• మెరిసే మేఘాలు

    మెరిసే మేఘాలు
  • కురిసే వర్షాలు

    కురిసే వర్షాలు
  • విరిసే పుష్పాలు

    విరిసే పుష్పాలు
  • మురిసే భువనాలు

    మురిసే భువనాలు
  • నాకు

    నాకు
  • కదిలే కావ్యాలు

    కదిలే కావ్యాలు

శ్రీవాణీ వీణాజనితం

నాకు బాగా నచ్చిన సంగీత దర్శకులలో ఎం.ఎస్.విశ్వనాథన్ ఒకరు. కే.బాలచందర్ ఎం.ఎస్.విశ్వనాథన్ కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. అంతులేని కథ ,ఇది కథ కాదు ,గుప్పెడు మనసు, మరోచరిత్ర, ఆకలిరాజ్యం, కోకిలమ్మ మచ్చుకు కొన్ని. వీటిలో కోకిలమ్మ సినిమాలోని ఒక మంచి పాట గురుంచే ఈ టపా (మొదట పాట వినాలనుకున్న వాళ్ళు చివరి వాక్యానికి వెళ్తే లింకు దొరుకుతుంది).



1983లో విడుదలైన కోకిలమ్మ లో సరిత ప్రధాన పాత్ర పోషించారు.  ఈ సినిమా సమాచారం కోసం, వీడియో కోసం చాలా వెదికాను కానీ ఎక్కడా దొరకలేదు. చూడాలనుకున్నా అవకాశం రాక చూడలేకపోయిన సినిమాల్లో ఇదొకటి.  అంతర్జాలంలో యూట్యూబ్ లింకులు కొన్ని దొరికాయి కానీ ఆవీ పాటలకు సంబంధించినవే.  టైటిల్‌ని బట్టి కథానాయిక ప్రఖ్యాత గాయకురాలై ఉంటుందని ఊహించాను. యూట్యూబ్‌లో నాలుగు పాటలు  చూశాక నా అంచనాలు తప్పని అర్థమయ్యింది. బాలచందర్ సినిమాల్లో పాటలు  కథతో పెనవేసుకొని అర్థవంతంగా ఉంటాయి కాబట్టి స్టోరీలైన్ సులభంగానే బోధపడింది. అలాగే బాలచందర్ అంటేనే సీరియస్ సినిమాలు కాబట్టి, వాటిలో సుఖాంతాలు తక్కువే కాబట్టి నేనూహించుకున్న స్టోరీలైన్‌కి ఒక ట్రాజెడీ ముగింపుని జోడిస్తే కథ చిక్కుముడి తేలిగ్గా విడిపోయింది. 


కోకిలమ్మ (సరిత) ఒక పనిపిల్ల. తనలాగే నిరుపేదైన కథానాయకుడికి (రాజీవ్) ఆసరాగా నిలబడి అతని అభ్యున్నతికి ఎంతో సహాయం చేస్తుంది. అతను పెద్ద గాయకుడై ఎదిగి తన మూలాలు మరచిపోతాడు. ఒక గొప్పింటి అందమైన అమ్మాయి (స్వప్న) ప్రేమలో పడి కోకిలమ్మకు దూరంగా మెలగుతాడు. విషయం తెలుసుకున్న  కోకిలమ్మ నిస్వార్థంగా తప్పుకొని త్యాగం చెయ్యటంతో కథ  సమాప్తమవుతుంది.




ఈ చిత్రానికి కోకిలమ్మ అని పేరు పెట్టటంలో దర్శకుడి నేర్పు కనిపిస్తుంది. కోకిల నల్లగా అందవిహీనంగా ఉంటుంది. పుట్టక ముందే తల్లి తెచ్చి తనను కాకుల గూడులో విడిచిపెడుతుంది. కాకుల మధ్య కాకిలా పొదగబడ్డ కోయిల, కాకిపిల్లలతో కలిసి  తొలుత కాకిలానే ప్రవర్తిస్తుంది, అరుస్తుంది. క్రమంగా కూయటం అనే తన ప్రత్యేకత అవగతమయ్యాక, తన స్వరూపాన్ని గ్రహించి వేరుపడి వెళ్ళిపోతుంది. కథానాయిక కోకిలమ్మ కూడా అంతే. తనకంటూ ప్రత్యేకమైన స్వచ్ఛమైన మనసున్నా,కమ్మని పాటలు పాడగల నేర్పున్నా, కాకుల్లాంటి లోకులకు పరిచర్యలు చేస్తూ అవకాశవాదైన మరో కాకి లాంటి వ్యక్తిని ప్రేమిస్తుంది. చివరికి అతని నిజస్వరూపం గ్రహించి తనే తప్పుకొని వెళ్ళిపోతుంది.

కోకిలమ్మ అనగానే చాలా మందికి 'పల్లవించవా నా గొంతులో' అనే ఫాట గుర్తొచ్చినా, మిగతా పాటలూ చాలా బావుంటాయి. శ్రీవాణీ వీణాజనితం అలాంటి ఒక ఆణిముత్యం. మనసుకవిగా చిరపరిచితులైన ఆచార్య ఆత్రేయ ఈ పాటకు గేయరచన చేశారు . పాడినవారు పి.బి.శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈ పాట సందర్భం తెలియదు కానీ వింటూంటే, సంగీతం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ సభలో కథానాయకుడు పాడిన పాటలా అనిపిస్తుంది.


పి.బి.శ్రీనివాస్ గాత్రంతో పాట మొదలవుతుంది.

మధురం మధురం నాదం
అది అమరం అమరం వేదం
నాదం గానం సామం
స్వరకలితం లలితం రమ్యం

నాదం అంటే సంస్కృతంలో శబ్దతరంగం, జగత్సంబంధమైన స్పందనం అనే అర్థాలున్నాయి. అలాగే క్రమబద్ధమైన మధురమైన శబ్దం అని కూడా అర్థముంది . అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లుతో, అపసవ్యమైన జీవన విధానాలతో , విపరీతమైన మానసిక  శారీరక ఒత్తిళ్ళతో అతలాకుతలమయ్యే హృదయాలను, సేదతీర్చి, సత్తువనిచ్చే శక్తి నాదానికి ఉంది. వేదానికి మరో పేరు శృతి. నేరుగా వినడం ద్వారా బహిర్గతమైనవి కనుక శృతులంటారు. ఆ వేదాలలో ఉన్నవి మంత్రోచ్ఛాటనలు, శ్లోకాలు, స్తోత్రాలు .జీవాత్మలో పరమాత్మలా ఆ మంత్రోచ్ఛటనలు, శ్లోకాలు, స్తోత్రాలలో దాగున్నది స్వరాలతో సమ్మిళితమైన లలితమైన రమ్యమైన నాదమే.  క్రమపద్ధతిలో వినిపించే నాదం మనస్సుని పట్టి ఉంచి, ఏకాగ్రతని పెంచి, బుద్ధిని వికసింపజేసి శరీరాన్ని అమరం చేస్తుంది. అందుకే నాదం అమరం. నాదాలతో నిండిన వేదం అమరం. 

 శ్రీవాణీ వీణాజనితం సురలోక మౌని సరితం
అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం
అమితం అమృతం నిరతం
శిశు పశు ఫణి సహితం విదితం
శౌకం  మధ్యమదూతం
త్రైకాల సంచారం

ఓంకార నాదం వైశిష్ట్యాన్ని తెలిపే పల్లవి ఇది. ఇందులో నాకు అర్థం కాని కొన్ని వాక్యాలున్నాయి. నాకు తెలిసినంతలో విశ్లేషించటానికి ప్రయత్నిస్తాను. అకార (సృష్టి- బ్రహ్మ) ఉకార (స్థితి- విష్ణు) మకారాల (లయ-మహేశ్వరుడు) కలయికే ఓంకారం. అది ఆద్యంతాలు లేని ప్రణవ నాదం. అంటే అంతమూ, ఆరంభమూ రెండూ లేవన్నమాట. అన్ని శబ్దాలకి మూలమిదే. అటువంటి ఈ నాదాన్నే స్వర్గలోకంలో ఉన్న మహర్షులు, బ్రహ్మర్షులు నిత్యం స్మరిస్తూ బ్రహ్మానందం అనుభవిస్తూంటారు. (నా దగ్గరున్న శబ్దరత్నాకరంలో ' సరితం' అనే పదం లేదు. ఆంధ్రభారతి పదకోశంలో సరితం అంటే చరితం అని ఉంది. అలాగే ' సరిత్ ' అంటే నది అనే అర్థముంది. ఈ అర్థాన్ని స్వీకరిస్తే సురలోక మహర్షులు స్నానమాడి పునీతమయ్యే నది లాంటి ప్రణవనాదం అనుకోవాల్సి వస్తుంది )

ఓంకారానికి ఆద్యంతాలు లేవనుకున్నప్పుడు శ్రీవాణీ వీణాజనితం (సరస్వతీదేవి వీణలోంచి జన్మించినది) అనడం తప్పేమో అనిపించింది. అంతర్జాలాన్ని శోధిస్తే సంగీత రత్నాకరం ప్రకారం వీణ(సంగీత వాయిద్యం) దేవతలకు ఆవాసమని, మెడలో మహేశ్వరుడు, తీగలలో పార్వతీ దేవి, వాటిని పట్టి ఉంచుతూ లక్ష్మీదేవి, యాళిలో (పౌరాణిక జంతువు మెడ ఆకారం) విష్ణువు, రెండవ సొరకాయబుర్రలో బ్రహ్మ, ప్రతిధ్వనించే నాదంలో సరస్వతీదేవి కొలువై ఉంటారని  తెలిసింది. సరస్వతీదేవి చేతిలో ఉంటుంది కాబట్టి సరస్వతివీణ అని కూడా అంటారు. సరస్వతికి మరోపేరు శ్రీవాణి. ముగ్గురమ్మలు, త్రిమూర్తులు కలిసి కొలువై ఉన్న చోట ప్రణవనాదమైన ఓంకారమేగా వినిపిస్తుంది. కాబట్టి శ్రీవాణీ వీణాజనితం అన్నమాటకు లెక్కసరిపోయింది. పశువులకు,శిశువులకు, పాములకు సైతం తెలిసిన సంగీతం, పక్షుల కూతల్లో   మధ్యమస్వరంలో రాయాబారాలు నడుపుతూ(శౌకం అంటే శుక సమూహం,శుకం అంటే చిలుక, మధ్యమం సరిగమపదనిలో ఒక స్వరం, దూతం అంటే  రాయబారి)   అమితమైన అమృతంలా త్రికాలాల్లో(భూత,భవిష్యత్,వర్తమాన)   నిరంతరం ఉంటుందని ఆత్రేయ గారి భావమనుకుంటాను.

మామూలు వెదురే మాధవ మురళియై రాగాల సుధలే చిలికినది
త్యాగయ్య గళమై అన్నయ్య పదమై వాగ్గేయ సిరులే కురిసినవి
గీతం కవితా హృదయం
సంగీతం జనతా హృదయం
రాగం తానం మకుటం
త్రైమూర్తి రూపం

మొదటి చరణంలోని పై వాక్యాలకు పెద్దగా వివరణ అక్కర్లేదనుకుంటాను. మొదటి వాక్యం నాకు బాగా నచ్చింది. సాధారణమైన వెదురుబొంగు శ్రీకృష్ణుని చేతిలో పడి సుమధురగీతాల సుధల్ని కురిపించిందంటే అది భగవంతుని అనుగ్రహ విశేషమే కదా. ఇదే అర్థమిచ్చేలా  వేటురి గారు ఏదో ఒక పాటలో చిన్న వాక్యం వ్రాసినట్లు గుర్తు. సమయానికి గుర్తురావటం లేదు. అన్నయ్య అంటే అన్నమయ్య . మాములుగా రాగం, తానం, పల్లవి అంటూంటాం. ఇక్కడ పల్లవి బదులు మకుటం అనే పదం వాడారు . మకుటం అంటే కిరీటం. పాటకు మకుటం పల్లవే కదా. ఈ మూడింటినీ త్రిమూర్తులతో పోల్చారు ఆత్రేయ.

జయదేవ కవితై, గోవింద గీతై పద్మావతేగా పలికినది
ప్రియురాలి శోకమే తొలికావ్య శ్లోకమై శ్రీరామ చరితై నిలచినది
తీరని దాహం గానం
కడతేర్చే జ్ఞానం గానం
రాగం మోదం మోక్షం సంగీత యోగం

జయదేవుడు 12వ శతాబ్దానికి చెందికి ఒక ప్రముఖ కవి. ఆయన భార్య పద్మావతి. ఇద్దరూ అన్యోన్య దంపతులు, పూరీ జగన్నాథస్వామి సేవకులు. జయదేవ కృతులలో గీతాగోవిందం అనే కావ్యం చాలా ప్రసిద్ది కెక్కింది. రాధాకృష్ణుల శృంగారాన్ని వర్ణిస్తూ వ్రాసిన వాటిని అష్టపదులంటారు. ఈ అష్టపదులలో పద్మావతి పేరు అనేక మార్లు దొర్లుతుంది. పద్మావతీ చరణ చారణ చక్రవర్తీ, పద్మావతీ రమణ..ఇలా. అది తన భార్యపై జయదేవునికున్న మమకారానికి గుర్తు. జయదేవుడు వ్రాసి స్వరపరిచిన ప్రతి అష్టపదిని పద్మావతి తన అపూర్వమైన నృత్య ప్రతిభతో స్వామి సన్నిధిలో అభినయించి చూపేది.

క్రౌంచ పక్షుల జంటను వేటాడి, వాల్మీకి కోపానికి గురై తద్వారా తొలిశ్లోక రచనకు కారణభూతుడౌతాడు ఒక బోయవాడు. ఆ శ్లోకమే శ్రీమద్రామాయణ మహాకావ్య రచనకు శ్రీకారం చుడుతుంది.  గానం ఒక తీరని దాహమే కాదు, జ్ఞానం ప్రసాదించి సంతోషాన్ని,విముక్తిని కలిగించేది కూడా అంటూ ఈ చరణం ముగుస్తుంది. వాల్మీకి నుంచి జయదేవుని వరకు, త్యాగయ్య నుంచి అన్నమయ్య వరకూ నాదోపాసకులంతా అలా సంగీత సుధాంబుధిలో తేలియాడి స్వరపరమాత్మలో లీనమై శాశ్వతులైన వాళ్ళే .మనసుకవి ఆత్రేయలో మరో పార్శ్వాన్ని ఆవిష్కరించిన  ఈ పాటను ఇక్కడ వినండి.





పెట్రోలు రాజకీయాలు..కాదంటారా ?!



నం నెత్తిన మళ్ళీ పెట్రోబాంబు పడింది. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 7.50 రూపాయిలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నింగినంటిన నిత్యావసర వస్తువుల ధరలకు నిచ్చెన వెయ్యలేక కాళ్ళు విరగొట్టుకున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది పిడుగుపాటు. షరా మాములుగా సవరించిన ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా వినియోగదారులంతా పెట్రోల్ పంపుల ముందు బారులు తీరి బూతులు తిట్టుకుంటూ నానా అవస్థలు పడ్డారు.   రాజకీయాలను బాగా వంటబట్టించుకున్న చమురు కంపెనీలు ధరల పెంపుదల విషయాన్ని సాయంత్ర వేళ బహిర్గతపరచి ప్రతిపక్షానికి వెనువెంటనే ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు చేసుకునే అవకాశం లేకుండా చేసి కొంతవరకూ సఫలీకృతమైనా, పెంచిన ధరల విషయంలో అవి ఎంత వరకూ తమ మాట నిలబెట్టుకుంటాయో వేచి చూడాలి. డీజల్ ధరను 5 రూపాయల వరకు, గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయల వరకు పెంచే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. ఇంధన ఛార్జీలు పెంచితే రవాణా ఛార్జీలు తడిసి మోపెడై నిత్యావసర వస్తువుల ధరలు మరింత ప్రియమవుతాయి. పెనంలోంచి పొయ్యిలోకి పడినట్లవుతుంది అప్పుడు పరిస్థితి. ఏతావాతా సగటు మనిషి కష్టాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

 సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 73.14 రూపాయిలు. ఆ ధర నిర్ణయింపబడే క్రమం ఇంచుమించుగా ఇదీ .

అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక బ్యారెల్ ముడిచమురు ధర 106.02 డాలర్లు అనుకొందాం (ప్రస్తుత రేటు)


1 బ్యారెల్ = 106.02 డాలర్లు
1 డాలరు = 55.39 రూపాయిలు.


