• మెరిసే మేఘాలు

    మెరిసే మేఘాలు
  • కురిసే వర్షాలు

    కురిసే వర్షాలు
  • విరిసే పుష్పాలు

    విరిసే పుష్పాలు
  • మురిసే భువనాలు

    మురిసే భువనాలు
  • నాకు

    నాకు
  • కదిలే కావ్యాలు

    కదిలే కావ్యాలు

నివేదన






వరు నువ్వంటే ఏమని చెప్పను?

నవ్యనాగరికతా దివ్య దీప్తుల
చూడలేక నా కళ్ళు చూద్కిపోయె
నింగికెగబ్రాకు విజ్ఞాన శిఖరాల
అందుకొనలేక నా వొళ్ళు అలసిపోయె

దయాధర్మరహిత దౌర్జన్య కౄర
కబంధ హస్తాల నా బ్రతుకు చితికిపోయె
ప్రేమాభిమాన విహీన పైశాచికారముల
విని విని నా మనసు మూగవోయె

ఆశల వెలుగేలేని అంధకారములోన
ఘోర భీకర దుర్భర జీవితారణ్యమున
కఠిన పాషాణ కంటకావృతముల బడి
దారి తెన్నులేక తిరుగాడు దీనుడను నేను

పంచభక్ష్య పరమాన్నములు తిని
విసరి పారవేసిన ఎంగిలాకులకై
ముసిరిన కాకుల మూగిన కుక్కల
విసిరి తరుమలేక కసరి కొట్టలేక
కాలే కడుపును కన్నీట తడుపలేక
చావలేక బ్రతుకుతున్న సజీవిని నేను

బంగారు భవనాల పారుగోడల నీడ
ఉప్పొంగి ప్రవహించు మురికి కాల్వ చెంత
నడిరోడ్డు దుమ్ము నిండు కౌగిలిలోన
అందరాని ఆనంద తీరాల
అందుకోజూస్తున్న అల్పజీవిని నేను

గుండెలవిసే మండుటెండలో
వొళ్ళు చివికే వడగళ్ళవానలో
ఎండుమాకుల చెంత ఇంటిచూరుల కింద
బితుకు బితుకుమను గుండెలు
పిడికిట బిగబట్టి
తలదాచుకోనింత చోటులేక
చీకుచింతాలేని చెట్టుచేమల జూచి
బాధలెరుగని బండరాళ్ళను చూచి
ఓర్వలేక  వగరుస్తున్న మనిషిని నేను 

కుక్కనై పుట్టినా కూడుతినేవాన్ని
గువ్వనైపోయినా గూడు కట్టుకొనేవాన్ని
మనిషినై పుట్టి మనిషిగా మసలలేక
నిత్యం చస్తున్న నిర్భాగ్యుడిని నేను
చచ్చి బ్రతుకున్న సౌభాగ్యుడను నేను

విసురు కసురులేక ఓపికతో విన్నావు
ఎంత సౌమ్యుడవీవు? ఎవరు నీవు ?

అరెరె ! అది ఏమి !..

ఉబికి ఉప్పొంగు దు:ఖమ్ము
వెక్కిళ్ళ వెలిగ్రక్క వినవచ్చె !
కడలిఘోషల దాగు బడబాగ్ని బాధ
నీ గుండె కుత్తులోన ఘూర్ణిల్ల సాగె !

ఏమి ? నీవూ నా బోటివాడవేనా ??
అంతుపొంతులేని మన బ్రతుకులొక్కటేనా ??

అవునులే ! మనముగాక మనకున్న దిక్కెవరు !
మనగోడు విని కడతేర్చు నాథుడెవ్వరు !!

(పాతికేళ్ళ  క్రితం  మా నాన్నగారు వ్రాసిన  కవిత)



రాగం పలికింది

(దాదాపు ఇరవైయేళ్ళ క్రితం మా నాన్నగారు వ్రాసిన కొన్ని భావగీతాలు ఆకాశవాణిలో వచ్చేవి. వాటిలో నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఇదొకటి.)



రాగం పలికింది -నాలో 
అనురాగం వొలికింది
                                                 || రాగం పలికింది 

విరుల సరులలో తురీరవములో
ఝరుల వగలులో గిరుల నగవులో
అంతులేని ఆనందలహరిలో
పొంగి పొరలు రసతరంగిణియై
                                                || రాగం పలికింది  

శరదిందుచంద్రికా చిద్విలాసమున
విరిగంధ వీచికా విరహతాపమున
మదన మనోహర మోహనాట్యమున
చిందులేయు చెలి అందెల రవళియై

                                                 || రాగం పలికింది   


మా ఊరి వేసవి కబుర్లు


వేసవి అంటేనే పిల్లలకు ఆటవిడుపు బోలెడన్ని శెలవులు,బోల్డంత కబుర్లు బోలెడంత హంగామా.మా బాబాయిలు, వాళ్ళ పిల్లలు అందరూ పల్లెలోనే ఉండేవారు. దాంతో వార్షిక పరిక్షలైపోయిన దగ్గర్నుంచి ఎప్పుడెప్పుడు మా ఊరు వెళ్దామా అని ఉబలాటంగా ఉండేది.

పొద్దున్నే చెఱువు గట్టుకు వెళ్ళడంతో దినచర్య మొదలయ్యేది (హి..హి..హి. ఆడువారి మాటలకు అర్థాలే వేరు లో వెంకటేష్ లా అన్నమాట). వస్తూ వస్తూ ఏ వేపపుల్లనో, కానుగ పుల్లనో నోట్లో ఆడిస్తూ,  ఆకాశం కడుపున అప్పుడే పుట్టిన పండటి ఎర్రటి సూరీన్ని  ముచ్చటపడి నీటి పొత్తిళ్ళలో పొదువుకున్న మా ఊరి చెఱువుని తిలకిస్తూ  , ఈ వార్తని వాడవాడలా వెల్లడించాలన్న ఉద్విగ్నతతో పంట పొలాల మీదుగా ఎగిరిపోతున్న కొంగలబారును పరికిస్తూ , చేదబావి గిలక చప్పుడు వింటూ మెల్లగా ఇంటికి చేరేవాళ్ళం. 

పెరట్లో స్నానాలు చేసి ఉపాహార వేళకు  పిల్లలందరం గిన్నెలు ముందేసుకు కూర్చుంటే నాయనమ్మో (నాన్నమ్మ) , పిన్నమ్మో (పిన్ని) వేడివేడిగా దోశెలు వడ్డించేది. దాన్లోకి రోట్లో చేసిన చట్నీ వేసుకొని ఆవురావురంటూ తినేవాళ్ళం. చట్నీలోకి చిన్న చిన్న ఉల్లిపాయాలు వాడేవాళ్ళు. ఇవి మాములు ఉల్లిపాయల కంటే చాలా చిన్నవిగా ఉన్నా అమోఘమైన రుచినిచ్చేవి. టిఫన్ల పట్ల మొహం మొత్తితే ఊరిబిండి (రోటితో చేసిన పచ్చడి) వేసుకుని చద్దన్నం తినేవాళ్ళం.

వీధిలో ఇతర పిల్లలు కనిపిస్తే జిల్ల - కోడి ఆడేవాళ్ళం (గోటీ - బిళ్ళ లేదా బిల్లంగోడు). లేకపోతే చిన్నాన్న పిల్లలతో కలిసి దగ్గర్లోని గుట్టల్లోకి పశువులను మేతకు తీసుకెళ్ళేవాళ్ళం. తలా కొన్ని పశువుల్ని పట్టుకొని, వాటిని అదిలిస్తూ గుట్టల్లోకి చేరేసరికి, ఊళ్ళో మాయమైన పిల్లగ్యాంగ్ అక్కడ ప్రత్యక్షమయ్యేది. ఎవరి దగ్గరైనా బాలూ బ్యాటూ ఉంటే క్రికేట్ క్రీడకు చక చకా సన్నాహాలు జరిగిపోయేవి. గుట్టలకు దగ్గర్లోని చేలల్లో పశువులను వదిలేసి అక్కడే కాస్త చదునైన ప్రదేశంలో ఆటను మొదలుపెట్టేవాళ్ళం. మా ఊళ్ళో అంగళ్ళేమీ లేవు. కూతవేటు దూరంలో మరో పల్లె ఉంది. అక్కడ ఒకటి రెండు అంగళ్ళుండేవి. అక్కడి నుంచి రబ్బరు బాలును కొనుకొచ్చేవాళ్ళు. అక్కడ దొరకలేదంటే సైకిలెక్కి ఐదుమైళ్ళు  ప్రయాణించి పేట(అమ్మమ్మ వాళ్ళ ఊరు) లో బంతిని కొనుకొచ్చేవాళ్ళు. బ్యాటు మాత్రం చెక్కతో ఇంట్లోనే తయారు చేసుకొనేవాళ్ళు. బుర్ర మీసాలు సవరించుకుంటూ కొడవలితో చెక్కలు కొట్టి మా తాత ఎన్నో సార్లు బ్యాట్లను తయారు చేసి ఇచ్చేవాడు. అవి విరిగిపోతే ఎండిపోయిన కొబ్బరి మట్టలే మాకు దిక్కు. 

కాసేపటికి ఇంటిదగ్గర్నుంచి బాబాయో, పిన్నమ్మో ఎవరో ఒకరు పశువుల వద్దకు వచ్చేవాళ్ళు. మేం ఇంటికి తిరిగివెళ్తూ మా తోటలోని మామిడికాయలను కొన్ని తెంపుకొని, పొలంలోంచి పచ్చి మిరపకాయలను కోసుకొని వెళ్ళేవాళ్ళం. ఇంటికెళ్ళి రోట్లో మామిడికాయలు, పచ్చి మిరప, రాళ్ళ ఉప్పు వేసి దంచి, ఆ దబ్బలును నోట్లో వేసుకుంటుంటే అద్భుతంగా ఉండేది. దట్టించిన కారం కళ్ళలో నీళ్ళు తెప్పిస్తూంటే దాన్నుంచి తప్పించుకోవటానికి చెంబులకొద్దీ నీళ్ళు తాగేవాళ్ళం. అప్పటికీ తగ్గేది కాదు. ఏ పంచదారో, బెల్లం ముక్కో నోట్లో వేసుకొన్నాక కాస్త తెరిపిన పడ్డట్లయ్యేది.

మధ్యహ్నాలు బెండుముక్కలు కట్టుకొని చెఱువులోకో బావిలోకో భయం భయంగా దిగేవాళ్ళం. లోపలికి వెళ్ళే ధైర్యం లేదు కాబట్టి గట్టు మీద చేతులుంచి నీళ్ళలో కాళ్ళు తపతపలాడించేవాళ్ళం. చెఱువు మొరవబోతే (పొంగితే. ఎప్పుడో గానీ మా ఊరి చెఱువు పొంగదు. పొంగితే మా సంబరానికి అంతుండేది కాదు ) చిన్న చిన్న కాలువల్లోకి నీళ్ళు వచ్చేవి. వాటిలో దిగి నడుము లోతు నీళ్ళలో కూర్చొని ఈత నేర్చుకోటానికి నానా తంటాలు పడేవాళ్ళం. కొన్ని సార్లు కాలువల్లోంచి పంటలకు గూడలేసేవాళ్ళు. మేమూ ఓ చెయ్యి వేసి సంతోషపడి పోయేవాళ్ళం.

 తగినన్ని నీళ్ళు లేకపోతే ఇంటిపట్టునే ఉండి పెద్దలు పిల్లలు జట్లు జట్లుగా విడిపోయి సరదాగా దాయాలు ( పాచికలు ) లేదా రాజు-రాణీ-దొంగ-పోలీస్ లాంటి ఆటలు ఆడేవాళ్ళం. వేసవిలోనే గానుగ ఆడేవాళ్ళు. అలాంటప్పుడు మా మకాం ఇక చెఱుకు తోటల్లోనే. ఓ వైపు మేం నోట్లో చెఱుకులు పరపరలాడిస్తూ మరో వైపు ఎద్దులు గానుగ యంత్రాన్ని తిప్పుతూంటే బెల్లం తయారు చేసే విధానాన్ని ఆసక్తిగా గమనించేవాళ్ళం ఎండలు మండిపోతూంటే మా వాళ్ళు కొబ్బరిబోండాలు కొట్టేవాళ్ళు. అవి తాగి సేదతీరేవాళ్ళం. 

గోధూళి వేళ ఊళ్ళో పెద్దలంతా మా ఊరి రాముడి దేవళం (చిన్న గుడి) ముందున్న కానుగ చెట్టు క్రింద సమావేశమయ్యేవాళ్ళు. అదే మాకు రచ్చబండ. పలకరింపులు పరాచికాలు బాగా ఉండేవి. దేవళం ప్రక్కనే మా తాతయ్య ఇల్లు కాబట్టి మేము అక్కడే పోగయ్యేవాళ్ళం. పట్నం నుంచి వచ్చిన మమ్మల్ని చూసి ' ఓరొరే ! మీరు పెద్దోడి కొడుకులు కూతుర్లా ' అని ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. ఓ సారి గుడి ముందు చిన్న తెరకట్టి లవకుశ సినిమా వేశారు. అప్పుడు నేను చాలా చిన్నవాన్ని అన్నమాట. చాలా గమ్మత్తుగా అనిపించింది.

రాత్రిళ్ళు వెన్నెల్లో కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసేవాళ్ళం. అదయ్యాక మళ్ళీ ఆటలు. అలసిపోయాక పిల్లందరం మిద్దే పైనే చాపలు, దిండ్లు పరుచుకొనేవాళ్ళం. మాకు తోడుగా కొంత మంది పెద్దవాళ్ళు వచ్చి పడుకొనేవాళ్ళు. రాత్రి పూట వెన్నెల్లో వెల్లకిల్లా పడుకొని , చల్లగా గాలి వీస్తూంటే, ఆ గాలికి కొబ్బరాకులు ఊగుతూంటే, ఆకాశంలో మబ్బుల వెనుక నక్కి తారలతో దాగుడుమూతలాడుతున్న చంద్రున్ని చూస్తూ తన్మయత్వంతో మెల్లగా నిద్రలోకి జారుకుని ఆ రోజుకి వీడ్కోలు పలికేవాళ్ళం.


వేసవి శెలవుల్లో మరో ముఖ్యమైన అంకం మహాభారత ఉత్సవాలు. మా పల్లెకు నాలుగు మైళ్ళ దూరంలో రహదారిని ఆనుకొని ఒ పల్లెటూరుంది. అక్కడ ప్రతి వేసవిలోనూ పద్దెనిమిది రోజుల పాటూ మహభారత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.  ఏటా ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా కలిగి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని ఓ నమ్మకం. వరుసగా ఐదేళ్ళు అనావృష్టి తాండవిచ్చినప్పుడూ ఈ విశ్వాసం చెక్కుచెదరలేదు .

ఆ ఊళ్ళో ద్రౌపది సమేత ధర్మరాజ దేవాలయం ఉంది. పద్దెనిమిది రోజులు సాగిన మహాభారత యుద్ధానికి  సంకేతంగా అన్నట్లు పద్దెనిమిది రోజుల పాటూ అక్కడ మధ్యాహ్నాలు హరికథా కాలక్షేపం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పేరొందిన హరికథా విద్వాంసులు  భుక్తాయాసంలో సైతం అలవోకగా పద్యాలు పాడుతూంటే, వాద్యగాళ్ళు తాళయుక్తంగా హార్మోనియం, తబలా, మ్రోగిస్తూంటే ముసలీ ముతకా, పిల్లా జెల్లా ఆలయ మండపంలో కూర్చొని ఒళ్ళంతా చెవులు చేసుకొని మంచిని వంటబట్టించుకొనే ప్రయత్నం చేసేవాళ్ళు.

హరికథలో వివరించిన ఘట్టాలనే కళాకారులు రాత్రిళ్ళు స్టేజి మీద ప్రదర్శించేవాళ్ళు. ఈ ప్రదర్శన రాత్రంతా కొనసాగేది . చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు బళ్ళు కట్టుకొని మరీ వచ్చేవాళ్ళు. చాపలు దుప్పట్లు తెచ్చుకొని వేదిక ముందున్న విశాలమైన మైదానంలో పరుచుకొని వీక్షణకు ఉపక్రమించేవాళ్ళు. తీరిక చిక్కిన ఆడవాళ్ళు తాంబూలం నములుతూ ఇరుగమ్మ పొరుగమ్మలతో కబుర్లలో పడితే చిన్న పిల్లలు మైదానం నలు వైపుల పరుగులు తీస్తూ ఆటలు ఆడేవాళ్ళు. ఈ గోలలో తొమ్మిది-పది గంటల మధ్య ప్రదర్శన మొదలయ్యేది. ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు.. ఇలా పాత్రలు ప్రవేశించేవి. నడిరాత్రి నిద్రలో జోగుతున్న ప్రజలని మేల్కొల్పటానికి మేళతాళాలతో  హాస్యగాడు రంగప్రవేశం చేసేవాడు. అతను రాగానే మళ్ళీ కలకలం మొదలయ్యేది. రాగయుక్తంగా  పద్యాలు పాడి మంచి నటన కనబరిచిన నటులకు (సాధారణంగా ఈ ట్రూపులో అంతా మగవాళ్ళే ఉంటారు) నోట్ల దండలతో తక్షణ గుర్తింపు లభించేది. ఒకవైపు ఈ తతంగం సాగుతూంటే  మరో వైపు మైదానం దగ్గర్లో వెలసిన తాత్కాలిక దుకాణాల వద్ద తినుబండారాలు , ఆట బొమ్మల వ్యాపారం జోరుగా సాగేది. తాగుబోతుల కోలాహలం చెప్పనక్కర్లేదు . బకాసుర వధ, వస్త్రాపహరణ, అర్జున తపస్మాను, ఉత్తర గోగ్రహణం, దుర్యోధన వధ ప్రదర్శించే రోజులలో ఇసుక వేస్తే నేలరాలనంత జనం పోగయ్యేవారు. ఇప్పుడంటే లెక్కలేనన్ని ఛానలున్నాయి కానీ దూరదర్శన్ తప్ప దిక్కులేని రోజుల్లో ప్రజలకు అదే పెద్ద వినోదం.  

