భూదేవికి విష్ణువిచ్చిన వరాలు, బలరాముని లీలలు ఇతర భాగవత విశేషాలు.

ఇంకొన్ని భాగవత విశేషాలు.
 1. 1.   త్రివిక్రముడైన వామనమూర్తి పాదాలను బ్రహ్మ తన కమండలంలోని నీళ్ళతో కడుగగా ఉద్భవించినదే గంగానది.

 2. 2.   విశ్వరూపున్ని చంపిన ఇంద్రుడుకి బ్రహ్మహత్యామహాపాతకం చుట్టుకుంటుంది. ఆ పాపాన్ని భూమి, వృక్షాలు, నీరు, స్త్రీలు పంచుకుంటారు. అందుకే భూమ్మీద కొంతభాగం ఎడారిగా నిర్మానుష్యంగా ఉంటుంది. వృక్షాలు స్రవించే ద్రవాలను (కల్లు వగైరా) త్రాగరాదని, బుడగలు నురగతో నిండిన నీరు నిరుపయోగమని, ఋతుమతియైన స్త్రీలని అంటరాదని పెద్దలు చెబుతారు. తన పాపాన్ని పంచుకున్నందుకు ప్రతిగా ఇంద్రుడు, త్రవ్విన ప్రతి గుంత తనంతట తనే పూడుకుపోతుందని భూమికి, కొమ్మలు నరికేసినా మళ్ళీ చివురిస్తాయని వృక్షాలకు, కలిసిన ప్రతి వస్తువు పెరుగుతుందని నీటీకి, అపరిమితమైన క్రీడాసక్తిని కలిగి ఉంటారని స్త్రీలకు వరాలిస్తాడు.

 3. 3.   వృత్తాసురుడు పూర్వజన్మలో చిత్రకేతుడనే రాజు. విష్ణుభక్తుడైన ఆయన, ఒకనాడు దివ్యవిమానంలో లోకాలన్నీ సంచరిస్తూ, కైలాసంలో ప్రమదగణాలన్నీ పరివేష్టించి ఉండగా సతీదేవిని ఆలింగనం చేసుకున్న పరమశివున్ని చూసి విరగబడి నవ్వుతాడు. సతీదేవి ఆగ్రహించి అతన్ని అసురుడవై పుట్టమని శపిస్తుంది.


 1. 4.   ఇక్ష్వాపు వంశీయుడైన యువనాశ్వుడనే మహారాజు సంతానప్రాప్తి కోసం ఇంద్రుని గూర్చి యజ్ఞం చేస్తాడు. యజ్ఞం పరిసమాప్తమయ్యాక మంత్రించిన పుణ్యజలాన్ని ప్రమాదవశాత్తూ మింగి గర్భం దాలుస్తాడు. అతని ఉదరం చీల్చుకొని పుట్టినవాడే మాంధాత. పుట్టగానే గ్రుక్కపట్టి ఏడ్చిన ఇతనికి ఇంద్రుడే స్వయంగా అమృతం తినిపిస్తాడు. మాంధాత షట్చక్రవర్తులలో ఒకడు.

 2. 5.   అత్రి మహర్షి ఆనందబాష్పముల నుండి ఉద్భవించినవాడు చంద్రుడు.

 3. 6.   చంద్రవంశానికి ఆద్యుడు పూరూరవుడు.ఇతను ఇళ-బుధు (గ్రహం) ల  కుమారుడు.సూర్యవంశపు మూలపురుషుడైన శ్రాద్ధదేవుని కూతురు ఇళ. ఆమెను వశిష్టుడు తపోశక్తితో పురుషునిగా మార్చి సుద్యుమ్నుడని నామకరణం చేస్తాడు. సుద్యుమ్నుడు ఒకనాడు వేటకు వెళ్ళి నిషిద్ధప్రాంతంలో కాలుమ్రోపి శాపవశాత్తూ మళ్ళీ స్త్రీగా మారిపోతాడు. వశిష్టుని ప్రార్థనకు  పరమశివుడు కరిగిపోయి సుద్యుమ్నుడు ఒక నెల స్త్రీగా మరొకనెల పురుషునిగా బ్రతుకుతూ  జీవితం కొనసాగిస్తాడని వరమిస్తాడు.అలా సుద్యుమ్నుడు స్త్రీగా ఉన్న సమయంలోనే చంద్రుని కుమారుడైన బుధునితో కలిసి పురూరవునికి జన్మనిస్తాడు.

 4. 7.   ప్రజాపతి ద్రోణుడు, ఆయన భార్య ధర, బ్రహ్మ అజ్ఞానుసారం నందుడు,యశోదగా జన్మిస్తారు.