1 బ్యారెల్ = 106.02 * 55.39 = 5872.44 రూపాయిలు

1 బ్యారెల్ = 158.97 లీటర్లు

1 లీటరు = 36.94 రూపాయిలు (5872.44 / 158.97)
 
ఎక్సైజ్ డ్యూటీ      = 14.45 రూపాయిలు

ఎడ్యుకేషన్ టాక్స్ = 0.43 రూపాయిలు
డీలర్ కమీషన్     = 1.05 రూపాయిలు
రిఫైనింగ్               = 0.52 రూపాయిలు
క్యాపిటల్ కాస్ట్ }
ఆఫ్ రిఫైనరి          = 6.00 రూపాయిలు
వ్యాట్                   = 5.5 రూపాయిలు
క్రూడ్ ఆయిల్ }
కస్టం డ్యూటీ        = 1.1 రూపాయిలు
పెట్రోలు కస్టం      =  1.54 రూపాయిలు
రవాణా ఛార్జీలు   =  6.00 రూపాయిలు

మొత్తం 73.53 రూపాయిలు. పన్నులు లేని పక్షంలో లీటరు పెట్రోలు ధర 49.46 రూపాయిలు. గత కొద్ది నెలలుగా మార్కెట్లో బ్యారెల్ ధర తగ్గుతూనే వస్తోంది. మార్కెట్లో బ్యారెల్ ధర 140 డాలర్లు పలికినప్పుడు కూడా ఇప్పుడున్నంత ధరలు లేవు. పైగా ఇండియన్ ఆయిల్ కంపెనీలకు కొనుగోళ్ళలో డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి పెట్రో ధరలు ఇంకా తక్కువగా ఉండాలి.పాకిస్తాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లో కంటే మనదేశంలోనే పెట్రో ఛార్జీలు అధికంగా ఉండటం గమనార్హం. డాలర్ రేటు పెరగటం వలన తామెంతో నష్టపోతున్నామని ఆయిల్ కంపెనీలు నమ్మబలుకుతున్నా, ఏటేటా పెరుగుతున్న లాభాలు, ఇరవై శాతం పడిపోయిన బ్యారెల్ ధరలు అదంతా కట్టుకథేనని తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు 2009-10 సంవత్సరానికి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీ లాభాలు పన్నులు పోగా 1301.37 కోట్లు కాగా, 2010-11 సంవత్సరాంతానికి 1539.01 కోట్లు.  అలాగే సబ్సిడీ ఇస్తున్నామని ఉదరగొట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రభుత్వాలు ఎన్ని పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నాయో పై క్యాలిక్యులేషన్ ద్వారా అర్థమవుతుంది.


ఇంధన వనరుల పై ప్రభుత్వాలకు మొదటి నుంచి సరైన అవగాహన, శ్రద్ధ లేదు. ఎన్ని నిక్షేపాలు కనుగొని, బేసిన్ల కొద్దీ బావులు తవ్వుకున్నా శాశ్వతమైన, సూర్య శక్తికి అవి ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాలేవు. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించి, పరిశోధనలు జరిపించి , ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడం విడ్డూరం. ఆకు పసరులతోను, నీళ్ళతోనూ, గాలితోను, సౌర శక్తితోను వాహనాలు నడిపి చూపించిన యువ శాస్త్రజ్ఞులకు దక్కిన గుర్తింపేది? భారత ఆర్థిక ములాలను శాసిస్తున్న కంపెనీలపై చూపించే అవ్యాజమైన ప్రేమాభిమానాల్లో ఆవగింజంతైన వారిపై చూపించారా?


  పెరుగుతున్న జనాభాకు భవిష్యత్ తరాలకు సరిపడే ఇంధన నిల్వల గురుంచి ఆలోచించరు. సరైన రోడ్లుండవు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సవ్యంగా ఉండదు. ఉన్నా అన్ని రూట్లలో తిరగదు. ఇవేమీ లేకున్నా ఇబ్బడి ముబ్బడిగా కార్ల కంపెనీలకు, మోటారు వాహనాల పరిశ్రమలకు పర్మిట్లు మాత్రం ఇచ్చేస్తారు. అవన్నీ రోడ్ల పైకొచ్చి ఉన్న చమురంతా అరాయించుకొని, కాలుష్యాన్ని వెదజల్లుతూంటే, ఆ తర్వాత సబ్సిడీలని నష్టాలని ధరలు పెంచి, రెట్టింపు ధరలు చెల్లించి దిగుమతులు చేసుకుని, పైపులు తవ్వుకొని పక్క దేశాల దయా దాక్షణ్యాలపై అధారపడతారు. అమెరికా తుమ్మినా అదిరిపడటం నేర్చుకున్నారు కాబట్టి ఇతర దేశాలతో ఏవైనా చమురు ఒప్పందాలవీ చేసుకున్నా అవి సఫలమయ్యే ఛాన్సులు లేవు. అమెరికా వద్దంటే కిక్కురుమనకుండా ఒప్పుకోవాల్సిందే.( ఈ మధ్యే ఇరాన్ విషయంలో జరిగిన సంఘటనే దానికి ఉదాహరణ. అమెరికా ఒత్తిళ్ళకు తలొగ్గి మనదేశం 11% శాతం దిగుమతులు తగ్గించుకోవడానికి ఒప్పుకొంది). ప్రపంచ చమురు సంక్షోభానికి భారత్ కారణం అని అమెరికా అంటే నంగి నంగిగా నీళ్ళు నమలటం తప్ప నోరు పెగల్చే సాహసం కూడా చెయ్యరు. కులం పేరుతో, మతం పేరుతో, కుటుంబం పేరుతో, సినీ అభిమానం పేరుతో వేలం వెర్రిగా రాజకీయ నాయకులని ఎన్నుకొనే ప్రజలకు అంతకంటే గొప్ప పాలకులని ఆశించటం తప్పేమో? అయినా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు ఈ తంతుని నిర్లిప్తంగా మనకేమి పట్టనట్లు గమనించలేదు. మహా అయితే వారం పది రోజులు గుండెలు బాదుకుంటాం. తర్వాత మళ్ళీ మాములే. ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర ఇంజను స్విచాఫ్ కూడా చెయ్యం.  కాదంటారా?



అంటరాని వసంతం


సంతం అంటేనే కొత్త శోభ, కొత్త ఉత్సాహం. అది అందరిదీ. చిగురించే మొక్కలోని కోమలత్వాన్ని , విరబూసిన  పువ్వులలోని స్వచ్ఛతని,  మత్తెక్కిన కోయిల సుస్వరాలని  ఎవరు మాత్రం ఆస్వాదించాలనుకోరు ? వసంతం, విషాదం ప్రతి మనిషి జీవితంలో ఉన్నాయి. అయితే అందరి అనుభూతులు మాత్రం ఒకేలా  పరిగణింపబడటం లేదు. కులం పేరుతో మనుషుల్ని వెలివేసి వాళ్ళ సంస్కృతిని కించపరచి, హక్కుల్ని కబళించి, ఆనందాలని కాలరాస్తే అదే అంటరాని వసంతమవుతుంది.

ఎల్లన్నది ఎన్నెలదిన్నె అనే కుగ్రామం. అత్త పర్యవేక్షణలో ఆటపాటలతో పెరుగుతూంటాడు. అక్షరాలు వ్రాయడం రాకపోయినా స్పందించే హృదయం, ఉప్పోంగే రక్తం అతనికి పదాలు కూర్చడం, ఆ కూర్చిన పదాలకి అలవోకగా చిందులు వెయ్యడం నేర్పాయి. వీధినాటకాలాడే ఎర్రగొల్లలు ఆ గ్రామానికి వచ్చి రాత్రిళ్ళు ప్రదర్శనలిస్తూంటే, ఆటపాటల మీదున్న ఆసక్తి కొద్దీ వాళ్ళని కాస్త దగ్గరినుంచి చూడాలనుకుంటాడు. అత్త వద్దని వారిస్తుంది. ఆమెకు తెలియకుండా ఒకరోజు ప్రొద్దున్నే  ఊరిబయటనున్న ఎర్రగొల్లల డేరాలకు వెళ్తాడతను. అతని కులం అక్కడ పరిచయమవుతుంది.

ఆ గ్రామంలో కట్టుబాట్ల ప్రకారం కేవలం కరణాలు, కాపులు మాత్రమే ప్రదర్శనకు దగ్గరగా కూర్చునేవాళ్ళు. వారి వెనుక మంగలి, కుమ్మరి మిగత కులాల వాళ్ళు కూర్చునేవాళ్ళు. వీళ్ళందరికీ దూరంగా వెనుకున్న మాల దిబ్బ పై మాలవాళ్ళు, మాదిగ దిబ్బపై మాదిగలు కూర్చునేవారు. కరణం వచ్చిన తర్వాతే వీళ్ళందరూ దిబ్బలపైకి రావాలి.  ప్రదర్శన కనిపించకపోయినా కూర్చునే చూడాలి తప్ప నిలబడి చూడకూడదు. అటువంటిది ఒక మాలపిల్లవాడు  ఏకంగా డేరాల్లోకే రావటం అక్కడున్న గుంపులో కలకలాన్ని సృష్టిస్తుంది. రాళ్ళతో వెంటపడతారు . అర్థంకాకపోయినా అనాలోచితంగానే పరుగు తీసిన ఎల్లన్న పొదలు దూకి, కంపచెట్లను దాటి, బండరాళ్ళు తగిలి బోర్లాపడి, పైకిలేచి, రక్తమోడుతూనే ఏటికి ఎదురీది, ఊరుకి ఆవలిగట్టు చేరుకుంటాడు . అయినా నడక ఆపలేదు. భయంతో మొదలుపెట్టిన నడక చీకటయ్యాక, చీకటిలో తననెవరూ గుర్తుపట్టలేరని నిర్ణయించుకున్నాక ఆపుతాడు . అత్త ఎందుకు వద్దందో అప్పుడర్ధమయ్యింది. ఇంటికి వెళ్ళిపోయి ఇంకెప్పుడూ అలా చెయ్యనని చెప్పాలనుకుంటాడు. చీకట్లో ఊరికి ఎంతదూరం వచ్చేశాడో, ఎటువైపు వెళ్ళాలో తెలియలేదు. తెల్లవారాక వెళ్ళాలనుకుంటాడు. ఎక్కడి నుంచో గాలి మోసుకొచ్చిన లయబద్దమైన శబ్దం అలసిపోయి నొప్పులతో బాధపడుతున్న అతని పాదాలకు తిరిగి సత్తువనిచ్చి ఉరుముల నాగన్న వద్దకు చేరుస్తుంది.

నాగన్న ఉరుముల నృత్యం ఆటగాడు. పక్కలదిన్నె అనే గ్రామంలో తన బృందంతో కలిసి ప్రదర్శనకు వచ్చినతను ఎల్లన్నలోని మెరుపుని అసహాయతను గుర్తించి అతన్ని చేరదీసి వివరాలు కనుక్కుంటాడు. గత జ్ఞాపకాలు అతని గుండె తలుపులు తట్టి మనసుని వికలం చేస్తాయి. నాగన్నదీ ఎన్నెలదిన్నే. అతనూ అక్కడినుంచి వలసపోయినవాడే. మాలాడు, మాదిగాడు వెట్టి చెయ్యకపోతే బ్రతకలేని ఊరు ఎన్నెలదిన్ని. మధ్యాహ్నం కూడు  తప్ప మరో కూలి వుండేది కాదు. దాని కోసం కూడా కొట్టుకు చచ్చేవాళ్ళు. కరణం పరమ క్రూరుడు. ' మీ కులం అంత గొప్పది ఇంత గొప్పది ' అని రెచ్చగొట్టి మాలల పైకి మాదిగల్ని, మాదిగల పైకి మాలల్ని ఉసిగొల్పేవాడు. అతని మాటకు ఎదురుతిరిగినివాళ్ళ బ్రతుకులు తాటితోపులో తెల్లారిపోయేవి. వరదలొచ్చినప్పుడల్లా ఏటికి దగ్గర్లో ఉన్న మాలపల్లి, మాదిగపల్లి మునిగిపోయేవి. ఊరికి పై భాగాన ఉన్న దిబ్బపై ఇళ్ళు కట్టుకోవాలని చూస్తే అంటరాని వాళ్ళు తలభాగాన ఉండరాదని అగ్రవర్ణాల వాళ్ళు హుకుం జారీ చేస్తారు . ఓ సారి వరదలొచ్చి,ఇళ్ళు తుడిచిపెట్టుకుపోయినప్పుడు నాగన్న తండ్రి ధైర్యం చేసి గొడ్డలి భుజాన వేసుకొని అందరినీ దిబ్బలపైకి తీసుకు వెళ్తాడు . అగ్రవర్ణాల ఇళ్ళ మధ్య నుంచి, ఊరి మధ్యనుంచి, దేవాలయాల సందుల నుంచి దిబ్బలపైకి జనాన్ని తీసుకువెళ్తాడు . తిండిలేక పిల్లలు అలమటిస్తూంటే షావుకారు కొట్టు తాళం పగలకోట్టి ధాన్యం బస్తాలు తెచ్చుకుంటారు. రెండ్రోజుల తర్వాత అతని శవం అదే దిబ్బపై కనబడుతుంది . బిక్కచచ్చిన జనం వానవెలిసాక మళ్ళీ పాతచోటే గుడిసెలు వేసుకుంటారు. అప్పుడు తల్లితో పాటు ఊరుదాటిన నాగన్న మళ్ళీ ఇన్నాళ్ళకి తన ఊరి పేరు వింటాడు.  మనుషులు మారుతున్నారు తప్ప మనుగడలో మార్పు లేదని ఎల్లన్న కథతో తెలుసుకుంటాడు . ఎల్లన్న చెయ్యి పుచ్చుకుని ఎన్నెలదిన్ని మాలపల్లిలో అడుగుపెడతాడు.

నాగన్నని పోల్చుకున్న ఊరు అతన్ని అతని నృత్యాన్ని ఆదరిస్తుంది . ఏ దిబ్బపై తన తండ్రిని చంపారో అదే దిబ్బపై ఆ మరణానికి కారకుడైన కరణాన్ని గుట్టుచప్పుడు కాకుండా మాదిగ మాతయ్య నరికేశాడని, ఇప్పుడంతా పిల్ల కరణం చెప్పుచేతుల్లో నడుస్తోందని  తెలుసుకుంటాడు.  ఎల్లన్నకి పాటలు, నృత్యం నేర్పించి అతని ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనుకుంటాడు.

నాగన్న చొరవతో పెద్దలను ఇరుకున పడేసి దెయ్యాల దిబ్బను సాగులోకి తెచ్చుకుంటారు మాలమాదిగలు. అగ్రవర్ణాలకు ఆవేశాలు రగిలినా అంతకు ముందు లేని ఐక్యత ఇప్పుడు మాలమాదిగల్లో కనబడేసరికి కక్కలేక మింగలేక మిన్నకుండిపోతారు. నాగన్న తర్ఫీదులో  ఎల్లన్న రాటుదేలి గొప్ప కళాకారుడిగా పేరు తెచ్చుకుంటాడు. అతను వేషం కడితే చూడ్డానికి చుట్టుపక్కల మాల మాదిగ పల్లెలు ఎగబడేవి. ఆటకు ముందు కరణం ,ఇతర పెద్దలు వచ్చారో లేదో తెలుసుకుని అప్పుడు మొదలెట్టడం ఆనవాయితీ. దాన్ని ధిక్కరించి 'ఘనత వహించిన పెద్ద మాల, అంతే ఘనత వహించిన పెద్ద మాదిగ  తమ స్థానాలు అలంకరించారా లేదా' నని తెలుసుకొని అప్పుడు ప్రదర్శన మొదలుపెట్టడం ప్రారంభిస్తారు . అగ్రవర్ణాలకు ఈ పరిణామం మింగుడుపడక నాగన్నని, ఎల్లన్నని పిలిపించి ఆటకు ముందు అలా పిలవకుండా ప్రదర్శనలిచ్చుకోమని లేకపోతే రెండు ఊళ్ళూ బూడిదవుతాయని హెచ్చరిస్తారు.  ఏం చెయ్యాలో తోచక నాగన్న తనవాళ్ళతో చర్చిస్తాడు. ఆత్మగౌరవం కోసం తెగించి పోరాడే ధృడచిత్తం కరువయ్యేసరికి నిరాశపడి ఆ దిగులుతోనే మరణిస్తాడు.

నాగన్న మాటలే మననం చేసుకుంటూ భార్యా పిల్లలను, గ్రామాన్ని విడిచిపెట్టి ఊళ్ళుపట్టిపోతాడు ఎల్లన్న. పెరిగే పైరు మీద, నాట్లు వేసే కూలీల కష్టం మీద, నేల మీద జరిగే ప్రతి విన్యాసం మీద పాటలల్లి పాడతాడు. భార్య పేరుని పల్లవిగా చేసుకోని పాడతాడు. మాలబైరాగిగా పేరు గడిస్తాడు. పెదకోటేశ్వరుడు అనే కుమ్మరి పోతులూరి వీరబ్రహ్మం గారిపై ద్విపద పద్యాలు వ్రాసి కులాల హెచ్చుతగ్గుల్ని నిరసిస్తూంటాడు . అతని కులం అతన్ని వెలివేస్తుంది. తాళపత్ర గ్రంథ సేకరణ కోసం బ్రౌన్‌దొర నియమించిన వాయసగాళ్ళు, పండితులు అతన్ని, అతని రచనలని అవహేళన చేస్తారు. పెదకోటేశ్వరుడు ఏ మాత్రం చలించకుండా బసవడిని, వీరబ్రహ్మాన్ని కలిపి ద్విపదలు రూపొందిస్తాడు. ఎల్లన్న గురుంచి విని అతన్ని కలుసుకోవాలని బయలుదేరుతాడు.  రాజవీధిలో వెళ్తున్న అతన్ని బ్రాహ్మణుడొకడు గుర్తించి అవమానించి కొట్టబోతాడు. పెదకోటేశ్వరుడు తన కాలికంటిన మట్టి విదిలించి, నేల మీద ఖాండ్రించి ఉమ్మి, ' నా చేత అపవిత్రమైన దీన్ని మీరు పవిత్రం చెయ్యండి' అని వెళ్ళిపోతాడు. ఎల్లన్నని కలిసి, అతని నేపథ్యం సాహిత్యం విని, తన రాతప్రతులను అతనికి అప్పగించి పులకరించిపోతాడు. తిరిగివెళ్తూ అగ్రవర్ణాల చేతిలో దారుణహత్యకు గురవుతాడు. అతని సమాధి ఒక సందర్శనీయ స్థలమవుతుంది.

