిష్కరించారు. ప్రాచీన కళలపై వీరికున్న అవగాహన అడుగడుగునా ప్రతిఫలిస్తుంది. ముఖ్యంగా నాట్యం గురుంచి, నాటకాల గురుంచి ముద్రలతో సహా వివరిస్తున్నప్పుడు ఆశేషమైన ఆ ప్రతిభా సంపత్తికి ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఆయన కలం నుంచి తప్పించుకున్న వస్తువు, వర్ణన లేదేమో? టైంమెషీన్‌లాంటి తన అద్భుతమైన రచనాశైలితో మనల్ని ఒక్కసారిగా మూడువందల ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తారు. చూడాలన్న(చదవాలన్న)ఉత్సుకత ఉంటే సున్నితమైన ప్రతి విషయాన్ని మైక్రోస్కోపిక్ వర్ణనలతో దర్శింపచేసి జ్ఞాన పిపాసను తీరుస్తారు. ఆయన సునిశిత పరిశీలనా దృష్టి ఎంతటిదో ఈ క్రింది వాక్యాల ద్వారా తెలియజేస్తాను.


"వర్షము పెద్దది కాజొచ్చెను.ఆ వానకు వడగండ్లు పడెను...ఒక పాము వానలో పరువెత్తుచుండెను. వడగండ్లు దాని శిరస్సును తాడించుచుండెను.అది పడగవిప్పి బుస్సుమనిలేచి ప్రక్కవాటుగా బొంయిమని వీచుచున్న గాలిని కసిగాట్లు కొరికి కష్టము మీద పోవుచుండెను".

వడగళ్ళు తన మీద పడుతూంటే పాము ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి.తననెవరో కసిదీర మోదుతున్నారని పాముకి కోపం.అక్కనా ప్రక్కనా ఎవరూ లేరు.హోరుమని వీస్తున్న గాలే అలా చేస్తూందనుకుందో, లేక తనకొచ్చిన ఉక్రోషాన్ని వెల్లగ్రక్కాలనుకుందో  కసిదీరా కాట్లు వేస్తోందట.

విశ్వనాథ వారు మేఘానికి వృక్షానికి మధ్య కూడా అద్భుతమైన సంబంధాన్ని ఏర్పరిచి హృదయాలకు హత్తుకొనేలా వివరించారు. ప్రతి సంవత్సరం పడమటి కనుమలు, వింధ్యగిరుల నుంచి ' పృషన్నిధి ' అనే నల్లని మేఘం సుబ్బన్నపేట వచ్చి అక్కడున్న నాలుగువందల ఏళ్ళ నాటి ' ఆదివటం ' అనే మహావృక్షాన్ని కలుసుకొని ఆనందభాష్పాలు రాలుస్తుంది. పట్టణీకరణం కారణంగా ఆదివటంతో సహా మహావృక్షాలన్నిటినీ నరికి విద్యుద్దీపాలకు సిమెంటు స్తంభాలను నాటుతారు. ఎప్పటిలాగే మళ్ళీ వచ్చిన పృషన్నిధి తన మిత్రుడైన ఆదివటం కనబడక తల్లడిల్లిపోతుంది. ఒక విద్యుత్‌స్తంభంపై ఆగి తనను కోరతవేసినట్లు బాధపడితే, ఒక ఝంఝూమారుతం వచ్చి దాన్ని నీళ్ళక్కరలేని గుట్టపైకి విసిరికొడుతుంది.

చెప్పుకుంటూ వెళ్తే ఇవే బోలెడున్నాయి. ఆధ్యాత్మిక వర్ణనలలో ఆయన విశ్వరూపం ప్రదర్శిస్తారు. అద్భుతమైన పరిశీలనాదృష్టి, అపారమైన సాహితీశక్తి ఉంటే తప్ప ఇటువంటి ఊహలు కలగవు. అయితే సమాసభూయిష్టమైన కొన్ని వర్ణనల కారణంగా సగటు పాఠకుడికి బోరుకొట్టే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా చివరి అధ్యాయాలలో వచ్చే దేవదాసి ధర్మారావుల సంభాషణలు, గీతాలు, పద్యాలు చదివి ఆకళింపు చేసుకోవాలంటే చాలా ఓపిక అవసరం.అలాగే, ఆశువుగా చెబుతూంటే వ్రాసిన నవల కాబట్టి కథనానికి ఏమాత్రం సహాయపడని సన్నివేశాలు కూడా అక్కడక్కడా తగుల్తాయి.

ఈ నవలలో చర్చకు వచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. అన్నింటినీ కాకపోయినా కొన్నింటిని వివరిస్తాను.

1. ఇతిహాసాలు,పురాణాలలోని పాత్రలను అభినయిస్తున్నప్పుడు నటీనటుల వస్త్రధారణ హావభావాలు అందుకనుగుణంగా ఉండాలని వ్యాఖ్యానించారు.నారదుడు సామగానం చేస్తే నాటకాలలో భజనగీతాలు పాడుతున్నట్లు చూపిస్తారని,అలాగే శ్రీ కృష్ణుడికి నీలిరంగు బనియను తొడిగి,శిరస్సుపై నెమలిపింఛం పెడతారు గానీ మూతి మీద మీసం మాత్రం ఉంచరని,పాశ్చాత్య నాటకాలు ప్రదర్శిస్తున్నప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటారని విమర్శిస్తారు.ఈ మాటలతో నేనూ ఏకీభవిస్తాను. పేరుమోసిన పెద్ద పెద్ద నిర్మాతలంతా క్రేజీ కాంబినేషన్ల పేరుతో తలాతోకా లేని సినిమాలు ఏళ్ళ తరబడి తీసి చేతులు కాల్చుకొనే కంటే మన గాథల్లోని సంఘటనలను ఉన్నవి ఉన్నట్లుగా తెరకెక్కిస్తే విజయాల సంగతేమోకానీ కనీసం ఆత్మతృప్తైనా మిగులుతుంది.


2. బాల్యవివాహాలను సమర్థించారు.చిన్నప్పుడే ఆడపిల్లకు తన భర్తెవరో తేలిపోవటం వల్ల అతనిమీదే మనస్సు లగ్నమవుతుందని,పెళ్ళి చిన్నప్పుడే చేసినా కార్యం ఎప్పుడో పదమూడేళ్ళ తర్వాత రజస్వలైన తర్వాతే జరిపిస్తున్నాం కాబట్టి ఇందులో దోషమేమీలేదని వాదించారు.అంతేకాదు మనం చిన్ననాడే గర్భాదానం చేయిస్తున్నామని భ్రమపడి పాశ్చాత్యులు బాల్యవివాహాలను వ్యతిరేకిస్తున్నారని,వారి వాదన సరికాదని విశ్లేషించారు.అయితే బాల్యవివాహాల ద్వారా కలిగే ఇక్కట్లను ఆయన మర్చిపోయినట్లున్నారు. వరుడు, అత్తమామలు మంచివారైతే ఫర్వాలేదు.కొంతలో కొంత నయం.కాకపోతేనే వచ్చింది చిక్కు.అప్రయోజకుడైన భర్తకు సేవలు చేస్తూ,అత్తింటి ఆరళ్ళు భరిస్తూ,తన దౌర్భాగ్యానికి తనను తానే నిందించుకుంటూ పసిప్రాయం నుంచే నరకాన్ని అనుభవించాలి.ఒకవేళ మంచి సంబంధమే దొరికినా హాయిగా ఆడుతూపాడుతూ తిరిగే వయసులో పుట్టెడు చాకిరీలు చెయ్యటం అవసరమా?

3. విగ్రహారాధనను వెనుకేసుకొచ్చారు. నిర్గుణమైన పరబ్రహ్మను సగుణం చేసి ఆరాధిస్తున్నప్పుడు ఒక ఆకృతి అవసరమవుతుందని, ఆ భావాన్నే పూజిస్తున్నామని,హిందువుల దేవుళ్ళు విగ్రహాలైతే, ఫోటోలు, చిత్రాలు, సిలువ
చిహ్నాలు విగ్రహాలు కావా అని ప్రశ్నలు సంధించారు. క్రీస్తును చంపిన సిలువ క్రైస్తవమతానికి చిహ్నమెలా అయ్యిందని నిలదీస్తారు. ఇందులో సత్యం లేకపోలేదు .

4. విధవా వివాహాల మీద కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పురుషుడికి ధనముంటే, స్త్రీకి అందముందని, సంఘసంస్కర్తలు కూడా డబ్బు, అందమున్న విధవలనే చూసి పెళ్ళిచేసుకుంటున్నారని, వాటితో నిమిత్తం లేకుండా విధవావివాహాలు జరిగినప్పుడు మంచిదని చెబుతారు.

5. ఇంగ్లీషు చదువుల మీద  అభిప్రాయాలను వెల్లడించారు.పది పదహారేండ్ల వరకూ తెలుగు చక్కగా చెప్పి తర్వాత ఏ భాషైనా బోధించమని,చిన్నప్పటినుండీ ఇంగ్లీషే బోధించటం వలన ఇంగ్లీషు కొంచెం వస్తోంది కానీ,తెలుగేమీ రాకుండా పోతుందని ఆవేదన చెందారు. ఈ గొడవ ఆనాటి(1934) నుంచే ఉన్నట్లుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటం తప్పనిసరి కాబట్టి మన నిర్ణయాలని కొంత సమర్థించుకోగలిగినా తెలుగు సరిగ్గా చదవడం, వ్రాయటం రాని తరం తయారవటం మాత్రం నిజంగా దురదృష్టకరం.

6. విడాకుల చట్టాలకు,స్త్రీ సమాజాలకు కూడా తాను వ్యతిరేకినని మంగమ్మ పాత్ర ద్వారా చెప్పిస్తారు. పనులను పంచుకోవాలి కానీ వాటికోసం పోటీపడరాదని, చదువుకున్నంత మాత్రాన స్త్రీ పురుషులిద్దరికీ సమానమైన జ్ఞానముంటుందని భ్రమపడరాదని చెబుతారు. స్త్రీ విద్య గురుంచి మాట్లాడుతూ స్త్రీలను క్రైస్తవ బడుల్లోకి పంపరాదని ధర్మారావు చేత చెప్పిస్తారు. మిషనుస్కూళ్ళలో చదివిన ఆడపిల్లలకు మన సంప్రదాయాలు అలవాటుకాక హైందవ సంస్కృతి నాశనమవుతోందని, గృహదేవతైన ఆమెకు గృహసంబంధమైన మంచిచెడ్డలు తెలియకుండా పోతున్నాయని బాధపడతారు.


వీరి అభిప్రాయాలు కొందరికి విపరీతంలా తోచవచ్చు. చాలా మంది ఏకీభవించలేకపోవచ్చు. రచయితే రాధాపతి పాత్ర ద్వారా చెప్పించినట్లు ఈయనెవరో బి.సి కాలం నాటి వాడని తీసిపారేయవచ్చు. కానీ మూడు దశాబ్దాల కాలంలో మనుషుల్లో,సంఘంలో చోటుచేసుకున్న పరిణామాలకు దర్పణం పట్టిన నవలగా దీన్ని దర్శిస్తే,చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గ్రంథమని ఇట్టే బోధపడుతుంది.

ఒకప్పుడు ఈ నవల విడిగా లభ్యమయ్యేది కాదు.విశ్వనాథ వారి సాహితీసర్వసం(మొత్తం సెట్టు నాలుగువేలకు పైమాటే అనుకుంటా) కొంటే తప్ప విడిగా అమ్మబడదని చెప్పేవారు. నేను కూడా మూడు నాలుగుసార్లు ఆ సమాధానం విని నీరుగారిపోయాను. నా బోటి వాళ్ళను తలచుకోని ఆ నిబంధనను తర్వాత సడలించినట్లున్నారు. ఇప్పుడు విడిగా కూడా లభ్యమవుతోంది.

సాదా ప్రతి వెల 558/-, లైబ్రరీ ప్రతి వెల 1116/-


విశ్వనాథ - వేయిపడగలు - సమీక్ష - మూడవభాగం



దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత విశ్వనాథ వారి వేయిపడగలు నవల సమీక్షకు మూడవ భాగం వ్రాస్తున్నందుకు పాఠకులు క్షమించాలి. దీనికి ప్రధాన కారణం అంత పెద్ద కథను క్లుప్తంగా ఎలా చెప్పాలో వెంటనే బోధపడకపోవటం. అందువల్లనే దీనిని వెనక్కి నెట్టి మిగతా విషయాల మీద టపాలు వ్రాయటం జరిగింది. ఇప్పుడు వీలు చిక్కింది కాబట్టి నింపాదిగా ఒకటికి రెండుసార్లు చదివి మధ్యలోనే ఆగిపోయిన సమీక్షను కొనసాగించదలచుకున్నాను. ముందు మిగతా కథలోకి వెళ్దాం.

రామేశ్వరం తాలూకా అధ్యక్షుడవుతాడు. సినిమా వ్యాపారం మొదలుపెట్టి డబ్బులు బాగా వెనకేసుకుంటాడు. జోస్యులు అనే ఉపాధ్యాయుడు అతని ప్రాపు కోసం ప్రాకులాడి తన ఇంటికి ఆహ్వానిస్తాడు. జోస్యులు భార్య మంగమ్మ. ఆమెకు నాగరిక లక్షణాలు తెలియవు. పైగా మగడంటే ఎక్కడలేని అయిష్టత. రామేశ్వరం మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకుంటాడు. విషయం తెలిసిన జోస్యులు తీవ్రంగా మథనపడి, సంగతి నలుగురికీ తెలిసిందని గ్రహించి అత్మహత్యాప్రయత్నం చెయ్యబోయి ధైర్యం చాలక గొల్లుమంటాడు.

పాఠశాలల తనిఖీకి వచ్చిన రామేశ్వరాన్ని చూసి జోస్యులు ఖాతరు చెయ్యకుండా నిద్రబోతాడు.రామేశ్వరం సంజాయిషీ కోరుతూ చీటీ పంపితే ' తాను సరిగ్గాలేడు గనకే తన భార్యను అతను ఏలుకొంటున్నాడని,తన నెల జీతం తనకు నెలా నెలా సరిగ్గా ముట్టజెప్పాలని,అలాగే తన భార్యతో కలిసి ఇంకా తను ఒకే ఇంట్లో ఉంటున్నందుకు పైకం పంపించాలని',తిరుగు టపా పంపుతాడు జోస్యులు. మంగమ్మ మోజులోపడిన రామేశ్వరం తన యావదాస్తిని ఆమె పేరిట వ్రాస్తాడు. అందరూ జోస్యుల్ని నపుంసకుడని గేలిచేస్తారు. జోస్యులు ఉన్మాదావస్థకు లోనై ఒకరోజు వీధిలో పెద్దమనుషులతో వెళ్తున్న రామేశ్వరం మీద కత్తితో దాడి చేస్తాడు. రామేశ్వరం మనుషులు అతని ఒళ్ళు హూనం చేస్తారు. పిచ్చివాడై రాత్రిపూట గుండేరు దగ్గర తిరుగుతున్న జోస్యులు హత్యకు గురవుతాడు.

రామేశ్వరం దొంగనోట్ల కేసులో అరెస్టవుతాడు. అతని పలుకుబడి ఆస్తిపాస్తులు అతన్ని రక్షించలేకపోతాయి. ఏడేండ్ల జైలుశిక్ష పడుతుంది. భర్తపోయాక గడసరితనం, నిర్భయత్వం అలవర్చుకున్న మంగమ్మ, జైలుకి వెళ్ళి రామేశ్వరాన్ని అపహాస్యం చేస్తుంది. స్వాతంత్ర్య పోరాటంలో అరెస్టయిన తన స్నేహితుడిని చూడటానికి అదే జైలుకు వచ్చిన ధర్మారావు, కటకటాల వెనుకనున్న రామేశ్వరాన్ని చూసి తగినశాస్తి జరిగిందని అనుకుంటాడు.

