రసరమ్య కావ్యం శ్రీరామరాజ్యం


రామాయణం భారతీయుల జీవాత్మ. శ్రీ రాముని పితృవాక్య పరిపాలన, సీతారాముల అన్యోన్యత , భరత లక్ష్మణ శతృఘ్నుల భాతృ భక్తి,  ఆంజనేయుని స్వామి భక్తి తరతరాలకీ చిరస్థాయిగా గుర్తుండిపోయేవి. ఎన్ని సార్లు చదివినా, పాడినా తనివితీరని గాథ అది. ఎల్కేజి ప్రేమలు, వెకిలి నవ్వులు, విపరీతమైన హింస, విశృంఖలత్వం తెలుగు సినిమా సామ్రాజ్యాన్నేలుతున్న ఈ రోజుల్లో, ఆ ఉధృతిలో పడి వో గట్టు చేరే ప్రయత్నం చెయ్యకుండా, ఏటికి ఎదురీది రామయణ నేపథ్యాన్ని, అందునా శోక ప్రధానమైన ఉత్తర రామాయణ ఘట్టాన్ని ఎన్నుకొని ఒక సినిమా నిర్మించాలనుకోవడానికి చాలా ధైర్యముండాలి. అంతకు మించి రామ కథ మీద అచంచలమైన భక్తి, విశ్వాసం ఉండాలి. ఆ రెండూ ఉన్న నిర్మాత యలమంచలి సాయిబాబు. మరో నిర్మాత  అయ్యుంటే (శ్రీరామదాసు, పాండురంగడు నిర్మాతలు) ఎలాగోలా ఈ సినిమాని చుట్టేసి ఓ పనైపోయిందనుకొనేవారు. సాయిబాబు మాత్రం ఎక్కడా రాజీపడలేదు. ఖర్చుకు వెనుకాడకుండా అత్యుత్తమమైన ఫలితం కోసం ఆయన పడిన తపనంతా సినిమాలో ప్రతి నిమిషం కనిపిస్తుంది. తెలుగులో ఇటువంటి కమిట్‌మెంట్ ఉన్న నిర్మాతంటే  శ్యాంప్రసాద్ రెడ్డి తప్ప ఇంకెవరూ గుర్తురారు నాకైతే. అందుకే సాయిబాబు గారికో సాష్టాంగ నమస్కారం.


కథ అందరికీ తెలిసిందే కాబట్టి దాని జోలికి పోను. కాకపోతే ఇందులో ఒక ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన మార్పు చేశారు. ఎన్నో ప్రయాసలు పడి సీతారాములనొక్కటి చేసిన హనుమంతుడు మళ్ళీ అడవుల పాలైన సీతమ్మను చూసి కృంగి పోతాడు. దారి చూపవయ్యా అని వేడుకుంటే బాలుని రూపంలో ఆశ్రమంలోనే ఉంటూ రామకథను గానం చేస్తూ, సీతమ్మ దుఃఖానికి ఉపశమనం చేకూర్చమని చెబుతాడు వాల్మీకి. ఇదే సృజనాత్మకత అంటే. రామకథను అణువణువునా జీర్ణించుకుని నిత్యం తర్కవితర్కాలు చేసి విశ్లేషించుకుంటే తప్ప ఇటువంటి భావనలు రావు. శ్రీరామరాజ్యానికి మాతృకైన లవకుశ కూడా కల్పితమే కాబట్టి, హనుమంతుడి పాత్రౌచిత్ర్యం దెబ్బతినలేదు కాబట్టి ఇది తప్పా వొప్పా అన్న ప్రశ్న ఉదయించదు. 




లవకుశతో బేరీజు వెయ్యకుండా చూస్తే శ్రీరామరాజ్యం ఒక అద్భుత దృశ్యకావ్యమనిపిస్తుంది. రాఘవేంద్రరావు వడ్డించిన కమర్షియల్ కిచిడీలతో పోల్చుకుంటే పంచభక్ష్య పరామాన్నం లాంటి ఈ సినిమా ఒక క్లాసిక్ అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. శ్రీరాముడిగా నందమూరి బాలకృష్ణ బాగా చేశాడనే చెప్పుకోవాలి. అతని పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో మెప్పించాడు.  ఆహార్యంలో తండ్రిని తలపించి, ఉచ్ఛారణలో వైవిధ్యాన్ని చూపించాడు. భధ్రుని మాటలు విని సీతను పరిత్యజించే సమయంలో బాధను, శృంగార సన్నివేశాల్లో చిలిపిదనాన్ని, కుశలవులతో వాగ్యుద్ధ సమయంలో రామబాణం వైశిష్ట్యాన్ని చెబుతూ  వీరరసాన్ని,సీత భూమిలోకి వెళ్ళిపోయే సమయంలో దుఃఖాన్ని,అసహాయతను స్పష్టంగా పలికించాడు. అతని దురదృష్టమేమిటంటే యాభైయేళ్ళ వయసులో ఈ సినిమా చేసే అవకాశం రావడం. ఫలితంగా కొన్ని క్లోజప్ షాట్స్‌లో ముదిమి ఛాయలు  కనిపిస్తాయి. వెండితెర రాముడిగా వీక్షకుల  గుండెల్లో కొలువుదీరిన ఆ 'తారకరాము' డి  తనయుడు కావటం మరో చిక్కు. ఎలా చేసినా శల్యపరీక్షలు చేసి తేలిగ్గా పెదవి విరిచేసేవాళ్ళూ లేకపోలేదు. సీతా శోకం ప్రధానమైన ఇతివృత్తంలో వియోగియైన భర్తగా విషాదాన్ని మొహాన పులుముకొని, తన శైలికి భిన్నంగా ప్రశాంతంగా సంభాషణలు పలుకుతూ, రౌద్రరసానికి అలవాటు పడిన అభిమానులని అలరించాలి. ఇన్ని ఒత్తిళ్ళను తట్టుకుంటూ కత్తి మీద సాము లాంటి శ్రీరామ పాత్రపోషణలో బాలకృష్ణ కృతకృత్యుడే అయ్యాడు. టాప్‌హీరో సమయంలోనే బాపుతో భగవాన్ శ్రీ కృష్ణ అనే పౌరాణిక చిత్రం ప్లాన్ చేసినా, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీ కృష్ణార్జున విజయం పరాజయం పాలవ్వడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఇప్పటికి అతని కల సాకరమయ్యింది.


 నయనతార నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సీతగా తన పేరును ప్రకటించగానే రకరకాల సందేహాలు వ్యక్తం చేసి బ్యాడ్ ఛాయిస్‌గా తీర్మానించేసిన ప్రేక్షకులందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా నటించి మెప్పించింది. కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతూంటే అటు బాలామణి సీతగా స్వయంవరంలో, ఇటు రాముని పత్నిగా అంతఃపుర సౌధాలలో, శోకగ్రస్తయైన తల్లిగా వాల్మీకి ఆశ్రమంలో పరిణితి చెందిన హావభావలు కనబరిచి ఆకట్టుకుంది. ఆమె ప్రతిభకు గీటురాయిగా నిలిచే ఎన్నో సన్నివేశాలు ఈ చిత్రంలో ఒకదాని వెనుక మరొకటి వస్తూ మంత్రముగ్ధులను చేస్తాయి. బరువైన సన్నివేశాలలో కంటతడి తెప్పించే సత్తా తనకూ ఉందని రుజువు చేస్తూ తన సినీజీవితానికే తలమానికమైన నటన ఈ చిత్రంలో ప్రదర్శించింది. హాట్సాఫ్ 


కుశలవులగా చేసిన చిన్నపిల్లలు ముద్దుగా చేశారు. కుశుడితో పోలిస్తే లవుడికి ముందస్తు సినిమా అనుభవం ఉండటం వలన అతనిలో భావాలు బాగా పలికాయి. బాల హనుమంతుడిగా చేసిన పిల్లాడు కూడా బాగా చేశాడు. బాలనటుల క్యాటెగరిలో వీరిద్దరిలో ఒకరికి అవార్డొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


అక్కినేని నాగేశ్వరరావు గురుంచి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు. ఇటువంటివన్నీ ఆయనకు కొట్టిన పిండి.


లక్ష్మణుడిగా శ్రీకాంత్ ఫర్వాలేదనిపించాడు. సీతను అడవిలో వదిలే సన్నివేశంలో మాత్రం ఇంకాస్త బాగా  చేసుండాల్సిందనిపించింది .


భూదేవిగా రోజా, భరతుడిగా సమీర్, చాకలి తిప్పడుగా బ్రహ్మానందం, ఇతర పాత్రలలో కే.ఆర్ విజయ, మురళీమోహన్, సీనియర్ నటుడు బాలయ్య సరిగ్గా ఇమిడిపోయారు . మర్యాదరామన్నలో నాగినీడుగా మెప్పించిన విలన్ పాత్రధారి ఋష్యశృంగునిగా నటించారు. నారద పాత్రలో ఏవియస్ కూడా కొన్ని సెకన్ల పాటూ తళుక్కున మెరుస్తారు. ఆంజనేయుడి దవడల మేకప్ మాత్రం ఒక్కో సీన్‌లో ఒక్కోలా ఉంది.


దర్శకత్వం విషయానికొస్తే, పచ్చటి ప్రకృతి కాన్వాసుపై వెచ్చటి ఏడు రంగుల ఇంధ్రధనస్సు చెక్కిన విధాతలా వెండితెరపై శ్రీరామరాజ్యాన్ని హృద్యంగా ఆవిష్కరించారు బాపు.  స్వతహాగా గొప్ప చిత్రకారుడు కావటం మూలన సన్నివేశాన్ని ఎంతబాగా ప్రెజంట్ చెయ్యవచ్చో ఆయనకు బాగా తెలుసు. భారీ రాజప్రాసాదాల నుంచి తెలుగుదనం తొణికిసలాడే ముని పర్ణశాలల వరకు  ఆయన ఆభిరుచి ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. కళ్ళను కట్టిపడేస్తుంది. రమణ గారి సంభాషణలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రాముడి ఏకపత్నీవ్రతతని, హనుమంతుని భక్తి తత్పరతని పిట్ట కథల రూపంలో చెప్పారు. రామయణం అంటే రాముని కథ కాదని, రాముడు నడిచిన మార్గమని అందరికీ తెలిపే ప్రయత్నం చేశారు. లవకుశలోని కొన్ని పద్యాలు డైలాగ్స్ రూపంలో అక్కడక్కడా వాడుకున్నారు. గ్రాఫిక్స్ విరివిగా ఉపయోగించారు.

ఇళయరాజా సంగీతం వీనులవిందుగా ఉంది. పాటల విషయంలో మాత్రం కాస్త అసంతృప్తి మిగిలింది. శ్రీరామా లేరా ఓ రామా పాటలో మొదటి చరణం కట్ చేశారు.  శ్రీరామంజనేయ యుద్ధం సినిమాలో మేలుకో శ్రీ రామ పాట చూసి, బాపు ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించి ఉంటారనుకున్నాను. రెండవ చరణం బావున్నా మొదటి చరణం మొత్తం ఎగిరిపోయింది. అలాగే కలయా నిజమా పాటలో పల్లవులెగిరిపోయాయి. ఆల్బంలో నాకు బాగా నచ్చిన రెండు పాటలివి. గాలీ నింగీ నీరు పాటలో కూడా చివరి లైన్లు కనబడవు, వినబడవు. రామాయణము పాట పావుశాతమే ఉంది.  క్లైమాక్స్‌లో  శ్రీరాముడు కుశలవులతో మాట్లడుతూ  శస్త్రవిద్యలలోనే కాదు అస్త్రవిద్యలలో కూడా మీకు నైపుణ్యమున్నదన్న మాట అంటాడు. దీన్ని బట్టి చుస్తే కుశలవులతో రాముడు యుద్ధం చేసిన సన్నివేశాలున్నట్లనిపిస్తుంది. చిత్రవ్యవధిని దృష్టిలో ఉంచుకొని ఎడిటింగ్‌లో ఇవన్నీ తీసేశారో లేక సినిమాలో ఉన్న భాగాలను మాత్రమే షూట్‌చేసారో తెలియదు. అవి కూడా ఉండుంటే ఇంకా బావుండేది.


 తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది . లేకపోతే భవిష్యత్తులో భక్తిరస చిత్రమంటే  క్రియేటివిటీ పేరుతో కేరళలోనో, కౌలాలంపూర్‌లోనో డ్యూయెట్లు పెట్టించి, బొడ్డు పాటల కోసం ఒక పాత్రను సృష్టించి  , బ్రహ్మానందం, ఆలీ , సునీల్‌లతో వెకిలి హాస్యం గుప్పించిన కే.రాఘవేంద్రరావు సినిమాలే గుర్తుకొస్తాయి. ఆ పైన మీ ఇష్టం.


10 comments

Post a Comment

థ్రిల్లర్


ప్రేమంటే ఏమిటి ?
దాని లక్షణాలేమిటి ?
దానిలో నిజాయితీ ఎంత ?
ఏది ప్రేమ? ఏది ఆకర్షణ ?
ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దేనికి ప్రేమిస్తాడు ?

కఠోరమైన మనః ప్రవృత్తికి ఆహ్లాదకరమైన ముసుగు తొడిగి, తమ ప్రత్యేకతలను సద్గుణాలను మాత్రమే బయటికి ప్రొజెక్ట్ చేస్తూ,  అవతల వ్యక్తిని ఇంప్రెస్ చెయ్యటానికి తాపత్రయపడటమే  ప్రేమా ? ప్రేమకు పరమావధి పెళ్ళేనా ? పెద్దల్ని ఎదిరించి ప్రేమవివాహాలు చేసుకొని పెళ్ళాలను పుట్టింటికి పంపటానికి భీష్మించే భర్తలది, మెట్టినింటి చిన్న చిన్న సంప్రదాయాలని పాటించటానికి నానా రాద్ధాంతం చేసే భార్యలది నిజమైన ప్రేమేనా ?  ఏ ప్రయోజనాన్ని ఆశించని నిస్వార్థమైన ప్రేమ అసలుందా ? ఈ విషయాలన్నిటినీ స్పృశిస్తూ ఒక అద్భుతమైన అబ్సర్డ్ నవల వస్తే అదే యండమూరి వీరేంద్రనాథ్ థ్రిల్లర్. అబ్సర్డ్ నవలలో కథ కంటే భావం ప్రధానం. దాన్ని మనసుకు హత్తుకునేలా చెప్పటానికి  కొన్ని అవాస్తవిక సంఘటనల సహాయం తీసుకుంటారు రచయితలు. అటువంటిదే ఏడేళ్ళు ప్రేమకోసం తపస్సు చెయ్యటం. ఇది సాధారణంగా జరిగే పనికాదు. కానీ అటువంటి సంఘటనొకటి జరిగి,  ప్రేమరాహిత్యంతో బాధపడుతూ హ్యూమన్ రిలేషన్స్‌పైనే అసహ్యాన్ని నింపుకున్న ఓ అమ్మాయికి విశ్వజనీయమైన ప్రేమను బోధిస్తూ ఒక యువకుడు వస్తే ..అదే థ్రిల్లర్ .

కథలోకి  వస్తే విద్యాధరి ఒక అందమైన మధ్యతరగతి అమ్మాయి. అనాథ. ఆమె బాల్యం, పరిసరాలు ఆమెకు మానవ సంబంధాలపైనే ఒక రకమైన కసిని కలిగిస్తాయి. ఒకప్రముఖ దిన పత్రిక సంపాదకుడిగా పనిచేస్తూ పేరు ప్రఖ్యాతులు  లభించాక, నైతిక విలువలకు తిలోదకాలిచ్చి స్త్రీలోలుడై భార్యను హతమార్చి ఏ కేసు లేకుండా చూసుకున్న ఆమె తండ్రి, తండ్రిలాంటి వాడినని చెప్పుకుంటూ ఆమెను లోబర్చుకోవాలని ప్రయత్నించే ముసలి ఇంటి ఓనరు, తాగి నీటి తొట్లో పడిపోతే మానవతాభావంతో సపర్యలు చేసినందుకు ప్రేమించమని వేధించే ఆయన కొడుకు, ఆమె ఒంటరితనాన్ని ఆసరా చేసుకుని ఆమెను పొందాలనుకొనే ఆమె మేనేజరు ఇలా అందరూ ఆమె ప్రవర్తనపై చెరగని ముద్రవేసిన వాళ్ళే.