ప్రదర్శన చూడాలనుకున్న రోజు రాత్రి పిల్లలందరం జట్టుగా ఏర్పడి బయలుదేరేవాళ్ళం. దారిలో మమ్మల్ని మేము కాపాడుకోవటానికన్నట్లు చేతిలో టార్చిలైటు, చంకలో చాపలు, చేతుల్లో కఱ్ఱలు పట్టుకోని గట్టిగా పాటలు పద్యాలు పాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం.స్వాతంత్ర్యం వచ్చిన అరవై ఏళ్ళకు మా ఊరికి తారురోడ్డొచ్చింది కానీ ఒకప్పుడది రాళ్ళు రప్పలతో నిండిన మట్టిబాటే. ప్రదర్శన జరుగుతూండగా నిద్రోస్తే పక్కనే ఉన్న మా పిన్ని వాళ్ళ ఊరికెళ్ళి అక్కడ పడుకొనేవాళ్ళం. 

అమ్మమ్మ వాళ్ళింట్లో పెద్దగా పొద్దుపోయేది కాదు. నా కంటే కేవలం సంవత్సరమన్నర పెద్దాడైనా, మా మామ మాతో పెద్దగా ఆడేవాడు కాదు. మరదళ్ళకు కాస్త తీరిక దొరికితే అచ్చంగాయలు, నేల - బండ (ఆంగ్లంలో మడ్ అండ్ స్టోన్) లాంటి ఆటలు ఆడేవాళ్ళు. 

ఆ ఊళ్ళో ఒక సినిమా టెంటుండేది. ఒక పొడవాటి కొట్టంలో తెల్లటి వస్త్రాన్ని కట్టి ప్రొజెక్టరులోంచి సినిమాని తెరపైకి ప్రసరింపజేసేవాళ్ళు. నేల క్లాసు, బెంచి అని రెండు తరగతులుండేవి. ఒక బండిలో పోస్టర్లు వేసుకొని చుట్టు పక్కల గ్రామాలకు వెళ్ళి వాల్‌పోస్టర్లు అంటించి ప్రచారం చేసి వచ్చేవాళ్ళు. సాయంత్రం ముస్లింల నమాజు పూర్తయ్యాక ప్రదర్శన ప్రారంభమయ్యేది. జనంతో హాలు కిటకిటలాడిపొయ్యేది. ఎక్కువగా ఎంటివోడు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వేసేవాళ్ళు. అన్నీ పాతసినిమాలే. కొండవీటి సింహం, అగ్నిపర్వతం, అడవి దొంగ, సాహస సామ్రాట్ లాంటివన్నమాట. మసాలా బొరుగులు (మరమరాలు) తింటూ పల్లెటూరి జనం మధ్య కూర్చొని వాళ్ళ ఈలలు కేకలు, వ్యాఖ్యానాల మధ్య సినిమా చూట్టం మంచి అనుభూతి. రాత్రి పూట సినిమా కార్యక్రమం లేకపోతే మా అమ్మమ్మే మా పక్కన పడుకొని పాత పౌరాణిక తెలుగు సినిమాల కథలు (శ్రీ కృష్ణావతారం, శ్రీ కృష్ణపాండవీయం లాంటివి) చెప్పేది. అది వింటూ నిద్రపోయేవాళ్ళం.


ఆ రోజులన్ని ఇప్పుడు తలచుకొంటూంటే అదొక స్వర్ణయుగంలా అనిపిస్తుంది. బాల్యం బాల్యమే.


రుద్రవీణ





నేను సైతం విశ్వవీణపు తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను

                                     -మహకవి శ్రీశ్రీ , జయభేరి.

వయసుడిగిపోయి చిక్కిశల్యమైన ఒక అంధురాలు, కోనేటి మెట్ల పై కూర్చొని బిచ్చమెత్తుకుంటోంది.

అటుగా వెళ్తున్న బ్రాహ్మణుడొకడు దయతలచి ' ఇదిగో అరటిపండు ' అంటూ ఒక అరటిపండును ఆమె ముందు పెట్టి వెళ్ళిపోయాడు. అంధురాలు దాన్ని అందుకోబోతే అది జారి క్రింది మెట్ల పై పడిపోయింది. చేతిదాకా వచ్చిన తిండి నోటి దాకా రాకపోయేసరికి అంధురాలు ఆందోళన చెంది, శరీరాన్ని మరింత వంచి  పటుత్వం లేని చేతులతో తడుముకుంటూ వెదుకుతోంది.

మంత్ర జపం చేసుకుంటూ  వెళ్తున్న పిల్లవాడొకడు ఆ దీనావస్థను చూశాడు. శిలలా బిగుసుకుపోయి చూస్తూన్నాడు కానీ సాయం చెయ్యాలన్న ఆలోచన కలుగలేదు.

దూరం నుంచి ఈ తతంగాన్నంతా కాసేపు గమనించిన తత్వాలు పాడుకొనే వృద్ధుడొకడు పైకిలేచి అరటిపండును అంధురాలికి అందజేశాడు. వెళ్ళిపోతున్న పిల్లవాన్ని ఆపి కళ్ళముందే అవస్థపడుతున్న అంధురాలికి సాయం చెయ్యలేదేమని ప్రశ్నించాడు. భగవంతుడు మనకిచ్చిన రెండు చేతులలో ఒకటి మనకి ఇంకొకటి పొరుగువాడి చేయుతకి  అని బోధించాడు.

ఇది ఉపోద్ఘాతం !

                *                                             *          

పచ్చని తివాచీ పరిచినట్టున ఓ అచ్చమైన పల్లెటూళ్ళోకి ఎక్కడినుంచో ఒక తెల్లటి అంబాసిడర్ కారోచ్చి ఆగింది. కార్లోంచి ఎం.పి గారి వ్యక్తిగత సహాయకుడు హడావుడిగా క్రిందకి దిగి చెట్టు క్రింద కూర్చోనున్న ఓ వ్యక్తిని
" ఏవయ్యా ! ఇట్రావయ్య " అంటూ పిలిచాడు.
ఆ వ్యక్తి పరుగులాంటి నడకతో వచ్చి నమస్కరించి వినయంగా చేతులు కట్టుకున్నాడు.
" ఏ ఊరిది ? "
" రామాపురమండి "
" అవునూ, ఈ ఊర్లో పోలీస్‌స్టేషన్ ఎక్కడుంది? ఫోన్ చేయ్యాలి. కార్లో ఎం.పి గారున్నారు".
ఆ వ్యక్తి కారువేపు వినయంగా వంగి నమస్కరించి " ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ లేదండి " అన్నాడు.
" పోనీ ఈ చుట్టుపక్కలెక్కడైనా పోలీస్ స్టేషన్లున్నాయా ? "
" పాతిక మైళ్ళ దూరంలో పోలీస్ స్టేషన్ ఉండదండి ."
" ఏమిటి ?! పోలీస్ స్టేషనే లేదా ? అయితే ఇది బాగా వెనుకబడిన ప్రాంతంలా ఉందే ! "
" కాదండి. కాదండి. ఈ ఊళ్ళో ఏదైనా నేరాలు జరిగితేనే కదండి పోలీస్ ‌స్టేషన్లు కావాలి. అట్టాంటివన్నీ ఇక్కడ జరగవండి."
అప్పటిదాకా వింటూన్న ఎం.పి గారు  విస్మయాన్ని ఆపుకోలేక కార్లోంచి  క్రిందకు దిగి పల్లెటూరి వ్యక్తిని దగ్గరికి పిలిచారు .
" ఈ ఊర్లో నేరాలే జరగవా? "
" జరగవండయ్యా "
ఇంతలో ఎం.పి గారి మరో సహాయకుడు కలుగజేసుకొని  " పోనీ టౌనుకెళ్ళి ఫోను చేసుకుందాం " అని సలహా ఇచ్చాడు. ఎం.పి గారికి అది రుచించలేదు .
" నువ్వండవయ్యా. ఈ ఊరు వరస చూస్తూంటే చాలా విచిత్రంగా ఉంది."
" ఇదే కాదండి .ఇట్టాంటి చిత్రాలు శానా ఉన్నాయండి మా ఊళ్ళో  "

వీళ్ళిలా మాట్లాడుతుండగానే ప్రక్కన  కలకలం రేగింది.  మద్యం సీసాలో ఎం.పి గారి సహాయకుడు తెచ్చుకున్న మంచి నీళ్ళను మద్యం గా భావించిన జనం ఆ సీసాని ఒడిసిపట్టుకొని ఊళ్ళో మద్యం తాగడానికి వీళ్ళేదని, ఎవరినీ తాగనీయమని భీష్మించారు. మద్యం కాదు నీళ్ళేనని రుజువు చేశాక పంతం విడిచిపెట్టి వెళ్ళిపోయారు.

ఎం.పి గారు ఊరివాళ్ళతో కలిసి నడుస్తూ
" ఈ ఊళ్ళో పోలీస్ స్టేషనే లేదట. ఎవ్వరూ నేరాలే చెయ్యరట. ఎవ్వరూ తాగరట. ఎవ్వరినీ తాగించరట. అయితే పార్టీ బాగానే పనిచేస్తోందనమాట. ఈ ఊళ్ళో ఏ పార్టీ బాగా స్ట్రాంగ్‌గా ఉందయ్యా ? కాంగ్రెస్సా ? " అని ఆడిగాడు.
"కాదండి."
" తెలుగుదేశమా ?"
" కాదండి."
" జనతా నా ? "
" కాదండి. ఇండిపెండెంటండి "
" ఇండిపెండెంటా? "
" అవునండి. అందరు చినబాబు పార్టీయేనండి "
" ఎవ్వరయ్యా చినబాబు ? ".
శిథిలావస్థలో ఉన్న ఆలయ గోపురంపై పిచ్చి మొక్కలు పీకేస్తున్న ఒక వ్యక్తిని చూపించి
" ఆరేనండి చినబాబు గారు " అన్నాడు ఊరతను .
"దేవుడి  కన్నా ఎత్తులో నిలబడ్డాడే " ఆశ్చర్యపోయారు ఎం.పి గారు.
" మా ఊరికి ఆయనే దేవుడండి "

 సమాజమే దేవాలయం అనుకుంటే అందులోని రుగ్మతలను ఏరిపారేసేవాడు దేవుడే ! ఇది ప్రారంభం.
                                                           *                                                     * 

సినిమాలు రెండు రకాలు - మనస్సుకు హత్తుకునేవి, మదిని మెలిపెట్టేవి.

రుద్రవీణ మొదటి కోవకు చెందిన సినిమా. చిరంజీవి, బాలచందర్, ఇళయరాజా, గణేష్‌పాత్రో, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి హేమాహేమీల కలయికలో వచ్చిన క్లాసిక్ మూవీ . మహరాష్ట్రలో రాలెగావ్‌సిద్ధి అనే గ్రామాన్ని సంస్కరించిన అన్నాహజారేని, ఆంధ్రదేశంలో ఒక ఐ.ఏ.యస్ అఫీసర్ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని అల్లుకున్న కథ. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడైన బిలహరి గణపతిశాస్త్రి తనయుడిగా జన్మించి, ఓ వైపు సాంప్రదాయరీతులలో సంగీతాన్ని అభ్యసిస్తూ, మరో వేపు సమాజంలోని అపసవ్య ధోరణులకు ఆవేదన చెందుతూ, అటు తండ్రిని ధిక్కరించలేక, ఇటు అంతఃకల్లోలాన్ని అణుచుకోలేక సతమతమవుతూ చివరికి తెగించి తిరుగుబాటు చేసి నవసమాజ నిర్మాణం వేపు అడుగులు వేసి, సామజిక చైతన్యం తీసుకొచ్చిన యువకుడి చరిత్రే  రుద్రవీణ.  

ఉదాత్తమైన కథకు ఊపిరిపోయాలంటే అందుకు తగ్గ నటీనటులు కుదరాలి.  అటువంటి వాళ్ళందరూ ఈ చిత్రానికి సరిగ్గా అమరిపోయి పదికాలాల పాటూ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రానికి ప్రాణప్రతిష్ట చేశారు. సాంప్రదాయాన్ని సంగీతాన్ని రెండు కళ్ళుగా భావించే తండ్రిగా జెమినీ గణేశన్, సంఘంలో మార్పు కోసం నిత్యం రగిలిపోయే నిప్పుకణిక లాంటి యువకుడిగా చిరంజీవి పోటీపడి నటించారు. వీరిద్దరి కలయికలో వచ్చే సన్నివేశాల్లో సంభాషణలు, భావోద్వేగాలు అద్భుతంగా పండాయి. చిరంజీవి స్వతహాగా చక్కని నటుడు. బాలచందర్ లాంటి మేటి దర్శకుల చేతిలో పడితే ఇక చెప్పేదేముంది. సంగీత సాధన చేస్తూ దీనురాలి ఆకలి కేకలు విని ఏకాగ్రత చెదిరే సన్నివేశాల్లో ,' అలగా జనానికీ ఆటపాటలు కావాలి నాన్నా'  అని వాదిస్తున్నప్పుడు ,'  మానవసేవ ద్రోహమా ? ' అని తండ్రిని ధిక్కరించి కచేరిలో పాడినప్పుడు, ఎలక్ట్రిషియన్ చావుకు కారణమైనప్పుడు,  ' నేను మీ కొడుకు మాత్రమే కాదు , మీ శిష్యున్ని, పెద్ద అభిమానిని కూడా, ఇంతగా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బిలహరి గణపతి శాస్త్రి గారు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంజరంలో బందీ కావటమే నాకు నచ్చలేదు. అదే నన్ను బాధిస్తోందని ' అని బాధపడినప్పుడు, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు, ఊరిబాగు కోసం వివాహాన్ని రద్దు చేసుకొనే సన్నివేశాల్లో సూర్యనారాయణ శాస్త్రి కనిపిస్తాడు కానీ చిరంజీవి కనిపించడు.

శోభన కళ్ళతోనే నటించిన సన్నివేశాలు రెండు. అంటరానిదానివి కదూ అని ప్రశ్నింపబడినప్పుడు ఒకసారి, వివాహాన్ని త్యజించబోతూ వరుడైన కథానాయకుడు తన అభిప్రాయం కోరినప్పుడు మరోసారి, కళ్ళతోనే అద్భుతమైన భావాలను పలికించి శభాషనిపించుకుంది. 

బాలచందర్ దర్శకత్వ ప్రతిభ గురుంచి చెప్పాలంటే మరో టపా వ్రాయొచ్చు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ' ఎవరిమాట విన్నావో, రావో, ఇందు లేవో, భళి, భళి  ' అన్న త్యాగరాజ కృతిని సందర్భానుసారంగా వాడుకున్నారు దర్శకుడు. ఎవరి సలహా విని నా వద్దకు రాకుండా ఉన్నావో, అసలున్నావో లేవో అంటూ త్యాగరాజు శ్రీరామున్ని విమర్శిస్తూ అల్లిన కృతి అది. ఆ కృతిని తండ్రితో కలిసి సాధన చేస్తూంటే బిచ్చగత్తె అన్నం కోసం అరుస్తూంటుంది. ఏకాగ్రత కోల్పోయిన సూర్యాన్ని తండ్రి కోప్పడి సంగీతం మీదే మనస్సు లగ్నం చెయ్యమంటాడు. ఇక్కడ బిచ్చగత్తె (సమాజం) అన్నం (సాయం) కోసం ప్రార్థిస్తోంది . కథానాయకుడికి సమాజ సేవ చెయ్యాలనే తపన ఉంది. కానీ తండ్రి అడ్డుపడుతూ సలహాలిస్తున్నాడు. ఇలా త్యాగరాజ కృతిని అటు సంగీతానికి ఇటు సన్నివేశానికి తగ్గట్టుగా వాడుకోవడం డర్శకుని ప్రతిభా పాటవాన్ని తేటతెల్లం చేస్తోంది. అలాగే, ప్రమాదంలో గాయపడి చావుబ్రతుకుల్లో ఉన్న విద్యుత్‌కార్మికున్ని, కథానాయకుడు కారులో కచేరీకి వెళ్తూ చూసే సన్నివేశం నాకు గౌతమ బుద్ధుని కథను జ్ఞప్తికి తెచ్చింది.

గణేష్‌పాత్రో సంభాషణలు ఈ చిత్రానికి ఆయువుపట్టు. ప్రటి మాటా శక్తివంతంగా ఉంది. కొన్ని సంభాషణలిక్కడ పొందుపరిచాను.

ఆకలి కేకలు నిన్నాకట్టుకోడానికి అవేమన్నా ఆలాపనలా ఆవృత్తాలా, అపశృతులు.
      దీనుల వేదనని అపశృతులనకండి నాన్నా.
ముష్టిదాని అరుపు నీకు మృష్టాన్నభోజనంలా ఉంటే సంగీతామృతం నీ జిహ్వకు సరిపడదు.
    గోదావరిలో  గొట్టికాలువ కలిస్తే అది సంగమం కాదు రా సంకరమే. 