ధర్మారావు స్నేహితుడు కిరీటి. అతనికి తన మరదలంటే చాలా ఇష్టం. తన కూతురుని అతనికే ఇచ్చి పెళ్ళి చేస్తానని చిన్ననాడు ప్రమాణం చేసిన అతని మేనమామ,ఆ తర్వాత నయాపైసా సంపాదన లేదని తెలిసి విముఖత చూపిస్తాడు.కిరీటి తల్లి మరణిస్తుంది.కిరిటి మరింత కృంగిపోయి నిద్రాహారాలు లేక నీరసించిపోతే,కబురందుకున్న అతని మేనమామ జాలిపడి తుదకు పెళ్ళికి అంగీకరిస్తాడు.

రాధాపతి ఒక మోస్తరు కవి. మంచి మాటకారి పైగా జిత్తులమారి. పనీపాటా లేకుండా ఆవారాగా తిరుగుతూంటాడు. బిజిలీ అనే ఒక నాటకాలపిల్లతో కొన్ని రోజులు ప్రేమాయణం నడిపి,ఆమె తరపువాళ్ళు కర్రలు పుచ్చుకోవడంతో కాలికి బుద్ధిచెప్పి మనోచాంచల్యం చావక ట్రైనులో తారసపడిన ఒక ఉపాధ్యాయురాలిని బుట్టలో వేసుకుంటాడు. ఆమెతో కొన్నాళ్ళు సహజీవనం చేసి ఆమెను గర్భవతి చేస్తాడు. పెళ్ళి కాకుండా తల్లయినందుకు ఆమె కించపడి అబార్షన్ చేయించుకుంటుంది. అప్పటికి అతని వాలకం తేటతెల్లమై అతనితో తెగతెంపులు చేసుకుంటుంది. అప్పులవాళ్ళు పట్టుకుపోగా మిగిలిన ఆస్తిని కరిగించి బెజవాడలో అనాధ స్త్రీ శరణాలయం తెరుస్తాడు రాధాపతి. రామేశ్వరం ద్వారా ప్రాప్తించిన ధనంతో అక్కడికి చేరుకున్న మంగమ్మ, అతని తీపిమాటలకు మోసపోయి అతనితో పాటూ తిరిగి సుబ్బన్నపేట వచ్చేసి సహజీవనం ప్రారంభిస్తుంది.

పంకజమ్మ ఒక వితంతువు. ఆమె కూతురు శ్యామల కుమారస్వామి అనే ఒక పేదబ్రాహ్మణ విధ్యార్థిని ఇష్టపడుతుంది.పంకజమ్మకు ఇదంతా ఇష్టముండదు. అందరికీ తనమీద గౌరవం ఉండటం చేత వారు పిలిచినప్పుడల్లా వెళ్ళి చర్చల్లో పాల్గొంటూ అనేక విషయలమీదా వాదోపవాదాలు చేస్తూంటాడు ధర్మారావు. అతని ఆభిప్రాయాలు,భావాలు రాధాపతికి నచ్చవు. బి.సి.కాలం నాటి వాడంటూ అతన్ని ఈసడించుకుంటాడు. తనతో పాటూ బెజవాడ రావల్సిందిగా మంగమ్మను కోరుతాడు. ధర్మారావు ప్రభావంతో మారిపోయిన ఆమె ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తుంది.

ధర్మారావు దంపతులు 'ఉండి' వెళ్ళి పశుపతి ఇంట్లో కొన్ని రోజులుంటారు. పశుపతి కూతురు పేరు కూడా అరుంధతే. ఆ పాపతో వారిద్దరికీ చనువు కుదురుతుంది. సుబ్బన్నపేటలోని బ్రాహ్మణవీధిలో మంటలంటుకొని ఇళ్ళు తగలబడిపోతాయి. పురపాలక సంఘం సమావేశమై కుళాయిలు విద్యుద్దీపాలు సమకూర్చుకోవాలని నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయాన్ని ధర్మారావు అన్నగారు వ్యతిరేకిస్తారు. ఉన్న అప్పులే తీరలేదని,కొత్తగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రజలందరిమీదా పన్నులభారం పడుతుందని వాదిస్తారు. ఆయన మాటలను అందరూ పెడచెవిని పెడతారు. సుబ్బన్నపేటకు కుళాయిలు,విద్యుద్దీపాలు వస్తాయి. స్త్రీ సంఘం ఏర్పాటై బాల్య వివాహాలు,విధవా వివాహాల మీద చర్చలు మొదలవుతాయి.

రంగారావు శ్రీలంక నుంచి ఒక ఫ్రెంచి వనితను తీసుకొచ్చి వివాహం చేసుకుంటాడు. ఇంగ్లీషు భార్యకు,ఫ్రెంచి భార్యకు మధ్య సవతుల గొడవ ప్రారంభవుతుంది. కోర్టుకెక్కి సమస్యలు తెచ్చుకోలేక ఫ్రెంచి వనితను నెలభరణానికి ఒప్పించి ఆమెను తిరిగి శ్రీలంక పంపేస్తాడు రంగారావు. ఇంగ్లీషు భార్య పేరు సుసానీ. సాధ్యమైనంత పైకం మూటగట్టుకొని ఇంగ్లాండుకు శాశ్వతంగా వెళ్ళిపోవాలని ఆమెకు ఊహ కలుగుతుంది. ఈ లోగా రంగారావు అంతుచిక్కని వ్యాధికి గురవుతాడు. ఇంగ్లీషు మందులు పనిచెయ్యవు. ఇదే సమయమని భావించిన సుసానీ తను ఇంగ్లాండు వెళ్ళిపోతానని రంగారావుతో చెబుతుంది. అతను అంగీకరిస్తాడు. సుసానీ ఉన్నదంతా ఊడ్చుకొని ఇరవైలక్షల రూపాయలతో వెళ్ళిపోవాలని సన్నాహాలు చేసుకుంటుండగా రంగారావు కొడుకు హర్రప్ప వచ్చి తన తల్లి నగలు మాత్రం విడిచి వెళ్ళమని అర్థిస్తాడు. ఆమె ఒప్పుకొని మిగిలిన సొమ్మంతా పెద్ద పెద్ద పెట్టెలలో పోగేసుకొని ఇంగ్లాండు తీసుకుపోతుంది. అయితే ఆమెను మోసం చేసి పది లక్షలవరకు కాజేస్తాడు దివాను. హర్రప్ప రాజ్యాధికారం తన చేతుల్లోకి తీసుకొని అన్ని వ్యవహారాలు చక్కబెడతాడు. తండ్రికి ఆయుర్వేద వైద్యున్ని కుదుర్చి ధర్మారావుని తన దివానుగా నియమిస్తాడు. జీతం పుచ్చుకోడానికి ధర్మారావు అంగీకరించడు.

కుమారస్వామి,శ్యామల వివాహం జరుగుతుంది. బ్రతుకు గడవడం కోసం మంగమ్మ దగ్గర అప్పులు చేస్తూంటాడు. అతను పదే పదే ఇంటికి రావటం రాధాపతికి నచ్చదు. మంగమ్మ రాధపతిని లక్ష్యపెట్టదు. ఆమె సారంగధర నాటకంలో చిత్రాంగి వేషం కడుతుంది. అరుంధతి రోగగ్రస్తురాలవుతుంది.

హర్రప్ప నాయనమ్మకు, తల్లికి కర్మలు చేసి,వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాలకు అంకురార్పణ చేస్తాడు. ధర్మారావు కుటుంబసభ్యులు సంతోషసాగరంలో మునిగిపోతారు. బంధుమిత్రాదులతో ధర్మారావు గృహం కళకళాడుతుంది. పిల్లవాడైన ధర్మారావు కొడుకు కోటకు ఒంటరిగా వెళ్ళి భయం లేకుండా సంచరిస్తూ,ముద్దు ముద్దు మాటలతో రోగిపీడుతుడైన రంగారావుకు ఉల్లాసాన్ని కలిగిస్తూంటాడు. ఇంతకాలం కళ్యాణోత్సవాల కోసమే ఎదురుచూసిన దేవదాసి,ఉత్సవాలలో అందంగా అభినయించి ప్రాణాలు విడుస్తుంది. ఈలోగా అరుంధతి అనారోగ్యం ముదిరి అవసానదశకు చేరుకుంటుంది.

తన ఆవేశం కారణంగా ఉద్యోగం కోల్పోతాడు కుమారస్వామి. మంగమ్మ అతన్ని కుమారునిగా భావించి ఆస్తంతా అతని పేర, ఏటా స్వామి ఉత్సవాల నిర్వహణ పేరిట రాసేస్తుంది. చిన్ననాడు ఇష్టపడిన తన బంధువుల అమ్మాయిని శరణాలయం వచ్చి తన బాగోగులు చూడవలసిందిగా అభ్యర్తిస్తాడు రాధాపతి. ఆమెకు ఇదివరకే పెళ్ళయ్యింది. మొగుడితో దెబ్బలాడి రాధాపతితో వచ్చేసి సహజీవనం ప్రారంభిస్తుంది. తనను ప్రేమించమని ఆమెనడుగుతాడు రాధాపతి. సహజీవనం చేస్తున్నా కూడా అతనిని ప్రేమించలేనంటుందామె. రాధాపతి విరక్తి చెంది సైనేడు మింగి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ విషయమంతా అతని సహచరుడు వ్రాసిన ఉత్తరం వలన మంగమ్మకు తెలుస్తుంది. ఆస్తంతా ఇతరులకు దానం చేసిందనే కోపంతో,నమ్మకంగా పనిచేస్తునట్లు నటిస్తూ వచ్చిన చెంగల్రావనే వ్యక్తి మంగమ్మను హత్య చేస్తాడు. పోలిసులతన్ని అరెస్టు చేస్తారు. అరుంధతి మరణిస్తుంది.ధర్మారావు శోకసముద్రంలో మునిగిపోతాడు.

రంగారావు ఆరోగ్యం కుదుటపడుతుంది. హర్రప్ప యోగమరణం పొందుతాడు. గణాచారి పాకలోనే తగలబడిపోతుంది. ధర్మారావు పశుపతి ఇంటికి వెళ్తాడు. పశుపతి కూతురు చిన్న అరుంధతి ధర్మారావునే పెళ్ళాడుతానని పట్టుబడుతుంది. పశుపతికి బాల్యవివాహాలు ఇష్టం లేకపోయినా కూతూరు మొండిపట్టుదలకు తలొగ్గి ధర్మారావుకిచ్చి పెళ్ళిచేస్తాడు. స్వర్గస్తురాలైన తన భార్య అరుంధతియే చిన్న అరుంధతినావహించినదని ధర్మారావు భావిస్తాడు . చిన్న అరుంధతి అవునని చెప్పటంతో నవల సమాప్తమవుతుంది.


(విశ్లేషణతో కూడిన చివరిభాగం తరువాతి టపాలో)


ధర్మస్థల - హళేబీడు - బేలూరు

ర్మస్థల..రెండు వారాల క్రితం, రిటైరై ఖాళీగా ఉన్న మా తల్లిదండ్రులు వేసవి శెలవులలో బెంగుళూరు వచ్చినప్పుడు వచ్చిందీ ప్రస్తావన.ఇరవై మూడేళ్ళ క్రిందట, మూడేళ్ళ మా చెల్లికి రెండవసారి తలనీలాలివ్వటానికి వెళ్ళినప్పుడు మొదటిసారి ధర్మస్థలను చూశాను. అప్పుడు మేము తిరుపతి నుంచి బయలుదేరి వెళ్ళాం. ఎప్పుడు మేమెక్కెడికి వెళ్ళినా కుటుంబసభ్యులందరినీ వెంటేసుకొని బయలుదేరే మా నాన్నగారు అప్పుడు కుడా మాతోపాటూ నాన్నమ్మను, తాతను, అమ్మమ్మను వెంటబెట్టుకొని వెళ్ళారు. అప్పట్లోనే ఆయన బేలూరు,హళేబీడు, శ్రవణబెళ్గోల చూడాలని ప్లాన్ చేశారు. కానీ ఈయనకు కన్నడ రాక, ఆయన చెప్పింది కన్నడ కండక్టరుకి అర్థం కాక ఆ ప్లాను బెడిసికొట్టి మా యాత్ర ధర్మస్థల దర్శనంతోనే ముగిసిపోయింది. వాళ్ళు ధర్మస్థలను మాత్రమే చూడాలనుకొన్నా,ఆ యాత్రకు బేలూరు,హళేబీడు కూడా జోడించి ఈ సారైనా వాళ్ళ కోరిక తీర్చాలని నేను గట్టిగా అనుకొన్నాను. టికెట్ ఏర్పాట్లు మా తమ్ముడు చూసుకున్నాడు.

బెంగళూరు నుంచి 325 కిలోమీటర్ల దూరంలో ఉంది ధర్మస్థల. డైరెక్ట్ ట్రైన్స్ ఏవీ లేవు. హస్సన్‌లేదా మంగళూరులో దిగి మళ్ళీ బస్సులో ప్రయాణం చెయ్యాలి. బస్సులో అయితే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ప్రయాణం. రాత్రి తొమ్మిదిన్నరకు బస్సెకితే తెల్లవారుజామున ఐదున్నరకి ధర్మస్థల చేరుకున్నాం. అప్పటికి చీకట్లింకా తొలగిపోలేదు. మా తల్లిదండ్రులను ధర్మసత్రాల దగ్గర కూర్చోబెట్టి ఖాళీగదుల కోసం కాటేజీలను,గెస్టవుస్‌లను వెదుక్కుంటూ వెళ్ళాను. వెళ్ళిన ప్రతిచోటా గదులు లేవన్న బోర్డు వెక్కిరిస్తూ కనపించింది. అలా ఒక గంటసేపు తచ్చాడి ఇక లాభం లేదని ఓ కాటేజిలో దూరాను. మరో గంటన్నరపాటూ చాంతాడంత పొడుగాటి లైన్లో నిల్చుంటే రూం దొరికింది. రూం కేటాయించే సమయంలో తప్పనిసరిగా మీ బంధుమిత్రులందరూ అక్కడే ఉండాలి. అప్పుడే రూం లభిస్తుంది. మాకు ఐదవ ఫ్లోర్‌లో కేటాయించారు. ఆ లభించిన గది కూడా పేరుకు గదే కానీ అందులో మంచాలు,మాట్రెస్సులు లాంటివేం లేవు. మూడు పొడవాటి సిమెంటు అరుగులను గదిలో నిర్మించి వాటిమీద బస్‌సీట్లలాంటి నల్లటి కవర్లను కప్పారు. హతోస్మి అనుకున్నాను. ఆ రోజు మా అదృష్టం బాలేదో లేక మాములుగానే ధర్మస్థలలో రూములంతేనో తెలియలేదు. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అంతా దేవస్థానం ఆధీనంలోనే ఉన్నాయని,ప్రైవేటు హోటళ్ళేవి లేవని విన్నాను. ఆలయ వెబ్‌సైట్‌లో అవుట్‌డేటెడ్ ఫోన్‌నంబర్లు దొరికాయి. పనిచేస్తున్న ఈ-మెయిల్ఐడి నుంచి జవాబు రాలేదు. గూగుల్‌లో వెదికినా ఇతర ప్రత్యామ్నాయాలు దొరకలేదు. ఒక్కటి మాత్రం నిజం. ధర్మస్థలలో సరైన వసతి సౌకర్యలు దొరికితే మీరదృష్టవంతుల కిందే లెక్క.