రెస్టారంట్‌లో తన ఇగో దెబ్బతీసినందుకు విద్యాధరిని దొంగ రశీదుల కేసులో ఇరికించి, ఆమెను భయపెట్టి పాదాక్రాంతం చేసుకోవాలనుకుంటాడు ఆమె మేనేజరు చక్రధర్. అటువంటి సమయంలో నాటకీయంగా రంగప్రవేశం చేసిన అనుదీప్ విద్యాధరికి ధైర్యం చెప్పి, చక్రధర్ బారి నుండి ఆమెను కాపాడుతాడు. తానెవరో ఆమెకు తెలియజేస్తాడు. ఏడు సంవత్సరాల క్రితం ఆమెను బస్‌లో చూసి ప్రేమలో పడ్డానని, ఆమె ప్రేమను పొందడానికి ఏడేళ్ళు వింధ్య పర్వతాలలో తపస్సు చేసానని చెబుతాడు. ' అన్ని సంవత్సరాలు తపస్సు చెయ్యడం దేనికి ? అప్పుడే చెప్పోచ్చు కదా ' అంటే ' అప్పటికే ఆమె వెంట తిరుగుతున్న రోమియోల్లో ఒకడ్ని కావటం ఇష్టం లేక, తన ప్రేమను అంగీకరిస్తుందో లేదో అన్న అనుమానం చేత ఆ పని చెయ్యలే' దంటాడు. ఆమె అతన్ని పిచ్చివాన్నిగా జమకడుతుంది. అతను తన ప్రేమ తీవ్రతను నిరూపించుకోవటానికి ఆమె శరీరంపై ఆమెకు తెలియకుండా ప్రేమ సందేశం వ్రాస్తాడు.  ప్రేమికుడంటే తనకు ప్రియమైనదాన్ని ప్రియురాలి కోసం వదులుకునేవాడని ఆమె ఒక పుస్తకంలో వ్రాసుకుంటే తనకెంతో ఇష్టమైన కుడిచేతిని భుజం వరకు నరికేసుకుంటాడు. సినిమా థియేటర్లో  బ్యాండేజీ కట్టబడి శూన్యంగా వున్న అతని కుడి భుజాన్ని చూసి విద్యాధరి భయంతో కేకలు వేస్తుంది. అదే థియేటర్‌కి కుటుంబంతో సహా వచ్చిన ఆమె తండ్రి స్నేహితుడు పోలీస్ కమీషనర్ ధర్మారావు ఆమెనెవరో ఆకతాయి ఏడిపిస్తున్నాడని భావించి అతని సంగతి చూడమని ఎస్సై విశ్వనాథాన్ని పురమాయిస్తాడు .

పోలీస్ స్టేషన్లో ఎస్సై విశ్వనాథానికి అతని భవిష్యత్తు చెప్పి, తన ప్రేమ శక్తిని నిరూపించుకోవటానికి కుడిచేతిని మళ్ళీ మొలిపిస్తాడు అనుదీప్. అతను నిజంగా చెయ్యి తెగ్గోసుకోలేదని, కేవలం ఆ భావాన్ని కలిగించాడని , అతనో మెస్మరిస్టన్న అంచనాకి వస్తారు ధర్మారావు, విద్యాధరి. విద్యాధరికి రక్షణగా ఇద్దరు కానిస్టేబుల్స్ ని నియమించి అతన్ని ఎలాగైనా పట్టుకోమని విశ్వనాథాన్ని ఆదేశిస్తాడు  ధర్మారావు.

దొంగ రశీదులతో ఇన్వెస్టర్లకు కోట్లరూపాయిల్లో ధనం ఎగ్గోట్టడానికి చక్రధర్, అతని పార్ట్‌నర్ పథకం పన్నారని, చక్రధర్ దగ్గర్నుంచి అందుకు సంబంధించిన రహస్య పత్రాలేవైనా సంపాదించి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సహకరించమని విద్యాధరిని కోరుతాడు ధర్మారావు. విద్యాధరి ఉత్సాహంతో అంగీకరిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అనుదీప్ అనవసరమైన రిస్కులు తీసుకోవద్దని ఆమెకు సలహా ఇస్తాడు. ఆమె దాన్ని పట్టించుకోదు. తమ మధ్య జరిగిన గొడవకు బాధపడుతున్నట్లు చక్రధర్‌ని నమ్మిస్తుంది. ఉబ్బితబ్బిబైన అతడు ఆమెను తన ఇంటికి ఆహ్వానిస్తాడు. రహస్య పత్రాలు సంపాదించటానికి ఇదే అనువైన అవకాశమని విద్యాధరి భావిస్తుంది. ఈ అసైన్మెంట్ గురుంచి విశ్వనాథంకు చెప్పి చక్రధర్ ఇంటికి వెళ్తుంది. అయితే ఆమె అంచనాలన్నీ తారుమారయ్యి కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటుంది. చక్రధర్ హత్యజేయబడతాడు. ఆమె నిందితురాలవుతుంది. తను ఏ నేరం చెయ్యలేదని మొత్తుకున్నా ఆమె మాట ఎవరూ వినరు.

రవిశాస్త్రి మరో పోలీసాఫీసర్. అనుదీప్ గురుంచి మొదటిసారి విన్నప్పుడు కలిగిన అసక్తితో పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేసి అతను నిజంగానే వింధ్య పర్వతాలలో ఏడు సంవత్సరాలు తపస్సు చేశాడని తెలుసుకొని నిర్ఘాంతపోతాడు .అనుదీప్  అతనికి కొన్ని క్లూస్ ఇచ్చి చక్రధర్ హత్య వెనుక అతని పార్ట్‌నర్, ఎస్సై విశ్వనాథంల హస్తం ఉందని తెలియజేస్తాడు. విద్యాధరి విడుదలవుతుంది. తనకు సాయం చేసింది అనుదీప్ అన్న విషయం ఆమెకు తెలియదు. అనుదీప్‌కి మాటిచ్చిన కారణంగా రవిశాస్త్రి కూడా మౌనం వహిస్తాడు.  అనుదీప్ తన ప్రేమ సందేశాన్ని ఒక క్యాసేట్లో నిక్షిప్తం చేసి రవిశాస్త్రి ద్వారా ఆమెకు చేరవేస్తాడు. తను జైల్లో ఉన్నప్పుడు ఏ మాత్రం పట్టించుకోకుండా, బయటపడ్డాక మళ్ళీ తయారైన అనుదీప్‌ని చూసి ఆమెకు పట్టరాని కోపం వస్తుంది. క్షుద్ర విద్యలతో మనుషుల్ని కనికట్టులో పడేస్తున్నావని నిందిస్తుంది. అనుదీప్ హర్టవుతాడు. తను మెస్మరిస్టు కాదని, మెస్మరిస్టు కేవలం కొంత మందిని మాత్రమే మోసం చెయ్యగలడని,  ప్రపంచాన్ని మొత్తం మోసం చెయ్యలేడని, తన ప్రేమ నిజమే అయితే ప్రపంచమంతా కరెంటు పోతుందని, ఆమెకు నమ్మకం కలిగాకే కరెంటు వస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు.

కరెంటు పోతుంది. విద్యాధరి ధర్మారావు ఇంటికి వెళ్ళి తనకు అనుదీప్‌కి మధ్య జరిగిన సంభాషణ చెబుతుంది. ధర్మారావు ఫోన్లు చేసి ప్రపంచమంతా కరెంటు పోయిందని నిర్థారించుకుంటాడు. విద్యాధరి అనుదీప్ ఇంటికి వెళ్ళి అతన్ని ప్రేమిస్తున్నట్లు కాగితం వ్రాసి, అతని తల్లిదండ్రులకు ఇచ్చి వస్తుంది. ఈ లోగా తన స్వార్థం కోసం ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక కరెంటుని తిరిగి రప్పించమని దేవున్ని వేడుకుంటాడు అనుదీప్. అయితే ఇదంతా బూటకమని ఒక కొత్త జనరేషన్ కంప్యూటర్ కనుక్కోవటం వల్ల ఎలెక్ట్రాన్ల ప్రవాహం  ఆగిపోయి ప్రపంచమంతా కరెంటు పోయిందని, ఈ విషయం ముందే తెలుసుకున్న అనుదీప్ తెలివిగా అందరినీ ఫూల్స్‌ని చేశాడని ధర్మారావు చెబుతాడు. ఇలాంటి వాడిని వదిలెయ్యటం ప్రమాదకరమని ఒక తెల్లకాగితం మీద సంతకం పెట్టిస్తే పోలీసులు మిగతా సంగతి చూసుకుంటారని చెప్పటంతో అలానే చేస్తుంది విద్యాధరి. 

బెయిలు మీద విడుదలైన చక్రధర్ బిజినెస్ పార్ట్‌నర్, ఎస్సై విశ్వనాథం సాక్ష్యాలను సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించుకుని విద్యాధరి హత్యకు పథకం వేస్తారు.  ఆమెను రక్షించే క్రమంలో కత్తిపోట్లకు గురయ్యి కుప్పకూలిపోతాడు అనుదీప్. మరణశయ్య మీదున్న అతన్ని చూసి జాలిపడకుండా ఇది కూడా  క్షుద్ర విద్యే అని నిర్దయగా మాట్లాడిన విద్యాధరి చెంప చెళ్ళుమనిపిస్తాడు రవిశాస్త్రి. అనుదీప్ గురుంచి తను తెలుసుకున్నవి, అతను ఆమెకెలా సాయపడిందీ వివరిస్తాడు.  బరువెక్కిన హృదయంతో, వెల్లువెత్తిన ప్రేమతో విద్యాధరి అనుదీప్ ప్రేమను అంగీకరించటానికి హాస్పిటల్‌కు వెళ్తుంది. అయితే అక్కడ అనుదీప్ పేరుతో ఎవరూ అడ్మిటవ్వలేదని తెలిసి విస్తుబోతుంది. అంతే కాదు అంతకుముందు జరిగిన సంఘటనలన్నీ కలే అని తెలిసి అయోమయానికి గురవుతుంది.వాస్తవానికి జరిగింది వేరే. తనది నిస్వార్థమైన ప్రేమైనప్పుడు ఆమెనుంచి ప్రేమను ఆశించటం కూడా తప్పే అని గ్రహించిన అనుదీప్,అమె జ్ఞాపకాలను తనతో తీసుకుని వెళ్ళిపోతూ (మరణిస్తూ) ప్రేమ ద్వారా తనకు లభించిన అతీతమైన శక్తులతో ఇప్పటివరకు జరిగినదంతా కలేనన్న నమ్మకాన్ని ఆమెకి కలిగిస్తాడు. ఇంతగా ప్రేమించినవాడు తనకు శాశ్వతంగా దూరమయ్యాడన్న బాధ ఆమెకు కలుగకుండా ఉండటం కోసం జరిగిందంతా కలేనన్న విశ్వాసం ఆమెకు కలిగించి, ఆమెలో మనుషుల పట్ల, ప్రేమ పట్ల సద్భావన కలిగిస్తాడు.



నా దగ్గరున్న పాత వర్షన్‌లో ఇదీ ముగింపు. తర్వాత వచ్చిన వర్షన్స్‌లో మార్చినట్లున్నారు. విద్యాధరి హాస్పిటల్‌కు వెళ్ళి అచేతనానవస్థలో నున్న అనుదీప్ ని ముద్దు పెట్టుకోవటంతో అనంతవాయువుల్లో కలిసిపోబోతున్న అతని ప్రాణాలు తిరిగి వస్తాయి. కథ సుఖాంతమవుతుంది.

అనుదీప్ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు రచయిత. ఒక గొప్పింటిని కుర్రాడిని ప్రేమించి, వివాహం చేసుకుని, కుటుంబ సమస్యలతో సతమవుతూ పుట్టెడు చాకిరీ చేసినా అత్తవారింట్లో గుర్తింపుకు నోచుకోక, విషజ్వరంతో మరణించిన అతని చెల్లెలు, ఆమె వ్రాసిన ఆఖరి ఉత్తరం అతన్ని కదిలిస్తాయి. విద్యాధరిని ప్రేమించిన తొలినాళ్ళలో జరిగిన ఈ సంఘటన అతని జీవితాన్నే మార్చివేస్తుంది. ప్రేమంటే ఏమిటన్న ఆలోచన మొదలవుతుంది. శరీరం కోసం భార్యని, వృద్ధాప్యం కోసం పిల్లల్ని, అహం తృప్తి కోసం ప్రియురాలిని, అవసరం కోసం భర్తని, రక్షణ కోసం కులాన్ని, మతాన్ని దేశాన్ని ఇలా సంకుచితంగా కాకుండా ప్రేమనేది లేదా అన్న చింతన బయలుదేరుతుంది.  చదువు మధ్యలో ఆపేసి, ప్రేమంటే ఏమిటో తెలుసుకోవటానికి, తన ప్రేమ నిజమా కాదా అని తెలుసుకోవటానికి, ఆమె తనను ప్రేమించేలా చెయ్యమని దేవున్ని కోరుకోవటానికి ఏడేళ్ళు వింధ్య పర్వతాలలో తపస్సు చేస్తాడతను. తీరా దేవుడు ప్రత్యక్షమయ్యాక ఆయన రికమెండేషన్‌తో సంపాదించుకోనే కృత్రిమమైన ప్రేమ వద్దనుకుని, స్వశక్తితో ఆమె ప్రేమను గెలుచుకోవాలనుకుంటాడు.  అందుకు గాను తనకు తానే మూడు షరతులు విధించుకుంటాడు.


  • 1. వాక్చాతుర్యంతో కానీ, ధీరోదాత్తమైన చర్యల ద్వారా గానీ, బహుమతుల ద్వారా గానీ, మగ స్పర్శ తాలూకు టెంప్టేషన్ ద్వారా గానీ ఆమె ప్రేమను పొందరాదు.

  • 2. ఆమె అభిప్రాయాలతో ఏకీభవించినట్లు మాట్లాడి, ఆమె కష్టల్లో ఉండగా ఓదార్చి ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యరాదు. 

  • 3. మంచి భవిష్యత్తు, సుఖప్రదమైన సంసారం, సెక్యూరిటీ లాంటి వాగ్దానాలు చేసి ఆమెను ఆకట్టుకోరాదు.


ఇవేవీ లేకుండా ఒకమ్మాయి మనస్సు గెలుచుకోవటం సాధ్యమయ్యే పనేనా?  అనుదీప్ సాధ్యమేనని నమ్ముతాడు. అతని పేరున బోల్డంత పుణ్యం జమయ్యింది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం పరిత్యజించే అవకాశమిస్తాడు దేవుడు. అనుదీప్ మాత్రం నెలరోజుల్లోగా విద్యాధరి ప్రేమను గెలుచుకోలేకపోతే శరీరం విడిచిపెట్టేయాలని నిర్ణయించుకుంటాడు. ఎత్తుకున్న కథాంశం ఏదైనా అది చదువరుల మానసిక వికాసాన్ని పెంపొందించేలా చెయ్యటంలో యండమూరి వీరేంద్రనాథ్‌ది అందెవేసిన చెయ్యి. ఈ నవలలో కూడా అది ప్రతిఫలించింది. బుద్ధుడిలా జ్ఞానోదయం పొంది, భీష్ముడిలా స్వచ్ఛంద మరణం వరంగా పొందిన అనుదీప్ ప్రియురాలి ప్రేమను పొందే క్రమంలో సంధించే ప్రశ్నలు , చేసే వాదనలు పాఠకుల్ని ఆలోచింపచేస్తాయి. తపస్సు దాకా అక్కర్లేదు. తమది ప్రేమేనా?  ఏమాశించి తాము ప్రేమిస్తున్నాం? తమ ప్రేమలో నిజాయితీ ఎంత?  అని పది నిమిషాలు నింపాదిగా ఆలోచించే వాళ్ళు యువతరంలో ఎంతమందున్నారన్నది ప్రశ్న. తమ ప్రేమ గురుంచి తల్లిదండ్రులకు మాటమాత్రం చెప్పకుండా  మోసం చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళు రేప్పొద్దున్న తమ జీవిత భాగస్వామిని మోసం చెయ్యరన్న నమ్మకమేమిటి? అంత విచక్షణే ఉంటే ఇన్ని ఆసిడ్ దాడులు, ఆత్మహత్యలు జరుగుతాయా?

