• మెరిసే మేఘాలు

    మెరిసే మేఘాలు
  • కురిసే వర్షాలు

    కురిసే వర్షాలు
  • విరిసే పుష్పాలు

    విరిసే పుష్పాలు
  • మురిసే భువనాలు

    మురిసే భువనాలు
  • నాకు

    నాకు
  • కదిలే కావ్యాలు

    కదిలే కావ్యాలు

రౌడీయిజం చేస్తున్న రాష్ట్రపతి కావల్సిన నేత




ళ్ళు గడిచే కొద్దీ వయస్సు పెరుగుతుంది.
వయసు పెరిగే కొద్దీ జ్ఞానం రావటం సహజం.
వస్తుందని ఆశించటంలో తప్పులేదు.

కానీ ఇవన్నీ మాములు మనుషులకు వర్తించే అంశాలు.రాజకీయ నాయకులకు కాదు.వాళ్ళు ఇటువంటివాటికి అతీతులు.యుక్తవయస్సులో ఉన్నా ముదిమి మీదపడుతున్నా వాళ్ళ వ్యవహారశైలి ఒకేలా ఉంటుంది.చెప్పేదొకటి చేసేదొకటి.తర్కానికి అందదు.'తొండ ముదిరి ఊసరవెల్లి అయిన'ట్లు వీళ్ళలో కొంతమంది ధోరణి నానాటికీ మరీ దిగజారిపోతూంటుంది.భావితరాలకి దిశానిర్దేశం చెయ్యాల్సిందిపోయి విచక్షణ మరిచిపోయి అకృత్యాలకి తెగబడే ఇలాంటి నేతల్ని చూస్తుంటే అసహ్యం కలగక మానదు.


ఇప్పటికే మీరు గ్రహించి ఉంటారు.


కాంగ్రెస్ కురువృద్ధుడైన కాకా అలియాస్ జి.వెంకటస్వామి గురించే ఇదంతా. కురువృద్ధుడన్న పదం ఇక్కడ ఉపయోగించినందుకు క్షమించాలి. భారతంలో భీష్మ, ద్రోణ, విదురాది వయోవృద్ధులంతా కురుసభలో న్యాయం కోసం పరితపించిపోయారే గానీ, వారే స్వయంగా ఏనాడూ ధర్మాన్ని అతిక్రమించలేదు. కానీ ఇక్కడ గౌరవనీయులైన కాకా గారే ఒక నటుడి స్థలాన్ని( శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కూడా హీరోగా ఒక సినిమాలో నటించాడు) నిర్లజ్జగా కబ్జా చేశారు. కబ్జా చెయ్యటమే కాకుండా ఈ వివాదంలోకి తెలంగాణా వాదాన్ని కూడా లాగారు. సీనియర్ నాయకున్నని, రాష్ట్రపతి కావల్సిన వ్యక్తినని స్వోత్కర్ష చెప్పుకొనే వెంకటస్వామి కబ్జా చెయ్యటం సిగ్గుపడాల్సిన అంశమైతే, దాన్లోకి తెలంగాణా వాదాన్ని లాగి ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టి లాభం పొందాలనుకోవడం పతనమైపోతున్న రాజకీయ విలువలకు పరాకాష్ట.  'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు' అని తన చర్యను సమర్థించుకుంటూ ఆయనిచ్చిన వివరణ వింటే ఆ పార్టీ నేతలంతా తలవంచుకోవాలి. తన స్థలం పక్కనే ఉంది కాబట్టి తననడిగి స్థలం కొనుగోలు చేసుండాల్సిందని ఆయనొక పసలేని వాదన లేవదీశారు. శ్రీకాంత్ తమ్ముడి స్థలమే కాకుండా రెండొందల ఎకరాల దళితుల స్థలాలను కూడా వెంకటస్వామి ఆక్రమించారని అక్కడి గ్రామస్తులు కొందరు ఆరోపించారు.  నిత్యం పదవీ కాంక్షతో తహతహలాడిపోతూ, వైయస్ ఉన్నంతకాలం మింగలేక కక్కలేక ఉండి సందుదొరికితే మైకు ముందుకొచ్చి అవినీతి గురించి లెక్చర్లు దంచిన వెంకటస్వామి నిర్వాకం చూసి, ఇప్పుడు రాష్ట్రప్రజలంతా నోళ్ళు వెళ్ళబెట్టి విస్తుపోతున్నారు.(నేను వైయస్ కు కానీ జగన్ కు కానీ అభిమానిని కాను) కబ్జా చేసిన స్థలంలో టీ.ఆర్.ఏస్. జెండాలను పాతిపెట్టి వివాదంలోకి ప్రాంతీయతత్వాన్ని లాగినా, ఆంధ్రా హీరోల సినిమాల విషయంలో ప్రవర్తించిన రీతిలో కాకుండా తెలంగాణా జె.ఏ.సి, బాధితుడైన శ్రీకాంత్ వైపే నిలబడటం ముదావహం. పోలీసులు కూడా న్యాయం శ్రీకాంత్ వైపే ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.మరోవైపు ఆయన మీద ఇటువంటి ఆరోపణలు కొత్తకాదని పత్రికలు కోడై కూస్తున్నాయి. ఇంత జరిగినా కనువిప్పు కలగని వెంకటస్వామి తాను తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశానని,అటువంటి తనకు సపోర్ట్ ఇవ్వకుండా ఆంధ్రుడైన శ్రీకాంత్ కు సపోర్ట్ ఇవ్వడమేంటని హుంకరిస్తున్నారు. పోలింగ్ శాతం కేవలం యాభైశాతం దాటటానికే ఆపసోపాలు పడే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అటువంటి దేశంలో ఇటువంటి నేతలకు కొదవ లేదు. గుడ్డిలో మెల్ల ఏంటంటే వాళ్ళు  మనదేశానికి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు కాకపోవటం. 

అంతవరకూ మనం అదృష్టవంతులమే.


రాధాకృష్ణ (వాటర్ పెయింటింగ్)



ప్పటిదాకా నేను వేసిన పెయింటింగ్స్ లో కొంచెం తేడాకొట్టిన పెయింటింగ్ ఇదేనని నా ఆభిప్రాయం.కలర్ కాంబినేషన్ సరిగ్గా కుదరలేదు.మొదట్లో వెయ్యాలనుకున్న కలర్స్ వేరు. కలర్ మిక్సింగ్ సరిగ్గా కుదరక ఇలా తయారయ్యింది. అయినా కూడా మా నాన్నగారు దీన్ని ఫ్రేం చేయించారు.


కర్ణాభిమన్యుల జన్మరహస్యం,ఏకలవ్యుని మరణం ఇతర విశేషాలు



తిహాసం అంటే 'ఇది ఇలాగే జరిగిందని ' అర్థం. పంచమవేదమైన మహాభారతం ఎన్నో అద్భుతమైన గాథలకు మారుపేరు. భారతంలో లేనిది ఎక్కడా లేదు, ఎప్పుడూ జరుగబోదు కూడా. పూర్వం దేవలోకంలో నాలుగువేదాలని ఒక వైపు, మహాభారతాన్ని ఒక వైపు వేసి తూస్తే, త్రాసు భారతం వైపే మొగ్గిందట. అటువంటి మహోన్నతమైన గ్రంథంలోంచి కొన్ని విశేషాలు ఇక్కడ.

  1. 1.   మహాభారతం వ్రాయడానికి వేదవ్యాసునికి మూడేళ్ళు పట్టింది.

  2. 2.   వేదాలను నాలుగు భాగాలుగా విభజించినందువలన వ్యాసునికా పేరు వచ్చింది. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు (నల్లగా ఉంటాడు,ద్వీపంలో పుట్టినవాడు).

  3. 3.   అమృతం కోసం గరుత్మంతుడు అమృతభాండం ఉంచిన దర్భలను ఆబగా నాకి పాముల నాలుకలు రెండవుతాయి.

  4. 4.   యాగశాలకున్న వాస్తుదోషం కారణంగా సర్పయాగం ఆగిపోతుందని యాగారంభానికి ముందే లోహితుడనే వాస్తుశాస్త్ర నిపుణుడు జనమేజయున్ని హెచ్చరిస్తాడు.

  5. 5.   బ్రాహ్మణులు కల్లు త్రాగరాదని, త్రాగితే నరకప్రాప్తి తథ్యమని శుక్రాచార్యులు శాపమిస్తాడు.

  6. 6.   కులాంతర వివాహాలు ఆనాడే ఉన్నాయి. యయాతి క్షత్రియుడు. దేవయాని బ్రాహ్మణ కన్య.'బ్రాహ్మణులు క్షత్రియ కన్యలను వివాహమాడవచ్చు కానీ,రాజులు బ్రాహ్మణ కన్యలను వివాహమాడరాద 'ని యయాతి అంటే శుక్రాచార్యులు అతని సందేహాన్ని తీర్చి వారిద్దరి వివాహానికి ధర్మబద్ధతను కల్పిస్తాడు.

  7. 7.   శకుంతలకు దుర్వాస మహర్షి శాపమివ్వటం, దుష్యంతుడు ఆమెను మరచిపోవటం, జాలర్లు తెచ్చిన ఉంగరం చూసి అతనికి అంతా గుర్తుకు రావటం..ఇదంతా మహాకవి కాళిదాసు కల్పనా వైచిత్ర్యం. వ్యాస భారతంలో కథ వేరు. అసలు దుర్వాస మహర్షి ప్రస్తావనే లేదు. దుష్యంతుడు ప్రజాపవాదుకి భయపడి నిండు సభలో శకుంతల ఎవరో తెలియనట్లు నటిస్తే, ఆకాశవాణి వారి వివాహాన్ని గురుంచి సభికులందరికీ చెబుతుంది.దుష్యంతుడు అప్పుడు అంగీకరిస్తాడు.

  8. 8.   దుష్యంతుని కుమారుడు భరతుడు. అతనికి పుట్టిన కొడుకులెవ్వరు ప్రయోజకులు కాకపోవటంతో ,ఆగ్రహించి భరతుడే వారందరినే చంపి,గొప్ప యాగం చేసి, భరధ్వాజుని ద్వారా భూమన్యుడనే కొడుకుని పొందుతాడు.

  9. 9.   మహాభారతం ఒక విధంగా దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధం అనుకోవచ్చు.అమృతం పొందిన దేవతలకు ఎదురొడ్డి నిలువలేక దైత్యులు,దానవులు భూప్రపంచంలో వివిధ రూపాలతో జన్మించి తమ ఆధిక్యాన్ని నిరూపించుకుంటూంటే దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి భూభారం తగ్గించటానికి దేవతలు కూడా మానవజన్మలెత్తుతారు.

    ధృతరాష్ట్రుడు - హంస అనే గంధర్వుడు
    పాండురాజు - వాయుదేవుని అంశ
    కుంతి,మాద్రి -సిద్ధి, ధృతి
    గాంధారి - మతి
    విదురుడు - యమధర్మరాజు
    ద్రోణుడు - బృహస్పతి
    కృపాచార్యుడు - ఏకాదశరుద్రుల అవతారం
    ద్రుపదుడు,విరాటుడు - వాయుదేవుని అంశ

    దుర్యోధనుడు - కలిపురుషుని అంశ
    దుర్యోధనుడి సోదరులు 99 మంది - రాక్షసులు
    శకుని - ద్వాపరయుగాంశ సంభూతుడు
    అశ్వత్థామ - రుద్రుడు,యముడు, కామ క్రోధాంశ సంభూతుడు
    శల్యుడు - ప్రహ్లాదుని తమ్ముడు సంహ్లాదుడు
    శిఖండి -గుహ్యకుడనే రాక్షసుడు
    ధృష్టద్యుమ్నుడు - అగ్ని అంశ
    ద్రౌపది తనయులు - విశ్వులు

    కంసుడు - కాలనేమి అనే రాక్షసుడు
    పదహారువేల మంది గోపికలు - అప్సరసలు
    జరాసంధుడు - దానవులలో మొదటివాడు విప్రచిత్తి
    రుక్మి (రుక్మిణీదేవి అన్న) - క్రోధుని కుమారుడు
    సాత్యకి (శ్రీకృష్ణుని తమ్ముడు)- మరుత్తులు

  10. 10.   కర్ణుడు పూర్వజన్మలో సహస్రకవచుడనే రాక్షసుడు. నరనారాయణులు అతనితో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి 999 కవచాలు చేధిస్తారు. మిగిలిన ఒక్క కవచంతో అతను పారిపోయి సూర్యునిలో దాక్కుంటాడు. నరనారాయణులే కృష్ణార్జునులుగా జన్మిస్తారు.

  11. 11.   కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. జన్మతహ వచ్చిన కవచ కుండలాలను శరీరం నుంచి చీల్చి ఇంద్రునికి దానం చేస్తాడు కాబట్టి అతనికి కర్ణుడనే పేరు వచ్చింది. దుర్యోధనుని ప్రాపకం పొందేనాటికే అతనికి కవచ కుండలాలు లేవు. దానమిచ్చేశాడు. మన సినిమాలలో, సీరియల్స్ లో దుర్యోధనుడి చెంత వున్న కర్ణున్ని కవచ కుండలాలలో చూపించి, యుద్ధసమయంలో అతను వాటిని ఇంద్రునికి దానం చేసినట్లు చూపిస్తారు.

  12. 12.   పెళ్ళికి ముందే గాంధారి శివుని గూర్చి తపస్సు చేసి నూటొక్క పిల్లల్ని కనే వరం పొందుతుంది.

  13. 13.   గాంధారి, ఆమె చెల్లెళ్ళు పదిమందితో కలిపి ధృతరాష్ట్రునికి వందమంది భార్యలు.

  14. 14.   అభిమన్యుడు చంద్రుని కుమారుడైన వర్ఛస్సు అంశతో జన్మించినవాడు. కుమారుని విడిచి ఉండలేని చంద్రుడు అతనికి పదహారోయేడు కలిగినవెంటనే తిరిగివచ్చేయాలని షరతు విధిస్తాడు .తత్పలితంగా అభిమన్యుడు పద్మవ్యూహంలో మరణిస్తాడు.

  15. 15.   కర్ణుడు సైతం ద్రోణాచార్యుడి వద్ద కొంతకాలం విద్యనభ్యసించాడు. కురుపాండవుల అస్త్రవిద్యాప్రదర్శనం కంటే ముందు అతనెవరో ద్రోణుడికి తెలుసు.

  16. 16.   ఏకలవ్యుడు శ్రీకృష్ణుడి పినతండ్రైన దేవశ్రవుని(వసుదేవుని తమ్ముడు)కుమారుడు.క్రోధుని కుమారులలో ఒకరి అంశతో జన్మించినవాడు. జరాసంధుని సైన్యాధిపతైన హిరణ్యధ్వజుడనే నిషాదరాజు ఇతన్ని పెంచుకుంటాడు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకెళుతున్నప్పుడు, అడ్డుపడి జరాసంధుని తరపున పోరాడి అతని చేతిలో ప్రాణాలు కోల్పోతాడు.

  17. 17.   హిడింబ అసలు పేరు కమలపాలిక.