పిల్లకరణం పట్నం వెళ్ళిపోతూ బంజరంతా మాలమాదిగలకు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ భూమిని ఆక్రమిద్దామనుకున్న అచ్చిరెడ్డికి ఇది ఆశనిపాతమవుతుంది. ఎన్నెలదిన్నెలో ముందు కరణం పొలాలు తడపాలి, తర్వాత పెద్ద రెడ్లు, సన్న రెడ్లు, ఇతరకులాలవి. మాలామాదిగల పొలాల వంతు వచ్చేసరికి నీళ్ళు మిగిలేవి కావు. గత్యంతరం లేక ఓ సారి నీళ్ళు దొంగలిస్తే మనుషుల్ని పంపించి చావగొట్టిస్తాడు అచ్చిరెడ్డి.  ఎల్లన్న భార్య సుభద్ర తిరగబడి కాళికావతారం ఎత్తటంతో ఆమెను 'దేవత ' ఆవహించిందని, అందుకే ఆమెకంత ధైర్యమొచ్చిందని భయపడతారు ఊరివాళ్ళు.

రాళ్ళను సైతం అరాయించుకునే కరువు రాచి రాంపాన పెడుతూంటే, పొట్ట చేతబట్టుకుని  ఊళ్ళకు ఊళ్ళకు వలసపోతూంటారు. ఆ గుంపుతో పాటూ ఎన్నెలదిన్నె ఎగిరివచ్చిన పండుటాకు లాంటి ఎల్లన్నని చూసి అతని భార్యాపిల్లలు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ఎల్లన్న, సుభద్ర మరణిస్తారు. కొడుకు శివయ్య వాళ్ళను అక్కడే సమాధి చేసి  భార్యను వెంటబెట్టుకొని బకింగ్‌హాం కాల్వ కూలిపనులకు వెళ్తాడు .మాలవాడు పనికోసం వచ్చాడని ఆగ్రహించి అక్కడ పనిచేస్తున్న జనం వాళ్ళ మీద దాడిచేస్తారు. చాలా దూరం పారిపోయి జీవచ్ఛవాల్లా పడిపోయిన శివయ్యను అతని భార్యని క్రైస్తవ మతం చేరదీస్తుంది. శివయ్య సీమోను అవుతాడు. అతనికి ఆశ్రయం ఇచ్చిన  మార్టిన్‌దీ అటువంటి నేపథ్యమే.

ఇక్కడి నుంచి కథ రకారకాల మలుపులు తిరిగి సీమోను కొడుకు రూబేను, రూబేను కొడుకు ఇమ్మాన్యుయెల్, అతని కొడుకు జెస్సీ జీవితాలని, అంతః సంఘర్షణను స్పృశిస్తూ జెస్సీ నక్సలైట్‌గా రూపాంతరం చెందడం వరకు సాగుతుంది. అజ్ఞాతంలో ఉన్న మనవడిని చూడ్డానికి వెళ్తాడు రూబేను. అతని భార్య మరియు జెస్సీ నాన్నమ్మ అయిన రూతు, మనవడి విజయాన్ని ఆకాక్షిస్తూ ఉత్తరం వ్రాయటంతో నవల పరిసమాప్తమవుతుంది.

తరతరాలుగా అలగాజనంగా ముద్రపడ్డ మాలమాదిగల బ్రతుకు పొరాటానికి నిలువెత్తు దర్పణం అంటరాని వసంతం. కల్యాణరావుగారి శైలి చాలా సరళంగా శక్తివంతంగా ఉంది. మామూలు మాటలతోనే మనసులోతుల్ని స్ఫృశిస్తారు .మాలమాదిగల జీవనశైలిని, వారి దైన్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. చచ్చిన గొడ్డు మాంసం తింటూ గొడ్డిచ్చిన పెద్దలకి దాన్ని చర్మంతో చెప్పులు కుట్టడం నుంచి, ఏ కులమూ తాకని తన దేహాన్ని ఒక తెల్లవాడు తాకి ' క్రీస్తుకు అంటరానితనం లేదు ' అన్నప్పుడు   ఆత్మగౌరవం కోసం క్రైస్తవ మతాన్ని అందిపుచ్చుకోవటం వరకూ, కాలిక్రింద చెప్పు నుంచి కొడవలిగా ఎదిగే వరకూ, మాలమాదిగల జీవితాల్లో వచ్చిన మార్పులను, అంతర్మథనాలను చక్కగా విశ్లేషించారు. కులం కారణంగానే మాలమాదిగలకు దక్కాల్సిన ఎన్నో గౌరవాలు దక్కలేదని, రవివర్మ, రాజమన్నారు, నండూరి వంటి వాళ్ళు వెలయించిన సాధారణ చిత్రాలని, రచనలని మాత్రం నెత్తిన పెట్టుకున్నారని ఆక్షేపిస్తారు. ప్రేరిణీ శివతాండవం కంటే ఉరుముల నృత్యంలో సహజత్వం ఉందని, పురాణాలను మంత్రాలను సైతం మహాకావ్యాలుగా ఆకాశానికెత్తిన పండితులు అంటరాని కులాలు పాడిన గీతాలు, ఆడిన వీధిభాగవతాల్లో గొప్పదనాన్ని గుర్తించలేకపోయారని ఎద్దేవా చేస్తారు. ఎంకి పాటలు నేను చదవలేదు కానీ ఈ మాటల్లో కొంత నిజం లేకపోలేదు. ఆత్మగౌరవం కోసం  పరమతాన్ని పుచ్చుకున్న మాలమాదిగల్ని సమర్థిస్తూనే ధనం కోసం మతం మార్చుకున్న అగ్రవర్ణాలను చూసి నవ్వుతారు. గాంధీజీ చేపట్టిన హరిజనోద్ధరణ, దేవాలయాల ప్రవేశం లాంటి కార్యక్రమాలని హిందూ మతచట్రంలో మాలమాదిగల్ని బంధించే ప్రయత్నమని, అందుకే అంబేద్కర్ వంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకించారని చెప్పి ఆయా కార్యక్రమాలలోని డొల్లతనాన్ని వివరించి ఆశ్చర్యపరుస్తారు .

నవలలో ప్రస్తావించిన చాలా సంఘటనలు మనసుని మెలిపెట్టి బాధపెట్టేవే. కొన్ని విషయాలు మాత్రం కొత్తగా ఉన్నాయి . చెన్న పురాణం, జాంబ పురాణం అన్నపేర్లు  చదివి ఇటువంటి పురాణలు కొన్ని ఉన్నాయా అని ఆశ్చర్యపోయాను. అప్పటిదాకా వ్యాస భగవానుడు వ్రాసిన పద్దెనిమిది పురాణాల గురుంచి మాత్రమే విని ఉండటం చేత ఈ కొత్త పురాణాలేమిటి, వాటిని ఎవరు వ్రాశారన్న జిజ్ఞాస బయలుదేరింది. అంతర్జాలాన్ని శోధించాక వీటిని కుల పురాణాలంటారని ఇటువంటి పురాణాలు ఇంకా అనేకం ఉన్నాయని  అర్థమయ్యింది. ఎవరు ఎలా వ్రాశారో ఇతిమిత్థంగా తెలియకపోయినా కులాల పుట్టుకలు, చరిత్రలు, వాటి అనుబంధ కథలు తెలిపే కులపురాణాలు, కొన్నైనా ఆయా కులాల్లో (లేదా ఇతర కులాల్లో) బాగానే ప్రాచుర్యం పొందినట్లున్నాయి. కేవలం నోటిమాటలు, ఆటపాటల ద్వారా ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయిపోయే ఈ పురాణలలో చెన్న పురాణం మాలలది. జాంబ పురాణం మాదిగలది (ఈ మధ్యనే జాంబపురాణం అనే పుస్తకాన్ని విడుదల చేశారు. దీనిపై దార్ల వారి వ్యాసం కూడా చదివాను). వీటిలో కథలు కొత్తగా ఉంటాయి. ఎప్పుడూ వినని, చదవని కథలు. (ఈ పురాణ కథల గురుంచి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్‌చెయ్యండి .) ఎవరో జడల ఋషి వ్రాసింది చరిత్ర ఎలా అవుతుందని సామాజిక మూలాలను ప్రశ్నించిన రచయిత, కనీసం ఎవరు వ్రాశారో తెలియని పురాణాలని పట్టుకొని మాలా మాదిగలు అంటరానివారెలా అయ్యారని ప్రశ్నించుకొని ఉంటే సమాధానం అందులోనే దొరికేది. తేడా మతంలో లేదు. దాన్ని బోధించే మనుషుల్లో ఉంది.

పుట్టుకతో ఎవారూ ఫలానా కులానికి చెందరని, కర్మానుసారమే బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని భగవానువాచ . నేను హిందువునేనయినా, హిందూమతం గురుంచి నాకున్న అవగాహన స్వల్పమే అయినా,  'బ్రాహ్మణత్వం' ' చాతుర్వర్ణ వ్యవస్థ ' వంటి పదాలకు తీసిన పెడార్థాలు మరే పదాలకీ తీయలేదని నిశ్చయంగా చెప్పగలను.  కుహానా పండితులు, మేధావుల కారణంగా సంఘానికి, తద్వారా హిందూ మతానికి ఎనలేని నష్టం జరిగింది. ఎందరో గురువులు, సాధకులు తమ బోధనలతో నయం చేసే ప్రయత్నం చేసినా, ఇంకా చేస్తున్నా అంటరానితనం అనే వ్యాధి ఇంకా పూర్తిగా  సమసిపోలేదు. అప్పటికీ ఇప్పటికీ మనుషుల మనస్తత్వాలలో చాలా మార్పులొచ్చినా అంటరానితనం పేరుతో దళితులని అవమానించటం లాంటి సంఘటనలు ఇప్పటికీ అడపాదడపా  మనం వింటూనే ఉన్నాం. అలాగే బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా శబరిమలై లాంటి సుప్రసిద్ధ ఆలయాలలో అర్చక పదవులు నిర్వహించడం చూస్తున్నాం. ఆత్మగౌరవం మాటెలా ఉన్నా ఆర్థికంగా మాత్రం మాలమాదిగలు అర్చక స్వాముల కంటే ఇప్పుడొక మెట్టు పైనే ఉన్నారు. చరిత్రకెక్కిన రాజులని, మహాపురుషులని తమ కులానికి చెందిన వాళ్ళుగా ప్రకటించుకోవటం సర్వసాధారణం కాబట్టి, మాలమాదిగల చారిత్రక ప్రశస్తి మీద మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో  తవ్వాల్సింది  పూడ్చాల్సింది చాలానే ఉంది. 

ఈ నవలని తెలుపు.కాం వెబ్‌సైట్ నుంచి  పొందవచ్చు.

వెల 70 రూపాయిలు .


రాత్రి కురిసిన వర్షం

 
 
రాత్రంతా కురిసిన వర్షం
తడి జ్ఞాపకాలను మిగిల్చివెళ్ళింది
చివికిపోయిన కన్నులచూరు నుండి
చుక్కలుగా తరలిపోతున్న దుఃఖం
కాలప్రవాహంలో జారి కరిగిపోతోంది
విరహ ఝంఝ ఉధృతవడిలో
శాఖలు తరిగిన శిథిల తరువునై
శోకనిశీధిలో చిక్కి ఉన్నాను
విచ్చుకుంటున్న వెల్గురేఖవై నన్నక్కున చేర్చుకొని
శుష్కించిన నా చైతన్యానికి స్వస్థత  చేకూర్చవూ
 
 
నీ తలపులతోనే తలారస్నానం చేసి
ఆరుబయట కురులారబెట్టుకున్నాను
విభాతకాంతుల దువ్వెనతో  
తడిసిన కురుల కరిమబ్బులని
తాపీగా దువ్వుకుంటున్న వియత్సుందరిని చూస్తూ నిల్చున్నాను
వెచ్చని నీ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు వీవెనలా వీతెంచి
ముచ్చెమటల ముత్యాలహారాలు నా మెడవంపులో కూర్చాయి
 
 
నీకు తెలుసో లేదో
తొలిసారి నా పై జారిన నీ తుంటరి చూపులు
తొలకరిజల్లులై నన్నింకా తబ్బిబ్బు చేస్తున్నాయి
ఆల్చిప్పల్లాంటి నా కన్రెప్పల్లో
అందమైన నీ ముఖబింబాన్ని ముత్యంలా పొదువుకున్నాను
అరవిచ్చిన పెదవులతో నువ్వు రువ్విన  ప్రతి నవ్వూ
మల్లెలుగా  ఏరుకొని మదిసీమలో నాటుకొన్నాను 
గుభాళించిన చిలిపి ఊహలన్నీ గిలిగింతలు రేపితే
గగనవీధులలో తేలి గాంధర్వ గీతాలు పాడాను
 
పరిచయాల పృథ్విపై  ప్రభవించిన మన ప్రేమ
భావాల కలయికతో బహుశాఖలు తొడిగి
పెద్దల అనుమతితో పరిణయమై 
                                  పొదరిల్లై మారినప్పుడు
ఫలించిన ఆశలన్నీ ప్రకాశించే తారలై
స్మరించిన నీ రూపం సుధాకరునిలా నన్నల్లుకున్నపుడు
చెలువములన్నీ చెంగలువలై
చలనములన్నీ కవనములై
తటాకమై నా మేను తాదాత్మ్యత చెందిన క్షణాలని
ఘనీభవించిన కాలానికి గుర్తుగా
గుండెపొరలలో నిక్షిప్తం చేసుకున్నాను
 
 
ఓర్వలేని వికృత విధి
ఉద్యోగం పేరిట నిన్ను విదేశాలకు విసిరికొట్టి
కారు మబ్బుల కర్కశ రాత్రిని కళ్ళ ముందు పులిమింది 
పొర్లుతున్న దుఃఖాన్ని పెదవంచున అదిమిపెట్టి
భారమైన కాలాన్ని భావరహితంగా మోస్తూ
సమూహంలో ఒంటరినై నే శిలాజమై మిగిలాను 

వాసంత సమీరం వెళ్ళిపోయింది వలపు వేణువులూదకనే
హేమంత తుషారం కరిగిపోయింది హృదయ సంతుష్ట రశ్మి సోకకనే
 
 
నీ మేనిపై తలవాల్చి
నీ చేతిని చుట్టిపట్టి
దయాపూరితమైన నీ కళ్ళలో
ద్యోతకమైన నా వలపుసౌధాలు
విస్ఫారిత నేత్రాలతో విస్మయంగా చూస్తూ
దొరలుతున్న మాటల మలయానిలంలో
దూదిపింజనై తేలిపోతూ
సైకత తీరాలలో సుప్రశాంత వనాలలో
నేను నడిచిన ప్రతి అడుగూ
గడిపిన ప్రతి ఘడియా
గవ్వలలో ఏరుకున్నాను
ఘనవృక్షసారముల మధ్య వెదుక్కొన్నాను
 

ఆధునిక ఉపకరణాలతో అంతరంగాన్ని శోధించి
అంతా బాగానే ఉందని సమాధానపడిపోకు
వెబ్‌చాట్లు, వీడియోఫోన్లు వియోగార్ణవాన్ని విశదం చెయ్యలేవు
అమావాస్య చీకట్లను తడుము
అలముకున్న నైరాశ్యం బోధపడుతుంది
ఎరుపెక్కిన దిక్కులు చూడు
బరువెక్కిన రెప్పల కావి కనబడుతుంది
ఘూర్ణిల్లే సముద్రపు హోరులో గతితప్పిన గుండె ఘోషను విను
ఆకుల ఆలింగనం వదిలి ఆర్తిగా జారిపోతున్న తుషారకన్యకల్లో నా కన్నీళ్ళు చూడు
 
వేయి తమస్సుల తపోవరమై
కోటి కోర్కెల ఉషోదయమై
విహంగ జతివై
ఉధృతగతివై
నా కోసం నువ్వు కదలి వచ్చేదెన్నడు
చారికలు గట్టిన చెంపలపై నీ పెదవి 
చేవ్రాలు పెట్టేదెన్నడు



గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తించని పాఠశాలలు



రిపబ్లిక్ డే వచ్చేసింది.  గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక నార్మల్ హాలిడే. సరదాగా ఇంటిపట్టున గడుపుతూనో లేక ఏ సినిమాతోనో, షాపింగ్‌మాల్ లోనో కాలం వెల్లిబుచ్చేస్తారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన త్యాగధనులని  ఈ రోజు ఎంత మంది ఎంతసేపు స్మరిస్తున్నారు, జాతీయ సెలవు దినాలలోనైనా ఎంత మంది  వారి ఆదర్శాలను వల్లించుకుంటున్నారు, దేశ స్వాతంత్ర్యం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది, అన్న విషయాల మీద  ఎవరైనా
సర్వే నిర్వహిస్తే ఎంత బావుణ్ణు. దేశం సిగ్గుపడే విషయాలు బయటికి వస్తాయి.




