రుక్మిణీ కళ్యాణం

శ్రీమద్భాగవతంలోని అనేకమైన రసవద్ఘట్టాలలో రుక్మిణీ కళ్యాణం వొకటి.భక్తితో పాటూ,ప్రేమ,అరాధన,అనుబంధాలు ఇందులో ఒకదానితో వొకటి పెనవేసుకొని ఉన్నాయి.పరమాత్వతత్వంతో పాటూ,జీవిత సత్యం కూడా పొందుపరచబడి ఉన్న ఈ మధుర ఘట్టాన్ని,మారుతున్న కాల పరిస్థితులను,రంగస్థల ప్రదర్శనానుకూలతను దృష్టిలో వుంచుకొని,సరళమైన పద్య సౌందర్యంతో,సర్వజనామోదయోగ్యమైన నాటకంగా తీర్చిదిద్ది,తెరకెక్కించే ప్రయత్నం చేశారు మా నాన్నగారు..

రుక్మిణీ కళ్యాణం నాటిక పై అవధాన చక్రవర్తి,శతావధాన సార్వభౌమ డాక్టర్ మేడసాని మోహన్ ,శతాధిక నాటకకర్త,నాటక నవరత్నం కొడాలి గోపాలరావు వంటి ప్రముఖుల అభిప్రాయాలు ఇక్కడ జత చేస్తున్నాను.ఈ నాటకంలోని కొన్ని రమ్యమైన పద్యాలు:

జగన్నాటక సూత్రధారియైన శ్రీకృష్ణుని ప్రేమకై అపర లక్ష్మీదేవియైన రుక్మిణి తపించి దుఃఖించే సందర్భంలో వచ్చే సీస పద్యం.

సీ||

సరసిజనాభ ! నీ శౌర్యార్చనార్పిత
ధామమ్ము కాని సౌందర్యమేల ?
పావన చరిత ! నీ ప్రణయానురాగాల
పులకించని పరువంపు తనమేల ?
మోహనాకార ! నీ మోవిపై మురళియై
మధుర శ్రుతులిడని మనుగడేల ?
దురితాపహార ! నీదు పదసన్నిధిలోన
ప్రమిదనై వెలుగని భాగ్యమేల ?

ఆ||

ఆశ్రిత జనపాల ! అంచిత గుణశీల !
పుణ్య హృదయలోల ! భువనపాల !
వేణుగానలోల ! వినవేల ! వేయేల !
నీవులేని బ్రతుకు నిలుపఁ జాల !

తన ప్రేమ రాయబారాన్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని కడకు తీసుకువెళ్ళిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడు యెంతకీ తిరిగి రాకపొయేసరికి 'ఏమైనదో ఏమో'నని రుక్మిణీదేవి మనస్సు పలుపలు విధాలుగా అలోచిస్తూ,చింతించే సమయంలో వచ్చే మరొక సీస పద్యం.

సీ||

ఏల నాస్వామి రాడేమి కతమొ ? భూసు
రేంద్రు డగ్నిద్యోతు డేగె, వృద్ధు
డాయసపడి, దుర్గమారణ్య మార్గమున్
గడచెనో? కడిచినా, కడలినధిగ
మించి ద్వారకపురమేగెనో? యేగిన
మాధవు దర్శన మతనికాయె
నో ! లేదో ! వినియేమను కొనెనో మనమున,
దయచేయతలచునో,తలుపడేమొ,

గీ||

కలికి ! శ్రీగౌరి యేరీతి కరుణ గొనునో ?
వ్రాలు నాతలనేమని వ్రాయబడెనో ?
తెల్లవారె లగ్నము,వచ్చిరెల్లవారు,
ఎట్లు తెల్లవారునో బ్రతుకేమి జేతు.

రుక్మిణీదేవి లేఖను చదివి,తాను తక్షణమే వచ్చి ఆమెను పెళ్ళి చేసుకుంటానని అగ్నిద్యోతునికి అభయం యిస్తూ శ్రీకృష్ణుడు వెల్లడించే సన్నివేశంలో వచ్చే పద్యం.

కు||

చెచ్చెర నేనచ్చోటికి
వచ్చెద,శిక్షించెద తులువలనెల్ల,జనుల్
మెచ్చగ నారీ రత్నము
దెచ్చెద,చేపట్టెద ప్రియ దేవేరియనన్ ||నాన్నగారి పుస్తకాలు - ప్రదర్శనలు

న్నో నాటికలు,గేయాలు వ్రాసినా, ప్రచురింపబడ్డ పుస్తకాలు రెండు.
అవి రుక్మిణీ కళ్యాణం(1991) ,అరోగ్యగీత(2002).