   అమ్మనే  అమ్ముకు తిరిగేవాడికి పుట్టగతులుండవు. అది అపచారం
  కాదురా వ్యభిచారం.
నేను అమ్మను అమ్ముకునేవాన్ని కాదు నాన్నా. అమ్మ అందరికీ అమ్మే అని నమ్మినవాన్ని.
     మన గుమ్మంలోకొచ్చి శుభవార్త చెప్పినవారికి దారి ఖర్చులివ్వటం
     ఆనవాయితీ.
ఆయన నోటికే చిల్లుపడిందనుకున్నాను. నోటుకీ చిల్లు పడింది. చిల్లు పడినవి చెల్లవండి.
సీతారామశాస్త్రి సృజించిన సిరివెన్నలలో సాహితీప్రియులందరూ తేలి వివశులయ్యారు. బంగారానికి తావి అబ్బినట్టు ఇళయరాజా సంగీతం, కే.జే.జేసుదాస్, బాలు, చిత్ర ల గానమాధుర్యం తోడై ఈ చిత్రంలోని పాటలని అజరామరం చేసాయి. నాకు నచ్చిన కొన్ని వాక్యాలు.
తరలిరాదా తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
గగనాల దాకా అల సాగకుంటే
మేఘాల రాగం ఇల చేరుకోదా


వెన్నెల దీపం కొందరిదా
అడవికి సైతం వెలుగు కదా
బ్రతుకున లేని శృతి కలదా
ఎద సడి లోనే లయ లేదా

కూసే కోయిల పోతే కాలం ఆగిందా
పారే ఏరే పాడే మరో పదం రాదా
మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలుకదు కదా


ఆకాశం తాకే ఏ నేలకైనా ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను
నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏ నాటికీ
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
ఏ హాయీ రాదోయి నీ వైపు మరువకు


శీతాకాలంలో ఏ కోయిలైనా
రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక
విరిసే నవ్వులు లేక
మురళికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే 
పండుగ కాదా

ఆనాడు వాసంత గీతాలు పలుకును

కరుణను మరపించేదా  చదువు సంస్కారం అంటే
తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే


లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని (కథానాయుక పేరు లలిత)
ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జలధిని

తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజా కుసుమం


ఈ పాటలన్నీ ఒక ఎత్తైతే మహాకవి శ్రీశ్రీ పదాలను ప్రేరణగా తీసుకొని వ్రాసిన  ' చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ' పాట మరొక ఎత్తు. సంగీతం నేర్చుకుంటూ వచ్చీరానీ సంగీత జ్ఞానంతో ఈ పాటను ఎన్ని సార్లు పాడుకొన్నానో గుర్తులేదు. ఎప్పుడు విన్నా ఏదో తెలియని అనుభూతి.
ఒక ముసలివాడు ఒంటరిగా ఉలి చేతబట్టి కొండను తొలచి తన ఊరికి  రహదారిని నిర్మించాడన్న వార్త విన్నప్పుడో, చిన్న మొక్క మొలవని ప్రాంతంలో ఒక వ్యక్తి, అన్నీ తానే అయ్యి, ముప్పైఏళ్ళు కష్టపడి 1360 ఎకరాల్లో అడవిని సృష్టించాడని తెలిసినప్పుడో కలిగే స్పందన.
 అనిర్వచనీయమైన ఆవేదనతో మనస్సంతా నిండిపోయి ఆ ట్రాన్స్‌లో నుండి రావటానికి కొంత సమయం పడుతుంది. సంఘజీవిగా నా బాధ్యతను గుర్తుచేస్తుంది. నా కంటే చిన్నవాళ్ళు, నేనెరిగిన వాళ్ళు సమాజానికి తమ వంతుగా ఎంతో చేస్తున్నారు.

వాళ్ళు చేసేదానిలో పదో వంతు చేసినా నా జన్మ ధన్యమైనట్లే.


*                                                              *

ఈ సినిమాని తమిళంలో పునర్నిర్మించారు. సీత, కమలహాసన్ నాయికానాయకులు. తమిళ శైలికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అన్నా చెల్లెళ్ళ బాంధవ్యాన్ని బలోపేతం చేశారు.' రండి  దయచేయండి, చెప్పాలని ఉంది' పాటలు లేవు. కథానాయకుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూంటే అక్కడ నాయిక పరిచయం అవుతుంది. పాటలలో డాన్సులు అవీ పెట్టారు. తెలుగువాన్ని కాబట్టి నాకు తెలుగు సినిమానే నచ్చినా తమిళం కూడా ఫర్వాలేదనిపించింది.

రుద్రవీణ జాయాపజయాల మీద చర్చ అనవసరం. అప్పుడున్న సమస్యలు ఇప్పుడూ ఉండవచ్చు. నా లాంటి వాళ్ళపై ఈ సినిమా చూపిన ప్రభావం చాలు కలకాలం నిలిచిపోడానికి. అవార్డులు రివార్డులు అన్నీ తర్వాతే.

మానవవాదానికి ముగింపు లేదు.


పృథ్వీరాజ్ చౌహాన్‌ది ధృతరాష్ట్రుని అంశా?






రాక్రమవంతుడైన పృథ్వీరాజ్ చౌహాన్ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఢిల్లీ -అజ్మీర్‌లను రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేసిన ఆఖరి హైందవరాజు, రాజపుత్ర యోధుడు అతను. అతని భార్య సంయుక్త. వారిద్దరి ప్రేమ, పరిణయం చాంద్‌బార్దాయ్ వ్రాసిన 'పృథ్వీరాజ రాసో ' సాక్షిగా జగద్వితం. మహమ్మదీయుల దండయాత్రను సమర్థవంతంగా తిప్పిగొట్టి తుదకు మళ్ళీ అదే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన పృథ్వీరాజ్ ధీరోద్ధాత్తత గురుంచి రకరకాల గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భవిష్యపురాణంలోనూ ఈ చారిత్రక పురుషుడి ప్రస్తావన ఉంది.


భవిష్యపురాణం ప్రకారం ఇంద్రప్రస్థాన్ని పరిపాలిస్తున్న అనంగపాలుడనే రాజుకు చంద్రకాంతి, కీర్తిమాలిని అని ఇద్దరు కూతుళ్ళు. చంద్రకాంతిని కన్యాకుబ్జాన్ని ఏలుతున్న రాష్ట్రపాలుని వంశీయునికిచ్చి పెళ్ళి చేస్తే, కీర్తిమాలినిని చవహని వంశస్థుడైన సొమేశ్వరునికిచ్చి వివాహం జరిపిస్తాడు.చంద్రకాంతికి జయచంద్రుడు, రత్నభానుడనే పిల్లలు కలుగుతారు. కీర్తిమాలినికి ముగ్గురు పిల్లలు పుడతారు -ధుందుకారుడు,కృష్ణకుమారుడు, పృథ్వీరాజు. వీళ్ళలో పృథ్వీరాజుది ధృతరాష్ట్రుని అంశ. అమిత బలపరాక్రమాలు కలవాడు. పన్నెండేళ్ళ ప్రాయంలోనే సింహంపై స్వారీ చేస్తాడు. మనవడి శౌర్య సంపత్తికి మెచ్చిన తాత అనంగపాలుడు అతన్ని దత్తత్త తీసుకొని రాజ్యాన్ని కట్టబెట్టి హిమాలయాలకు వెళ్ళిపోతాడు.



సోదరులిద్దరూ తనకు శతృవులని భావించిన పృథ్వీరాజు, తాత పరమపదించగానే వాళ్ళను రాజ్యం నుండి వెళ్ళగొడతాడు.వాళ్ళు తమ తమ మంత్రులని వెంటబెట్టుకొని కన్యాకుబ్జాన్ని పాలిస్తున్న జయచంద్రున్ని శరణు వేడుతారు.అతడు ఆభయమిచ్చి ఆశ్రయం కల్పిస్తాడు. జయచంద్రునికి అగమ, మలన అని ఇద్దరు చెల్లెళ్ళు. అగమను పృథ్వీరాజుకిస్తారు. మలనను ధుంధుకారుని మంత్రైన ప్రద్యోతనునికిచ్చి పెళ్ళి జరిపిస్తాడు. పృథ్వీరాజు కొత్త దుర్గాన్ని నిర్మించి దాని గుమ్మాన్ని ఎత్తిస్తాడు. ఆ గుమ్మం భాగ్యప్రదాత అని భావించి దానికి దేహలి అని నామకరణం చేస్తాడు (అదే నేటి ఢిల్లీ). కొంతకాలానికి ' తాత ఆస్తిలో తనకూ భాగముందని, తన భాగం తనకు వదిలిపెట్ట ' మని వర్తమానం పంపుతాడు జయచంద్రుడు. పృథ్వీరాజు తిరస్కరిస్తాడు. వైరం మొదలవుతుంది.

జయచంద్రుని తమ్ముడైన రత్నభానుడు (ఇతని కొడుకే నకులాంశ సంభూతుడు లక్షణుడు) పృథ్విరాజు పాలనలో ఉన్న కొంత ప్రాంతాన్ని హస్తగతం చేసుకుంటాడు. జయచంద్రునికి పిల్లలు కలుగరు. దాసీదాని మీద మనసు పడి ఆమె ద్వారా సంయుక్త అనే పుత్రికకు తండ్రవుతాడు. ఆమె యుక్తవయస్సుకు రాగానే స్వయంవరం ప్రకటిస్తాడు. పృథ్వీరాజు ధైర్యసాహసాలు విన్న ఆమె స్వయంవర మంటపంలో అతని బంగారు ప్రతిమను పుష్పమాలాంకృతం చేస్తుంది. ధైర్యముంటే వచ్చి తీసుకెళ్ళమని పృథ్వీరాజుకు సవాలు విసురుతాడు జయచంద్రుడు. పృథ్విరాజు ససైన్యంతో వచ్చి సంయుక్తను తీసుకెళ్తాడు. హోరాహోరీగా జరిగిన యుద్ధంలో రత్నభానుడు నిహతుడవుతాడు.


పృథ్వీరాజు లక్ష చండీయాగం చేస్తే దేవి ప్రసన్నురాలై కౌరవుల అంశతో కుమారులను, ద్రౌపది అంశతో కూతురును అనుగ్రహిస్తుంది. అయితే వీరు సంయుక్త ద్వారా కలిగిన సంతానమో మరెవరి ద్వారా కలిగిన సంతానమో తెలియదు.కూతురు పుట్టగానే భూమి కంపించి, రక్తమాంస వర్షం కురిసి, ఆకాశం నుంచి చండిక వికటాట్టహాసం చేస్తుంది.ఆమె పేరు ఏల. పన్నెండేళ్ళ ప్రాయంలో ఆమె తండ్రిని పిలిచి మండపంలో రక్తధారలతో తనకు అభిషేకం చేయించేవాడు, ద్రౌపది నామధేయంతో నగలను సమర్పించేవాడు తనకు నాథుడవుతాడని చెబుతుంది. పృథ్వీరాజు ఆ విధంగా శాసనం వ్రాయించి, కర్ణాంశ సంజాతుడైన తన కొడుకు తారకునిచ్చి, ఒక లక్ష సైన్యంతో దేశం మీదకు పంపుతాడు. రాజులందరూ వెనుకంజ వేస్తే అర్జునాంశ సంజాతుడైన బ్రహ్మానందుడు అందుకు సంసిద్ధుడౌతాడు.(ఇతను మలన కుమారుడు.ఇతని స్నేహితుడు కృష్ణుని అంశలో పుట్టిన జయసింహుడు). వివాహానికి ఎక్కడెక్కడి రాజులూ సైన్యంతో వస్తే పృథ్వీరాజు ఆశ్చర్యపోయి వారికి శిబిరాలు ఏర్పాటు చేస్తాడు. వివాహమైన వెంటనే తారకాదులు చెలరేగి యుద్ధం చేస్తే జయసింహుడు ఖడ్గధారియై దూకి తన వారిని ఆదుకుంటాడు.సకలవిద్యాపారంగతుడైన పృథ్వీరాజు రెండవ కురుక్షేత్ర యుద్ధంలో (రెండవ తైరైను యుద్ధంలో) మహమ్మదు ఘోరీ చేతిలో అపజయం పాలై మరణిస్తాడని,అంతటితో అతని వంశం క్రమంగా అంతరిస్తుందని, నకులాంశ సంభూతుడైన లక్షణుడు కూడా ఈ యుద్ధంలో మరణిస్తాడని భవిష్య పురాణం తెలియజేస్తోంది.

పురాణాల్లో ఇలా ఉంటే చరిత్రకారుల భాష్యం మరోలా ఉంది. అనంగపాలుడనే తాత పృథ్వీరాజుకున్నా, ఆ తాతయ్య కూతుళ్ళ పేర్లు మాత్రం రూపసుందరి, కమలాదేవి. సోమేశ్వరరాజు (తండ్రి పేరు సరిపోయింది) -కమలాదేవిల తనయుడు పృథ్వీరాజ్ చౌహాన్. పృథ అనే చెల్లేలు మాత్రం ఉంది.చిత్తోడ్ రాజైన సమర్‌సింగ్ ఈమె భర్త . రెండవ తైరైను యుద్ధంలో అన్నయ్య ఓడిపోవటం, భర్త, కన్నకొడుకూ వీరమరణం పొందటంతో అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటుంది. పృథ్వీరాజుకు హరిరాజనే సోదరుడున్నట్లు కొంత సమాచారముంది. పృథ్వీరాజు మరణాంతరం, అతని కుమారుడైన గోవిందరాజుని అజ్మీర్ సామంత రాజుగా ప్రకటిస్తారు ముసల్మానులు. హరిరాజు అతన్ని పడగొట్టి రాజ్యాన్ని కైవసం చేసుకుంటాడు. తురుష్కులపై తిరుగుబాటు చేసి కొంతమేర సఫలీకృతుడై చివరికి పరాజితుడై ఆత్మార్పణ చేసుకుంటాడు. పృథ్వీరాజుకు చాలామంది సంతానమున్నట్లు, వీరిలో కొందరు ఇస్లాం మతం పుచ్చుకున్నట్లు కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు గానీ ఎక్కడా ఏల తారకుడిల ప్రస్తావన లేదు. అలాగే జయచంద్రుడు - పృథ్వీరాజ్ అన్నదమ్ములన్న విషయం రూఢియైనా , జయచంద్రుని తమ్ముడైన రత్నభానుడి విషయంలో సమాచారం లేదు. సంయుక్త జననంలోనూ స్పష్టత లేదు.

భవిష్యపురాణంలో వివాస్పద అంశాలు చాలా ఉన్నాయి. ఏది వ్యాసకృతమో, ఏది ఇతరుల కల్పనో తెలియదు. వాటిలో పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్ర ఒకటి. ధృతరాష్ట్రాంశతో జన్మించిన పృథ్వీరాజు వరుసకు అన్నకూతురైన సంయుక్తను లేవదీసుకొని వివాహమాడటం ఏమిటో అంతుపట్టకుండా ఉంది. జయసింహుని లీలలు, చరిత్ర దాదాపుగా శ్రీకృష్ణుని చరిత్రను పోలివున్నాయి. ఇంతటి ప్రఖ్యాతి వహించిన రాజు నిజంగా పృథ్వీరాజు కాలంలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లేవు.నకులాంశతోనూ, కర్ణాంశతోను ద్రౌపద్యాంశతోనూ పుట్టిన వాళ్ళు, ఇతర దివ్యాంశ సంభూతులు అనామకులుగా మరణించటమేమిటో అర్థం కాకుండా ఉంది. ఏ ప్రయోజనమూ నెరవేరనప్పుడు మహాత్ములు మళ్ళీ పుట్టడం దేనికి? ఇన్ని సందేహాల మధ్య అసలు భవిష్యపురాణంలో పేర్కొన్న పృథ్వీరాజు, మాములు జనానికి తెలిసిన పృథ్వీరాజు ఒక్కరేనా అన్న అనుమానం కలుగక మానదు.



కీచక సంతతి




'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా' అని మనుస్మృతి చెబుతోంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారని దీని భావం. మన దేశం గురించి మన సంస్కృతి గురించి గొప్పగా ఎన్ని బాకాలు ఊదినా దేశ రాజధానిలోనే ఒక స్త్రీ మానప్రాణాలకు రక్షణ లేనప్పుడు అదంతా అపహాస్యం కాకమానదు.

ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఉదంతాన్ని తలచుకుంటేనే నెత్తురు మరిగి మనస్సు విచలితమవుతోంది. మృగత్వం మూర్తీభవించిన ఆరు మంది మగాళ్ళు పశువాంఛతో ఒక అమ్మాయిని దారుణంగా మానభంగం చేసి ఆమెను, ఆమె స్నేహితున్ని ఇనుపరాడ్‌తో తీవ్రంగా గాయపరచి కదులుతున్న బస్సులోంచి నగ్నంగా నడిరోడ్డు మీదకు విసిరేశారు. ఆదుకొనే నాథుడు లేక అచేతనావస్థలో వారిద్దరూ ఎంతసేపలా పడిపోయారు తెలియదు. తగిలిన గాయాలలాంటివి. ఆ అమ్మాయి దయనీయ స్థితి వింటే మానవమాత్రుడికెవరికైనా కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరక్క మానదు. జరిగిన ఘోరం కారణంగా ఆమె ప్రేవులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బ్రతికినా భవిష్యత్తులో పెళ్ళి చేసుకొని సంసారం చెయ్యలేని దుస్థితి. ప్రేవులు దెబ్బతిన్న కారణంగా ఆహారాన్ని సైతం నరాల ద్వారా అందిస్తున్నారు వైద్యులు. హేయమైన కార్యానికి పాల్పడ్డ నేరస్తులు బాధితుల దుస్తులు కాల్చివేసి, బస్సును క్లీన్ చేసి నింపాదిగా యథావిధిగా మరుసటిరోజు విధులకు హాజరయ్యారు.

