గోదావరి యాత్ర-3 (దక్షారామం,సామర్లకోట, అన్నవరం, పీఠాపురం, కాకినాడ)

దక్షారామం


దాక్షారామం గురుంచి చెప్పుకునే ముందు పంచారామాల గురించి తెలుసుకోవాలి.

తారకాసుర సంహార సమయంలో అతని గొంతులో ఉన్న తన తండ్రి పరమశివుడి ఆత్మలింగాన్ని ఆగ్నేయాస్త్రంతో బేధిస్తాడు కార్తికేయుడు. ఆత్మలింగం ఐదు ముక్కలైపోయి ఒక్కో ముక్క ఒక్కో క్షేత్రంలో పడుతుంది. ముక్కలైన లింగాలు ఆకర్షణాశక్తితో తిరిగి ఏకమవ్వాలని, పెరిగిపోయి ఆకాశం వైపు సాగిపోతుంటే, దాన్ని నిలువరించటానికి  సూర్య చంద్రులు, కార్తికేయుడు, ఇంద్రుడు, మహావిష్ణువు ఆ లింగాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అలా ఏర్పడినవే పంచారామ క్షేత్రాలు - అమరావతి, దక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, గునుపూడి. అమరావతి దూరమైపోతుంది కాబట్టి మిగతా నాలుగు ఆరామాలు దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాం. 

దక్షారామానికి విశేషమైన పురాణ ప్రాశస్త్యంఉంది. ఇది పంచారామాలలో ఒకటి మాత్రమే కాదు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కూడా. దక్షప్రజాపతి నిరీశ్వరయాగం చేసి నిహతుడై మేకముఖంతో పునర్జీవితుడైన స్థలం ఆలయానికి దగ్గర్లోనే ఉంది. సతీవియోగంతో ఖిన్నుడైన పరమేశ్వరుడు  ఆగ్రహంతో ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని ప్రళయతాండవం చేస్తూంటే  అఖిలలోకాలు గడగడలాడాయి. అందరూ స్థితికారకుడైన మహావిష్ణువు శరణు కోరితే, ఆయన శివున్ని శాంతపరచడానికి తన సుదర్శన చక్రం ప్రయోగించి సతీదేవి దేహాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించాడు. అలా ఖండింపబడ్డ శరీరభాగాలు పద్దెనిమిదిచోట్ల పడి అవే అష్టాదశ శక్తిపీఠాలయ్యాయి. ఇక్కడ అమ్మవారి నాభి పడింది. ఆమె మాణిక్యాంబగా కొలువై ఉంది. సూర్యభగవానుడు పూజించిన ఈ లింగానికి తూర్పు చాళుక్య భీముడు ఆలయం నిర్మించాడు. అందుకే భీమేశ్వరాలయం అయ్యింది. తనకు తన శిష్య పరివారానికి భిక్ష దొరకలేదన్న కారణంతో కాశీ నగరాన్ని శపించబోయి పరమేశ్వరుని ఆగ్రహానికి గురై వెలేయబడ్డ వ్యాస మహర్షి ఇక్కడే భీమేశ్వర-మాణిక్యాంబ సేవలో తరించి ఉపశమనం పొందారు.





ఆలయ ప్రవేశం చేయబోయేంతలో ద్వారం వద్దే బ్రాహ్మణుల గుంపు ఒకటి మమ్మల్ని  అటకాయించింది. వాళ్ళలో చొరవ కలిగిన బ్రాహ్మణుడొకరు ఆలయ విశేషాలన్నీ విపులంగా చెబుతామని,మరే క్షేత్రంలోనూ ఇంత వివరంగా చెప్పే వాళ్ళు దొరకరని,విశేషాలు చెప్పినందుకు ప్రతిగా భక్తులు తమకు తోచిన సొమ్ము  బ్రాహ్మణ సంఘానికి దానం చెయ్యాల్సి ఉంటుందని, ఆ ధనాన్ని తాము పేద బ్రాహ్మణ సంక్షేమం కోసం వినియోగిస్తామని చెప్పాడు. ఇదేదో ఉభయ తారకంగా ఉందని, చొరవగా మాట్లాడిన బ్రాహ్మణున్నే మేం  కుదుర్చుకున్నాం.