ఈ నవలను రాజేంద్రప్రసాద్, సీత ప్రధాన పాత్రధారులుగా ముత్యమంత ముద్దు పేరుతో తెరకెక్కించారు. మూలాలు చెడగొట్టకుండా తమ పరిధి మేరకు బాగానే తీశారు. రవిరాజా పినిశెట్టి దర్శకుడు.  సినిమాలో కథను సుఖాంతం చేశారు. నవలలో లేని దివ్యవాణి పాత్ర సినిమాలో బాగా పండింది.  హంసలేఖ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు కూడా బాగా పాపులరయ్యాయి. అయితే సినిమా కంటే నవల చాలా బావుంటుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.


4 comments

Post a Comment

భగ్నప్రేమ

కౌముది.నెట్ తాజసంచిక (సెప్టంబరు 2011) లో కవితాకౌముది విభాగానికి వెళ్ళి నా కవిత 'భగ్నప్రేమ '( ఇక్కడ ) చదివి మీ అమూల్యమైన అబిప్రాయాలు తెలియజేయండి. కవితను ప్రచురించిన కౌముది యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.





చైత్రమాసపు కోయిలనై చివురించిన తలపులన్ని ఎలుగెత్తి పాడాను
వైశాఖ గాడ్పులలో వలపు చలివేంద్రమంటి నీ చిరునామా వెదికాను
జగతిలో శ్రేష్టమైనవన్నీ జ్యేష్ఠలో పదిలపరిచాను
ఆషాడ మేఘాల అనురాగ పరిష్వంగంలో
నీ అందెల నిక్వాణం విని నిదురమరిచాను
భారమైన హృదయం ఆవిరైన ఆర్ణవమైతే
కురిసిన శ్రావణ భాధ్రపద కుంభవృష్టి ధారలలో 
తడిసీ, వణికీ తనువంతా నీరైపోయాను
ఆశ్వయుజమంతా ఆశలపందిళ్ళు పరచి
ఆవిష్కృత శరద్వెన్నెలలో నీ మోము గాంచి
అవ్యక్తానుభూతుల సుడిలో అవశేషమునై నిలిచాను
కార్తీకమంతా కలతల కడగండ్లు రేగి
కాటుక శర్వరిలా కమ్ముకొని భయపెడితే
వెచ్చని నీ ఊసుల దీపాలు వెలిగించి ఉపశమనం పొందాను
నీ వియద్వేణియ నుండి విరివిగా రాలిన నీటిబొట్లు 
మార్గశీర్షపు తొలిసంధ్యలలో మంచుముత్యాలై మెరిసిపోతే
మత్తెక్కిన మధుపమునై తిరిగి మధురోహలు గ్రోలాను
పుష్యమాసపు ప్రవాసినై
ప్రేమంతా పోగు చేసి పుష్పమాలికలల్లి
భవిష్యత్ బహిర్ద్వారం వద్ద బంట్రోతునై నిలబడితే
తిరస్కరించి తూలనాడి తిమిరంలోకి నెట్టేశావు
మాఘమాసపు పెళ్ళిపందిరిపై మందస్మితయై అటు నువ్వు
మొదలు తెగిన వృక్షమునై మృత్యువాకిట ఇటు నేను
కఠిన కర్కశ పాషాణ నాతివై నువ్వు కాదు పొమ్మన్నా
కడతేరని ప్రేమతో కొత్త ఊపిరులూదుకుంటాను
నీ పెరటి పున్నమితోటలో
ఫల్గుణినై పరిమళిస్తాను










6 comments

Post a Comment

పురాణాల్లోంచి కొన్ని వినాయక విశేషాలు

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.పండుగ సందర్భంగా విఘ్నేశ్వరునికి సంబంధించిన పురాణ విశేషాలు కొన్ని తెలుసుకుందాం.

  1. 1.   మహావిష్ణువుకు జయ-విజయులనే ద్వారపాలకులున్నట్లే ఆయన చెల్లెలైన పార్వతీదేవికి జయ,విజయ అనే చెలికత్తెలున్నారు. ఎంతసేపూ అయ్యవారైన భోళాశంకరుడి ఆజ్ఞలు శిరసావహించేవారే కాకుండా అమ్మవారి మాటలను ఔదలదాల్చేవాడు కూడా ఒకడుండాలని చెప్పడంతో పార్వతి తన ఒంటిమీద నలుగుపిండితో గణేశుని సృష్టించి ద్వారపాలకుడిగా నియమిస్తుంది.

  2. 2.   గజాసురుడనే శివభక్తుడైన రాక్షసుడు ఏనుగు ముఖంతో వున్నవాడి చేతిలోనే మరణం సిద్ధించాలని వరం కోరుకుంటాడు. దానికోసమే కైలాస పర్వత సానువుల్లో ఉత్తరాభిముఖంగా అమంగళంగా పడి వున్న ఏనుగు ముఖాన్ని ఉత్తరించి గణేశుని బ్రతికిస్తాడు పరమశివుడు.

  3. 3.   వినాయకుడు ఎరుపు వర్ణంలో వుంటాడు. ఆయన ఏకదంతుడు. కుడిచేతివైపు దంతం విరిగిపోయి ఉంటుంది. బ్రహ్మదేవుని సూచన మేరకు మహాభారత రచన కోసం గణేశున్ని ప్రార్థిస్తాడు వ్యాసభగవానుడు. గణేశుడు ప్రత్యక్షమై వ్యాసుడు ఆపకుండా చెప్పుకుంటూ వెళ్తేనే తాను వ్రాస్తానని షరతు విధిస్తాడు. వ్యాసుడు అంగీకరించి తను చెప్పినది అర్థం చేసుకొనే గణేశుడు వ్రాయాలని మెలిక పెడతాడు. వ్యాస భగవానుడు సంక్లిష్టమైన పదాలతో,అద్భుతమైన వర్ణనలతో మహాభారతాన్ని ఆపకుండా చెప్పుకుపోతుంటే తాను నిరాఘాటంగా వ్రాయాడానికి కావల్సిన ఘంటం లేదు కాబట్టి తన దంతాన్నే విరిచి దానితోనే రచన చేస్తాడు.

  4. 4.   విఘ్నాలు కల్పించేది, నశింపచేసేది విఘ్నేశుడే. ఒక దేవాలయంలో ఇద్దరు గణేశులుంటే ఒకరు విఘ్నాలు కల్పించేవారని(విఘ్నరాజని) మరొకరు విఘ్నాలు తొలగించేవారని (వినాయకుడని) అర్థం. ఇద్దరూ సమాన స్థాయిలో పూజలందుకుంటారు. ఆయనకు సంబంధించిన ప్రతి సంఖ్య 21తో ముడిపడి ఉంటుంది. దేవతలందరి చెవులు మకరకుండలాల చేత కప్పబడి ఉంటే వినాయకుని చెవులు మాత్రమే విస్తారంగా ఉండి ఎటువంటి అలంకరణలు లేకుండా దర్శనమిస్తాయి.మనం కోరిన కోర్కెలన్నీ ఆయన వింటాడన్న అంతరార్థం అందులో ఉంది.

  5. 5.   వినాయకుడు, ఆంజనేయుడు -ఈ ఇద్దరి మూర్తులను చందనంతో అలంకరించటం శ్రేష్ఠం .

  6. 6.   ఒకసారి మేనమామైన విష్ణువు ఇంట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ, భధ్రంగా దాచిన సుదర్శన చక్రాన్ని తినుబండారంగా భావించి మ్రింగేస్తాడు బాల వినాయకుడు. చక్రం కోసం వెదికి వేసారిన విష్ణువు అది బాలగణపతి పొట్టలోనే ఉందని గ్రహించి అతన్ని నవ్వించటానికి మొదటిసారి గుంజిళ్ళు తీస్తాడు.ఆ చర్యలకు వినాయకుడు పగలబడి నవ్వితే చక్రం బయటపడుతుంది.

  7. 7.   విశ్వరూప ప్రజాపతి కుమార్తెలు సిద్ధి బుద్ధి. ముందుగా భూప్రదక్షిణ చేసి తిరిగివచ్చిన వారికి వారినిద్దరినీ ఇచ్చి వివాహం చెయ్యాలని శివపార్వతులు నిర్ణయిస్తారు.కుమారస్వామి నెమలి వాహనమెక్కి హడావుడిగా ప్రదక్షిణకు బయలుదేరితే గణేశుడు 7 మార్లు తల్లిదండ్రులైన శివపార్వతులకు ప్రదక్షిణ చేసి విజేతగా నిలుస్తాడు .

  8. 8.   గణేశుని సంతానంగా క్షేముడు, లాభుడు అనే ఇద్దరు కొడుకుల్ని చెబుతారు.

  9. 9.   గణేశుని ధ్వజంపై మూషికం గుర్తు రెపరెపలాడుతూంటుంది.

  10. 10.   భస్మాసురుని కొడుకు దురాసదనున్ని వక్రతుండావతారంతో హతమారుస్తాడు విఘ్నేశ్వరుడు. ఆ అవతారంలో ఆయనకు పంచమూఖాలు, పది బాహువులు, సిగలో నెలవంక, సింహ వాహనం ఉంటాయి.

  11. 11.   శివపార్వతుల కళ్యాణం వీక్షించటానికి దేవ, దానవ, గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర కింపురుషాదులు, ఇతర సమస్తకోటి జీవరాశి తరలి రావటంతో బరువు తట్టుకోలేక ఉత్తరంవైపు భుమి క్రుంగిపోతుంది. దాన్ని సమతలం చెయ్యటానికి పరమశివుడు అగస్త్య మహర్షిని పిలిపించి ఆయన్ని దక్షిణ దిశకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. దక్షిణ దిశనుండే తన పెళ్ళిని చూడగలిగే శక్తిని ప్రసాదించి, తన జటాజూటంలోంచి ఒక జటను కావేరి నది రూపంలో లాగి అగస్త్యుని కమండలంలోకి ప్రవేశపెడతాడు. ఒకసారి దక్షిణభారత దేశమంతా తీవ్ర దుర్భిక్షమైన పరిస్థితులు నెలకొంటే, ప్రజల బాధలు తీర్చటానికి వినాయకుడు కాకి రూపం ధరించి వెళ్ళి అగస్త్యుని కమండలం కూలదోస్తాడు. అగస్త్యుడు ఆగ్రహించి దాన్ని తరిమితే పసిబాలుడుగా మారిపోయి పరుగులంకించుకుంటాడు. కొద్దిసేపు అలా ఆటలాడి తర్వాత నిజరూపంతో సాక్షాత్కరించి ఆయన్ని తరింపచేస్తాడు. అలా కావేరి నదిని భూమార్గం పట్టించినవాడవుతాడు.

  12. 12.   ముద్గల పురాణం ప్రకారం వినాయకుని అనేకావతారాలలో ఎనిమిది ప్రముఖమైనవి - వక్రతుండుడు (సింహ వాహనుడు,మత్సరాసుర సంహారి), ఏకదంతుడు(మూషిక వాహనుడు, మదాసుర సంహారి) ,మహోదరుడు(మూషిక వాహనుడు,మోహాసుర సంహారి), గజవక్త్రుడు(మూషిక వాహనుడు,లోభాసుర సంహారి), లంబోదరుడు(మూషిక వాహనుడు,క్రోధాసుర సంహారి),వికటుడు (మయూర వాహనుడు,కామాసుర సంహారి), విఘ్నరాజు(శేష వాహనుడు,మమాసుర సంహారి), ధూమ్రవర్ణుడు(అశ్వ వాహనుడు,అభిమానాసుర సంహారి).

  13. 13.   గణేశ పురాణం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కటి చొప్పున నాలుగవతారాలు. మహోత్కట వినాయకుడు (కృత యుగంలో కశ్యపుడు,అదితిల కొడుకు. ఎర్రటి వర్ణంలో పది బాహువులతో సింహవాహనుడై ఉంటాడు ), మయూరేశ్వరుడు (త్రేతా యుగంలో శివపార్వతులకి జన్మించినవాడు. తెల్లని వర్ణంతో,ఆరు భుజములతో నెమలి వాహనుడై ఉంటాడు.), గజాననుడు (ద్వాపర యుగంలో శివపార్వతులకి జన్మించినవాడు. ఎర్రటి వర్ణంతో నాలుగు చేతులతో ఉంటాడు.మూషిక వాహనుడు), ధూమ్రకేతు (కలియుగాంతంలో నీలిరంగు అశ్వాన్ని అధిరోహించి దుష్టశిక్షణ చేస్తాడు.బూడిద వర్ణంతో రెండు లేక నాలుగు చేతులతో ఉంటాడు).



2 comments

Post a Comment

కాంగ్రెస్ మార్కు మతసామరస్యం !



స్వతంత్ర భారద్దేశంలో సెక్యూలరిజం అనేది ఒక కొరుకుడుపడని పదం. ఎవరికి తోచిన అర్థం వాళ్ళు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయనాయకుల పదకోశంలో దీని అర్థాలు అతివేగంగా మారిపోయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెర్షన్లు విడుదలవుతూంటాయి. ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఈ విషయంలో మినహాయింపు. 125 సంవత్సరాల ఘనచరిత్ర కలిగి యాభైఏళ్ళకు పైగా దేశాన్ని పరిపాలించి ఇంకా
శాసిస్తున్న పార్టీ, దేశసమస్యలపై నిర్దుష్టమైన అభిప్రాయాలు ఏర్పరుచుకోకపోయినా ఒక్క విషయం మీద మాత్రం ఆది నుంచి కుండబద్దలు కొట్టినట్లుగా తన వైఖరి స్పష్టం చేస్తునే ఉంది. మతసామరస్యమంటే కేవలం కొన్ని వర్గాలకి కొమ్ముకాయడమేనని కాంగ్రెస్ పెద్దల ఆభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే కొత్తగా మతహింస నిరోధక బిల్లు (Prevention of Communal and Targetted voilence bill 2011)తో మన ముందుకు వస్తోంది.


మతహింస కేవలం ఒక వర్గానికే పరిమితం కాదు. కవ్వించేది ఎవరైనా అల్లర్లంటూ చెలరేగాక ఆస్తినష్టం ప్రాణనష్టం రెండువైపులా ఉంటుంది. ఎటువంటి ఒత్తిళ్ళకు లొంగకుండా నిజనిర్ధారణ చేసి కులమతాలకు అతీతంగా శిక్షలు విధించాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. అలా కాకుండా వోటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ, పక్షపాత బుద్ధులతో ఒక వర్గాన్ని చిన్నచూపు చూసి, మరో వర్గంపై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తేనే వస్తుంది చిక్కు. అందుకే ఈ బిల్లు వివాదాస్పదమయ్యింది.