స్నానపానాదులు ముగించుకొని,టిఫన్ చేసి మంజునాథేశ్వరాలయానికి వెళ్ళాం. కేరళ లేక మంగళూరు సాంప్రదాయ శైలిలో కట్టిన ఈ ఆలయానికో ప్రత్యేకత ఉంది. దీనిని జైనులు నిర్వహిస్తున్నారు. ఇందులో కొలువై ఉన్న దేవుడు పరమశివుడు.
 


పూజలు చేసే పూజారులు వైష్ణవ తెగకు చెందినవాళ్ళు. ఇలా మూడు విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఇక్కడ శాంతి సౌభాతృత్వంతో మెలగుతూ దేవుడొక్కడే అన్న విషయాన్ని నిరూపిస్తారు. ఇక్కడ ప్రత్యేక దర్శనమంటూ ఏమీ లేదు. అందరూ మాములు క్యూలో వెళ్ళవలసిందే. క్యూలైన్లు పొడవుగా ఉన్నా క్యూ కదులుతూనే ఉంటుంది. గర్భాలయం సమీపమించినప్పుడు పురుషులు షర్టులు,బనియన్లు తీసివేయాల్సి ఉంటుంది. క్యూలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి బయటికి వచ్చేంతవరకు వివిధసేవలు,వాటికి దక్కే ప్రసాదాల వివరాలతో చెవులు ఊదరగొట్టేస్తారు నిర్వాహకులు. ఇది నాకు నచ్చలేదు. ఎంతసేపు ఈ గొడవే అయితే ఇక దేవుడి మీద మనస్సు లగ్నమయ్యేదెప్పుడు?

పూర్వకాలంలో ధర్మస్థలను కుడుమ అని పిలిచేవారు.ఇక్కడ జైన మతపెద్దైన పెర్గడె,అమ్ము బల్లత్తి దంపతులు ఎంతో ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవారు.ఒకనాడు మానవాకారాలు ధరించి వచ్చిన ధర్మదేవుని దూతలను పెర్గడె దంపతులు తమ ఆతిథ్యంతో సంతృప్తి పరుస్తారు.దేవదూతలు సంతోషించి ఆ రాత్రి పెర్గడె కలలో కనిపించి ప్రస్తుతం అతనుంటున్న ఇంటిని ఖాళీ చేసి ధర్మప్రబోధం చెయ్యవలసిందని అజ్ఞాపిస్తారు.

వారి ఆజ్ఞానుసారం కొత్తిల్లు కట్టుకొని,పాతింటిలో వెలసిన ధర్మమూర్తులను కొలుస్తూంటాడు పెర్గడె.మళ్ళీ వారు అతని కలలో కనబడి తమకు ప్రత్యేకంగా ఆలయాలు నిర్మించాలని,వాటి నిర్వహణ బాధ్యతలు అతనే తీసుకోవాలని,దానికి బదులుగా అతని కుటుంబాన్ని తాము రక్షించి సమృద్ధినిస్తామని చెబుతారు. వారు చెప్పినట్లే చేసిన పెర్గడె, పూజారుల కోరిక మేరకు అన్నప్ప ద్వారా మంగళూరు దగ్గరున్న కద్రి నుంచి శివలింగాన్ని కూడా తెప్పించి ప్రతిష్ఠిస్తాడు. 16వ శతాబ్దంలో ఉడిపి వడిరాజస్వామి వేంచేసి లింగానికి శాస్త్రయుక్తంగా పూజలు చేసి ఈ ప్రదేశాన్ని ధర్మస్థలగా నామకరణం చేస్తాడు.

గంటలో దర్శనం పూర్తయ్యింది. వెంట్రుకలివ్వాలనుకొనే వారికి ఆలయం వెలుపలే టికెట్లు లభిస్తాయి. మనవైపు ఆడవాళ్ళు మూడు కత్తెర్లు వేయించుకుంటే ఇక్కడ ఐదు కత్తెర్లు వేయించుకోవాలి. దీనిని పంచముడి అంటారు.

అక్కడి నుంచి దగ్గర్లోనే ఉన్న నేత్రావతి నదీ తీరానికి వెళ్ళాం. అది అధ్వానంగా ఉంది. భక్తులు నీటిని కలుషితం చేస్తారని నదికి చెక్‌డ్యాం కట్టి చిన్న చిన్న గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ఆ నీరు ఏర్పరచిన గుంటలలో భక్తులు స్నానాలు

 


చేస్తూ,ఈదులాడుకుంటూ కనిపించారు. నదిలో దిగి నీళ్ళు చల్లుకొని ఒకటి రెండు ఫోటోలు దిగి తిరిగి వచ్చేశాం.అప్పటికి అపరాహ్ణవేళయ్యింది. సరైన హోటల్‌కోసం చూస్తే దేవస్థానం వారి ఉచిత అన్నదానం చాలా బావుంటుందని,అందరూ వాటినే ఆదరించటం మూలన పెద్దగా భోజన హోటల్స్ లేవని తెలిసింది. మేం దర్శనం కోసం క్యూలో నిలబడినప్పుడే అన్నదానం క్యూ ఆంజనేయుని తోకలా పొడవుగా ఉంది. మళ్ళీ గంటల తరబడి క్యూలో నిలబడే ధైర్యం లేక బస్టాండులో ఉన్న చిన్న హోటల్‌లో కాస్త కతికి భోజనం అయిందనిపించాం. అప్పటికే నేనొక నిర్ణయానికి వచ్చేశాను. ధర్మస్థలలో ఎక్కువసేపుండటం కంటే ముందు హస్సన్ వెళ్ళిపోయి అక్కడ సరైన సౌకర్యాలున్న హోటలొకటి చూసుకోవాలని అనుకున్నాను. వెంటనే నా అలోచనను అమలులో పెట్టాను. మధ్యాహ్నం రెండున్నరకి హస్సన్‌బస్సు దొరికింది.మూడు దాటితే తర్వాత బస్సు రాత్రి ఎనిమిదిపైనేనని కండక్టరు చెప్పాడు. సౌకర్యలోపం కారణంగా తలెత్తిన ఇబ్బందులు ధర్మస్థల, దానికి చుట్టుపక్కలున్న ప్రదేశాలు చూడాలనుకొన్న నా పూర్వపు ఆలోచనలను వెనక్కి నెట్టేశాయి.

ధర్మస్థల నుంచి హస్సన్‌కు 110 కిలోమీటర్లు. ఘాట్‌రోడ్డు కాబట్టి బస్సులో నాలుగు గంటలు పట్టింది. దారికిరువైపులా పచ్చదనమే. ఎక్కడా రాయలసీమలోలా రాళ్ళగుట్టలు కనబడవు. పైగా విశాలమైన ఆవరణతో విలసిల్లే మంగళూరు శైలి గృహనిర్మాణాలు,పనసతోటలు,కాఫీ తోటలు మార్గమంతా ఎదురై ఆహ్లాదాన్ని పంచుతాయి. సకలేశ్‌పుర తర్వాత హోరున వర్షం కురిసి వాతావరణాన్ని మరింత ముగ్ధం చేసింది.

హస్సన్ కొత్తబస్టాండును తలదన్నే బస్టాండు ఆంధ్రదేశంలో ఏ జిల్లా కేంద్రంలోనూ లేదేమో .అంత స్టైలిష్‌గా విశాలంగా ఉంది. బస్టాండుకు కొద్ది దూరంలోనే మంచి హోటల్‌లో దిగి సేదతీరాం. ఆ తర్వాత బేలూరు,హళేబీడు,శ్రావణ బెళ్గోల చుట్టిరావడానికి టాక్సీలను, ప్రైవేట్ ట్రావెల్స్‌ను విచారించటానికి నేను రోడ్డు మీదకొచ్చాను. పదేళ్ళుగా బెంగుళూరులో పాతుకుపోయా కాబట్టి కన్నడ సంభాషణలపై నాకు మంచి పట్టే ఉంది. ట్రావెల్స్ వాళ్ళు 1500 అవుతుందని చెప్పారు. పైగా శ్రావణ బెళ్గోల హస్సన్ నుంచి బెంగళూరు వెళ్ళే మార్గంలో వస్తుందని, అక్కడ గోమటేశ్వరుని చూడ్డానికి ఎక్కవలసిన మెట్లు వందకుపైనే ఉన్నాయని చెప్పారు. మా తల్లిదండ్రులు అన్ని మెట్లెక్కలేరని లిస్ట్ లోంచి దాన్ని తీసేశాను. పాత బస్టాండు వెళ్ళి అక్కడున్న టాక్సీ డ్రైవర్లను కలిశాను. హీనపక్షం ఎనిమిదివందలిస్తే వస్తామన్నారు వాళ్ళు. అదే విషయం మా నాన్నగారికి ఫోన్లో చెబితే ' వృథా ఖర్చులెందుకు,అవే డబ్బులు హళేబీడు,బేలూరులో సైట్‌సీయింగ్‌కి ఖర్చుపెట్టోచ్చు.బస్సుల గురుంచి వాకబు చెయ్య'మని సూచించారు. బస్టాండులో ఆరాతీస్తే పొద్దున్నే ఆరున్నరకు హళేబీడుకు డైరెక్ట్ బస్సుందని చెప్పారు. ఆఖరికి అదే ఖరారయ్యింది. పొద్దున్నే స్నానం హళేబీడు బస్సెక్కేశాం. హస్సన్ నుంచి హళేబీడుకి 39 కిలోమీటర్ల దూరముంది. సమృద్ధమైన జలకళతో,పాడిపంటలతో,అరటి,కొబ్బరి తోటలతో అలరారే స్వచ్ఛమైన కన్నడ పల్లెసీమల్ని చూసి ముచ్చటపడుతూ గంటసేపటికి హళేబీడు చేరుకున్నాం.

హళేబీడు

హళేబీడు పల్లెటూరు. ఊరి మొదట్లో పెద్ద చెరువు. దాన్ని దాటుకొని లోనికివెళ్తే మూడురోడ్ల కూడలి మధ్య ఠీవీగా దర్శనమిస్తూ హొయశాల వృత్తం, అందులో సింహంతో పోరాడుతున్న శాళుడి ప్రతిమ(హొయశాల రాజచిహ్నం)కనువిందు

 


చేస్తాయి.అది ఈ మధ్యే నిర్మించినదైనా ఆ ప్రదేశానికున్న చారిత్రక ప్రాముఖ్యతను రొమ్ము విరుచుకొని చాటి చెప్పేలా ఉంది.దానికి ప్రక్కనే 890 ఏళ్ళనాటి హొయశాళేశ్వరుడు,శాంతలేశ్వరుల ఆలయాలున్నాయి. బస్టాండులో కాకాహోటల్లో టిఫన్ పూర్తిచేసి ఆలయసందర్శనకు ఉత్సాహంగా బయలుదేరాం.

హళేబీడు అసలు పేరు ద్వారసముద్రం. క్రీ.శ.12వ శతాబ్దంలో హొయశాలుల రాజధానిగా ఈ ప్రాంతం ఒక వెలుగు వెలిగింది. హొయశాలులు పశ్చిమ కనుమలలోని కొండజాతి వాళ్ళు. ప్రాథమికంగా జైనమతారాధకులైన వీరు తర్వాత హిందువులుగా మారిపోయి, అవసానదశలో ఉన్న ఆనాటి రాజవంశాల(పశ్చిమ గాంగేయులు, రాష్ట్రకూటులు) పరిస్థితులను ఆసరా చేసుకొని క్రమక్రమగా పట్టు సాధిస్తూ తమ సామ్రాజ్యాన్ని విస్తృతం చేశారు. వారిలో ముఖ్యుడు విష్ణువర్థన మహారాజు. ఆయన ఆనతి ప్రకారమే రెండు శివాలయాలను నిర్మించారు. ఒకటి హొయశాళేశ్వరుడికి, ఇంకొకటి కేదారేశ్వరుడికి. హొయశాలేశ్వరాలయాన్ని క్రీ.శ 1121లో దండనాయకుడైన కేతుమల్లుని పర్యవేక్షణలో ప్రారంభిస్తే, కేదారేశ్వరాలయాన్ని మహారాణి శాంతలాదేవి పేరుమీదుగా క్రి.శ 1219లో ప్రారంభించారు. శాంతలాదేవి అభీష్టం మేరకు నిర్మింపబడిన గుడి కాబట్టి కేదారేశ్వరునికే శాంతలేశ్వరుడని మరో పేరు. నిర్మాణానికి 105 ఏళ్ళు పట్టింది.


ఆలయ నిర్మాణ శైలి అబ్బురపరుస్తుంది.నక్షత్రాకారంలో వెలసిన ఎత్తైన వేదికపై రెండు ఆలయాలనూ నిర్మించారు.ఆలయాంతర్భాగంలో పైకప్పుపై అద్భుతమైన శిల్పాలు చేక్కారు.గర్భగుడి ద్వారమైతే శిల్పకళకు పరాకాష్టగా నిలుస్తుంది. క్రిందినుంచి 




పైవరకూ మొత్తం శిల్పాలలో అలంకరించేశారు. ద్వారపాలురైన నంది,భృంగి విగ్రహాలు,మానవ కపాళాలతో నిండిన వారి కిరీటాలు చూసి నోళ్ళువెళ్ళబెట్టకతప్పదు. కపాలం ఎంత డొల్లగా ఉంటుందో నంది,భృంగి కిరీటాలలోని కపాలాలు కూడా అంతే డొల్లగా ఉంటాయి. కపాలంలో ఒక రంధ్రం నుంచి మరో రంధ్రానికి చిన్న పుల్లను దూర్చి తియ్యవచ్చు. అలాగే విగ్రహాలు ధరించిన నగల మధ్య కూడా చేతి వ్రేళ్ళు దూరేంత ఎడమ ఉంది. శాంతలేశ్వరునికి అభిముఖంగా ఉన్న నందీశ్వరుడి ప్రతిమ 


 


ఆకట్టుకుంటుంది. భారతదేశం మొత్తం మీద ఇంత అందంగా రకరకాల అలంకరణలతో చెక్కబడిన మరో నంది విగ్రహం లేదంటే అతిశయోక్తి లేదు. హొయశాళేశ్వరునికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం కూడా బావుంది కానీ దానికి ఇన్ని అలంకరణలు లేవు.

బాహ్యగోడలపై ఎనిమిది వరుసల శిల్పశైలి ద్యోతకమవుతుంది. క్రింద నుంచి మొదటి వరుసలో ఏనుగులు, రెండో వరుసలో సింహాలు, మూడవ వరుసలో లతలు తీగెలు,నాల్గవ వరుసలో ఆశ్విక దళం, ఐదవ వరుసలో మళ్ళీ లతలు తీగెలు, ఆరవ 


 


వరుసలో రామాయణ మహాభారత ఇతివృత్తాలు, ఏడవ వరుసలో మకరం, ఎనిమిదవ వరుసలో హంసలు కనిపిస్తాయి. వాటిపైన వెలసిన శిల్పాల అందచందాలని చూసి ఆస్వాదించాల్సిందే కానీ మాటలలో వర్ణించడం సాధ్యం కాదు.ప్రతి శిల్పం సహజత్వం ఉట్టిపడుతూ,శిల్పాచార్యుని సృజనాత్మక ప్రతిభకు నిలువుటద్దం పడుతుంది. ఒక్కో శిల్పం గురుంచి వివరిస్తూ పొతే చిన్న పుస్తకమే అవుతుంది. నాకు చేతనైన రీతిలో కొన్ని శిల్పాలు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.