ఆ బ్రహ్మణుడు నిజమే చెప్పాడని తర్వాత తెలిసింది. అమరావతి సంగతి తెలియదు గానీ, మిగతా పంచారామాల్లో ఇలా క్షేత్ర మహత్యాన్ని, విశేషాలని చెప్పే వాళ్ళు నిజంగానే లేరు. పైగా ఆయన స్వస్థలం మా ఊరి దగ్గరే - శ్రీకాళహస్తట. చాలా ఏళ్ళ క్రితం వచ్చి ఇక్కడే స్థిరపడ్డారట. ఎంతో ఓపికతో ఆలయం అంతా కలయతిప్పి సంగతులన్నీ తెలియజేశారు.

దక్షారామం భోగస్థానం. ఇక్కడికెవరైనా అనుకోకుండా వస్తారు కానీ ముందే ప్రణాళికలు వేసుకొని రావడం జరగదట. రావణ సంహారానంతరం బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకొనే ప్రయత్నంలో సాక్షాత్తూ శ్రీరాముడు ప్రతిష్ఠించిన లక్ష్మీనారాయణుడు ఇక్కడి  క్షేత్రపాలకుడు. ఆలయంలోపల ఓ వైపు గర్భాలయం నమునాలో ఏకశిలతో చెక్కిన మరుగుజ్జు కట్టడం ఉంది. అది నమునా కాదని, నమునాలు కట్టి నిర్మాణాలు చేసేది మానవులు కాని దేవతలు కారని, అది భవిష్యత్తులో పాపాలు పెరిగి మనుష్యులు అంగుష్ఠ మాత్రులైనప్పుడు వారి సౌకర్యార్థం నిర్మించిన ఆలయమని చెప్పారు.





గర్భాలయానికి అభిముఖంగా ఠీవిగా నిలబడ్డ నిలువెత్తు నందీశ్వరుడు అబ్బుర పరుస్తాడు. త్రివిక్రముడైన భీమేశ్వరుడు ఇక్కడ తన  ధవళ  స్వరూపాన్ని తొమ్మిడడుగులకు కుదించుకుని రెండంతస్థులు ఆక్రమించి  భక్తులను అలౌకికానుభూతికి గురి చేస్తాడు. ప్రాతఃకాలంలో ఉషాకిరణాలు స్వామి వారిపై పడినప్పుడు మరింత వైభవంగా ఉంటుందట. క్రింద పానవట్టం దర్శించుకొని  మెట్లెక్కి పైకి వెళ్ళి పూర్తి లింగస్వరూపాన్ని దర్శించుకోవాలి. లింగం పైనున్న చిహ్నాలు కుమారస్వామి ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం గుర్తులని కొందరు, కిరాతుని రూపంలో అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు ధరించిన పులిచర్మం గుర్తులని ఇంకొందరు అంటారు.  భీమేశ్వరుని ప్రక్కనే సతీదేవి కొలువై ఉంటుంది. గర్భాలయం లోపల చీకటిగా ఉంటుంది. పూర్వం వెలుతురు కోసం గోడలకు వజ్రాలు,మణులు తాపించారట. ఔరంగజేబ్ దండయాత్రల కాలంలో ఇతరుల పాలవడం ఇష్టం లేక వాటంత అవే రాళ్ళుగా మారిపోయాయని గోడలపై పొడుచుకొచ్చిన రాళ్ళను చూపించి చెబుతారు.




మాణిక్యాంబ అమ్మవారు వామాచార స్వరూపిణి. ఎడమవైపు చూస్తూంటారు. హిమవంతుడు-మేనకాదేవిల ముద్దులపట్టి కనుక పార్వతీదేవికి మైనాకాంబ అని మరో పేరుంది. అదే మాణిక్యాంబగా రూపాంతరం చెందింది. అమ్మవారి స్వరూపం క్రింద శ్రీచక్రాన్ని నిక్షిప్తం చేశారు. అమ్మవారు స్వామివారు సమాన స్థాయిలో వినుతికెక్కిన ఆలయాల్లో ఇదొకటి. మిగతా రెండు ఆలయాలు- కాశీ (అన్నపూర్ణ,విశ్వనాథుడు), శ్రీశైలం (భ్రమరాంబ,మల్లికార్జునుడు).శ్రీనాథ కవిసార్వభౌముని భీమఖండం దాక్షారామ వైభవాన్ని తెలియజేస్తుంది.