అసలు రిపబ్లిక్‌డే ని ఈ రోజే ఎందుకు జరుపుకోవాలి ?  చాలా మందికి ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలియదు. 1950 జనవరి ఇరవయ్యారవ తేదినుంచి మనదేశ రాజ్యాంగం అమల్లోకికి వచ్చింది కాబట్టి ప్రతి ఏటా అదే తేదిన మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అనుకుంటారు కొంతమంది . ఇందులో కాస్త నిజం లేకపోలేదు. అయితే అసలు కారణం వేరే ఉంది. భారత రాజ్యాంగానికి నవంబరు 26 1949 లోనే ఆమోదం లభించింది. అమలు పరచే తారీఖుకి ఒక ప్రాముఖ్యత  ఉండాలని రెండు నెలలు ఆగారు.  ఏమిటా తారీఖు ? ఏమిటా ప్రాధాన్యత ? 1930 జనవరి 26వ తేదిన లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో మొదటిసారిగా దేశానికి పూర్ణ స్వరాజ్యం కావాలని ప్రకటించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం లభిస్తే చాలు, సర్వోత్కృష్టమైన సంపూర్ణ అధికారం భ్రిటిషు వారి చెప్పు చేతుల్లోనే వుంచి సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకొనే వాళ్ళు మన రాజకీయ నాయకులు (!!) . జలియన్‌వాలాబాగ్ ఉదంతం జాతిని ఉలిక్కిపడేలా చేసింది. సుభాష్ చంద్రబోస్ , జవహర్‌లాల్ నెహ్రూ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో కాకపుట్టించి పూర్ణ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రకటన ఇప్పించగలిగారు. ఆ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో  నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి జనవరి 26 1950 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.

అటువంటి రిపబ్లిక్‌డే ప్రైవేటు పాఠశాలలకు నేడొక ఆటవిడుపులా మారింది. గవర్నమెంటు హాలిడే కాబట్టి పిల్లలు స్కూళ్ళకు రానవసరం లేదని ముందు జాగ్రత్తగా హోం డైరీల్లో హెచ్చరించే పాఠశాలలు కొన్నైతే,  ఏ శనివారమో ఆదివారమో రిపబ్లిక్‌డే వస్తే ఎక్కడ ఆ రోజు మళ్ళీ పనిచేయాల్సి వస్తుందోనని ముందు రోజే తూతూ మంత్రంగా జెండావందనం జరిపించేసి మమ అనుకునే  స్కూలు యాజమాన్యాలు ఇంకొన్ని. ప్రేమికులరోజుకి రకరకాల భాష్యాలు చెప్పి పిల్లల చేత ఠంచనుగా సెలబ్రేట్ చేయించి స్వాతంత్ర్యదినోత్సవాన్ని మాత్రం ఆగస్టు పన్నెండవ తేదీనే జరుపుకున్నమిషనరీ స్కూలు, గురూజీ పూజ, సత్సంగం లాంటి కార్యక్రమాలను సెలవు రోజుల్లో అట్టహాసంగా నిర్వహించి రిపబ్లిక్‌డే ని విస్మరించే పాఠశాల మా ఇంటికి కూతవేటు దూరంలోనే ఉన్నాయి. భావిభారత పౌరుల్ని తయారుచెయ్యాల్సిన పాఠశాలలు ఇంత బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించబట్టే  బాలబాలికల్లో దేశభక్తి నానాటికి తీసికట్టు నాగంబొట్లు చందంగా తయారవుతోంది. సెలవు దినాల్లో పిల్లలు బడికి వెళ్ళకపోతేనేం అనుకునే తల్లిదండ్రులూ ఉన్నారు. గాంధీ నెహ్రూలు తప్ప మరో స్వాతంత్ర్య సమరయోధుడు తెలియని పిల్లలున్నారంటే అది వీళ్ళ చలవే. సమస్యకు మరో పార్శ్వం వీళ్ళు. 


నా చిన్నతనంలో స్కూళ్ళో జరుపుకున్న జాతీయపండుగలు నాకింకా గుర్తున్నాయి. పాఠశాలంతా అలంకరించిన మూడు రంగుల పేపర్ తోరణాలు, విశాలమైన ఆవరణలో ఆవిష్కరింపబడి వినువీధులలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం, తెల్లటి చొక్కాకి ఎడమవైపు పిన్నీసుతో గుచ్చబడి, పడిపోయిందో లేదోనని నేను అప్పుడప్పుడూ తడుముకొని గర్వంగా చూసుకున్న చిట్టి జెండా, భారతదేశము నా మాతృభూమి అని అందరితో కలిసి చేసిన ప్రతిజ్ఞ, ఒళ్ళు ఉప్పోంగేలా పాడిన వందేమాతరం, మైకు చేతబట్టుకొని వచ్చీ రానీ భాషా జ్ఞానంతో ' తేనెల తేటల మాటలతో మనదేశ మాతనే కొలిచెదమా ', ' శ్రీలు పొంగిన జీవ గడ్డై, పాలు వారిన భాగ్యసీమై' లాంటి  పాటలు శ్రావ్యంగా పాడిన మిత్రబృందం, వాడిపోయిన  మొహాలు చూసి కూడా ఉపన్యాసాలు విరమించని ముఖ్య అతిథులు, చివర్లో చాక్‌లెట్ల కోసం మేం సంబరంగా ఎగబడ్డ సన్నివేశాలు .. అన్నీ గుర్తున్నాయి.  

ఇప్పుడేవీ ఆ ప్రతిజ్ఞలు ?
ఏదీ ఆ జాతీయగీతాలాపన ?
ఏదీ ఆ ఆనందం ?

దేశంలో చాలా సమస్యలకు దేశభక్తి లేకపోవటం కూడా ఒక కారణం. భారతదేశ ప్రతిజ్ఞ ఎవరు వ్రాశారో తెలియకపోయినా, బూతులతో నిండిన తెలుగు సినిమా డైలాగులు, వాటి కలెక్షన్లు కంఠతా పట్టేసి, నటీనటులను గుడ్డిగా అరాధించే యువతరం తయారైతే అంతకంటే దరిద్రం ఈ దేశానికి మరొకటి లేదు. తల్లిదండ్రులు కనీసం జాతీయ పర్వదినాలోనైనా ప్రముఖుల ఆదర్శజీవితాల్లోంచి ముఖ్యమైన ఘట్టాలని, వారి పోరాట స్ఫూర్తిని, నిజాయితీని కళ్ళకు కట్టేలా పిల్లలకు విడమరిచి చెప్పి దేశభక్తిని పెంపొందింపజెయ్యాలి .ప్రైవేటు స్కూళ్ళు ఇప్పటికైనా తమ బాధ్యత గుర్తించి గణతంత్ర దినోత్సవం,స్వాతంత్ర దినోత్సవం లాంటి పండుగలను విధిగా నిర్వహించాలి. ప్రభుత్వం కళ్ళుతెరిచి జాతీయ పర్వదినాలను సెలబ్రేట్ చేసుకోని పాఠశాలల గుర్తింపు రద్దు చెయ్యాలి.


నా ఉప్మా ప్రహసనం !!


' ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్ '  అని ముక్క తిమ్మన అన్నాడు గానీ నిజానికి ఏ ముద్దూ మురిపెం లేకపోయినా ఎటువంటి విద్యనైనా చాలా వీజీగా ఔపోసన పట్టేసే ధీరోదాత్తులు కార్యశూరులు మగవాళ్ళని నా ప్రగాఢ విశ్వాసం. అలాంటిది వంట విషయమైతే ఇక చెప్పక్కర్లేదు. మగపుంగవుల సామర్థ్యత ముందు ఆడవాళ్ళ నైపుణ్యం ఏ పాటిది? పైగా దానికి తిరుగులేని సాక్ష్యాధారాలు మనకి ఉండనే ఉన్నాయి. నలభీమపాకం అన్నారు గాని సీతా, ద్రౌపదీ పాకాలని ఎవరూ అనలేదు కదా? అసలంతవరకూ దేనికి? తెలుగు టి.వీ. ఛానాల్స్‌లో మధ్యాహ్నమయ్యేసరికి సహజ కవచ కుండలాల్లాంటి తెల్లటి కోటు, తలపై కిరీటం లాంటి టోపీ పెట్టుకొని దండయాత్ర చేసి వచ్చిన వీరాగ్రేసరుల్లా మగవాళ్ళు నోరూరే రకరకాల వంటలు ఎలా చెయ్యలో నేర్పుగా చేసి చూపెడుతూంటే, పక్కనే నిలబడి పళ్ళికిలిస్తూ మధ్య మధ్యలో ' బాణలిలో నూనె వెయ్యాలా లేక నూనెలో బాణలి వెయ్యాలా ' లాంటి చొప్పదంటు ప్రశ్నలేసి ' రెండూ నా మీద వెయ్యి ' అని ప్రేక్షకుడు విసుక్కోకముందే ' బ్రేక్ ' అంటూ విరామం తీసుకొని, తీరా వంట మొత్తం పూర్తయ్యాక లోట్టలేసుకుంటూ తినే వంట రాని మహిళా యాంకర్స్‌ని మనం చూస్తూనే ఉన్నాంగా ?




ఈ మాటే ఓ సారి యథాలాపంగా మా ఆవిడతో అంటే ' ఊరికే కబుర్లెందుకు చెబుతారు ? మీరు చెయ్యరాదూ ఈ పూట  వంట ' అనేసింది. ఈ ఆడవాళ్ళున్నారు చూశారు .వీళ్ళు మహా  గడుసరులు సుమండి. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకీ బోలెడు అర్థాలుంటాయి. ఆచితూచి అడుగెయ్యకపోయారో అట్లకాడెతో అప్పడాన్ని వేయించినట్టు వేయించేస్తారు.  సామన్య మగమాత్రుడైతే వెంటనే అవేశపడిపోయి ' నువ్వలా కూర్చో. చూద్దువు గానీ నా ప్రతాపమేంటో ' అని హూంకరించి ఆపసోపాలు పడి అమాయాకంగా వంట మొత్తం చేసేసి కాలరెగరేసేవాడు.  ఆ తర్వాతే వస్తుంది అసలు చిక్కంతా . వంట ఏ మాత్రం బావున్నా  మొగుడనే  ఆ మానవమాత్రుడు ఇక చచ్చాడన్న మాటే. గోముగా గుండె మీద గోకి మెల్లగా  వంటింటి బాధ్యతను కూడా నేర్పుగా మొగుళ్ళకు బదలాయించేస్తారు పెళ్ళాలు . నేను గట్టిపిండాన్ని కాబట్టి ప్రమాదాన్ని పసిగట్టి ' కాలేజి రోజుల్లో మేం కూడా చేశాం లేవోయ్. నేను నాన్‌వెజ్ వండితే నాలుగు క్యాంపస్‌ల దాకా ఘుమఘుమలాడేది. అయినా నేను వంట చెయ్యాలంటే ఆ రోజుకొక ప్రత్యేకతుండాలి . ఆషామాషీగా వంట చేసెయ్యడం నాకిష్టం లేదు ' అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాను. ' మీరు వంట చేశారా ? I can imagine ' అని ఆ రోజంతా మా ఆవిడ పగలబడి నవ్వుతూనే ఉంది. ఇది ఇంకొక వెరైటి రెచ్చగొట్టే ప్రోగ్రాం అనుకొని నేను మిన్నకుండిపోయాను.


అయితే నేను వంట చెయ్యాల్సిన రోజు రానే వచ్చింది.


వేసవి సెలవులివ్వడంతో పాపను తీసుకొని మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. మా ఆవిడున్నప్పుడు పది సార్లు పిలిచినా భోజనానికి కదిలే వాన్ని కాదు. ఆ పనీ ఈ పని అంటూ సమయం వృధా చేసి తీరా తను టేబుల్ మీద ప్లేట్ పెట్టి అందులో అన్నీ వడ్డించేసాక తీరిగ్గా అప్పుడు పైకి లేచి పాదప్రక్షాళనం ,హస్త ప్రక్షాళనం, ముఖ ప్రక్షాళనం చేసుకొని అప్పుడు తినడానికి వెళ్ళేవాన్ని. ఇప్పుడు అంత సౌలభ్యం లేదు కాబట్టి నా ఏర్పాట్లేవో నేనే చేసుకోవాలి. అప్పటికీ చాలా రోజులు బయటి తిండి తింటూనే వచ్చాను.  కాస్త తేడా అయ్యి రెండు రోజులు కిందా మీదా అయ్యేసరికి, విజయదశమికి శాపగ్రస్తుడైన అర్జునుడు జమ్మి చెట్టు మీంచి గాండీవాన్ని తీసి టంకారావం చేసినట్లు నా పాకశాస్త్ర పాండిత్యాన్ని కూడా ప్రపంచానికి ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని నిర్ణయించుకున్నాను. ప్రొద్దున్నే టిఫన్ స్వయంగా చేసుకోవాలని అనుకున్నాను.




 నిజానికి ఇంత కష్టపడకుండా మా ఇంటిదగ్గర్లోనే ఒక టిఫన్స్ సెంటరుంది. అక్కడికి వెళ్ళి ఏ ఇడ్లీయో దోశెనో తిని మెల్లగా నడుచుకుంటూ వచ్చేయచ్చు. కానీ మిన్ను విరిగి మీద పడినా ఆ హోటల్‌లో మాత్రం కాలు పెట్టనని ముందే భీషణ ప్రతిజ్ఞ చేసేశాను. దానికో కారణముంది. ఓ సారి ఇలాగే వెళ్ళి ఇడ్లీ సాంబార్ ఆర్డరిచ్చాను. అదేం కర్మమో ఆ రోజు పని వాళ్ళు లేక ఓనరే సర్వింగ్ చేస్తున్నాడు. ఆర్డరిచ్చేటప్పుడు ' ఇడ్లీ మీద సాంబార్ కుమ్మరించకు. చెట్నీ మాత్రం సెపరేట్ గా ఇవ్వు చాలు ' నన్నాను. కన్నడిగులు సాంబార్లో బెల్లం వేస్తారు. అది నాకు నచ్చదు. ఓనరు నేను చెప్పినప్పుడు అన్నిటికి తలాడించి, సర్వింగ్ చేసేటప్పుడు మాత్రం తాను మైండ్‌లో దేనికి ఫిక్సయ్యాడో అలానే చేశాడు. ఇడ్లీల మీద గిన్నెల కొద్దీ సాంబార్ కుమ్మరించి తీసుకొచ్చాడు. ' నాకిలా వద్దు'  అంటే,  ' ఇప్పుడు ఇడ్లీ మీద సాంబార్ పోసేసాగా తీసుకో ' అన్నాడు. వాదనలు కొనసాగి నాకు తిక్క రేగి ' నీ హోటల్‌లో మళ్ళీ అడుగుపెడితే అప్పుడడుగు ' అని చెప్పి తినకుండానే వచ్చేశాను. అప్పటి నుంచి  ఆ హోటల్ గడప తొక్కటం లేదు.  


టిఫన్ చెద్దామని నిర్ణయించున్నాక ఉప్మా అయితే త్వరగా పూర్తవుతుందని, మా ఆవిడకు ఫోన్ చేసి ఎలా చెయ్యాలో కనుక్కున్నాను. అంతకు ముందెప్పుడూ ఉప్మా చేసిన అనుభవం లేదు కాబట్టి ఆ మాత్రం జాగ్రత్త తప్పలేదు. అవతల్నించి మా ఆవిడ కంఠంలో తలమునకలయ్యేంత ఆశ్చర్యం తన్నుకొచ్చి ఇవతల నా చెవులను తాకుతోంది. నేను నింపాదిగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ మా ఆవిడ చెప్పేది పూర్తిగా వినిపించుకోకుండా ' ఈ మాత్రం చాలు. ఇక చెలరేగిపోతా ' అని భరోసా ఇచ్చి ఫోన్ పెట్టేశాను. స్టవ్ వెలిగించి ముందుగా రవ్వ ఫ్రై చేశాను. మరో వైపు ఇంకో పాత్రలో నీళ్ళు వేడి చేశాను.ఈ రెండూ జరుగుతూండగానే సవ్యసాచిలా ఉల్లిపాయలు కట్ చేశాను. నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్న సన్నివేశం చూసి మా పనిమనిషి పాత సినిమాలో నౌకర్లా ' బాబు గారూ ' అని తెగ ఎమోషనల్‌గా ఫీలయిపోయినా పట్టించుకోలేదు.  పక్షి కన్ను తప్ప పరిసరాలు పట్టించుకోని పార్థునిలా ఫ్రై చేసిన రవ్వని ఒక పాత్రలో పోసుకొని, బాణలిలో వేడి నీళ్ళు పోసి అందులోకి రవ్వని షిఫ్ట్‌చేశి ఉప్పు వేశాను. వేయించిన ఉల్లిపాయల్ని కుడా కలిపాను. కరివేపాకు  కొత్తిమీర  కనిపించలేదు కాబట్టి వదిలేశాను .  ఏ జానర్ సినిమా అయినా రాయలసీమ శైలిలోనే సంభాషణలు పలికే జయప్రకాష్‌రెడ్డిలా, వంటేదైనా కారం తగలాలని పచ్చి మిరపకాయలు కట్ చేసి, సరిపోదేమో అని కొంచెం కారంపొడి కూడా చివర్లో వేశాను.  రిలాక్సై హాల్లోకొచ్చి టీ.వి చూస్తూ  ' ఇక అయిపోయినట్లే ' అని గర్వంగా కూర్చున్నాను. ఇంకా ఎన్ని అకృత్యాలు చూడాల్సి వస్తుందనేమో మా  పనిమనిషి అప్పటికే చెప్పా పెట్టకుండా పరారైపోయింది.   