 5. 8.   ఉగ్రసేన మహారాజు భార్య, సఖులతో కలిసి వనవిహారం చేస్తూంటే  ద్రమిళుడనే గంధర్వుడు ఆమెను చూసి మోహిస్తాడు.ఉగ్రసేనుడి రూపం ధరించి ఆమెను ఏకాంతంలో కలుసుకుంటాడు.ఆమె గర్భవతౌవుతుంది. ఆలస్యంగా విషయం తెలుసుకొని కోపంతో, తనకు పుట్టబొయే బిడ్డ రాక్షసుడవుతాడని శపిస్తుంది. ద్రమిళుడు, ఆ బిడ్డ తనవారి చేతనే ద్వేషింపబడుతాడని  ప్రతిశాపం యిస్తాడు.అలా పుట్టినవాడే కంసుడు. ఈ రహస్యాన్ని నారద మహర్షి అతనికి తెలియజేస్తాడు.

 6. 9.   వసుదేవునికి దేవకి కాకుండా ఇంకో ఆర్గురు భార్యలున్నారు. వారిలో రోహిణి ఒకతె. దేవకీదేవి గర్భాన ఏడవ కుమారుడిగా జన్మించిన బలరామున్ని విష్ణువు రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెడ్తాడు. అలాగే వసుదేవునికి ఐదుగురు అక్కచెళ్ళెళ్ళు. వారిలో కుంతీదేవి ఒకతె. ఆమె శ్రీకృష్ణునికి స్వయానా మేనత్త.

 7. 10.   ఏడేళ్ళ వయసులో ఏడు రోజుల పాటూ  గోవర్ధనగిరిని తన చిటికెనవ్రేలి పై మోస్తాడు బాలకృష్ణుడు. అలా గోవులను కాచినందుకే 'గోవిందు'డౌతాడు.

 1. 11.   కుబేరుడు మెల్లకన్ను కలవాడు. పార్వతిదేవి సౌందర్యం చూసి క్షణకాలం మనస్సు చలించటంతో మెల్లకన్ను పొందుతాడు.

 2. 12.   నలకూబర, మణిగ్రీవులు కుబేరుని పుత్రులు. గంధర్వకాంతలతో కలిసి మధువు సేవిస్తూ వివస్త్రులై ఒళ్ళుపై తెలియకుండా ఆకాశగంగలో స్నానం చేస్తూంటే, ఆ దారెంట వెళ్తున్న నారద మహర్షి కనిపిస్తాడు. గంధర్వ స్త్రీలంతా హడావుడిగా బట్టలు కట్టుకొని ఆయనకు భయభక్తులతో నమస్కరిస్తే, వీరిద్దరూ గర్వాంధకారంతో ఏమీ పట్టనట్లు దిసమొలతో నిలబడి, మిన్నకుండిపోతారు. నారదుడు ఆగ్రహించి వారిని వంద దివ్య సంవత్సరాలపాటూ మద్దిచెట్లై పడుండమని శపిస్తాడు. కృష్ణావతారంలో భగవంతుడు నడుముకి రోకలి కట్టుకొని ఈ మద్దిచేట్ల మధ్యలోనే వెళ్ళి వాటిని పడద్రోసి వారికి శాపవిమోచనం కలిగిస్తాడు.

 3. 13.   బృందావనంలోని యమునా నదిలో సౌభరి అనే ఋషి నిలబడి గొప్ప తపస్సు చేసుకునేవాడు. ఆ నదిలోని ఒక మగచేపను ఒక గ్రద్ద చంపి తినటంతో చేపలన్నీ వెళ్ళి మునితో తమ బాధను చెప్పుకుంటాయి. ఆయన జాలిపడి, గరుత్మంతుడితో సహా ఏ పక్షైనా మరోసారి ఇటువైపు వస్తే మరణం తధ్యమని శపిస్తాడు.

 4. 14.   రమణక ద్వీపంలో నివసించే పాములకు గరుత్మంతుడికీ మధ్య ఒక ఒప్పందం ఉంది. గరుత్మంతుడు పాములనన్నిటినీ ఇష్టం వచ్చినట్లు ఆరగించకుండా నెల నెలా ఒక కుటుంబం పెట్టే బలి ఆహారాన్ని మాత్రమే పుచ్చుకోవాలని ఒడంబడిక చేసుకుంటారు. తన వంతు వచ్చినప్పుడు కాళీయుడు ఆ ఒప్పందాన్ని ధిక్కరించి విషం క్రక్కుతూ గరుత్మంతుడిపై దాడి చేస్తాడు. ఆయన దాన్ని తరుముకుంటూ వెళ్తాడు. కాళీయుడు భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోకాలన్నితిరిగి తిరిగీ చివరకి అధోలోకాలకి వెళ్ళి అనంతుడి కాళ్ళపై పడితే, ఆయన బృందావనంలోని యమునా నదిలో దాక్కుంటే గరుత్మంతుడు ఏమీ చెయ్యలేడని సలహా ఇస్తాడు.అలా కాళీయుడు యమునానది చేరుకొని తన మహోగ్ర విషంతో అందులోని జీవజాలాన్ని నాశనం చేసి స్థిర నివాసం ఏర్పరుచుకుంటాడు. కృష్ణుడు అతని పీచమణచి, తిరిగి రమణకద్వీపం వెళ్ళిపొమ్మని, తలపై తన పాదముద్రలున్నాయి కనుక గరుడుడు ఏమీ చెయ్యడని అభయమిస్తాడు.