దర్శనం పూర్తయ్యాక మాకు గైడ్‌గా వ్యవరించిన బ్రాహ్మణుడికి సంతోషంతో కొంత సొమ్ము ముట్టజెప్పబోయాం. ఆయన తనకొద్దొంటూ యువకుడైన మరో బ్రాహ్మణున్ని చూపించి ఆయనకివ్వమన్నారు. ఆ యువకుడికి మేమిచ్చిన మొత్తం నచ్చలేదు. సొమ్ము పుచ్చుకోకుండా పెదవి విరిచి ఇక్కడికొచ్చే భక్తులు కనీసం మూడువేలకు తక్కువ కాకుండా విరాళాలు ఇస్తారని అలకబూనాడు. మేమంత తూగలేమని చెప్పాం. అతను వినలేదు. చివరికి మా గైడ్ ఏమనుకున్నాడో మరి అతనికి నచ్చజెప్పి సొమ్ము స్వీకరించేలా చేశాడు
.

సామర్లకోట కుమారారామ భీమేశ్వరాలయం

శివపుత్రుడైన కుమారస్వామి సేవించిన లింగం కాబట్టి కుమారారామ భీమేశ్వరుడంటారు. ఈ ఆలయం దక్షారామాన్ని పోలి ఉంటుంది. దక్షారామంలో లాగే ఇక్కడున్న శివలింగం కూడా పొడుగ్గా ధవళ కాంతులతో మెరిసిపోతూ రెండంతస్థులు ఆక్రమించి ఉంటుంది. పంచారామాల్లోని మిగతా లింగాలు భోగప్రదాయకమైనవైతే ఇది యోగకారక లింగం. అమ్మవారి పేరు బాలాత్రిపురసుందరి. చైత్ర  వైశాఖ మాసాలలో సహస్రకరములతో  సూర్యభగవానుడు  పగటి పూట స్వామివారి పాదాలకు, సాయంకాలం అమ్మవారి పాదాలకు ప్రణమిల్లుతాడని ప్రతీతి. 






సామర్లకోట పూర్వ నామధేయం స్వాములకోట లేదా శ్యామల కోట అట. పూర్వం వైష్ణవ స్వాములు ఎక్కువగా నివసించిన స్థలమని ఓ కథనం చెబితే, శ్యామలాంబ గుడి, దాని చుట్టూ కోట ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని మరో కథనం చెబుతుంది.  మా దర్శనం పూర్తైన వెంటనే  మధ్యహ్నమయ్యిందని గుడి మూసేయటంతో అదృష్టం కోద్దీ దర్శనం లభించిందనే చెప్పాలి.

సామర్లకోట నుంచి పీఠాపురం వెళ్ళేసరికి పురుహూతికా దేవి-శ్రీ కుక్కుటేశ్వర స్వామి వార్ల ఆలయం ముసేశారు. పునర్దర్శనం మధ్యహ్నం మూడున్నర తర్వాతే అని తెలిసింది. భోజనాల కోసం వీధులు వెదుక్కుని హోటళ్ళ చుట్టూ తిరగటం కంటే దేవాలయాల్లో జరిగే ఉచిత నిత్యాన్నదానంతో కడుపు నింపుకుంటే ఇటు పుణ్యం అటు సమయం కలిసొస్తుందని మాకు ముందే చెప్పాడు మా డ్రైవరు. దర్శనానికి విరామమిచ్చినా భోజనాలు వడ్డిస్తూండటం చేత గుడి తలుపులు తెరిచే ఉంచారు.ఆకలి రుచెరగదంటారు కదా. అందరం భోంచేసి, వేడి వేడి అన్నం తినటం చేత, ఉక్కబోత చేత పట్టిన చెమటని తుడుచుకుంటూ కాసేపు ఆలయ మండపంలో విశ్రాంతి తీసుకొని, మరో రెండు గంటలు ఏం చెయ్యాలో తెలియక తర్జనభర్జన పడి చివరికి అన్నవరం వెళ్ళిరావాలని నిర్ణయించుకున్నాం.

అన్నవరం


పంపానదీ తీరాన రత్నగిరిపై కొలువైన భక్తవరదుడు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి. మేరువు కుమారులు భధ్రుడు,రత్నాకరుడు. ఘోర తపస్సు చేసి శ్రీరామచంద్రున్ని తనపై కొలువుంచుకునే వరం పొందిన అన్నయ్యను చూసి, రత్నాకరుడూ స్పూర్తిని పొందాడు. తదేక దీక్షతో శ్రీమహావిష్ణువును మెప్పించి త్రిమూర్త్యాత్మకమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణుని రూపంలో స్వామివారిని మోసే భాగ్యం పొందాడు.