ఉప్మా పూర్తయ్యింది . వేడి వేడిగా దించి ప్లేట్‌లో వేసుకొని నోట్లో ఒక్క ముద్ద పెట్టుకున్నాను కదా . పొలమారి కడుపులో రసాయనిక చర్యలు బయలుదేరాయి. రెండో ముద్ద వేసుకోవడానికి ధైర్యం చాలక కళ్ళు తిరిగినంత పనైంది.


కాలుజారి పడ్డ సుయోధనుడనై,
ఖిన్నుడనై,
దీనికి కారణంబేమిటి  అని పరిపరివిధాలా ఆలోచిస్తూ మా ఆవిడకి ఉప్మా ఫోటో పంపి, ఫోన్ చేస్తే ' ఉప్మా లో కారప్పొడి వెయ్యాలన్న వెరైటీ ఆలోచన మీకెలా వచ్చినది ఆర్యపుత్రా ? ' అని సమాధానం వినిపించినది.


అవతల్నుంచి మా పాప 'వావ్! నాన్న కేక్ చేశారు ' అంటొంది ఫోటో చూస్తూ. మా బామ్మర్దేమో ' హల్వా నా ?!  ' అని అమాయకంగా అడుగుతున్నాడు వాళ్ళక్కని.


మగబ్లాగర్లారా .అధైర్యపడకండి. ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపించే భిన్నత్వంలో ఏకత్వం లాంటి పరమాత్మ స్వరూపమైన ఉప్మా తయారు చెయ్యడం అంత సామన్యమైన విషయమేమి కాదు. ఆ విధంగా నేను విజయం సాధించినట్లే లెక్క.


అంతటి ఉప్మా ఫోటో ని మీకు చూడాలనుందా?


అయితే..క్రిందకు స్క్రోల్‌చెయ్యండి  
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.






రసరమ్య కావ్యం శ్రీరామరాజ్యం


రామాయణం భారతీయుల జీవాత్మ. శ్రీ రాముని పితృవాక్య పరిపాలన, సీతారాముల అన్యోన్యత , భరత లక్ష్మణ శతృఘ్నుల భాతృ భక్తి,  ఆంజనేయుని స్వామి భక్తి తరతరాలకీ చిరస్థాయిగా గుర్తుండిపోయేవి. ఎన్ని సార్లు చదివినా, పాడినా తనివితీరని గాథ అది. ఎల్కేజి ప్రేమలు, వెకిలి నవ్వులు, విపరీతమైన హింస, విశృంఖలత్వం తెలుగు సినిమా సామ్రాజ్యాన్నేలుతున్న ఈ రోజుల్లో, ఆ ఉధృతిలో పడి వో గట్టు చేరే ప్రయత్నం చెయ్యకుండా, ఏటికి ఎదురీది రామయణ నేపథ్యాన్ని, అందునా శోక ప్రధానమైన ఉత్తర రామాయణ ఘట్టాన్ని ఎన్నుకొని ఒక సినిమా నిర్మించాలనుకోవడానికి చాలా ధైర్యముండాలి. అంతకు మించి రామ కథ మీద అచంచలమైన భక్తి, విశ్వాసం ఉండాలి. ఆ రెండూ ఉన్న నిర్మాత యలమంచలి సాయిబాబు. మరో నిర్మాత  అయ్యుంటే (శ్రీరామదాసు, పాండురంగడు నిర్మాతలు) ఎలాగోలా ఈ సినిమాని చుట్టేసి ఓ పనైపోయిందనుకొనేవారు. సాయిబాబు మాత్రం ఎక్కడా రాజీపడలేదు. ఖర్చుకు వెనుకాడకుండా అత్యుత్తమమైన ఫలితం కోసం ఆయన పడిన తపనంతా సినిమాలో ప్రతి నిమిషం కనిపిస్తుంది. తెలుగులో ఇటువంటి కమిట్‌మెంట్ ఉన్న నిర్మాతంటే  శ్యాంప్రసాద్ రెడ్డి తప్ప ఇంకెవరూ గుర్తురారు నాకైతే. అందుకే సాయిబాబు గారికో సాష్టాంగ నమస్కారం.


కథ అందరికీ తెలిసిందే కాబట్టి దాని జోలికి పోను. కాకపోతే ఇందులో ఒక ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన మార్పు చేశారు. ఎన్నో ప్రయాసలు పడి సీతారాములనొక్కటి చేసిన హనుమంతుడు మళ్ళీ అడవుల పాలైన సీతమ్మను చూసి కృంగి పోతాడు. దారి చూపవయ్యా అని వేడుకుంటే బాలుని రూపంలో ఆశ్రమంలోనే ఉంటూ రామకథను గానం చేస్తూ, సీతమ్మ దుఃఖానికి ఉపశమనం చేకూర్చమని చెబుతాడు వాల్మీకి. ఇదే సృజనాత్మకత అంటే. రామకథను అణువణువునా జీర్ణించుకుని నిత్యం తర్కవితర్కాలు చేసి విశ్లేషించుకుంటే తప్ప ఇటువంటి భావనలు రావు. శ్రీరామరాజ్యానికి మాతృకైన లవకుశ కూడా కల్పితమే కాబట్టి, హనుమంతుడి పాత్రౌచిత్ర్యం దెబ్బతినలేదు కాబట్టి ఇది తప్పా వొప్పా అన్న ప్రశ్న ఉదయించదు. 




లవకుశతో బేరీజు వెయ్యకుండా చూస్తే శ్రీరామరాజ్యం ఒక అద్భుత దృశ్యకావ్యమనిపిస్తుంది. రాఘవేంద్రరావు వడ్డించిన కమర్షియల్ కిచిడీలతో పోల్చుకుంటే పంచభక్ష్య పరామాన్నం లాంటి ఈ సినిమా ఒక క్లాసిక్ అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. శ్రీరాముడిగా నందమూరి బాలకృష్ణ బాగా చేశాడనే చెప్పుకోవాలి. అతని పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో మెప్పించాడు.  ఆహార్యంలో తండ్రిని తలపించి, ఉచ్ఛారణలో వైవిధ్యాన్ని చూపించాడు. భధ్రుని మాటలు విని సీతను పరిత్యజించే సమయంలో బాధను, శృంగార సన్నివేశాల్లో చిలిపిదనాన్ని, కుశలవులతో వాగ్యుద్ధ సమయంలో రామబాణం వైశిష్ట్యాన్ని చెబుతూ  వీరరసాన్ని,సీత భూమిలోకి వెళ్ళిపోయే సమయంలో దుఃఖాన్ని,అసహాయతను స్పష్టంగా పలికించాడు. అతని దురదృష్టమేమిటంటే యాభైయేళ్ళ వయసులో ఈ సినిమా చేసే అవకాశం రావడం. ఫలితంగా కొన్ని క్లోజప్ షాట్స్‌లో ముదిమి ఛాయలు  కనిపిస్తాయి. వెండితెర రాముడిగా వీక్షకుల  గుండెల్లో కొలువుదీరిన ఆ 'తారకరాము' డి  తనయుడు కావటం మరో చిక్కు. ఎలా చేసినా శల్యపరీక్షలు చేసి తేలిగ్గా పెదవి విరిచేసేవాళ్ళూ లేకపోలేదు. సీతా శోకం ప్రధానమైన ఇతివృత్తంలో వియోగియైన భర్తగా విషాదాన్ని మొహాన పులుముకొని, తన శైలికి భిన్నంగా ప్రశాంతంగా సంభాషణలు పలుకుతూ, రౌద్రరసానికి అలవాటు పడిన అభిమానులని అలరించాలి. ఇన్ని ఒత్తిళ్ళను తట్టుకుంటూ కత్తి మీద సాము లాంటి శ్రీరామ పాత్రపోషణలో బాలకృష్ణ కృతకృత్యుడే అయ్యాడు. టాప్‌హీరో సమయంలోనే బాపుతో భగవాన్ శ్రీ కృష్ణ అనే పౌరాణిక చిత్రం ప్లాన్ చేసినా, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీ కృష్ణార్జున విజయం పరాజయం పాలవ్వడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఇప్పటికి అతని కల సాకరమయ్యింది.


 నయనతార నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సీతగా తన పేరును ప్రకటించగానే రకరకాల సందేహాలు వ్యక్తం చేసి బ్యాడ్ ఛాయిస్‌గా తీర్మానించేసిన ప్రేక్షకులందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా నటించి మెప్పించింది. కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతూంటే అటు బాలామణి సీతగా స్వయంవరంలో, ఇటు రాముని పత్నిగా అంతఃపుర సౌధాలలో, శోకగ్రస్తయైన తల్లిగా వాల్మీకి ఆశ్రమంలో పరిణితి చెందిన హావభావలు కనబరిచి ఆకట్టుకుంది. ఆమె ప్రతిభకు గీటురాయిగా నిలిచే ఎన్నో సన్నివేశాలు ఈ చిత్రంలో ఒకదాని వెనుక మరొకటి వస్తూ మంత్రముగ్ధులను చేస్తాయి. బరువైన సన్నివేశాలలో కంటతడి తెప్పించే సత్తా తనకూ ఉందని రుజువు చేస్తూ తన సినీజీవితానికే తలమానికమైన నటన ఈ చిత్రంలో ప్రదర్శించింది. హాట్సాఫ్ 


కుశలవులగా చేసిన చిన్నపిల్లలు ముద్దుగా చేశారు. కుశుడితో పోలిస్తే లవుడికి ముందస్తు సినిమా అనుభవం ఉండటం వలన అతనిలో భావాలు బాగా పలికాయి. బాల హనుమంతుడిగా చేసిన పిల్లాడు కూడా బాగా చేశాడు. బాలనటుల క్యాటెగరిలో వీరిద్దరిలో ఒకరికి అవార్డొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


అక్కినేని నాగేశ్వరరావు గురుంచి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు. ఇటువంటివన్నీ ఆయనకు కొట్టిన పిండి.


లక్ష్మణుడిగా శ్రీకాంత్ ఫర్వాలేదనిపించాడు. సీతను అడవిలో వదిలే సన్నివేశంలో మాత్రం ఇంకాస్త బాగా  చేసుండాల్సిందనిపించింది .


భూదేవిగా రోజా, భరతుడిగా సమీర్, చాకలి తిప్పడుగా బ్రహ్మానందం, ఇతర పాత్రలలో కే.ఆర్ విజయ, మురళీమోహన్, సీనియర్ నటుడు బాలయ్య సరిగ్గా ఇమిడిపోయారు . మర్యాదరామన్నలో నాగినీడుగా మెప్పించిన విలన్ పాత్రధారి ఋష్యశృంగునిగా నటించారు. నారద పాత్రలో ఏవియస్ కూడా కొన్ని సెకన్ల పాటూ తళుక్కున మెరుస్తారు. ఆంజనేయుడి దవడల మేకప్ మాత్రం ఒక్కో సీన్‌లో ఒక్కోలా ఉంది.


దర్శకత్వం విషయానికొస్తే, పచ్చటి ప్రకృతి కాన్వాసుపై వెచ్చటి ఏడు రంగుల ఇంధ్రధనస్సు చెక్కిన విధాతలా వెండితెరపై శ్రీరామరాజ్యాన్ని హృద్యంగా ఆవిష్కరించారు బాపు.  స్వతహాగా గొప్ప చిత్రకారుడు కావటం మూలన సన్నివేశాన్ని ఎంతబాగా ప్రెజంట్ చెయ్యవచ్చో ఆయనకు బాగా తెలుసు. భారీ రాజప్రాసాదాల నుంచి తెలుగుదనం తొణికిసలాడే ముని పర్ణశాలల వరకు  ఆయన ఆభిరుచి ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. కళ్ళను కట్టిపడేస్తుంది. రమణ గారి సంభాషణలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రాముడి ఏకపత్నీవ్రతతని, హనుమంతుని భక్తి తత్పరతని పిట్ట కథల రూపంలో చెప్పారు. రామయణం అంటే రాముని కథ కాదని, రాముడు నడిచిన మార్గమని అందరికీ తెలిపే ప్రయత్నం చేశారు. లవకుశలోని కొన్ని పద్యాలు డైలాగ్స్ రూపంలో అక్కడక్కడా వాడుకున్నారు. గ్రాఫిక్స్ విరివిగా ఉపయోగించారు.

ఇళయరాజా సంగీతం వీనులవిందుగా ఉంది. పాటల విషయంలో మాత్రం కాస్త అసంతృప్తి మిగిలింది. శ్రీరామా లేరా ఓ రామా పాటలో మొదటి చరణం కట్ చేశారు.  శ్రీరామంజనేయ యుద్ధం సినిమాలో మేలుకో శ్రీ రామ పాట చూసి, బాపు ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించి ఉంటారనుకున్నాను. రెండవ చరణం బావున్నా మొదటి చరణం మొత్తం ఎగిరిపోయింది. అలాగే కలయా నిజమా పాటలో పల్లవులెగిరిపోయాయి. ఆల్బంలో నాకు బాగా నచ్చిన రెండు పాటలివి. గాలీ నింగీ నీరు పాటలో కూడా చివరి లైన్లు కనబడవు, వినబడవు. రామాయణము పాట పావుశాతమే ఉంది.  క్లైమాక్స్‌లో  శ్రీరాముడు కుశలవులతో మాట్లడుతూ  శస్త్రవిద్యలలోనే కాదు అస్త్రవిద్యలలో కూడా మీకు నైపుణ్యమున్నదన్న మాట అంటాడు. దీన్ని బట్టి చుస్తే కుశలవులతో రాముడు యుద్ధం చేసిన సన్నివేశాలున్నట్లనిపిస్తుంది. చిత్రవ్యవధిని దృష్టిలో ఉంచుకొని ఎడిటింగ్‌లో ఇవన్నీ తీసేశారో లేక సినిమాలో ఉన్న భాగాలను మాత్రమే షూట్‌చేసారో తెలియదు. అవి కూడా ఉండుంటే ఇంకా బావుండేది.


 తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది . లేకపోతే భవిష్యత్తులో భక్తిరస చిత్రమంటే  క్రియేటివిటీ పేరుతో కేరళలోనో, కౌలాలంపూర్‌లోనో డ్యూయెట్లు పెట్టించి, బొడ్డు పాటల కోసం ఒక పాత్రను సృష్టించి  , బ్రహ్మానందం, ఆలీ , సునీల్‌లతో వెకిలి హాస్యం గుప్పించిన కే.రాఘవేంద్రరావు సినిమాలే గుర్తుకొస్తాయి. ఆ పైన మీ ఇష్టం.


థ్రిల్లర్


ప్రేమంటే ఏమిటి ?
దాని లక్షణాలేమిటి ?
దానిలో నిజాయితీ ఎంత ?
ఏది ప్రేమ? ఏది ఆకర్షణ ?
ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దేనికి ప్రేమిస్తాడు ?

కఠోరమైన మనః ప్రవృత్తికి ఆహ్లాదకరమైన ముసుగు తొడిగి, తమ ప్రత్యేకతలను సద్గుణాలను మాత్రమే బయటికి ప్రొజెక్ట్ చేస్తూ,  అవతల వ్యక్తిని ఇంప్రెస్ చెయ్యటానికి తాపత్రయపడటమే  ప్రేమా ? ప్రేమకు పరమావధి పెళ్ళేనా ? పెద్దల్ని ఎదిరించి ప్రేమవివాహాలు చేసుకొని పెళ్ళాలను పుట్టింటికి పంపటానికి భీష్మించే భర్తలది, మెట్టినింటి చిన్న చిన్న సంప్రదాయాలని పాటించటానికి నానా రాద్ధాంతం చేసే భార్యలది నిజమైన ప్రేమేనా ?  ఏ ప్రయోజనాన్ని ఆశించని నిస్వార్థమైన ప్రేమ అసలుందా ? ఈ విషయాలన్నిటినీ స్పృశిస్తూ ఒక అద్భుతమైన అబ్సర్డ్ నవల వస్తే అదే యండమూరి వీరేంద్రనాథ్ థ్రిల్లర్. అబ్సర్డ్ నవలలో కథ కంటే భావం ప్రధానం. దాన్ని మనసుకు హత్తుకునేలా చెప్పటానికి  కొన్ని అవాస్తవిక సంఘటనల సహాయం తీసుకుంటారు రచయితలు. అటువంటిదే ఏడేళ్ళు ప్రేమకోసం తపస్సు చెయ్యటం. ఇది సాధారణంగా జరిగే పనికాదు. కానీ అటువంటి సంఘటనొకటి జరిగి,  ప్రేమరాహిత్యంతో బాధపడుతూ హ్యూమన్ రిలేషన్స్‌పైనే అసహ్యాన్ని నింపుకున్న ఓ అమ్మాయికి విశ్వజనీయమైన ప్రేమను బోధిస్తూ ఒక యువకుడు వస్తే ..అదే థ్రిల్లర్ .