ఇంతటి ఘోరానికి పాల్పడ్డ నేరస్తులకి ఏ శిక్ష సరిపోతుంది? అసలు భారతీయ శిక్షా స్మృతిలో ఇటువంటి నేరాలకు శిక్ష ఉందా? కేవలం ఐదు నిమిషాల్లో దేహ బాధ నుంచి విముక్తి చేసే ఉరి, ఆ అమ్మాయి జీవితకాలం అనుభవించే మానసిక క్షోభకు సరితూగుతుందా?

దేశంలో కీచక సంతతి నానాటికీ ఎక్కువవుతోంది. ఒక్క ఢిల్లీలోనే ఈ సంవత్సరం 572 రేపులు నమోదయ్యాయి. మిగతా మహానగరాలన్నిటిలో నమోదైన కేసుల సంఖ్య కంటే ఇదెక్కువ. గ్యాంగ్‌రేప్ జరిగిన తర్వాత దేశ రాజధానిలో మహిళల భద్రత గురుంచి కవర్ చెయ్యటానికి వెళ్ళిన ఆజ్‌తక్ మహిళా జర్నలిస్టు కెమేరా సాక్షిగా ఈవ్ టీజింగ్‌కి గురయ్యారు. ఒకవైపు దేశం అట్టుడికి పోతున్నా, మరోవైపు ఎవడేం చేస్తాడన్న ధీమాతో కెమేరా సాక్షిగా ఈవ్ టిజీంగ్ పాల్పడటం  ఘనత వహించిన మనదేశ రాజధాని నేరచరిత్రకు పరాకాష్ఠ. వాళ్ళనని లాభం లేదు. యాథా రాజా తథా ప్రజా అన్నారు కదా. అనేక మోసాలు, నేరాలు చేసిన నిందితులు నాయకమాన్యులవుతున్న దేశంలో ప్రజలు అలా కాక మరోలా ఎలా ఉంటారు?

చెక్ రిపబ్లిక్, పోలాండ్, జర్మనీ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో, అమెరికాలోని  కొన్ని రాష్ట్రాల్లో కెమికల్ కాస్ట్రేషన్ అవలంబిస్తారు. మందుల ద్వారా నేరస్తుల వాంఛలు తగ్గించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇది దీర్ఘకాలిక ప్రణాళిక లాంటిది. నేరస్తుడి పై నిఘా వుంచి సమయానుకూలంగా మందులు వేస్తూండాలి. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సడలిపోయి నోరున్నవాడిదే రాజ్యమవుతున్న రోజులివి. తమ చేతకానితనానికి సహనమనే అందమైన ముసుగు తొడుక్కొని, మిన్ను విరిగి మీదపడిపోతున్నా మరేం పర్లేదన్నట్టు ప్రతి రోజూ  ఒకేలా నిబ్బరంగా గడపగల భారతీయ ప్రజలలో చైతన్యం జ్వలించాలంటే ఇటువంటి సున్నితమైన శిక్షలు సరిపోవు.

అనెస్తీషియా ఇవ్వకుండా అంగవిచ్ఛేదన చెయ్యాలి.

అరబిక్ దేశాల్లో అమలయ్యే ఆటవిక శిక్షలు కావాలి. రాళ్ళతో కొట్టి చంపడం, బహిరంగ శిరచ్ఛేదన లాంటివి.

అప్పుడే అమ్మాయి మీద చెయ్యివెయ్యాలనుకున్న ప్రతి ఆగంతకుడికి వెన్నులో వణుకు మొదలవుతుంది.


ఏటా ఎంతోమంది ఆయేషాలు, శ్రీలక్ష్మిలు, మరెంతో మంది అబలలు దారుణకృత్యాల బారినపడి దగ్ధమవుతున్నా, జడివానలో దున్నపోతులా  ఏ మాత్రం స్పందించని ప్రభుత్వ యంత్రాంగాలు ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు చేబడుతాయా లేక కీచక సంతతికి దేశాన్ని చేజేతులా సమర్పించుకుంటాయా ? 


నా మొదటి పద్యం



ది నా మొదటి పద్యం. అమ్మవారిని స్తుతిస్తూ వ్రాశాను. పద్య నిర్మాణంలో సందేహ నివృత్తి చేసిన శంకరాభరణం బ్లాగు నిర్వాహకులు, గురుతుల్యులు శ్రీ కంది శంకరయ్య గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

ఇది సీస పద్యం. తేటగీతితో పద్యాన్ని పూర్తిచేశాను. రెఫరెన్స్ కోసం వాటి వాటి లక్షణాలు క్రింద పొందుపరచాను.

సీసము - లక్షణాలు

నాలుగు పెద్ద పాదాలు . ప్రతి పాదానికి 6 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు. 4+ 4 గణాలుగా పాదం వ్రాస్తే ప్రతి పాదంలోనూ మూడవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతికి బదులు ప్రాసయతిని వాడవచ్చు. అన్ని పాదాల్లోనూ ఒకే యతి పాటించాలనీ లేదు, పాటించకూడదనీ లేదు. మొత్తం పద్యానికీ ఒకే యతి పాటించవచ్చు. ప్రాస నిమయం లేదు. అక్షర నియతి లేదు. సీస పద్యాన్ని ఆటవెలదితో కానీ తేటగీతితో కానీ తప్పనిసరిగా పూర్తిచెయ్యాలి.

తేటగీతి - లక్షణాలు

1 సూర్య గణం + 2 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు. 5 గణాలు ఏ పాదానికా పాదంగా ఉంటాయి. ప్రతి పాదంలోనూ నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. వీలైతే ప్రాసయతి వాడవచ్చు. ప్రాస నియమం లేదు. అక్షర నియతి లేదు.

నా పద్యం

శ్రీకరి సుందరి శ్రీవిష్ణు హృత్పద్మ
                మందిరా ఇందిర మంగళప్రియ
దాక్షాయణీ దుర్గి దైత్యసంహారిని
               
దీనసంసేవిని దేవదేవి
జ్ఞానసంజీవని నాదసంధాయని
               
శారదా సర్వజ్ఞ త్యరూప
 
ఓంకార రూపిణీ జస్స్వరూపిణి
                
ర్వలోకాత్మికా ర్వమాత 

మల భావాంతరంగిణి న్నపూర్ణ
విశ్వరూపిణి త్రినయని వేద వినుత
యోగమాయా వినోదిని త్పలాక్షి
పాహి మోక్షప్రదాయిని పాహి పాహి


 
భావం :

ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లీ, సుందరి ,శ్రీ మహావిష్ణువు హృదయపద్మమందిరంలో వసించు లక్ష్మీ, మంగళప్రియ, దాక్షాయని, దుర్గా (పార్వతి),దైత్య సంహారిని,దీనజన సంరక్షిణి, దేవ దేవి, జ్ఞానమనే సంజీవని ప్రసాదించి అజ్ఞానమనే మృత్యువు నుంచి రక్షించు సరస్వతి, నాదంతో (సంగీతంతో) అనుసంధానింపబడు శారదా,(సంగీతానికి సాహిత్యానికి నెలవు సరస్వతి, శరదృతువులో సరస్వతిని పూజిస్తారు), సర్వజ్ఞురాలా , సత్య రూపిణి, ఓంకార రూపిణి, ఓజస్స్వరూపిణి (ఓజస్సు = తేజము, బలము, ఉత్సాహము), సర్వలోకాత్మికా, సర్వమాత, నిర్మల(అమల=నిర్మల) హృదయాంతరంగముతో విశ్వాన్ని పోషించే అన్నపూర్ణ, విశ్వరూపిణి, త్రినయన, వేదముల చేత స్తుతింపబడి, యోగమాయతో వినోదించు కలువకన్నుల తల్లీ, మోక్షప్రదాయినీ రక్షించు తల్లీ రక్షించు .    


సుందర దృశ్యరూపం శిరిడిసాయి



నేను షిర్డీ సాయిబాబా భక్తున్ని కాను. దృశ్యరూపంగా సినిమాలలో గానీ సీరియల్స్‌లో గానీ ఆయన మహత్యాలు చూసిన సంఘటనలు గానీ, కర్ణాకర్ణిగా ఆయన చరిత్ర విన్న దాఖలాలు గానీ లేవు . అలాగని ఆయన పట్ల ఎటువంటి వ్యతిరేకత కూడా లేదు. మా ఆవిడ మాత్రం సాయిబాబా భక్తురాలు. గురువారాలు ఉపవాసాలు ఉండటం, సాయి సచ్చరిత చదవడం లాంటివి  క్రమం తప్పకుండా చేస్తూంటుంది. పూర్తిగా ఆమెకోసమే కాకపోయినా, ఇటువంటి సినిమాల పట్ల నాలో మాములుగా ఉన్న ఆసక్తి, నాగార్జున ఎలా చేశాడోనన్న ఉత్సుకత ఏమూలనో ఉండటం చేత మొదటిరోజే సినిమాకు వెళ్ళిపోయాం. సినిమా చూస్తూ, చూశాక చాలా ఆశ్చర్యానికి లోనయ్యాం.

శిరిడిసాయి చాలా బావుంది. సాయిబాబా జీవిత చరిత్రను నిజాయితీగా వివరించే ప్రయత్నమని సినిమా చూస్తున్నంతసేపూ అనిపించింది. కథ, కథనం చాలావరకు సాయి సచ్చరితలో ఉన్నట్లే చిత్రీకరించారని మా ఆవిడ ద్వారా తెలిసింది. ఎటువంటి సినిమాలలో అయినా చవకబారు హాస్యాన్ని, వెకిలి శృంగారాన్ని గుప్పించే రాఘవేంద్రరావు ఈ సినిమాలో స్కోపు లేవటం మూలంగానో, శ్రీ రామరాజ్యం విడుదలైనప్పుడు ఆ చిత్రాన్ని తన చిత్రాలతో పోల్చి జరిగిన చర్చల మూలానో కాస్త పద్ధతిగా తీశాడు. ఆయితే ఇందులోనూ చవకబారు సంభాషణలు లేకపోలేదు. ఆలీ, అనంత్ , బ్రహ్మానందం, శ్రీహరి ఆ కార్యాన్ని తమ పంథాలో నిర్వహించారు. బ్రహ్మానందం నటన ఎనభైలలో ప్రదర్శించిన ఆయన శైలిని గుర్తుచేస్తుంది. గ్రాఫిక్స్ సరిగ్గా కుదరలేదు. ఒక్కటే దేవుడు పాట ప్రారంభంలో ఋషులు, ముల్లాలు, క్రైస్తవ మతపెద్దలు హిమాలయాల్లో లైన్‌గా కూర్చొని ప్రార్థనలు చేస్తూంటారు. ఆ సన్నివేశాలు కాస్త నవ్వు తెప్పించాయి. అమరారామ,శరణు శరణు శరణం పాటలు నాకు బాగా నచ్చాయి . మిగతా పాటలు సన్నివేశాలకు సరిపోయాయి అనిపించింది కానీ గొప్పగా అనిపించలేదు. బాబా పట్ల నాలో భక్తిభావం లేకపోవటం అందుకు కారణం కావచ్చు.

నాగర్జున నటన మీద నాకు మొదటినుంచీ పెద్ద భ్రమలు లేవు. అన్నమయ్య చుశాక ఫర్వాలేదు అనుకున్నాను. శ్రీరామదాసు ద్వితీయార్థంలో ప్రదర్శించిన హావభావాలు చుశాక నా ఆభిప్రాయం సడలింది. శిరిడిసాయి చూశాక నాగార్జున నటనలో పరిణితి కనబడింది. ఇటువంటి చిత్రాలు చేస్తున్నప్పుడు నటీనటుల ఆహర్యం ముఖ్యం. సగం మార్కులు అక్కడే పడిపోతాయి అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయిలలో నాగార్జునకు ఆహర్యం బాగా నప్పింది. బాడీలాంగ్వేజ్‌లో సాయిబాబా శైలిని చక్కగా అనుకరించాడు. పతాక సన్నివేశాల్లో ముఖంలో సాత్వికతను ఆర్ద్రత బాగా ప్రకటించగలిగాడు. పూర్తిగా ఒన్‌మ్యాన్ షో. అతను గర్వంగా చెప్పుకునే చిత్రాలలో ఇదొకటని నిస్సందేహంగా చెప్పొచ్చు.

మిగతా నటీనటులందరూ ఆయా పాత్రలకు సరిపోయారు. శ్రీకాంత్, శరత్‌బాబు, తదితరులు తమ పరిధి మేరకు బానే చేశారు. కమలినీ ముఖర్జీ తేలిపోయింది.

చవకబారు సినిమాలన్నీ కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తున్న ఈ రోజుల్లో ఈ సినిమా ఘనవిజయం సాధించి  ఇటువంటి మరిన్ని చిత్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆశిస్తున్నాను.


కురుపాండవుల తదుపరి జన్మలు -1


కురుపాండవులకు తదుపరి జన్మలున్నాయా? భవిష్య పురాణం ఉందనే చెబుతోంది.


కురుక్షేత్ర సంగ్రామం చివరి దశకు చేరుకొంది. అటు పాండవ శిబిరంలోనూ ఇటు కౌరవ శిబిరంలోనూ యోధాగ్రేసరులందరో అసువులు బాశారు. కౌరవులు పరాజితులై పాండవులు విజేతలయ్యారు. యుద్ధం చివరి రోజైన పద్దెనిమిదవ రోజు సాయంత్రం, జరిగిన నష్టాన్ని తలచుకొని శ్రీకృష్ణుడు కాలస్వరూపుడైన పరమేశ్వరున్ని స్తుతించాడు. పాండవులకు రక్షణగా ఉండమని ప్రార్థించాడు.

నమ:శాంతాయ రుద్రాయ భూతేశాయ కపర్దినే
కాలకర్త్రే జగద్భర్త్రే పాపహర్త్రే నమోనమ:
పాండవాన్రక్ష భవన్మద్భక్తాన్ భూతభీరుకాన్

రుద్రుడు సంతుష్టుడై త్రిశూలం దాల్చి నందిని అధిరోహించి పాండవ శిబిరానికి కాపలాగా వచ్చాడు. శ్రీకృష్ణుడు సెలవు తీసుకొని గజస నగరానికి వెళ్ళిపోయాడు. తొడ విరిగిపోయి నెత్తుటిమడుగులో పడి ఉన్న దుర్యోధనుని చేత సర్వసైన్యాధ్యక్షునిగా నియమింపబడ్డ అశ్వత్థామ, కుంతిభోజుడు, కృపాచార్యుడు శతృసంహారం కోసం రాత్రి పూట పాండవ శిబిరానికి రహస్యంగా వస్తారు. రక్షకుడిగా సాక్షాత్తు రుద్రుడే నిలబడివుండటం చూసి నివ్వెరపోతారు. అశ్వత్థామ పరిపరివిధాలా పరమేశ్వరున్ని ప్రార్థించి దివ్యఖడ్గాన్ని పొందుతాడు. పరమేశ్వరుడు మార్గానికి అడ్డు తొలగి దారినిస్తాడు.అశ్వత్థామ రెట్టించిన ఉత్సాహంతో శిబిరాల్లోకి దూరి నిద్రిస్తున్న ఉపపాండవులను (పాండవ కుమారులు ఐదుమంది) పాండవులుగా భ్రమించి తన దివ్యఖడ్గానికి బలిస్తాడు. ధృష్టధ్యుమ్నాదులను పరలోకానికి పంపుతాడు.కార్యం ముగిశాక దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెవిన వేస్తాడు. శాత్రవ సంహారం జరిగిందన్న సంతృప్తితో రారాజు మరణిస్తాడు.

కుపితులైన పాండవులు దీనికంతటికి పరమేశ్వరుడే కారణమని అతన్ని నిందించి శస్త్రప్రయోగం చేస్తారు. ప్రయోగించిన ప్రతి ఆయుధం శివుడిలో ఐక్యమైపోతుంది. ఆగ్రహం చల్లారని పాండవులు తన మీద పడి పిడిగుద్దులు గుద్దితే పరమేశ్వరుడు కోపించి " మీరు కృష్ణ భక్తులు గనుక మిమ్మల్ని చంపగలిగీ సహించి రక్షించాను. పునర్జన్మలెత్తి ఈ నేరానికి శిక్షను అనుభవించండి" అని శపిస్తాడు. పాండవులు పశ్చాత్తాపం చెంది హరిని హరున్ని ఇద్దరినీ స్తోత్రం చేస్తారు. భక్తసులభుడైన పరమేశ్వరుడు శాంతించి ఏం వరం కావాలో కోరుకొమ్మంటాడు. శరీరంలో ఐక్యమైన ఆయుధాలు శస్త్రాలు తిరిగి పాండవులకు ప్రసాదించవలసిందిగా కోరుకుంటాడు శ్రీకృష్ణుడు. పరమేశ్వరుడు ఆ వరాన్ని ప్రసాదించి త్వరపడి వారిని శపించానని ఆయినా తన వాక్కు వృధా కాదు కనుక వివిధ నామధేయాలతో పాండవులు పునర్జన్మలెత్తి పాపఫలం అనుభవిస్తారని చెబుతాడు.

ఆ ప్రకారం..