  18. 18.   ఘటోత్కచుడికి నెత్తిన జుట్టు లేదు. బోర్లించిన కుండలా బట్టతలతో ఉంటాడు కాబట్టే అతనికా పేరు.



కౌముది.నెట్ లో నా కథ 'శ్రీకారం'

కౌముది.నెట్ లో నా కథ 'శ్రీకారం'


కౌముది.నెట్ తాజసంచికలో(Aug 2010) కథాకౌముది విభాగానికి వెళ్ళి నా కథ 'శ్రీకారం' చదివి మీ అమూల్యమైన అబిప్రాయాలు తెలియజేయండి.ఈ సందర్భంగా ఆలయం గురుంచి కొన్ని వివరాలు తెలియచేసిన మిత్రుడు సామల ప్రశాంత్ కుమార్ కి,కథ నిడివి విషయంలో నా సందేహాలు నివృత్తి చేసిన సుప్రసిద్ద రచయిత్రి వసుంధర గారికి, ప్రచురించిన కౌముది యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.


శాలివాహన (వాటర్ పెయింటింగ్)


ఆంధ్రుల తొలి తెలుగు రాజులు శాతవాహనులు.ఆయితే వీళ్ళెవరనేదాని మీద బోల్డంత గందరగోళం ఉంది.శాలివాహనుడు విక్రమాదిత్యున్నే ఓడించిన రాజని ఒక కథ బహుళ ప్రచారంలో ఉంది.మన పురాణాల ప్రకారం శాలివాహనుడు విక్రమాదిత్యుని మనవడు, అగ్నివంశపు రాజు.విదేశీ చరిత్రకారుల ప్రకారం గౌతమీపుత్ర శాతకర్ణే శాలివాహనుడు.కొంతమంది స్వదేశీ చరిత్రకారులు దీనితో విభేదిస్తారు.అయితే ఇంద్రదత్తమైన సింహాసనం పొంది,భేతాళున్ని వశం చేసుకున్న విక్రమాదిత్యుడెవరు అనేదానిమీదే చరిత్రకారులకు ఏకాభిప్రాయం లేదు.
అటువంటప్పుడు అతన్ని ఓడించి శక శకానికి శ్రీకారం చుట్టిన శాలివాహనుడెవరో తెలుసుకోవడం కష్టం.వీళ్ళు ఎవరైనా ఆంధ్రజాతికి వీళ్ళే మొదటి తెలుగు పాలకులన్నది సుస్పష్టం.

ఆ శాలివాహనుడి ఊహాచిత్రమే ఈ చిత్రం.


నీలాలు కారేనా కాలాలు మారేనా

శీరిక్షలో నాకు నచ్చిన కొన్ని మధురగీతాల్ని మీతో పంచుకుంటాను.

ముందుగా 'ముద్దమందారం' సినిమా లోంచి 'నీలాలు కారేనా కాలాలు మారేనా ' పాట గురుంచి ..

1981 లో విడుదలై అఖండ విజయాలు సాధించిన తెలుగు సినిమాలలో ఇదొకటి. ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దర్శకుడిగా జంధ్యాల( వెంకట దుర్గాశివ సుబ్రహ్మణ్య శాస్త్రి) గారికిదే మొదటి సినిమా. అప్పటికే ఆయన సినీరచయితగా సుప్రసిద్ధులు. హీరో హీరోయిన్ల(ప్రదీప్,పూర్ణిమ)లతో సహా నటీనటులందరూ చాలా వరకు కొత్తవాళ్ళే. 'సుత్తివేలు' గా ప్రసిద్ధులైన కురుముద్దాలి లక్ష్మీ నరసింహా రావు గారికీ,ఏ.వీ.ఎస్ గారికీ ఇదే మొదటి చిత్రం. సంగీతం రమేష్ నాయుడు గారు. పాటలన్నీ వేటూరి గారే వ్రాశారు. ఆ సాహితీ పారిజాతపు మహావృక్షం కొమ్మరెమ్మల్లో విరబూసిన పాటలు, సుమధుర మరందాల సువాసనలే వెదజల్లాయి. యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ సినిమా విమర్శకులకు మాత్రం బాగా పని కల్పించింది. టీనేజ్ ప్రేమకథలతో యువతను పెడదోవ పట్టిస్తున్నారని వాళ్ళంతా జంధ్యాల పై అస్త్రశస్త్రాలను సంధించారు.





కథ మాములు ప్రేమ కథే.అమెరికా నుంచి తిరిగొచ్చిన ఒక లక్షాధికారి కొడుకు,తండ్రినెదిరించి ఒక పూలమ్ముకొనే పేదింటమ్మాయిని పెళ్ళిచేసుకుంటాడు. ఆ తర్వాత వారి జీవితం ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతుంది. ఆ సందర్భంగా వచ్చే సన్నివేశాలలో ప్రియురాలిని ఓదారుస్తూ కథానాయకుడు పాడే పాట ఇది.

నీలాలు కారేనా
కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా




మొదటి చరణంలో సూర్యుడికి,చంద్రుడికీ పేదాగొప్ప భావం లేదని,నింగినీ,నేలను కొనగల సంపద లేదని చెబుతారు.

సూరీడు నెలఱేడు సిరిగల దొరలే కారులే
పూరి గుడిసెల్లో, తేడా మనసుల్లో
వెలిగేటి దీపాలులే
ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేరులే
కలిమి లేముల్లో, కరిగే ప్రేమల్లో
నిరుపేద లోగిళ్ళులే


ఈ క్రింది చరణం చూడండి ఎంత బావుందో,


ఈ గాలిలో తేలి వెతలన్నీ మరిచే వేళలో
కలికి వెన్నెల్లో, కలల కన్నుల్లో
కలతారిపోవాలి లే
ఆ తారలే తేరి తళతళమెరిసే రేయిలో
ఒడిలో నువ్వుంటే ,ఒదిగిపోతుంటే
కడతేరిపోవాలి లే


ఒక వైపు పుచ్చపువ్వులా వెన్నెల !
మరో వైపు చల్లని గాలి !

అటువంటి గాలిలో తేలిపోతూ కష్టాలన్నీ మరిచిపోయే వేళ, ప్రియురాలి కలతలన్నీ ఆరిపోవాలని,తన ఒడిలో ఆమె ఒదిగిపోతుంటే అలాగే తుదిశ్వాస విడవాలని కోరుకుంటాడు. ప్రతి ప్రేమికుడు కోరుకునేదిదే.పండు వెన్నెల్లో ఈ పాట వింటూ పడుకుంటే ఎటువంటి కష్టాలైనా మరచిపోతాం. సినిమా గురుంచి తెలియకపోయినా,పాట విన్న వెంటనే కథ,కథతో పాటు సన్నివేశం,రెండూ శ్రోతలకి అవగతమవుతాయి. సగటు ప్రేమికుడి హృదయాన్ని వేటూరి చక్కగా ఆవిష్కరిస్తే,రమేష్ నాయుడు సంగీతం దానికి మరింత సొగసులు దిద్దింది. ఇక బాలు గురించి చెప్పాల్సిన పని లేదు. గంధర్వ గాత్రంతో భావయుక్తంగా పాడి పాటకు ప్రాణం పోసారాయన.

చంద్రునికీ మచ్చలున్నట్లు ప్రదీప్ నటనొక్కటే ఈ పాటకు లోటు .


నటకిరీటికి నీరాజనం


(జూలై పంతొమ్మిది రాజేంద్రప్రసాద్ జన్మదినం.ఆ సందర్బంగా ఈ వ్యాసం )

వి నేను ఏడవ తరగతి చదివే రోజులు.వారం రోజులుగా మా స్కూల్ చుట్టుప్రక్కల ఒకటే సందడి.'ఏంటా సంగత'ని ఆరా తీస్తే రాజేంద్రప్రసాద్ సినిమా షూటింగ్ అన్నారు మా ఫ్రెండ్స్.స్కూల్ ప్రక్కనే వెస్ట్ రైల్వే స్టేషన్.దానికావల ఒక చర్చ్.ఆ చర్చ్ పరిసరాల్లో సినిమా తీస్తున్నారని చెప్పారు.క్లాస్ లో ఆ చుట్టుప్రక్కల ఇళ్ళల్లో ఉంటున్న పిల్లలు కొంతమందున్నారు. వాళ్ళొచ్చి రోజూ షూటింగ్ కబుర్లు చెబుతూంటే పసందుగా ఉండేది.క్లాస్ రూం కిటికీలోంచి కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కనిపించేది.దాంతో టీచర్లు చెప్పేది బుర్రకెక్కేది కాదు.రాజేంద్రప్రసాద్ అంతే తమాషానా? 'ఆహ నా పెళ్ళంట,వివాహభోజనంబు ' లాంటి భారీ విజయాలతో టాప్ హీరోలతో సమానమైన పాపులారిటీ తెచ్చుకొని,ఇంటిల్లీపాదీలో ఒకడిగా చెలామణీ అయిపోతున్న హీరో.అతని సినిమా వస్తోందంటే టాక్ తో సంబంధం లేకుండా జనం థియేటర్ల దగ్గర బారులు తీరేవాళ్ళు.హీరోగా అతనంటే ఇష్టపడని వాళ్ళు బహుతక్కువని చెప్పోచ్చు.

అప్పట్లో నేను ప్రొద్దున్నే లేచి మా క్లాస్ టీచర్ దగ్గర మాథ్స్ ట్యూషన్ కి వెళ్ళేవాన్ని.ఆవిడ ఉండేది మా స్కూల్ దగ్గరే.ఏడవ తరగతి కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గరపెట్టుకొని కూడా చదివేవాన్ని.ఒకసారి అలా ట్యూషన్ ముగించుకొని సైకిలెక్కి ఇంటిముఖం పట్టబోతూంటే మా మిత్రబృందం ' అలా చర్చ్ వరకు వెళ్ళొద్దాం రా రా ' అన్నారు.'దేనిక'ని అడిగా.'రాజేంద్రప్రసాద్ షూటింగ్ ఉందంట వెళ్ళొద్దాం' అన్నారు.వాళ్ళలో ఒకడు రాజేంద్రప్రసాద్ వీరాభిమాని(అతను నిజంగా రాజేంద్రుడి ఫ్యాన్ కాదేమో అని నేను మొదట అనుమానపడ్డాను.అప్పటిదాకా మేమంతా ఏ చిరంజీవి ఫ్యానో, బాలయ్య ఫ్యానో,నాగార్జున ఫ్యానో,వెంకీ ఫ్యానో అని విన్నవాళ్ళమే గానీ ఇలా వేరైటిగా రాజేంద్రప్రసాద్ ఫ్యాన్ అని చెప్పుకోవటాన్ని వినలేదు.అందరూ రాజేంద్రప్రసాద్ ని అభిమానిస్తారని,అతనికిష్టమైన హీరో వేరొకరుండొచ్చని,చెబితే నవ్వుకుంటామని ఇలా చెప్పాడేమో అనుకున్నాను.నా అభిప్రాయం తప్పని అతను నిజంగానే కేవలం రాజేంద్రప్రసాద్ అభిమానని తర్వాత తెలిసింది).

రాజేంద్రప్రసాద్ పేరు వినగానే నేను ఎగిరి గంతేశాను.అతనంటే నాకూ ఇష్టమే.'ఆహ నా పెళ్ళంట' సన్నివేశాలు ఇంకా మదిలో ఫ్రెష్ గానే ఉన్నాయి.మా సైకిళ్ళు చర్చి వైపు దారి తీసాయి.కాంపౌండ్ లోకి ప్రవేశిస్తూండగా ఒక తెల్లటి అంబాసిడర్ కారు మమ్మల్ని దాటుకుంటూ దూసుకుపోయింది.మా స్నేహితుడొకడు ఆయాసపడుతూ సైకిల్ తొక్కుతూనే 'ఆ కార్లో ఉన్నాడేమో రా' అన్నాడు."నీ మొహం.అది ఎవరి కారో ఏంటో ? అయినా రాజేంద్ర ప్రసాద్ ఈ కార్లో ఎందుకొస్తాడు ?" అన్నాడు వీరాభిమాని.
మొదటివాడు మాత్రం ఊరుకోలేదు.అందులో ఉన్నది రాజేంద్రప్రసాదే అని నిర్ణయానికి వచ్చేశాడు.మేము వారించేలోగా 'ఒరేయ్ రాజేంద్రా' అని అరిచేశాడు గట్టిగా .

అంతే ! ముందు వెళ్తున్న కారు కిటికీలోంచి రాజేంద్రప్రసాద్ తల బయట పెట్టి చూట్టం...నవ్వుతూ మమ్మల్ని రమ్మని సైగ చెయ్యటం జరిగిపోయాయి.

మాకు ఒక్కక్షణం మతి పొయ్యింది.'ఒరేయ్ గిరేయ్' అని వాగినందుకు మమ్మల్ని తిడుతారేమో అనుకున్నాం.మర్యాద లేకుండా మాట్లాడినందుకు మా స్నేహితుడి మీద కోపం వచ్చింది.అభిమాన హీరోని చూడబోతున్న ఆనందం ఒకవైపు, మందలిస్తారేమో అన్న భయం ఒక వైపు.సైకిళ్ళు నిలబెట్టి అలానే షూటింగ్ స్పాట్ కి వెళ్ళాం.

ఆ రోజు షూటింగ్ ఇంకా మొదలవలేదు.విశాలమైన చెట్ల నీడలో కొన్ని టేబుళ్ళు,వాటి మీద ఏవో కొన్ని గిన్నెలు,చుట్టూ కొన్ని కుర్చీలు అమర్చబడి ఉన్నాయి.మల్లెపువ్వు లాంటి తెల్లటి పొడుగు చేతుల షర్టు,పంచె కట్టుకొని ఓ కుర్చీ వైపు వెళ్తూ 'రండి పిల్లలు టిఫన్ చేద్దురు గానీ' అన్నారు రాజేంద్రప్రసాద్ చిరునవ్వుతో.సినిమా వాళ్ళలో ఒకతను 'ఒరేయ్ అంటారా' అని మమ్మల్నేదో అనబోయాడు.రాజేంద్రప్రసాద్ అతన్ని వారించి 'వాళ్ళంతా నా ఫ్యాన్సయ్యా' అన్నారు.

మాకు చాలా సంతోషం వేసింది.తనొక పెద్ద ఆర్టిస్టనే అహంభావం లేదు.నవ్వుతూ సరదాగా ఉండే మనిషి.'వద్దు సార్ ' అన్జెప్పి నోటుపుస్తకాల్లో ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ లు తీసుకున్నాం.
ఆటోగ్రాఫ్లిస్తూండగా తెల్ల చీర కట్టుకొని ఒక అమ్మాయొచ్చింది.పరిచయం ఉన్న మొహంలా కనిపించలేదు.అప్పటికి మాకెవరికీ సితార,జ్యోతిచిత్ర లాంటి పత్రికలు చదివే అలవాటు లేదు కాబట్టి ఆమెవరో తెలియలేదు.ఆవిడే కాదు,ఒక్క రాజేంద్రప్రసాద్ తప్పితే అక్కడ ఉన్న మిగతా సినిమాజనంలో ఎవరు ఆర్టిస్టులో,ఎవరు అసిస్టెంట్లో తెలియదు.ఆటోగ్రాఫ్ పొందిన ఆనందంతో మా ఛాతీలు ఉప్పొంగాయి.మేం వచ్చేశాం.