ఏనుగు ఉదరం చీల్చుకొని పరమశివుడు నృత్యం చేస్తున్న భంగిమ గజాసురవధ శిల్పంలో కనిపిస్తుంది.ఆనందంతో చిందులేస్తున్న నందిని, మృదంగం వాయిస్తున్న ప్రమదగణాలని పొట్టలోనే చూడవచ్చు. శంకరుని వాడైన గోళ్ళు ఎనుగు మృతకళేబరాన్ని చీల్చుకొని వెలుపలికి వచ్చినట్టు మలిచారు.త్రివిక్రమావతారమైన వామనావతార ఘట్టంలో ఒక పాదాన్ని బ్రహ్మదేవుడు కడుగుతున్నట్లు, ఆ నీరే నదిగా మారి జాలువారినట్లు,అందులో చేపలు ఇతర జలచరాలు

 


ఈదులాడుతున్నట్టు, గరుడుడు భక్తిప్రపత్తులతో మ్రొక్కుతున్నట్లు, దేవతా స్త్రీ వింజామరలు వీస్తునట్లు మలిచారు. దశకంఠుడైన రావణుడు కైలాసాన్ని ఎత్తే శిల్పంలో, శిఖరాగ్రభాగాన పార్వతీసమేతుడై కూర్చున్న పరమేశ్వరున్ని మలిచారు. భక్తుని బలదర్పానికి ఆగ్రహించిన నిరంజనుడు తన కాలిబొటనవ్రేలితో పర్వతాన్ని తొక్కిపట్టగా, జీవనాడులన్నీ కదిలిపోయి రావణుడు కనుగుడ్లు తేలవేసిన దృశ్యాన్ని శిల్పం ప్రతిబింబిస్తుంది. ఈ శిల్పానికి చేరో వైపు బ్రహ్మవిష్ణువులను చెక్కారు.

సాధారణంగా త్రిమూర్తుల చిత్రాలలో మహావిష్ణువు మధ్యలో ఉంటే ఆయనకు చెరోవైపు బ్రహ్మరుద్రులుంటారు.కానీ ఇది శివాలయం కాబట్టి శివున్ని కేంద్రస్థానంలో ఉంచి,విష్ణువుకి స్థానచలనం కలిగించారు.

హిరణ్యకశిపుని వధ శిల్పంలో ఆగ్రహోదగ్రుడైన స్వామివారు రాక్షసి మూకలో ఒకడి తల చర్మం వలిచి పైకి లేపినట్లు చూపారు. వరహావతారంలో ఒక వైపు హిరణ్యాక్షుని తొక్కి పట్టి మరోవైపు ఆయుధాలతో రాక్షసగణాన్ని చీల్చిచెండాడుతున్న దృశ్యం 


 


కనిపిస్తుంది. గోవర్ధన గిరిధారి శిల్పంలో పర్వతంలో వేటగాన్ని, కోతిని ఇతర జంతువులను, వృక్షాలను చిత్రించి వాటికి జీవకళ తీసుకొచ్చారు. రోదసీ వీక్షణానికి టెలిస్కోపుని, త్రాగడానికి స్ట్రాని పాశ్చ్యాత్యుల కంటే మనమే ముందుగా ఉపయోగించామని చెప్పే శిల్పం,ఆంగ్లేయుల తలకట్టును, వస్త్రధారణను పోలిన శిల్పం


 

కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. టెలిస్కొపును కనుగొన్నది, ఆంగ్లేయులు వ్యాపారనిమిత్తం మనదేశానికి వచ్చినది 17వ శతాబ్దంలో. త్రాగడానికి వ్రాడే స్ట్రాను 19వ శతాబ్దంలో కనుగొన్నారు. ఈ విశేషాలన్నీ అంతకుముందే ఎప్పుడో పన్నెండు పదమూడో శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయాల్లో చూచాయగా బయటపడటం అప్పటికే మనదేశీయులు సాధించిన అపూర్వమైన అభివృద్ధికి సమ్మున్నత తార్కాణంగా భాసిస్తుంది . షరా మాములుగా అద్భుత శిల్పసంపదకు ఆలవాలమైన ఈ ఆలయాలను 1311లో మాలిక్ కాఫర్ ఒకసారి, 1326లో మహమ్మద్‌బిన్ తుగ్లక్ ఒకసారి ధ్వంసం చేసి సంపదనంతా మూటలు గట్టి అనేకసార్లు ఒంటెలపై మోసుకొనివెళ్ళారు. మహమ్మదీయుల దాడిలో ధ్వంసమై ప్రాభవం కోల్పోయిన ఊరు కాబట్టి హళేబీడు(పాత నగరం)అన్న పేరు స్థిరపడింది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యాధీశులు వీటి సంరక్షణభారం వహించారు. మొత్తం 35000 శిల్పాలకు పైగా శిల్పాలు ఈ ఆలయాల్లో ఉన్నాయని ఒక అంచనా. కొన్నింటిని ఆంగ్లేయులు తరలించుకొని పోయి లండన్‌లో భధ్రపరిచారని చెబుతారు.

ఆలయం వెలుపల పెద్ద సాక్షి గణపతి విగ్రహం ఉంది.దానికి ఎదురుగా హొయసల రాజలాంఛనం కనిపిస్తుంది.పూర్వం ఈ ద్వారం గుండానే మాహారాజ ప్రభృతులు పరతెంచి వచ్చి మొదట సాక్షి గణపతిని అర్చించి ఆ తర్వాత ఆలయ ప్రవేశం చేసేవారట. హొయసల రాజ చిహ్నం వెనుక ఓ కథ ఉంది. పూర్వం శాళుడు గురుకులంలో విద్యనభ్యసిస్తున్న రోజుల్లో అక్కడో సింహం జొరబడి భయోత్పాతం




 సృష్టించిందట. తక్కిన శిష్యులంతా భీతావహులై పరుగులుపెడితే, శాళుడు ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఒంటరిగానే సింహంతో కలియబడ్డాడట. శిష్యుడి ధైర్యసాహసాలకు ముగ్ధుడైన జైన గురువు సుదత్తుడు ' హొయ్ శాళా హొయ్ శాళా' అని అతన్ని ఉత్తేజపరిచారట.ప్రాచీన కన్నడ భాషలో' హొయ్ ' అంటే కొట్టు అని అర్థం. ఆ శాళుడు స్థాపించిన సామ్రాజ్యం కాబట్టి ఆ సంఘటనే రాజచిహ్నమయ్యింది.

ప్రధానమైన ఈ ఆలయాలు సందర్శించాక ప్రక్కనే ఉన్న జైనదేవాలయాలకు వెళ్ళాం. పార్శ్వనాథ స్వామి(జైనుల 23వ తీర్థంకరుడు) దేవాలయంలో నల్లశిలతో చెక్కబడిన పెద్ద విగ్రహం ఉంది. ఆ మూర్తి తలపై పడగలు విప్పిన ఏడుతలల సర్పాన్ని చెక్కారు. అయితే ఆలయమంతా గబ్బిలాల వాసనే. మందిరం ఎదురుగా ఉన్న రాతిస్తంభాల మండపం బావుంది. జైన దేవాలయాలకు కొద్దిగా ప్రక్కనే రంగనాథస్వామి ఆలయం కూడా ఉంది.

హళేబీడు నుంచి బేలూరుకు 17మైళ్ళ దూరం. ప్రతి అరగంటకు బస్సులున్నాయి. మేం వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది. అప్పటికే సమయం పదకొండయ్యి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూండటంతో, ఇంకో అరగంట వేచి చూసే ఓపిక లేక ప్రవేట్ బస్సులో బేలూరు బయలుదేరాం.

బేలూరు



యగచి నదీతీరంలో ఉంది బేలూరు పట్టణం. దీని పూర్వనామం వేలాపురి.హళేబీడు ధ్వంసమయ్యాక హొయసలులు దీనిని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన గావించారు. ఇక్కడున్న ఏకైక దర్శనీయ స్థలం చెన్నకేశవాలయం. దీని నిర్మాణానికి నాంది పలికింది కూడా విష్ణువర్థనుడే. చోళులపై తన ఘనవిజయానికి గుర్తుగా ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించాడు. హళేబీడులోని శివాలయాల కంటే ఈ ఆలయం చాలా పెద్దది. క్రీ.శ.1116లో శంఖుస్థాపన జరుపుకున్న ఈ ఆలయాన్ని మూడు



తరాలవాళ్ళు 103 ఏళ్ళు కష్టపడి నిర్మించారు. ఇక్కడి మూర్తి, మోహినీ అవతారంలో ఉన్న చెన్నకేశవస్వామి(చెన్న అంటే కన్నడలో అందమైన అని అర్థం). ఈ స్వామికే విజయనారాయణుడని, సౌమ్యనారయణుడని మరో పేర్లు. హొయసాలులు నిర్మించిన అనేక దేవాలయాల్లో నేటికీ ప్రతి ఉదయం,సాయంత్రం క్రమంతప్పకుండా ధూపదీప నైవేద్యాలందుకొంటున్న ఏకైక దేవాలయం ఇదొక్కటే. మోహినీ అవతారంలో మహావిష్ణువు భస్మాసురున్ని అంతమొందించింది ఇక్కడే అని భక్తుల విశ్వాసం.

ఆలయం వెలుపల ఉన్న 42 అడుగుల ఏకరాతి కార్తీకదీపోత్సవ స్తంభాన్ని విజయనగర పాలకులు ప్రతిష్ఠించారు.ఎటువంటి పునాదులు లేకుండా ఒక రాతి 





వేదికపై నిలబెట్టబడిన ఈ స్తంభం నేటికీ పడిపోకుండా నిలబడి సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది.ఆలయ ఆవరణలో చెన్నకేశవునికి అభిముఖంగా, ధ్వజస్తంభం వద్ద వెలసిన గరుడప్రతిమను ఇటీవలే ప్రతిష్ఠించారు.

ఆలయ ప్రాంగణంలో నాలుగు గుడులున్నాయి.మొదటిది ముఖ్యమైంది అయిన చెన్నకేశవస్వామి గర్భగుడి మధ్యలో ఉంటే,దానికి ఒకవైపు కప్పే చెన్నిగరాయని ఆలయం,మరోవైపు సౌమ్యనాయకి(లక్ష్మీదేవి),రంగనాయకి(భూదేవి) ఆలయాలున్నాయి .

ఆలయ నిర్మాణశైలి చాలావరకు హళేబీడులోని శివాలయాలను పోలి ఉంటుంది. ఇక్కడ కూడా నక్షత్రాకారపు వేదిక మెట్లెక్కి ప్రదక్షిణపూర్వకంగా తిరిగి ఆలయంలోకి ప్రవేశించాలి. బాహ్యగోడలపై దర్శనమిచ్చిన శిల్పాలు హళేబేడులోని కొన్ని శిల్పాలను గుర్తుచేస్తాయి. అయితే హళిబేడుకి బేలూరుకి ఉన్న ముఖ్య వ్యత్యాసం ఏమిటంటే హళేబేడు దేవాలాయాలకు బాహ్యసౌందర్యం ఎక్కువ. బేలూరు ఆలయానికి బాహ్యసౌందర్యం, అంతస్సౌందర్యం రెండూ ఉన్నాయి.

చెన్నకేశవాలయంలో ఉన్న 48 స్తంభాలు వేటికవే వైవిధ్యంగా ఉంటాయి.ఇందులో ఐదు స్తంభాలు ముఖ్యమైనవి.వాటిలో నరసింహ స్తంభం వినుతికెక్కింది.ఒకప్పుడు ఈ స్తంభం తనంతట తానే తిరిగేదట. ఇప్పుడు నిలిచిపోయింది. హొయసాలుల 




ఇష్టదైవమైన నరసింహస్వామి ప్రతిమను,ఇతర చిన్న శిల్పాలను ఈ స్తంభంలో మలిచారు. ఒక చోట ఉద్దేశపూర్వకంగానే ఖాళీని ఉంచి ఏ శిల్పి అయినా ఈ స్తంభం విశిష్టత చెదరకుండా ఆ స్థలంలో సరిపోయే శిల్పం చెక్కవచ్చునని సవాలు విసిరారు.అది ఇప్పటికీ ఖాళీగానే ఉంది. మిగిలిన నాలుగు స్తంభాలు గర్భాలయానికి ఎదురుగా ఉన్న నవరంగ మండపం దగ్గరున్నాయి. ఒక్కో స్తంభంపైన ఒక్కో సాలభంజికను చెక్కారు. ఈ సాలభంజికలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. ఈ శిల్పాలకన్నిటికీ జగదేకసుందరి మహారాణి శాంతలాదేవి అందచందాలే ప్రేరణ అని చెబుతారు. శాంతలాదేవికి భరతనాట్యంలో మంచి ఆభినివేశం ఉంది. పురజనుల కోరిక మేరకు దేవాలయాల్లో మూలవిరాట్టుకు ఎదురుగా నృత్యం చేసి అందరినీ మెప్పించి నాట్య సరస్వతి,నృత్యశారద లాంటి అనేక బిరుదుల్ని పొందింది. నవరంగ మండపంలోనున్న ఒక స్తంభంపై నృత్యం చేస్తున్న ఆమె భంగిమ మనసు దోచుకొంటుంది. ఆ ప్రతిమ తలపై వ్రేలాడుతున్న పాపటిబిళ్ళ అల్లాడుతున్నట్లే ఉంటుంది.మొత్తం నలభైరెండు సాలభంజికలున్నాయి. వాటిలో నాలుగు నవరంగ మండపంలో ఉంటే తక్కినవి బాహ్యకుడ్యాలపై వెలిశాయి.

నవరంగ మండపం మధ్యలో పైకప్పుపై అద్భుతమైన శిల్పకళ ఆవిష్కృతమవుతుంది.వేలాడే స్తంభాన్ని పైకప్పులో వీక్షించవచ్చు .

బాహ్యగోడలపై చెక్కిన సాలభంజికలలో జగత్ప్రసిద్దమైనది దర్పణసుందరి ప్రతిమ. త్రిభంగి నృత్యకారిణి ప్రతిమలోని భంగిమను ఇప్పటివరకూ ఏ నృత్యకారిణి అనుసరించలేకపోయిందని ప్రతీతి. అలాగే మహావిష్ణువు దశావతారాలు, ఇతర రూపాలు, రామాయణ మహాభారత గాథలలోని సన్నివేశాలు సునిశిత పరిశీలనాశక్తితో ప్రాణంపోసుకొని నయనమనోహరంగా దర్శనమిస్తాయి. 




ఇక్కడున్న కప్పే చెన్నిగరాయ దేవాలయం గురించి కూడా చెప్పుకోవాలి.ఈ ఆలయం శాంతలాదేవి కోరిక మేరకు అమరశిల్పి జక్కన నిర్మించినది.కొడుకు పుట్టక ముందే ఆలయ నిర్మాణం కోసం ఊరు విడిచి వస్తాడు జక్కన్న.పెరిగి పెద్దవాడైన కొడుకు డంకణ్ణ, తండ్రిని వెదుక్కుంటూ బేలూరు వచ్చి అక్కడ మూలవిరాట్టు విగ్రహాన్ని చెక్కుతున్న జక్కన్నను చూస్తాడు.తండ్రి వాడుతున్న శిల దోషభూయిష్టమైనది చెబుతాడు.ఆవాక్కై ఆగ్రహానికి గురైన జక్కన్న, నింద రుజువు చేసిన పక్షంలో తన కుడిచేతిని నరుక్కొంటానని శపథం చేస్తాడు.డంకణ్ణ గంధపు ముద్దను తీసుకొని విగ్రహమంతా పులుముతాడు.శరీరమంతా పూసిన పూత ఒక్క నాభి దగ్గరే తడిగా మిగిలిపోతుంది.అక్కడ ఉలితో మోదగానే, పగిలి అందులోంచి ఇసుక,నీరు,ఒక కప్ప గెంతుకుంటూ బయటపడతాయి.జక్కనాచారి మాటమీద నిలబడి తన చేతిని నరుక్కొంటాడు.అప్పుడే అతనికి డంకణ్ణ తన కన్నకొడుకని తెలుస్తుంది.మాహావిష్ణువు ఆదేశాల మేరకు అతని స్వగ్రామంలో ఒక కేశవాలయం నిర్మించి పోయిన తన కుడిచేతిని మళ్ళీ పొందుతాడు.