స్వామివారి స్వరూపం అనేక విశేషాలకు ఆలవాలం. మూలవిరాట్టు క్రిందిభాగంలో ప్రతిష్టించిన నారాయణయంత్రం సర్వశక్తిమంతమైనది. అది బ్రహ్మస్వరూపం. పంచాయతనానికి గుర్తుగా ఆయనకు నలువైపులా వినాయకుడు, బాలాత్రిపురసుందరి, మహేశ్వరుడు, సూర్యనారాయణుడు కొలువై ఉంటారు. యంత్రం మీదుగా లింగాకృతిలో పైకి లేచిన మధ్యభాగం పరమశివుడికి ప్రతీక. ఊర్థ్వభాగంలో విష్ణు స్వరూపమై ధనుర్బాణాలు, వంపులు తిరిగిన



మీసకట్టుతో శ్రీ సత్యనారాయణుడు కనువిందు చేస్తాడు. స్వామివారికి ఎడమవైపు అనంతలక్ష్మి అమ్మవారు,కుడివైపున మహేశ్వరుడు నెలవై ఉంటారు. సృష్టి, స్థితి, లయకారకులను ముగ్గురినీ సూచించే స్వరూపం కనుకనే త్రిమూర్త్యాత్మకం  అన్నారు.  బ్రహ్మకు పూజలు జరిగే అతికొద్ది దేవాలయల్లో ఇదొకటి.  సీతారాములు ఈ ఆలయానికి క్షేత్రపాలకులు. దగ్గర్లోనే కొలువై ఉన్న వనదుర్గ ఆలయం మహామహిమాన్వితమైనది. ఆమె రాత్రి పూట నగర సంచారం చేస్తూ ప్రజలను రక్షిస్తూంటుందని ఓ నమ్మకం.

స్వయంభువుగా వెలసిన సత్యదేవుడు పూర్వం ఈరంకి ప్రకాశం అనే బ్రాహ్మణుడి కలలో కనబడి తను రత్నగిరిపై వెలసి ఉన్నానని, తనను ప్రతిష్ఠించి శాస్త్రప్రకారం తనకు పూజాదులు నిర్వహించమని ఆదేశించారు .బ్రాహ్మణుడి స్వప్న వృత్తాంతం తెలుసుకున్న ఆ ఊరి జమిందారు గారు గ్రామస్తుల సాయంతో వెదికించి, స్వామివారిని గుర్తించి, వెలికితీయించి, ప్రతిష్ఠించి పూజాదులు ప్రారంభించారు. అన్న (అడిగిన) వరాలను తీర్చే క్షేత్రం కనుక అన్నవరమైంది.

అన్నవరం చిన్న టౌన్. క్షేత్రం, క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రీకుల కోసం వెలసిన హోటళ్ళు తప్ప పెద్ద వూరేం లేదు. భక్తులు వెళ్ళేందుకు ఉన్న నడకదారిని చూసి శంకరాభరణం సినిమాలోనున్న చంద్రమోహన్, రాజ్యలక్ష్మిల సన్నివేశం గుర్తొచ్చింది. కొండపైకి ప్రయాణం తిరుమల ఘాట్‌రోడ్లను తలపించింది. వాహనాలను నేరుగా గుడి వెనుక భాగం వరకు తీసుకువెళ్ళచ్చు కాబట్టి వయస్సుమీదపడినవాళ్ళు తిరుమలోలా ఎక్కువ దూరం నడవాల్సిన పనిలేదు. భక్తుల రద్దీ లేకపోవటం చేత పది నిమిషాల్లో దర్శనం అయిపోయింది.







వైష్ణవులు,శైవులు అన్న భేదం లేకుండా అన్ని విశ్వాసాలవాళ్ళు కొలిచే దైవం శ్రీ సత్యనారాయణస్వామి. గోధుమఊక, ఏలకులు, పచ్చకర్పూరం, పాలు, నెయ్యి మొదలైన పదార్థాలతో  చేసిన ప్రసాదం స్వామివారికి ప్రీతిపాత్రం. ఆలయంలో భక్తులు వ్రతాలు చేసుకొనే వెసులుబాటు కూడా ఉంది. ఘాట్‌రోడ్ మీదుగా క్రిందకు దిగుతూంటే ప్రశాంతంగా ప్రవహిస్తున్న పంపానది  కాసేపు తన అందచందాలతో కట్టిపడేసింది.