ధర్మరాజు బలఖానిగా
భీముడు వీరణుడిగా
అర్జునుడు బ్రహ్మానందుడిగా
నకులుడు లక్షణుడిగా
సహదేవుడు దేవసింహునిగా
ధృతరాష్ట్రుడు పృథ్వీరాజు గా
అతని కుమార్తె వేల గా ద్రౌపది
ఆమె అన్న తారకుడిగా కర్ణుడు
జయసింహుడనే పేరుతో శ్రీకృష్ణుడు మళ్ళీ జన్మిస్తారు.
(సశేషం ..)


నన్నయ Vs పాల్కురికి సోమనాథుడు

చరా పుణ్యమా అని తెలుగులో ఆదికవి నన్నయా లేక పాలకురికి సోమనాథుడా అనే వివాదం బయలుదేరింది కాబట్టి ఎవరు ఎలాంటివారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నన్నయ






నన్నయ పదకొండవ శతాబ్దానికి చెందిన కవి.ఆయనకు ముందు ఆంధ్ర సాహిత్యం అధ్వాన్న స్థితిలో ఉండేది. సంస్కృత భాషలో రచింపబడిన వేదవేదాంగాలు, పురాణాలు, కావ్యాలు సామాన్య ప్రజానీకానికి సులభంగా బోధపడేవి కావు. ఈ విషయాన్ని గ్రహించిన జినుడు, గౌతమ బుద్ధుడు తమ బోధనలు జనబాహుళ్యానికి అర్థమయ్యే రీతిలో వ్యవహారిక భాషల్లోనే బోధించి విజయం సాధించారు. ఆరవ శతాబ్దం చివర్లో నిర్మింపబడ్డ శాసనాల్లోనే తెలుగు ఆనవాళ్ళు కనిపించినా, అప్పటికి తెలుగులో ప్రామాణికమైన రచనలు జరిగినట్లు దాఖలాలు లేవు. తెలుగు ప్రయోగం మాత్రం అంతంతమాత్రంగానే ఉండేది. చెదురుమదురుగా కొన్ని పద్యాలు ఉన్నప్పటికీ అవి సంస్కృత వృత్తాల వాసనలను పోలి ఉండేవి. దీనికి కారణం తెలుగులో తగిన పదజాలం లేకపోవటం. ఉన్న కొన్ని పదాలకు స్థిరమైన రూపం ఉండేది కాదు( ఉదాహరణకు  దేవుడు అనే శబ్దం దేవడు, దేవండు, దేవణ్డు ' గా, తూర్పు అనే శబ్దం తూఱ్వు, తూఱ్పు, తూఱ్గు గా వ్రాయబడేది).

తెలుగులో పరిస్థితి ఇలా ఉండగా పొరుగుభాషలైన తమిళం,కన్నడంలో పరిస్థితి మరోలా ఉంది. తమిళంలో క్రీస్తుకు పూర్వమే తోల్కాప్పియం, తిరుక్కురళ్ వంటి గ్రంథాలు వెలువడితే క్రీస్తు తర్వాత సిలప్పదికారం, మణిమేకలై వంటి మహాకావ్యాలు వచ్చాయి. భారతం కూడా రచింపబడింది. కన్నడలో విక్రమార్క విజయం, గదాయుద్ధం వంటి గొప్ప కావ్యాలు వచ్చాయి. అటువంటి సమయంలోనే  ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్న చాళుక్యులు భాషాభిమానంతో  వ్యవహారిక తెలుగు భాషలోనే శాసనాలు వేయించటానికి ప్రయత్నించారు. చాళుక్య ప్రభువైన రాజరాజనరేంద్రుడు వైదిక మతాభిమాని. అతని ఆస్థాన కవి నన్నయభట్టు. నారాయణభట్టు, భీమనభట్టు ఇతర ప్రముఖ కవులు. కన్నడ దేశంలో సాహితీ ప్రక్రియ ద్వారా విస్తరిస్తున్న జైనమతం రాజరాజనరేంద్రున్ని కలవరపెట్టింది. వైదిక మతోద్ధరణ తన గురుతర బాధ్యతగా భావించాడు. కన్నడ, తమిళ బాషలలో అప్పటికే భారతం రచింపబడి ఉండగా తెలుగులో అప్పటివరకూ లిఖిత కావ్యరచన జరుగలేదన్న వాస్తవాన్ని గ్రహించి విచారించి, ఆ లోపాన్ని సరిదిద్దే బాధ్యతను నన్నయ భుజస్కందాల పై మోపాడు.

రాజరాజ నరేంద్రుని ప్రోత్సాహంతో వ్యాస భారతాన్ని ఆంధ్రీకరించే ప్రయత్నానికి నాంది స్థాపన చేశాడు నన్నయ.
సంస్కృతాన్ని ప్రధానంగా తీసుకొని సంస్కృత శబ్దాలతో సమ్మిళితమైన భాషను ఆంధ్రభాషగా స్వీకరించాడు . కొన్ని వేల సంవత్సరాల క్రితం సంస్కృత ప్రాకృత పదాల కలయికతో ఏర్పడ్డ పదాలకు వ్యుత్పత్తి అర్థాలు సృష్టించాడు. వివిధ రూపాలతో వ్యావహారికంలో నలుగుతున్న అనేక పదాలను సంస్కరించి, ప్రామాణికతను నిర్థారించి గ్రాంథికత కల్పించాడు. తెలుగు భాష ప్రత్యేకతైన అక్షరసామ్య యతిని, కన్నడ ప్రాసను మేళవించి సంస్కృత వృత్తాల యతినియమాలు మార్చి కొత్త చోట్ల యతిని ప్రవేశపెట్టాడు. ద్రవరూపంలో ఉన్న భాషకు స్థిరరూపాన్నిచ్చి సుసంపన్నం చేశాడు. ఋష్యత్వం సిద్ధించిన కవులకే తప్ప ఇతర కవులకు ఇది సాధ్యం కాదు

నన్నయ వ్యాస భారతాన్ని ఉన్నది ఉన్నట్లు తెనుగించలేదు. కొన్ని విడిచిపెట్టాడు. కొన్ని సృజించాడు. మరికొన్ని ఇతర పురాణాల్లోంచి స్వీకరించాడు. ఇది స్వేచ్ఛానువాదం. సంస్కృత భాషాభిమానులు తెలుగు భాషను నిరసిస్తున్న రోజుల్లోనే పంచమవేదమైన మహభారతాన్ని తెనుగించే సాహసాన్ని చెయ్యడం నన్నయ సామర్థాన్ని చాటిచెబుతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి సాయపడినట్లు నారయణభట్టు తనకు పరిపూర్ణ సాయమందించాడని అవతారికలో వ్రాసుకొన్నాడు నన్నయ.

పాలకురికి సోమనాథుడు



పాలకురికి సోమనాథుడు 13వ శతాబ్దానికి చెందిన కవి. ఇతని తల్లిదండ్రులు విష్ణూరమిదేవుడు, శ్రియాదేవి. బ్రాహ్మణుడిగా జన్మించి వేదవేదాంగాలు నేర్చుకొని బసవేశ్వరుని బోధనలతో ప్రభావితుడై జంగముడిగా మారాడని కొందరు, పుట్టుకతోనే జంగముడని మరికొందరు వాదిస్తారు. ఇతని జన్మస్థలం మీద కూడా వివాదం ఉంది. అధిక సంఖ్యాకులు ఇతనిది వరంగల్లు దగ్గర్లోని పాలకురికి అని భావిస్తే ఇంకొంతమంది కర్నాటకలోని పాలకురికి అని విబేధిస్తారు.

సోమనాథుడు సంస్కృత, తెలుగు, కన్నడ భాషలలో కావ్యాలు వ్రాశాడు. తమిళ, మరాఠి ఇతర భాషలు కూడా వచ్చు.సంగీతంలో ప్రవేశం ఉంది. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, మల్లమ్మదేవి పురాణం, సోమనాథ స్తవం మొదలైన కావ్యాలు వ్రాశాడు. నన్నయ్య నడచిన బాటను విడిచిపెట్టి తనదైన ప్రత్యేక మార్గాన్ని తొలుచుకుంటూ వెళ్ళి విజయం సాధించాడు. నన్నయ్య సంస్కృత శబ్ద సమ్మిళతమైన తెలుగును స్వీకరిస్తే, సోమనాథుడు జానుతెలుగును అక్కునజేర్చుకున్నాడు. అచ్చ తెలుగు చంధస్సు ద్విపదలోనే అధికశాతం కృతులు వ్రాశాడు. సాధ్యమైనన్ని తెలుగు పదాలను రచనల్లో ప్రయోగించి తెలుగు పదాలకు పల్లకీ మ్రోశాడు. వాడుకలో ఉన్న శివ భక్తుల కథలన్నిటినీ కలిపి బసవని కథకు అన్వయించి కావ్యరచన చేశాడు. ఇతను వ్రాసిన వృషాదిప శతకం తెలుగులో తొలి శతకం. అలాగే చెన్నమల్లుసీసము మొదటి సీసపద్య శతకం.పశ్చిమ చాళుక్యుల వద్ద సేనానిగా పనిచేసిన సోమనాథుడు అంత్యకాలంలో శ్రీశైలం చేరి అక్కడ బసవేశ్వరుని మేనల్లుడైన చెన్నమల్లుని పై సీస పద్యాలు వ్రాశాడు.

సోమనాథుడి సమాధి వరంగల్లు దగ్గర్లోని పాలకురికిలో ఉందని కొందరంటే కాదు మైసూరు జిల్లాలో ఉందని ఇంకొందరంటారు.

సోమనాథుడు వ్రాసిన బసవపురాణం, పండితారాధ్య చరిత్ర స్వతంత్ర్య రచనలైనప్పటికీ, సాహిత్యపరంగా నిర్జీవమైన భాషను బ్రతికించి పరిపుష్టం చేసింది నన్నయభట్టే. పైగా సోమనాథుని కంటే ముందు నన్నెచోడుడు కుమారసంభవ మనే కావ్యాన్ని ఇంచుమించు స్వతంత్ర్యంగానే వ్రాశాడు. అయితే కథా వస్తువు ప్రాచీనమైనది. జానుతెలుగు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇతనే. సోమనాథుని ఆదికవిగా భావించాల్సి వస్తే, అతనికి ముందు కాలం వాడైన నన్నెచోడున్ని ఆదికవిగా ఎందుకు భావించకూడదు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే  ఎటువంటి పదకోశం లేని కాలంలోనే పంచమ వేదమైన మహాభారతాన్ని తెనుగించే ప్రయత్నం చేసి, దాని కోసం భాషను సంస్కరించిన నన్నయ్యభట్టునే ఆదికవిగా పరిగణించాలి. సోమనాథుడు, నన్నెచోడుడు లాంటి కవులు తప్పిస్తే అధిక శాతం కవులందరూ నన్నయ్య పరచిన బాటలోనే సాగిపోయి జైత్రయాత్రలు చేశారు. పెద్దానాదులు సైతం ఆదికవిగా నన్నయ్యను కీర్తించారు.

కాబట్టి తెలుగులో ఆదికవి నన్నయే.

(మూలం: సినారే  "ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు:ప్రయోగములు " )


సమాజ జీవచ్ఛవం

 ప ఎన్నికల ఫలితాలు చుశాక నాకు గాయం  సినిమాలోంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వ్రాసిన ఈ క్రింది పాట గుర్తొచ్చింది .



ఈ క్రింది వార్తలు చూశారా? నాకైతే మూడింటికీ పెద్ద తేడా కనబడలేదు.





















ఒకరు దేశాన్ని కుదిపేసిన 2జి కుంభకోణానికి ప్రధానసూత్రధారి.  ఇంకొకరు మతం ముసుగులో ఆశ్లీల కార్యకలాపాలకు అవకతవకలు పాల్పడ్డ స్వామీజీ.  మరొకరు తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని నిలువునా దోచేసి అనతి కాలంలోనే వేలకోట్లకు పడగలెత్తి, మృతదేహం రాకముందే ముఖ్యమంత్రై పోదామని కలలు గని ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్న జగన్. ముగ్గురూ మేము నిర్దోషులమని బుకాయిస్తున్నవాళ్ళే. రాజా దళిత కార్డు ఉపయోగిస్తూంటే, నిత్యానంద మతం కార్డు ప్రయోగిస్తున్నాడు. జగన్ తండ్రి, తల్లి, చెల్లి ద్వారా సెంటిమెంటు పండించటానికి కృషి చేస్తున్నాడు.

ఒకప్పుడు నేరం చేసినవాళ్ళు పట్టుబడినప్పుడు అవమానభారంతో తలదించుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కాలం మారిపోయింది. కోట్లాది రూపాయిలు మింగేసిన వాళ్ళు, రేపులు హత్యలు చేసిన వాళ్ళు దేశోద్ధారకులుగా చలామణీ అయిపోతున్నారు. ఎన్ని అవలక్షణాలుంటే వాడే హీరో.   తమ కోసం ధర్నాలు, రాస్తారోకోలు, ఆత్మార్పణలు   చేసుకునే వెఱ్ఱి జనాన్ని చూసి వీళ్ళంతా వెకిలి నవ్వులు నవ్వుకుంటూ జైళ్ళలో ఉన్నా రాజభోగాలు అనుభవిస్తూ  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.  రోజుకొకటి చొప్పున తామర తంపరగా పుట్టుకొస్తున్న టి.వీ.ఛానళ్ళు  రేటింగులకోసం వీళ్ళను కవర్‌చేసి యథాశక్తి హైప్‌ని క్రియేట్ చేస్తున్నాయి.

 అఫ్‌కోర్స్. మనదేశంలో ఇంతకంటే అద్భుతాలు  జరుగుతాయని ఊహించలేం. గొఱ్ఱె కసాయి వాడినే నమ్ముతుంది. జనాన్ని మోసం చెయ్యటం చాలా తేలిక.  నిరక్షరాస్యులనైతే చెప్పక్కర్లేదు. చదువుకున్న వాళ్ళనైతే మరీ సులభం. చదవేస్తే ఉన్నమతి పోయినట్లు వీళ్ళ సంఖ్య ఈ మధ్య ఎక్కువైపోయింది. చేతిలో ఒక పేపరు, చూడ్డానికో ఛానలు, చెప్పడానికి కొన్ని అబద్ధాలు ఉంటే ఇక తిరుగులేదు. ఒక్కసారి వీళ్ళకు బ్రెయిన్‌వాష్ చెయ్యగలిగితే ఆ తర్వాత వీళ్ళను మించిన వీరాభిమానులు మరొకరుండరు. రకరకాల వాదనలు లేవనెత్తి తమ నేతను మించిన నేత మరొకడు లేడని ఢంకా భజాయించి ప్రచారం చేస్తారు. ఒక నాయకుడు చనిపోతే ఆరొందల మంది ఆత్మహత్యలు చేసుకోవటం, హఠాన్మరణం చెందటం ఏమిటన్న కనీస అనుమానం వీళ్ళకు రాదు. ఈ జాబితా మొత్తం ఫేక్ అయినా వీళ్ళకు పట్టింపు లేదు. అలా మరణించిన వాళ్ళను రెండున్నరేళ్ళు ఓదార్చమేమిటన్న తలంపూ రాదు. 2004లో 9.18 లక్షలున్న ఆస్తి 2011 నాటికి 365 కోట్లెలా అయ్యిందంటే అదంతా తమ నేత అసమాన వ్యాపార దక్షత అని గుడ్డిగా వాదిస్తారు తప్ప అందులో వాస్తవాలు తెలుసుకొనే ప్రయత్నం చెయ్యరు. ఒకవైపు వేల కోట్ల రూపాయిల కుంభకోణాలు కళ్ళకు కనపడుతున్నా, భూములు కోల్పోయి  ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి లబోదిబోమంటున్నా, అవినీతికి ఆధారాలున్నాయని కోర్టులు నొక్కివక్కాణిస్తున్నా, కరుడుగట్టిన నేరస్తులతో సంబంధ బాంధవ్యాలు బయటపడుతున్నా, అవన్నీ వొట్టి ఆరోపణలేనని రాజకీయ కుట్రలని బుకాయిస్తారు. ఇంకొంతమంది 'ఎవడు చెయ్యటం లేదు. అందరూ అదేగా చేస్తున్నది ' అని వేదాంతలు చెబుతారు. ఇంకొంతమంది ' ఎప్పుడూ అవినీతికి పాల్పడని వాళ్ళే జగన్‌ని విమర్శించాల ' ని సూత్రీకరిస్తారు. వీళ్ళ ప్రకారం సిగ్నల్‌జంప్ చేసి వందరూపాయిలు లంచమిచ్చిన వాడూ, వేలకోట్ల రూపాయిలు హవాలా మార్గంలో వెనకేసుకొని దేశద్రోహానికి పాల్పడ్డ వాడూ ఒకడే. ఈ గీతా సూత్రం తెలియక భారతీయ శిక్షా స్మృతి ఎన్నో సెక్షన్లు ఏర్పరచుకొంది పాపం.

ఈ దుస్థితి ప్రధాన కారణం పిరికి ప్రభుత్వం, అసమర్థ ప్రతిపక్షం, చవకబారు రాజకీయాలు, మీడియా, మేధావులు. మీడియా గురుంచి ఇదివరకే మాట్లాడుకున్నాం. ప్రభుత్వం గురుంచి, ప్రతిపక్షం గురుంచి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మేధావుల మౌనం దేశానికి శాపం అని ఊరికే అనలేదు.  దురదృష్టవశాత్తూ జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కూడా జగన్ అరెస్టయ్యేంతవరకూ పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. రాష్ట్ర ఖజానాని లూటీ చేసిన వ్యక్తి అభిమానులు కూడా ఏ మాత్రం మొహమాటం, సిగ్గూ లేకుండా పబ్లిక్‌గ్గా తమ నేతను వెనకేసుకొస్తున్నప్పుడు ఒక నేరస్తుడిని నేరస్తుడు అని చెప్పడానికి మేధావులు, విలువలున్న నేతలు ఎందుకు అధైర్యపడుతున్నారో ఆలోచించుకోవాలి. వీళ్ళ నోళ్ళు పెగలనంతకాలం సాక్షి చెప్పిందే వేదం, చూపించిందే భాగవతం.