 5. 15.   రామావతారంలో గర్భవతియైన సీతమ్మను పరిత్యజించటానికి ప్రధానకారణమైన చాకలివాడిని కృష్ణావతారంలో అంతమొందిస్తాడు మహావిష్ణువు. గతజన్మ వాసనలవల్ల ద్వాపరయుగంలో కూడా చాకలిగా జన్మించిన అతను, కంసుని దగ్గర సేవకుడిగా పనిచేస్తూ బ్రతుకు వెళ్ళదీస్తుంటాడు. ధనుర్యాగం కోసం మధురానగరం వచ్చిన బలరామకృష్ణులు, వీధులలో కలయతిరుగుతూ కంసుని పట్టువస్త్రాలు మోసుకెళ్తున్న అతన్ని చూస్తారు. అతని వద్దనున్న మూటలోంచి కొన్ని పట్టువస్త్రాలు తమకూ కట్టుకోవటానికి ఇవ్వమని అడుగుతారు. చాకలివాడు ఆ బట్టలు ఇవ్వకపోగా 'పాలు పెరుగుతిని క్రొవ్వుతో కొట్టుకుంటున్న గొల్లవార' ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో, యుగాలు మారినా ఇతని ఆలోచనా ధోరణి మారలేదని గ్రహించిన కృష్ణుడు ఒక్క పిడికిలిపోటుతో అతన్ని యమపురికి పంపిస్తాడు.

 6. 16.   పంచజనుడనే రాక్షసుని శరీరం నుండి పుట్టినదే పాంచజన్యమనే శంఖం.గురువైన సాందీపుని కుమారున్ని అన్వేషిస్తూ వెళ్ళిన కృష్ణుడు ఆ రాక్షసుని చంపి శంఖాన్ని తీసుకుంటాడు.

 7. 17.   వరాహమూర్తిగా ఉన్నకాలంలో మహావిష్ణువు భూదేవికి పలు వరాలిస్తాడు.భూమిపుజ అలా వచ్చిన వరమే.అలాగే పుస్తకం నేల మీద పెడితే చదువు సిద్ధించకూడదని, శంఖం నేల మీద పెడితే మంగళం జరుగరాదని, తులసిని పువ్వులని నేల మీద పెడితే దేవతలు వారి ఇంట పూజలు స్వీకరించరాదని, శివలింగం నేలపెట్టిన ఇంట దేవతలు నివసించరాదని భూదేవి వరాలు కోరుతుంది.

 8. 18.   నరకాసురుని భార్య పేరు చతుర్దశి.

 9. 19.   నరకాసురుడు చెరపట్టిన 16100 మంది కన్యలను 16100 రూపాలతో ఏకకాలంలో వివాహం చేసుకుంటాడు కృష్ణ పరమాత్ముడు.ప్రతి భార్యతోను 10 మంది పిల్లలు కలిగారు. వీళ్ళ పిల్లలు, మనవళ్ళకు చదువు చెప్పడానికి నియమించిన గురువుల సంఖ్య మూడు కోట్ల ఎనభైవేల ఒక వంద.

 10. 20.   రుక్మిణిదేవి అన్న రుక్మిని బలరాముడు చంపేస్తాడు. పాచికలాడి పలుమార్లు బలరామున్ని ఓడించి  పకపకా నవ్వుతాడు రుక్మి. బలరాముడు పట్టుదలగా ఆడి గెలిచినా ఒప్పుకోక, ' గొల్లవార' ని అవహేళన చెయ్యటంతో ఆయన ఆగ్రహించి అతన్ని పరలోకం పంపిస్తాడు.

 11. 21.   మన్మథుడు ఒక్క రతీదేవికి తప్ప మిగతా వారెవ్వరికీ కనిపించడు.అతను అనంగుడు.

 12. 22.   బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. వాళ్ళలో పెద్దవాడు శివభక్తుడైన బాణాసురుడు.