ముందుగా బిల్లులోని ముఖ్యాంశాలు చదవండి (పూర్తి బిల్లు ఇక్కడ )
  • సెక్షన్ 3 ప్రకారం ఒక వర్గానికి చెందారన్న కారణంగా దానికి చెందిన వ్యక్తిని కాని, ఆస్తిని కానీ అసంకల్పితంగా గానీ, పథకం ప్రకారం గానీ దాడిచేయ్యటం నేరం.
  •  క్లాజ్ 7 ప్రకారం ఆ వర్గానికి చెందిన వ్యక్తులపై శారీరకమైన వేధింపులకు పాల్పడటం నేరం.
  • క్లాజ్ 8 ప్రకారం ఆ వర్గం పైన కానీ, ఆ వర్గానికి చెందిన వ్యక్తిపై కానీ మాటల ద్వారా గానీ, వ్రాతల ద్వారా కంటికి కనిపించే మరే విధమైన పనుల ద్వారా కానీ ద్వేషాన్ని వ్యాప్తి చెయ్యడం నేరం.
  • క్లాజ్ 9 ప్రకారం వ్యక్తిగా గానీ, సామూహికంగా గానీ ఆ వర్గం మీద పథకం ప్రకారం దాడి చెయ్యటం నేరం.
  • క్లాజ్ 10 ప్రకారం ఆ వర్గానికి వ్యతిరేకంగా ధనసహాయం గానీ మరే విధమైన సహాయం గానీ చెయ్యటం నేరం.
  • క్లాజ్ 12 ప్రకారం ప్రభుత్వోద్యోగులెవరైనా ఆ వర్గానికి చెందిన వ్యక్తులను మానసికంగా గానీ,శారీరకంగా గానీ హింసించడం నేరం.
  • క్లాజ్ 13 మరియు 14 ప్రకారం ఆ వర్గానికి చెందిన వ్యక్తులను రక్షించకుండా అలసత్వం ప్రదర్శించిన ప్రభుత్వోద్యోగులను కఠినంగా శిక్షించవచ్చు  
  • క్లాజ్ 15 ప్రకారం ఈ విషయంలో తన క్రింది ఉద్యోగులు సరిగ్గా పనిచెయ్యకపోయినా వారి పైనున్న అధికారి అందుకు బాధ్యుడవుతాడు.
  • క్లాజ్ 16 ప్రకారం ఉన్నతాధికారుల ఆజ్ఞలను సాకుగా చూపడానికి వీల్లేదు .
  • సెక్షన్ 58 ప్రకారం నిందితులకు బెయిల్ కూడా రాదు.ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చెయ్యవచ్చు.
  • సెక్షన్ 66 ప్రకారం ఫోటోలు,వీడియోలను సాక్ష్యాలుగా ప్రవేశపెట్టవచ్చు  
సెక్షన్లు క్లాజులు బాగానే ఉన్నాయనిపిస్తుందా? ఇక్కడే అసలైన మెలిక ఉంది. మతకల్లోలాలు జరిగినప్పుడు మెజారిటీ వర్గాన్ని అందుకు బాధ్యులుగా బిల్లు రూపకల్పన చేశారు. సెక్షన్ 3 ప్రకారం వర్గం అంటే దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మతపరంగా లేదా భాషాపరంగా మైనారిటికి చెందిన వారు మరియు షెడ్యూల్డు కులాలు లేదా తెగలకు చెందిన వారు . మనదేశంలో ఒక్క హిందువులు తప్ప మిగతా
అన్ని మతాల వారు మతపరమైన మైనారిటి క్రిందకు వస్తారు. కొత్తగా ప్రతిపాదించిన ఈ చట్టం ప్రకారం ఎప్పుడైనా మతఘర్షణలు జరిగితే న్యాయం కోసం పోరాడే హక్కు కేవలం మైనారిటీలకే ఉంది. సబ్ క్లాజ్ 3j ప్రకారం మైనారిటి ప్రజలనే బాధితులుగా పేర్కొన్నారు కాబట్టి అధిక సంఖ్యాక వర్గాల ప్రజలు నష్టపోయినా కిక్కురుమనడానికి వీలు లేదు . మెజారిటీ వర్గం ప్రజలే మతకల్లోలాలు ప్రేరేపిస్తారని, 
వారికి  ఎటువంటి ఆపదలు కలగవని ఈ బిల్లు ఉద్దేశ్యం కాబోలు. అలాగే వర్గం అన్న పదానికిచ్చిన నిర్వచనం కారణంగా మైనారిటీ ప్రజలు విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసినా, మానసికమైన, శారీరికమైన చిత్రహింసలకు పాల్పడినా, ఆస్తుల పై దాడులు చేసినా, అందుకు సహాయం చేసినా, ఈ బిల్లు పరిధిలోకి రారు.


సెక్షన్ 74 మరింత వివాదాస్పదంగా ఉంది. భారతీయ న్యాయసుత్రాల ప్రకారం నేరం నిరూపింపబడేవరకు ముద్దాయిని నేరస్తుడిగా భావించడానికి వీల్లేదు. సెక్షన్ 74 ఈ సుత్రానికి విరుద్ధంగా ఉంది. దీని ప్రకారం పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను నేరస్తులగానే భావిస్తారు. నిజంగా నేరస్తులు కానివారు ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మతకలహాలను, జాతుల మధ్య
వైరాన్ని విచారించటానికి ప్రభుత్వం National Authority for Communal Harmony, Justice and Reparation అనే సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థకు వున్న విశేషాధికారాల ప్రకారం అల్లర్లు జరుగుతున్న ప్రదేశాల్లోనే కాదు, జరుగవచ్చని భావిస్తున్న ప్రదేశాల్లో పనిచేస్తున్న ప్రభుత్వాధికారుల పనితీరులో కూడా ఇష్టనుసారం జోక్యం చేసుకోవచ్చు. ఎవరినైనా విచారించే అధికారం అర్హత ఉంది. వీళ్ళ ఆదేశాలను సమీక్షించే అధికారం ఎవరికీ లేదు. పథకం ప్రకారం జరిగే ఘర్షణలను అంతఃకలహాలుగా పేర్కొంటూ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికుంది. దీనివల్ల ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్రకు పరిమితమైపోవాల్సి ఉంటుంది. అమోదం పొందిన పక్షంలో ఈ బిల్లు జమ్మూ కాశ్మీర్‌కు తప్ప తక్కిన అన్నీ రాష్ట్రాలకూ వర్తిస్తుంది. హిందువులు తక్కువగా ఉండే జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం అక్కడి ప్రభుత్వ అనుమతి అవసరం.


 ఇంతటి మోసపూరితమైన బిల్లు మరొకటుంటుందా? ఇది ఏ రకమైన మతసామరస్యానికి ప్రతీక ? అసలిటువంటి బిల్లుల వల్ల మతసహనం పరిఢవిల్లుతుందా ? మెతక వైఖరితో మతపరమైన రిజర్వేషన్లతో విభజించి పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలందరికీ ఒకే న్యాయం ఒకే చట్టం ఉండాలనే ఇంగితజ్ఞానం ఎప్పుడలవడుతుంది ?


3 comments

Post a Comment

జగదానందకారకంగా శ్రీరామరాజ్యం పాటలు



శ్రీరామరాజ్యం పాటల కోసం నేను ఆత్రంగా ఎదురుచూడ్డానికి ప్రధాన కారణం బాపు-రమణ ,ఇళయరాజాల కాంబినేషన్. నేను ఇళయరాజాకు వీరాభిమానిని. ఆయన కూనిరాగం కూడా నాకు మహాప్రసాదమే. ఇక రాముడంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు రామాయణమంటే ఉప్పూ-కారం లేని కూరలా చప్పగా ఉంటుందని ఈసడించుకొన్న మాట నిజమే కానీ గత రెండు మూడేళ్ళుగా రామాయణం మీద రకరకాల పుస్తకాలు చదవటం వల్లనైతేనేమి, ప్రవచనాలు వినడం వల్లనైతే నేమి, నా అవగాహన మెరుగుపడి పాత్రల ఔచిత్యం బోధపడి, గౌరవం, భక్తిభావం రెండు కలిగాయి. సీతాసమేత రామలక్ష్మణ హనుమంతులకు నా మదిలో మందిరమే కట్టేశాను. ఇక హనుమంతుడిలాగా రామనామాన్ని నరనరాన జీర్ణించుకున్న భక్తులు బాపు-రమణలు. ఇద్దరికీ పౌరాణికాల మీద మంచి పట్టుంది. అంతకు మించి నిబద్ధత ఉంది. కథ ఏదైనా కమర్షియల్ ఫార్ములా పేరుతో చవకబారు శృంగారం కుమ్మరించే దర్శకేంద్రులు కోకొల్లలుగా ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంకా మనుగడగలుగుతున్నారంటే అందుకు కారణం కేవలం వృత్తి పట్ల వాళ్ళకున్న నిజాయితీనే. ఇటువంటి అరుదైన వ్యక్తుల కలయికలో తయారవుతున్న  చిత్రమంటే ఎవరికి మాత్రం ఉత్కంఠత ఉండదు ?

గీత రచయితగా జొన్నవిత్తుల గారి పేరు ప్రకటించినప్పుడు నేను తెల్లబోయాను. ఆనాటి లవకుశ పాటల స్థాయిలో  సాహిత్యం సమకూర్చగలరా అన్న సందేహం కలిగింది. తెలుగు భాష గొప్పదనం గురుంచి వ్రాసిన పాట తప్ప,ఆయన పేరు వినగానే ఠక్కున స్ఫురింపజేసే పాటలేవి నాకు తెలియవు. వేటూరి గారి చేత పాటలు వ్రాయిద్దామనుకుంటే అప్పటికే ఆయన స్వర్గస్థులైపోయారు. ఇక ఆ స్థాయిలో వ్రాయగలిగింది సిరివెన్నల సీతారామశాస్త్రి గారొక్కరే అని నా ప్రగాఢ నమ్మకం. జొన్నవిత్తులకు అవకాశమిచ్చి తప్పు చేస్తున్నారేమో అనుకున్నాను కాని ఆయన అద్భుతంగా గేయ రచన చేసి నన్ను ఆశ్చర్యానికి గురి చేశారు. పాటలన్నీ పామరులకు సైతం అర్థమయ్యేలా సరళంగా వ్రాసారు.దండకం వంటివి వ్రాయల్సి వచ్చినప్పుడు కాస్త విజృంభించారు. ఆయన సినీ జీవితంలో చిరస్థాయిలో నిలిచిపోయేలా సాహిత్యమందించారు. ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో చెప్పినట్లు ఈ పాటలన్నీ ముందు జొన్నవిత్తుల గారి చేత వ్రాయబడి, రమణ గారి అంగీకారం పొంది తర్వాత ఇళయరాజా చేత స్వరాల సొగసులు అందుకున్నవే.


ఇక పాటల్లోకి వెళ్దాం.



  • జగదానంద కారక (5/5) - ఈ పాటను ఆల్బంకే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. త్యాగరాజ కృతిలోని పల్లవిని మాత్రం తీసుకొని విడిగా చరణాలు వ్రాసుకొని స్వరాలు సమకూర్చారు. ఇదే పల్లవితో   పెళ్ళిపుస్తకం  , త్యాగయ్య  సినిమాలలోను పాటలున్నాయి. ఆ పాటలకు ఈ పాటకు తేడా గమనించండి. ఆపారమైన ఇళయరాజా స్వరసంపత్తికి ఇదొక మెచ్చుతునక. పాట చివరలో జగదానంద కారకా అని ప్లెయిన్ వాయిస్‌లో వచ్చే బాలు గారి స్వరం ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది . ఈ పాటకున్న ఏకైక అపశృతి శ్రేయఘోషల్ 'శ' ను 'ష' గా ఉచ్ఛరించటం. సాహిత్యాన్ని బట్టి ఇది సినిమాలో మొదటిపాట, శ్రీ రామ పట్టాభిషేకం జరిగే సమయంలో వచ్చే పాట అనుకుంటున్నాను.

  • శ్రీ రామా లేరా ఓ రామా (5/5) -మరొక అద్బుతమైన పాట. ఇది రెండవ పాట కావొచ్చు.రాముడి దైనందిన జీవితం, సీతాదేవితో ఏకాంతంగా గడిపే క్షణాలను మోంటేజ్‌ పద్ధతిలో చిత్రీకరించి వుండే అవకాశముంది. వర్థమాన గాయకుడు రాము చాలా చక్కగా పాడారు.

  •  కలయా నిజమా వైష్ణవ మాయా (5/5) -ఇదొక బిట్ సాంగ్. ఒక మంచి పాటను చిన్నదిగా కుదించి అన్యాయమే చేశారు. టిప్పు ఇంత అద్భుతంగా పాడగలరని ఈ పాట ద్వారే తెలిసింది. ఇది కూడా మొదటి భాగంలో వచ్చే పాటే.  సీతను అడవుల పాలుచెయ్యనున్నారని తెలిసి ఆంజనేయుడు పడే మానసిక క్షోభను ఈ పాటలో ప్రతిబింబించారు.

  • సీతారామ చరితం (5/5) -దండకారణ్యం నుంచి మొదలై రావణ వధ వరకు సాగే సన్నివేశాలను సులభంగా అర్థమయ్యే రీతిలో వర్ణించిన పాట. అనిత, కీర్తన చాలా బాగా పాడారు. 'ఎందుకు ఈ పరీక్ష, ఎవ్వరికీ పరీక్ష? శ్రీరాముని భార్యకా శీలపరీక్ష,అయోనిజకి అవనిజకా అగ్నిపరిక్షా ? ' అంటూ ప్రశ్నలు అడిగే విధానం చాలా నచ్చింది. సినిమా రెండవ భాగంలో కుశలవులు పాడే పాటల్లో ఒకటి కావచ్చు.

  •  దండకం (5/5) - క్లైమాక్స్ ??

  • సీతా సీమంతం (4/5) -సీతాదేవి సీమంతానికి సంబంధించినది.  సాహిత్యాన్ని జాగ్రత్తగా వింటే ఇది సినిమాలో రెండుసార్లు వస్తుందని తెలిసిపోతుంది. మొదటి సగం అయోధ్యలో, రెండవ సగం వాల్మీకి ఆశ్రమంలో.

  •  గాలి నింగీ నీరు
    (4/5) -ఇది మరో మోంటేజ్ సాంగ్. లవకుశలో ' ఏ నిమిషానికి ఏమి జరుగునో' లా సీతాదేవిని అడవుల పాల్జేసే సమయంలో వచ్చే పాట. ఈ పాటమీదున్న ఏకైక ఫిర్యాదు అధునిక సంగీత వాయిద్యాలు వాడటం.

  • దేవుళ్ళే మెచ్చి(4/5) -రామ కథపై ఇంకొక పాట.

  • రామాయణము (4/5) -రామ కథను కీర్తిస్తూ కుశలవులు పాడే మరొక పాట.
  • రామరామ (3.75/5) -ఈ పాట రెండవ భాగంలో వస్తుంది. అల్లరి చేసినందుకు కోప్పడిన తల్లిని అనునయిస్తూ రాముడి బాల్య చేష్టలను వర్ణిస్తూ కుశలవులు గానం చేసే పాట.
  • ఎవడున్నాడు (3.5/5) -అక్కినేని వ్యాఖ్యానంతో ఈ చిన్న పాట ఆరంభమవుతుంది. తనకు నారదునికి మధ్య జరిగిన సంవాదం రామాయణ రచనకు ఎలా పురిగొల్పింది వివరిస్తూ వాల్మీకి చెప్పే సన్నివేశం ఈ పాటలో పొందుపరిచారు. ' ఓంకారానికి సరిజోదు' అంటూ రాముడి గుణగణాలను అలతి పదాలలో అందంగా సాక్షత్కరించారు.
  • మంగళం రామునకు (3.5/5) -శ్రీరామునికి మాంగళాశ్వాసం.పట్టాభిషేకమయ్యాక వచ్చే చిన్న గేయం
  • సప్తాశ్వరూఢం (3.5/5) -సూర్యభగవానుడు, శ్రీ రాముడు మీద పద్యాలు .ఇది చిత్ర ప్రథమార్థంలో పట్టాభిషేకానికి ముందో తర్వాతో వచ్చే పద్యాలు.
  • ఇది పట్టాభి రాముడు,శంఖు చక్రాలు పోలిన -(3.25/5) -ఇవి రెండు ఒకే బాణీలో ఉన్నాయి.కుశలవులు అయోధ్య వచ్చినప్పుడు రాచనగరును చూపిస్తూ రాముని పరివారంలోని వారో లేక, కూడా వచ్చిన మునికుమారులో పాడే పాటలా ఉంది.జానపదులు పాడుకొనే శైలిలో ఉంది.  


 పాటలన్నీ విన్నాక ఇళయరాజా మాత్రమే ఇటువంటి చిత్రానికి న్యాయం చేకూర్చగలరనిపించింది. శంఖుచక్రాలు పోలిన, గాలి నింగి నీరు పాటలు ఆధునిక శైలిలో ఉన్నప్పటికీ అన్ని పాటలు బావున్నాయి.  కీరవాణి బాణీలు నాకు పెద్దగా నచ్చలేదు. 'అన్నమయ్య' లో కీర్తనలన్నీ అంతకుముందే ప్రాచుర్యంలో ఉన్నవే. అందులో మూడు పాటలకే స్వంతంగా స్వరాలు సమకూర్చారు (తెలుగుదనానికిది, ఏలే ఏలే, అస్మదీయ మగటిమి).' శ్రీరామదాసు' లో కొన్ని మాత్రామే బావున్నాయి. 'పాండురంగడు' లో అంతంత మాత్రం .  అలా కాకుండా చేస్తున్నది మొదటి పౌరాణిక చిత్రమైనా, మేరుపర్వతం లాంటి 'లవకుశ' తో పోటీపడుతున్నా ఏ మాత్రం తొణక్కుండా ఇంత ఆహ్లాదభరితమైన సంగీతాన్ని అందించటం ఒక్క స్వరరాజాకే చెల్లింది. ఈ పాటలకు బాపు దర్శకత్వ ప్రతిభ తోడైతే ఆకాశమే హద్దు. ఆస్తిలో కొంతభాగం పోయినా ఫర్వాలేదు కానీ సినిమా మాత్రం కావ్యంలా మిగిలిపోవాలని తపనపడే నిర్మాత యలమంచలి సాయిబాబా అభిరుచిని అభినందించక తప్పదు. ఈ చిత్రం  అపూర్వవిజయం సాధించి రమణ గారికి ఘననివాళి అర్పించాలని మనసారా కోరుకుంటున్నాను.