తర్వాత ఆ సినిమా షూటింగ్ చాలా సార్లు చూశాను.కొన్ని నెలల తేడాతో విడుదలైన ఆ సినిమా మంచి విజయాన్నే దక్కించుకొంది.

ఆ సినిమా 'చెట్టు కింద ప్లీడరు'.
ఆ అమ్మాయి హీరోయిన్ 'కిన్నెర'.

రాజేంద్రప్రసాద్ ని ఆ తర్వాత చాలాసార్లు చుశాను.'సీతాపతి ఛలో తిరుపతి ' సినిమా అయితే మా ఇంటిదగ్గరే తీశారు. వాణీవిశ్వనాథ్ ని చూడ్డానికి జనం ఎగబడ్డారు.మా నాన్నగారు ఆ సినిమాలో ఒక వేషం వెయ్యాల్సింది.కలెక్టర్ ప్రోగ్రాం ఉండటంతో కుదర్లేదు.

'స్నేహం' సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టిన రాజేంద్రప్రసాద్, తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు.వంశీ,జంధ్యాల,బాపు,రేలంగి నరసింహారావు,ఎస్వీ కృష్ణారెడ్డి,ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేషన్లలో ఎన్నో మరపురాని హిట్సందించారు.'ఏప్రిల్ 1 విడుదల(ఈ సినిమా పోస్టర్ చూసి,రిలీజ్ డేటేదో,సినిమా పేరేదో తెలుసుకోలేక తికమకపడ్డాను),ఆ ఒక్కటీ అడక్కు,

పెళ్ళిపుస్తకం,మిస్టర్ పెళ్ళాం,బృందావనం, మేడం,అప్పుల అప్పారావు,ఆలీబాబా అరడజను దొంగలు,కొబ్బరిబొండాం,రాజేంద్రుడు గజేంద్రుడు,మాయలోడు ' ఇలా బోల్డన్ని.ఒకవైపు కామెడీ హీరోగా ఏకచ్ఛత్త్రాదిపత్యం వహిస్తూనే 'ప్రేమతపస్సు', 'ఎర్రమందారం' లాంటి సినిమాల్లో నటించి తన నటనకు రెండు వైపులా పదునుందని నిరూపించుకున్నారు.పాత్ర ఏదైనా పండించగల ఆల్ రౌండర్ అనిపించుకున్నారు. పాటలు పాడి,కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా చేశారు.కొన్ని పొరపాట్లు చేసి అప్రధాన్య పాత్రలు సైతం వేశారు( శ్రీకాంత్ 'తాళి ',జగపతిబాబు 'చిలక్కొట్టుడు' లాంటివి).1996 నుంచి అనుకుంటాను ఆయన సినిమాలు వరుసగా పరాజయాల బాట పట్టినప్పుడు నేను చాలా బాధపడ్డాను.ఇటువంటి టాలెంటెడ్ హీరోని జనం మిస్సవ్వకూడదు అనుకున్నాను.అంతలో 'క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ' వచ్చింది.ఆ టైపు సినిమాలు కొన్ని వరుసగా వచ్చి(శ్రీరామచంద్రులు,సందడే సందడి)విజయం సాధించాయి.మళ్ళీ అపజయాలు.ఆ క్రమంలో కొంతగ్యాప్ తరువాత వచ్చిన ' ఆ నలుగురు ' మళ్ళీ నటకిరీటిని సత్తాని చాటింది.'మీ శ్రేయోభిలాషి ' కూడా మంచి ప్రయత్నమే.'క్విక్ గన్ మురుగన్' పర్లేదనిపించింది.

అందం,నటన రెండూ ఉండి దాదాపు ఒక దశాబ్దం పాటు(1985 లేడీస్ టైలర్ to 1996 వద్దు బావా తప్పు వరకు ) తిరుగులేని కామెడీహీరోగా వెలుగొందిన ఏకైక తెలుగు కథానాయకుడు రాజేంద్రప్రసాద్.మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు సైతం మానసికోల్లాసానికి ఆయన సినిమాలు చూసేవారంటే అంతకు మించిన అవార్డులు,రివార్డు ఏముంటాయి.రాజేంద్రప్రసాద్ ను పూర్తిస్థాయిలో రిప్లేస్ చేయ్యగల నటుడు ఇంకా తెలుగుసినీరంగానికి దొరకలేదు.భగవంతుడు ఆయనకు చిరాయువునిచ్చి మరిన్ని మంచి చిత్రాలలో నటింపజేసి మనల్నందరినీ అలరింపజెయ్యాలని ఆశిస్తూ...

ఒక అభిమాని.


(కొన్ని హాస్యసన్నివేశాలు)






వాల్మీకి ఉత్తరకాండకు, లవకుశ సినిమాకు గల తేడాలు


వాల్మీకి ఉత్తరకాండకు,మన ఎంటీవోడి లవకుశ సినిమాకు చాలా తేడాలున్నాయి.వాటితో పాటూ రావణుడి గురుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ పొందుపరిచాను.
  1. 1.   శూర్పణఖ విభీషణుడికి అక్క.

  2. 2.   రావణ, కుంభకర్ణ, శూర్పణఖా, విభీషణులు కన్యాపుత్రులు.

  3. 3.   మయుని కూతురు మండోదరి. ఆయన కోరిక మేరకే రావణుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. మామా అల్లుళ్ళకు యుద్ధం జరగదు ('భూకైలాస్' గుర్తొచ్చిందా).

  4. 4.   రావణుడు అంటే కైలాసాన్ని ఎత్తలేక బాధతో రావాలు చేసినవాడని(అరచినవాడని) అర్థం. అతని అసలు నామధేయం దశకంఠుడు.

  5. 5.   సీతాదేవి రావణుడి ఇంటి దగ్గర పుట్టదు. ఆమె మొదట దొరికేది జనక మహారాజుకే.

  6. 6.   శూర్పణఖ భర్తను రావణుడే చంపేస్తాడు. అయితే అది అనుకోకుండా జరుగుతుంది.

  7. 7.   యమధర్మరాజుకి రావణుడికి యుద్ధం జరుగుతుంది. యముడు ఆగ్రహించి యమదండం విసరబోతాడు. యమదండానికి ఎటువంటివారినైనా సంహరించే శక్తి ఉంది. అలాగే రావణుడికి మానవుల చేతిలో తప్ప అన్యుల చేతిలో చావు లేదు. బ్రహ్మ కలుగచేసుకొని యమున్ని వారించి, అతని చేత యుద్ధాన్ని విరమింపచేసి తను ఇచ్చిన రెండు వరాలలో ఏదీ నిష్ఫలమవకుండా చూస్తాడు.

  8. 8.   ఒక్క చాకలే కాదు, అయోధ్యా ప్రజలందరూ 'రావణుడి చెరలో ఎంతోకాలం గడిపిన సీతను రాముడు తెచ్చి ఏలుకున్నాడ 'ని కారుకూతలు కూస్తారు.

  9. 9.   కుశలవులు (కుశుడు పెద్దవాడు) జన్మించినప్పుడు శతృఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలోనే ఉంటాడు. లవణాసురున్ని అంతమొందించటానికి వెళ్తూ వాల్మీకి ఆశ్రమంలో ఆగుతాడు. సీతాదేవిని పరామర్శిస్తాడు కూడా.

  10. 10.   రాముడు అశ్వమేధయాగం తలపెట్టినది నైమిశారణ్యంలో. అయోధ్యలో కాదు.

  11. 11.   కుశలవులకు రాముడికి/రామసైన్యానికి మధ్య ఎటువంటి యుద్ధం జరుగదు. వారిద్దరూ యాగాశ్వాన్ని పట్టి బంధించటం అన్నది కూడా జరుగదు. అశ్వమేధయాగం సంధర్భంగా విచ్చేసిన కుశలవులు రామకథ రమ్యంగా గానం చేస్తుంటే, రాముడికి అనుమానం వచ్చి,'మీ తల్లిని వెంటబెట్టుకొని రండి ' అంటాడు. మరుసటి రోజు వాల్మీకి సీతా,కుశలవులతో వచ్చి సీత పాతివ్రత్యాన్ని శ్లాఘిస్తాడు. యాగానికి హాజరైన జనులందరి ముందూ తన పాతివ్రత్యాన్ని మళ్ళీ నిరూపించుకోవాలని శ్రీరాముడు సీతను కోరుతాడు. ఆ తరువాత జరిగేది మీకు తెలిసిందే.

  12. 12.   సీత పృథ్విలో ఐక్యమైన తరువాత కూడా రాముడు చాలాకాలం రాజ్యం చేస్తాడు. పదివేల అశ్వమేధయాగాలు పూర్తి చేస్తాడు.


వాల్మీకి రామాయణానికీ - వ్యవహార రామాయణానికీ గల తేడాలు


చాలా రోజుల తర్వాత ఉషశ్రీ రామాయణం చదివాను. ఎప్పటినుంచో ఆ పుస్తకం ఇంట్లో ఉన్నా తెలిసిన కథే కదా అని ఇన్నాళ్ళూ చదవడానికి పెద్దగా ఉత్సాహం చూపలేదు. ఆ మధ్య రామాయణం గురుంచి చర్చ వచ్చినప్పుడు వ్యవహారికంలో రామాయణానికి ఆపాదించబడ్డ చాలా విషయాలు మూలకథలో లేవని తెలిసింది. అప్పటి నుంచీ వాల్మీకి రామాయణం చదవాలని ఒకటే కోరిక. అయితే సరైన పుస్తకం ఏదీ అన్నదే ప్రశ్న. వెబ్ లో మైలవరపు శ్రీనివాసరావు గారు వ్రాసిన బాలకాండ చదివాను. ఎంతో చక్కగా ప్రతి విషయాన్ని, అందులోని భావాన్ని మనస్సుకు హత్తుకునేలా చెప్పారాయన. అది చదివాక 'మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని ' అర్థమయ్యింది. ఇన్నాళ్ళూ సినిమాలలో చూపిందో, లేక చిన్న చిన్న పుస్తకాలలో చదివిందో(బాలల బొమ్మల రామాయణం లాంటివి) అసలైన రామయణం అనుకునేవాన్ని. ఆ భ్రమలు తొలగించుకోవాలంటే వాల్మీకి రామాయణం చదవక తప్పదు అనిపించింది. ఉషశ్రీ రామాయణం దాని ఆధారంగా వ్రాసిందే కాబట్టి నిన్నా మొన్న కూర్చొని ఎకబిగిన చదివేశాను.రామాయణం యొక్క గొప్పదనం, అందులోని పాత్రల వైశిష్ట్యం తెలుసుకొని చాలా సంతోషం వేసింది.అలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామనే ఈ టపా.



  1. 1.   దశరథ మాహారాజుకు మొత్తం 353 భార్యలు.

  2. 2.   దశరథుడికి కైకంటే చాలా ఇష్టం. పట్టమహిషైన శ్రీరాముని తల్లి కౌసల్య కంటే కైకంటేనే ఆయనకు ప్రీతి. కౌసల్య పట్ల ఆయనకు ఉదాసీన భావం ఉండేది. రాణివాసంలో కైక మాటలకే ప్రాధాన్యత.

  3. 3.   దశరథ మహారాజు అశ్వమేధయాగం నిర్వర్తించి తరువాత పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు. ఆ సమయంలో రావణుడు మరొక యజ్ఞదీక్షలో ఉంటాడు. అందుకే దశరథుని యాగాశ్వాన్ని పట్టుకోకుండా వదిలేస్తాడు.

  4. 4.   తన వంశంలో పుట్టినవాడి చేతిలో మరణం తప్పదని ఇక్ష్వాకు వంశీయుడైన అనరణ్యుడు రావణున్ని శపిస్తాడు.రాముడు అదే వంశంలో పుడతాడు.

  5. 5.   రామ లక్ష్మణ భరత శతృఘ్నులు నలుగురిని పన్నెండు నెలలు(మాములుగా అయితే పది నెలలు) మోసి కంటారు కౌసల్య, కైకేయి, సుమిత్ర.

  6. 6.   బలపరాక్రమాలలో లక్ష్మణుడు రాముని తరువాతివాడు. భరతుడు వయసులో పెద్దవాడైన భుజబలంలో మాత్రం శతృఘ్నుడుకి సముడు .

  7. 7.   క్షీరసాగరమథనంలో ధన్వంతరి తరువాత ఉద్భవించిన వారు 60కోట్ల మంది అప్సరసలు. వీరిని ఎవ్వరూ వివాహమాడరు. సంచార వృత్తి కలిగివుంటారు. వీరి తర్వాత పుట్టినవి వారుణి(మద్యం), కౌస్తుభం.

  8. 8.   అహల్య వృత్తాంతం భిన్నంగా ఉంది. అహల్య అంటే ఎటువంటి వంకరలేని అందమైన స్త్రీ. ఆమె భర్త గౌతమ మహర్షి. ఆయన ఇంద్రపదవికి కావల్సిన సర్వవిజ్ఞానం పొందాక,ఆయన్ని పరీక్షించడానికి,నిజంగా కామక్రోధమదమాత్సర్యాలను జయించాడా అని కనుక్కోవడానికి ఇంద్రుడొక పథకం వేస్తాడు. ఆ ప్రకారం గౌతమునిలా వేషం ధరించి అహల్య చెంతకు వస్తాడు. అయితే తన పాతివ్రత్య బలంతో వచ్చినది ఇంద్రుడని గ్రహిస్తుంది అహల్య. ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఆమెతో కలవాలన్న తన కోర్కె తెలియజేస్తాడు. ఇక్కడ కలవటం అంటే మోక్షమివ్వటం అని అర్థం. శారీరక కలయిక కాదు. మోక్షమన్న మాటవినగానే క్షణకాలం పాటు ఆలోచిస్తుంది అహల్య. ఆమె మనస్సును క్షణకాలం చంచలం చెయ్యగలిగానే అనుకుని దేవేంద్రుడు నవ్వుతాడు. అహల్యకు అప్పుడు సత్యం బోధపడి 'నువ్వు వెళ్ళిపో' అని వేడుకుంటుంది. ఈ లోగా గౌతముడు అక్కడి వచ్చి పొరబడి,అవేశంతో ఇద్దరినీ శపిస్తాడు. ఆ విధంగా ఆయనకు ఇంద్రపదవి దూరమవుతుంది. ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ ఎవరికీ కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యి సంవత్సరాలు బ్రతకాలని గౌతముడు ఆమెను శపిస్తాడు. అంతేకానీ రాయివి కమ్మని శాపం ఇవ్వడు.అలాగే ఇంద్రుడున్ని వృషణహీనుడవుతావని శపిస్తాడు.