 13. 23.   ద్వివిదుడు నరకాసురుని మిత్రుడు.ఇతను వానరరాజైన సుగ్రీవుని మంత్రి మైందుని తమ్ముడు. అయినా యుగప్రభావం వల్ల తన మిత్రుని చంపిన కృష్ణుడిపై పగబట్టి యాదవ గ్రామాలను, నగరాలను ధ్వంసం చేస్తాడు. రైవతక పర్వతం పైనున్న బలరాముడు కొంతసేపు ఉపేక్షించి ఇక లాభం లేదని అతన్ని సంహరిస్తాడు


 1. 24.   జాంబవతి-కృష్ణుల కొడుకు సాంబుడు. అతను దుర్యోధనుడి కూతురైన లక్షణ స్వయంవరానికి వెళ్ళి ఆమెను బలవంతంగా తీసుకువెళ్తూంటే కౌరవులంతా దాడి చేస్తారు. అతని శౌర్యప్రతాపాగ్నికి తట్టుకోలేక అందరు చుట్టిముట్టి, కట్టడి చేసి బంధిస్తారు. శాంతిప్రియుడైన బలరాముడు కృష్ణుడికి నచ్చజెప్పి హస్తినాపురం వెళ్ళి వారిని వదిలేయమని హితుల ద్వారా చెప్పి పంపిస్తాడు. దుర్యోధనుడు పెడచెవిన పెడతాడు. బలరాముడు ఆగ్రహించి,' హస్తినాపురాన్ని యమునా నదిలో కలిపేస్తా' నని తన నాగలి భూమిలో గ్రుచ్చి నగరం మొత్తాన్ని పైకి లేపేసరికి అందరూ హాహాకారాలు చేస్తారు. దుర్యోధనుడు కాళ్ళబేరానికొచ్చి యువదంపతులను విడిచిపెడతాడు.


2 comments

Post a Comment

అరటిచెట్టు ఎలా పుట్టింది, కంసుడి జన్మరహస్యం ఇతర భాగవత విశేషాలు

వారం భాగవతం లోంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
 1. 1.   అష్టాదశ పురాణాలు వ్యాస భగవానుడే వ్రాశాడు.

 2. 2.   పరీక్షిత్తు అసలు నామధేయం విష్ణురాతుడు. కలిపురుషుడి వేడుకోలుకు కరిగిపోయి అతను జూదశాలల యందు, మధుశాలల యందు, వ్యభిచారుల యందు, జంతు వధ్యశాలల యందు, బంగారమందు ఉండవచ్చని అభయం ఇస్తాడు. కలి పురుషుడు పరీక్షిత్తు కిరీటంలో ప్రవేశించి, అతని బుద్ధిని పెడత్రోవ పట్టించి, ధ్యానమగ్నుడైన శమీక మహర్షి మెడలో చనిపోయిన త్రాచు పామును వేలాడదీసేలా చేస్తాడు.

 3. 3.   కురుక్షేత్ర యుద్ధకాలంలో విదురుడు తీర్థయాత్రకు వెళ్ళిపోతాడు.

 4. 4.   హిరణ్యాక్ష, హిరణ్యకశిపులలో హిరణ్యకశిపుడు పెద్దవాడు. తన కొడుకులిద్దరూ విష్ణువు చేతిలో మరణిస్తారని దితికి ముందే తెలుసు. ఆయన భయంతోనే వాళ్ళను 100 సంవత్సరాలు గర్భంలో దాచుకుంటుందామె.

 5. 5.   అనుహ్లాదుడు, సమ్హ్లాదుడు, హ్లాదుడు  ప్రహ్లాదుని సోదరులు.


 1. 6.   ప్రహ్లాదుని మనవడు రాహువు. అతని తల్లి సింహిక. అమృతం పంచే సమయంలో రాహువు మారువేషంలో దేవతల వరుసలో కూర్చున్నాడని మోహినీ అవతారమెత్తిన విష్ణువుకు ముందే తెలుసు. అయినా వరుసలో కూర్చున్నవాడిని లేపడం ధర్మం కాదు కాబట్టి, అతను అమృతం తాగిన వెంటనే, అది గొంతు దిగక ముందే అతని శిరస్సుని ఉత్తరిస్తాడు. అయితే అమృతం మింగిన శిరస్సు అమరత్వం పొందింది కాబట్టి గ్రహస్థితిని కల్పిస్తారు.

 2. 7.   గజేంద్రుని భార్యలు 10లక్షల కోట్ల ఆడేనుగులు. గజేంద్రుడు వేయి సంవత్సరాల పాటూ మొసలిపట్టులో ఉండి పోరాడుతాడు. ఆ తర్వాత ఓపిక సన్నగిల్లి విష్ణువుని శరణు వేడితే, ఆయన ఆఘమేఘాల పై వచ్చి రక్షిస్తాడు.

 3. 8.   వృత్తాసురుని కంఠాన్ని వజ్రాయుధంతో కొయ్యటానికి  ఇంద్రునికి దాదాపు ఒక సంవత్సర కాలం పట్టింది.

 4. 9.   నముచి అనే రాక్షసుడు అటు తడి, ఇటు పోడి కాని వస్తువు ద్వారా మరణించాలని కోరుకుంటే, దేవేంద్రుడు సముద్రపు నురగలో వజ్రాయుధం ముంచి అతన్ని సంహరిస్తాడు.