 మూడేళ్ళ క్రితం ప్రమాదవశాత్తూ చనిపోయిన ఒక వ్యక్తిని సానుభూతి వోట్ల కోసం హత్య చేశారంటూ ప్రచారం చేసి, కనీళ్ళు పెట్టుకోవడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ఆ ఉదంతం మీద ఇప్పటికే కొన్ని కమిటీలు విచారణ చేసి ఇది ప్రమాదవశాత్తూ జరిగిందేనని, ఇందులో ఏ కుట్రకోణమూ లేదని తేల్చేశాయి. అయినా సరే ఎవో కుంటిసాకులు వెతికి జనాన్ని మభ్య పెట్టటం వీళ్ళకు అలవాటైపోయింది. పోనీ, నిజంగానే ఒక స్పష్టమైన నివేదిక కోసం ఎదురుచూస్తున్నారా అంటే అదీ లేదు. ప్రతిపక్షనాయకుడి ఆస్తుల విచారణ కోసం సుప్రీం కోర్టుకు వెళ్ళడంలో ఉన్న శ్రద్ధ, స్వంత మనిషి మృతి విచారణపై పోరాడటంలో లేదు. ఎక్కడో రైల్వే అకౌంట్స్‌లో పనిచేస్తున్న బ్రహ్మానందరెడ్డిని తీసుకొచ్చి ఏవియేషన్ కార్పొరేషన్‌కి ఎం.డి. ని చేసిన ఘనత వైయెస్సార్‌ది  . అకౌంట్స్ కి  ఏవియేషన్ కి ఏమైనా సంబంధముందా?  వ్యవస్థను అపహాస్యం చేసిన నియామకాల్లో ఇదొకటి. అర్హత లేని వ్యక్తుల్ని కీలకపదవుల్లో నియమించి ఆ తర్వాతి పరిణామాలకు అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం నిజంగా హాస్యాస్పదం. కిరణ్ ఎందుకు వైయస్‌తో పాటూ హెలికాప్టర్‌లో వెళ్ళలేదు అని వాదిస్తున్న జగన్ వర్గానికి దీని దగ్గర సమాధానముందా ? అసలు జగన్ ముఖ్యమంత్రి అయ్యుంటే ఈ ఆరోపణలుండేవా? ఏడుపులూ పెడబొబ్బలు ఉండేవా? కొన్ని వేలకోట్ల రూపాయిల హవాలా కుంభకోణానికి పాల్పడి, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాక కర్నాటక , సిక్కిం తదితర రాష్ట్రాలకు సైతం తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన తన కొడుకుని అరెస్టు చేసినందుకు 'నా కొడుకు ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారు ? నా కుటుంబానికి అన్యాయం చేశారు. పద్దెనిమిది నియోజక వర్గాల్లో మమ్మల్నే గెలిపించండి' అని కన్నీళ్ళు పెట్టుకోవటం విజయమ్మకే చెల్లింది.  జగన్‌ని ముఖ్యమంత్రి చెయ్యకపోవటం తప్ప వైయెస్సార్ కుటుంబానికి కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏమీ లేదు. A1 నిందితున్ని ఎప్పుడో అరెస్టు చెయ్యకుండా ఎలెక్షన్ల ముందు అరెస్టు చేసి నిజానికి భారీ సాయమే చేసింది.


అబద్ధాలనే అక్షర సత్యాలుగా ప్రచారం చేసి జనం ఆలోచనా విధానంలో చాలా మార్పులే తీసుకొచ్చింది సాక్షి.  విపక్ష నాయకుల మీటింగులకు వెనుక నుంచి ఫోటోలు తీసి జనం రాలేదని ప్రచారం చెయ్యటం దగ్గర్నుంచి, జగన్ అరెస్ట్ అయ్యాడని తెలిసి తిండి మానేసిన చిన్నారి ఫోటోల వరకు ప్రతి వార్తా విలక్షమైనదే.  ఏళ్ళ తరబడి ప్రభుత్వ ప్రకటనలను ఏకపక్షంగా పొంది, తీరా ప్రభుత్వ నియంత్రణ విధించాక అది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని, జర్నలిజంపై దాడని నెత్తీ నోరుబాదుకోవటం, దానికి కొంత మంది మేధావులు వంతపాడటం పెద్ద వింత. అసలు జర్నలిజం విలువలంటూ సాక్షిలో ఉన్నదెప్పుడని ? F.I.R లో రాజశేఖర్‌రెడ్డి పేరు చేర్చటం మహానేరంగా, జగన్‌ని అరెస్టు చెయ్యడం మహాపాపంగా, కోట్లు మింగేసిన వ్యక్తిని సాధారణ డొక్కు వ్యానులో కోర్టుకి తరలిస్తే ఉపద్రవం జరిగిపోయినట్లు  సాక్షి ప్రచారం చేసింది. అసలు వైయ్యెసార్ కుటుంబ చరిత్ర  ఎంతమందికి తెలుసు. (వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. పేజీ 64 నుంచి పేజి 78 వరకు, జగన్ గురించి పేజి 92 )  నెలకు రెండొందలు పింఛను ఇచ్చారనో, కాలేజీ ఫీజులు కట్టారనో, ఆరోగ్యశ్రీ అనో వైకాపాకి ఓట్లేసిన ప్రజలు దోపిడీకి గురైన వేల కోట్ల రూపాయిలు కూడా తమదేనని ఎంత త్వరగా తెలుసుకుంటే అంతమంచిది. నిరక్షరాస్యులైన ఎర్రచీరల అవ్వలకు, పచ్చచీరల అక్కలకు ఇప్పుడవి తెలియకపోవచ్చు . రోజుకి వందరూపాయిలు చూడ్డమే గగనమైపోయిన అమాయకులకు వేలకోట్లు ఎంతో బోధపడక పోవచ్చు. ఎలాగోలా వార్తల్లో కనబడాలనే జగన్ తాపత్రయం అర్థం కాకపోవచ్చు. ఏదో అన్యాయం జరిగిందన్న అపోహపడి వాళ్ళంతా గంపగుత్తగా ఫ్యాను గుర్తుకు వోటేసి ఉండవచ్చు. అంత మాత్రాన జగన్ నిర్దోషి అయిపోడు. ఒక రాజకీయ విశ్లేషకుడు విశ్లేషించినట్టు గాలి జనార్ధనరెడ్డిని జైల్లో పెట్టాక శ్రీరాములు యాభైవేల మెజారిటితో గెలిచాడు. బీహార్లో పప్పూయాదవ్ గెలిచాడు. శ్రీరాములు గెలిచినంత మాత్రాన  చేసిన అవినీతి మాయమైపోదు. గాలి నిజాయితీపరుడూ అయిపోడు.  పప్పూయాదవ్ ఉత్తముడూ అవడు. అలానే ఇదీ. సత్యమేవ జయతే.


శ్రీవాణీ వీణాజనితం

నాకు బాగా నచ్చిన సంగీత దర్శకులలో ఎం.ఎస్.విశ్వనాథన్ ఒకరు. కే.బాలచందర్ ఎం.ఎస్.విశ్వనాథన్ కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. అంతులేని కథ ,ఇది కథ కాదు ,గుప్పెడు మనసు, మరోచరిత్ర, ఆకలిరాజ్యం, కోకిలమ్మ మచ్చుకు కొన్ని. వీటిలో కోకిలమ్మ సినిమాలోని ఒక మంచి పాట గురుంచే ఈ టపా (మొదట పాట వినాలనుకున్న వాళ్ళు చివరి వాక్యానికి వెళ్తే లింకు దొరుకుతుంది).



1983లో విడుదలైన కోకిలమ్మ లో సరిత ప్రధాన పాత్ర పోషించారు.  ఈ సినిమా సమాచారం కోసం, వీడియో కోసం చాలా వెదికాను కానీ ఎక్కడా దొరకలేదు. చూడాలనుకున్నా అవకాశం రాక చూడలేకపోయిన సినిమాల్లో ఇదొకటి.  అంతర్జాలంలో యూట్యూబ్ లింకులు కొన్ని దొరికాయి కానీ ఆవీ పాటలకు సంబంధించినవే.  టైటిల్‌ని బట్టి కథానాయిక ప్రఖ్యాత గాయకురాలై ఉంటుందని ఊహించాను. యూట్యూబ్‌లో నాలుగు పాటలు  చూశాక నా అంచనాలు తప్పని అర్థమయ్యింది. బాలచందర్ సినిమాల్లో పాటలు  కథతో పెనవేసుకొని అర్థవంతంగా ఉంటాయి కాబట్టి స్టోరీలైన్ సులభంగానే బోధపడింది. అలాగే బాలచందర్ అంటేనే సీరియస్ సినిమాలు కాబట్టి, వాటిలో సుఖాంతాలు తక్కువే కాబట్టి నేనూహించుకున్న స్టోరీలైన్‌కి ఒక ట్రాజెడీ ముగింపుని జోడిస్తే కథ చిక్కుముడి తేలిగ్గా విడిపోయింది. 


కోకిలమ్మ (సరిత) ఒక పనిపిల్ల. తనలాగే నిరుపేదైన కథానాయకుడికి (రాజీవ్) ఆసరాగా నిలబడి అతని అభ్యున్నతికి ఎంతో సహాయం చేస్తుంది. అతను పెద్ద గాయకుడై ఎదిగి తన మూలాలు మరచిపోతాడు. ఒక గొప్పింటి అందమైన అమ్మాయి (స్వప్న) ప్రేమలో పడి కోకిలమ్మకు దూరంగా మెలగుతాడు. విషయం తెలుసుకున్న  కోకిలమ్మ నిస్వార్థంగా తప్పుకొని త్యాగం చెయ్యటంతో కథ  సమాప్తమవుతుంది.




ఈ చిత్రానికి కోకిలమ్మ అని పేరు పెట్టటంలో దర్శకుడి నేర్పు కనిపిస్తుంది. కోకిల నల్లగా అందవిహీనంగా ఉంటుంది. పుట్టక ముందే తల్లి తెచ్చి తనను కాకుల గూడులో విడిచిపెడుతుంది. కాకుల మధ్య కాకిలా పొదగబడ్డ కోయిల, కాకిపిల్లలతో కలిసి  తొలుత కాకిలానే ప్రవర్తిస్తుంది, అరుస్తుంది. క్రమంగా కూయటం అనే తన ప్రత్యేకత అవగతమయ్యాక, తన స్వరూపాన్ని గ్రహించి వేరుపడి వెళ్ళిపోతుంది. కథానాయిక కోకిలమ్మ కూడా అంతే. తనకంటూ ప్రత్యేకమైన స్వచ్ఛమైన మనసున్నా,కమ్మని పాటలు పాడగల నేర్పున్నా, కాకుల్లాంటి లోకులకు పరిచర్యలు చేస్తూ అవకాశవాదైన మరో కాకి లాంటి వ్యక్తిని ప్రేమిస్తుంది. చివరికి అతని నిజస్వరూపం గ్రహించి తనే తప్పుకొని వెళ్ళిపోతుంది.

కోకిలమ్మ అనగానే చాలా మందికి 'పల్లవించవా నా గొంతులో' అనే ఫాట గుర్తొచ్చినా, మిగతా పాటలూ చాలా బావుంటాయి. శ్రీవాణీ వీణాజనితం అలాంటి ఒక ఆణిముత్యం. మనసుకవిగా చిరపరిచితులైన ఆచార్య ఆత్రేయ ఈ పాటకు గేయరచన చేశారు . పాడినవారు పి.బి.శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈ పాట సందర్భం తెలియదు కానీ వింటూంటే, సంగీతం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ సభలో కథానాయకుడు పాడిన పాటలా అనిపిస్తుంది.


పి.బి.శ్రీనివాస్ గాత్రంతో పాట మొదలవుతుంది.

మధురం మధురం నాదం
అది అమరం అమరం వేదం
నాదం గానం సామం
స్వరకలితం లలితం రమ్యం

నాదం అంటే సంస్కృతంలో శబ్దతరంగం, జగత్సంబంధమైన స్పందనం అనే అర్థాలున్నాయి. అలాగే క్రమబద్ధమైన మధురమైన శబ్దం అని కూడా అర్థముంది . అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లుతో, అపసవ్యమైన జీవన విధానాలతో , విపరీతమైన మానసిక  శారీరక ఒత్తిళ్ళతో అతలాకుతలమయ్యే హృదయాలను, సేదతీర్చి, సత్తువనిచ్చే శక్తి నాదానికి ఉంది. వేదానికి మరో పేరు శృతి. నేరుగా వినడం ద్వారా బహిర్గతమైనవి కనుక శృతులంటారు. ఆ వేదాలలో ఉన్నవి మంత్రోచ్ఛాటనలు, శ్లోకాలు, స్తోత్రాలు .జీవాత్మలో పరమాత్మలా ఆ మంత్రోచ్ఛటనలు, శ్లోకాలు, స్తోత్రాలలో దాగున్నది స్వరాలతో సమ్మిళితమైన లలితమైన రమ్యమైన నాదమే.  క్రమపద్ధతిలో వినిపించే నాదం మనస్సుని పట్టి ఉంచి, ఏకాగ్రతని పెంచి, బుద్ధిని వికసింపజేసి శరీరాన్ని అమరం చేస్తుంది. అందుకే నాదం అమరం. నాదాలతో నిండిన వేదం అమరం. 

 శ్రీవాణీ వీణాజనితం సురలోక మౌని సరితం
అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం
అమితం అమృతం నిరతం
శిశు పశు ఫణి సహితం విదితం
శౌకం  మధ్యమదూతం
త్రైకాల సంచారం

ఓంకార నాదం వైశిష్ట్యాన్ని తెలిపే పల్లవి ఇది. ఇందులో నాకు అర్థం కాని కొన్ని వాక్యాలున్నాయి. నాకు తెలిసినంతలో విశ్లేషించటానికి ప్రయత్నిస్తాను. అకార (సృష్టి- బ్రహ్మ) ఉకార (స్థితి- విష్ణు) మకారాల (లయ-మహేశ్వరుడు) కలయికే ఓంకారం. అది ఆద్యంతాలు లేని ప్రణవ నాదం. అంటే అంతమూ, ఆరంభమూ రెండూ లేవన్నమాట. అన్ని శబ్దాలకి మూలమిదే. అటువంటి ఈ నాదాన్నే స్వర్గలోకంలో ఉన్న మహర్షులు, బ్రహ్మర్షులు నిత్యం స్మరిస్తూ బ్రహ్మానందం అనుభవిస్తూంటారు. (నా దగ్గరున్న శబ్దరత్నాకరంలో ' సరితం' అనే పదం లేదు. ఆంధ్రభారతి పదకోశంలో సరితం అంటే చరితం అని ఉంది. అలాగే ' సరిత్ ' అంటే నది అనే అర్థముంది. ఈ అర్థాన్ని స్వీకరిస్తే సురలోక మహర్షులు స్నానమాడి పునీతమయ్యే నది లాంటి ప్రణవనాదం అనుకోవాల్సి వస్తుంది )

ఓంకారానికి ఆద్యంతాలు లేవనుకున్నప్పుడు శ్రీవాణీ వీణాజనితం (సరస్వతీదేవి వీణలోంచి జన్మించినది) అనడం తప్పేమో అనిపించింది. అంతర్జాలాన్ని శోధిస్తే సంగీత రత్నాకరం ప్రకారం వీణ(సంగీత వాయిద్యం) దేవతలకు ఆవాసమని, మెడలో మహేశ్వరుడు, తీగలలో పార్వతీ దేవి, వాటిని పట్టి ఉంచుతూ లక్ష్మీదేవి, యాళిలో (పౌరాణిక జంతువు మెడ ఆకారం) విష్ణువు, రెండవ సొరకాయబుర్రలో బ్రహ్మ, ప్రతిధ్వనించే నాదంలో సరస్వతీదేవి కొలువై ఉంటారని  తెలిసింది. సరస్వతీదేవి చేతిలో ఉంటుంది కాబట్టి సరస్వతివీణ అని కూడా అంటారు. సరస్వతికి మరోపేరు శ్రీవాణి. ముగ్గురమ్మలు, త్రిమూర్తులు కలిసి కొలువై ఉన్న చోట ప్రణవనాదమైన ఓంకారమేగా వినిపిస్తుంది. కాబట్టి శ్రీవాణీ వీణాజనితం అన్నమాటకు లెక్కసరిపోయింది. పశువులకు,శిశువులకు, పాములకు సైతం తెలిసిన సంగీతం, పక్షుల కూతల్లో   మధ్యమస్వరంలో రాయాబారాలు నడుపుతూ(శౌకం అంటే శుక సమూహం,శుకం అంటే చిలుక, మధ్యమం సరిగమపదనిలో ఒక స్వరం, దూతం అంటే  రాయబారి)   అమితమైన అమృతంలా త్రికాలాల్లో(భూత,భవిష్యత్,వర్తమాన)   నిరంతరం ఉంటుందని ఆత్రేయ గారి భావమనుకుంటాను.