  9. 9.   శివధనుర్భంగం చేసి రాముడు సీతను వివాహమాడినప్పుడు మిగతా రాజకుమారులెవ్వరు అక్కడ లేరు. సీత కూడా విజయమాలతో నిల్చొని సిగ్గుపడుతూ సిద్ధంగా లేదు. సీతా స్వయంవరం అంతకు ముందే చాలా కాలంగా జరుగుతూ వస్తున్నది. ఎంతోమంది ప్రయత్నించి విఫలులయ్యారు. ఇంకొంతమంది యుద్ధానికి వస్తే వారిని జనకుడు ఓడించి పంపాడు. అలా కొంతకాలం గడిచాక విశ్వామిత్ర సహితులై రామలక్ష్మణులు మిథిలా నగరం వస్తారు. రాముడు ధనువునెక్కుపెట్టి విరిచేస్తాడు.

  10. 10.   రావణుడు సీతాస్వయంవరానికి రాలేదు. శివధనువును ఎక్కుపెట్టటం అపచారమనే భావంతో అతను మిన్నకుండిపోయాడని తెలుస్తోంది. తన తరువాత మరెవ్వరూ ఆ ధనువును ఎక్కపెట్టరాదనే శ్రీరాముడు దాన్ని విరిచేస్తాడు.

  11. 11.   వివాహమయ్యేనాటికి రాముని వయస్సు పన్నెండేళ్ళు. సీత వయసు ఐదేళ్ళు.

  12. 12.   పరశురామ గర్వభంగం సీతారాములు అయోధ్యకు వెళ్తూండగా మార్గమధ్యంలో జరుగుతుంది. జనకుడి రాజమందిరంలో కాదు.

  13. 13.   శ్రీరామున్ని వనవాసం చెయ్యమన్నందుకు ఆగ్రహించి లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ కైకను వధించటానికి కత్తి దూయరు. లక్ష్మణుడు ఆమె పరోక్షంలో ఆమెను,తండ్రిని నానామాటలంటాడు. భరతుడు తల్లిని మందలిస్తాడు.శతృఘ్నుడు మాత్రం మంధరను పాదతాడనం చేసి,భరతుడు వారిస్తే విడిచిపెడతాడు.

  14. 14.   వనవాసానికి వెళ్ళేనాటికి సీతారాముల వయస్సు 18,25 సంవత్సరాలు.

  15. 15.   దశరథుడు మరణించాక ఆయన దేహాన్ని పన్నెండురోజుల పాటూ తైలద్రోణంలో నిల్వ చేస్తారు. అంత్యక్రియలు చెయ్యడానికి కుమారులెవ్వరు అందుబాటులో లేకపోవటంతో భరత శతృఘ్నులు అయోధ్య వచ్చేవరకు శవం కుళ్ళి పోకుండా ఈ ఏర్పాట్లు చేస్తారు.

  16. 16.   నాస్తికవాదం రామాయణ కాలంలో కూడా ఉంది. రామున్ని అయోధ్యకు రప్పించటానికి భరతుడు సకల పరివారంతో వెళ్ళినప్పుడు జాబాలి అనే దశరథుని మంత్రి 'ఎవరు తండ్రి,ఎవరు తల్లి' అంటూ నాస్తికవాదం చేస్తాడు. దీన్ని శ్రీరాముడు నిరసించి,'మీవంటి వారిని నా తండ్రి ఎలా కొలువులో పెట్టుకున్నారో' అంటాడు.

  17. 17.   సీతారామలక్ష్మణులు వనవాసంలో మాంసాహారం తిన్నారు.

  18. 18.   ముక్కు చెవులు కోయబడ్డ శూర్పణఖ తన గోడు సోదరులైన ఖరదూషణాదులకు విన్నవించుకుంటుంది. ఆగ్రహంతో ససైన్యంగా వచ్చిన వారిని శ్రీరాముడు యమపురికి పంపిస్తాడు. అకంపనుడనే దూత ఈ సంగతంతా రావణుడికి చెప్పి,సీతాదేవి సౌందర్యం గురుంచి వివరించి, రామున్ని నిలువరించాలంటే సీతను అపహరించాలని ఉపాయం ఇస్తాడు. వాడి మాటలు విని రావణుడు వెళ్ళి మారీచున్ని కలుస్తాడు. మారీచుడు అతనికి హితబోధ చేసి పంపించేస్తాడు. శూర్పణఖ లంక వెళ్ళి రావణున్ని రెచ్చగొడుతుంది.

  19. 19.   జనబాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న లక్ష్మణరేఖ గురుంచి వాల్మీకి రామాయణంలో లేదు. లక్ష్మణుడు అటువంటి రేఖ ఏదీ గీయడు

  20. 20.   రావణుడు ఎడమచేత్తో సీత జుట్టుపట్టుకొని,కుడి చేత్తో ఆమెను ఎత్తుకొని పిశాచాల్లాంటి గాడిదలు పూంచిన రథంలో ఆమెను కూర్చోబెట్టి లంకకు తీసుకుపోతాడు.

  21. 21.   రావణుడితో తలపడక ముందే జటాయువు సీతారామలక్ష్మణులకు పరిచయం అవుతాడు. వారు పంచవటికి విచ్చేసినప్పుడు జాటయువు తనను తాను పరిచయం చేసుకుంటాడు.

  22. 22.   వాలి మహాబలవంతుడు. తనతో యుద్ధానికి సిద్ధపడిన రావణున్ని సైతం ఓడించి పంపిన పరాక్రమశాలి. అతనితో ఎవరు ముఖాముఖి తలపడినా వారి బలంలో సగం వాలికి చెందేటట్లు వరం ఉంది. చెట్టు చాటు నుంచి వాలిని వధించటానికి గల కారణాల్లో ఇదొకటి.

  23. 23.   కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి (అవతార్ గుర్తొచ్చిందా). అవి ఎక్కడబడితే అక్కడ వాలి విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా అపార ప్రాణనష్టం జరుగుతూండటంతో ఇంద్రుడు వాటి రెక్కలు కత్తరించివేస్తాడు.

  24. 24.   అశోకవనంలో అన్నపానీయాలు ముట్టని సీతాదేవికి రహస్యంగా అమృతం యిస్తూ రక్షిస్తాడు ఇంద్రుడు.

  25. 25.   రావణుడు మారువేషంలో వచ్చి రాముడికి యుద్ధ ముహూర్తం నిర్ణయించడు.శ్రీరాముడే యుద్ధముహూర్తం నిర్ణయించి లంకకు బయలుదేరుతాడు.

  26. 26.   యుద్ధారంభానికి ముందే కుంభకర్ణుడు నిండుసభకు వచ్చి రావణుడికి హితబోధ చేస్తాడు.

  27. 27.   రావణుడి ఉదరంలో అమృతభాండం ఉన్నట్లు,విభీషణుడి సలహాతోనో మరొకరి సలహాతోనో దాన్ని పగలగొట్టి, రావణున్ని సంహరించినట్లు ఇందులో లేదు. అగస్త్య మహర్షి సలహా మేరకు శ్రీరాముడు, సూర్యున్ని ధ్యానించి బాణప్రయోగం చేసి రావణుడి గుండె చీలుస్తాడు.


నేను కనుక్కున్న రహస్యం !!

సిద్ధార్థుడికి బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం అయినట్లు నిన్ననే నాకొక రహస్యం బోధపడింది.అదేంటంటే పుట్టిన ప్రతి మనిషీ కాస్త తీర్థం పుచ్చుకోక తప్పదు. తీర్థం అంటే గుళ్ళో ఇచ్చే తులసి తీర్థం కాదండోయ్.అక్షరాలా ఆల్కహాలే.ఆడైనా మగైనా ఎవరికైనా ఇది తప్పదు.అలాగని ఎవరూ తప్పించుకోనూలేరు.ఎంతంటి సంప్రదాయవాదులైనా,బిర్రబిగుసుకొని ఎంత మడిగట్టుకు కూర్చున్నా,'హరిహర బ్రహ్మాదులు సైతం నా చేత ఆ పని చెయ్యించలేర'ని భీషణ ప్రతిజ్ఞలు చేసినా మీకు తెలియకుండా మీరే కాస్త మందు పుచ్చుకొని వొళ్ళు తూలుతూంటే,గాల్లో తేలిపోవటం ఖాయం.

నాకైతే ఇది మొదటిసారి కాదు.

పెళ్ళికి ముందు కూడా ఒకసారి ఇలాగే దగ్గు వదలకుండా పట్టి పీడిస్తూంటే అప్పటి నా కాబొయే శ్రీమతి కోరిక మేరకు బెనిడ్రిల్ కాఫ్ సిరప్ తాగా(సామాన్యంగా జ్వరాలు,జలుబులు వస్తే నేను వెంటనే ఇంగ్లీషు మందులు వాడను.వీలైతే కాస్త గృహ వైద్యం చేసుకుంటాను.శరీరానికి కొంచెం తట్టుకొనే శక్తి ఉండాలని అలా చేస్తూంటానన్నమాట.ఇలాగే ఒకసారి జ్వరంతో వొళ్ళంతా చలిచలిగా ఉంటే,ముల్లుని ముల్లుతోనే తియ్యాలని, మా తమ్ముళ్ళతో కలిసి ఊరి చెరువులో మునకలేశాను.నా అదృష్టం బావుండి వెంటనే జ్వరం తగ్గిపోయింది).ఒక కప్ తాగితే తగ్గదేమోనని,రెండు మూడు కప్స్ తాగాను.ఆ రోజు రాత్రి లేట్ నైట్ బస్ పట్టుకొని తిరుపతి వెళ్ళాలి.ఇహ చూస్కొండి నా పరిస్థితి.ఒక వైపు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.ఇంకో వైపు వోళ్ళు సోలిపోతొంది.ఒక తాగుబోతులాగా నా రూం నుంచి లోంచి బయటపడి,వాలిపోతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరిచిపెట్టుకొనే ప్రయత్నం చేస్తూ అపసోపాలు పడతా వచ్చి ఆటో లో కూర్చున్నాను.అలాగే బస్టాండ్ చేరుకొని బస్సెక్కి నా సీట్లో వాలిపోయి నిద్రపోయాను.తిరుపతిలో దిగి,ఇంటికెళ్ళి నిద్రపోయి మళ్ళీ లేచాక కూడా ఆ హ్యాంగోవర్ వదల్లేదు.

చాలా రోజుల తర్వాత మళ్ళీ నిన్న అదే పరిస్థితి వచ్చింది.ఈ సారి కూడా వేడి పాలల్లో పసుపు మిరియాలపొడి కలుపుకొని తాగటం లాంటివి చేశాను కాని ఏమీ ఫలితం కనిపించలేదు.బెనిడ్రిల్ లో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుందని మా ఆవిడ వేరొక దగ్గుమందిచ్చింది.బెనిడ్రిల్ కాదు కదా అని చెప్పి ఈ మందు కూడా రెండు మూడు కప్స్ గటగటా తాగేశాను.కళ్ళు బైర్లు కమ్మటం,వొళ్ళు పట్టుతప్పిపోవటం,రాత్రంతా పడుకుని లేచి ఆఫీసుకెళ్ళాక కూడా నిద్ర ముంచుకురావటం..ఇలా చరిత్ర పునరావృత్తమైంది.

ఏతావాతా నాకు తెలిసిందేమిటంటే ఏ దగ్గుమందులోనైనా ఆల్కహాల్ ఉంటుందని.టేస్ట్ బావుంటుందని మూడు నాలుగు కప్స్ తాగితే ఒళ్ళు తూలటం తప్పదని.దీని సంగతేంటో తేల్చుకుందామనుకొని కొంతమంది మందుబాబులను కదిపితే వాళ్ళు చెప్పిందేమిటంటే బీరు బాటిల్లో కంటే దగ్గుమందులోనే ఆల్కహాల్ శాతం ఎక్కువుంటుందని.ఆల్కహాల్ వల్ల ప్రత్యక్ష లాభం లేకపోయినా,శరీరాన్ని రిలాక్స్ చేయ్యటం వల్ల దగ్గుకి ఉపశమనం దొరుకుతుందని దగ్గుమందులో వాడుతారట.

కాబట్టి పుట్టిన ప్రతి మనిషీ తాగక తప్పదు.ఆ మాటకొస్తే శైశవ దశలోనే మందు రుచి చూడక తప్పదు.ఇది అనివార్యం.భగవద్గీతలో చెప్పినట్లు 'ఇట్టి దాని గురుంచి శోకింప తగదు '.



బాలకృష్ణ - కె.విశ్వనాథ్ ల జననీ జన్మభూమి


రస్పర భిన్నధృవాలైన నందమూరి బాలకృష్ణ,కె.విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన ఏకైక చిత్రం జననీ జన్మభూమి.బాలనటుడిగా తెరంగేట్రం చేసి అడపాదడపా స్వంత సినిమాలలో ప్రాధాన్యమున్న పాత్రలలో తళుక్కున మెరిసిన బాలకృష్ణ సోలో హీరోగా తన ప్రస్థానం ప్రారంభించాక వచ్చిన మూడవ సినిమా ఇది.ఒకరు కళాత్మక చిత్రాలను అందంగా ఆవిక్ష్కరించిన దర్శకుడైతే,ఇంకొకరు విశ్వవిఖ్యాతనటుడికి నటవారసుడైన మాస్ హీరో (నిజానికి అప్పటికి ఏ ఘనవిజయాలు బాలయ్య స్వంతం కాకపోయినా,ఎన్.టి.యార్ కున్న పుష్కలమైన మాస్ ఇమేజ్, కొడుకుగా అతనికీ సంక్రమించింది).ఇటువంటి వ్యక్తుల కలయికలో సినిమా అంటే సినీప్రియులు ఉట్కంఠతతో ఎదురుచూడటం సహజం.అయితే ఈ చిత్రం సాదాసీదాగా సాగిపోయి అటు అభిమానుల్ని,ఇటు సగటు ప్రేక్షకుడిని నిరుత్సాహపరుస్తుంది.అసలు వీరి కాంబినేషన్లో ఒక సినిమా ఉందనే విషయం కుడా చాలామందికి తెలియదంటే అందులో వింతేమీ లేదు.