2003(మే-జూన్) లో రాష్త్ర ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవం-2002 పోటీలకు చిత్తూరు జిల్లా నుంచి ఎంపికై ప్రదర్శింపబడ్డ ఎకైక నాటిక 'దర్పణం' .అదే సంవత్సరం(నవంబర్- డిసెంబర్) లో కిన్నెర, హైదరాబాద్ వారు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ నాటకోత్సవాలలో కూడా ఈ నాటిక ప్రదర్శింపబడింది(బాక్స్ ఐటెం).
చలం -మైదానం - రెండవ భాగంమైదానం(The open plain) ఒక సర్రియలిస్టిక్(surrealistic) నవల.

సర్రియలిజం అంటే సబ్-కాన్షియస్ మైండ్ ఆలోచనలకు భావాలకు ఒక రూపం యిస్తూ అంతర్లీనంగా ఒక సందేశాన్నిజోడించి చెప్పే ఒక కళ. 1920లలో ఫ్రెంచిలో ఊపిరిపోసుకున్న ఈ సాహిత్య ఉద్యమానికి ఆద్యుడు, మేనిఫెస్టో రచయితైన ఆండీ బ్రెటన్ మాటల్లో సర్రియలిజం అంటే"ఎవరి అదుపాజ్ఞలు లేనప్పుడు,ఎటువంటి తర్కానికి కానీ,సాంఘిక కట్టుబాట్లకు కానీ,ఆచార వ్యవహారాలకు కానీ,నీతి నియమాలకు కానీ లొంగకుండా,మాటల ద్వారా కానీ,వ్రాతల ద్వారా కానీ,మరే విధాల ద్వారా కానీ,తన మస్తిష్కం లో రేగే అలోచనలు ఉన్నది ఉన్నట్లుగా వెల్లడించే ప్రక్రియ"

సర్రియలిజం మూలాలు 1916 కాలంలో స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ లో మొదలైన దాదా ఉద్యమం(Dadaism)లో ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరగటానికి ప్రధాన కారణం అప్పటి అప్పర్ మిడిల్ క్లాస్ యొక్క కాపిటలిస్ట్ రీజనింగ్,అలోచనా విధానాలు అని గాఢంగా నమ్మిన కొంతమంది, వాటికి వ్యతిరేకంగా ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటివరకు ఉన్న అలోచనా శైలి,నాగరికత మీద విశ్వాసం సన్నగిల్లి, ప్రజల విచక్షణా జ్ఞానాన్ని, అభిప్రాయాలను, విద్యా వ్యవస్థను,మంచీ-చెడులను..ఇలా ఒక్కటేమిటి మొత్తం వ్యవస్థనే సవాల్ చేసి, ఉలిక్కిపడి నిశ్చేష్ఠుల్ని చేసే సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది Anti-Art. ఇటువంటి Art (రచనలు కానీ,చిత్రాలు కానీ) చాలాసార్లు లాజిక్ వుండదు. ఉన్నా అందులో దాగున్ననిగూడార్థం సగటు పాఠకుడికి అర్థం కాదు. ఈ తరహా సాహిత్య ప్రక్రియని తెలుగు సాహిత్యంలో కొద్దిమందే అడపాదడపా అనుకరించారు.అటూవంటివాళ్ళలో చలం వొకడు.

సర్రియలిజం అనే కోణంలో చూసినప్పుడు మైదానం ఒక అద్భుతమైన నవల.ఇందులోని ప్రధాన పాత్రలు రాజేశ్వరి,అమీర్,మీరా. కథనంతా రాజేశ్వరి చుట్టూనే తిప్పుతూ,ఆమె ద్వారానే వివరిస్తాడు రచయిత. తన కథను సాటి స్త్రీతోనో, లేక పాఠకురాలితోనో, లేక సమాజంతోనో చెప్పుకుంటున్నట్లు కథనం సాగుతుంది. ఈ పాత్రల అలోచనాశైలి,మనస్తత్వ ధోరణులు ఏవీ తర్కానికి అందవు. ప్రస్తుత సమాజపు కట్టుబాట్లను, ఆచార వ్యవహారాలను ప్రశ్నిస్తూ,పూర్తి విప్లవాత్మక పద్ధతుల్లో ప్రవర్తిస్తాయి.

కథానాయిక మస్తిష్కమే ఇక్కడొక సువిశాలమైన మైదానం !