దురదృష్టవశాత్తూ మేమా ఆలయాన్ని దర్శించలేదు. మేం కుదుర్చుకున్న గైడ్ మాకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మాకా అవకాశం లేకుండా చేశాడు. కప్పే చెన్నిగరాయని దేవలయాన్ని ముందుగా సాంపిల్‌గా నిర్మించి మధ్యలోనే ఆపేసి చెన్నకేశవాలయాన్ని నిర్మించారని మాకతను చెప్పాడు. దానికి తగ్గట్టుగానే బాహ్యకుడ్యాలపై ఎటువంటి శిల్పాలు లేక ఖాళీగా కనిపించటంతో మేమటువైపు వెళ్ళలేదు.ఫోటోలు తీసేపనిలో గుడికి అనేక ప్రదక్షిణలు చేసి అప్పటికే అలసిపోయాం. దానికితోడు మధ్యాహ్నం ఒంటిగంట కావడంతో, రాత్రికి బెంగళూరు చేరుకోవాలన్న విషయం గుర్తొచ్చి అప్పటికి స్వస్తి చెప్పాం. అయితే మా అమ్మగారు మాత్రం వాటిని కవర్‌చేశారు.

బేలూరులో మంచి వసతి సౌకర్యాలున్నాయి. మధ్యాహ్నం బేలూరులోనే భోజనం చేసి హస్సన్ బస్సెక్కాం. ఈ బస్సు మళ్ళీ హళేబీడు మీదుగా వెళ్ళి గంటన్నరపాటూ మా సమయాన్ని వృథా చెయ్యకుండా,వేరొక మార్గంలో ప్రయాణించి అరగంటలోనే గమ్యస్థానం చేరుకుంది. అక్కడ దిగి కాస్త ఫ్రెషపయ్యి రెండున్నరకంతా బెంగుళూరు బస్సెక్కేశాం.

అక్కడితో మా యాత్ర పరిసమాప్తమయ్యింది .


యాగంటి - బనగానపల్లె - బెలూం గుహలు

ప్రభుత్వోద్యోగిగా పనిచేసి, పదవీవిరమణ చెయ్యబోతున్న మా నాన్నగారిని కలవడానికి నేను మా తమ్ముడు గుంతకల్లు వెళ్ళాం. కార్యక్రమం ముగిశాక దగ్గర్లోని దర్శనీయ స్థలాలు చూడాలని ముందే నిర్ణయించుకున్నాం. యాగంటి,బనగానపల్లె,బెలూం గుహలు...ఇవన్నీ గుంతకల్లు నుంచి వందకిలోమీటర్లో పరిధిలో వుంటాయి కాబట్టి పొద్దున్నే బయలుదేరితే సాయంకాలానికి తిరిగివచ్చేయచ్చని నాన్నగారు చెప్పటంతో సరేనన్నాం. గుంతకల్లుకు ట్రాన్సఫరైన కొత్తలో అమ్మా,నాన్న అవన్నీ చూసేశారు. మా కోసం మా నాన్నగారు మళ్ళీ బయలుదేరారు.

లింగాకృతిలో స్వయంభూ ఉమామహేశ్వరస్వామి వెలసిన క్షేత్రం యాగంటి. గుంతకల్లు నుంచి 103 కిలోమీటర్ల దూరంలో ఉందీ పుణ్యక్షేత్రం. చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాలు ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసుకుంటున్న సాధుపుంగవుల్లా గంభీరంగా ఉంటే,మధ్యలో ధవళకాంతులతో మెరిసిపోతున్న ఆలయం ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరునిలా ఉంటుంది.




గుడిలోకి ప్రవేశించగానే పుష్కరిణి స్వాగతమిస్తుంది. ఎక్కడో ఉద్భవించిన నీరు,నందికేశుని నోటినుండి ధారగా పడుతూ కోనేరుని నింపుతుంది.' సబ్బులు,షాంపూలు వాడరాదు.బట్టలు ఉతకరాదు ' అని తాటికాయంత అక్షరాలతో బోర్డులు పెట్టినా భక్తులు ఖాతరు చెయ్యకపోవటం వల్ల కోనేట్లో నీరు అపరిశుభ్రమైపోయింది. ఆలయ నిర్వాహకులు కూడా ఆట్టే పట్టించుకునేట్లు లేరు. పుష్కరిణిలో పాదప్రక్షాళనం చేసుకోని, నంది నోటి నుంచి పడుతున్న నీరు నెత్తిన చల్లుకొని ఆలయలోకి వెళ్ళాం. గర్భాలయంలో శివలింగానికి బదులుగా లింగాకృతిలో ఉన్న పార్వతీపరమేశ్వర స్వరూపం కనిపించింది. అమ్మవారికి బొట్టు పెట్టారు. స్వామివారికి తిలకం దిద్దారు. స్వామివారిని దర్శించుకొని వెలుపలికి వస్తే జీవకళ ఉట్టిపడుతున్న నిలువెత్తు నందికేశుడు కనువిందు చేస్తాడు.


స్థలపురాణం

ఈ క్షేత్రం గురుంచి ఒక ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. యాగంటి అసలు పేరు నేగంటి. ఉత్తరభారతదేశ యాత్ర ముగించుకొని దక్షిణదేశానికి వచ్చిన అగస్త్య మహర్షి, ఇక్కడి ప్రశాంతతకు ముగ్ధుడై ఇక్కడొక వేంకటేశ్వరాలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు. తన తపోశక్తితో వేంకటేశుని విగ్రహాన్ని సృష్టించి దానిని ప్రతిష్ఠించాలని జపహోమాలు చెయ్యగా విగ్రహం యొక్క కాలి బొటనవ్రేలు గోరు విరిగిపోయింది. విరిగిన విగ్రహం అభిషేకాలకు పనికిరాదు కాబట్టి దానిని అక్కడే ఒక గుహలో స్థాపించి, జరిగిన దానికి విచారపడి పరమేశ్వరున్ని ప్రార్థించగా, ఆయన ప్రసన్నుడై ఈ ప్రదేశం శైవక్షేత్రంగా విలసిల్లగలదని ఆభయమిచ్చాడు. అగస్త్య మహర్షి కోరిక మేరకు లింగాకృతిలో ఉమామహేశ్వర స్వరూపంతో ఉద్భవించాడు.

చాలాకాలం తర్వాత గురుశిష్యులైన శివభక్తులిద్దరు, పశువులు మేపుతూ ఈ అటవీప్రాంతంలో సంచరిస్తూండగా లింగాకృతిలో ఉన్న ఉమామహేశ్వర విగ్రహం వారికి తారసపడింది. ఎన్నో ఏళ్ళుగా అదే ప్రాంతంలో తిరుగుతున్నా ఏనాడూ ఎదురవని లింగం ఆనాడు కనిపించేసరికి వారిద్దరూ ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. ఆనాటి నుంచి రోజూ నిష్ఠగా పూజలు చేస్తూ రెండు విస్తరాకులలో అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టేవారు. భక్తులిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళో పరీక్షించాలని భావించిన స్వామి,వటువు వేషం దాల్చి తనకూ కాస్త ప్రసాదం పెట్టమని ఇద్దరినీ అడిగాడు. గురువు మౌనం వహిస్తే, శిష్యుడు సరేనన్నాడు. మరుసటి రోజు మూడు విస్తళ్ళలో నైవేద్యం సిద్ధం చేసి వటువు కోసం ఎదురుచూశాడు శిష్యుడు. 'మూడో విస్తరి ఎవరికోసం' అని అడిగిన గురువుకి 'అన్నార్థుల కోసమని సమాధనమిచ్చాడు . గురువు ధ్యానంలో మునిగిపోయాడు. వటువు రాలేదు కానీ పులి వచ్చింది. స్వామి వారే పులి రూపంలో వచ్చి 'ఆకలిగా ఉంద 'ని అర్థించారు. శిష్యుడు మారుమాట మాట్లాడకుండా ముందే సిద్ధం చేసిన మూడో విస్తరిని ముందుపెట్టాడు. నైవేద్యాన్ని ఆరగించిన పులి ఇకా ఆకలిగా ఉందంటే తన విస్తరిని కూడా సమర్పించుకున్నాడు. ఆకలి తీరని పులి ఇంకా అరుస్తూంటే శిష్యుడు సవినయంగా చేతులు జోడిచి ' ఓ వ్యాఘ్రమా ! ఆర్తుల కోసం ఉంచిన మూడో విస్తరిని ఇచ్చేశాను. నాకోసం దాచుకున్న విస్తరినీ నీకే దానం చేశాను. గురువుగారి విస్తరిని దానం చేసే అధికారం నాకు లేదు. ఇక మిగిలింది నేనే. నన్నే ఆహారంగా స్వీకరించు ' అంటూ పులినోట్లో తలపెట్టబోయాడు. పులి అంతర్థానమై సంతుష్టుడైన స్వామి సాక్షాత్కరించాడు. శిష్యుడికి మోక్షం ప్రసాదించి తనతో పాటూ కైలాసానికి తీసుకువెళ్ళాడు. ఇంతలో గురువు కళ్ళు తెరిచి శిష్యుడు కోసం చూస్తే, గగనవీధిలో శివపార్వతులతో కలిసి కైలాసం వెళ్తున్న శిష్యుడు కనిపించాడు. గురువు దీనంగా చేతులు జోడించి శివపార్వతులను పరిపరివిధాల స్తుతించి,శిష్యుని వైపు చూసి 'శిష్యా ! ఇంతకాలం ఇద్దరమూ కలిసిమెలిసి ఉన్నాం.భగవంతుడి సపర్యలు చేశాం.ఇప్పుడు ఒక్కడివే వెళ్ళిపోతావా? నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు ' అని వేడుకొన్నాడు. శిష్యుడు కరిగిపోయి 'గురువుగారు! ఇదిగో ఈ వస్త్రాన్ని వదిలేస్తున్నాను. దీనిని మీరు పట్టుకున్నట్లైతే నాతోపాటూ బొందితో కైలాసం వచ్చేస్తారు ' అని వస్త్రాన్ని జారవిడిచారు.క్రిందకు జారిన ఆ వస్త్రం కాలనాగై గురువు కంటబడింది.గురువు ముట్టుకొలేకపోయాడు.శిష్యుడు కైలాసం వెళ్ళిపోయాడు.

ప్రస్తుతమున్న శివాలయాన్ని విజయనగర ప్రభువులైన హరిహర బుక్కరాయల కాలంలో నిర్మించారు. గర్భగుడికి వెనుకవైపు అగస్త్య పుష్కరిణి ఉంది. ఇందులో నీళ్ళు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయి. చుట్టూ ఉన్న పర్వతాలలో అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ,వేంకటేశ్వరస్వామి వారి గుహ,వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం వ్రాసిన గుహలు ఉన్నాయి. నిట్టనిలువుగా ఉన్న మెట్లు ఎక్కి గుహల్లోకి వెళ్ళాలి. బ్రహ్మంగారి గుహలోకి వెళ్తే నడుం బాగా వంచి వెళ్ళాలి. వృద్ధులకు స్థూలకాయులకు కష్టంతో కూడుకున్న పని.



యాగంటిలో కంటికి కనిపించే అద్భుతాలు మూడు

  1. 1.   యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించవు. పూర్వం అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసుకుంటూంటే కాకాసురుడనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి గోల చేస్తూ ఆయన ప్రశాంతతకు భంగం కలిగించాడట. ఆగ్రహించిన ఆయన ఆ కాకిని భస్మం చేసి,కాకులెప్పుడూ ఈ ప్రాంతానికి రావటానికి వీళ్ళేదని ఆంక్షలు విధించాడట. కాకి శనేశ్వరుని వాహనం. కాకిని బహిష్కరించడమంటే ఆయనను వెలేసినట్టే. అందుకే ఈ శివాలయంలో నవగ్రహ మంటపం ఉండదు.

  2. 2.   ఈ క్షేత్రంలో ఎక్కడో ఉద్భవించిన నీరు ఎప్పుడూ పారుతూనే ఉంటుంది. ఇవి త్రాగడానికి మాత్రమే పనికొస్తాయి. వ్యవసాయం కోసమో, మరే ఇతర అవసరాల కోసమో నీళ్ళు మళ్ళించాలని చూస్తే ఆ ప్రయత్నం సిద్ధించదు. పొలాల కోసం నీళ్ళు మళ్ళించాలని అనేక ప్రయత్నాలు చేసిన ప్రభుత్వం చివరికి తన ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చింది. క్షేత్రం దాటిన వెంటనే నీళ్ళు భుమిలోకి ఇంకిపోయేవట.

  3. 3.  ఉమామహేశ్వరస్వామి గర్భగుడికి ఎదురుగా,ఈశాన్యమూలలో ఉన్న బసవయ్య విగ్రహం(నందీశ్వరుడు)నిత్యం పెరుగుతూనే ఉంది. తొంభై ఏళ్ళ క్రితం నాలుగుస్తంభాల మధ్య చిన్నదిగా ఉండి ప్రదక్షిణలకు అణువుగా ఉన్న ఈ విగ్రహం ఇప్పుడు అమాంతం పెరిగి పెద్దదైపోయి మండపం దాటి వెలుపలికి వచ్చేసింది. ప్రదక్షిణలు చెయ్యడం కష్టమే. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత ఇరవై ఏళ్ళలో ఈ విగ్రహం ఒక అంగుళం పెరిగింది. ఈ బసవయ్యే కలియుగాంతంలో కాలుదువ్వి రంకె వేస్తుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానం చెబుతోంది.


యాగంటి నుంచి పదికిలోమీటర్ల దూరంలో బనగానపల్లెలో బ్రహ్మం గారి నేలమఠం ఉంది. అక్కడే ఆయన వ్రాసిన కాలజ్ఞాన గ్రంథాలను ఒక చింతచెట్టు క్రింద నిక్షిప్తం చేశారు. వాటిల్లో ప్రస్తుతం ఒక గ్రంథం మాత్రమే బయటపడిందని,మిగతా రెండింటిని వీరభోగవసంతరాయల అవతారంలో బ్రహ్మంగారే వెలుపలికి తీస్తారని ఆలయ పూజారి చెప్పారు. అంతే కాదు ఈ చింతచెట్టు కాయలు తినడానికి పనికిరావని,కలియుగాంతంలో ఇదే చెట్టుకు మల్లెపూలు పూస్తాయని కూడా చెప్పారు.


అక్కడి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని రవ్వలకొండకి వెళ్ళం. అక్కడ కొన్నాళ్ళు అచ్చమ్మ గారి ఆలమందలు కాస్తూ, ఒక గుహలో బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాశారట. పాతాళబావి లాంటి ఆ ప్రదేశానికి ఒకటే దారి. మెల్లగా మెట్లు దిగి నడుము బాగా వంచి చీకటిలో లోపలకి వెళ్తే బురదనీళ్ళతో నిండిన ప్రదేశం వస్తుంది. గాలి కూడా సరిగ్గా ఆడదు. పదిమంది కంటే ఎక్కువ మంది వెళ్తే ఊపిరాడక చనిపోయే అవకాశాలెక్కువ. అక్కడే శేషశాయి నీడలో కాలజ్ఞానం వ్రాసుకుంటున్న బ్రహ్మంగారిని చూసిన అచ్చమ్మ,ఆయన శిష్యురాలైపోయిందట.