కథలోకి  వస్తే విద్యాధరి ఒక అందమైన మధ్యతరగతి అమ్మాయి. అనాథ. ఆమె బాల్యం, పరిసరాలు ఆమెకు మానవ సంబంధాలపైనే ఒక రకమైన కసిని కలిగిస్తాయి. ఒకప్రముఖ దిన పత్రిక సంపాదకుడిగా పనిచేస్తూ పేరు ప్రఖ్యాతులు  లభించాక, నైతిక విలువలకు తిలోదకాలిచ్చి స్త్రీలోలుడై భార్యను హతమార్చి ఏ కేసు లేకుండా చూసుకున్న ఆమె తండ్రి, తండ్రిలాంటి వాడినని చెప్పుకుంటూ ఆమెను లోబర్చుకోవాలని ప్రయత్నించే ముసలి ఇంటి ఓనరు, తాగి నీటి తొట్లో పడిపోతే మానవతాభావంతో సపర్యలు చేసినందుకు ప్రేమించమని వేధించే ఆయన కొడుకు, ఆమె ఒంటరితనాన్ని ఆసరా చేసుకుని ఆమెను పొందాలనుకొనే ఆమె మేనేజరు ఇలా అందరూ ఆమె ప్రవర్తనపై చెరగని ముద్రవేసిన వాళ్ళే.

రెస్టారంట్‌లో తన ఇగో దెబ్బతీసినందుకు విద్యాధరిని దొంగ రశీదుల కేసులో ఇరికించి, ఆమెను భయపెట్టి పాదాక్రాంతం చేసుకోవాలనుకుంటాడు ఆమె మేనేజరు చక్రధర్. అటువంటి సమయంలో నాటకీయంగా రంగప్రవేశం చేసిన అనుదీప్ విద్యాధరికి ధైర్యం చెప్పి, చక్రధర్ బారి నుండి ఆమెను కాపాడుతాడు. తానెవరో ఆమెకు తెలియజేస్తాడు. ఏడు సంవత్సరాల క్రితం ఆమెను బస్‌లో చూసి ప్రేమలో పడ్డానని, ఆమె ప్రేమను పొందడానికి ఏడేళ్ళు వింధ్య పర్వతాలలో తపస్సు చేసానని చెబుతాడు. ' అన్ని సంవత్సరాలు తపస్సు చెయ్యడం దేనికి ? అప్పుడే చెప్పోచ్చు కదా ' అంటే ' అప్పటికే ఆమె వెంట తిరుగుతున్న రోమియోల్లో ఒకడ్ని కావటం ఇష్టం లేక, తన ప్రేమను అంగీకరిస్తుందో లేదో అన్న అనుమానం చేత ఆ పని చెయ్యలే' దంటాడు. ఆమె అతన్ని పిచ్చివాన్నిగా జమకడుతుంది. అతను తన ప్రేమ తీవ్రతను నిరూపించుకోవటానికి ఆమె శరీరంపై ఆమెకు తెలియకుండా ప్రేమ సందేశం వ్రాస్తాడు.  ప్రేమికుడంటే తనకు ప్రియమైనదాన్ని ప్రియురాలి కోసం వదులుకునేవాడని ఆమె ఒక పుస్తకంలో వ్రాసుకుంటే తనకెంతో ఇష్టమైన కుడిచేతిని భుజం వరకు నరికేసుకుంటాడు. సినిమా థియేటర్లో  బ్యాండేజీ కట్టబడి శూన్యంగా వున్న అతని కుడి భుజాన్ని చూసి విద్యాధరి భయంతో కేకలు వేస్తుంది. అదే థియేటర్‌కి కుటుంబంతో సహా వచ్చిన ఆమె తండ్రి స్నేహితుడు పోలీస్ కమీషనర్ ధర్మారావు ఆమెనెవరో ఆకతాయి ఏడిపిస్తున్నాడని భావించి అతని సంగతి చూడమని ఎస్సై విశ్వనాథాన్ని పురమాయిస్తాడు .

పోలీస్ స్టేషన్లో ఎస్సై విశ్వనాథానికి అతని భవిష్యత్తు చెప్పి, తన ప్రేమ శక్తిని నిరూపించుకోవటానికి కుడిచేతిని మళ్ళీ మొలిపిస్తాడు అనుదీప్. అతను నిజంగా చెయ్యి తెగ్గోసుకోలేదని, కేవలం ఆ భావాన్ని కలిగించాడని , అతనో మెస్మరిస్టన్న అంచనాకి వస్తారు ధర్మారావు, విద్యాధరి. విద్యాధరికి రక్షణగా ఇద్దరు కానిస్టేబుల్స్ ని నియమించి అతన్ని ఎలాగైనా పట్టుకోమని విశ్వనాథాన్ని ఆదేశిస్తాడు  ధర్మారావు.

దొంగ రశీదులతో ఇన్వెస్టర్లకు కోట్లరూపాయిల్లో ధనం ఎగ్గోట్టడానికి చక్రధర్, అతని పార్ట్‌నర్ పథకం పన్నారని, చక్రధర్ దగ్గర్నుంచి అందుకు సంబంధించిన రహస్య పత్రాలేవైనా సంపాదించి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సహకరించమని విద్యాధరిని కోరుతాడు ధర్మారావు. విద్యాధరి ఉత్సాహంతో అంగీకరిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అనుదీప్ అనవసరమైన రిస్కులు తీసుకోవద్దని ఆమెకు సలహా ఇస్తాడు. ఆమె దాన్ని పట్టించుకోదు. తమ మధ్య జరిగిన గొడవకు బాధపడుతున్నట్లు చక్రధర్‌ని నమ్మిస్తుంది. ఉబ్బితబ్బిబైన అతడు ఆమెను తన ఇంటికి ఆహ్వానిస్తాడు. రహస్య పత్రాలు సంపాదించటానికి ఇదే అనువైన అవకాశమని విద్యాధరి భావిస్తుంది. ఈ అసైన్మెంట్ గురుంచి విశ్వనాథంకు చెప్పి చక్రధర్ ఇంటికి వెళ్తుంది. అయితే ఆమె అంచనాలన్నీ తారుమారయ్యి కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటుంది. చక్రధర్ హత్యజేయబడతాడు. ఆమె నిందితురాలవుతుంది. తను ఏ నేరం చెయ్యలేదని మొత్తుకున్నా ఆమె మాట ఎవరూ వినరు.

రవిశాస్త్రి మరో పోలీసాఫీసర్. అనుదీప్ గురుంచి మొదటిసారి విన్నప్పుడు కలిగిన అసక్తితో పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేసి అతను నిజంగానే వింధ్య పర్వతాలలో ఏడు సంవత్సరాలు తపస్సు చేశాడని తెలుసుకొని నిర్ఘాంతపోతాడు .అనుదీప్  అతనికి కొన్ని క్లూస్ ఇచ్చి చక్రధర్ హత్య వెనుక అతని పార్ట్‌నర్, ఎస్సై విశ్వనాథంల హస్తం ఉందని తెలియజేస్తాడు. విద్యాధరి విడుదలవుతుంది. తనకు సాయం చేసింది అనుదీప్ అన్న విషయం ఆమెకు తెలియదు. అనుదీప్‌కి మాటిచ్చిన కారణంగా రవిశాస్త్రి కూడా మౌనం వహిస్తాడు.  అనుదీప్ తన ప్రేమ సందేశాన్ని ఒక క్యాసేట్లో నిక్షిప్తం చేసి రవిశాస్త్రి ద్వారా ఆమెకు చేరవేస్తాడు. తను జైల్లో ఉన్నప్పుడు ఏ మాత్రం పట్టించుకోకుండా, బయటపడ్డాక మళ్ళీ తయారైన అనుదీప్‌ని చూసి ఆమెకు పట్టరాని కోపం వస్తుంది. క్షుద్ర విద్యలతో మనుషుల్ని కనికట్టులో పడేస్తున్నావని నిందిస్తుంది. అనుదీప్ హర్టవుతాడు. తను మెస్మరిస్టు కాదని, మెస్మరిస్టు కేవలం కొంత మందిని మాత్రమే మోసం చెయ్యగలడని,  ప్రపంచాన్ని మొత్తం మోసం చెయ్యలేడని, తన ప్రేమ నిజమే అయితే ప్రపంచమంతా కరెంటు పోతుందని, ఆమెకు నమ్మకం కలిగాకే కరెంటు వస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు.

కరెంటు పోతుంది. విద్యాధరి ధర్మారావు ఇంటికి వెళ్ళి తనకు అనుదీప్‌కి మధ్య జరిగిన సంభాషణ చెబుతుంది. ధర్మారావు ఫోన్లు చేసి ప్రపంచమంతా కరెంటు పోయిందని నిర్థారించుకుంటాడు. విద్యాధరి అనుదీప్ ఇంటికి వెళ్ళి అతన్ని ప్రేమిస్తున్నట్లు కాగితం వ్రాసి, అతని తల్లిదండ్రులకు ఇచ్చి వస్తుంది. ఈ లోగా తన స్వార్థం కోసం ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక కరెంటుని తిరిగి రప్పించమని దేవున్ని వేడుకుంటాడు అనుదీప్. అయితే ఇదంతా బూటకమని ఒక కొత్త జనరేషన్ కంప్యూటర్ కనుక్కోవటం వల్ల ఎలెక్ట్రాన్ల ప్రవాహం  ఆగిపోయి ప్రపంచమంతా కరెంటు పోయిందని, ఈ విషయం ముందే తెలుసుకున్న అనుదీప్ తెలివిగా అందరినీ ఫూల్స్‌ని చేశాడని ధర్మారావు చెబుతాడు. ఇలాంటి వాడిని వదిలెయ్యటం ప్రమాదకరమని ఒక తెల్లకాగితం మీద సంతకం పెట్టిస్తే పోలీసులు మిగతా సంగతి చూసుకుంటారని చెప్పటంతో అలానే చేస్తుంది విద్యాధరి. 

బెయిలు మీద విడుదలైన చక్రధర్ బిజినెస్ పార్ట్‌నర్, ఎస్సై విశ్వనాథం సాక్ష్యాలను సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించుకుని విద్యాధరి హత్యకు పథకం వేస్తారు.  ఆమెను రక్షించే క్రమంలో కత్తిపోట్లకు గురయ్యి కుప్పకూలిపోతాడు అనుదీప్. మరణశయ్య మీదున్న అతన్ని చూసి జాలిపడకుండా ఇది కూడా  క్షుద్ర విద్యే అని నిర్దయగా మాట్లాడిన విద్యాధరి చెంప చెళ్ళుమనిపిస్తాడు రవిశాస్త్రి. అనుదీప్ గురుంచి తను తెలుసుకున్నవి, అతను ఆమెకెలా సాయపడిందీ వివరిస్తాడు.  బరువెక్కిన హృదయంతో, వెల్లువెత్తిన ప్రేమతో విద్యాధరి అనుదీప్ ప్రేమను అంగీకరించటానికి హాస్పిటల్‌కు వెళ్తుంది. అయితే అక్కడ అనుదీప్ పేరుతో ఎవరూ అడ్మిటవ్వలేదని తెలిసి విస్తుబోతుంది. అంతే కాదు అంతకుముందు జరిగిన సంఘటనలన్నీ కలే అని తెలిసి అయోమయానికి గురవుతుంది.వాస్తవానికి జరిగింది వేరే. తనది నిస్వార్థమైన ప్రేమైనప్పుడు ఆమెనుంచి ప్రేమను ఆశించటం కూడా తప్పే అని గ్రహించిన అనుదీప్,అమె జ్ఞాపకాలను తనతో తీసుకుని వెళ్ళిపోతూ (మరణిస్తూ) ప్రేమ ద్వారా తనకు లభించిన అతీతమైన శక్తులతో ఇప్పటివరకు జరిగినదంతా కలేనన్న నమ్మకాన్ని ఆమెకి కలిగిస్తాడు. ఇంతగా ప్రేమించినవాడు తనకు శాశ్వతంగా దూరమయ్యాడన్న బాధ ఆమెకు కలుగకుండా ఉండటం కోసం జరిగిందంతా కలేనన్న విశ్వాసం ఆమెకు కలిగించి, ఆమెలో మనుషుల పట్ల, ప్రేమ పట్ల సద్భావన కలిగిస్తాడు.



నా దగ్గరున్న పాత వర్షన్‌లో ఇదీ ముగింపు. తర్వాత వచ్చిన వర్షన్స్‌లో మార్చినట్లున్నారు. విద్యాధరి హాస్పిటల్‌కు వెళ్ళి అచేతనానవస్థలో నున్న అనుదీప్ ని ముద్దు పెట్టుకోవటంతో అనంతవాయువుల్లో కలిసిపోబోతున్న అతని ప్రాణాలు తిరిగి వస్తాయి. కథ సుఖాంతమవుతుంది.

అనుదీప్ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు రచయిత. ఒక గొప్పింటిని కుర్రాడిని ప్రేమించి, వివాహం చేసుకుని, కుటుంబ సమస్యలతో సతమవుతూ పుట్టెడు చాకిరీ చేసినా అత్తవారింట్లో గుర్తింపుకు నోచుకోక, విషజ్వరంతో మరణించిన అతని చెల్లెలు, ఆమె వ్రాసిన ఆఖరి ఉత్తరం అతన్ని కదిలిస్తాయి. విద్యాధరిని ప్రేమించిన తొలినాళ్ళలో జరిగిన ఈ సంఘటన అతని జీవితాన్నే మార్చివేస్తుంది. ప్రేమంటే ఏమిటన్న ఆలోచన మొదలవుతుంది. శరీరం కోసం భార్యని, వృద్ధాప్యం కోసం పిల్లల్ని, అహం తృప్తి కోసం ప్రియురాలిని, అవసరం కోసం భర్తని, రక్షణ కోసం కులాన్ని, మతాన్ని దేశాన్ని ఇలా సంకుచితంగా కాకుండా ప్రేమనేది లేదా అన్న చింతన బయలుదేరుతుంది.  చదువు మధ్యలో ఆపేసి, ప్రేమంటే ఏమిటో తెలుసుకోవటానికి, తన ప్రేమ నిజమా కాదా అని తెలుసుకోవటానికి, ఆమె తనను ప్రేమించేలా చెయ్యమని దేవున్ని కోరుకోవటానికి ఏడేళ్ళు వింధ్య పర్వతాలలో తపస్సు చేస్తాడతను. తీరా దేవుడు ప్రత్యక్షమయ్యాక ఆయన రికమెండేషన్‌తో సంపాదించుకోనే కృత్రిమమైన ప్రేమ వద్దనుకుని, స్వశక్తితో ఆమె ప్రేమను గెలుచుకోవాలనుకుంటాడు.  అందుకు గాను తనకు తానే మూడు షరతులు విధించుకుంటాడు.


  • 1. వాక్చాతుర్యంతో కానీ, ధీరోదాత్తమైన చర్యల ద్వారా గానీ, బహుమతుల ద్వారా గానీ, మగ స్పర్శ తాలూకు టెంప్టేషన్ ద్వారా గానీ ఆమె ప్రేమను పొందరాదు.

  • 2. ఆమె అభిప్రాయాలతో ఏకీభవించినట్లు మాట్లాడి, ఆమె కష్టల్లో ఉండగా ఓదార్చి ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యరాదు. 

  • 3. మంచి భవిష్యత్తు, సుఖప్రదమైన సంసారం, సెక్యూరిటీ లాంటి వాగ్దానాలు చేసి ఆమెను ఆకట్టుకోరాదు.