1 comment

Post a Comment

ఆంధ్రప్రదేశ్ థీంసాంగ్‌లో నా పెయింటింగ్

ముందుగా నేను గీసిన శాలివాహన చిత్రం చూడండి.

తర్వాత ఈ క్రింది వీడియోలోని ఆంధ్రప్రదేశ్ థీంసాంగ్‌ని జాగ్రత్తగా చూడండి.0:52 నిమిషాల దగ్గర నా పెయింటింగ్ కనిపిస్తుంది.



ఈ వీడియోను ఎవరు కంపోస్ చేశారా అని వెదికితే ఈ వివరాలు కనిపించాయి.

గేయ రచయిత :సాహిత్య సాగర్
సంగీతం:నరేష్
గాయనీ గాయకులు:అంజనా సౌమ్య, శ్రావణ భార్గవి, పవన్
ఎడిటర్:వంశీ
దర్శకుడు:వాసు
నిర్మాణం:టీంవర్క్స్

ఈ సంగతి నాకు ఆలస్యంగా,అదీ కాకతాళీయంగా తెలిసింది. ఫేస్‌బుక్‌లో మా తమ్ముడు పెట్టిన వీడియోల్లో ఇదొకటి. ఏమిటా అని చూస్తే పాట మొదట్లోనే నేను గీసుకున్న బొమ్మ కనిపించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. నేనెవరో తెలియకపోయినా, నేను గీసిన బొమ్మను ఈ వీడియో పుణ్యమా అని కొన్నివేలమంది  చూడగలిగారు. ఉబుసుపోక నేను గీసుకున్న చిత్రాన్ని, బ్లాగ్‌లోంచి ఏరుకొని, ఆ చిత్రానికి  మనరాష్ట్రానికి చెందిన థీంసాంగ్‌లో స్థానం కల్పించి, దానికొక గౌరవాన్ని కల్పించిన వారికి నా కృతజ్ఞతలు.


5 comments

Post a Comment

రాధా కళ్యాణం





పాటలు విని మమకారం పెంచుకున్న సినిమాల్లో రాధాకళ్యాణం ఒకటి. ఆ రోజుల్లో ఇంటింటికీ టి.వీలు గట్రా ఉండేవి కావు కాబట్టి  అన్నిటికీ టేప్‌రికార్డరే  దిక్కు. మా ఇంట్లో మర్ఫీ కంపేని వారి టేప్‌రికార్డర్ ఉంది. దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని శతృదుర్భేధ్యమైన కోటలాగా అదింకా పనిచేస్తూ పాటలు వినిపిస్తూనే ఉంది. ఒకట్రెండు సార్లు రిపేర్ల పేరుతో దండయాత్రలు జరిగాయి కానీ అవేవీ  మూలాన్ని సమూలంగా నాశనం చెయ్యలేకపోయాయి. అప్పట్లో మా నాన్నగారి దగ్గర మంచి పాటల కలెక్షన్ ఉండేది. ఆయనకి నటీనటులతో సంబంధం లేదు. సంగీతం సాహిత్యం సమపాళ్ళలో కలిసిపోయిన మంచి పాటేదైనా వినబడితే వెంటనే రికార్డు చేయించి పట్టుకొచ్చేవారు. అలా పోగైన క్యాసెట్లన్నీ ఒకదాని మీదొకటి పేర్చి ఒక అరలో అందంగా అమర్చేవారు. నాకు పాటలు వినాలనిపించినప్పుడల్లా వాటినన్నిటినీ  తీసి ముందేసుకొని కొత్తపాటలు, వినని పాటలు ఏవైనా ఉన్నాయాని వెదికేవాన్ని.  వేరుచేసిన క్యాసెట్లను ఒక్కక్కటే ప్లే చేస్తూ ప్రతి పాటలో పల్లవులు వినేవాన్ని. ఆకట్టుకొనేలా ఉంటే అది ఆటోమేటిక్‌గా నా ప్లేయింగ్‌ లిస్ట్‌లోకి వెళ్ళిపోయేది. అలా పరిచయమైన పాటలతో ఇష్టాన్ని పెంచుకున్న సినిమా ఇది. పరిచయమైన చాలా కాలానికి ఈ సినిమాని చూశాను. నిన్న మళ్ళీ చూశాను.

చంద్రమోహన్, రాధిక, శరత్‌బాబు నటించిన ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రానికి స్వర్గీయ ముళ్ళపూడి వెంకటరమణ సంభాషణలు సమకూరిస్తే, బాపు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మాతృక కే.భాగ్యరాజా నటించి దర్శకత్వం వహించిన తమిళ చిత్రం  అంత ఎజు నాట్కళ్.  శోభనపు గదిలో విషం తాగి ఆత్మహత్యాప్రయత్నం చేసిన రాధ (రాధిక)ను, డాక్టరైన ఆమె భర్త ఆనంద్ (శరత్‌బాబు)రక్షిస్తాడు. తోలిరాత్రి ఒక ఆడపిల్ల చావడానికి సిద్ధపడిందంటే దానికి పెళ్ళంటే ఇష్టం లేకపోవటమే ఏకైక కారణమని, స్నేహితుడిలా భావించి జరిగిందంతా తనతో చెప్పమని అడుగుతాడు ఆనంద్. రాధ తన కథను చెప్పటం మొదలుపెడుతుంది.

తమిళ బ్రాహ్మణుడైన పాల్ఘాట్ మాధవన్ (చంద్రమోహన్) మ్యూజిక్ డైరెక్టరవుదామని పొట్టచేతబట్టుకొని హైదరాబాదులో దిగుతాడు. ' తాదూర సందులేదు మెడకో డోలన్నట్లు ' అతనికి తోడు శిష్యుడైన ఒక చిన్నపిల్లవాడు. ఇద్దరూ కలిసి ఇల్లు కోసం వెదుక్కుంటూ వచ్చి రాధ వాళ్ళింట్లో మేడ మీద గదిలో అద్దెకు దిగుతారు. రోజూ అవకాశాల కోసం కాళ్ళచెప్పులరిగేలా తిరిగి తిరిగి  అరకొర తిండితో నెట్టుకొస్తూ రాత్రికి ఇల్లు చేరుతూంటారు . రాధ పేదింటి పిల్ల. తండ్రి ఇల్లులొదిలేసి వెళ్ళిపోతే, తల్లి, చెల్లెలు, తమ్ముళ్ళలో కలిసి తాత పంచనే ఉంటూ కాలం వెళ్ళదీస్తూంటుంది. మంచివాడు, అమాయకుడు తనలాగే నిరుపేదైన మాధవన్ వ్యక్తిత్వం ఆమెను ఆకట్టుకుంటుంది. అతని కష్టాలకు జాలిపడి తన బంగారు గాజు తాకట్టు పెట్టి సాయం చేయబోతుంది. మాధవన్ తన వాచినమ్మి ఆమె గాజును విడిపిస్తాడు. తన పేదరికం కారణంగా ఆమె ప్రేమను పట్టించుకోనట్లు మొదట నటించినతను ఆమె నిజాయితీకి మనస్సు మార్చుకుని తనూ ప్రేమించడం మొదలుపెడ్తాడు.

విధురుడై (భార్యను కోల్పోయి) ఆరేళ్ళ పాపకు తండ్రైన డాక్టర్ ఆనంద్‌తో  రాధకు పెళ్ళి నిశ్చయం చేస్తాడు ఆమె తాత. రాధ ఎదురు తిరిగి దెబ్బలు తింటుంది. లేచిపోడానికి సిద్ధమైతే మాధవన్ ఆమెను ఓదార్చి ' రాత్రి రహస్యంగా దేవాలయంలో పెళ్ళిచేసుకుని తిరిగి వచ్చి ప్రొద్దున్న అంతా చెప్పి పెద్దల ఆశీస్సులు తీసుకుందా' మని చెబుతాడు. ఇద్దరూ దేవాలయంలో ఉండగా, మనుషులతో మాధవన్ పై దాడిచేయించి రాధను తీసుకువెళ్తాడు ఆమె తాతయ్య. గుట్టుచప్పుడు కాకుండా ఆమె పెళ్ళి ఆనంద్‌తో జరిగిపోతుంది.

రాధ కథనంతా విన్న డాక్టర్ ఆనంద్, ఆమెను మళ్ళీ మాధవన్‌తో కలిపే బాధ్యతను తన భుజాన వేసుకుంటాడు. చావుబ్రతుకుల మధ్యనున్న తన తల్లి కోరిక మేరకే తను మళ్ళీ వివాహం చేసుకున్నానని, ఆమె మరణించేవరకూ ఆమె మనస్సు నొప్పించకుండా కోడలిగా  మసలుకొంటే చాలని చెబుతాడు. తాకట్టులో ఉన్న రాధ వాళ్ళింటిని విడిపించి ,ఆమె చెల్లెలికి ఉద్యోగం ఇప్పించి, అవిటివాడైన తమ్ముడికి కృత్రిమ కాలుని ఏర్పాటు చేయిస్తాడు. క్రమక్రమంగా ఆరేళ్ళ పాపకు, అత్తకు రాధ దగ్గరవుతుంది. గాయాల నుంచి కోలుకొని మళ్ళీ అవకాశాల వేటలో రోడ్డున పడ్డ మాధవన్‌ను సినిమా తీసే నెపంతో ఆనంద్ చేరదీసి తన గెస్టవుస్‌లో ఆశ్రయం కల్పిస్తాడు. తమ ముగ్గురి కథనే సినిమా కథగా చెబుతూ క్లైమాక్స్  ఎలా ఉంటే బావుంటుందని అడుగుతాడు. భర్తతో ఉండిపోతేనే బావుంటుందని మాధవన్ చెబితే, ప్రేమించిన ప్రియుడి దగ్గరికి చేరడమే ఉత్తమ పరిష్కారమని ఆనంద్ వాదిస్తాడు.

ఆనంద్ తల్లి మరణిస్తుంది. అడ్వాన్సిచ్చే నెపంతో మాధవన్‌ని ఇంటికి పిలిపిస్తాడు ఆనంద్. రాధను ఆ ఇంట్లో చూసిన మాధవన్‌కి విషయం అర్థమవుతుంది. ఆమె అతనితో ఉండటమే ఉత్తమమని, సినిమాలు వేరు జీవితం వేరని చెబుతాడు.ఆనంద్ మొండిగా వాదిస్తే కట్టిన తాళిని విప్పేస్తే ఆమెను తనతో తీసుకువెళ్తానంటాడు. బలవంతంగా తాళి తియ్యబోయిన ఆనంద్‌ను రాధ ప్రతిఘటిస్తుంది. 'ఇదే మన కథ. మన జాతి కథ. నీతి కథ ' అని చెప్పి నిండు మనస్సుతో ఆశీర్వదించి వెళ్ళిపోతాడు మాధవన్. రాధ ఆనంద్ ఒక్కటవ్వంతో కథ ముగుస్తుంది.

విజయవంతమైన తమిళ కథను తెలుగులో చక్కగా తీర్చిదిద్దారు బాపు గారు. బాపు బొమ్మగా రాధిక, తమిళ బ్రాహ్మణుడిగా చంద్రమోహన్, డాక్టర్‌గా శరత్‌బాబు పోటిపడి నటించారు. ముళ్ళపూడి వారి మాటలు తూటాల్లా పేలాయి. ముగింపులో మాధవన్ పాత్రలో చంద్రమోహన్ చెప్పే డైలాగ్ నాకు బాగా నచ్చింది.' పెళ్ళి కాని అమ్మాయి మనస్సు అద్దం లాంటిది. అందులో చానా మూఖాలు కనిపిస్తాయి.కాని తనకి తాళి కట్టిన తర్వాత అదే మనస్సు పటం గా మారిపోతుంది .అందులో ఒకే దేవుడు. భర్త. అది మీరు .మన కథకు ఇదిదా కరక్టు క్లైమాక్సు .ఇది ఓల్డు కావచ్చు కానీ ఇదిదా గోల్డు.' ఎంత అమూల్యమైన మాటలివి.

కే.వి.మహాదేవన్ స్వర గాంధర్వాలకు అందమైన సాహిత్యాన్ని సమకూర్చి పాటలను అజరామరం చేశారు సి.నారాయణరెడ్డి గారు,జ్యోతిర్మయి గారు.చిటికెయ్యవే చినదాన, చేతికి గాజుల్లా, కలనైనా క్షణమైనా, ఏం మొగుడో..ఇలా ప్రతి పాటా ఆణిముత్యమే. ' చేతికి గాజుల్లా, కళ్ళకు కాటుకలా, నుదుటికి తిలకంలా, రాధకు మాధవుడు' అన్న వాక్యాలు విని ఇది ఖచ్చితంగా వేటూరి గారే వ్రాసుంటారని అనుకున్నాను. జ్యోతిర్మయి గారని తెలిసి తెల్లబోయాను.

తెలుగులో కూడా ఘనవిజయం సాధించిన ఈ సినిమాను బాపుగారి దర్శకత్వంలోనే 'వో సాత్‌ దిన్' అనే పేరుతో  హిందిలో పునర్నిర్మించారు. పద్మినీ కొళాపురి, అనిల్‌కపూర్(చంద్రమోహన్), నసీరుద్దీన్‌షా ముఖ్యభూమికలు పోషించారు.అక్కడ కూడా విజయ కేతనం ఎగరవేసింది.





3 comments

Post a Comment

విశ్వనాథ సత్యనారాయణ - వేయిపడగలు - విశ్లేషణ


విసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు ఆశువుగా చెబుతూండగా, వారి తమ్ముడు వెంకటేశ్వర్లు గారు వ్రాసిన నవల వేయిపడగలు. కేవలం 29 రోజుల్లో వేయిపేజీల ఉద్గ్రంథాన్ని వెలువరించడం విశ్వనాథ వారి పాండితీ ప్రకర్షకు నిదర్శనం. 1934లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన పోటీకోసం వ్రాయబడి అడవి బాపిరాజు గారి 'నారాయణరావు'  నవలతో పాటూ ప్రథమ బహుమతి పంచుకున్న ఈ నవల ఆయనకు విశేష ఖ్యాతినార్జించి పెట్టింది. 1968-70ప్రాంతాలలో బహుభాషాకోవిదుడైన దివంగత ప్రధానమంత్రి శ్రీ పి.వి.నరసింహారావు ఈ నవలను  హిందిలోకి అనువదించి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డునందుకొన్నారు. ఈ అనువాదం ఆధారంగా నిర్మితమైన 'సహస్రఫణ్ ' అనే ధారావాహిక హిందీ మొదలైన అనేక భారతీయభాషలలో దూరదర్శన్ ద్వారా ప్రసారమైంది.

ఇంతకుముందు వేయిపడగలు కథను సంక్షిప్తంగా మాత్రమే  చెప్పడం జరిగింది.  అది కాక ఎన్నో పిట్టకథలు, సహాయపాత్రలు ఉన్నాయి.  అన్నింటినీ గుదిగుచ్చడం కష్టం కాబట్టి ప్రధానమైన కథనే ఇక్కడ ప్రస్తావించాను.  ఇక్కడ ఒక ఇబ్బంది కూడా ఉంది. ఒకే పేరు గల పాత్రలు, ఒకే అక్షరంతో మొదలయ్యే పాత్రలు నవలలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు ధర్మారావు తండ్రి పేరు, కొడుకు పేరు రామేశ్వరమే.  వీళ్ళు కాకుండా ప్రతినాయకులలో ఒకడైన రామేశ్వరం ఉండనే ఉన్నాడు.  ఇంకొన్ని పాత్ర పేర్లు ఇలా ఉన్నాయి రామక్రిష్ణారావు, రంగాజమ్మ, రామచంద్రరాజు, రథంతరి, రుక్మిణమ్మారావు, రాజ్యలక్ష్మి...ఇలా సాగుతుంది వరస.  పొరపాటున మధ్యలో కొన్నిరోజులు విరామం ఇచ్చారంటే మళ్ళీ చదవడం మొదలుపేట్టేటప్పుడు ఎవరు ఎవరో గుర్తురాక గందరగోళానికి గురవ్వక తప్పదు.  కానీ ఒకసారి నవల మీద స్పష్టత వచ్చాక ముఖ్యమైన ప్రతిపాత్రా మనస్సులో గుర్తుండి పోతుంది.  అంత వివరణాత్మకంగా పాత్రలను మలచారు.