సినిమా అక్కడక్కడా బావుంటుంది.ప్రధానంగా ఆత్మ లోపించింది.పాశ్చత్య పోకడలు వంటబట్టించుకుని,ఏ పనీ పాటా లేకుండా సరదాగా గర్ల్ ఫ్రెండ్(సుమలత)తో గడిపే ఓ బిజినెస్ మాగ్నెట్ కొడుకు(బాలకృష్ణ),పై చదువుల కోసం అమెరికా వెళ్ళి,పూర్తిగా మారిపొయి స్వదేశం వచ్చి తమ వ్యాపారాల్లో మోసాల వల్ల ఇక్కట్లపాలౌతున్న నిరుపేద కుటుంబాలలో చైతన్యం తీసుకొచ్చి,తండ్రి (సత్యనారాయణ)కళ్ళు తెరిపించడం చిత్ర ఇతివృత్తం.ముఖ్యంగా నిరుద్యోగులైన యువతీయువకులకు సందేశాన్నివ్వాలనే సదుద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే కథనంలో లోపాల వల్ల అనుకున్న కార్యం నెరవేరలేదు.అల్లరి చిల్లరిగా ఉండే యువకుడు అమెరికా వెళ్ళి అకస్మాత్తుగా ఎందుకు మారిపోయాడన్నదానికి సరైన కారణం లేదు.విదేశీయులు సైతం తనదేశం గురుంచి గొప్పగా చెబుతూంటే విని మారిపోయానంటాడు హీరో.అక్కడే కథ తేలిపోయింది.తండ్రిలాగా కోడుకులు ఎక్కడ పూర్తిగా వ్యాపార ధోరణి అలవర్చుకుంటారో అని తల్లడిల్లే తల్లి(శారద),తన పెద్దకొడుకులో వచ్చిన మార్పుకి సంతోషించి,తండ్రి బాధ్యతలు చేపట్టేముందు, ప్రజల కష్టనష్టాలు తెలియాలంటే ఊళ్ళు చుట్టాలని సలహా యిస్తుంది.అలా జనరల్ కంపార్టుమెంట్ లో తన ప్రయాణం ప్రారంభించిన కథానాయకుడు ఒక పల్లెటూరు చేరుకొని,ఆ ఊరిని బాగుచెయ్యాలని నిర్ణయించుకోవడం,తనలాగే జులాయైన తమ్ముడికి(శుభలేఖ సుధాకర్) జ్ఞానోదయం కలిగించి అతనితో కలిసి అనేక కార్యక్రమాలలో పాల్గొని చైతన్యం తీసుకురావడం,ఊరి ప్రజల ఆదరాభిమానాలతో పాటు ఒక చేనేత కార్మికురాలి(రాజ్యలక్ష్మి) ప్రేమను సంపాదించటం,తండ్రికి తనకి మధ్య జరిగిన పోరాటంలో తమ్ముడిని కోల్పోవటం ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు. చిన్నకొడుకు మరణంతో కుమిలిపోయిన తండ్రి తన తప్పు తను తెలుసుకోవటంతో సినిమా సమాప్తమవుతుంది.

ఈ సినిమాలో హీరోయిజం లేదు.హీరోయిజం అంటే డాన్సులు,ఫైట్లు కాదు.క్యారేక్టర్ ఎలివేషన్ లేదు.అలాగే ఏ గ్లామర్ లేని రాజ్యలక్ష్మిని ప్రధాన కథానాయిక చేసి,సుమలత ని సైడ్ హీరోయిన్ కి పరిమితం చెయ్యటం ఇంకో తప్పు.చెప్పదల్చుకున్న విషయమేదో పూర్తిగా చెప్పకపోవడం(చేనేత కార్మికుల సమస్యలు,నిరుద్యోగుల సమస్యలు,అసాంఘిక శక్తుల చేతిలో పడి వారు సృష్టించే విధ్వంసం)మరో తప్పు.బలమైన ప్రతినాయకుడు లేకపోవటం తప్పున్నర తప్పు.సత్యనారాయణ విలన్ అన్నట్లు చెబుతారు కానీ,అతని విలనిజాన్ని ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు ఏమీ లేవు ఇంజనీర్లకు లంచాలివ్వడం తప్ప.గోకిన రామారావు పల్లెటూర్లో ఆకురౌడీ.అతనే శుభలేఖ సుధాకర్ చావుకు కారకుడవుతాడు.ఎంతో హోంవర్కు చేసి గాని సినిమా ప్రారంభించని కె.విశ్వనాథ్ గారు,ఈ సినిమా సబ్జెక్ట్ మీద ఇంకొంచెం పరిశోధన చేసివుంటే,వీరిద్దరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వచ్చుండేవేమో.

సామాన్యంగా విశ్వనాథ్ గారి సినిమాలలో సంగీతానికి పెద్ద పీట వేస్తారు.ఈ సినిమాలో పాటలు కూడా అంతంతమాత్రమే.ఇక ప్రధాన తారగణం నటన పాత్రోచితంగా ఉంది.ముఖ్యంగా బాలకృష్ణ నటన విస్మయపరుస్తుంది.సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమైనా ఉందంటే అది బాలకృష్ణ నటన ఒక్కటే.ఎంతో కంట్రోల్డ్ గా ఉండే ఆయన హావభావాలు,ఆయన నటనలోని మరో కోణాన్ని చూపుతాయి.మిగిలిన సినిమాలలోని నటనంతా ఒక ఎత్తు,ఇందులోని నటన ఇంకొకెత్తు అన్నట్లుంటుంది.ఇప్పుడు మనం చూస్తున్న బాలయ్య వేరు,ఈ సినిమాలోని బాలయ్య వేరు అన్నమాట.తర్వాత వచ్చిన 'మంగమ్మ గారి మనవడు' కంటే ముందు ఈ సినిమా హిట్టైయ్యుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదేమో.


సినిమాలోంచి ఒక సన్నివేశం ఇక్కడ.




బెంగుళూరులో అక్షరాభ్యాసం

క్షరాభ్యాసం!

అసలు ఆ ప్రక్రియే నాకు కొత్త !

దీని గురుంచి ఎవరో చెబితే వినటం,సినిమాల్లో చూడటమే తప్ప ప్రత్యక్షంగా అందులో పాల్గొన్నది ఎప్పుడూ లేదు.మాది రాయలసీమ గ్రామీణ నేపథ్యమున్న కుటుంబం కావటమే అందుకు ప్రధాన కారణం.ఇటువంటి ఆచారాలు పట్టింపులు మా పల్లెటూర్లో లేవు.ఏ మూడేళ్ళకో,ఐదేళ్ళకో మొక్కుబడిగా బళ్ళో చేర్పించడం తప్ప,దానికోసం ప్రత్యేకంగా అక్షరాభ్యాసం లాంటి పూజా కార్యక్రమాలు చెయ్యటం ఎవరికీ అలవాటు లేదు.అయితే ఇలాంటి పండుగకొకటి మా ఇంట్లోనూ జరిగితే బావుంటుందని నేను అనుకునేవాన్ని.మనకు అలవాటు లేకపోయినా,మంచి ఎక్కడున్నా స్వీకరించమని పెద్దలు చెప్పారు కదా.

ఆ రోజు రానే వచ్చింది.మా పాపకు అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించుకున్నాం,బాసరలో కాకుండా,బెంగుళూరులో.బెంగుళూరులో సరస్వతీదేవి ఆలయాలు ఉన్నాయా,కనీసం చిన్న గుడైనా వుందా, ఉంటే ఎక్కడుందో చెప్పమని మా కోలీగ్స్ ని ఆరాతీశాను.మిత్రులు నాలుగైదు గుళ్ళ పేర్లు చెప్పారు కానీ,నా మనస్సు మాత్రం ఒక గుడి చుట్టునే పరిభ్రమించింది.

అది చామరాజపేటలోని శ్రీ శారదాంబ గుడి.శివాంశ సంభూతుడైన ఆదిశంకరాచార్యులు శృంగేరి లో స్థాపించిన శారదా పీఠానికి అనుబంధ శాఖ ఈ గుడి.అమ్మవారి విగ్రహం దివ్యంగా ఉంటుంది.అలంకరణ విశేషంగా ఉంటుంది.శారదాంబతో పాటు,ఆదిశంకరునికి కూడా ఓ ఆలయం ఉందిక్కడ.చారిత్రాతక ప్రాశస్త్యమున్న ఆలయశాఖలో అక్షరాభ్యాసం చేయిస్తే శుభప్రదంగా ఉంటుందని భావించి అక్కడే చేయించాము.

లింకు

ఆక్షరాభ్యాసం చేయించాలనుకున్నవారు ముందుగా గుడికి వెళ్ళి,శారదాంబ ఆలయంలోని పూజారిని కలిసి తమ పిల్లల జన్మనక్షత్రాలు చెప్పి,వాటికి అనుకూలమైన మంచి రోజు చెప్పమని అడగాలి.ఈ వివరాలు ఫోన్లో వెల్లడించరు.పంచాంగం చూసి ఆయనొక తేదీ నిర్ణయించాక ఆలయ ప్రాంగణంలో ఆ తేదీకి టికెట్ కొనుక్కోవాలి.ధర 100 రూపాయిలు.టికెట్ తో పాటూ పూజకు కావల్సిన సరంజామా ఏంటొ ఒక లిస్టు యిస్తారు నిర్వాహకులు.ఆక్షరాభ్యాసం రోజు ఆ సామాన్లన్నీ పట్టుకొని అలయానికి హాజరైతే,మనం యిచ్చిన టోకెన్ల ప్రకరం పూజ నిర్వహిస్తారు.అరగంటసేపు పూజ కొనసాగుతుంది.రెండేసి జంటలను గర్భగుడి పక్కన కూర్చోబెట్టి పూజ చేయిస్తారు.మగవారు పంచెకట్టులోను(బనియన్ కి కూడా మినహాయింపు లేదు),ఆడవారు చీరలోను రావాలి.ఈ విషయంలో ఖచ్చితంగా ఉంటారు.లిస్టులో ఇచ్చిన పూజాసామగ్రి మొత్తం మీరు తీసుకెళ్ళకపోయినా,దక్షిణ కొంచెం తక్కువైనా ఎవరూ కోపగించుకోరు.ఉదయం 8-11 వరకు,సాయంత్రం 5-8 వరకు పూజారులు అందుబాటులో ఉంటారు.

శారదాంబ ఆలయానికి పక్కనే శృంగేరి పీఠం వారి బుక్ ట్రస్టుంది.ఆధ్యాత్మిక పుస్తకాల పట్ల అభిరుచి గల పాఠకులకు అక్కడ అనేక పుస్తకాలు లభ్యమవుతాయి.

చామరాజపేటకు మెజస్టిక్ నుంచి చాలా బస్సులున్నాయి.అక్కడినుంచి ఆటోలో వెళ్ళినా 20 రూపాయిల కంటే ఎక్కువ కాదు.


పులి (వాటర్ పెయింటింగ్)


ది నేను ఇంటర్మీడియట్లో ఉండగా వేసిన బొమ్మ.'ఈనాడు' ఆదివారం మ్యాగ్ జైన్లోని ఫోటో ని చూసి చిత్రించిన చిత్రం ఇది. వేరొక పుస్తకంలో రఫ్ గా వేసుకొన్న నా ఫోటో స్కెచ్ ని మా నాన్నగారు కట్ చేసి ఈ పెయింటింగ్లో ఇరికించి ఫ్రేం చేయించారు.


తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వేలి - ఉగాది మ్యాగ్ జైన్లో నా కవితలు

పాత కవితలే అయినా మళ్ళీ ప్రచురించిన రవి పొట్లూరి గారికి నా కృతజ్ఞతలు.'తపస్వీ కళ్ళుతెరు' కవితలో చివరి రెండు వాక్యాలు 'ఆమె' కవితకు సంబంధించినవి.

Kavitalu


భేతాళ ప్రశ్నలు


చాన్నాళ్ళ తర్వాత నా బాల్యమిత్రుడు దివాకరం హైదరాబాద్ వచ్చాడు.కోల్ కత్తాలో ఉద్యోగం.ఏదో పని మీద హైదరాబాద్ వచ్చి పొద్దున్నే ఫ్లైటు దిగేశాడు.వారం రోజులు ముందే వస్తున్నానని చెప్పేశాడు కాబట్టి తప్పించుకోడానికి వేరే దారిలేక శంషాబాద్ దాకా కారులోపోయి అతన్ని రిసీవ్ చేసుకొని మా ఇంటికి తీసుకొచ్చాను.

దివాకరం సత్తెకాలపు మనిషి.తనేదో,తనపనేదో అన్నట్లు ఉంటాడు.బాహ్య ప్రపంచంతో తనకెంత అవసరమో అంత మేరకే సంబంధబాంధవ్యాలు పెట్టుకొని,మిగతా సమయాల్లో,శత్రుభయం కలిగినప్పుడు డిప్పలోకి శరీరాన్ని లాక్కొనే కూర్మంలా తన లోకంలోకి జారిపోతాడు.ఆ తర్వాత,ఇల్లు కూలిపోతున్నా,ప్రపంచం తలక్రిందులైపోతున్నా అతనికి పట్టదు.పట్టించుకోవాలన్న ఆసక్తి ఉండదు.అంచేత కరెంట్ అఫైర్స్ లో కొంచెం వీకే.

స్నానాలు చేసి,టిఫన్లు గట్ర ముగించాక 'బ్రేవ్' మని తేంచి
"ఊళ్ళో మాంచి సినిమా ఎదైనా ఉంటే చెప్ప రా, చూసి చాన్నాళ్ళయ్యింది.వెళ్దాం" అన్నాడు హఠాత్తుగా.

నాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.
"సినిమానా..ఇప్పుడా?..కుదరదు" అన్నాను తమాయించుకొని.

"అవున్లే.అసలే ఎండలు మండిపోతున్నాయి.దానికి తగ్గట్లు ఇప్పుడొచ్చే సినిమాల్లో కొత్తదనం ఉండటం లేదు.రోట్లో తలదూర్చి రోకలిపోటుకి ఏడవడమెందుకు? చల్లగా ఇంటిపట్టునే ఉండి సాయంత్రం అలా టాంక్ బండ్ వైపో రవీంద్రభారతి వైపో వెళ్దాం.కాస్త కాలాక్షేపం గా ఉంటుంది."

"అదీ కుదరదు !"

"అదీ కుదరదా? అదేమిట్రా అలా అంటావ్? హఠాత్తుగా ఊడిపడి నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నానా ?"

"ఎంతమాటనేశావ్ రా! స్నేహగుణంలో కర్ణుడి లాంటి వాన్ని.నన్నే శంకిస్తావా?"

"శంకించక ఏం చెయ్యమంటావ్? ఆర్నెళ్ళ క్రితం హైదరాబాదు వస్తే అప్పుడూ ఇలానే అన్నావు.ఇప్పుడూ అదే అంటున్నావ్.మళ్ళీ కర్ణుడినంటూ కబుర్లు.అసలు నీకు నాతో సరదాగా సమయం గడపాలనుందా లేదా?"

"అదా నీ అనుమానం.ఏం చెయ్యమంటావ్రా బాబు? మా ఖర్మ అలా తగలడింది.అప్పుడేమో మాహానుభావుడు చిదంబరం నిప్పురాజేశాడు.రోజు మార్చి రోజు బందులతో సతమతమయ్యి చచ్చాం.తుమ్మితే బందు,దగ్గితే బందు.వాళ్ళకేం దుక్కలా పుష్టిగా బానే ఉంటారు.కూలీనాలీ చేసుకునే కార్మికులే మధ్యలో ఖర్చైపోతున్నారు.ఇప్పుడేదో కాస్త ప్రశాంతంగా ఉందనుకుంటే ఓదార్పుయాత్రల వల్ల మళ్ళీ బందులు మొదలయ్యాయి."

"ఓదార్పుయాత్రా? తీర్థయాత్రలు,దండయాత్రలు విన్నాం కానీ ఈ ఓదార్పుయాత్ర ఏంట్రా,ఎప్పుడూ వినలేదు."

"నువ్వే కాదు,మొన్నటిదాకా ఎవరూ వినలేదు.ఇదో కొత్తసీసాలో పాతసారాయి టైపు కాన్సెప్టు లే.దుఃఖం లో ఉన్న వాళ్ళని ఓదార్చి రావటం,వీలైతే వాళ్ళకేదైనా నష్టపరిహారం ఇవ్వడం అన్నమాట.చెప్పుకోడానికి సింపుల్ గానే ఉన్నా, ఆచరణలో మాత్రం ఇందాక నువ్వు లిస్టు చేసిన రెండు యాత్రలలో,రెండో దానికి కాస్త దగ్గరగా ఉంటుంది."