 5. 10.   బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి.

 6. 11.   దుర్వాసో మహర్షి భార్య కందళియే కదళీ వృక్షం (అరటి చెట్టు) గా రూపుదాల్చింది. ఆమె ఔర్వుడనే మహర్షి కూతురు. తలబిరుసు ఎక్కువ. ఆమె విషయం ముందే చెప్పి దుర్వాసో మహర్షికిచ్చి వివాహం జరిపిస్తాడు ఔర్వుడు. చాలా కాలం ఆమె ప్రవర్తన భరించిన దుర్వాసో మహర్షి ఒక రోజు ఆమె చెప్పిన పని చెయ్యకపోయేసరికి ఆగ్రహించి భస్మీపటలం చేస్తాడు. విషయం తెలుసుకున్న ఔర్వుడు కోపించి ఒక రాజర్షి ( అంబరీషుడు) చేతిలో ఘోరావమానం పొందుతావని శాపమిస్తాడు. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన దుర్వాసో మహర్షి ఆమె వృక్షంగా జన్మించి అమృతతుల్యమైన ఫలాలిస్తుంది వరమిస్తాడు.

 7. 12.   కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు.దేవాసుర సంగ్రామంలో అతన్ని సుదర్శనచక్రంతో సంహరిస్తాడు శ్రీమహావిష్ణువు.అసుర గురువు శుక్రాచార్యుడు మృతసంజీవనీ విద్యతో అతన్ని తిరిగి బ్రతికిస్తాడు. రోషిల్లిన కాలనేమి, తీవ్రమైన తపస్సు చేసి విష్ణువు చేతిలో కానీ, ఇతర ఏ దేవతల చేతిలో కానీ మరణం కలగకుండా బ్రహ్మ దగ్గర వరం పొందుతాడు.కంసుడిగా జన్మిస్తాడు.అతను కోరుకున్నది విష్ణువు చేతిలో కానీ ఇతర ఏ దేవతల చేతగానీ మరణం సంప్రాప్తించకూడదని. అందుకు తగ్గట్టుగానే భగవంతుడు విష్ణు రూపంలో అతన్ని పరిమార్చకుండా, కృష్ణావతారం ఎత్తి అతన్ని నిర్జిస్తాడు.

 8. 13.   కంసుడు మహాపరాక్రమశాలి.తను యువరాజవగానే దిగ్విజయ యాత్ర ప్రారంభించి అన్ని దేశాలూ గెలుస్తాడు. యాత్రలో భాగంగా జరాసంధుని రాజధాని చేరుకున్నప్పుడు, అతను కువలయపీడం అనే మత్తగజాన్ని కంసునిపై పురిగొల్పుతాడు.కంసుడు రెండు చేతులతో దాన్ని ఒడిసిపట్టి గిరగిరా త్రిప్పి అది జరాసంధుని సభాప్రాంగణంలో పడేలా విసిరేస్తాడు. జారాసంధుడు అతని బలపరాక్రమాలకి ముగ్ధుడై తన కూతుళ్ళైన అస్థి, ప్రాప్తిలను అతనికిచ్చి వివాహం చేస్తాడు. అస్థి మొహం ఎప్పుడూ ఇంకాసేపట్లలో తుమ్మబోయేలా ఉంటే, తుమ్మిన తర్వత మొహం ఎలా ఉంటుందో ప్రాప్తి మొహం అలా ఉంటుంది.

 9. 14.   కంసుడు ఆ తర్వాత చాణూర ముష్టికాదులను ఓడించి వారిని తన అనుచరులుగా మార్చుకుంటాడు.అదే ఊపులో వానరుడైన ద్విందుడుని, ఋష్యమూక పర్వతంపై నివశిస్తున్న కేశి ని ఓడించి వారితో సఖ్యం ఏర్పరుచుకుంటాడు.ఆ తర్వాత మహేంద్రపర్వతం వెళ్ళి పరశురాముని కవ్విస్తే, ఆయన తన ధనస్సు అతనికిచ్చి ఎక్కుపెట్టమంటాడు. కంసుడు అలవోకగా ఆ ధనువు చేతబట్టి ఎక్కుపెడితే, ఆ ధనస్సుని అతనికే ఇచ్చివేసి, మహావిష్ణువు పరిపూర్ణావతారం అతని అంతఃపురానికి వచ్చి దాన్ని తిరిగి ఎక్కుపెట్టగలదని, ఆ అవతారం చేతిలో మరణం తధ్యమని చెబుతాడు.