ఇవేవీ లేకుండా ఒకమ్మాయి మనస్సు గెలుచుకోవటం సాధ్యమయ్యే పనేనా?  అనుదీప్ సాధ్యమేనని నమ్ముతాడు. అతని పేరున బోల్డంత పుణ్యం జమయ్యింది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం పరిత్యజించే అవకాశమిస్తాడు దేవుడు. అనుదీప్ మాత్రం నెలరోజుల్లోగా విద్యాధరి ప్రేమను గెలుచుకోలేకపోతే శరీరం విడిచిపెట్టేయాలని నిర్ణయించుకుంటాడు. ఎత్తుకున్న కథాంశం ఏదైనా అది చదువరుల మానసిక వికాసాన్ని పెంపొందించేలా చెయ్యటంలో యండమూరి వీరేంద్రనాథ్‌ది అందెవేసిన చెయ్యి. ఈ నవలలో కూడా అది ప్రతిఫలించింది. బుద్ధుడిలా జ్ఞానోదయం పొంది, భీష్ముడిలా స్వచ్ఛంద మరణం వరంగా పొందిన అనుదీప్ ప్రియురాలి ప్రేమను పొందే క్రమంలో సంధించే ప్రశ్నలు , చేసే వాదనలు పాఠకుల్ని ఆలోచింపచేస్తాయి. తపస్సు దాకా అక్కర్లేదు. తమది ప్రేమేనా?  ఏమాశించి తాము ప్రేమిస్తున్నాం? తమ ప్రేమలో నిజాయితీ ఎంత?  అని పది నిమిషాలు నింపాదిగా ఆలోచించే వాళ్ళు యువతరంలో ఎంతమందున్నారన్నది ప్రశ్న. తమ ప్రేమ గురుంచి తల్లిదండ్రులకు మాటమాత్రం చెప్పకుండా  మోసం చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళు రేప్పొద్దున్న తమ జీవిత భాగస్వామిని మోసం చెయ్యరన్న నమ్మకమేమిటి? అంత విచక్షణే ఉంటే ఇన్ని ఆసిడ్ దాడులు, ఆత్మహత్యలు జరుగుతాయా?

ఈ నవలను రాజేంద్రప్రసాద్, సీత ప్రధాన పాత్రధారులుగా ముత్యమంత ముద్దు పేరుతో తెరకెక్కించారు. మూలాలు చెడగొట్టకుండా తమ పరిధి మేరకు బాగానే తీశారు. రవిరాజా పినిశెట్టి దర్శకుడు.  సినిమాలో కథను సుఖాంతం చేశారు. నవలలో లేని దివ్యవాణి పాత్ర సినిమాలో బాగా పండింది.  హంసలేఖ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు కూడా బాగా పాపులరయ్యాయి. అయితే సినిమా కంటే నవల చాలా బావుంటుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.


భగ్నప్రేమ

కౌముది.నెట్ తాజసంచిక (సెప్టంబరు 2011) లో కవితాకౌముది విభాగానికి వెళ్ళి నా కవిత 'భగ్నప్రేమ '( ఇక్కడ ) చదివి మీ అమూల్యమైన అబిప్రాయాలు తెలియజేయండి. కవితను ప్రచురించిన కౌముది యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.





చైత్రమాసపు కోయిలనై చివురించిన తలపులన్ని ఎలుగెత్తి పాడాను
వైశాఖ గాడ్పులలో వలపు చలివేంద్రమంటి నీ చిరునామా వెదికాను
జగతిలో శ్రేష్టమైనవన్నీ జ్యేష్ఠలో పదిలపరిచాను
ఆషాడ మేఘాల అనురాగ పరిష్వంగంలో
నీ అందెల నిక్వాణం విని నిదురమరిచాను
భారమైన హృదయం ఆవిరైన ఆర్ణవమైతే
కురిసిన శ్రావణ భాధ్రపద కుంభవృష్టి ధారలలో 
తడిసీ, వణికీ తనువంతా నీరైపోయాను
ఆశ్వయుజమంతా ఆశలపందిళ్ళు పరచి
ఆవిష్కృత శరద్వెన్నెలలో నీ మోము గాంచి
అవ్యక్తానుభూతుల సుడిలో అవశేషమునై నిలిచాను
కార్తీకమంతా కలతల కడగండ్లు రేగి
కాటుక శర్వరిలా కమ్ముకొని భయపెడితే
వెచ్చని నీ ఊసుల దీపాలు వెలిగించి ఉపశమనం పొందాను
నీ వియద్వేణియ నుండి విరివిగా రాలిన నీటిబొట్లు 
మార్గశీర్షపు తొలిసంధ్యలలో మంచుముత్యాలై మెరిసిపోతే
మత్తెక్కిన మధుపమునై తిరిగి మధురోహలు గ్రోలాను
పుష్యమాసపు ప్రవాసినై
ప్రేమంతా పోగు చేసి పుష్పమాలికలల్లి
భవిష్యత్ బహిర్ద్వారం వద్ద బంట్రోతునై నిలబడితే
తిరస్కరించి తూలనాడి తిమిరంలోకి నెట్టేశావు
మాఘమాసపు పెళ్ళిపందిరిపై మందస్మితయై అటు నువ్వు
మొదలు తెగిన వృక్షమునై మృత్యువాకిట ఇటు నేను
కఠిన కర్కశ పాషాణ నాతివై నువ్వు కాదు పొమ్మన్నా
కడతేరని ప్రేమతో కొత్త ఊపిరులూదుకుంటాను
నీ పెరటి పున్నమితోటలో
ఫల్గుణినై పరిమళిస్తాను










పురాణాల్లోంచి కొన్ని వినాయక విశేషాలు

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.పండుగ సందర్భంగా విఘ్నేశ్వరునికి సంబంధించిన పురాణ విశేషాలు కొన్ని తెలుసుకుందాం.

  1. 1.   మహావిష్ణువుకు జయ-విజయులనే ద్వారపాలకులున్నట్లే ఆయన చెల్లెలైన పార్వతీదేవికి జయ,విజయ అనే చెలికత్తెలున్నారు. ఎంతసేపూ అయ్యవారైన భోళాశంకరుడి ఆజ్ఞలు శిరసావహించేవారే కాకుండా అమ్మవారి మాటలను ఔదలదాల్చేవాడు కూడా ఒకడుండాలని చెప్పడంతో పార్వతి తన ఒంటిమీద నలుగుపిండితో గణేశుని సృష్టించి ద్వారపాలకుడిగా నియమిస్తుంది.

  2. 2.   గజాసురుడనే శివభక్తుడైన రాక్షసుడు ఏనుగు ముఖంతో వున్నవాడి చేతిలోనే మరణం సిద్ధించాలని వరం కోరుకుంటాడు. దానికోసమే కైలాస పర్వత సానువుల్లో ఉత్తరాభిముఖంగా అమంగళంగా పడి వున్న ఏనుగు ముఖాన్ని ఉత్తరించి గణేశుని బ్రతికిస్తాడు పరమశివుడు.

  3. 3.   వినాయకుడు ఎరుపు వర్ణంలో వుంటాడు. ఆయన ఏకదంతుడు. కుడిచేతివైపు దంతం విరిగిపోయి ఉంటుంది. బ్రహ్మదేవుని సూచన మేరకు మహాభారత రచన కోసం గణేశున్ని ప్రార్థిస్తాడు వ్యాసభగవానుడు. గణేశుడు ప్రత్యక్షమై వ్యాసుడు ఆపకుండా చెప్పుకుంటూ వెళ్తేనే తాను వ్రాస్తానని షరతు విధిస్తాడు. వ్యాసుడు అంగీకరించి తను చెప్పినది అర్థం చేసుకొనే గణేశుడు వ్రాయాలని మెలిక పెడతాడు. వ్యాస భగవానుడు సంక్లిష్టమైన పదాలతో,అద్భుతమైన వర్ణనలతో మహాభారతాన్ని ఆపకుండా చెప్పుకుపోతుంటే తాను నిరాఘాటంగా వ్రాయాడానికి కావల్సిన ఘంటం లేదు కాబట్టి తన దంతాన్నే విరిచి దానితోనే రచన చేస్తాడు.

  4. 4.   విఘ్నాలు కల్పించేది, నశింపచేసేది విఘ్నేశుడే. ఒక దేవాలయంలో ఇద్దరు గణేశులుంటే ఒకరు విఘ్నాలు కల్పించేవారని(విఘ్నరాజని) మరొకరు విఘ్నాలు తొలగించేవారని (వినాయకుడని) అర్థం. ఇద్దరూ సమాన స్థాయిలో పూజలందుకుంటారు. ఆయనకు సంబంధించిన ప్రతి సంఖ్య 21తో ముడిపడి ఉంటుంది. దేవతలందరి చెవులు మకరకుండలాల చేత కప్పబడి ఉంటే వినాయకుని చెవులు మాత్రమే విస్తారంగా ఉండి ఎటువంటి అలంకరణలు లేకుండా దర్శనమిస్తాయి.మనం కోరిన కోర్కెలన్నీ ఆయన వింటాడన్న అంతరార్థం అందులో ఉంది.

  5. 5.   వినాయకుడు, ఆంజనేయుడు -ఈ ఇద్దరి మూర్తులను చందనంతో అలంకరించటం శ్రేష్ఠం .

  6. 6.   ఒకసారి మేనమామైన విష్ణువు ఇంట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ, భధ్రంగా దాచిన సుదర్శన చక్రాన్ని తినుబండారంగా భావించి మ్రింగేస్తాడు బాల వినాయకుడు. చక్రం కోసం వెదికి వేసారిన విష్ణువు అది బాలగణపతి పొట్టలోనే ఉందని గ్రహించి అతన్ని నవ్వించటానికి మొదటిసారి గుంజిళ్ళు తీస్తాడు.ఆ చర్యలకు వినాయకుడు పగలబడి నవ్వితే చక్రం బయటపడుతుంది.

  7. 7.   విశ్వరూప ప్రజాపతి కుమార్తెలు సిద్ధి బుద్ధి. ముందుగా భూప్రదక్షిణ చేసి తిరిగివచ్చిన వారికి వారినిద్దరినీ ఇచ్చి వివాహం చెయ్యాలని శివపార్వతులు నిర్ణయిస్తారు.కుమారస్వామి నెమలి వాహనమెక్కి హడావుడిగా ప్రదక్షిణకు బయలుదేరితే గణేశుడు 7 మార్లు తల్లిదండ్రులైన శివపార్వతులకు ప్రదక్షిణ చేసి విజేతగా నిలుస్తాడు .

  8. 8.   గణేశుని సంతానంగా క్షేముడు, లాభుడు అనే ఇద్దరు కొడుకుల్ని చెబుతారు.

  9. 9.   గణేశుని ధ్వజంపై మూషికం గుర్తు రెపరెపలాడుతూంటుంది.

  10. 10.   భస్మాసురుని కొడుకు దురాసదనున్ని వక్రతుండావతారంతో హతమారుస్తాడు విఘ్నేశ్వరుడు. ఆ అవతారంలో ఆయనకు పంచమూఖాలు, పది బాహువులు, సిగలో నెలవంక, సింహ వాహనం ఉంటాయి.

  11. 11.   శివపార్వతుల కళ్యాణం వీక్షించటానికి దేవ, దానవ, గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర కింపురుషాదులు, ఇతర సమస్తకోటి జీవరాశి తరలి రావటంతో బరువు తట్టుకోలేక ఉత్తరంవైపు భుమి క్రుంగిపోతుంది. దాన్ని సమతలం చెయ్యటానికి పరమశివుడు అగస్త్య మహర్షిని పిలిపించి ఆయన్ని దక్షిణ దిశకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. దక్షిణ దిశనుండే తన పెళ్ళిని చూడగలిగే శక్తిని ప్రసాదించి, తన జటాజూటంలోంచి ఒక జటను కావేరి నది రూపంలో లాగి అగస్త్యుని కమండలంలోకి ప్రవేశపెడతాడు. ఒకసారి దక్షిణభారత దేశమంతా తీవ్ర దుర్భిక్షమైన పరిస్థితులు నెలకొంటే, ప్రజల బాధలు తీర్చటానికి వినాయకుడు కాకి రూపం ధరించి వెళ్ళి అగస్త్యుని కమండలం కూలదోస్తాడు. అగస్త్యుడు ఆగ్రహించి దాన్ని తరిమితే పసిబాలుడుగా మారిపోయి పరుగులంకించుకుంటాడు. కొద్దిసేపు అలా ఆటలాడి తర్వాత నిజరూపంతో సాక్షాత్కరించి ఆయన్ని తరింపచేస్తాడు. అలా కావేరి నదిని భూమార్గం పట్టించినవాడవుతాడు.

  12. 12.   ముద్గల పురాణం ప్రకారం వినాయకుని అనేకావతారాలలో ఎనిమిది ప్రముఖమైనవి - వక్రతుండుడు (సింహ వాహనుడు,మత్సరాసుర సంహారి), ఏకదంతుడు(మూషిక వాహనుడు, మదాసుర సంహారి) ,మహోదరుడు(మూషిక వాహనుడు,మోహాసుర సంహారి), గజవక్త్రుడు(మూషిక వాహనుడు,లోభాసుర సంహారి), లంబోదరుడు(మూషిక వాహనుడు,క్రోధాసుర సంహారి),వికటుడు (మయూర వాహనుడు,కామాసుర సంహారి), విఘ్నరాజు(శేష వాహనుడు,మమాసుర సంహారి), ధూమ్రవర్ణుడు(అశ్వ వాహనుడు,అభిమానాసుర సంహారి).

  13. 13.   గణేశ పురాణం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కటి చొప్పున నాలుగవతారాలు. మహోత్కట వినాయకుడు (కృత యుగంలో కశ్యపుడు,అదితిల కొడుకు. ఎర్రటి వర్ణంలో పది బాహువులతో సింహవాహనుడై ఉంటాడు ), మయూరేశ్వరుడు (త్రేతా యుగంలో శివపార్వతులకి జన్మించినవాడు. తెల్లని వర్ణంతో,ఆరు భుజములతో నెమలి వాహనుడై ఉంటాడు.), గజాననుడు (ద్వాపర యుగంలో శివపార్వతులకి జన్మించినవాడు. ఎర్రటి వర్ణంతో నాలుగు చేతులతో ఉంటాడు.మూషిక వాహనుడు), ధూమ్రకేతు (కలియుగాంతంలో నీలిరంగు అశ్వాన్ని అధిరోహించి దుష్టశిక్షణ చేస్తాడు.బూడిద వర్ణంతో రెండు లేక నాలుగు చేతులతో ఉంటాడు).



కాంగ్రెస్ మార్కు మతసామరస్యం !



స్వతంత్ర భారద్దేశంలో సెక్యూలరిజం అనేది ఒక కొరుకుడుపడని పదం. ఎవరికి తోచిన అర్థం వాళ్ళు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయనాయకుల పదకోశంలో దీని అర్థాలు అతివేగంగా మారిపోయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెర్షన్లు విడుదలవుతూంటాయి. ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఈ విషయంలో మినహాయింపు. 125 సంవత్సరాల ఘనచరిత్ర కలిగి యాభైఏళ్ళకు పైగా దేశాన్ని పరిపాలించి ఇంకా
శాసిస్తున్న పార్టీ, దేశసమస్యలపై నిర్దుష్టమైన అభిప్రాయాలు ఏర్పరుచుకోకపోయినా ఒక్క విషయం మీద మాత్రం ఆది నుంచి కుండబద్దలు కొట్టినట్లుగా తన వైఖరి స్పష్టం చేస్తునే ఉంది. మతసామరస్యమంటే కేవలం కొన్ని వర్గాలకి కొమ్ముకాయడమేనని కాంగ్రెస్ పెద్దల ఆభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే కొత్తగా మతహింస నిరోధక బిల్లు (Prevention of Communal and Targetted voilence bill 2011)తో మన ముందుకు వస్తోంది.


మతహింస కేవలం ఒక వర్గానికే పరిమితం కాదు. కవ్వించేది ఎవరైనా అల్లర్లంటూ చెలరేగాక ఆస్తినష్టం ప్రాణనష్టం రెండువైపులా ఉంటుంది. ఎటువంటి ఒత్తిళ్ళకు లొంగకుండా నిజనిర్ధారణ చేసి కులమతాలకు అతీతంగా శిక్షలు విధించాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. అలా కాకుండా వోటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ, పక్షపాత బుద్ధులతో ఒక వర్గాన్ని చిన్నచూపు చూసి, మరో వర్గంపై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తేనే వస్తుంది చిక్కు. అందుకే ఈ బిల్లు వివాదాస్పదమయ్యింది.