"అంతా అయోమయంగా ఉంది.దుఃఖం లో ఉన్న వాళ్ళని ఓదార్చి రావటామా? ఎవరు దుఃఖంలో ఉన్నారు? ఎవరు ఓదారుస్తున్నారు? కాస్తా అర్థమయ్యేలా చెప్పరా బాబు"

"ఇదిగో ఇదే నీతో వచ్చిన చిక్కు.మునీంద్రుడిలా ముక్కుమూసుకొని నీ లోకంలో నువ్వు తప్పస్సు చేసుకోకుండా అప్పుడప్పుడూ జన జీవనస్రవంతిలోకి రా.అన్ని విషయాలూ అవగతమవుతాయి.నాకీ కంఠశోష తప్పుతుంది.ప్రస్తుతానికి తప్పదు కాబట్టి ,చెప్తాను విను.పొయిన సంవత్సరం సెప్టంబరులో జరిగిన ఘోర ప్రమాదంలో వైయస్సర్ దుర్మరణం పాలయ్యారు కదా ?"

"అవున్రా పాపం.అంత అర్థాంతరంగా పోతారని ఎవరూ ఊహించలేదు."

"మరే.'అయ్యో! ఇలా జరిగిందేమిట'ని అప్పుడు అంతా బాధపడ్డారు.తట్టుకోలేని అభిమానులు గుండెలాగిమరణిస్తే,ఇంకొంత మంది ఆత్మహత్య
చేసుకున్నారు.కూలీనాలీ చేసుకునే శ్రామికుల దగ్గర్నుంచి కార్లలో తిరిగే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు దాక,అనకాపల్లి నుంచి అమెరికా దాక ఇదే తంతు అనుకో."

"జనాదరణ ఉన్న నాయకుడు కదా,హఠాత్తుగా పోయేసరికి జీర్ణించుకోవడం కష్టమయ్యుంటుంది.అయినా నీ పిచ్చిగానీ అభిమానానికి ఎల్లలేమిట్రా?"

"నిజమే.ఆ అభిమానం శృతిమించే ఆరొందల మంది ప్రాణాలు కోల్పోయారు."

"ఆరొందల మందే !!!!"

"అవున్రా.పదో పరకో కాదు,యాభైయ్యో వందా కాదు.అక్షరాలా ఆరొందల పైచిలుకు మంది అశువులు బాసారు !".

"ఏంట్రా నువ్వనేది ?! మనుషులనుకున్నావా,పిట్టలనుకున్నావా? అరోందల మందేంటి,ఉట్టి పుణ్యానికి ప్రాణాలు కోల్పోవడం ఏంటి? గాంధీ నెహ్రూ లాంటి దేశనాయకులు,మదర్ థెరీసా లాంటి మనవతామూర్తులు చనిపోయినప్పుడే అంతమంది మరణించలేదు.వినడానికే విడ్డూరంగా ఉంది.యావరేజి సినిమాకి చూపించే హైప్డ్ కలెక్షన్స్ లా ఉన్నాయి ఈ లెక్కలు.నిజంగా అంతమంది పోయారంటావా?"

"ఇదిగో నువ్వలా భేతాళ ప్రశ్నలు వేస్తే నేను చెప్పనంతే."

"బాబ్బాబు.అంత మాటనకు."

"అయితే విను.తండ్రి కోసం ప్రాణాలు తృణప్రాయంగా వదిలేసిన వీరాభిమానుల్ని చూసి జగన్ మనస్సు క్షోభించింది.చనిపోయిన ఆభిమానుల కుటుంబాలనన్న్నిటినీ పరామర్శించి,వాళ్ళను ఓదార్చి,బుగ్గలు నిమిరి,ఆత్మవిశ్వాసం నింపిరావాలని కంకణం కట్టుకున్నారు.అందుకే ఈ ఓదార్పుయాత్ర.ఎండా వానా లెక్కచెయ్యని మొండి బాటసారిలా గత వారం రోజులుగా ఆయన ఊళ్ళన్నీ చెడామడా తిరిగేస్తున్నారు.
అందులో భాగాంగా తెలంగాణలో అడుగుపెట్టారు."

"తండ్రికి తగ్గ తనయుడన్నమాట.మంచిదే కదా ?!"

"ఏం మంచో ఏమో కానీ,గిట్టని వాళ్ళు చాలా అనుకుంటున్నారు."

"గిట్టని వాళ్ళెప్పుడూ ఏదో ఒకటి అంటార్లే.లోకులు కాకులు అన్నారు కాదా.ఏమనుకుంటున్నారింతకీ ?"

"ఏముంది? 'ఓదార్పుయాత్రకింత మందీ మార్బలం దేనికి? హంగామా,మీడియా కవరేజి దేనికి? రాజకీయ ప్రసంగాలు దేనికి? ఇది ఓదార్పుయాత్రా,ఎన్నికల పర్యటనా? నిజంగా ఓదార్చాలనుకున్న వాళ్ళెవరూ ఇంత పబ్లిసిటీ ఇచ్చుకోరు.
ఓదార్చాలనుకున్నవాడు తన స్థాయికి తగ్గట్టు ఏ విమానంలోనో, హెలికాప్టర్లోనో, అధమపక్షం స్వంతవాహనాల్లోనో రాక,ఇలా రైలుపెట్టెల్లో తిరిగి,సాధారణ ప్రజానీకాన్ని ఇబ్బందులపాలు చెయ్యడం దేనికని' చెవులు కొరుక్కుంటున్నారు."

"పాయింటే!అయితే దానికీ,తెలంగాణకీ,ఇప్పుడీ బంద్ కీ సంబంధం ఏమిటి? "

"అక్కడికే వస్తున్నా.జగన్ సమైక్యవాది కదా.తెలంగాణలో వచ్చి ఆయన ఓదార్పేదో ఆయన చేసుకోకుండా ఎక్కడ సమైక్యవాదాన్ని ప్రచారం చేస్తాడో అని తెలంగాణవాదులు భయపడుతున్నారు.ప్రత్యేక తెలంగాణ కోసం టీఆరెస్ ఎమ్మెల్యేలు,ఎంపీలు బోలెడన్ని నిరాహారదీక్షలు,ధర్నాలు చేసి రాజీనామాలు చేసేశారు కదా."

"తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి టీఆరెస్ రాజీనామాల కేంలే.పదవిలో ఉండి వాళ్ళు పొడిచిందేమీ లేదు.కార్మికశాఖా మంత్రిగా కేంద్రంలో కేసియార్ నిర్వాకం చుశాం కదా.తప్పిపోయాడని వాళ్ళ పార్టీ వాళ్ళే పోలీస్ స్టేషన్లో రిపోర్టులిచ్చుకున్నారు.వాళ్ళ సంగతి చెప్పకు.నిరాహార దీక్షలు,ధర్నాలు అంటున్నావు.ఎవరైనా పోయారా?"

"నాయకులెవరూ పోలేదు కానీ,విద్యార్ధులు చాలా మంది అత్మహత్యలు చేసుకున్నారు"

"అరెరె...విద్యార్థులు చనిపోయారా? కామన్ సెన్స్ ఉన్నవాడెవడు కేసియార్ ని నమ్మడే.వాళ్ళెలా ఈ చట్రంలో ఇరుక్కున్నారు ?"

"పిచ్చివాడా! ఏ ఉద్యమంలోనైనా బలిపశువులయ్యేది కార్యకర్తలు,విద్యార్థులే.పథకం రూపొందించటం నాయకుల వంతైతే,ఆ నాయకుల్ని గుడ్డిగా నమ్మి వాళ్ళ కోసం,జీవితాలని పణంగా పెట్టేది కార్యకర్తలూ,విద్యార్థులే.తన అస్థిత్వం నిలుపుకోవడం కోసం కేసియార్ మొదలుపెట్టిన రాజకీయ డ్రామా,విద్యార్థుల రంగప్రవేశంతో సీరియస్నెస్ సంతరించుకొని ఇప్పుడు అతన్నే ధిక్కరించే స్థాయికి చేరుకొంది.
విద్యార్థుల భవిష్యత్తుకు దిక్సూచి కావల్సిన విద్యారంగం బ్రష్టుపట్టిపోయింది.కోదండరాం లాంటి ప్రొఫెసర్లు,లెక్చరర్లు ఉన్నవీ లేనివి చెప్పి విద్యార్థుల భావావేశాలు రెచ్చగొట్టి, నిస్సుగ్గుగా వినోదం చూస్తున్నారు."

"ఏమిటేమిటీ ? గురువులే ఉన్నవీ లేనివీ చెప్పి విద్యార్థులను ఉసిగొల్పుతున్నారా? ఏం చెబుతున్నారు?"

"చాలా చెబుతున్నార్లే! మచ్చుకొకటి.తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయట."

"అదెలా సాధ్యం? తెలంగాణా వారికే ఉద్యోగం ఇవ్వాలనుకున్నా ఇప్పుడు తెలంగాణ జనాభా ఎంత? వాళ్ళలో తాతముత్తాతల కాలం నుంచీ తెలంగాణలో ఉంటున్నదని ఎందరు? వలసవాదులెంతమంది? ఉన్న ప్రభుత్వోద్యోగాలు ఎన్ని? తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రులని ఏం చెయ్యమంటున్నారు కదా,మరి వాళ్ళ ఉద్యోగాల సంగతేంటి? అసలిది జరిగేపనేనా ?"

"చంపావు ఫో! అన్ని తెలివితేటలు ఎవరికి ఏడ్చాయి.ఎవడి అజెండా వాడు విద్యార్థుల మీదకు రుద్దుతున్నాడు.శివాలెత్తిన విద్యార్థులు విచక్షణాజ్ఞానం కోల్పోయి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు.ప్రజాప్రతినిధుల్ని రాజీనామా చెయ్యమని బెదిరిస్తున్నారు"

"ఇంతకీ అసలైన వాళ్ళు రాజీనామా చేశారా? "

"అసలైన వాళ్ళా ? వాళ్ళెవరు ? "

"తెలంగాణ పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులుగా తమను తాము గ్లోరిఫై చేసుకున్నకోదండరాం,ఆయనతో పాటూ ఉద్యమాలు చేస్తున్న ఇతర ప్రొఫెసర్లు,లెక్చరర్లు"

"లేదు"

"మరి ఏ అర్హతతో ఇతరులను రాజీనామా చెయ్యమని బెదిరిస్తున్నారు? ఇతరులకు చెప్పడానికేనా నీతులు?"

"నీ బుర్రకివాళ ఏదో అయిందిరోయ్."

"జగన్ విషయం మధ్యలోనే వదిలేశావు."

"వదిలేయ్యలేదు.అది చెబుతూంటేనే యక్ష ప్రశ్నలతో నువ్వు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశావు.టీఆరెస్ నాయకులంతా రాజీనామాలు చేసేశారు.ఇతరులెవ్వరూ తమకు ఎదురుగా పోటికి నిలబడరాదని,నిలబడితే తెలంగాణా ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.వేరుపడాలన్న కాంక్ష ప్రజల గుండెల్లో బలంగా రగులుతున్నంతవరకూ
వాళ్ళ ఆటలు సాగుతాయి.ఆ మంటలు చల్లారిపోకుండా అప్పుడప్పుడు సినిమా షూటింగ్స్ పైనో,థియేటర్ల పైనో, లేక కాలేజీల పైనో దాడి చేసి ప్రజల్ని రెచ్చగొడుతూంటారు.త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.ఇలాంటి సమయంలో జగన్ వచ్చి సమైక్యవాదం ప్రచారం చేస్తే,జనాల మనస్సు ఏకొంచెమైనా మారితే, తమ పని రెంటికీ చెడ్డ రేవడి లా తయారవుతుందని అతని ఫ్లెక్సీలు,బ్యానర్లు దగ్ధం చేసి,రావటానికి వీళ్ళేదని అల్టిమేటం జారీ చేశారు."

"ఇదేం అన్యాయంరా ? తెలంగాణ ఏమైనా పాకిస్తానా? అక్కడికి వెళ్ళడానికి పాస్ పోర్టు,వీసా కావాలా? దేశంలో ఎక్కడైనా,ఎప్పుడైనా తిరిగే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది.తెలంగాణవాదులు సీమాంధ్రలలో పర్యటించి తమ వాదాన్ని ప్రచారం చేసుకోవచ్చు.సమైక్యవాదులెవరైనా తెలంగాణ వచ్చి తమ గోడు వెల్లబోసుకోవచ్చు.

కాదనడానికి వీళ్ళెవరు? వీళ్ళకేం హక్కుంది? సినిమా షూటింగ్స్ పైన,కాలేజీల పైన దాడి చెయ్యడమేంటి? సినిమాలు రిలీజైతే థియేటర్ల మీద పడటం ఏంటి? చూడాలనుకున్న వాడు సినిమా చూస్తాడు.ఇష్టం లేనివాడు ఇంట్లో కూర్చుంటాడు.మధ్యలో వీళ్ళ పెత్తనమేమిటి? అంటే సినిమాలు చూస్తేనో,ఫలానా కాలేజిలో చదువుకుంటేనో తెలంగాణా ఉద్యమం నీరుగారిపొతుందా? అంత బలహీనమైనదా ఉద్యమం ? అటువంటప్పుడు దాన్ని మొయ్యటం దేనికి? ఇతరులెవ్వరు ఎన్నికల్లో పోటీ చెయ్యరాదా ? ఏం పోటికి దిగితే గెలవలేమని భయమా? ఇంత జరుగుతూంటే లాయర్లు,పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఎలా చూస్తూ కూర్చొంది?"

"ఒరెయ్ ఒరెయ్ అంతలా ఆవేశపడకు.నిదానించు.వ్యవస్థను సమూలంగా పెల్లగించేసే ప్రాథమిక ప్రశ్నలే లేవదీశావు కానీ నా దగ్గర జవాబులు లేవు.లాయార్లు,పోలీసులు మాత్రం మనుషులు కారా? వాళ్ళకూ ఇష్టాయిష్టాలు ఉండవా? ప్రభుత్వమా? భలేవాడివే.ఆయనే ఉంటే మంగలి దేనికని ప్రభుత్వమంటూ ఒకటేడిస్తే ఈ దుస్థితి దేనికి? నిన్న జరిగిన ఓదార్పుయాత్రలో తెలంగాణవాదులు,జగన్ వర్గీయులు ఇష్టమొచ్చినట్లు కొట్టుకుంటే,పదుల సంఖ్యలో నిలిచిపోయిన ట్రైన్లలో తిండీ నీళ్ళు దొరక్క అమాయకజనం అలమటించిపోయారు.కొంతమందికి బుల్లెట్ దెబ్బలు తగిలి విలవిలలాడిపోయారు.జగన్ కారణంగా గొడవలు జరిగి జనం గాయపడ్డారని ఇటు తెలంగాణలో,జగన్ ని అరెస్టు చేశారని అటు సీమలో బలవంతంగా బంద్ చేయిస్తున్నారు.కొంతమంది రైళ్ళకు నిప్పు పెట్టారు.ఇట్లాగే గత డిసెంబరులో,అటు తెలంగాణలో,ఇటు సీమాంధ్రలో, బస్సులు ధ్వంసం చేసి నిప్పు పెడితే,నష్టాలు పూడ్చుకోలేక ఆర్టిసీ రేట్లు పెంచి ప్రజల నడ్డివిరిచింది.ధ్వంసం చేసిందెవరు,శిక్ష అనుభవిస్తున్నదెవరు ?ఎవరు చేసుకున్న పాపం ఇది ? "

"దారుణం! అసలిది ప్రజాస్వామ్యమా లేకా నిరంకుశత్వమా ? ఆపత్కాలంలో నిజానిజాలు వెలికితీసి ప్రజలకు సత్యం బోధపరచి చైతన్యవంతుల్ని చెయ్యాల్సిన మీడియా ఏం చేస్తోంది ? "

"సరిపోయింది.అడగాల్సిన దాని గురుంచే అడిగావులే.మీడియా అంటేనే మాయాజాలం.నిజాన్ని నిర్భయంగా వెల్లడించే రోజులు ఎప్పుడో పోయాయి.