 10. 15.   ప్రజాపతి సుతపుడు,అతని భార్య పృష్ణి పన్నెండువేల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి మహావిష్ణువునే కొడుకునుగా పొందే వరం పొందుతారు. మూడు జన్మలలో వారి కొడుకై జన్మించి వారిని తరింపచేస్తాడు నారాయణుడు.మొదట సుతపుడు-పృష్ణి దంపతులకు పృష్ణిగర్భుడిగా,తర్వాత అదితి,కశ్యపులకు వామనుడిగా, పిదప దేవకీ వసుదేవులకు శ్రీ కృష్ణుడిగా జన్మిస్తాడు.

 11. 16.   కంసుని చేత వధింపబడిన ఆరుగురు దేవకి వసుదేవ పుత్రులకు ఒక శాపముంది. వారు గతంలో మరీచి, ఊర్ణాదేవి అనే ఋషి దంపతుల పిల్లలు. ఒకసారి సత్యలోకం వెళ్ళి బ్రహ్మదేవుని చూసి నవ్వటంతో రాక్షసులై పుట్టండని ఆయన శపిస్తాడు. అలా మొదట కాలనేమి (కంసుని పూర్వజన్మ) పుత్రులుగా జన్మిస్తారు.తర్వాత హిరణ్యకశిపుని తనయులుగా పుడతారు. ఆ జన్మలో గొప్ప తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి దీర్ఘాయువును  వరంగా పొందుతారు. తనకులేని దీర్ఘాయువు తన కొడుకులు పోందటంతో హిరణ్యకశిపుడు ఆగ్రహించి మీరంతా దీర్ఘనిద్రలో ఉండి చనిపోతారని, పూర్వజన్మలో మీ తండ్రే రాబోయే జన్మలో మిమ్మల్ని చంపుతాడని శపిస్తాడు.

(మిగతా విశేషాలు తరువాతి టపాలో)

3 comments

Post a Comment

ఆవేశమంతా ఆలాపనే లే

వినడానికి అద్భుతంగా ఉండి చిత్రీకరణలో తేలిపోయిన ఎన్నో పాటల్లో ఇదొకటి. లిరిక్  విని పాట ఇలా తీసుంటారని అలా తీసుంటారని ఏదేదో ఉహించుకున్నాను.పల్లవి విని ఇదేదో కథానాయకుడు ఆవేదనతో పాడే పాటేమోననుకున్నాను. చరణాలు విన్నాక ' కాదు ఇది హీరో తన భావావేశాన్నే హృద్యంగా వెల్లబుచ్చే పాట ' అనుకున్నాను.అప్పటికి నేనీ సినిమా చూడలేదు. అయితే హీరోయిన్ భానుప్రియ అని,దర్శకుడు వంశీ అని తెలుసు. హీరో మోహన్ అని మాత్రం తెలీదు. పాట బాగా నచ్చడంతో చాలా సార్లు మళ్ళీ మళ్ళీ విన్నాను. విన్న ప్రతిసారీ కథానాయకుడి మన:స్థితిని పొంది ఒక తియ్యని అనుభూతికి లోనయ్యాను.మొన్నామధ్య తేజ టీ.వి లో ఈ సినిమా వస్తూంటే ఆత్రంగా చూశాను. పది నిమిషాలయ్యేసరికి సినిమా నిరుత్సాహాన్ని కలిగించింది. వంశీ లాంటి భావుకుడు కూడా అంత చప్పగా  పాటను ఎలా తీశారా అని అనిపించింది. పాటలో ఉన్న గాఢతను తెర మీద ప్రతిఫలించటంలో ఆయన విఫలమయ్యారు. తర్వాత చూడలేక ఛానల్ మార్చేశాను.

ఈ పాటకు సంగీతం ఇళయరాజా. సాహిత్యం వేటూరి. ఇందులో మొదటి చరణంలో వేటూరి భావసౌందర్యం చూడండి

అల పైట వేసే సెలపాట విన్నా
గిరి వీణ మీటే జలపాతమన్నా
( సెలయేరు వేగంగా ప్రవహిస్తున్నప్పుడు ఉప్పొంగి ఎగసే అలలు దానికి పైటలాగా ఉన్నాయట.  పర్వతం ఒక వీణయితే,అ పర్వతం పైనుంచి దూకే జలపాతం ఆ వీణకున్న తంత్రి అట.అలతి పదాలలో ఎంత అద్భుతమైన భావం ఇమిడ్చారో చూశారా !  )

నాలోన సాగే ఆలాపన
రాగాలు తీసే ఆలోచన

ఝరుల గమన నాట్యం
అరవిరుల మరుల కావ్యం
ఎగసి ఎగసి నాలో
గళమధువులడిగే గానం
(గళమధువులన్నది ఇంకో మంచి ప్రయోగం)
నిదురలేచే నాలో హృదయమే

వేటూరి ఇంటిపేరుని 'పాటూరి' గా మార్చినా తప్పులేదేమో. అంత అపుర్వమైన పాటలు వ్రాశారాయన.