మామూలు వెదురే మాధవ మురళియై రాగాల సుధలే చిలికినది
త్యాగయ్య గళమై అన్నయ్య పదమై వాగ్గేయ సిరులే కురిసినవి
గీతం కవితా హృదయం
సంగీతం జనతా హృదయం
రాగం తానం మకుటం
త్రైమూర్తి రూపం

మొదటి చరణంలోని పై వాక్యాలకు పెద్దగా వివరణ అక్కర్లేదనుకుంటాను. మొదటి వాక్యం నాకు బాగా నచ్చింది. సాధారణమైన వెదురుబొంగు శ్రీకృష్ణుని చేతిలో పడి సుమధురగీతాల సుధల్ని కురిపించిందంటే అది భగవంతుని అనుగ్రహ విశేషమే కదా. ఇదే అర్థమిచ్చేలా  వేటురి గారు ఏదో ఒక పాటలో చిన్న వాక్యం వ్రాసినట్లు గుర్తు. సమయానికి గుర్తురావటం లేదు. అన్నయ్య అంటే అన్నమయ్య . మాములుగా రాగం, తానం, పల్లవి అంటూంటాం. ఇక్కడ పల్లవి బదులు మకుటం అనే పదం వాడారు . మకుటం అంటే కిరీటం. పాటకు మకుటం పల్లవే కదా. ఈ మూడింటినీ త్రిమూర్తులతో పోల్చారు ఆత్రేయ.

జయదేవ కవితై, గోవింద గీతై పద్మావతేగా పలికినది
ప్రియురాలి శోకమే తొలికావ్య శ్లోకమై శ్రీరామ చరితై నిలచినది
తీరని దాహం గానం
కడతేర్చే జ్ఞానం గానం
రాగం మోదం మోక్షం సంగీత యోగం

జయదేవుడు 12వ శతాబ్దానికి చెందికి ఒక ప్రముఖ కవి. ఆయన భార్య పద్మావతి. ఇద్దరూ అన్యోన్య దంపతులు, పూరీ జగన్నాథస్వామి సేవకులు. జయదేవ కృతులలో గీతాగోవిందం అనే కావ్యం చాలా ప్రసిద్ది కెక్కింది. రాధాకృష్ణుల శృంగారాన్ని వర్ణిస్తూ వ్రాసిన వాటిని అష్టపదులంటారు. ఈ అష్టపదులలో పద్మావతి పేరు అనేక మార్లు దొర్లుతుంది. పద్మావతీ చరణ చారణ చక్రవర్తీ, పద్మావతీ రమణ..ఇలా. అది తన భార్యపై జయదేవునికున్న మమకారానికి గుర్తు. జయదేవుడు వ్రాసి స్వరపరిచిన ప్రతి అష్టపదిని పద్మావతి తన అపూర్వమైన నృత్య ప్రతిభతో స్వామి సన్నిధిలో అభినయించి చూపేది.

క్రౌంచ పక్షుల జంటను వేటాడి, వాల్మీకి కోపానికి గురై తద్వారా తొలిశ్లోక రచనకు కారణభూతుడౌతాడు ఒక బోయవాడు. ఆ శ్లోకమే శ్రీమద్రామాయణ మహాకావ్య రచనకు శ్రీకారం చుడుతుంది.  గానం ఒక తీరని దాహమే కాదు, జ్ఞానం ప్రసాదించి సంతోషాన్ని,విముక్తిని కలిగించేది కూడా అంటూ ఈ చరణం ముగుస్తుంది. వాల్మీకి నుంచి జయదేవుని వరకు, త్యాగయ్య నుంచి అన్నమయ్య వరకూ నాదోపాసకులంతా అలా సంగీత సుధాంబుధిలో తేలియాడి స్వరపరమాత్మలో లీనమై శాశ్వతులైన వాళ్ళే .మనసుకవి ఆత్రేయలో మరో పార్శ్వాన్ని ఆవిష్కరించిన  ఈ పాటను ఇక్కడ వినండి.





పెట్రోలు రాజకీయాలు..కాదంటారా ?!



నం నెత్తిన మళ్ళీ పెట్రోబాంబు పడింది. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 7.50 రూపాయిలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నింగినంటిన నిత్యావసర వస్తువుల ధరలకు నిచ్చెన వెయ్యలేక కాళ్ళు విరగొట్టుకున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది పిడుగుపాటు. షరా మాములుగా సవరించిన ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా వినియోగదారులంతా పెట్రోల్ పంపుల ముందు బారులు తీరి బూతులు తిట్టుకుంటూ నానా అవస్థలు పడ్డారు.   రాజకీయాలను బాగా వంటబట్టించుకున్న చమురు కంపెనీలు ధరల పెంపుదల విషయాన్ని సాయంత్ర వేళ బహిర్గతపరచి ప్రతిపక్షానికి వెనువెంటనే ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు చేసుకునే అవకాశం లేకుండా చేసి కొంతవరకూ సఫలీకృతమైనా, పెంచిన ధరల విషయంలో అవి ఎంత వరకూ తమ మాట నిలబెట్టుకుంటాయో వేచి చూడాలి. డీజల్ ధరను 5 రూపాయల వరకు, గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయల వరకు పెంచే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. ఇంధన ఛార్జీలు పెంచితే రవాణా ఛార్జీలు తడిసి మోపెడై నిత్యావసర వస్తువుల ధరలు మరింత ప్రియమవుతాయి. పెనంలోంచి పొయ్యిలోకి పడినట్లవుతుంది అప్పుడు పరిస్థితి. ఏతావాతా సగటు మనిషి కష్టాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

 సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 73.14 రూపాయిలు. ఆ ధర నిర్ణయింపబడే క్రమం ఇంచుమించుగా ఇదీ .

అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక బ్యారెల్ ముడిచమురు ధర 106.02 డాలర్లు అనుకొందాం (ప్రస్తుత రేటు)


1 బ్యారెల్ = 106.02 డాలర్లు
1 డాలరు = 55.39 రూపాయిలు.


1 బ్యారెల్ = 106.02 * 55.39 = 5872.44 రూపాయిలు

1 బ్యారెల్ = 158.97 లీటర్లు

1 లీటరు = 36.94 రూపాయిలు (5872.44 / 158.97)
 
ఎక్సైజ్ డ్యూటీ      = 14.45 రూపాయిలు

ఎడ్యుకేషన్ టాక్స్ = 0.43 రూపాయిలు
డీలర్ కమీషన్     = 1.05 రూపాయిలు
రిఫైనింగ్               = 0.52 రూపాయిలు
క్యాపిటల్ కాస్ట్ }
ఆఫ్ రిఫైనరి          = 6.00 రూపాయిలు
వ్యాట్                   = 5.5 రూపాయిలు
క్రూడ్ ఆయిల్ }
కస్టం డ్యూటీ        = 1.1 రూపాయిలు
పెట్రోలు కస్టం      =  1.54 రూపాయిలు
రవాణా ఛార్జీలు   =  6.00 రూపాయిలు

మొత్తం 73.53 రూపాయిలు. పన్నులు లేని పక్షంలో లీటరు పెట్రోలు ధర 49.46 రూపాయిలు. గత కొద్ది నెలలుగా మార్కెట్లో బ్యారెల్ ధర తగ్గుతూనే వస్తోంది. మార్కెట్లో బ్యారెల్ ధర 140 డాలర్లు పలికినప్పుడు కూడా ఇప్పుడున్నంత ధరలు లేవు. పైగా ఇండియన్ ఆయిల్ కంపెనీలకు కొనుగోళ్ళలో డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి పెట్రో ధరలు ఇంకా తక్కువగా ఉండాలి.పాకిస్తాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లో కంటే మనదేశంలోనే పెట్రో ఛార్జీలు అధికంగా ఉండటం గమనార్హం. డాలర్ రేటు పెరగటం వలన తామెంతో నష్టపోతున్నామని ఆయిల్ కంపెనీలు నమ్మబలుకుతున్నా, ఏటేటా పెరుగుతున్న లాభాలు, ఇరవై శాతం పడిపోయిన బ్యారెల్ ధరలు అదంతా కట్టుకథేనని తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు 2009-10 సంవత్సరానికి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీ లాభాలు పన్నులు పోగా 1301.37 కోట్లు కాగా, 2010-11 సంవత్సరాంతానికి 1539.01 కోట్లు.  అలాగే సబ్సిడీ ఇస్తున్నామని ఉదరగొట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రభుత్వాలు ఎన్ని పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నాయో పై క్యాలిక్యులేషన్ ద్వారా అర్థమవుతుంది.


ఇంధన వనరుల పై ప్రభుత్వాలకు మొదటి నుంచి సరైన అవగాహన, శ్రద్ధ లేదు. ఎన్ని నిక్షేపాలు కనుగొని, బేసిన్ల కొద్దీ బావులు తవ్వుకున్నా శాశ్వతమైన, సూర్య శక్తికి అవి ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాలేవు. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించి, పరిశోధనలు జరిపించి , ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడం విడ్డూరం. ఆకు పసరులతోను, నీళ్ళతోనూ, గాలితోను, సౌర శక్తితోను వాహనాలు నడిపి చూపించిన యువ శాస్త్రజ్ఞులకు దక్కిన గుర్తింపేది? భారత ఆర్థిక ములాలను శాసిస్తున్న కంపెనీలపై చూపించే అవ్యాజమైన ప్రేమాభిమానాల్లో ఆవగింజంతైన వారిపై చూపించారా?


  పెరుగుతున్న జనాభాకు భవిష్యత్ తరాలకు సరిపడే ఇంధన నిల్వల గురుంచి ఆలోచించరు. సరైన రోడ్లుండవు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సవ్యంగా ఉండదు. ఉన్నా అన్ని రూట్లలో తిరగదు. ఇవేమీ లేకున్నా ఇబ్బడి ముబ్బడిగా కార్ల కంపెనీలకు, మోటారు వాహనాల పరిశ్రమలకు పర్మిట్లు మాత్రం ఇచ్చేస్తారు. అవన్నీ రోడ్ల పైకొచ్చి ఉన్న చమురంతా అరాయించుకొని, కాలుష్యాన్ని వెదజల్లుతూంటే, ఆ తర్వాత సబ్సిడీలని నష్టాలని ధరలు పెంచి, రెట్టింపు ధరలు చెల్లించి దిగుమతులు చేసుకుని, పైపులు తవ్వుకొని పక్క దేశాల దయా దాక్షణ్యాలపై అధారపడతారు. అమెరికా తుమ్మినా అదిరిపడటం నేర్చుకున్నారు కాబట్టి ఇతర దేశాలతో ఏవైనా చమురు ఒప్పందాలవీ చేసుకున్నా అవి సఫలమయ్యే ఛాన్సులు లేవు. అమెరికా వద్దంటే కిక్కురుమనకుండా ఒప్పుకోవాల్సిందే.( ఈ మధ్యే ఇరాన్ విషయంలో జరిగిన సంఘటనే దానికి ఉదాహరణ. అమెరికా ఒత్తిళ్ళకు తలొగ్గి మనదేశం 11% శాతం దిగుమతులు తగ్గించుకోవడానికి ఒప్పుకొంది). ప్రపంచ చమురు సంక్షోభానికి భారత్ కారణం అని అమెరికా అంటే నంగి నంగిగా నీళ్ళు నమలటం తప్ప నోరు పెగల్చే సాహసం కూడా చెయ్యరు. కులం పేరుతో, మతం పేరుతో, కుటుంబం పేరుతో, సినీ అభిమానం పేరుతో వేలం వెర్రిగా రాజకీయ నాయకులని ఎన్నుకొనే ప్రజలకు అంతకంటే గొప్ప పాలకులని ఆశించటం తప్పేమో? అయినా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు ఈ తంతుని నిర్లిప్తంగా మనకేమి పట్టనట్లు గమనించలేదు. మహా అయితే వారం పది రోజులు గుండెలు బాదుకుంటాం. తర్వాత మళ్ళీ మాములే. ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర ఇంజను స్విచాఫ్ కూడా చెయ్యం.  కాదంటారా?



అంటరాని వసంతం


సంతం అంటేనే కొత్త శోభ, కొత్త ఉత్సాహం. అది అందరిదీ. చిగురించే మొక్కలోని కోమలత్వాన్ని , విరబూసిన  పువ్వులలోని స్వచ్ఛతని,  మత్తెక్కిన కోయిల సుస్వరాలని  ఎవరు మాత్రం ఆస్వాదించాలనుకోరు ? వసంతం, విషాదం ప్రతి మనిషి జీవితంలో ఉన్నాయి. అయితే అందరి అనుభూతులు మాత్రం ఒకేలా  పరిగణింపబడటం లేదు. కులం పేరుతో మనుషుల్ని వెలివేసి వాళ్ళ సంస్కృతిని కించపరచి, హక్కుల్ని కబళించి, ఆనందాలని కాలరాస్తే అదే అంటరాని వసంతమవుతుంది.

ఎల్లన్నది ఎన్నెలదిన్నె అనే కుగ్రామం. అత్త పర్యవేక్షణలో ఆటపాటలతో పెరుగుతూంటాడు. అక్షరాలు వ్రాయడం రాకపోయినా స్పందించే హృదయం, ఉప్పోంగే రక్తం అతనికి పదాలు కూర్చడం, ఆ కూర్చిన పదాలకి అలవోకగా చిందులు వెయ్యడం నేర్పాయి. వీధినాటకాలాడే ఎర్రగొల్లలు ఆ గ్రామానికి వచ్చి రాత్రిళ్ళు ప్రదర్శనలిస్తూంటే, ఆటపాటల మీదున్న ఆసక్తి కొద్దీ వాళ్ళని కాస్త దగ్గరినుంచి చూడాలనుకుంటాడు. అత్త వద్దని వారిస్తుంది. ఆమెకు తెలియకుండా ఒకరోజు ప్రొద్దున్నే  ఊరిబయటనున్న ఎర్రగొల్లల డేరాలకు వెళ్తాడతను. అతని కులం అక్కడ పరిచయమవుతుంది.

ఆ గ్రామంలో కట్టుబాట్ల ప్రకారం కేవలం కరణాలు, కాపులు మాత్రమే ప్రదర్శనకు దగ్గరగా కూర్చునేవాళ్ళు. వారి వెనుక మంగలి, కుమ్మరి మిగత కులాల వాళ్ళు కూర్చునేవాళ్ళు. వీళ్ళందరికీ దూరంగా వెనుకున్న మాల దిబ్బ పై మాలవాళ్ళు, మాదిగ దిబ్బపై మాదిగలు కూర్చునేవారు. కరణం వచ్చిన తర్వాతే వీళ్ళందరూ దిబ్బలపైకి రావాలి.  ప్రదర్శన కనిపించకపోయినా కూర్చునే చూడాలి తప్ప నిలబడి చూడకూడదు. అటువంటిది ఒక మాలపిల్లవాడు  ఏకంగా డేరాల్లోకే రావటం అక్కడున్న గుంపులో కలకలాన్ని సృష్టిస్తుంది. రాళ్ళతో వెంటపడతారు . అర్థంకాకపోయినా అనాలోచితంగానే పరుగు తీసిన ఎల్లన్న పొదలు దూకి, కంపచెట్లను దాటి, బండరాళ్ళు తగిలి బోర్లాపడి, పైకిలేచి, రక్తమోడుతూనే ఏటికి ఎదురీది, ఊరుకి ఆవలిగట్టు చేరుకుంటాడు . అయినా నడక ఆపలేదు. భయంతో మొదలుపెట్టిన నడక చీకటయ్యాక, చీకటిలో తననెవరూ గుర్తుపట్టలేరని నిర్ణయించుకున్నాక ఆపుతాడు . అత్త ఎందుకు వద్దందో అప్పుడర్ధమయ్యింది. ఇంటికి వెళ్ళిపోయి ఇంకెప్పుడూ అలా చెయ్యనని చెప్పాలనుకుంటాడు. చీకట్లో ఊరికి ఎంతదూరం వచ్చేశాడో, ఎటువైపు వెళ్ళాలో తెలియలేదు. తెల్లవారాక వెళ్ళాలనుకుంటాడు. ఎక్కడి నుంచో గాలి మోసుకొచ్చిన లయబద్దమైన శబ్దం అలసిపోయి నొప్పులతో బాధపడుతున్న అతని పాదాలకు తిరిగి సత్తువనిచ్చి ఉరుముల నాగన్న వద్దకు చేరుస్తుంది.