ఒక సువిశాలమైన మైదానం చూడగానే మనకి ఏమనిపిస్తుంది? కాసేపు ఆడుకోవాలని,ఇంకాసేపు గెంతులేయాలని,స్వేచ్ఛగా చుట్టూ కలయతిరగాలని అనిపించదూ? అలాగే తన మస్తిష్కమనే మైదానంలో, ఆమె కలయతిరుగుతూ,తనలో రేగే రకరకాల అలజడులకు స్వేచ్ఛారూపం యిస్తే,అప్పుడు జరగబోయే విపరీత పరిణామాలకు,వాటి దుష్ఫలితాలకు దర్పణమే ఈ పుస్తకం. ఇప్పుడు మనకు కొత్తగా అనిపిస్తున్న సహజీవనం అనే concept ని,ఆ concept ఒక గృహిణి తన స్వేచ్ఛాస్వాతంత్ర్యాల కోసం అన్వయించుకొంటే, ఆమెకు ఎదురయ్యే దుస్థితులని చలం ఆనాడే ఇందులో చర్చించారు. అలాగే వివాహ వ్యవస్థ మీద కూడా కొన్ని పదునైన వ్యాఖ్యలు చేశారు. మనస్తత్వాలు, శరీరధర్మాలు పొసగని ఎన్నో పెళ్ళైన జంటలు కేవలం సంఘానికి భయపడి తమ బ్రతుకు బండిని లాగించటం మీద విమర్శలు ఉన్నాయి. తన పసితనంలో తనను లొంగదిసుకోవటానికి విఫలయత్నాలు చెసి ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్పే మావయ్యను, అంతర్లీనంగా ఎంత కుళ్ళున్నా ఏనాడూ బయటపడకుండా గుట్టుగా కాపురాలు చేస్తూ నెట్టుకొచ్చే మనుషుల ద్వంద ప్రవృత్తులను, అటువంటి సమాజాన్ని రాజేశ్వరి పాత్ర 'ఛీ' కొడుతుంది. పురుషులతో సమానమైన శారీరక స్వాతంత్ర్యాన్ని కోరుకుంటుంది.

ఐతే,ఏ కళైనా సమాజ హితం కోరుకునే విధంగా ఉండాలి. అప్పుడే అ కళకొక అర్ధం పరమార్థం. మన సమాజంలో సర్రియలిజం గురుంచి ఎంతమందికి తెలుసు? మహా మహా మెధావులకే ఓ పట్టాన అర్థం కాని ఈ ప్రక్రియ ఇంక పామర జనులకు ఏం అర్థం అవుతుంది? తద్వారా వొరిగే ప్రయోజనం ఏమిటి? తను చెప్పదలచుకున్న విషయం పాఠకుడికి,లేదా వీక్షకుడికి సులభంగా అర్థమవ్వాలని ఒక రచయిత లేదా చిత్రకారుడు కోరుకుంటారు. అంతే కానీ తమ రచనలు చదివి,చిత్రాలు చూసి విషయం బోధపడక,వాటి సారాంశం తెలుసుకోడానికి ప్రత్యేక పరిశోధనలు చెయ్యాలని ఎవరూ అనుకోరు. పరిశోధన చేసి అర్థం చేసుకొనే వోపిక, తీరిక అందరికీ ఉండవు. ఒకవేళ ఉన్నా ఒక్కో వ్యక్తి ఒక్కో అర్థాన్ని తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు మంచి కంటే చెడు జరిగే అవకాశాలే ఎక్కువ. అందరి మనఃస్థితి ఒకేలా ఉండదు కదా. చలాన్ని,చలం రచనలని సమాజంలోని ఒక వర్గం బహిష్కరించడానికి ఇదొక కారణం.

సర్రియలిజం గురించి తెలియని సగటు పాఠకుడి దృష్టిలో మైదానం ఒక చవుకబారు నవల. మైదానం అంటే కథలో నాయిక నివసించే స్థలమని, ఇందులోని పాత్రలకు వ్యక్తిత్వం లోపించిందని,విశృంఖలత్వాన్ని రచయిత ప్రేరేపిస్తున్నాడని అనుకొనే ప్రమాదం కూడా ఉంది. అయితే, ముందే చెప్పినట్లు దీనికి కారణం,తన అభిప్రాయాల్ని వ్యక్తం చెయ్యడానికి చలం ఎన్నుకొన్న సాహితీ ప్రక్రియ, ఆనాటి కాల పరిస్థితులు. అది అర్థం కానప్పుడు ఆయన రచనలూ అర్థం కావు. సాధారణ పాఠకుడు ఈ పుస్తకాలను తన ఇంట్లొ పెట్టుకోడు. తను అర్థం చేసుకోగలిగినా తన పిల్లలు సరిగ్గా అర్థం చేసుకుంటారో లెదోనన్న బెంగ. ఇంకొకరిని చదవమని ప్రోత్సాహించడు. ఇతరులు ఏమనుకుంటారోనని భయం.అందుకే ఇటువంటివి విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా, గ్రంథాలయాల్లో పి.హెచ్.డి విద్యార్థులకి పరిశోధనాంశంగా మగ్గిపోతూంటాయి. ఆనాడు చలం ప్రస్తావించిన సమస్యలు,లేవనెత్తిన ప్రశ్నలు నేటికీ సమాజంలో సజీవమై ఉన్నాయి. ఎందరు ఎలా అనుకున్నా,తెలుగు సాహిత్యం ఉన్నన్నాళ్ళు చలం మీదా,చలం రచనల మీదా చర్చలు జరుగుతూనే వుంటాయి.మైదానం అజరామరమై నిలిచి ఉంటుంది.1 comment

Post a Comment