వేయిపడగలంటే సనాతన భారతీయ ధర్మాలు సంప్రదాయాలని అర్థం. సుబ్బన్నపేట దేవుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హర్రప్ప వంశీకులు,ధర్మారావు వంశీకులు, గణాచారి- వీరు నలుగురు ధర్మానికి నాలుగుస్తంభాలుగా నిలిచి ధర్మార్థకామమోక్షాలను పరిరక్షిస్తూ ప్రజలకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిన రంగారావు ప్రాచీన ధర్మాలకు తిలోదకాలిచ్చి హంగూ ఆర్భాటాలను వంటబట్టించుకొని విచక్షణారహితమైన నిర్ణయాలు తీసుకుని ప్రజాధనం వృధా చేస్తాడు.  ఫలితంగా ఖజానాపై అప్పుల భారం పెరిగి పరిపాలన కుంటుపడుతుంది. కొన్ని వందలఏళ్ళుగా అన్నం పెట్టిన వృత్తివిద్యలు కనుమరుగైపోయి ప్రజలు దిక్కులేనివాళ్ళవుతారు.  విదేశీ విద్యనే మహత్తరమైనదని, స్వజాతి సంస్కృతి ఆచారాలు అనాగరికమనే భావన ప్రబలుతుంది.  ప్రజలందరూ స్వధర్మం మరచిపోయి పరధర్మాల వైపు ఆకర్షితులై, అవే ఉత్తమమని నమ్మి, వాటిని అక్కున చేర్చుకోవటంతో సనాతనధర్మాలకి ప్రతీకైన సుబ్రహ్మణ్యేశ్వరుడు క్రమక్రమంగా తన పడగలన్నీ కోల్పోయి, కళావిహీనమై చివరికి రెండే పడగలతో మిగిలిపోతాడు. ఆ రెండు పడగలే ధర్మారావు, అరుంధతి.

ఇందులో ప్రధానంగా మూడు తరాల జీవన విధానాల్ని, పాశ్చాత్యుల దురాక్రమణ తర్వాత చోటుచేసుకున్న మార్పులు చేర్పులని, తద్వారా ఎదురవుతున్న సమస్యలని చర్చించారు. ఒక రకంగా ఇది విశ్వనాథ సత్యనారాయణ గారి స్వీయచరిత్ర అనుకోవచ్చు. వారి పూర్వీకులు కాశీ వెళ్ళి అక్కడినుంచి శివలింగం తెచ్చి కృష్ణా నదీతీరంలోని ఒక గ్రామంలో ప్రతిష్ఠించారట. అలా ఆ గ్రామం విశ్వనాథపల్లై అదే వారింటి పేరుగా స్థిరపడిపోయింది. ఆ తర్వాత వీరు నందమూరు వలస వచ్చారు. విశ్వనాథవారి నాన్నగారు అక్కడ కూడా కాశీ నుంచి తెప్పించిన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. తెలుగు బోధకులుగా విజయవాడ, కరీంనగర్ కళాశాలల్లో పనిచేసిన విశ్వనాథ వేయిపడగలను నవలను కూడా ఆ విశ్వనాథునికే అంకితమిచ్చి తన శివభక్తిని చాటుకున్నారు. వారికి రెండు పెళ్ళిళ్ళయ్యాయి. మొదటి భార్య గతించాక మరో అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఆమెను కూడా అదే పేరుతో పిలిచేవారు.

వేయిపడగలులో కథానాయకుడు ధర్మారావు కూడా అంతే. అతను కవి,జాతీయ కళాశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. తరతరాలుగా అతని పూర్వీకులు సేవించుకుంటున్న నాగేశ్వరాలయం లోని శివలింగం కాశీ నుంచి తెప్పించి ప్రతిష్ఠించినదే.  తన భార్య చనిపోయాక ధర్మారావు కూడా మరో పెళ్ళిచేసుకుంటాడు. ఆమె పేరు కూడా అరుంధతి. ధర్మారావుకు సనాతనధర్మాల మీద సమున్నత విశ్వాసముంది. వాటికి ఆచరణకు అవరోధాలు కలిగినప్పుడల్లా విలవిలలాడిపోతాడు. స్వతహాగా సాత్వికుడు కానీ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు నిర్మొహమాటంగా వెల్లడించే స్వభావమున్నవాడు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పగలడే కానీ, నచ్చనివాటి మీద ఉద్యమాలు లేవదీసి పోరాటాలు చేసే తత్వం అతనికి లేదు. అన్నిటికీ సాక్షీభూతుడు కానీ దేనికీ ప్రత్యక్ష కారకుడు కాదు. Passive hero.

కథానాయిక అరుంధతి భర్తను రెండవ పెళ్ళి చేసుకోమనేటంత ఉదాత్తురాలు.  ప్రాచీన భారతస్త్రీ స్వభావానికి ప్రతీక. దేవదాసి భగవంతున్నే నమ్ముకుని ఆ మూర్తితో వివాహం కోసం పరితపించే పవిత్రమూర్తి. ఈమె పాత్ర సమాజంలో దేవదాసీలంటే ఉన్న చులకనభావాన్ని రూపుమాపి వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పడానికే సృష్టించబడిందనుకోవచ్చు. రంగారావు, మంగమ్మ లాంటి వాళ్ళు మొదట కొన్ని వ్యామోహాలకు లొంగినా జీవిత చరమాంకంలో తమ తప్పులు తెలుసుకొని మారిపోతారు. రామేశ్వరం, రాధాపతి, దివాను నాగేశ్వరరావు లాంటి వాళ్ళు పాశ్చాత్య సంసృతిని పూర్తిగా జీర్ణించుకుని పెడత్రోవలు తొక్కి పతనమైపోతారు. ధర్మారావు, అరుంధతి, హర్రప్ప లాంటి వారు ఎన్నిఆటుపోట్లు ఎదురైనా పూర్వాచార పరాయణులుగానే మిగిలిపోతారు.

ఈ పుస్తకం చదువుతూంటే నాకు అప్రయత్నంగా భారత,భాగవతాలు గుర్తొచ్చాయి. అందులో ఉన్నట్లే ఇందులో కూడా ప్రతిపాత్రని వంశవృక్షంతో సహా వివరిస్తూ వెళ్తారు రచయిత. తెరమీది బొమ్మల్లా రకరకాల పాత్రలు వచ్చిపోతూ తమ వ్యక్తిత్వాల ద్వారా మన మనస్సులో స్థానాలేర్పరచుకొని వెళ్తాయి.రామేశ్వరశాస్త్రి దాతృత్వం, రత్నగిరి ఆత్మగౌరవం, లక్ష్మణస్వామి(ఏనుగు)స్వామిభక్తి,నాగేశ్వరశాస్త్రి నక్క వినయం, సుసానీ అవిధేయత చెదరని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు సమాజం పరుగులుపెడుతున్నపుడు, ఆ రథచక్రాల ఇరుసులలో ఇరుక్కొని నలిగిపోయిన సామాన్యుల వెతల్ని చక్కగా ఆవిష్కరించారు. ప్రాచీన కళలపై వీరికున్న అవగాహన అడుగడుగునా ప్రతిఫలిస్తుంది. ముఖ్యంగా నాట్యం గురుంచి, నాటకాల గురుంచి ముద్రలతో సహా వివరిస్తున్నప్పుడు ఆశేషమైన ఆ ప్రతిభా సంపత్తికి ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఆయన కలం నుంచి తప్పించుకున్న వస్తువు, వర్ణన లేదేమో? టైంమెషీన్‌లాంటి తన అద్భుతమైన రచనాశైలితో మనల్ని ఒక్కసారిగా మూడువందల ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తారు. చూడాలన్న(చదవాలన్న)ఉత్సుకత ఉంటే సున్నితమైన ప్రతి విషయాన్ని మైక్రోస్కోపిక్ వర్ణనలతో దర్శింపచేసి జ్ఞాన పిపాసను తీరుస్తారు. ఆయన సునిశిత పరిశీలనా దృష్టి ఎంతటిదో ఈ క్రింది వాక్యాల ద్వారా తెలియజేస్తాను.


"వర్షము పెద్దది కాజొచ్చెను.ఆ వానకు వడగండ్లు పడెను...ఒక పాము వానలో పరువెత్తుచుండెను. వడగండ్లు దాని శిరస్సును తాడించుచుండెను.అది పడగవిప్పి బుస్సుమనిలేచి ప్రక్కవాటుగా బొంయిమని వీచుచున్న గాలిని కసిగాట్లు కొరికి కష్టము మీద పోవుచుండెను".

వడగళ్ళు తన మీద పడుతూంటే పాము ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి.తననెవరో కసిదీర మోదుతున్నారని పాముకి కోపం.అక్కనా ప్రక్కనా ఎవరూ లేరు.హోరుమని వీస్తున్న గాలే అలా చేస్తూందనుకుందో, లేక తనకొచ్చిన ఉక్రోషాన్ని వెల్లగ్రక్కాలనుకుందో  కసిదీరా కాట్లు వేస్తోందట.

విశ్వనాథ వారు మేఘానికి వృక్షానికి మధ్య కూడా అద్భుతమైన సంబంధాన్ని ఏర్పరిచి హృదయాలకు హత్తుకొనేలా వివరించారు. ప్రతి సంవత్సరం పడమటి కనుమలు, వింధ్యగిరుల నుంచి ' పృషన్నిధి ' అనే నల్లని మేఘం సుబ్బన్నపేట వచ్చి అక్కడున్న నాలుగువందల ఏళ్ళ నాటి ' ఆదివటం ' అనే మహావృక్షాన్ని కలుసుకొని ఆనందభాష్పాలు రాలుస్తుంది. పట్టణీకరణం కారణంగా ఆదివటంతో సహా మహావృక్షాలన్నిటినీ నరికి విద్యుద్దీపాలకు సిమెంటు స్తంభాలను నాటుతారు. ఎప్పటిలాగే మళ్ళీ వచ్చిన పృషన్నిధి తన మిత్రుడైన ఆదివటం కనబడక తల్లడిల్లిపోతుంది. ఒక విద్యుత్‌స్తంభంపై ఆగి తనను కోరతవేసినట్లు బాధపడితే, ఒక ఝంఝూమారుతం వచ్చి దాన్ని నీళ్ళక్కరలేని గుట్టపైకి విసిరికొడుతుంది.

చెప్పుకుంటూ వెళ్తే ఇవే బోలెడున్నాయి. ఆధ్యాత్మిక వర్ణనలలో ఆయన విశ్వరూపం ప్రదర్శిస్తారు. అద్భుతమైన పరిశీలనాదృష్టి, అపారమైన సాహితీశక్తి ఉంటే తప్ప ఇటువంటి ఊహలు కలగవు. అయితే సమాసభూయిష్టమైన కొన్ని వర్ణనల కారణంగా సగటు పాఠకుడికి బోరుకొట్టే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా చివరి అధ్యాయాలలో వచ్చే దేవదాసి ధర్మారావుల సంభాషణలు, గీతాలు, పద్యాలు చదివి ఆకళింపు చేసుకోవాలంటే చాలా ఓపిక అవసరం.అలాగే, ఆశువుగా చెబుతూంటే వ్రాసిన నవల కాబట్టి కథనానికి ఏమాత్రం సహాయపడని సన్నివేశాలు కూడా అక్కడక్కడా తగుల్తాయి.

ఈ నవలలో చర్చకు వచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. అన్నింటినీ కాకపోయినా కొన్నింటిని వివరిస్తాను.

1. ఇతిహాసాలు,పురాణాలలోని పాత్రలను అభినయిస్తున్నప్పుడు నటీనటుల వస్త్రధారణ హావభావాలు అందుకనుగుణంగా ఉండాలని వ్యాఖ్యానించారు.నారదుడు సామగానం చేస్తే నాటకాలలో భజనగీతాలు పాడుతున్నట్లు చూపిస్తారని,అలాగే శ్రీ కృష్ణుడికి నీలిరంగు బనియను తొడిగి,శిరస్సుపై నెమలిపింఛం పెడతారు గానీ మూతి మీద మీసం మాత్రం ఉంచరని,పాశ్చాత్య నాటకాలు ప్రదర్శిస్తున్నప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటారని విమర్శిస్తారు.ఈ మాటలతో నేనూ ఏకీభవిస్తాను. పేరుమోసిన పెద్ద పెద్ద నిర్మాతలంతా క్రేజీ కాంబినేషన్ల పేరుతో తలాతోకా లేని సినిమాలు ఏళ్ళ తరబడి తీసి చేతులు కాల్చుకొనే కంటే మన గాథల్లోని సంఘటనలను ఉన్నవి ఉన్నట్లుగా తెరకెక్కిస్తే విజయాల సంగతేమోకానీ కనీసం ఆత్మతృప్తైనా మిగులుతుంది.


2. బాల్యవివాహాలను సమర్థించారు.చిన్నప్పుడే ఆడపిల్లకు తన భర్తెవరో తేలిపోవటం వల్ల అతనిమీదే మనస్సు లగ్నమవుతుందని,పెళ్ళి చిన్నప్పుడే చేసినా కార్యం ఎప్పుడో పదమూడేళ్ళ తర్వాత రజస్వలైన తర్వాతే జరిపిస్తున్నాం కాబట్టి ఇందులో దోషమేమీలేదని వాదించారు.అంతేకాదు మనం చిన్ననాడే గర్భాదానం చేయిస్తున్నామని భ్రమపడి పాశ్చాత్యులు బాల్యవివాహాలను వ్యతిరేకిస్తున్నారని,వారి వాదన సరికాదని విశ్లేషించారు.అయితే బాల్యవివాహాల ద్వారా కలిగే ఇక్కట్లను ఆయన మర్చిపోయినట్లున్నారు. వరుడు, అత్తమామలు మంచివారైతే ఫర్వాలేదు.కొంతలో కొంత నయం.కాకపోతేనే వచ్చింది చిక్కు.అప్రయోజకుడైన భర్తకు సేవలు చేస్తూ,అత్తింటి ఆరళ్ళు భరిస్తూ,తన దౌర్భాగ్యానికి తనను తానే నిందించుకుంటూ పసిప్రాయం నుంచే నరకాన్ని అనుభవించాలి.ఒకవేళ మంచి సంబంధమే దొరికినా హాయిగా ఆడుతూపాడుతూ తిరిగే వయసులో పుట్టెడు చాకిరీలు చెయ్యటం అవసరమా?

3. విగ్రహారాధనను వెనుకేసుకొచ్చారు. నిర్గుణమైన పరబ్రహ్మను సగుణం చేసి ఆరాధిస్తున్నప్పుడు ఒక ఆకృతి అవసరమవుతుందని, ఆ భావాన్నే పూజిస్తున్నామని,హిందువుల దేవుళ్ళు విగ్రహాలైతే, ఫోటోలు, చిత్రాలు, సిలువ
చిహ్నాలు విగ్రహాలు కావా అని ప్రశ్నలు సంధించారు. క్రీస్తును చంపిన సిలువ క్రైస్తవమతానికి చిహ్నమెలా అయ్యిందని నిలదీస్తారు. ఇందులో సత్యం లేకపోలేదు .

4. విధవా వివాహాల మీద కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పురుషుడికి ధనముంటే, స్త్రీకి అందముందని, సంఘసంస్కర్తలు కూడా డబ్బు, అందమున్న విధవలనే చూసి పెళ్ళిచేసుకుంటున్నారని, వాటితో నిమిత్తం లేకుండా విధవావివాహాలు జరిగినప్పుడు మంచిదని చెబుతారు.