3 comments

Post a Comment

కోట్లు ఖర్చుపెట్టినా పసలేని సినిమాలుకొన్ని సినిమాలు ఆరంభం నుంచే ఊరిస్తూంటాయి.హీరో హీరోయిన్ల కాంబినేషన్ వల్లనో,హీరో దర్శకుల అరుదైన కలయిక కారణంగానో,ఒక ప్రతిష్ఠాత్మకమైన బేనర్ నిర్మించే చిత్రం కావటం వల్లనో,లేక ఒక హిట్ కాంబినేషన్ రిపీటవ్వడం మూలానో ఎక్కడలేని క్రేజ్ ఏర్పడుతుంది.షూటింగ్ స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొట్టిన దగ్గర్నుంచి చిత్రీకరణ పూర్తయ్యి గుమ్మడికాయ కొట్టి విడుదలయ్యే నాటి వరకు ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తారు.దానికి తగ్గట్టు 'ఈ సినిమాలో హీరోని ఎవ్వరూ ఊహించని విధంగా చూపిస్తున్నాం,ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్,ప్రసిద్ధ కెమెరామెన్,సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నారు, సినిమాని అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నాం,ఇన్ని సెట్స్ వేశాం,ఎవరూ చూడని ప్రదేశాలు చూపిస్తున్నాం,ఇన్ని కోట్లు ఖర్చుపెట్టాం, క్వాలిటీ విషయంలో  రాజీపడకుండా నిర్మిస్తున్నాం' అని విడుదలకు ముందు సదరు నిర్మాతలు చెవినిల్లు కట్టుకొని పోరుపెడతారు.నిజమే కాబోలని నమ్మేసి ముందూ వెనక ఆలోచించకుండా డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున డబ్బులు చెల్లించి హక్కులు కొంటారు.వేలకు వేలు తగలేసి అభిమానులు బేనర్లు కటౌట్లు పెడతారు.ఉత్సాహంతో ర్యాలీలు చేస్తారు. పిచ్చి ముదిరి పాకాన పడిన ఇంకొంతమంది రిలీజ్‌కు ముందే 'మా సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది,ఈ రికార్డ్ బ్రేక్ చేస్తుందని' పందేలు వేసుకుంటారు.

సినిమా రిలీజవుతుంది.
కథ ఉండదు,కథ ఉంటే లాజిక్ ఉండదు,రెండూ ఉన్నా కథనం ఉండదు.

సినిమా బాక్సాఫీసు దగ్గర చతికిలపడుతుంది.
పరువుపోయిందని అభిమానులు బూతులు తిట్టుకుంటూ మొహాలు వేళ్ళాడదీసుకొని బయటికివస్తారు.
తెచ్చిన అప్పు,కట్టాల్సిన వడ్డీ తలుచుకోని డిస్ట్రిబ్యూటరు బావురుమంటాడు.

దీనికంతటికీ కారణం ఎవరు?

అనుభవజ్ఞుడైన శిల్పి ఒక విగ్రహాన్ని దీక్షగా చెక్కినట్టు తెగ బిల్డప్పిచ్చి చివరకు తలతోకా లేని సినిమాను తీసిన దర్శకుడిదా?
గుడ్డిగా అతన్ని నమ్మి డబ్బుని మంచినీళ్ళలా ఖర్చుపెట్టిన నిర్మాతదా?
ఫైట్లు,డాన్సుల మీద ఉన్న ఇంటరెస్టు, కథ మీద లేని హీరోలదా ?

ఉదాహరణకు ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు తీసుకుందాం.పవన్‌కళ్యాణ్  నటించిన ' కొమరం పులి ' సినిమా దాదాపు రెండేళ్ళపాటు నిర్మాణం జరుపుకొని ఆ మధ్యే రిలీజయ్యింది.ఈ సినిమాని చూసిన ప్రేక్షకుడికెవరికైనా ఇంత నాసిరకం సినిమాకి అన్నేళ్ళు అన్ని కోట్లు ఎందుకు ఖర్చుపెట్టారో ఒక పట్టాన అర్థం కాదు.కథ లేదు,ఉన్న లైన్ కుడా బాగా నలిగిపోయిన కథ.పోనీ అదే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారా అంటే అదీ లేదు.బ్యాంకాక్ లో సన్నివేశాలు చిత్రీకరించి వాటిని హైదరాబాద్ కి ఆపాదిస్తాడు దర్శకుడు.ఇక హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యటానికి సృష్టించిన పోరాటాలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