నాగన్న ఉరుముల నృత్యం ఆటగాడు. పక్కలదిన్నె అనే గ్రామంలో తన బృందంతో కలిసి ప్రదర్శనకు వచ్చినతను ఎల్లన్నలోని మెరుపుని అసహాయతను గుర్తించి అతన్ని చేరదీసి వివరాలు కనుక్కుంటాడు. గత జ్ఞాపకాలు అతని గుండె తలుపులు తట్టి మనసుని వికలం చేస్తాయి. నాగన్నదీ ఎన్నెలదిన్నే. అతనూ అక్కడినుంచి వలసపోయినవాడే. మాలాడు, మాదిగాడు వెట్టి చెయ్యకపోతే బ్రతకలేని ఊరు ఎన్నెలదిన్ని. మధ్యాహ్నం కూడు  తప్ప మరో కూలి వుండేది కాదు. దాని కోసం కూడా కొట్టుకు చచ్చేవాళ్ళు. కరణం పరమ క్రూరుడు. ' మీ కులం అంత గొప్పది ఇంత గొప్పది ' అని రెచ్చగొట్టి మాలల పైకి మాదిగల్ని, మాదిగల పైకి మాలల్ని ఉసిగొల్పేవాడు. అతని మాటకు ఎదురుతిరిగినివాళ్ళ బ్రతుకులు తాటితోపులో తెల్లారిపోయేవి. వరదలొచ్చినప్పుడల్లా ఏటికి దగ్గర్లో ఉన్న మాలపల్లి, మాదిగపల్లి మునిగిపోయేవి. ఊరికి పై భాగాన ఉన్న దిబ్బపై ఇళ్ళు కట్టుకోవాలని చూస్తే అంటరాని వాళ్ళు తలభాగాన ఉండరాదని అగ్రవర్ణాల వాళ్ళు హుకుం జారీ చేస్తారు . ఓ సారి వరదలొచ్చి,ఇళ్ళు తుడిచిపెట్టుకుపోయినప్పుడు నాగన్న తండ్రి ధైర్యం చేసి గొడ్డలి భుజాన వేసుకొని అందరినీ దిబ్బలపైకి తీసుకు వెళ్తాడు . అగ్రవర్ణాల ఇళ్ళ మధ్య నుంచి, ఊరి మధ్యనుంచి, దేవాలయాల సందుల నుంచి దిబ్బలపైకి జనాన్ని తీసుకువెళ్తాడు . తిండిలేక పిల్లలు అలమటిస్తూంటే షావుకారు కొట్టు తాళం పగలకోట్టి ధాన్యం బస్తాలు తెచ్చుకుంటారు. రెండ్రోజుల తర్వాత అతని శవం అదే దిబ్బపై కనబడుతుంది . బిక్కచచ్చిన జనం వానవెలిసాక మళ్ళీ పాతచోటే గుడిసెలు వేసుకుంటారు. అప్పుడు తల్లితో పాటు ఊరుదాటిన నాగన్న మళ్ళీ ఇన్నాళ్ళకి తన ఊరి పేరు వింటాడు.  మనుషులు మారుతున్నారు తప్ప మనుగడలో మార్పు లేదని ఎల్లన్న కథతో తెలుసుకుంటాడు . ఎల్లన్న చెయ్యి పుచ్చుకుని ఎన్నెలదిన్ని మాలపల్లిలో అడుగుపెడతాడు.

నాగన్నని పోల్చుకున్న ఊరు అతన్ని అతని నృత్యాన్ని ఆదరిస్తుంది . ఏ దిబ్బపై తన తండ్రిని చంపారో అదే దిబ్బపై ఆ మరణానికి కారకుడైన కరణాన్ని గుట్టుచప్పుడు కాకుండా మాదిగ మాతయ్య నరికేశాడని, ఇప్పుడంతా పిల్ల కరణం చెప్పుచేతుల్లో నడుస్తోందని  తెలుసుకుంటాడు.  ఎల్లన్నకి పాటలు, నృత్యం నేర్పించి అతని ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనుకుంటాడు.

నాగన్న చొరవతో పెద్దలను ఇరుకున పడేసి దెయ్యాల దిబ్బను సాగులోకి తెచ్చుకుంటారు మాలమాదిగలు. అగ్రవర్ణాలకు ఆవేశాలు రగిలినా అంతకు ముందు లేని ఐక్యత ఇప్పుడు మాలమాదిగల్లో కనబడేసరికి కక్కలేక మింగలేక మిన్నకుండిపోతారు. నాగన్న తర్ఫీదులో  ఎల్లన్న రాటుదేలి గొప్ప కళాకారుడిగా పేరు తెచ్చుకుంటాడు. అతను వేషం కడితే చూడ్డానికి చుట్టుపక్కల మాల మాదిగ పల్లెలు ఎగబడేవి. ఆటకు ముందు కరణం ,ఇతర పెద్దలు వచ్చారో లేదో తెలుసుకుని అప్పుడు మొదలెట్టడం ఆనవాయితీ. దాన్ని ధిక్కరించి 'ఘనత వహించిన పెద్ద మాల, అంతే ఘనత వహించిన పెద్ద మాదిగ  తమ స్థానాలు అలంకరించారా లేదా' నని తెలుసుకొని అప్పుడు ప్రదర్శన మొదలుపెట్టడం ప్రారంభిస్తారు . అగ్రవర్ణాలకు ఈ పరిణామం మింగుడుపడక నాగన్నని, ఎల్లన్నని పిలిపించి ఆటకు ముందు అలా పిలవకుండా ప్రదర్శనలిచ్చుకోమని లేకపోతే రెండు ఊళ్ళూ బూడిదవుతాయని హెచ్చరిస్తారు.  ఏం చెయ్యాలో తోచక నాగన్న తనవాళ్ళతో చర్చిస్తాడు. ఆత్మగౌరవం కోసం తెగించి పోరాడే ధృడచిత్తం కరువయ్యేసరికి నిరాశపడి ఆ దిగులుతోనే మరణిస్తాడు.

నాగన్న మాటలే మననం చేసుకుంటూ భార్యా పిల్లలను, గ్రామాన్ని విడిచిపెట్టి ఊళ్ళుపట్టిపోతాడు ఎల్లన్న. పెరిగే పైరు మీద, నాట్లు వేసే కూలీల కష్టం మీద, నేల మీద జరిగే ప్రతి విన్యాసం మీద పాటలల్లి పాడతాడు. భార్య పేరుని పల్లవిగా చేసుకోని పాడతాడు. మాలబైరాగిగా పేరు గడిస్తాడు. పెదకోటేశ్వరుడు అనే కుమ్మరి పోతులూరి వీరబ్రహ్మం గారిపై ద్విపద పద్యాలు వ్రాసి కులాల హెచ్చుతగ్గుల్ని నిరసిస్తూంటాడు . అతని కులం అతన్ని వెలివేస్తుంది. తాళపత్ర గ్రంథ సేకరణ కోసం బ్రౌన్‌దొర నియమించిన వాయసగాళ్ళు, పండితులు అతన్ని, అతని రచనలని అవహేళన చేస్తారు. పెదకోటేశ్వరుడు ఏ మాత్రం చలించకుండా బసవడిని, వీరబ్రహ్మాన్ని కలిపి ద్విపదలు రూపొందిస్తాడు. ఎల్లన్న గురుంచి విని అతన్ని కలుసుకోవాలని బయలుదేరుతాడు.  రాజవీధిలో వెళ్తున్న అతన్ని బ్రాహ్మణుడొకడు గుర్తించి అవమానించి కొట్టబోతాడు. పెదకోటేశ్వరుడు తన కాలికంటిన మట్టి విదిలించి, నేల మీద ఖాండ్రించి ఉమ్మి, ' నా చేత అపవిత్రమైన దీన్ని మీరు పవిత్రం చెయ్యండి' అని వెళ్ళిపోతాడు. ఎల్లన్నని కలిసి, అతని నేపథ్యం సాహిత్యం విని, తన రాతప్రతులను అతనికి అప్పగించి పులకరించిపోతాడు. తిరిగివెళ్తూ అగ్రవర్ణాల చేతిలో దారుణహత్యకు గురవుతాడు. అతని సమాధి ఒక సందర్శనీయ స్థలమవుతుంది.

పిల్లకరణం పట్నం వెళ్ళిపోతూ బంజరంతా మాలమాదిగలకు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ భూమిని ఆక్రమిద్దామనుకున్న అచ్చిరెడ్డికి ఇది ఆశనిపాతమవుతుంది. ఎన్నెలదిన్నెలో ముందు కరణం పొలాలు తడపాలి, తర్వాత పెద్ద రెడ్లు, సన్న రెడ్లు, ఇతరకులాలవి. మాలామాదిగల పొలాల వంతు వచ్చేసరికి నీళ్ళు మిగిలేవి కావు. గత్యంతరం లేక ఓ సారి నీళ్ళు దొంగలిస్తే మనుషుల్ని పంపించి చావగొట్టిస్తాడు అచ్చిరెడ్డి.  ఎల్లన్న భార్య సుభద్ర తిరగబడి కాళికావతారం ఎత్తటంతో ఆమెను 'దేవత ' ఆవహించిందని, అందుకే ఆమెకంత ధైర్యమొచ్చిందని భయపడతారు ఊరివాళ్ళు.

రాళ్ళను సైతం అరాయించుకునే కరువు రాచి రాంపాన పెడుతూంటే, పొట్ట చేతబట్టుకుని  ఊళ్ళకు ఊళ్ళకు వలసపోతూంటారు. ఆ గుంపుతో పాటూ ఎన్నెలదిన్నె ఎగిరివచ్చిన పండుటాకు లాంటి ఎల్లన్నని చూసి అతని భార్యాపిల్లలు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ఎల్లన్న, సుభద్ర మరణిస్తారు. కొడుకు శివయ్య వాళ్ళను అక్కడే సమాధి చేసి  భార్యను వెంటబెట్టుకొని బకింగ్‌హాం కాల్వ కూలిపనులకు వెళ్తాడు .మాలవాడు పనికోసం వచ్చాడని ఆగ్రహించి అక్కడ పనిచేస్తున్న జనం వాళ్ళ మీద దాడిచేస్తారు. చాలా దూరం పారిపోయి జీవచ్ఛవాల్లా పడిపోయిన శివయ్యను అతని భార్యని క్రైస్తవ మతం చేరదీస్తుంది. శివయ్య సీమోను అవుతాడు. అతనికి ఆశ్రయం ఇచ్చిన  మార్టిన్‌దీ అటువంటి నేపథ్యమే.

ఇక్కడి నుంచి కథ రకారకాల మలుపులు తిరిగి సీమోను కొడుకు రూబేను, రూబేను కొడుకు ఇమ్మాన్యుయెల్, అతని కొడుకు జెస్సీ జీవితాలని, అంతః సంఘర్షణను స్పృశిస్తూ జెస్సీ నక్సలైట్‌గా రూపాంతరం చెందడం వరకు సాగుతుంది. అజ్ఞాతంలో ఉన్న మనవడిని చూడ్డానికి వెళ్తాడు రూబేను. అతని భార్య మరియు జెస్సీ నాన్నమ్మ అయిన రూతు, మనవడి విజయాన్ని ఆకాక్షిస్తూ ఉత్తరం వ్రాయటంతో నవల పరిసమాప్తమవుతుంది.

తరతరాలుగా అలగాజనంగా ముద్రపడ్డ మాలమాదిగల బ్రతుకు పొరాటానికి నిలువెత్తు దర్పణం అంటరాని వసంతం. కల్యాణరావుగారి శైలి చాలా సరళంగా శక్తివంతంగా ఉంది. మామూలు మాటలతోనే మనసులోతుల్ని స్ఫృశిస్తారు .మాలమాదిగల జీవనశైలిని, వారి దైన్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. చచ్చిన గొడ్డు మాంసం తింటూ గొడ్డిచ్చిన పెద్దలకి దాన్ని చర్మంతో చెప్పులు కుట్టడం నుంచి, ఏ కులమూ తాకని తన దేహాన్ని ఒక తెల్లవాడు తాకి ' క్రీస్తుకు అంటరానితనం లేదు ' అన్నప్పుడు   ఆత్మగౌరవం కోసం క్రైస్తవ మతాన్ని అందిపుచ్చుకోవటం వరకూ, కాలిక్రింద చెప్పు నుంచి కొడవలిగా ఎదిగే వరకూ, మాలమాదిగల జీవితాల్లో వచ్చిన మార్పులను, అంతర్మథనాలను చక్కగా విశ్లేషించారు. కులం కారణంగానే మాలమాదిగలకు దక్కాల్సిన ఎన్నో గౌరవాలు దక్కలేదని, రవివర్మ, రాజమన్నారు, నండూరి వంటి వాళ్ళు వెలయించిన సాధారణ చిత్రాలని, రచనలని మాత్రం నెత్తిన పెట్టుకున్నారని ఆక్షేపిస్తారు. ప్రేరిణీ శివతాండవం కంటే ఉరుముల నృత్యంలో సహజత్వం ఉందని, పురాణాలను మంత్రాలను సైతం మహాకావ్యాలుగా ఆకాశానికెత్తిన పండితులు అంటరాని కులాలు పాడిన గీతాలు, ఆడిన వీధిభాగవతాల్లో గొప్పదనాన్ని గుర్తించలేకపోయారని ఎద్దేవా చేస్తారు. ఎంకి పాటలు నేను చదవలేదు కానీ ఈ మాటల్లో కొంత నిజం లేకపోలేదు. ఆత్మగౌరవం కోసం  పరమతాన్ని పుచ్చుకున్న మాలమాదిగల్ని సమర్థిస్తూనే ధనం కోసం మతం మార్చుకున్న అగ్రవర్ణాలను చూసి నవ్వుతారు. గాంధీజీ చేపట్టిన హరిజనోద్ధరణ, దేవాలయాల ప్రవేశం లాంటి కార్యక్రమాలని హిందూ మతచట్రంలో మాలమాదిగల్ని బంధించే ప్రయత్నమని, అందుకే అంబేద్కర్ వంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకించారని చెప్పి ఆయా కార్యక్రమాలలోని డొల్లతనాన్ని వివరించి ఆశ్చర్యపరుస్తారు .

నవలలో ప్రస్తావించిన చాలా సంఘటనలు మనసుని మెలిపెట్టి బాధపెట్టేవే. కొన్ని విషయాలు మాత్రం కొత్తగా ఉన్నాయి . చెన్న పురాణం, జాంబ పురాణం అన్నపేర్లు  చదివి ఇటువంటి పురాణలు కొన్ని ఉన్నాయా అని ఆశ్చర్యపోయాను. అప్పటిదాకా వ్యాస భగవానుడు వ్రాసిన పద్దెనిమిది పురాణాల గురుంచి మాత్రమే విని ఉండటం చేత ఈ కొత్త పురాణాలేమిటి, వాటిని ఎవరు వ్రాశారన్న జిజ్ఞాస బయలుదేరింది. అంతర్జాలాన్ని శోధించాక వీటిని కుల పురాణాలంటారని ఇటువంటి పురాణాలు ఇంకా అనేకం ఉన్నాయని  అర్థమయ్యింది. ఎవరు ఎలా వ్రాశారో ఇతిమిత్థంగా తెలియకపోయినా కులాల పుట్టుకలు, చరిత్రలు, వాటి అనుబంధ కథలు తెలిపే కులపురాణాలు, కొన్నైనా ఆయా కులాల్లో (లేదా ఇతర కులాల్లో) బాగానే ప్రాచుర్యం పొందినట్లున్నాయి. కేవలం నోటిమాటలు, ఆటపాటల ద్వారా ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయిపోయే ఈ పురాణలలో చెన్న పురాణం మాలలది. జాంబ పురాణం మాదిగలది (ఈ మధ్యనే జాంబపురాణం అనే పుస్తకాన్ని విడుదల చేశారు. దీనిపై దార్ల వారి వ్యాసం కూడా చదివాను). వీటిలో కథలు కొత్తగా ఉంటాయి. ఎప్పుడూ వినని, చదవని కథలు. (ఈ పురాణ కథల గురుంచి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్‌చెయ్యండి .) ఎవరో జడల ఋషి వ్రాసింది చరిత్ర ఎలా అవుతుందని సామాజిక మూలాలను ప్రశ్నించిన రచయిత, కనీసం ఎవరు వ్రాశారో తెలియని పురాణాలని పట్టుకొని మాలా మాదిగలు అంటరానివారెలా అయ్యారని ప్రశ్నించుకొని ఉంటే సమాధానం అందులోనే దొరికేది. తేడా మతంలో లేదు. దాన్ని బోధించే మనుషుల్లో ఉంది.

పుట్టుకతో ఎవారూ ఫలానా కులానికి చెందరని, కర్మానుసారమే బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని భగవానువాచ . నేను హిందువునేనయినా, హిందూమతం గురుంచి నాకున్న అవగాహన స్వల్పమే అయినా,  'బ్రాహ్మణత్వం' ' చాతుర్వర్ణ వ్యవస్థ ' వంటి పదాలకు తీసిన పెడార్థాలు మరే పదాలకీ తీయలేదని నిశ్చయంగా చెప్పగలను.  కుహానా పండితులు, మేధావుల కారణంగా సంఘానికి, తద్వారా హిందూ మతానికి ఎనలేని నష్టం జరిగింది. ఎందరో గురువులు, సాధకులు తమ బోధనలతో నయం చేసే ప్రయత్నం చేసినా, ఇంకా చేస్తున్నా అంటరానితనం అనే వ్యాధి ఇంకా పూర్తిగా  సమసిపోలేదు. అప్పటికీ ఇప్పటికీ మనుషుల మనస్తత్వాలలో చాలా మార్పులొచ్చినా అంటరానితనం పేరుతో దళితులని అవమానించటం లాంటి సంఘటనలు ఇప్పటికీ అడపాదడపా  మనం వింటూనే ఉన్నాం. అలాగే బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా శబరిమలై లాంటి సుప్రసిద్ధ ఆలయాలలో అర్చక పదవులు నిర్వహించడం చూస్తున్నాం. ఆత్మగౌరవం మాటెలా ఉన్నా ఆర్థికంగా మాత్రం మాలమాదిగలు అర్చక స్వాముల కంటే ఇప్పుడొక మెట్టు పైనే ఉన్నారు. చరిత్రకెక్కిన రాజులని, మహాపురుషులని తమ కులానికి చెందిన వాళ్ళుగా ప్రకటించుకోవటం సర్వసాధారణం కాబట్టి, మాలమాదిగల చారిత్రక ప్రశస్తి మీద మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో  తవ్వాల్సింది  పూడ్చాల్సింది చాలానే ఉంది. 

ఈ నవలని తెలుపు.కాం వెబ్‌సైట్ నుంచి  పొందవచ్చు.

వెల 70 రూపాయిలు .