పీఠాపురం (పురుహూతికా దేవి-శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం) 


పీఠాపురానికి మూడు ప్రత్యేకతలున్నాయి.

మొదటిది- దీన్ని పాదగయ క్షేత్రం అంటారు. ఇక్కడ పరమశివుడు కుక్కుటేశ్వర స్వామి రూపంలో పూజలందుకుంటున్నాడు. కుక్కుటం అంటే కోడి. పూర్వం గయాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి శ్రీమహావిష్ణువును మెప్పించి ఒక విచిత్రమైన వరం పొందాడు. భూప్రపంచంలో తనను మించిన పవిత్రమైన ప్రాణి, తన శరీరాన్ని మించిన పవిత్రమైన స్థలం మరెక్కడా ఉండకూడదని, తనను ఎవరు దర్శించినా, స్పృశించినా వాళ్ళ పాపం తొలగిపోయి పునీతులవ్వాలని వరం పొందాడు. దీంతో ఇంద్రాది దేవతలకు కొత్త చిక్కు వచ్చి పడింది. భూలోకంలో పాపుల సంఖ్య నానాటికీ క్షీణించి సకల ప్రాణులతో స్వర్గం నిండిపోతూండటంతో వాళ్ళు తలలు పట్టుకున్నారు. త్రిమూర్తులను శరణు వేడారు. వాళ్ళు చిరునవ్వు నవ్వి బ్రాహ్మణ రూపాలు ధరించి గయాసురున్ని సమీపించారు. తామొక దివ్యయజ్ఞం తలపెడుతున్నామని అయితే దానికి అనువైన పవిత్ర స్థలం గయాసురుని శరీరం తప్ప మరొకటి లేదని, ఏడు రోజులపాటు తమ యజ్ఞానికి సహకరించాలని కోరారు.

గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని భారీగా విస్తరింపజేశాడు. త్రిమూర్తులు అతని శరీరంపై కూర్చుని యజ్ఞం ప్రారంభించారు. వేయినాల్కలలో ఎగిసిపడుతున్న యజ్ఞాగ్నిని భరిస్తూ కదలకుండా పడుకుని కోడికూతతో రోజులు లెక్కపెట్టుకొంటూ ఆరురోజులు నెట్టుకొచ్చాడు గయాసురుడు. ఏడవరోజు సమీపిస్తూండటంతో పరమశివుడు ఇక లాభం లేదని కుక్కుట రూపం ధరించి ముందుగానే కూతపెట్టాడు. గడువైపోయిందని గయాసురుడు తన దేహాన్ని కదిలించేసరికి యజ్ఞానికి విఘ్నం కలిగింది. ఏడురోజులపాటూ యజ్ఞాగ్ని భరించలేనివాడివి ఇతరులపాపాలు ఎలా భరించగలవని ప్రశ్నిస్తారు బ్రాహ్మణులు. యజ్ఞానికి ఆటంకం కలిగించావు కనుక సంహారం తప్పదంటే, వచ్చినవారు త్రిమూర్తులే అని గ్రహించిన  గయాసురుడు తన దేహానికి పూజార్హత కలిగించమని వేడుకున్నాడు. అలా


గయాసురుని శిరోభాగం (బుద్ధగయ-బీహార్), నాభి (జాజ్‌పూర్-ఒరిస్సా), పాదాలు (పీఠాపురం) పావనమయ్యాయి. పరమశివుడే ఇక్కడే కుక్కుటేశ్వరుడిగా వెలశాడు.



రెండవది -ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి.ఇక్కడ అమ్మవారి ఎడమచేయి పడింది. గౌతమ మహర్షిచే శాపగ్రస్తుడైన ఇంద్రుడు ఇక్కడే అమ్మవారిని సేవించి పురుషత్వాన్ని తిరిగి పొందాడని పురాణ కథనం చెబుతోంది. పురుహూతికా దేవి నాలుగు చేతులలో కమలము, బీజాలు, పరశువు, మధుపాత్ర ధరించి అలరారుతూంటుంది. బీజాలు కమలము ధరించిన రూపాన్ని పురుహూత లక్ష్మిగా సమయాచారులు, పరశువు, మధుపాత్ర ధరించిన రూపాన్ని పురుహూతాంబగా వామాచారులు కొలిచేవారని మరో కథనం.