బనగానపల్లెలో భోజనవిరామం తీసుకొని అక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలోని బెలూం గుహలకు బయలుదేరాం. ప్రవేశద్వారం వద్దనున్న అతి పెద్ద బుద్ధవిగ్రహం చూపరులని ఆకట్టుకొంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలను 1884లో బ్రిటీషువారు

కనుగొన్నారు. తర్వాత దాదాపు ఒక శతాబ్దం పాటూ మరుగునపడిపోయిన వీటిని జర్మన్ దేశస్తుడైన గేబర్ సారథ్యంలో మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ గుహలకు తుది ఎక్కడో ఎవరికీ తెలియదు. ఇప్పటిదాకా మూడున్నర కిలోమీటర్ల మార్గాన్ని మాత్రమే తవ్వకాలలో కనుగొన్నారు. అందులో ఒకటిన్నర కిలోమీటరు వరకే ప్రజాసందర్శనకు ప్రభుత్వం అనుమతిచ్చింది. బౌద్ధమతానికి సంబందించిన ఎన్నో ఆనవాళ్ళు ఇక్కడ దొరికాయి. భూమట్టానికి 120 అడుగుల క్రింద వరకు వెళ్ళగలిగిన ఈ గుహ లోపల,ప్రకృతి సహజంగా ఏర్పడిన రకరకాల ఆకారాలకు పేర్లు పెట్టి, లైటింగ్, పైపుల ద్వారా వెంటిలేషన్ ఏర్పాటు చేసి సందర్శకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది పర్యాటక శాఖ. మేం కూడా కొంతదూరం గుహలో బిక్కుబిక్కుమంటూ పాక్కుంటూ వెళ్ళి సాహసయాత్ర చేసినంత బిల్డప్పిచ్చి అలసిపోయి చివరికి ఇంటిదారి పట్టాం.




కొసమెరుపు
యాగంటి నుంచి బనగానపల్లె వెళ్ళే దారిలో ఒక పాడుబడిన నవాబుల బంగళా ఉంది. దానికే కాస్త గ్రాఫిక్స్ జోడించి ఒక పెద్ద కోటగా భ్రమింపజేస్తారు అరుంధతి సినిమాలో. అప్పటి నుంచి ఇది అరుంధతి కోటగా చేలామణి అవుతూ ఒక సందర్శన క్షేత్రమైపోయింది.


ఓ ప్రేమ కథ !!



చుక్కలు రాలిన వో చీకటి రాత్రి
హోరున గాలి అరుస్తూంటే
జోరుగ వర్షం కురుస్తూంటే
నిద్రాణమై ఉన్న నగరంలో
నిబిడీకృత హాస్టల్ గదిలో
మనసు చచ్చిన
ఓ మానవ దేహం
మృతశరీరమై వ్రేలాడుతోంది !
మూగగా గాలితో ఊసులాడుతోంది !!

పీక్కుపోయిన పిచ్చోడి వదనం
కత్తుల జుత్తుల గెడ్డపు కదనం
గుంటలు తొక్కిన గుండ్రటి కళ్ళు
ఎముకలు పోగైన ఎర్రటి వొళ్ళు
ప్రపంచానికి ప్రశ్నలు వేస్తున్నాయ్ !
సంప్రదాయాన్ని సవాల్ చేస్తున్నాయి !
కాలం చేసినా కాంతులు తగ్గని
ఆ పవిత్ర శవం ఓ యువకవిది !
ఆశలు తీరని ఓ ప్రేమికుడిది !!

పూర్వాశ్రమంలో ఆ అబ్బాయి
పల్లెటూరి స్వేచ్ఛా పావురాయి
భావుకత్వం అతని సౌందర్యం
మంచితనమే మరో ఆహార్యం
పై చదువుల కోర్కెలు హృదిలో కదలి
పట్నం చేరాడు కన్నతల్లినొదలి
అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి
తొలకరిప్రాయంలో తొలిప్రేమకు
కుర్రాడయ్యాడు కొత్తఖైదీ !

ఆతని ప్రేయసి అందాల బొమ్మ
అపరంజి సోకుల పున్నమి కొమ్మ
నగుమోమే ఆమె నయగారం
నాట్యశాస్త్రం కుసుమ సింగారం
అబ్బాయి తెలివికి ఆశ్చర్యపోయింది
మాటలు కలుపుతూ ముచ్చటపడింది
స్నేహంతో మొదలైన పరిచయం
శృతెక్కువై సరిహద్దులు దాటి
చేసింది మనస్సులు ప్రేమమయం

మనసులొకటైన ప్రేమికులిద్దరూ
మిన్నూమన్నూ తమవేనన్నారు
ఎడబాయని బాసలే చేసుకొని
ఎదనిండా వొకళ్ళని నింపుకొని
ప్రేమైకరాగాలు పల్లవించారు
ప్రణయలోకాలలో పర్యటించారు
వసంతాలన్నీ విరబూయించి
వెలిగిపోయారు వీడని జంటై
కలల ధరిత్రికి కన్నుల పంటై

అమ్మాయి తండ్రి అపరకుబేరుడు
ఆత్మీయతలంటే అసలెరుగడు
అంతస్తు ఆత్మలో సగభాగం
కులతత్వం అతనికున్న రోగం
కూతురు ప్రేమ తెలిసి కస్సుమన్నాడు
కలనైనా ప్రియుని కలువరాదన్నాడు
చదువాపించి చూపులు జరిపించి
తీశాడు తనయ తలపుల ఆయువు !
మరొకరితో నిర్ణయించి మనువు !!

నివ్వెరపోయిన నిత్యచెలికాడు
వివాహం కోరి వెళ్ళి అడిగాడు
కులం కలవని అంతస్తుకందని
కుర్రాన్ని చూసి కళ్ళెర్ర చేసి
పట్టి గెంటించాడు ప్రియురాలి తండ్రి
ప్రేమ వ్యవహారలకు వొళ్ళుమండి
వ్యాధుడి వేటుకు వాలిన చిలుకలై
వేరుపడ్డారు ప్రేయసీ ప్రియులు
విధి ఆటల్లో వింత పావులై

చేసిన బాసలు చెదిరిపోయాయి
కోర్కెల మేడలు కూలిపోయాయి
మేలిమి కావ్యం మాసిపోయిసింది
మువ్వల సవ్వడి మూగబోయింది
వెర్రెక్కి కవి ఊరంతా తిరిగాడు
విఫలయత్నాలకు వగచి ఏడ్చాడు
విశ్రాంతి కరువై విరక్తి పరమై
వలపుల సఖుడు ఉరేసుకున్నాడు !
ఊహల జగతి ఊరేగి చేరాడు !

స్మృతులు ముసిరీ సమస్యలు కసిరీ
పగిలిపోయింది ప్రియసఖి హృదయం
ఎవరు చేస్తారు ఆమెకు న్యాయం ?
తిమిరం విడింది తెల్లవారింది
పట్నానికావల పెళ్ళివేదికలో
మంగళగీతాల మేళవింపులో
నవ వధువూపిరి నిలిచిపోయింది !
గగ్గోలు పెట్టిన కూతురు తండ్రిని
గరళం సీసా వెక్కిరించింది !!

సలీం అనార్కలి సమాధుల కథలు
మజ్ఞు లైలాల మారణ గాథలు
చరిత్రకందని చరితలు ఇంకా
పగిలించెనులే నెత్తుటి ఢంకా
తరాలు మారినా యుగాలు దొర్లినా
తేడాల జాడ్యం తొలగని లోకాన
విలాపమేనా వలపుకు సొంతం ?
పెద్దలకెందుకు ఇంతటి పంతం ?
ఇంకెన్నాళ్ళని ఈ విషాదాంతం ?

(1999లో వ్రాసిన కవిత)


సిగలో అవి విరులో

పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో,రమేష్‌నాయుడు స్వరకల్పనలో,అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ,జయప్రద నటించిన మేఘసందేశం  చిత్రం లోనిది.భావకవితాప్రవక్త దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యాన్నందించిన ఆఖరి చిత్రం కూడా ఇదే.ఆయన వ్రాసిన మూడు గేయాలను ఈ చిత్రంలో వాడుకున్నారు(మిగాతా రెండూ-ఆకులో ఆకునై,శీతవేళ రానీయకు).దురదృష్టవశాత్తూ ఈ చిత్రం విడుదలకు ముందే ఆయన పరమపదించారు .





ఈ పాట వింటే ముందుగా ట్యూన్ అనుకొని తర్వాత సాహిత్యం వ్రాసినట్లనిపిస్తుంది .అద్భుతమైన బాణీకి,మధురమైన సాహిత్యం తోడైతే,వీనులవిందైన గాత్రం దాన్ని అజరామరం చేస్తుంది.గాంధర్వగాత్రంతో తనవంతు బాధ్యతను సమర్థవంతంగా పోషించారు కే.జే.యేసుదాస్.

సువాసనలు వెదజల్లటం పువ్వుల ధర్మం.అవి శక్తివంతమైనవి.సుకుమారమైనంత మాత్రాన వాటిని తీసిపారెయ్యటానికి వీలు లేదు.దేవుళ్ళ దగ్గర్నుంచి దుర్మార్గుల వరకు ఎవరిని ప్రసన్నం చేసుకోవాలన్నా పువ్వులు తప్పనిసరి.అంతటి శక్తివంతమైనవి కాబట్టే వాటినే బాణాలుగా మన్మథునికి కట్టబెట్టి లోకకార్యాన్ని నిర్వర్తిస్తున్నారు త్రిమూర్తులు . ఇప్పుడంటే తలలో పువ్వులు పెట్టుకోవటం నామోషీగా భావిస్తున్నారు కానీ,నిండుగా తలలో పువ్వులు పెట్టుకున్న స్త్రీమూర్తిని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.ఆ స్త్రీమూర్తి భార్య అయితే,అది తొలిరేయైతే అంతకంటే చెప్పేదేముంది.సరిగ్గా అటువంటి సందర్భమే ఈ చిత్ర కథానాయకుడికీ ఎదురయ్యింది .

అతను భావావేశం కలిగిన ఒక ఉపాధ్యాయుడు.అసలే కవి.పైగా పెళ్ళైయ్యింది.గదిలో ఎదురుగా చక్కని చుక్కలాంటి భార్య సిగ్గుపడుతూ నిల్చుని ఉంది.జడలో పెట్టుకున్న మల్లెపువ్వులు, అగరుధూమాల సువాసనను,అత్తరుల ఘుమఘుమలను జ్ఞప్తికి తెస్తూ
అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అంతే ! అతనిలో ప్రణయానురాగాలు పెల్లుబుకి ఒక మధురగీతాన్ని అందుకున్నాడు.



సిగలో అవి విరులో
అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో
మసలే వలపు తొలకరులో



ఒకదానిమీద ఒకటి పేర్చినట్లు దొంతరలు కట్టిన ఆమె సిగ్గు,వలపు తొలకరి జల్లులా ఉందట.తొలకరి వర్షం మనసుకి ఆహ్లాదాన్నిస్తుంది. కమ్మని మట్టివాసన వెదజల్లుతూ కురిసే చిరుజల్లులో తడవాలంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు? ఇక్కడ నాయిక సిగ్గు కథానాయకుడికి తొలకరిలా ఉందట.ఒట్టి తొలకరికాదండోయ్ వలపు తొలకరిలా .మాములు చిరుజల్లులకే మనం మైమరిచిపోతాం.ఇక ప్రేమతో నిండిన తొలకరి అయితే... అది అనుభవించాల్సిందే కానీ చెప్పశక్యం కాదు.



ఎదుట,నా ఎదుట,ఏవో సోయగాల మాలికలు
మదిలోన, గదిలోన, మత్తిలిన కొత్త కోరికలు
నిలువనీవు నా తలపులు మరీ మరీ ప్రియా ప్రియా
నిలువనీవు నా తలపులు
నీ కనుల ఆ పిలుపులు ||సిగలో


గదిలో కట్టిన మాలికలు గమ్మత్తుగా ఉంటే,ఎదుట ఉన్న నాయిక సోయగాలు ఏకంగా అతని మదిలోనే మాలికలు కట్టేసుకొని కొత్తకోరికలు రేపుతూ  అతని తలపులు నిలువనీయటం లేదట.



జరిగి, ఇటు వొరిగి, పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అరవిడిన, చిగురాకు పెదవులను మరిగి
మరలి రాలేవు నా చూపులు మరీ మరీ ప్రియా ప్రియా
మరలి రాలేవు నా చూపులు
మధువుకై మెదలు తుమ్మెదలు  ||సిగలో


ఒకప్పుడు ప్రతి చిత్రంలోను భావుకత ప్రాధాన్యతున్న పాటలుండేవి.రాను రాను వాటి సంఖ్య తగ్గి ఇప్పుడు దాదాపుగా మృగ్యమైపోయాయి.ఇటువంటి పాతపాటలు వింటూంటే తెలుగు సినిమా పాటకు మళ్ళీ ఆ రోజులు వస్తాయా అనిపిస్తుంది .


తెలంగాణ పేరుతో ఎన్నాళ్ళీ దొంగనాటకాలు ?




సోదరభావంతో తెలంగాణ కోసం శాంతియుతంగా పోరాడుతున్న గద్దర్ లాంటి వాళ్ళకి ఈ వ్యాసం వర్తించదు.ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ తెలంగాణ పేరుతో అనేక అరాచకాలకు తెగబడుతున్న మూర్ఖశిఖామణుల కోసమే ఈ వ్యాసం .

చాలించడి మీ దొంగ ఏడుపులు పెడబొబ్బలు.
ఎన్నాళ్ళీ దొంగనాటకాలు?
అడిగేవాడు లేక మీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది.

తెలుగుభాషా వికాసానికి, సంస్కృతికి ఎనలేని సేవ చేసిన ప్రముఖుల విగ్రహాలు కూల్చెయ్యటానికి మీకు మనస్సెలా వచ్చింది? శాంతియుత ప్రదర్శన అంటూ మోసపూరిత వాగ్దానాలు చేసి మీరు సాధించిన ఘనకార్యం ఇదా? ఇలా చేస్తే తెలంగాణ వచ్చేస్తుందని ఏ అజ్ఞాని మీకు చెప్పింది.ప్రజల అంగీకారం ఉంటేనే ఏ ఉద్యమమైనా ఫలప్రదమవుతుంది.మీరు చేసిన పనికి తెలంగాణలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందే.దీన్ని ఎలా సమర్ధించుకుంటారు? మీరు చేసేది ఉద్యమమా దౌర్జన్యమా? అన్నమయ్య మిమ్మల్ని ఏం చేశాడు? మిమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూసి,మీ మానప్రాణాలతో ఆట్లాడుకొని,మిమ్మల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చిచంపిన నైజాం నవాబు మీకు దైవ సమానుడా? మీ రక్త మాంసాలను పీల్చిపిప్పి చేసిన పటేల్‌ పట్వారి వ్యవస్థను ఒక్క కలంపోటుతో రద్దు చేసిన ఆంధ్రుడు NTR మీకు ఆగర్భశత్రువా? విగ్రహాలతో మాకు సమస్య లేదు,విగ్రహాలను పెట్టించినవాడితోనే సమస్య అని ఒక బ్లాగరు అన్నాడు. అదే NTR పెట్టించిన తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు ఎందుకు వదిలేశారు ? అప్పుడు మీకు NTR ఆంధ్రత్వం గుర్తురాలేదా? మీకు చేతనైతే తెలంగాణ ఉద్యమాన్ని అమ్ముకొని సొమ్ముచేసుకున్న మర్రి చెన్నారెడ్డి విగ్రహాలని బ్రద్దలుకొట్టుకోండి కానీ తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన అమరజీవి పోట్టీశ్రీరాములు విగ్రహాలని కాదు. మీది తెలుగు భాష కాదా? ఈ మాటలనడానికి మీరు ఏ మాత్రం సిగ్గుపడటం లేదా? నిన్న మొన్న వచ్చిన నవాబుగిరీలు, ముల్కీలు మీకు ప్రియమైపోయాయి కానీ ఏనాడో శాతవాహనులు స్థాపించి, రుద్రమ్మదేవి ఏలిన అచ్చమైన తెలుగు భాష మీకు చేదైపోయిందా? అందుకేనా మూలాలు మరచిపోయి తెలుగుతల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసారు? ఆఖరికి దేవుళ్ళకు కూడా ప్రాంతీయ తత్వాన్ని(భధ్రాచలం,తిరుమల) ఆపాదించిన ఒక మూర్ఖుడి మాటలు మీకు శిరోధార్యమవుతున్నాయంటే మిమ్మల్ని చూసి మీరే జాలిపడాలి.