5. ఇంగ్లీషు చదువుల మీద  అభిప్రాయాలను వెల్లడించారు.పది పదహారేండ్ల వరకూ తెలుగు చక్కగా చెప్పి తర్వాత ఏ భాషైనా బోధించమని,చిన్నప్పటినుండీ ఇంగ్లీషే బోధించటం వలన ఇంగ్లీషు కొంచెం వస్తోంది కానీ,తెలుగేమీ రాకుండా పోతుందని ఆవేదన చెందారు. ఈ గొడవ ఆనాటి(1934) నుంచే ఉన్నట్లుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటం తప్పనిసరి కాబట్టి మన నిర్ణయాలని కొంత సమర్థించుకోగలిగినా తెలుగు సరిగ్గా చదవడం, వ్రాయటం రాని తరం తయారవటం మాత్రం నిజంగా దురదృష్టకరం.

6. విడాకుల చట్టాలకు,స్త్రీ సమాజాలకు కూడా తాను వ్యతిరేకినని మంగమ్మ పాత్ర ద్వారా చెప్పిస్తారు. పనులను పంచుకోవాలి కానీ వాటికోసం పోటీపడరాదని, చదువుకున్నంత మాత్రాన స్త్రీ పురుషులిద్దరికీ సమానమైన జ్ఞానముంటుందని భ్రమపడరాదని చెబుతారు. స్త్రీ విద్య గురుంచి మాట్లాడుతూ స్త్రీలను క్రైస్తవ బడుల్లోకి పంపరాదని ధర్మారావు చేత చెప్పిస్తారు. మిషనుస్కూళ్ళలో చదివిన ఆడపిల్లలకు మన సంప్రదాయాలు అలవాటుకాక హైందవ సంస్కృతి నాశనమవుతోందని, గృహదేవతైన ఆమెకు గృహసంబంధమైన మంచిచెడ్డలు తెలియకుండా పోతున్నాయని బాధపడతారు.


వీరి అభిప్రాయాలు కొందరికి విపరీతంలా తోచవచ్చు. చాలా మంది ఏకీభవించలేకపోవచ్చు. రచయితే రాధాపతి పాత్ర ద్వారా చెప్పించినట్లు ఈయనెవరో బి.సి కాలం నాటి వాడని తీసిపారేయవచ్చు. కానీ మూడు దశాబ్దాల కాలంలో మనుషుల్లో,సంఘంలో చోటుచేసుకున్న పరిణామాలకు దర్పణం పట్టిన నవలగా దీన్ని దర్శిస్తే,చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గ్రంథమని ఇట్టే బోధపడుతుంది.

ఒకప్పుడు ఈ నవల విడిగా లభ్యమయ్యేది కాదు.విశ్వనాథ వారి సాహితీసర్వసం(మొత్తం సెట్టు నాలుగువేలకు పైమాటే అనుకుంటా) కొంటే తప్ప విడిగా అమ్మబడదని చెప్పేవారు. నేను కూడా మూడు నాలుగుసార్లు ఆ సమాధానం విని నీరుగారిపోయాను. నా బోటి వాళ్ళను తలచుకోని ఆ నిబంధనను తర్వాత సడలించినట్లున్నారు. ఇప్పుడు విడిగా కూడా లభ్యమవుతోంది.

సాదా ప్రతి వెల 558/-, లైబ్రరీ ప్రతి వెల 1116/-


9 comments

Post a Comment

విశ్వనాథ - వేయిపడగలు - సమీక్ష - మూడవభాగం



దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత విశ్వనాథ వారి వేయిపడగలు నవల సమీక్షకు మూడవ భాగం వ్రాస్తున్నందుకు పాఠకులు క్షమించాలి. దీనికి ప్రధాన కారణం అంత పెద్ద కథను క్లుప్తంగా ఎలా చెప్పాలో వెంటనే బోధపడకపోవటం. అందువల్లనే దీనిని వెనక్కి నెట్టి మిగతా విషయాల మీద టపాలు వ్రాయటం జరిగింది. ఇప్పుడు వీలు చిక్కింది కాబట్టి నింపాదిగా ఒకటికి రెండుసార్లు చదివి మధ్యలోనే ఆగిపోయిన సమీక్షను కొనసాగించదలచుకున్నాను. ముందు మిగతా కథలోకి వెళ్దాం.

రామేశ్వరం తాలూకా అధ్యక్షుడవుతాడు. సినిమా వ్యాపారం మొదలుపెట్టి డబ్బులు బాగా వెనకేసుకుంటాడు. జోస్యులు అనే ఉపాధ్యాయుడు అతని ప్రాపు కోసం ప్రాకులాడి తన ఇంటికి ఆహ్వానిస్తాడు. జోస్యులు భార్య మంగమ్మ. ఆమెకు నాగరిక లక్షణాలు తెలియవు. పైగా మగడంటే ఎక్కడలేని అయిష్టత. రామేశ్వరం మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకుంటాడు. విషయం తెలిసిన జోస్యులు తీవ్రంగా మథనపడి, సంగతి నలుగురికీ తెలిసిందని గ్రహించి అత్మహత్యాప్రయత్నం చెయ్యబోయి ధైర్యం చాలక గొల్లుమంటాడు.

పాఠశాలల తనిఖీకి వచ్చిన రామేశ్వరాన్ని చూసి జోస్యులు ఖాతరు చెయ్యకుండా నిద్రబోతాడు.రామేశ్వరం సంజాయిషీ కోరుతూ చీటీ పంపితే ' తాను సరిగ్గాలేడు గనకే తన భార్యను అతను ఏలుకొంటున్నాడని,తన నెల జీతం తనకు నెలా నెలా సరిగ్గా ముట్టజెప్పాలని,అలాగే తన భార్యతో కలిసి ఇంకా తను ఒకే ఇంట్లో ఉంటున్నందుకు పైకం పంపించాలని',తిరుగు టపా పంపుతాడు జోస్యులు. మంగమ్మ మోజులోపడిన రామేశ్వరం తన యావదాస్తిని ఆమె పేరిట వ్రాస్తాడు. అందరూ జోస్యుల్ని నపుంసకుడని గేలిచేస్తారు. జోస్యులు ఉన్మాదావస్థకు లోనై ఒకరోజు వీధిలో పెద్దమనుషులతో వెళ్తున్న రామేశ్వరం మీద కత్తితో దాడి చేస్తాడు. రామేశ్వరం మనుషులు అతని ఒళ్ళు హూనం చేస్తారు. పిచ్చివాడై రాత్రిపూట గుండేరు దగ్గర తిరుగుతున్న జోస్యులు హత్యకు గురవుతాడు.

రామేశ్వరం దొంగనోట్ల కేసులో అరెస్టవుతాడు. అతని పలుకుబడి ఆస్తిపాస్తులు అతన్ని రక్షించలేకపోతాయి. ఏడేండ్ల జైలుశిక్ష పడుతుంది. భర్తపోయాక గడసరితనం, నిర్భయత్వం అలవర్చుకున్న మంగమ్మ, జైలుకి వెళ్ళి రామేశ్వరాన్ని అపహాస్యం చేస్తుంది. స్వాతంత్ర్య పోరాటంలో అరెస్టయిన తన స్నేహితుడిని చూడటానికి అదే జైలుకు వచ్చిన ధర్మారావు, కటకటాల వెనుకనున్న రామేశ్వరాన్ని చూసి తగినశాస్తి జరిగిందని అనుకుంటాడు.

ధర్మారావు స్నేహితుడు కిరీటి. అతనికి తన మరదలంటే చాలా ఇష్టం. తన కూతురుని అతనికే ఇచ్చి పెళ్ళి చేస్తానని చిన్ననాడు ప్రమాణం చేసిన అతని మేనమామ,ఆ తర్వాత నయాపైసా సంపాదన లేదని తెలిసి విముఖత చూపిస్తాడు.కిరీటి తల్లి మరణిస్తుంది.కిరిటి మరింత కృంగిపోయి నిద్రాహారాలు లేక నీరసించిపోతే,కబురందుకున్న అతని మేనమామ జాలిపడి తుదకు పెళ్ళికి అంగీకరిస్తాడు.

రాధాపతి ఒక మోస్తరు కవి. మంచి మాటకారి పైగా జిత్తులమారి. పనీపాటా లేకుండా ఆవారాగా తిరుగుతూంటాడు. బిజిలీ అనే ఒక నాటకాలపిల్లతో కొన్ని రోజులు ప్రేమాయణం నడిపి,ఆమె తరపువాళ్ళు కర్రలు పుచ్చుకోవడంతో కాలికి బుద్ధిచెప్పి మనోచాంచల్యం చావక ట్రైనులో తారసపడిన ఒక ఉపాధ్యాయురాలిని బుట్టలో వేసుకుంటాడు. ఆమెతో కొన్నాళ్ళు సహజీవనం చేసి ఆమెను గర్భవతి చేస్తాడు. పెళ్ళి కాకుండా తల్లయినందుకు ఆమె కించపడి అబార్షన్ చేయించుకుంటుంది. అప్పటికి అతని వాలకం తేటతెల్లమై అతనితో తెగతెంపులు చేసుకుంటుంది. అప్పులవాళ్ళు పట్టుకుపోగా మిగిలిన ఆస్తిని కరిగించి బెజవాడలో అనాధ స్త్రీ శరణాలయం తెరుస్తాడు రాధాపతి. రామేశ్వరం ద్వారా ప్రాప్తించిన ధనంతో అక్కడికి చేరుకున్న మంగమ్మ, అతని తీపిమాటలకు మోసపోయి అతనితో పాటూ తిరిగి సుబ్బన్నపేట వచ్చేసి సహజీవనం ప్రారంభిస్తుంది.

పంకజమ్మ ఒక వితంతువు. ఆమె కూతురు శ్యామల కుమారస్వామి అనే ఒక పేదబ్రాహ్మణ విధ్యార్థిని ఇష్టపడుతుంది.పంకజమ్మకు ఇదంతా ఇష్టముండదు. అందరికీ తనమీద గౌరవం ఉండటం చేత వారు పిలిచినప్పుడల్లా వెళ్ళి చర్చల్లో పాల్గొంటూ అనేక విషయలమీదా వాదోపవాదాలు చేస్తూంటాడు ధర్మారావు. అతని ఆభిప్రాయాలు,భావాలు రాధాపతికి నచ్చవు. బి.సి.కాలం నాటి వాడంటూ అతన్ని ఈసడించుకుంటాడు. తనతో పాటూ బెజవాడ రావల్సిందిగా మంగమ్మను కోరుతాడు. ధర్మారావు ప్రభావంతో మారిపోయిన ఆమె ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తుంది.

ధర్మారావు దంపతులు 'ఉండి' వెళ్ళి పశుపతి ఇంట్లో కొన్ని రోజులుంటారు. పశుపతి కూతురు పేరు కూడా అరుంధతే. ఆ పాపతో వారిద్దరికీ చనువు కుదురుతుంది. సుబ్బన్నపేటలోని బ్రాహ్మణవీధిలో మంటలంటుకొని ఇళ్ళు తగలబడిపోతాయి. పురపాలక సంఘం సమావేశమై కుళాయిలు విద్యుద్దీపాలు సమకూర్చుకోవాలని నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయాన్ని ధర్మారావు అన్నగారు వ్యతిరేకిస్తారు. ఉన్న అప్పులే తీరలేదని,కొత్తగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రజలందరిమీదా పన్నులభారం పడుతుందని వాదిస్తారు. ఆయన మాటలను అందరూ పెడచెవిని పెడతారు. సుబ్బన్నపేటకు కుళాయిలు,విద్యుద్దీపాలు వస్తాయి. స్త్రీ సంఘం ఏర్పాటై బాల్య వివాహాలు,విధవా వివాహాల మీద చర్చలు మొదలవుతాయి.

రంగారావు శ్రీలంక నుంచి ఒక ఫ్రెంచి వనితను తీసుకొచ్చి వివాహం చేసుకుంటాడు. ఇంగ్లీషు భార్యకు,ఫ్రెంచి భార్యకు మధ్య సవతుల గొడవ ప్రారంభవుతుంది. కోర్టుకెక్కి సమస్యలు తెచ్చుకోలేక ఫ్రెంచి వనితను నెలభరణానికి ఒప్పించి ఆమెను తిరిగి శ్రీలంక పంపేస్తాడు రంగారావు. ఇంగ్లీషు భార్య పేరు సుసానీ. సాధ్యమైనంత పైకం మూటగట్టుకొని ఇంగ్లాండుకు శాశ్వతంగా వెళ్ళిపోవాలని ఆమెకు ఊహ కలుగుతుంది. ఈ లోగా రంగారావు అంతుచిక్కని వ్యాధికి గురవుతాడు. ఇంగ్లీషు మందులు పనిచెయ్యవు. ఇదే సమయమని భావించిన సుసానీ తను ఇంగ్లాండు వెళ్ళిపోతానని రంగారావుతో చెబుతుంది. అతను అంగీకరిస్తాడు. సుసానీ ఉన్నదంతా ఊడ్చుకొని ఇరవైలక్షల రూపాయలతో వెళ్ళిపోవాలని సన్నాహాలు చేసుకుంటుండగా రంగారావు కొడుకు హర్రప్ప వచ్చి తన తల్లి నగలు మాత్రం విడిచి వెళ్ళమని అర్థిస్తాడు. ఆమె ఒప్పుకొని మిగిలిన సొమ్మంతా పెద్ద పెద్ద పెట్టెలలో పోగేసుకొని ఇంగ్లాండు తీసుకుపోతుంది. అయితే ఆమెను మోసం చేసి పది లక్షలవరకు కాజేస్తాడు దివాను. హర్రప్ప రాజ్యాధికారం తన చేతుల్లోకి తీసుకొని అన్ని వ్యవహారాలు చక్కబెడతాడు. తండ్రికి ఆయుర్వేద వైద్యున్ని కుదుర్చి ధర్మారావుని తన దివానుగా నియమిస్తాడు. జీతం పుచ్చుకోడానికి ధర్మారావు అంగీకరించడు.

కుమారస్వామి,శ్యామల వివాహం జరుగుతుంది. బ్రతుకు గడవడం కోసం మంగమ్మ దగ్గర అప్పులు చేస్తూంటాడు. అతను పదే పదే ఇంటికి రావటం రాధాపతికి నచ్చదు. మంగమ్మ రాధపతిని లక్ష్యపెట్టదు. ఆమె సారంగధర నాటకంలో చిత్రాంగి వేషం కడుతుంది. అరుంధతి రోగగ్రస్తురాలవుతుంది.

హర్రప్ప నాయనమ్మకు, తల్లికి కర్మలు చేసి,వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాలకు అంకురార్పణ చేస్తాడు. ధర్మారావు కుటుంబసభ్యులు సంతోషసాగరంలో మునిగిపోతారు. బంధుమిత్రాదులతో ధర్మారావు గృహం కళకళాడుతుంది. పిల్లవాడైన ధర్మారావు కొడుకు కోటకు ఒంటరిగా వెళ్ళి భయం లేకుండా సంచరిస్తూ,ముద్దు ముద్దు మాటలతో రోగిపీడుతుడైన రంగారావుకు ఉల్లాసాన్ని కలిగిస్తూంటాడు. ఇంతకాలం కళ్యాణోత్సవాల కోసమే ఎదురుచూసిన దేవదాసి,ఉత్సవాలలో అందంగా అభినయించి ప్రాణాలు విడుస్తుంది. ఈలోగా అరుంధతి అనారోగ్యం ముదిరి అవసానదశకు చేరుకుంటుంది.

తన ఆవేశం కారణంగా ఉద్యోగం కోల్పోతాడు కుమారస్వామి. మంగమ్మ అతన్ని కుమారునిగా భావించి ఆస్తంతా అతని పేర, ఏటా స్వామి ఉత్సవాల నిర్వహణ పేరిట రాసేస్తుంది. చిన్ననాడు ఇష్టపడిన తన బంధువుల అమ్మాయిని శరణాలయం వచ్చి తన బాగోగులు చూడవలసిందిగా అభ్యర్తిస్తాడు రాధాపతి. ఆమెకు ఇదివరకే పెళ్ళయ్యింది. మొగుడితో దెబ్బలాడి రాధాపతితో వచ్చేసి సహజీవనం ప్రారంభిస్తుంది. తనను ప్రేమించమని ఆమెనడుగుతాడు రాధాపతి. సహజీవనం చేస్తున్నా కూడా అతనిని ప్రేమించలేనంటుందామె. రాధాపతి విరక్తి చెంది సైనేడు మింగి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ విషయమంతా అతని సహచరుడు వ్రాసిన ఉత్తరం వలన మంగమ్మకు తెలుస్తుంది. ఆస్తంతా ఇతరులకు దానం చేసిందనే కోపంతో,నమ్మకంగా పనిచేస్తునట్లు నటిస్తూ వచ్చిన చెంగల్రావనే వ్యక్తి మంగమ్మను హత్య చేస్తాడు. పోలిసులతన్ని అరెస్టు చేస్తారు. అరుంధతి మరణిస్తుంది.ధర్మారావు శోకసముద్రంలో మునిగిపోతాడు.