మూడవది -శ్రీమహావిష్ణువు పరిపూర్ణ స్వరూపం దత్తాత్రేయుడు. ఆయనే శ్రీపాద శ్రీవల్లభుడిగా అవతరించిన క్షేత్రం పీఠాపురం.

పీఠాపురంలోనే ఉన్న కుంతిమాధవాలయం ప్రశస్తమైనది.పాండవమాత కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవాలయం ఇది.

కాకినాడ


కాకినాడ చేరేసరికి సాయంకాలమైంది .

అధ్యాత్మిక ప్రవచనాలు వినేవాళ్ళాందరికీ కాకినాడ అంటే ముందు గుర్తొచ్చేది పూజ్య గురువు శ్రీ చాగంటి కోటేశ్వర్రావు గారు. ఆయన వాగ్గంగలో మునకలేసి తమ జీవితాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నవాళ్ళు నాతో సహా ఎందరో. అటువంటి విద్వత్వరేణ్యులు కాకినాడలో ఉండటం కాకినాడ వాసుల అదృష్టం. కాకినాడ పూర్వనామం కోకనదమట. ఒకప్పుడు ఎర్రటి కలువలతో నిండిన ప్రదేశం కనుక ఆ పేరట. ఆంగ్లేయులకు  షరా మాములుగా నోరు తిరక్క గో కేనడా అనటం మొదలుపెట్టి జనబాహుళ్యానికి వచ్చేసరికి అది కాకినాడగా మార్పుచెందింది.





పగలంతా ప్రయాణం చేసి అలసిపోయిన మమ్మల్ని సముద్రతీరం సేదతీర్చింది. పొంగెత్తే కెరటాలను సవాలు చేస్తూ పొగరుగా నిల్చున్న కుర్రకారు, ఎగిసిపడే అలలని చూసి భయపడుతూనే వెనక్కి జరిగి, తీరా ఆ అలలు పాదాలను ముంచెత్తి కాళ్ళ క్రింద ఇసుకను లాగేస్తే చక్కిలిగింతలు పెట్టినట్లయ్యి కేరింతలు కొట్టే పసిమనస్సులు, జీవనసంధ్యలో ఉన్నా ఒడ్డున కూర్చుని, త్రుళ్ళిపడే తమ పిల్లల్లో ప్రాత:కాలపు ఉషస్సులు వెదుక్కుని మురిసిపోయే వయోవృద్ధులు, దగ్గరకొచ్చినట్లే వచ్చి అంతలోనే దూరం జరుగుతూ ఒడ్డుకు విరహతాపాన్ని పెంచుతున్న ఓడలు, గూట్లో పెట్టిన నేతి దీపాల్లా దూరంగా మిణుకుమిణుకుమంటూన్న విద్యుద్దీపాలు..ఓహ్.. కొన్ని క్షణాలు అజరామరాలు..

భారమైన హృదయాలతో రాజమండ్రికి తిరుగుప్రయాణమయ్యాం. కాకినాడలో సుబ్బయ్య హోటల్ చాలా ప్రఖ్యాతి కెక్కిందని మా డ్రైవరు చెబితే  రాత్రి భోజనాలకు అక్కడే పార్శిల్ చేయించుకున్నాం. హోటల్  చూడ్డానికి మాములుగా చిన్నగా ఉంటుంది కానీ రుచిలో మాత్రం దానికి తిరుగులేదు. అక్కడలేని వెరైటీలు లేవు. పూర్తి శాకాహార భోజనశాల. భోజనాలు చేసేవారందరికీ తమ దగ్గరున్న రకాలు చెప్పి యజమానే కొసరి కొసరి వడ్డిస్తాడని చెప్పాడు డ్రైవరు.ఇక్కడ పార్శిల్ బుట్టల్లో చేస్తారు. ఒక బుట్ట ఇద్దరికి పూర్తిగా సరిపోయి ఇంకొంత మిగులుతుందంటే  మేం రెండు బుట్టలు తీసుకున్నాం. ఒక్క బుట్ట ఖాళీచెయ్యడానికే ఆపసోపాలు పడ్డాం. మరో బుట్టను వృథాచెయ్యడం ఇష్టం లేక హోటల్‌లోని పనిపిల్లలకు ఇస్తే పాపం వాళ్ళు  చాలా సంతోషించారు.

మరుసటి రోజు యాత్రకు ప్రణాళికలు వేసుకొని కమ్మని జ్ఞాపకాలతో కలల్లోకి జారుకున్నాం.


-(సశేషం)



4 comments

Post a Comment