మహేష్ ' ఖలేజా ' కుడా అంతే. మూడేళ్ళ తర్వాత వచ్చిన ఈ చిత్రంలో కాస్త కథ ఉన్నా,దాని మీద కసరత్తు చెయ్యకుండా తన ట్రేడ్ మార్క్ కామెడీ  మీద దృష్టిపెట్టాడు దర్శకుడు.పాటలు వీక్.వినడానికి బావున్న కొన్ని పాటలు, చిత్రీకరణలో అంతంతమాత్రం. సమయం సందర్భం లేకుండా వచ్చిపోతూంటాయి.దానికి తోడు కథకు సంబంధం లేని టైటిల్. ' కొమరం పులి ' కి 42కోట్లు ఖర్చైతే, ' ఖలేజా ' కి 50కోట్ల బడ్జెటయ్యిందనీ నిర్మాత సెలవిచ్చారు. ' వరుడు 'లో ఐదురోజుల పెళ్ళి విశిష్టత గురుంచి చెప్పాలనుకున్న గుణశేఖర్, కేవలం ఆ పెళ్ళి, ఆ సెట్టింగు మీదే మనస్సుపెట్టటంతో సినిమా ఘోరపరాజయం పాలై అల్లు అర్జున్ కి షాక్‌నిచ్చింది. ఈ చిత్రానికైన ఖర్చు 31 కోట్లని ఒక రూమరు. ఈ సొమ్ములో ఒక్కశాతం ఇచ్చినా ఇంతకంటే మంచి కథలు అందించేవాళ్ళు మన వర్ధమాన రచయితలు. అంత ఓపిక లేదు. ఈ స్పీడుయుగంలో ఎంత త్వరగా నాలుగురాళ్ళు వెనకేసుకుంటే అంత గొప్ప కాబట్టి హడావుడిగా సినిమా ప్రారంభిస్తారు. చివరకి ఏం తియ్యాలో తెలియక, తీసినవాటిని మార్చి ,మార్చిన వాటిని మళ్ళీ తీసి, ఇలా ఏళ్ళు గడిపి చివరకి ఏదో అయ్యిందనిపిస్తారు. దాని ఫలితం కూడా అలానే ఉంటుంది.

ఈ వ్యాధి ఒక్క మన తెలుగు దర్శక నిర్మాతలకే కాదు మణిరత్నం లాంటి లబ్ధప్రతిష్టులైన దర్శకులకి ఉంది. ఒక సాదాసీదా కథకి రామాయణన్ని, ముఖ్యంగా అందులో రావణుడి వ్యక్తిత్వాన్ని విశ్లేషించే యత్నం చేసినట్లు ప్రొజెక్ట్ చేసి కుతూహలం పెంచారు. ఈ సినిమా బడ్జెట్ 55 కోట్లు. ప్రధాన పాత్రధారుల నటన, ఫోటోగ్రఫీ, సంగీతం బావున్నా, కథ తేలిపోవటంతో ఈ సినిమా బోల్తాపడింది. ఈ విషయంలో శంకర్‌కి కూడా మినహాయింపేమీ లేదు. 150 కోట్లు(అనధికారిక అంచనా 200 కోట్ల పైనే) ఖర్చుపెట్టి తీసిన ఈ సినిమాలో కథ అంతంతమాత్రమే. ఇదే కాన్సెప్ట్ తో కన్నడలో ఉపేంద్ర ' హాలీవుడ్ ' అనే చిత్రాన్ని తీసాడు చాలా కాలం క్రితం. అది గొప్ప ఫెయిల్యూర్‌గా మిగిలిపోయింది. అదే కథకి కాస్త టెక్నాలజీనీ జోడించి శంకర్ మళ్ళీ  ప్రేక్షకుల మీదకు వదిలాడు. చిత్ర కథానాయకుడు రజనీ కావటం,కొన్ని గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండటంతో సినిమా కాస్త బయటపడింది కానీ లేకుంటే డిస్ట్రిబ్యూటర్లు మసైపోయేవాళ్ళు.(తమిళ సోదరులు ఎంత గింజుకున్నా రోబో తెలుగులో 20 కోట్లకు మించి చెయ్యదని ట్రేడ్ పండితుల అంచనా.ఒక డబ్బింగ్ చిత్రం అంత వసూలు చెయ్యటం గొప్ప విషయమే కానీ,దాన్ని కొన్నది 30 కోట్లకు.కాబట్టి నష్టం తప్పదు).

ఏతావాతా చెప్పోచ్చేదేమిటంటే సినిమాకు కథ ముఖ్యం.

కథనం ఊపిరైతే కథ శరీరం లాంటిది.
 

ఈ రెండూ లేకుండా  సరిగ్గా లేనప్పుడు మిగతా ఎన్ని హంగులు,ఆర్భాటాలు ఉన్నా సినిమాని రక్షించలేవు.ఈ విషయం మన దర్శక,నిర్మాతలు ఇప్పటికైనా గ్రహిస్తే భవిష్యత్తులో ఇలాంటి కాస్ట్లీ మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ జరగవు.లేకపొతే తెలుగు సినిమా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.8 comments

Post a Comment