ఎవరయ్యా మీకు పాఠాలు చెప్పింది ?
ఏ విశ్వవిద్యాలయం మీకు పట్టాలిచ్చింది ?


మాట్లాడితే రెచ్చగోడుతున్నారు అంటున్నారు
ఎవరిని ఎవరిని రెచ్చగొడుతున్నారు ?

  • పార్టీ పెట్టింది మొదలు అంధ్రులు దొంగలు దోపిడీదారులని ఆడిపోసుకున్నది కేసీయార్ కాదా ?
  • ఆంధ్రావాళ్ళను తరిమికొడతాం అని చిందులు తొక్కింది కేసీయార్‌కాదా ?
  • సీమాంధ్ర కళాశాలలు,వాణిజ్య సముదాయాల పై దాడులకు తెగబడింది మీరు కాదా?
  • వాల్యూయేషన్‌కి వచ్చిన సీమాంధ్ర ఉపాధ్యాయులపై భౌతిక దాడులకి తెగబడింది మీ విద్యార్థులు కాదా? ఈ సంఘటన జరిగిన తర్వాత సీమాంధ్ర విద్యార్థులు తెలంగాణ ఉపాధ్యాయులుకు శాలువాలతో సన్మానం చేసింది వాస్తవం కాదా ?
  • సీమాంధ్ర కళాకారుల మూవీ షూటింగ్స్ సెట్స్ ధ్వంసం చేసింది మీరు కాదా?
  • సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఇళ్ళపై దాడికి దిగింది మీరు కాదా ?
  • సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం చేసింది మీరు కాదా ?

  • సీమాంధ్ర నేతలు కేవలం తెలంగాణ రాదంటే రెచ్చగొడుతున్నారు అంటారు మరి మీరు చేసిన నిర్వాకాలని ఏమని అనాలి ?

సీమాంధ్రులు మిమ్మల్ని దోచుకుతిన్నారు అంటారు. శ్రీకృష్ణ కమిటీ ప్రకారం తెలంగాణ కంటే అన్ని రకాలుగా వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ.కానీ మీరు దాన్ని విశ్వసించరు.కోదండరాం,కేసియార్ మాటలు మీకు వేదమంత్రాలతో సమానం. ఇంతకాలం మేం మిమ్మల్ని దోచుకుతిన్న మాట నిజమే అయితే మీరు ముందుగా తిరగబడాల్సింది ఇన్నేళ్ళుగా మీరెన్నుకున్న ప్రజాప్రతినిధుల పైన. వాళ్ళేమీ నోరూ వాయి లేని వాజమ్మలు కాదే.నోట్లో వేలు పెడితే చప్పరించడం కూడా రాని చంటి పిల్లలు కారే ? వేలు పెడితే వెన్నమూక వరకూ దిగమింగే రకం. సుబ్బరంగా సంపాదించుకుని కోట్లు గడించుకొన్నారు కదా? మీరెన్నుకున్న ఎంపీలు కేసియార్,విజయశాంతి నిన్న మొన్నటిదాకా ఎనాడైనా పార్లమెంటు మొహం చుశారా? రాత్రంతా తాగి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయ్యటం తప్ప కేసియార్ ఎమైనా వెలగబెట్టాడా? ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడ్డాడా? రాజీనామా డ్రామాలు మొదలుపెట్టి ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని మళ్ళీ ఎన్నికైతే 'తెలంగాణా వాదం యొక్క తీవ్రత ' అంటూ మీరు మురిసిపోయారు కానీ ఎప్పుడైనా ఇందులో మర్మం గ్రహించారా? ఎంతసేపూ విద్యార్థులే ఎందుకు త్యాగాలు చేసి తన్నులు తినాలి, మీరెందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి మీ నైతికత నిరూపించుకోరు అని ఎప్పుడైనా కోదండరాంను నిలదీశారా? ఆయన, ఆయనతో పాటు విద్యార్థులను రెచ్చగొడుతూ నెల తిరిగేసరికి సీమాంధ్రులు కూడా సక్రమంగా పన్నులు కడితే తప్ప విడుదలవ్వని జీతాలను పుచ్చుకుంటున్న ఇతర మేధావులు త్యాగాలకు అతీతులా ? క్లాసులు సక్రమంగా జరక్క విద్యార్థులు,వ్యాపారం జరక్క వ్యాపారస్తులు ,రోజు గడవక బడుగుజీవులు నాశనమైపోవచ్చు కానీ వీళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలను వదలరా? నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కావచ్చు,పాలమూరు సమస్య కావచ్చు, సమస్య ఏదైనా పోరాడి సాధించుకోవల్సింది మీరు మీ ప్రజాప్రతినిధులు.ఇంతకాలం ఈ మేధావులు, సంఘసంస్కర్తలు ఏం చేసారు? చోద్యం చూశారా లేక చేతకాక మిన్నకున్నారా? జయప్రకాష్ నారాయణ లాంటి బలహీనుల్ని కోట్టారు కాబట్టి సరిపోయింది కానీ అదే ఏ బలవంతుడైన నేత మీదో చెయ్యిపడుంటే ఆరోజే మీ సామర్థ్యం బయటపడేది. మీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే మీ దివాళాకోరు నాయాకులపై తిరగబడండి. ఆడలేనమ్మ మద్దెల మీద పడి ఏడ్చినట్లు మీలో ఇన్ని లోపాలు పెట్టుకొని సీమాంధ్రుల మీద ఏడిస్తే ఏమిటి ప్రయోజనం ?


హిందూ దేవుళ్ళకి మీసాలు, గెడ్డాలు ఎందుకుండవు?


హిందూ దేవుళ్ళకి మీసాలు,గెడ్డాలు ఎందుకుండవో నాకర్థం కాదు. ఒక్క యమధర్మరాజు తప్ప మిగతా అందరూ క్లీన్‌షేవ్‌తో కనిపిస్తూంటారు. యమధర్మరాజుకి కూడా , ఆయన వృత్తిధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని కాస్త భయంకరంగా కనిపించాలని బుర్ర మీసాలు ఏర్పాటు చేసారు కానీ మరోకారణం చేత కాదు. బృహస్పతి దేవగురువు, వయస్సులో గురువు సహజంగా శిష్యులకంటే పెద్దవాడు కాబట్టి ఆయనకీ విషయంలో మినహాయింపు నిచ్చారు. సూర్యభగవానుడికి, శనేశ్వరుడికి, ఖగరాజైన గరుత్మంతుడికి కొంతమంది మీసాలు పెట్టి సంతోషించారు కానీ తతిమ్మా దేవగణం అంతా మీసాలు లేని మగరాయుళ్ళ బ్యాచే.

త్రిమూర్తుల విషయానికి వస్తే సృష్తికర్తైన బ్రహ్మను, లయకారకుడైన శంకరున్ని మనవాళ్ళు కరుణించి అప్పుడప్పుడు వారికి మీసాలు,గెడ్డాలు తగిలించారు. స్థితికారుడైన మహావిష్ణువును మాత్రం పట్టించుకోకుండా వదిలేశారు. తనకున్న కోట్లాది ఆలయాల్లో ఆయనెక్కడా మీసాలతో దర్శనమిచ్చిన దాఖలాలు లేవు (ఒక్క శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు గుడిలో తప్ప). క్షత్రియుడైన శ్రీరాముడిని, యదువంశీయుడైన శ్రీకృష్ణుడిని నూనూగు మీసాలు కూడా రాని పసిబాలకులలా చిత్రీకరించారు. పోనీ పురాణాలు,ఇతిహాసాలలో అలా వ్రాసుందా అంటే అదీ లేదు. వాల్మీకి రామయణంలోనే వనవాసం రోజుల్లో రాముడికి మీసాలున్నాయని అనుకోవటానికి ఆధారాలున్నాయి. అరణ్యకాండలో, బంగరులేడిగా రుపుదాల్చకముందు రావణుడికి హితబోధ చేస్తూ మారీచుడు,' శ్రీరాముడు మీసాలు గెడ్డాలు రాని పన్నెండేళ్ళ ప్రాయంలోనే ఒక్క బాణంతో తనను కొన్ని యోజనాల అవతల పడేలా కోట్టాడ'ని చెబుతాడు.ఇక ప్రముఖ సాహితీవేత్త, చరిత్రకారులు కీ.శే.సురవరం ప్రతాపరెడ్డిగారైతే భగవద్గీత బోధించేనాటికి శ్రీకృష్ణుడి వయస్సు దాదాపు ఎనభై యేళ్ళని లెక్కగట్టారు. అలాగే శ్రీరాముడు దాదాపు పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అవతార స్వరూపుడైనా,నరుడిగా ప్రవర్తిస్తూ ధర్మబద్ధంగా గడిపిన రాముడు కూడా ఏ చిత్రపటంలోనూ మీసాలతో కనిపించడు. రవివర్మ లాంటి చిత్రకారుల చిత్రాలే కాదు,ప్రాచీన శిల్పులు మలచిన శిల్పాలు సైతం అలానే ఉన్నాయి. దీనికి కారణాలేమిటో తెలియదు. ఆగమశాస్త్ర నియమాలేమైనా దేవుళ్ళకు మీసాలు,గెడ్డాలు నిషేదించాయేమో తెలియదు. వేదాలేమైనా ఈ ప్రస్తావన చేశాయా అంటే అదీ అనుమానమే. విజ్ఞులైన చదువరులు ఈ విషయమై సమాచారాన్ని పంచుకుంటే సంతోషిస్తాను.

ఈ లోగా రెక్కలు,కాళ్ళు తెగి రక్తమోడుతున్న 60వేల సంవత్సరాల వయోవృద్ధుడు జటాయువును పరామర్శిస్తున్న మీసాల రామలక్ష్మణులను ఇక్కడ చూడండి.






కాంగిరెస్సు ఎమ్మెల్యే సిరంజీవి..నాదో ఇన్నపం




య్యా! నాయనా ! సిరంజీవి బాబు ! దండాలు సామీ  దండాలు. నా పేరు రంగన్న. 'ఎవుడ్రా ఈడు నా మానాన నేనుబోతా ఉంటే కాళ్ళకు సుట్టుకున్నాడు' అనుకోవద్దు. నేను నీకు తెలియదేమో . నాకు నువ్వంటే పేనం. ఒక్కనాకే గాదు, నాకు నా పెళ్ళాం బిడ్డలకూ నువ్వంటే మా సెడ్డ ఇట్టం.నా కొడుక్కైతే సెప్పనక్కరలేదు. బుడంకాయంత కాణ్ణుంచి ఆడు నీ సినేమాలు, డాన్సింగులు, పైటింగులు సూసి ఎర్రెక్కిపోయినోడు. ఏం సినిమాలు! ఏమా కత !

సాలెంజి సినిమాలో సంపాయించిన దుడ్డంతా రావుగోపాల్రావు మొకాన గొట్టి వీరోయిన్ని పెండ్లి సేసుకున్నప్పుడు టాపు లేచిపోయేలా సప్పట్లు గొట్టాం. రుద్రయీన సినిమాలో కన్నతండ్రిని, కమ్మని పాటని, కాబోయే పెండ్లాన్ని వొదిలేసి ఊరిబాగు కోసం పాటుపడితే సెబాసో అని పొంగిపోయినాం. ఠాగూరులో అవినీతి, అక్కరమం నేలమట్టం సెయ్యాలని పిల్లకాయల్ని ఎంటేసుకొని పెద్ద ఉద్దెమం  సేసినప్పుడు ఈరో అంటే ఈడు, సినిమా అంటే ఇది అని సంబరపడిపోయినాం .

గొప్ప గొప్ప ఏశాలేసి, డవిలాగులు సెప్పినోడు సొంతంగా పార్టీ పెడతాండాడంటే  నా కడుపులో పాలుపోసినంత ఆనందపడిపోయినా. పెజలే రమ్మంటున్నారని నువ్వంటే ఉబ్బితబ్బిబైపోయి ఉండబట్టలేక పక్కింటి కోటేశుని, ఎనకింటి యలమందని,ముందింటి మునికిష్టయ్యని, ఆఖరికి మా ఊరి సర్పంచి బుల్రెడ్డిగారి పుల్రెడ్డిని .. ..అందరినీ 

నిలబెట్టి వరసగా అడిగేసినా మీరు గానీ పిలిసినారా అని. అప్పుడాళ్ళు సూసిన సూపులకి అర్థం ఇప్పటిదాకా బోధపడకుండా ఉంది. తిరప్తిలో మీటింగు పెడితే ఆకుచెప్పులేసుకొని ఊళ్ళూ ఏళ్ళు దాటి, బస్సులూ బళ్ళూ ఎక్కి మీటింగుకోచ్చినా. అడ్డెడ్డెడ్డే ఏం జనం ..ఏం జనం! మా ఊరి తిరనాళ్ళక్కూడా అంత జనం సూడలేదు. ఒకరి మీదొకరు కుక్కేసుకొని, నెట్టేసుకొని ఎగపడిపోతా ఉంట్రి. నిలబడేదానికి కూడా సోటులేకపాయె.ఎట్టో ఒకట్ట ఒంటి కాలుపై నిలబడి నీ మాటలు ఇన్నా. గెంజి-బెంజి సూసినోడు గదా గొడుగులా మమ్మల్ని కాస్తాడనుకొన్నా. సామజిక నేయమంటా నువ్వేదో  పెద్ద మాటలు మాట్టాడితే నాకర్థం కాకపోయినా పెద్దోల్ల మాటలు  అట్టాగే ఉంటాయనుకొని సరిపెట్టుకొని ఈలలేసి సంతోషపడిపోయినా. నిలబడి నిలబడి కాళ్ళు పీకేసి పట్టుదప్పి  పోలీసోడి మీద పడితే ఆడు గుడ్లురుమి, గబుక్కున లాఠి లేపి గొడ్డుని బాదినట్టు బాదేసినాడు. ఆరోజు ఆడికి ఎదురు లేకుండా పోయింది. నాకు దిక్కు లేకుండా పోయింది. రెక్కలు తెగిన పచ్చిలాగ వారంరోజులు  గవుర్నమెంటాసుపత్రిలో పడిపోతే నా ఇంటి ఆడది రెక్కల కట్టం చేసి నా పిల్లల నోట్లో ఇంత అంబలి పోసింది. ఆ రోజులు తల్సుకుంటే నాకు వొళ్ళు మానైపోతుంది.