ఇప్పుడున్నదంతా స్వార్థం.ఒకళ్ళ మీద ఒకరికి బురదజల్లుకోడానికే తీరిక లేదు,ఇక వార్తలు సేకరించేదెవరు? ఏ వార్తయినా ఒకేవిధంగా అన్ని పేపర్లలోనూ,ఛానళ్ళలోనూ రావడం చూశావా? ఒక్కోక్కరిది ఒక్కో వర్షన్. ఏది నిజమో,ఏది అబద్ధమో ఎవడికి తెలుసు? "

"వ్యవస్థలన్నీ నాశనమైపోయాయన్నమాట.లాభం లేదు. నాకొక్కటే ఉపాయం కనిపిస్తోంది."

"ఏమిట్రా అది?"

"తాటిమట్ట లాంటి నాలుకలతో రెచ్చగొట్టే ప్రకటనలు చేసే నాయకులను,వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్టు చేసి జైల్లో వెయ్యాలి.విద్యార్థుల ఉద్వేగాలతో ఆడుకుంటూ ఉద్యోగాలు చేసుకునే లెక్చరర్లను,ప్రొఫెసర్లని విధుల నుంచి తొలగించి ఇతరులతో రిప్లేస్ చెయ్యాలి.రాష్ట్రంలో నిరుద్యోగం ఆ విధంగానైన కొంత తగ్గుతుంది.ఇక ప్రభుత్వ ఆస్తులను,ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తే,కఠిన కారాగార శిక్ష విధించి,నష్టపరిహారం నిందితుల దగ్గర్నుంచే ముక్కుపిండి వసూలు చెయ్యాలి.ఉద్యమాలంటూ ఉన్మాద ప్రవృత్తితో ప్రవర్తించే విద్యార్థులను రెండు మూడు వార్నింగులిచ్చి,రిపీటయితే కళాశాల నుంచి డీబార్ చెయ్యాలి.కళాశాలలు సంఘవిద్రోహ శక్తులకు వసతిగృహాల్లా మారిపోకుండా డేగకళ్ళతో పర్యవేక్షించాలి."

"ఒరేయ్ ఒరేయ్ నన్ను కాస్త ఊపిరిపీల్చుకోనియ్యి.ఇదంతా చెబుతోంది నువ్వేనా? ఏమీ పట్టనట్లుండే నీలో ఇంతటి ఆవేశమా ?"

"ప్రజలు కూడా నాలాంటి వాళ్ళేరా.వాళ్ళు కూడా అన్నీ గమనిస్తూ మౌనంగా ఉంటారు.సహనం నశించి తిక్కరేగితే మెత్తటి చెప్పుతో గట్టిగా బుద్ధిచెబుతారు"

"ఏదో నీ తాపత్రయం కానీ,ఆ రోజొస్తుందంటావా?"

"రాకపోతే మన రాష్ట్రం ఇంకో పాతికేళ్ళు వెనక్కిబడిపోయి,బీహార్ లా తయారవుతుంది."

"సర్లే! మాంచి వేడిమీదున్నట్లున్నావ్.టీవీ పెడతాను.కొంచెం చల్లబడు"

"ఆగాగు.ఏంటో బ్రేకింగ్ న్యూసట.స్క్రోలింగ్ వేస్తున్నారు...సరిగ్గా కనిపించడం లేదు"

"మరేం లేదు.జగన్ ఓదార్పుయాత్ర రద్దయిందని తెలిసి గుండె ఆగి కొంతమంది అభిమానులు మరణించారట..అరె..అదేమిట్రా అలా కూలబడిపోయావ్.ఏమయింది? "

" ఉన్నట్లుండి గుండె పట్టేసినట్లుంది."

"గుండెలో పట్టేసిందా! ఒక్క నిమిషం ఓపికపట్టరోయ్.యువ ఎంపి గారి ఓదార్పు లిస్టు అప్డేటు చెయ్యాలి.సమయానికి నా మొబైల్ ఫోను ఎక్కడ చచ్చిందో ఏంటో"

"హతోస్మి!! "


వక్రతుండం మహాకాయం (వాటర్ పెయింటింగ్)


ఫ్రేం పగిలిపోయింది మధ్యలో.


యండమూరి వీరేంద్రనాథ్ - ప్రేమ


నభైలలో అనుకుంటా,ఆంధ్రభూమి వారపత్రిక నలుగురు లబ్దప్రతిష్ఠులైన రచయితల(త్రుల)తో 'ప్రేమ' అనే నవలకు శ్రీకారం చుట్టింది. అలాగని ఇది గొలుసునవల కాదు. నలుగురూ భిన్న కథాంశాలు ఎన్నుకొని, ప్రేమని ఎలివేట్ చేస్తూ, అదే పేరుతో నవల వ్రాయాలి. ఎవరి కథలు వారివే అన్నమాట. అలా వ్రాసిన నవలే ఇది. ఆ నలుగురిలో నాకు గుర్తున్నదని ఇద్దరు. ఒకరు యద్దనపూడి, ఇంకొకరు యండమూరి. ప్రేమ మీద యండమూరి చేసిన రచనలలో సాదాసీదాగా అనిపించిన రచన ఇది.

కథ

వేదసంహిత అనే అందమైన అమ్మాయి అద్దె ఇల్లు కోసం ఆదిత్యపురం అనే గ్రామానికి రావటంతో కథ ప్రారంభం అవుతుంది.అంత అందమైన ఒంటరి ఆడపిల్లకు ఆశ్రయం ఇవ్వటానికి అంతా సందేహిస్తే,చలం అనే యువకుడు ఆమె అందానికి ముగ్ధుడై అమె పల్లెటూళ్ళో రీసెర్చ్ చెయ్యటానికి వచ్చిందని అబద్ధం చెబుతాడు.సోమయాజులు దయతలచి తన ఇంట్లో ఆమెకు చోటు కల్పిస్తారు.


చలం ఆమెను మూగగా ప్రేమిస్తూంటాడు.సోమయాజులు గారి కూతురు భారతి.ఒకరోజు అందరూ పొలాల్లో సంతోషంగా గడుపుతున్న సమయంలో,హఠాత్తుగా భారతి జలగ బారిన పడుతుంది. ఏం చెయ్యలో పాలుపోక అందరూ వృధా ప్రయత్నాలు చేస్తూంటే,అరుణ్ అనే యువకుడు వచ్చి ఆమెను రక్షిస్తాడు.వేదసంహితతో అతనికి పరిచయం కలుగుతుంది.అతను అంత్రోపాలజీలో మాస్టర్స్ చేసివుండటంతో వారి మధ్య కబుర్లు పెరిగి ఊళ్ళో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.ఇద్దరూ కలిసి పని మీద ఒకరోజు పట్నం వెళ్తారు.సంహిత అరుణ్ కి తెలియకుండా తన నగలు కుదువపెట్టబోతుంటే, అతను వారించి ఆమె నగలు ఆమెకు ఇప్పిస్తాడు.వారిద్దరూ కలిసి తిరగడం చూసి చలం ఊక్రోషానికి గురవుతాడు.తన ప్రేమను వెల్లడి చేస్తాడు.సంహిత షాకయ్యి తను వివాహితురాలని చెబుతుంది.ఒక వ్యక్తి మీద,ఒక వ్యవస్థ మీద తను వ్రాసిన థీసిస్ అతని చేతిలో పెట్టి అది చదువమంటుంది.చలం కొయ్యబారిపోతాడు.ఓ సాయంత్రం సంహిత కాఫీ తేవడానికి వెళ్ళినప్పుడు ఆమెకు వచ్చిన ఉత్తరం చదువుతాడు అరుణ్.ఆమె అతనితో గొడవేసుకుంటుంది.ఆమె మీద తనకున్న వ్యామోహాన్ని వ్యక్తం చేస్తాడు అరుణ్.వాదులాట జరిగి కోపంతో వెళ్ళిపోయిన అతను,ఆమె మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తాడు.


అభిషేక్ ఆదిత్యపురం వస్తాడు.వేదసంహిత భర్తగా అతన్ని అందరికీ పరిచయం చేస్తాడు చలం. అభిషేక్ మెక్సికో దీవుల్లో స్థిరపడ్డ భారతీయ సంతతి డాక్టర్. అపాచి తెగకు నాయకుడు. చట్టబద్ధంగా వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారవుతాడు. అతన్ని వదిలించుకోవాలని ప్రభుత్వం కుట్రపన్ని బంధించి, ఉరిశిక్ష విదించి వో దీవికి పంపిస్తుంది. అక్కడి జైలర్ హెర్మన్ కార్టిస్.అతను మహాకౄరుడు. అభిషేక్ తన ప్రవర్తనతో అతన్ని మార్చాలని ప్రయత్నిస్తాడు. ఈ లోగా అభిషేక్ ను విడిపించుకు వెళ్ళాలని అపాచీలు మెరుపుదాడి చేసి విఫలులవుతారు. దాడిలో తీవ్రంగా గాయపడి కొనవూపిరితో ఉన్న కార్టిస్ కి రక్తదానం చేసి,శస్తచికిత్స చేసి,అతని ప్రాణం నిలబెడతాడు అభిషేక్. కార్టిస్ విచలితుడౌతాడు. అతనికి ప్రాణభిక్ష పెట్టి దూరంగా పంపిచేయాలని నిర్ణయించుకుంటాడు. అభిషేక్ ససేమిరా అంటాడు.విసిగిపోయిన కార్టిస్ అతని ఆఖరి కోరిక ఏమిటని అడుగుతాడు.తన పూర్వికులది భారతదేశంలోని అందమైన గ్రామం అని,ఆ గ్రామంలో గడపాలని తన కోరికని చెబుతాడు అభిషేక్. కార్టిస్ అతన్ని నెలరోజుల పాటూ భారతదేశం పంపిస్తాడు. వేదసంహిత అతని మీద రీసెర్చ్ చేసి ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా అతనికి స్నేహపాత్రమవుతుంది. అతనిచ్చిన గుర్తుల ఆధారంగా ఆమే ఆదిత్యపురం గ్రామాన్ని ఎన్నుకొని అతని రాకకోసం ఎదురుచూస్తూంటుంది. ఈ విషయాలు ఒక్క చలంకి తప్ప ఇతరులకి తెలియవు. అందరూ రీసెర్చ్ వర్కు మీదే సంహిత కొన్ని రోజులు గ్రామంలో ఉంటోందని, అభిషేక్,సంహిత భార్యభర్తలనే భావిస్తారు.

ఆదిత్యపురం వచ్చిన అభిషేక్ తన మనస్తత్వంతో అందరినీ ఆకట్టుకొంటాడు. తనను జలగబారి నుండి రక్షించాడన్న కృతజ్ఞతతో భారతి అరుణ్ ని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలియని సోమయాజులు ఆమెకు పెళ్ళి సంబంధం ఖాయం చేసి ఏర్పాట్లలో ఉంటారు. భారతి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. అభిషేక్ తన వైద్యంతో ఆమె ప్రాణం నిలబెట్టి,జరిగిన విషయం తెలుసుకొని అరుణ్ నిజస్వరూపం ఆమెకు తేటతెల్లమయ్యేలా, సంహితతో కలిసి ఒక నాటకం ఆడుతాడు.భారతి అరుణ్ ని ఛీకొడుతుంది. సోమయాజులు గారి కుటుంబం పరువు నిలబడుతుంది.

అభిషేక్,సంహిత ఆదిత్యపురం విడిచి వెళ్ళాల్సిన రోజు రానే వస్తుంది. సంహిత దుఃఖితురాలవుతుంది. ఇద్దరూ ఒకటవుతారు. భారమైన హృదయాలతో ఐ.ఏ.ఎస్ ఇంటర్వ్యూ కోసం సంహిత ఒకవైపు,కార్టిస్ కిచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం మరో ట్రైన్ లో అభిషేక్ ప్రయాణమవుతారు. అప్పుడు చూస్తాడు చలం ఆమె మెడ మీద మచ్చని. అయితే అది త్రాగుబోతైన ఆమె అసలు భర్త చేసిన గాయం అన్న నిజం, అతనికి ఎప్పటికీ తెలియకుండానే ఉండిపోతుంది.

కథనం

నవలలో పల్లెసీమల్లోని అందాలని,అలవాట్లని వర్ణించిన విధానం,అంత్రోపాలజి పరిణామక్రమాన్ని వివరించిన తీరు నాకు బాగా నచ్చాయి.మిగతా రచనంతా సాధారణంగా ఉంటుంది. కథారంభంలో సంహితని సృష్టించినప్పుడు ఆమె అందానికి వివశుడై బ్రహ్మదేవుడు ఆశువుగా శృంగార పద్యం చెబితే,సరస్వతీదేవి ఆగ్రహించి ఆ అమ్మాయి అందచందాలని ఏ మాత్రం గుర్తించలేని వ్యసనపరుడైన భర్త దొరకాలని శపిస్తుంది. ఆ భాగం చదివాక,ఇక నవలలో సంహిత అష్టకష్టాలు పడే సన్నివేశాలు వస్తాయని,ధైర్యంతోనే ఆమె తన జీవితాన్ని నిర్మించుకొని ప్రేమను పొందుతుందని ఊహించాను. అటువంటి సన్నివేశాలు ఎక్కడా లేవు.సంహిత పాత్ర పరిధిని తగ్గించి ప్రేమతత్వాన్ని బోధించే భారాన్ని మొత్తం అభిషేక్ మీద పేట్టేశారు రచయిత. సంహిత అభిషేక్ ని ఆరాధిస్తూ మిగిలిపోతుంది.ఆ మాత్రం దానికి కథానాయికకు అంత బిల్డప్ ఇవ్వాల్సిన పని లేదు. ఇది ప్రధానమైన లోపం అనుకోవచ్చు. ప్రేమ అనగానే మనకు సహజంగా స్పురించే యువతీయువకుల మధ్య ప్రేమని ఇందులో ఎక్కడా కూలంకుషంగా చర్చించలేదు. భారతి -అరుణ్,సంహిత -చలం ,సంహిత - అరుణ్ మధ్య అలాంటి సన్నివేశాలు వచ్చినా రచయిత లోతుగా వెళ్ళి విమర్శలు చెయ్యలేదు. విశ్వజనీయమైన మానవతా విలువలపైనే ఎక్కువగా దృష్టి పెట్టి అభిషేక్ పాత్ర ద్వారా అదే చెప్పిద్దామని ప్రయత్నించారు.ఇక కథానాయకుడికి మెక్సికో బ్యాక్ డ్రాప్ పెట్టడం కూడా ఉరిశిక్ష ముందు 'నెలరోజుల ' సాధారణ జీవితాన్ని ఇవ్వటానికే.మనదేశపు చట్టాలతో అది సాధ్యం కాదు కదా. పైగా ఉరిశిక్షకు గురైన కథానాయకుడు విదేశాల నుండి స్వదేశానికి వచ్చి ప్రేమతత్వాన్ని చాటితే, కథానాయకుడి పరిధి,చుట్టూ అల్లుకున్న కథ పరిధి పెరిగి,ఇంకా బలోపేతమవుతుందని భావించి ఉండవచ్చు.