ముందుగా బిల్లులోని ముఖ్యాంశాలు చదవండి (పూర్తి బిల్లు ఇక్కడ )
  • సెక్షన్ 3 ప్రకారం ఒక వర్గానికి చెందారన్న కారణంగా దానికి చెందిన వ్యక్తిని కాని, ఆస్తిని కానీ అసంకల్పితంగా గానీ, పథకం ప్రకారం గానీ దాడిచేయ్యటం నేరం.
  •  క్లాజ్ 7 ప్రకారం ఆ వర్గానికి చెందిన వ్యక్తులపై శారీరకమైన వేధింపులకు పాల్పడటం నేరం.
  • క్లాజ్ 8 ప్రకారం ఆ వర్గం పైన కానీ, ఆ వర్గానికి చెందిన వ్యక్తిపై కానీ మాటల ద్వారా గానీ, వ్రాతల ద్వారా కంటికి కనిపించే మరే విధమైన పనుల ద్వారా కానీ ద్వేషాన్ని వ్యాప్తి చెయ్యడం నేరం.
  • క్లాజ్ 9 ప్రకారం వ్యక్తిగా గానీ, సామూహికంగా గానీ ఆ వర్గం మీద పథకం ప్రకారం దాడి చెయ్యటం నేరం.
  • క్లాజ్ 10 ప్రకారం ఆ వర్గానికి వ్యతిరేకంగా ధనసహాయం గానీ మరే విధమైన సహాయం గానీ చెయ్యటం నేరం.
  • క్లాజ్ 12 ప్రకారం ప్రభుత్వోద్యోగులెవరైనా ఆ వర్గానికి చెందిన వ్యక్తులను మానసికంగా గానీ,శారీరకంగా గానీ హింసించడం నేరం.
  • క్లాజ్ 13 మరియు 14 ప్రకారం ఆ వర్గానికి చెందిన వ్యక్తులను రక్షించకుండా అలసత్వం ప్రదర్శించిన ప్రభుత్వోద్యోగులను కఠినంగా శిక్షించవచ్చు  
  • క్లాజ్ 15 ప్రకారం ఈ విషయంలో తన క్రింది ఉద్యోగులు సరిగ్గా పనిచెయ్యకపోయినా వారి పైనున్న అధికారి అందుకు బాధ్యుడవుతాడు.
  • క్లాజ్ 16 ప్రకారం ఉన్నతాధికారుల ఆజ్ఞలను సాకుగా చూపడానికి వీల్లేదు .
  • సెక్షన్ 58 ప్రకారం నిందితులకు బెయిల్ కూడా రాదు.ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చెయ్యవచ్చు.
  • సెక్షన్ 66 ప్రకారం ఫోటోలు,వీడియోలను సాక్ష్యాలుగా ప్రవేశపెట్టవచ్చు  
సెక్షన్లు క్లాజులు బాగానే ఉన్నాయనిపిస్తుందా? ఇక్కడే అసలైన మెలిక ఉంది. మతకల్లోలాలు జరిగినప్పుడు మెజారిటీ వర్గాన్ని అందుకు బాధ్యులుగా బిల్లు రూపకల్పన చేశారు. సెక్షన్ 3 ప్రకారం వర్గం అంటే దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మతపరంగా లేదా భాషాపరంగా మైనారిటికి చెందిన వారు మరియు షెడ్యూల్డు కులాలు లేదా తెగలకు చెందిన వారు . మనదేశంలో ఒక్క హిందువులు తప్ప మిగతా
అన్ని మతాల వారు మతపరమైన మైనారిటి క్రిందకు వస్తారు. కొత్తగా ప్రతిపాదించిన ఈ చట్టం ప్రకారం ఎప్పుడైనా మతఘర్షణలు జరిగితే న్యాయం కోసం పోరాడే హక్కు కేవలం మైనారిటీలకే ఉంది. సబ్ క్లాజ్ 3j ప్రకారం మైనారిటి ప్రజలనే బాధితులుగా పేర్కొన్నారు కాబట్టి అధిక సంఖ్యాక వర్గాల ప్రజలు నష్టపోయినా కిక్కురుమనడానికి వీలు లేదు . మెజారిటీ వర్గం ప్రజలే మతకల్లోలాలు ప్రేరేపిస్తారని, 
వారికి  ఎటువంటి ఆపదలు కలగవని ఈ బిల్లు ఉద్దేశ్యం కాబోలు. అలాగే వర్గం అన్న పదానికిచ్చిన నిర్వచనం కారణంగా మైనారిటీ ప్రజలు విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసినా, మానసికమైన, శారీరికమైన చిత్రహింసలకు పాల్పడినా, ఆస్తుల పై దాడులు చేసినా, అందుకు సహాయం చేసినా, ఈ బిల్లు పరిధిలోకి రారు.


సెక్షన్ 74 మరింత వివాదాస్పదంగా ఉంది. భారతీయ న్యాయసుత్రాల ప్రకారం నేరం నిరూపింపబడేవరకు ముద్దాయిని నేరస్తుడిగా భావించడానికి వీల్లేదు. సెక్షన్ 74 ఈ సుత్రానికి విరుద్ధంగా ఉంది. దీని ప్రకారం పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను నేరస్తులగానే భావిస్తారు. నిజంగా నేరస్తులు కానివారు ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మతకలహాలను, జాతుల మధ్య
వైరాన్ని విచారించటానికి ప్రభుత్వం National Authority for Communal Harmony, Justice and Reparation అనే సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థకు వున్న విశేషాధికారాల ప్రకారం అల్లర్లు జరుగుతున్న ప్రదేశాల్లోనే కాదు, జరుగవచ్చని భావిస్తున్న ప్రదేశాల్లో పనిచేస్తున్న ప్రభుత్వాధికారుల పనితీరులో కూడా ఇష్టనుసారం జోక్యం చేసుకోవచ్చు. ఎవరినైనా విచారించే అధికారం అర్హత ఉంది. వీళ్ళ ఆదేశాలను సమీక్షించే అధికారం ఎవరికీ లేదు. పథకం ప్రకారం జరిగే ఘర్షణలను అంతఃకలహాలుగా పేర్కొంటూ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికుంది. దీనివల్ల ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్రకు పరిమితమైపోవాల్సి ఉంటుంది. అమోదం పొందిన పక్షంలో ఈ బిల్లు జమ్మూ కాశ్మీర్‌కు తప్ప తక్కిన అన్నీ రాష్ట్రాలకూ వర్తిస్తుంది. హిందువులు తక్కువగా ఉండే జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం అక్కడి ప్రభుత్వ అనుమతి అవసరం.


 ఇంతటి మోసపూరితమైన బిల్లు మరొకటుంటుందా? ఇది ఏ రకమైన మతసామరస్యానికి ప్రతీక ? అసలిటువంటి బిల్లుల వల్ల మతసహనం పరిఢవిల్లుతుందా ? మెతక వైఖరితో మతపరమైన రిజర్వేషన్లతో విభజించి పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలందరికీ ఒకే న్యాయం ఒకే చట్టం ఉండాలనే ఇంగితజ్ఞానం ఎప్పుడలవడుతుంది ?


జగదానందకారకంగా శ్రీరామరాజ్యం పాటలు



శ్రీరామరాజ్యం పాటల కోసం నేను ఆత్రంగా ఎదురుచూడ్డానికి ప్రధాన కారణం బాపు-రమణ ,ఇళయరాజాల కాంబినేషన్. నేను ఇళయరాజాకు వీరాభిమానిని. ఆయన కూనిరాగం కూడా నాకు మహాప్రసాదమే. ఇక రాముడంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు రామాయణమంటే ఉప్పూ-కారం లేని కూరలా చప్పగా ఉంటుందని ఈసడించుకొన్న మాట నిజమే కానీ గత రెండు మూడేళ్ళుగా రామాయణం మీద రకరకాల పుస్తకాలు చదవటం వల్లనైతేనేమి, ప్రవచనాలు వినడం వల్లనైతే నేమి, నా అవగాహన మెరుగుపడి పాత్రల ఔచిత్యం బోధపడి, గౌరవం, భక్తిభావం రెండు కలిగాయి. సీతాసమేత రామలక్ష్మణ హనుమంతులకు నా మదిలో మందిరమే కట్టేశాను. ఇక హనుమంతుడిలాగా రామనామాన్ని నరనరాన జీర్ణించుకున్న భక్తులు బాపు-రమణలు. ఇద్దరికీ పౌరాణికాల మీద మంచి పట్టుంది. అంతకు మించి నిబద్ధత ఉంది. కథ ఏదైనా కమర్షియల్ ఫార్ములా పేరుతో చవకబారు శృంగారం కుమ్మరించే దర్శకేంద్రులు కోకొల్లలుగా ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంకా మనుగడగలుగుతున్నారంటే అందుకు కారణం కేవలం వృత్తి పట్ల వాళ్ళకున్న నిజాయితీనే. ఇటువంటి అరుదైన వ్యక్తుల కలయికలో తయారవుతున్న  చిత్రమంటే ఎవరికి మాత్రం ఉత్కంఠత ఉండదు ?

గీత రచయితగా జొన్నవిత్తుల గారి పేరు ప్రకటించినప్పుడు నేను తెల్లబోయాను. ఆనాటి లవకుశ పాటల స్థాయిలో  సాహిత్యం సమకూర్చగలరా అన్న సందేహం కలిగింది. తెలుగు భాష గొప్పదనం గురుంచి వ్రాసిన పాట తప్ప,ఆయన పేరు వినగానే ఠక్కున స్ఫురింపజేసే పాటలేవి నాకు తెలియవు. వేటూరి గారి చేత పాటలు వ్రాయిద్దామనుకుంటే అప్పటికే ఆయన స్వర్గస్థులైపోయారు. ఇక ఆ స్థాయిలో వ్రాయగలిగింది సిరివెన్నల సీతారామశాస్త్రి గారొక్కరే అని నా ప్రగాఢ నమ్మకం. జొన్నవిత్తులకు అవకాశమిచ్చి తప్పు చేస్తున్నారేమో అనుకున్నాను కాని ఆయన అద్భుతంగా గేయ రచన చేసి నన్ను ఆశ్చర్యానికి గురి చేశారు. పాటలన్నీ పామరులకు సైతం అర్థమయ్యేలా సరళంగా వ్రాసారు.దండకం వంటివి వ్రాయల్సి వచ్చినప్పుడు కాస్త విజృంభించారు. ఆయన సినీ జీవితంలో చిరస్థాయిలో నిలిచిపోయేలా సాహిత్యమందించారు. ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో చెప్పినట్లు ఈ పాటలన్నీ ముందు జొన్నవిత్తుల గారి చేత వ్రాయబడి, రమణ గారి అంగీకారం పొంది తర్వాత ఇళయరాజా చేత స్వరాల సొగసులు అందుకున్నవే.


ఇక పాటల్లోకి వెళ్దాం.



  • జగదానంద కారక (5/5) - ఈ పాటను ఆల్బంకే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. త్యాగరాజ కృతిలోని పల్లవిని మాత్రం తీసుకొని విడిగా చరణాలు వ్రాసుకొని స్వరాలు సమకూర్చారు. ఇదే పల్లవితో   పెళ్ళిపుస్తకం  , త్యాగయ్య  సినిమాలలోను పాటలున్నాయి. ఆ పాటలకు ఈ పాటకు తేడా గమనించండి. ఆపారమైన ఇళయరాజా స్వరసంపత్తికి ఇదొక మెచ్చుతునక. పాట చివరలో జగదానంద కారకా అని ప్లెయిన్ వాయిస్‌లో వచ్చే బాలు గారి స్వరం ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది . ఈ పాటకున్న ఏకైక అపశృతి శ్రేయఘోషల్ 'శ' ను 'ష' గా ఉచ్ఛరించటం. సాహిత్యాన్ని బట్టి ఇది సినిమాలో మొదటిపాట, శ్రీ రామ పట్టాభిషేకం జరిగే సమయంలో వచ్చే పాట అనుకుంటున్నాను.

  • శ్రీ రామా లేరా ఓ రామా (5/5) -మరొక అద్బుతమైన పాట. ఇది రెండవ పాట కావొచ్చు.రాముడి దైనందిన జీవితం, సీతాదేవితో ఏకాంతంగా గడిపే క్షణాలను మోంటేజ్‌ పద్ధతిలో చిత్రీకరించి వుండే అవకాశముంది. వర్థమాన గాయకుడు రాము చాలా చక్కగా పాడారు.

  •  కలయా నిజమా వైష్ణవ మాయా (5/5) -ఇదొక బిట్ సాంగ్. ఒక మంచి పాటను చిన్నదిగా కుదించి అన్యాయమే చేశారు. టిప్పు ఇంత అద్భుతంగా పాడగలరని ఈ పాట ద్వారే తెలిసింది. ఇది కూడా మొదటి భాగంలో వచ్చే పాటే.  సీతను అడవుల పాలుచెయ్యనున్నారని తెలిసి ఆంజనేయుడు పడే మానసిక క్షోభను ఈ పాటలో ప్రతిబింబించారు.

  • సీతారామ చరితం (5/5) -దండకారణ్యం నుంచి మొదలై రావణ వధ వరకు సాగే సన్నివేశాలను సులభంగా అర్థమయ్యే రీతిలో వర్ణించిన పాట. అనిత, కీర్తన చాలా బాగా పాడారు. 'ఎందుకు ఈ పరీక్ష, ఎవ్వరికీ పరీక్ష? శ్రీరాముని భార్యకా శీలపరీక్ష,అయోనిజకి అవనిజకా అగ్నిపరిక్షా ? ' అంటూ ప్రశ్నలు అడిగే విధానం చాలా నచ్చింది. సినిమా రెండవ భాగంలో కుశలవులు పాడే పాటల్లో ఒకటి కావచ్చు.

  •  దండకం (5/5) - క్లైమాక్స్ ??

  • సీతా సీమంతం (4/5) -సీతాదేవి సీమంతానికి సంబంధించినది.  సాహిత్యాన్ని జాగ్రత్తగా వింటే ఇది సినిమాలో రెండుసార్లు వస్తుందని తెలిసిపోతుంది. మొదటి సగం అయోధ్యలో, రెండవ సగం వాల్మీకి ఆశ్రమంలో.

  •  గాలి నింగీ నీరు
    (4/5) -ఇది మరో మోంటేజ్ సాంగ్. లవకుశలో ' ఏ నిమిషానికి ఏమి జరుగునో' లా సీతాదేవిని అడవుల పాల్జేసే సమయంలో వచ్చే పాట. ఈ పాటమీదున్న ఏకైక ఫిర్యాదు అధునిక సంగీత వాయిద్యాలు వాడటం.

  • దేవుళ్ళే మెచ్చి(4/5) -రామ కథపై ఇంకొక పాట.

  • రామాయణము (4/5) -రామ కథను కీర్తిస్తూ కుశలవులు పాడే మరొక పాట.
  • రామరామ (3.75/5) -ఈ పాట రెండవ భాగంలో వస్తుంది. అల్లరి చేసినందుకు కోప్పడిన తల్లిని అనునయిస్తూ రాముడి బాల్య చేష్టలను వర్ణిస్తూ కుశలవులు గానం చేసే పాట.
  • ఎవడున్నాడు (3.5/5) -అక్కినేని వ్యాఖ్యానంతో ఈ చిన్న పాట ఆరంభమవుతుంది. తనకు నారదునికి మధ్య జరిగిన సంవాదం రామాయణ రచనకు ఎలా పురిగొల్పింది వివరిస్తూ వాల్మీకి చెప్పే సన్నివేశం ఈ పాటలో పొందుపరిచారు. ' ఓంకారానికి సరిజోదు' అంటూ రాముడి గుణగణాలను అలతి పదాలలో అందంగా సాక్షత్కరించారు.
  • మంగళం రామునకు (3.5/5) -శ్రీరామునికి మాంగళాశ్వాసం.పట్టాభిషేకమయ్యాక వచ్చే చిన్న గేయం
  • సప్తాశ్వరూఢం (3.5/5) -సూర్యభగవానుడు, శ్రీ రాముడు మీద పద్యాలు .ఇది చిత్ర ప్రథమార్థంలో పట్టాభిషేకానికి ముందో తర్వాతో వచ్చే పద్యాలు.
  • ఇది పట్టాభి రాముడు,శంఖు చక్రాలు పోలిన -(3.25/5) -ఇవి రెండు ఒకే బాణీలో ఉన్నాయి.కుశలవులు అయోధ్య వచ్చినప్పుడు రాచనగరును చూపిస్తూ రాముని పరివారంలోని వారో లేక, కూడా వచ్చిన మునికుమారులో పాడే పాటలా ఉంది.జానపదులు పాడుకొనే శైలిలో ఉంది.  


 పాటలన్నీ విన్నాక ఇళయరాజా మాత్రమే ఇటువంటి చిత్రానికి న్యాయం చేకూర్చగలరనిపించింది. శంఖుచక్రాలు పోలిన, గాలి నింగి నీరు పాటలు ఆధునిక శైలిలో ఉన్నప్పటికీ అన్ని పాటలు బావున్నాయి.  కీరవాణి బాణీలు నాకు పెద్దగా నచ్చలేదు. 'అన్నమయ్య' లో కీర్తనలన్నీ అంతకుముందే ప్రాచుర్యంలో ఉన్నవే. అందులో మూడు పాటలకే స్వంతంగా స్వరాలు సమకూర్చారు (తెలుగుదనానికిది, ఏలే ఏలే, అస్మదీయ మగటిమి).' శ్రీరామదాసు' లో కొన్ని మాత్రామే బావున్నాయి. 'పాండురంగడు' లో అంతంత మాత్రం .  అలా కాకుండా చేస్తున్నది మొదటి పౌరాణిక చిత్రమైనా, మేరుపర్వతం లాంటి 'లవకుశ' తో పోటీపడుతున్నా ఏ మాత్రం తొణక్కుండా ఇంత ఆహ్లాదభరితమైన సంగీతాన్ని అందించటం ఒక్క స్వరరాజాకే చెల్లింది. ఈ పాటలకు బాపు దర్శకత్వ ప్రతిభ తోడైతే ఆకాశమే హద్దు. ఆస్తిలో కొంతభాగం పోయినా ఫర్వాలేదు కానీ సినిమా మాత్రం కావ్యంలా మిగిలిపోవాలని తపనపడే నిర్మాత యలమంచలి సాయిబాబా అభిరుచిని అభినందించక తప్పదు. ఈ చిత్రం  అపూర్వవిజయం సాధించి రమణ గారికి ఘననివాళి అర్పించాలని మనసారా కోరుకుంటున్నాను.