పార్టిపెట్టినాక నడుపోడు, సివరోడు కలిసి నీ గురుంచి బాగా సెప్పిరి. సొర్రాజ్జెమొచ్చి ఇన్నేళ్ళయ్యాక ఇంత గొప్ప నాయకుడొచ్చినాడని  సెవులు తుప్పొదిలేలా ఊదరగొట్టేసిరి. పంచెలూడదిస్తాం, పెజారాజ్యం తెస్తాం అని శివాలు పోతిరి. నేను కూడా పచ్చ జెండాలు పాతి, కూలోల్లకి మిఠాయిలు పంచినా. కూలినాలి సేసుకొనే నా కొడుకు, పార పలుగు పారేసి మీ ఎనకంబడి తిరిగి అతిగతీ లేకుండా పోయినాడు. ఇట్టాగాదని ఒక రేత్రి ఆడు పార్టీ జీపేక్కబోతా ఉంటే రెక్కలు బట్టుకొని దూరంగా లాక్కెళ్ళి ' ఏందిరా సిన్నోడా, పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారంట. ఏరే పార్టిలో ఉన్న సెడ్డోళ్ళంతా మన పార్టీలోకొస్తే మన పార్టీ సెడ్డదవదా ? ' అని గింజుకున్నా. 'అయ్యన్నీ గిట్టనోళ్ళు సెప్పే కతలు.నీకర్థం కాదులే'  అని ఆడు పరుగుని దులిపినట్టు దులిపేసి ఎల్లిపోయినాడు. సడేలే లోకులు కాకులంజెప్పి నా మనసు నిమ్మతిగా ఉంచుకున్నా. ఎవురెన్నిమాటలు సెప్పినా, మార్పు తెస్తానన్న నీ మాటల్నే నమ్మినా.గాంది మాహత్‌ముడు తప్ప నీ ఎనకాల పుటోలోనున్న మిగతా వాల్లెవురో తెలీకపోయినా నీ మీద అభిమానంతో నీకే వోటు గుద్దినా.

కానీ సిరంజీవి, నువ్వు సేసిందేది ? మమ్మల్ని నిలువునా ముంచేస్తివే.  ఏ పార్టీకి ఎతికేరంగా పార్టీబెట్టినావో అదే పార్టీలో సేరిపోయి మమ్మల్ని రాతికూశాల మాదిరిగా మాటల్లేకుండా నిలబెట్టేస్తివే. తిండీతిప్పలు లేకుండా నీ ఎంబట తిరిగిన నా కొడుకు ఇప్పుడు  మిన్నువిరిగి మీదపడిపోయినట్లు దిక్కులు సూస్తా ఉండిపోయినాడు. మొన్న ఎలచ్చన్లలో కాంగిరెస్సోళ్ళు, నాకొడుకు నెత్తురొచ్చేటట్టు కొట్టుకున్నారు. డిల్లీలో సాగిలపడి పైకి లేచి సొక్కా దులుపుకొని, కులాశాగా నువ్వు సేతులు కలిపేసినావు గానీ ముకాన నవ్వు పులుముకొని మేమిక్కడ భుజాలు రాసుకొని తిరగేదెట్టా?  రెంటికీ సెడ్డ రేవడి అయిపోయినాయి మా బ్రతుకులు. ఎలచ్చన్లలో నువ్వు ఓడిపొయినప్పుడు, పార్టీకి సీట్లు రానప్పుడు ఇంత బాధవలేదు గానీ ఇప్పుడవుతాఉంది. ఇంత ఘోరంగా ఒక ఈరో పెట్టిన పార్టీ ఎగస్పార్టీలో కలిసిపోలేదని అంతా అంటా ఉంటే తలకొట్టేసినట్లుంది.(ఆడెవుడో అరవహీరో అంట,ఆడి పార్టీ మొత్తానికి ఆడొక్కడే గెలిసాడంట.ఆ పార్టీ ఇంకా ఉంది.మన పార్టీకి మాత్రం నూకలు సెల్లిపొయినాయి ). జెండా పీకేస్తున్నారని పేపరోళ్ళంటే మా గొంతు నొక్కేస్తున్నారని దబాయిస్తివి. ప్లీనరీ సమావేశాల్లో కూడా అదే సెప్పి ఆర్నెళ్ళు తిరక్కుండానే  మాట మార్చేస్తివి. దీనికంటే ' నాకు సేత కాలేదు,బుద్ధిగా సినిమాలు సేసుకుంటా' అనుంటే కొంచెం పరువుండేది. మాట నిలకడ, మనసు నిలకడ లేని మడిసి ఎంట  మేం నడవలేం సామీ. తెర మీద బ్రతుక్కి, తెర వెనుక జీవితానికి ఇంత అంతరముందని ఇప్పుడే తెలిసొచ్చినాది. లెంపలు ఏసుకుంటాన్నా.

అయినా నాక్కొన్ని అనుమానాలుండిపాయే..


  • నువ్వు దేనికోసం పార్టీబెట్టినావు? మంత్రి పదవికోసమా, పెజాసేవ కోసమా?
  • మంత్రి పదవే అయితే ఏ పార్టీవోడైనా నీకు పిలిచి సీటిచ్చేవోడు. పార్టీ పెట్టి నువ్వు సాధించిందేంది?
  •  కాంగిరెస్సు పార్టీలో అప్పుడు కనిపించంది నీకిప్పుడు ఏం కనిపించింది ?
  • సివరగా సామాజిక నాయమంటే ఏంది? (మా బాబువు కదూ..ఈ ఒక్క దానికి జవాబియ్యి సాలు. ఎవుడ్ని అడిగినా నవ్వుతా ఉండారు గాని ఒక్కడూ సమాధానం సెప్పడంలా)



బహిరంగ ప్రేమ ప్రదర్శన

మొన్నా మధ్య  బాబాయ్ వరుస బంధువొకరు పని మీద బెంగుళూరు వచ్చి కొన్నిరోజులున్నారు. ఉత్తినే తిని తొంగుంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఏటుంటది అనుకున్నారేమో,పనైపోయాక  ఓ సాయంకాలం ఖాళీగా ఉంటే, చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయి  బ్రిగేడ్ రోడ్, ఫోరం లాంటి ప్రదేశాలు చుట్టేసి ఈసురోమంటూ కాళ్ళీడ్చుకుంటూ వచ్చారు.వచ్చిన దగ్గర్నుంచీ ఒకటే రుస రుస.సంగతేమిటా అని ఆరా తీస్తే public display of love and affection  అట.అంటే  బహిరంగంగా ప్రేమను ప్రదర్శించటం అన్నమాట.

మా బంధువు కొంచెం పాతకాలం మనిషి. స్త్రీ, పురుషుల మధ్య ఉండే రొమాంటిక్ రిలేషన్ ఏదైనా ఇంటి నాలుగ్గోడల మధ్య ఉండాలి గానీ అందరికీ బహిర్గతమవ్వకూడదని ఆయన ప్రగాఢ విశ్వాసం. మన సంస్కృతి మనకు గుట్టుని నేర్పిందని, అనాది నుండి అదే మన జీవన విధానమని ఆయన గట్టి నమ్మిక. అందరి ముందు గట్టిగా వాటేసుకోవటం, ముద్దులు పెట్టుకోవటం మన నాగరికత కాదని, పాశ్చాత్య పోకడలన్నీ వచ్చి మనదేశాన్ని బ్రష్టుపట్టిస్తున్నాయని ఆయన వాపోతారు. బహిరంగ ప్రదేశాల్లో కపుల్స్ ఎవరైనా ఒకరి నడుముల మీద మరొకరు చేతులు వేసుకొని సినిమాల్లో హీరో హీరోయిన్లలా కలల్లో తేలిపోతున్నట్టు తదాత్మ్యంతో నడుస్తూంటే ఆయన ఆశ్చర్యంతో నోరువెళ్ళబెడతారు. సన్నిహితంగా ఎవరైనా కనిపిస్తే ఊపిరిబిగబట్టేసి హైరానా పడిపోతారు. 'వీళ్ళందరికీ ఇదేం పోయేకాలం.ఈ వేషాలేవో ఇంటిదగ్గర వేయచ్చుగా? ఇలా అందరుముందూ నగుబాటు కావడం ఎందుకు' అని విసురుకుంటారు.

"ఇందులో తప్పేముంది? మీ జనరేషన్ వేరు. ఈ జనరేషన్ వేరు. ఇప్పుడంతా స్పీడ్‌యుగం. మీకాలంలో ఉన్నట్లు నెమ్మదిగా శాంతంగా ఉండమంటే ఎలా సాధ్యం? ఆలుమగలయితే మాత్రం అందరి ముందు అంటీ అంటనట్లు ఉండాలా?  టీనేజ్‌ ప్రేమికులే వొళ్ళుపై తెలియకుండా తిరుగుతున్నారు. ఆలుమగలు చేతులు పట్టుకుంటే తప్పేమిటి? ఎవరో ఏదో అనుకుంటారని  భార్యాభర్తలు బయట ఎడమొహం పెడమొహంగా ఉండాలా? వాళ్ళేమీ  నేరం చెయ్యటం లేదు కదా?"  అని నా స్నేహితుడు అడిగితే గయ్యుమంటూ ఇంతెత్తున పైకి లేచారు . "టీనేజ్‌లో ఉన్నవాళ్ళకి యుక్తాయుక్త విచక్షణ ఉండదు. తల్లితండ్రులకి తెలియకుండా చాటుగా తిరుగుతూంటారు కాబట్టి, థ్రిల్ల్ కోసమో, మరి దేనికోసమో అలా చేస్తూండవచ్చు.ఆలుమగలు అలా కాదు కదా. వాళ్ళు చట్టబద్ధంగా ఒక్కటైన వాళ్ళు. నువ్వు నీ భార్యతో అన్యోన్యంగా ఉన్నావన్న విషయం నీ భార్య గుర్తిస్తే చాలు. ప్రపంచం అంతా గుర్తించాల్సిన పని లేదు. అది వాళ్ళకు అనవసరం కూడా. ఇంట్లో ఏనాడూ అప్యాయత చూపని నువ్వు, బహిరంగ ప్రదేశాలలో భార్యపై వాలిపోయి ఉపయోగమేమిటి? ఇదంతా వొఠ్ఠి నటన. అశాశ్వతం.పీడాకారం సినిమాలు చూసి వాటిని అనుకరించే ప్రయత్నమే కానీ అందులో నిజాయతీ ఏది. భార్యని నిజంగా ప్రేమిస్తూ ,ఆమె గౌరవాన్ని కోరుకునేవాడు ఇలా నలుగురి దృష్టి ఆమె మీద పడేలా చేస్తాడా?" అని దబాయించారు.నా స్నేహితుడు కూడా తన వాదనలు వినిపించాడు.నేను మౌనంగా వింటూ కూర్చున్నాను.


ఆయన వెళ్ళిపోయిన కొన్ని రోజులకి నా మిత్రుడు మళ్ళీ తారసపడాడ్డు. మాటల సందర్భంలో నవ్వుతూ ఒక విషయం చెప్పాడు. అతని భార్య ఫేస్‌బుక్, ఆర్కుట్ లాంటి సోషల్‌ నెట్వర్కింగ్ సైట్స్ తరచుగా చూస్తుందట. విదేశాల్లో స్థిరపడిన ఆవిడ స్నేహితురాళ్ళు ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు తమ భర్తలను గట్టిగా వాటేసుకొనో లేక, ముద్దులు పెట్టుకుంటూనో ఫోటోలు తీసుకొని వాటిని గర్వంగా షేర్ చేస్తుంటారట. అవి చూసిన ప్రతిసారి ఇతని భార్య కూడా మీరెప్ప్పుడైనా అలా రొమాంటిక్‌గా నాతో ఫోటోలు దిగారా? కనీసం పబ్లిక్‌గా భార్యమీద చెయ్యైనా వేశారా అని వేళాకోళం చేసేదట. మొదట్లో సరదాగా తీసుకున్న నా మిత్రుడు,భార్య నిజంగానే  బాధపడుతోందేమోనని  అనుమానించి ఒకరోజు  బజార్లో నడిచి వెళ్తూంటే ఆమె భుజం మీద చెయ్యి వేశాడట. అతని భార్య తెగ కంగారుపడిపోయి ' ఏమిటా రౌడీ వేషాలు, ఎవరైనా చూస్తే బావోదు. చెయ్యి తియ్యండి ' అని కసిరిందట.

నాకు నవ్వాగలేదు.


సినిమాల్లో మా సీనియర్





యన నాకు సీనియర్.మంచి ఒడ్డు పొడవు.చూడ్డానికి హీరోలా ఉంటాడు.కాలేజ్‌లో ఉన్నప్పుడే మోడలింగ్ చెయ్యాలని కలలు కనేవాడు.యాక్టర్ కాకపోయుంటే డాక్టర్ అయ్యేవాళ్ళమని తారలు చెప్పే కబుర్లు చెప్పాల్సిన అవసరం తనకి లేదు.ఎందుకంటే తను నిజంగా డాక్టరే .విదేశాల్లో ఎం.బి.బి.యస్ పూర్తి చేశాక హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో వైద్య వృత్తిని నిర్వహిస్తూ తన ప్రయత్నాలు కొనసాగించాడు. హాస్పిటల్‌కు వచ్చే సినీపరిశ్రమకు చెందిన వ్యక్తుల కళ్ళల్లో పడటంతో అతని పంటపండి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.మొదట్లో కొన్ని వేషాలు వేసినా జగపతిబాబు హీరోగా వచ్చిన సిద్ధం  అతనికి మంచి గుర్తింపునిచ్చింది.కమలహాసన్, వెంకటేష్, మోహన్‌లాల్ లాంటి ప్రముఖ నటులతో కలిసి పని చేసే అదృష్టం వరించింది. (ఈనాడు, ఈనాడు తమిళ్ వెర్షన్ ఉన్నైపోల్ ఒరువాన్ ). మంచి నటుడిగా మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు అక్కినేని నాగార్జున నటించిన గగనం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.



గగనం గురుంచి ప్రత్యేకంగా చెప్పటానికి ఒక కారణం ఉంది.అక్కినేని నాగార్జున తన అభిమాన కథానాయకుడు. చిన్నప్పుడు ఏ హీరో చిత్రాల కోసం కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూశాడో, క్యూలైన్లో నిలబడి ఎగబడి చూశాడో అదే హీరో పక్కన తనూ ప్రధాన పాత్రలో నటించే అవకాశం రావటం సామాన్యమైన విషయం కాదు. వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో వర్ణించే ఉదాహరణలకు ఏ మాత్రం తీసిపోని పరిణామక్రమం ఇది. ప్రతిభ,పట్టుదల ఉంటే ఆకాశమే హద్దనే విషయాన్ని భరత్‌రెడ్డి మళ్ళీ నిరూపించాడు.

Hats off to him and wishing him all the best in his future endeavors


ఎవర్రా బాబు ఈ బుక్‌ని కంపోజ్ చేసింది ?

మా పాప నర్సరీ బుక్‌లో English Alphabets ‌కి ఇచ్చిన పదాలు ఇవి.







I  for INSPECTOR, INCH TAPE
M for MICROPHONE, MOUSE
U for UNDERWARE, UNCLE
W for WAITER
Y for YOUTH


ఎవర్రా బాబు ఈ బుక్‌ని కంపోజ్ చేసింది ? Y for YOUTH అంటే ఏం వివరిస్తాం అంత చిన్న పిల్లలకి? ఇన్స్‌పెక్టర్, మౌస్, మైక్రోఫోన్, అండర్వేర్ ..ఇంత కంటే మంచి పదాలు దొరకలేదా  ఆ Alphabets కి ? అందరికీ అర్థమయ్యే ICE CREAM , INK BOTTLE, MANGO, MUG లాంటి పదాలుండగా వాటిని వదిలేసి  కఠిన పదాలతో పుస్తకాలను తయారు చేసి వాటిని పిల్లలపై రుద్దే ప్రచురణకర్తలను, పాఠశాల యాజమాన్యాలని ఏమనాలో అర్థం కావటం లేదు.