'ప్రేమ' అనే టాపిక్ మీద యండమూరి ఇంతకంటే మంచి రచనలే చేశారు.చాలమందికి ఏ ' వెన్నెల్లో ఆడపిల్లో ', ' ప్రియురాలు పిలిచే ' నచ్చినా నావరకు బాగా నచ్చిన పుస్తకం అంటే ' థ్రిల్లర్ ' మాత్రమే.ప్రేమంటే ఏమిటో తెలుసుకోడానికి,ప్రేమలో తన నిజాయితీ ఎంతో నిరూపించుకోవడానికి అనుదీప్ అనే కుర్రాడు ఏడు సంవత్సరాలు తపస్సు చేసి,ఆ తపశ్శక్తితో విద్యాధరి అనే అమ్మాయి ప్రేమను పొందాలని ప్రయత్నించి,విఫలుడై ,స్వశక్తితోనే దాన్ని సంపాదించే క్రమంలో చివరకు ప్రాణాలే కోల్పోతాడు. వెళ్తూ వెళ్తూ తన తాలూకు జ్ఞాపకాలు ఆమెను ఏమీ బాధించకుండా కాలగతినే మార్చి జరిగినదంతా కలే అనే భ్రమకు ఆమెను గురిచేస్తాడు. ఈ నవలని రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా ముత్యమంతముద్దు అనే పేరుతో తెరకెక్కించారు.సీత కథానాయిక. ఆఫ్ కోర్స్ సినిమాలో క్లైమాక్స్ మార్చారులెండి. అందులో కథానాయకుడు బ్రతుకుతాడు. లేకపోతే జనం చూడరుగా.


శీత ప్రత్యూషం - కవిత




రా
త్రి చెరలో మగ్గిపోయిన
వియత్సుందరి విరహోత్కంఠితను
విభాతనాధుడొచ్చి విడిపించాడు
ఆకాశం సిగ్గుపడితే
దిక్కుల మేనంతా ఎర్రబడింది.

వియద్వీధి వాకిట్లో విహరించే కొంగలు
ధవళ కాంతుల దివ్యతోరణం కడుతున్నాయి
కెంజాయ ఎండల కాళ్ళ పారాణి దిద్దుకొని
మిసిమి మేఘాలు పసిపాపల్లా పరుగులుతీస్తున్నాయి
కొండల మీదుగా తేలి వచ్చేకూని రాగాల శీత గాలి
వన్నెచిన్నెల కన్నెపైరులకి నేర్పుతోంది కొత్త నాట్య శైలి

ఆలయకోనేట్లో అరవిరిసిన తామర తరుణులు
తుషార జలకాలాడి తలలెత్తి చూస్తున్నాయి
తరుశాఖ పత్రాల చివుళ్ళ పెదవులపై
తళుక్కుమంటూన్న హిమబిందువులు
అగాధాల సంద్రంలో అవతరించిన ముత్యాలైనాయి

చౌరస్తాకూడలిలో చితికిపోయిన బడుగూపేక
చింతల చిదుగులు పేర్చి ఆశలనెగళ్ళు వెలిగించి
భయం చలిని పోగొట్టుకుంటున్నారు
భవితపై భరోసా నింపుకుంటున్నారు
వీధిమలుపులో విరిగిన ఫ్లాట్ ఫాంపై
వయసుడిగిపోయిన భిక్షువర్షీయసి
ఆకలి సెగల ఆవిర్లుకక్కి
మూలబడ్డ ధూమశకటంలా
ముడుచుకూంటూ మూలిగింది

పల్లెటూళ్ళో పశువుల పాకలో
తల్లిపాలకై చిట్టిలేగ సంచలించి చిందులేసింది
కలతనిద్రలో ఉలిక్కిపడ్డ పసిపాప
మాతృమూర్తి హృదయంపై వెచ్చగా వొత్తిగిల్లింది.
గవాక్షాల సరిహద్దులు దాటి
గదిలోకి ప్రసరించే గోర్వెచ్చని మయూఖాలు
మారుని శరాలై గిలిగింతలు పెడుతుంటే
ప్రియనాథుని పరిష్వంగంలో త్రుళ్ళిపడిందో పెళ్ళికూతురు
నిద్రాభూతం తరుముతూంటే
పరీక్షల ప్రేతం భయపెడుతూంటే
కంబళి ఖడ్గం చెలాయిస్తూ
పుస్తక మంత్రం పఠిస్తూ
కుస్తీపడుతున్నాడో కుర్ర పహిల్వాను.

జగమంతా పరుచుకున్న జలతారు మంచుతెర
జీర్ణకాలాంబరంలా జరీవూడుతోంది
తమస్సుల నిశీధి తొలగిపోయి
ఉషస్సుల సత్వం వెలుగుచూస్తోంది
పేడనీళ్ళ పసుపుకళ్ళాపి వొళ్ళంతా పులుముకొని
రంగేళి ముగ్గుల రతనాల చీర నిండుగా చుట్టుకొని
గొబ్బెమ్మ సింధూరం నొసటన గుండ్రంగా దిద్దుకొని
తెలుగు లోగిళ్ళలో భూమాత కొత్త పోకళ్ళు పొయింది.


నెచ్చెలి (వాటర్ పెయింటింగ్)



పె
ళ్ళికి ముందు నేను వేసిన చిత్రాలలో ఇదొకటి. IndiaArt.com వెబ్సైట్ లో కొన్ని నచ్చిన పేయింటింగ్స్ సిస్టంలోకి కాపీ చేసుకొని వాటికి కొన్ని మార్పులు చేసి పెయింటింగ్ చేస్తూంటాను. బాగా వస్తే ఫ్రేం చెయించుకొని ఇంట్లో పెట్టుకోవటం,రాకపొతే పడెయ్యటం అన్నమాట. నాకు తెలిసిన అతనొకరు తన పెయింటింగ్స్ ఫ్రేం చేయించి ఇంటి గోడలనిండా నింపేశాడు. అదీ స్పూర్తి. ఎలా వుంది?


పిల్లలు - రియాలిటి డాన్స్ షోలు




'ఆ
ట ' ప్రోగ్రాం పై ఆఖరుకి వేటు పడింది.టీ.వీ.లో ఆ ప్రోగ్రాం చూడాల్సి వచ్చినప్పుడల్లా ఉష్ట్రపక్షి ఇసుకలో తలదాచేసుకొని శతృవుల బారి నుంచి తప్పించుకున్నట్లు,వేరే రూంలోకి పారిపోయి ఇతర వ్యాపకాల్లో తలమునకలైపొయి నన్ను నేను కాపాడుకొనేవాడిని.ఆ అవసరం ఇప్పుడు తప్పింది.కళ పేరుతో వ్యాపారం చేస్తూ,ఆ కళకే వలువలు నిస్సుగుగా వొలిచేస్తూంటే,వస్త్రదానం చేసి పరువు నిలిపిన శ్రీకృష్ణ పరమాత్ముడిలా జస్టిస్ సుభాషిణ్ రెడ్డి నేతృత్వంలోని మానవహక్కుల కమీషన్ కరుణించి కొరడా ఝళిపించింది.ఈ పోలిక కొంతమందికి అతిశయోక్తిగా అనిపించవచ్చు గానీ దురదృష్టవశాత్తూ ఇది నిజం.

ఒక రకంగా ఈ పరిస్థితికి ఓంకారే బాధ్యుడు.మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా బుల్లితెర జీవితం ప్రారంభించి,అనతికాలంలోనే నిర్మాతగా,ప్రయోక్తగా పలు విజయవంతమైన కార్యక్రమాలు రూపొందించిన ఆయన,మెట్లెక్కే తొందరలో కొన్ని ప్రామాణిక విలువలు గాలికొదిలేశారు.అదే ఇంత రాద్ధాంతానికీ దారి తీసింది.పిల్లల స్పెషల్ గా 'ఆట ' ను ప్లాన్ చేసుకున్నప్పుడు,ప్రైం టైం లో దాన్ని ప్రసారం చేస్తున్నప్పుడు అందులో అసభ్యత,అశ్లీలతకు తావుండకూడదు.కానీ ఓంకార్ ఆ ప్రాథమిక సూత్రం విస్మరించారు.అర్హతలేని వారిని కూడా అందలం ఎక్కించే ప్రయత్నం చేశారు.ముఖ్యంగా మెంటర్లు.మనం మాట్లాడేది కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నారని,కాస్త హుందాగా వ్యవహరించాల్సిన అవసరం చాలా వుందని వాళ్ళకు ఏ కోశానా ఉండదు.ఏది మంచో,ఏది చెడో పిల్లలకు విడమరిచి చెప్పాల్సిన మెంటర్లే చిల్లర మాటలు మాట్లాడుతూ,వెకిలి వేషాలు వేస్తూ,పిచ్చి ఛాలెంజిలు చేసుకుంటూ ఉంటారు.ఆట-4 లో అయితే అచ్చం కుళాయిల దగ్గర ఆడవాళ్ళు తన్నులాటల్లానే ఉండేది.ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన పిల్లలు వాటినే వేమన పద్యాల్లా,సుమతీ శతకాల్లా భావించి వల్లిస్తూంటారు.ఆట-4 లో వయసుకు మించిన మాట్లాడిన గీతిక,ఆట-5 లో ఆ పాపను మించి వల్గర్ డాన్సులు చేసే భువన..ఈ లిస్టు చాల పెద్దది.దానికితోడు కురచ దుస్తులు వేసుకొని,'నన్ను కొరికేయ్ రో,నా వయసు పదహారే,రింగరింగ రింగరింగా రే ' లాంటి పాటలకు డాన్సులు వెయ్యడం.అతిమాటలు మాట్లాడే పిల్లల్ని నాలుగు తగిలించి మంచి మాటలు చెప్పాల్సిన తల్లిదండ్రులు,తమ పిల్లలు ఎవో ఘనకార్యాలు చేసినట్లు నవ్వుకుంటూ చప్పట్లు కొట్టడం ఇంకో విడ్డూరమైన విషయం.ఇటువంటి షోలు చూసే పిల్లల్లో అవి ఎన్ని దుష్పరిణామాలకు దారితీస్తాయో చెప్పనక్కరలేదు.

ఒక్క ఆట మాత్రమే కాదు,నృత్య ప్రధానమైన రియాలిటీ షోస్ అన్నీ దాదపుగా అలానే తగలడ్డాయి.ఓంకారే నిర్వహించే ఛాలెంజ్ (మా టీవీ),నాగరాజ్/ఉదయభాను నిర్వహించే మగధీర (జీ టీవీ) అంతకంటే ఘోరంగా వుంటున్నాయి.మెంటర్లు గా పిలవబడే వ్యక్తులకు,పార్టిసిపెంట్లకు చాలా మందికి స్టేజి మీద ఎలా ప్రవర్తించాలో తెలియనట్లుంది.లేదా పుర్తిగా మరిచిపోతున్నట్లున్నారు.సగం కార్యక్రమం కేకలు,సవాళ్ళూ,ప్రతి సవాళ్ళతోనే నిండిపోతోంది.ఇలా చేస్తే గానీ రియాలిటి అనిపించుకోదనో లేక టీ.ఆర్.పీ రేటింగ్ లు పెరుగుతున్నాయి కాబట్టి మనం చేస్తున్నదని కరక్టే అని భ్రమలో వాళ్ళు ఉన్నారో తెలియదు. ఆమ్మ రాజశేఖర్,నవనీత్ కౌర్ లాంటి జడ్జిలు కొన్ని సందర్భాల్లో శ్రుతి మీరి ఆసభ్యంగా ప్రవర్తించారు.అయితే అవన్నీ యువత ప్రధానంగా పాల్గొనే ప్రోగ్రాములు కాబట్టి 'ఆట ' కు ప్రజాసంఘాల నుంచి వచ్చినంత వ్యతిరేకత వాటికి రాలేదు.కాస్త సంసారపక్షం గా ఉండి,ఇంటిల్లిపాదీ చూడగలిగేలా ఉండే నృత్య ప్రధానమైన కార్యక్రమం ఎదైనా వుంది అంటే అది 'ఢీ' ఒక్కటే.అప్పుడప్పుడు ఉదయభాను కాస్త అతి చేసినా,ఏనాడూ,ఎబ్బెట్టుగా అనిపించలేదు.ఈ విషయం లో మల్లెమాల గారిని,ఈ టీవి యాజమాన్యాన్నీ అభినందించాలి.

ఓంకార్ గారు,ఇతర నిర్వాహకులు కూడా అసభ్యత,ఆశ్లీలతను పక్కన పెట్టి, సృజనాత్మకతకు పెద్దపీట వేసి మళ్ళీ జనరంజకరమైన కార్యక్రమాలు నిర్మించి ప్రజాదరణ పొందాలని ఆశిద్దాం.తమ పిల్లల ప్రగతి ఎదుగుదలని ఓర్వలేని వారే ఇలా అడ్డుకొంటున్నారని భావించే తల్లిదండ్రులు కూడా, పిల్లల మనస్తత్వ నిపుణులోకరు టివీలో చెప్పిన మాటను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.మీ పాపకో,బాబుకో నాట్యం మీద ఆసక్తి వుంటే తప్పకుండా నేర్పించండి.అది కూచిపూడి,భరత నాట్యమే కానవసరం లేదు.కానీ వాళ్ళ చేత ఆశ్లీల నృత్యాలను మాత్రం చేయించకండి.అటువంటి కార్యక్రమాలను మీరు చూస్తూ పరోక్షంగా వారిని ప్రోత్సాహించకండి.ఆశ్లీల నాట్యాల్లో వయసుకు మించిన భావాలు పలికించాల్సి వచ్చినప్పుడు పిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతారు.ఆది అనేక అనర్థాలకు కారణం అవుతుంది.కోరి సమస్యలని తెచ్చుకోవద్దు.'ఆట ' ద్వారానో,మరింకొకటి ద్వారానో కొన్ని నిరుపేద కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియచ్చు.కానీ మీ పిల్లలు ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారో మీరూ అలోచించండి.నేటి బాలలే కదా రేపటి పౌరులు.