రంగారావు ఆరోగ్యం కుదుటపడుతుంది. హర్రప్ప యోగమరణం పొందుతాడు. గణాచారి పాకలోనే తగలబడిపోతుంది. ధర్మారావు పశుపతి ఇంటికి వెళ్తాడు. పశుపతి కూతురు చిన్న అరుంధతి ధర్మారావునే పెళ్ళాడుతానని పట్టుబడుతుంది. పశుపతికి బాల్యవివాహాలు ఇష్టం లేకపోయినా కూతూరు మొండిపట్టుదలకు తలొగ్గి ధర్మారావుకిచ్చి పెళ్ళిచేస్తాడు. స్వర్గస్తురాలైన తన భార్య అరుంధతియే చిన్న అరుంధతినావహించినదని ధర్మారావు భావిస్తాడు . చిన్న అరుంధతి అవునని చెప్పటంతో నవల సమాప్తమవుతుంది.


(విశ్లేషణతో కూడిన చివరిభాగం తరువాతి టపాలో)


ధర్మస్థల - హళేబీడు - బేలూరు

ర్మస్థల..రెండు వారాల క్రితం, రిటైరై ఖాళీగా ఉన్న మా తల్లిదండ్రులు వేసవి శెలవులలో బెంగుళూరు వచ్చినప్పుడు వచ్చిందీ ప్రస్తావన.ఇరవై మూడేళ్ళ క్రిందట, మూడేళ్ళ మా చెల్లికి రెండవసారి తలనీలాలివ్వటానికి వెళ్ళినప్పుడు మొదటిసారి ధర్మస్థలను చూశాను. అప్పుడు మేము తిరుపతి నుంచి బయలుదేరి వెళ్ళాం. ఎప్పుడు మేమెక్కెడికి వెళ్ళినా కుటుంబసభ్యులందరినీ వెంటేసుకొని బయలుదేరే మా నాన్నగారు అప్పుడు కుడా మాతోపాటూ నాన్నమ్మను, తాతను, అమ్మమ్మను వెంటబెట్టుకొని వెళ్ళారు. అప్పట్లోనే ఆయన బేలూరు,హళేబీడు, శ్రవణబెళ్గోల చూడాలని ప్లాన్ చేశారు. కానీ ఈయనకు కన్నడ రాక, ఆయన చెప్పింది కన్నడ కండక్టరుకి అర్థం కాక ఆ ప్లాను బెడిసికొట్టి మా యాత్ర ధర్మస్థల దర్శనంతోనే ముగిసిపోయింది. వాళ్ళు ధర్మస్థలను మాత్రమే చూడాలనుకొన్నా,ఆ యాత్రకు బేలూరు,హళేబీడు కూడా జోడించి ఈ సారైనా వాళ్ళ కోరిక తీర్చాలని నేను గట్టిగా అనుకొన్నాను. టికెట్ ఏర్పాట్లు మా తమ్ముడు చూసుకున్నాడు.

బెంగళూరు నుంచి 325 కిలోమీటర్ల దూరంలో ఉంది ధర్మస్థల. డైరెక్ట్ ట్రైన్స్ ఏవీ లేవు. హస్సన్‌లేదా మంగళూరులో దిగి మళ్ళీ బస్సులో ప్రయాణం చెయ్యాలి. బస్సులో అయితే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ప్రయాణం. రాత్రి తొమ్మిదిన్నరకు బస్సెకితే తెల్లవారుజామున ఐదున్నరకి ధర్మస్థల చేరుకున్నాం. అప్పటికి చీకట్లింకా తొలగిపోలేదు. మా తల్లిదండ్రులను ధర్మసత్రాల దగ్గర కూర్చోబెట్టి ఖాళీగదుల కోసం కాటేజీలను,గెస్టవుస్‌లను వెదుక్కుంటూ వెళ్ళాను. వెళ్ళిన ప్రతిచోటా గదులు లేవన్న బోర్డు వెక్కిరిస్తూ కనపించింది. అలా ఒక గంటసేపు తచ్చాడి ఇక లాభం లేదని ఓ కాటేజిలో దూరాను. మరో గంటన్నరపాటూ చాంతాడంత పొడుగాటి లైన్లో నిల్చుంటే రూం దొరికింది. రూం కేటాయించే సమయంలో తప్పనిసరిగా మీ బంధుమిత్రులందరూ అక్కడే ఉండాలి. అప్పుడే రూం లభిస్తుంది. మాకు ఐదవ ఫ్లోర్‌లో కేటాయించారు. ఆ లభించిన గది కూడా పేరుకు గదే కానీ అందులో మంచాలు,మాట్రెస్సులు లాంటివేం లేవు. మూడు పొడవాటి సిమెంటు అరుగులను గదిలో నిర్మించి వాటిమీద బస్‌సీట్లలాంటి నల్లటి కవర్లను కప్పారు. హతోస్మి అనుకున్నాను. ఆ రోజు మా అదృష్టం బాలేదో లేక మాములుగానే ధర్మస్థలలో రూములంతేనో తెలియలేదు. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అంతా దేవస్థానం ఆధీనంలోనే ఉన్నాయని,ప్రైవేటు హోటళ్ళేవి లేవని విన్నాను. ఆలయ వెబ్‌సైట్‌లో అవుట్‌డేటెడ్ ఫోన్‌నంబర్లు దొరికాయి. పనిచేస్తున్న ఈ-మెయిల్ఐడి నుంచి జవాబు రాలేదు. గూగుల్‌లో వెదికినా ఇతర ప్రత్యామ్నాయాలు దొరకలేదు. ఒక్కటి మాత్రం నిజం. ధర్మస్థలలో సరైన వసతి సౌకర్యలు దొరికితే మీరదృష్టవంతుల కిందే లెక్క.

స్నానపానాదులు ముగించుకొని,టిఫన్ చేసి మంజునాథేశ్వరాలయానికి వెళ్ళాం. కేరళ లేక మంగళూరు సాంప్రదాయ శైలిలో కట్టిన ఈ ఆలయానికో ప్రత్యేకత ఉంది. దీనిని జైనులు నిర్వహిస్తున్నారు. ఇందులో కొలువై ఉన్న దేవుడు పరమశివుడు.
 


పూజలు చేసే పూజారులు వైష్ణవ తెగకు చెందినవాళ్ళు. ఇలా మూడు విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఇక్కడ శాంతి సౌభాతృత్వంతో మెలగుతూ దేవుడొక్కడే అన్న విషయాన్ని నిరూపిస్తారు. ఇక్కడ ప్రత్యేక దర్శనమంటూ ఏమీ లేదు. అందరూ మాములు క్యూలో వెళ్ళవలసిందే. క్యూలైన్లు పొడవుగా ఉన్నా క్యూ కదులుతూనే ఉంటుంది. గర్భాలయం సమీపమించినప్పుడు పురుషులు షర్టులు,బనియన్లు తీసివేయాల్సి ఉంటుంది. క్యూలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి బయటికి వచ్చేంతవరకు వివిధసేవలు,వాటికి దక్కే ప్రసాదాల వివరాలతో చెవులు ఊదరగొట్టేస్తారు నిర్వాహకులు. ఇది నాకు నచ్చలేదు. ఎంతసేపు ఈ గొడవే అయితే ఇక దేవుడి మీద మనస్సు లగ్నమయ్యేదెప్పుడు?

పూర్వకాలంలో ధర్మస్థలను కుడుమ అని పిలిచేవారు.ఇక్కడ జైన మతపెద్దైన పెర్గడె,అమ్ము బల్లత్తి దంపతులు ఎంతో ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవారు.ఒకనాడు మానవాకారాలు ధరించి వచ్చిన ధర్మదేవుని దూతలను పెర్గడె దంపతులు తమ ఆతిథ్యంతో సంతృప్తి పరుస్తారు.దేవదూతలు సంతోషించి ఆ రాత్రి పెర్గడె కలలో కనిపించి ప్రస్తుతం అతనుంటున్న ఇంటిని ఖాళీ చేసి ధర్మప్రబోధం చెయ్యవలసిందని అజ్ఞాపిస్తారు.

వారి ఆజ్ఞానుసారం కొత్తిల్లు కట్టుకొని,పాతింటిలో వెలసిన ధర్మమూర్తులను కొలుస్తూంటాడు పెర్గడె.మళ్ళీ వారు అతని కలలో కనబడి తమకు ప్రత్యేకంగా ఆలయాలు నిర్మించాలని,వాటి నిర్వహణ బాధ్యతలు అతనే తీసుకోవాలని,దానికి బదులుగా అతని కుటుంబాన్ని తాము రక్షించి సమృద్ధినిస్తామని చెబుతారు. వారు చెప్పినట్లే చేసిన పెర్గడె, పూజారుల కోరిక మేరకు అన్నప్ప ద్వారా మంగళూరు దగ్గరున్న కద్రి నుంచి శివలింగాన్ని కూడా తెప్పించి ప్రతిష్ఠిస్తాడు. 16వ శతాబ్దంలో ఉడిపి వడిరాజస్వామి వేంచేసి లింగానికి శాస్త్రయుక్తంగా పూజలు చేసి ఈ ప్రదేశాన్ని ధర్మస్థలగా నామకరణం చేస్తాడు.

గంటలో దర్శనం పూర్తయ్యింది. వెంట్రుకలివ్వాలనుకొనే వారికి ఆలయం వెలుపలే టికెట్లు లభిస్తాయి. మనవైపు ఆడవాళ్ళు మూడు కత్తెర్లు వేయించుకుంటే ఇక్కడ ఐదు కత్తెర్లు వేయించుకోవాలి. దీనిని పంచముడి అంటారు.

అక్కడి నుంచి దగ్గర్లోనే ఉన్న నేత్రావతి నదీ తీరానికి వెళ్ళాం. అది అధ్వానంగా ఉంది. భక్తులు నీటిని కలుషితం చేస్తారని నదికి చెక్‌డ్యాం కట్టి చిన్న చిన్న గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ఆ నీరు ఏర్పరచిన గుంటలలో భక్తులు స్నానాలు

 


చేస్తూ,ఈదులాడుకుంటూ కనిపించారు. నదిలో దిగి నీళ్ళు చల్లుకొని ఒకటి రెండు ఫోటోలు దిగి తిరిగి వచ్చేశాం.అప్పటికి అపరాహ్ణవేళయ్యింది. సరైన హోటల్‌కోసం చూస్తే దేవస్థానం వారి ఉచిత అన్నదానం చాలా బావుంటుందని,అందరూ వాటినే ఆదరించటం మూలన పెద్దగా భోజన హోటల్స్ లేవని తెలిసింది. మేం దర్శనం కోసం క్యూలో నిలబడినప్పుడే అన్నదానం క్యూ ఆంజనేయుని తోకలా పొడవుగా ఉంది. మళ్ళీ గంటల తరబడి క్యూలో నిలబడే ధైర్యం లేక బస్టాండులో ఉన్న చిన్న హోటల్‌లో కాస్త కతికి భోజనం అయిందనిపించాం. అప్పటికే నేనొక నిర్ణయానికి వచ్చేశాను. ధర్మస్థలలో ఎక్కువసేపుండటం కంటే ముందు హస్సన్ వెళ్ళిపోయి అక్కడ సరైన సౌకర్యాలున్న హోటలొకటి చూసుకోవాలని అనుకున్నాను. వెంటనే నా అలోచనను అమలులో పెట్టాను. మధ్యాహ్నం రెండున్నరకి హస్సన్‌బస్సు దొరికింది.మూడు దాటితే తర్వాత బస్సు రాత్రి ఎనిమిదిపైనేనని కండక్టరు చెప్పాడు. సౌకర్యలోపం కారణంగా తలెత్తిన ఇబ్బందులు ధర్మస్థల, దానికి చుట్టుపక్కలున్న ప్రదేశాలు చూడాలనుకొన్న నా పూర్వపు ఆలోచనలను వెనక్కి నెట్టేశాయి.

ధర్మస్థల నుంచి హస్సన్‌కు 110 కిలోమీటర్లు. ఘాట్‌రోడ్డు కాబట్టి బస్సులో నాలుగు గంటలు పట్టింది. దారికిరువైపులా పచ్చదనమే. ఎక్కడా రాయలసీమలోలా రాళ్ళగుట్టలు కనబడవు. పైగా విశాలమైన ఆవరణతో విలసిల్లే మంగళూరు శైలి గృహనిర్మాణాలు,పనసతోటలు,కాఫీ తోటలు మార్గమంతా ఎదురై ఆహ్లాదాన్ని పంచుతాయి. సకలేశ్‌పుర తర్వాత హోరున వర్షం కురిసి వాతావరణాన్ని మరింత ముగ్ధం చేసింది.

హస్సన్ కొత్తబస్టాండును తలదన్నే బస్టాండు ఆంధ్రదేశంలో ఏ జిల్లా కేంద్రంలోనూ లేదేమో .అంత స్టైలిష్‌గా విశాలంగా ఉంది. బస్టాండుకు కొద్ది దూరంలోనే మంచి హోటల్‌లో దిగి సేదతీరాం. ఆ తర్వాత బేలూరు,హళేబీడు,శ్రావణ బెళ్గోల చుట్టిరావడానికి టాక్సీలను, ప్రైవేట్ ట్రావెల్స్‌ను విచారించటానికి నేను రోడ్డు మీదకొచ్చాను. పదేళ్ళుగా బెంగుళూరులో పాతుకుపోయా కాబట్టి కన్నడ సంభాషణలపై నాకు మంచి పట్టే ఉంది. ట్రావెల్స్ వాళ్ళు 1500 అవుతుందని చెప్పారు. పైగా శ్రావణ బెళ్గోల హస్సన్ నుంచి బెంగళూరు వెళ్ళే మార్గంలో వస్తుందని, అక్కడ గోమటేశ్వరుని చూడ్డానికి ఎక్కవలసిన మెట్లు వందకుపైనే ఉన్నాయని చెప్పారు. మా తల్లిదండ్రులు అన్ని మెట్లెక్కలేరని లిస్ట్ లోంచి దాన్ని తీసేశాను. పాత బస్టాండు వెళ్ళి అక్కడున్న టాక్సీ డ్రైవర్లను కలిశాను. హీనపక్షం ఎనిమిదివందలిస్తే వస్తామన్నారు వాళ్ళు. అదే విషయం మా నాన్నగారికి ఫోన్లో చెబితే ' వృథా ఖర్చులెందుకు,అవే డబ్బులు హళేబీడు,బేలూరులో సైట్‌సీయింగ్‌కి ఖర్చుపెట్టోచ్చు.బస్సుల గురుంచి వాకబు చెయ్య'మని సూచించారు. బస్టాండులో ఆరాతీస్తే పొద్దున్నే ఆరున్నరకు హళేబీడుకు డైరెక్ట్ బస్సుందని చెప్పారు. ఆఖరికి అదే ఖరారయ్యింది. పొద్దున్నే స్నానం హళేబీడు బస్సెక్కేశాం. హస్సన్ నుంచి హళేబీడుకి 39 కిలోమీటర్ల దూరముంది. సమృద్ధమైన జలకళతో,పాడిపంటలతో,అరటి,కొబ్బరి తోటలతో అలరారే స్వచ్ఛమైన కన్నడ పల్లెసీమల్ని చూసి ముచ్చటపడుతూ గంటసేపటికి హళేబీడు చేరుకున్నాం.

హళేబీడు

హళేబీడు పల్లెటూరు. ఊరి మొదట్లో పెద్ద చెరువు. దాన్ని దాటుకొని లోనికివెళ్తే మూడురోడ్ల కూడలి మధ్య ఠీవీగా దర్శనమిస్తూ హొయశాల వృత్తం, అందులో సింహంతో పోరాడుతున్న శాళుడి ప్రతిమ(హొయశాల రాజచిహ్నం)కనువిందు

 


చేస్తాయి.అది ఈ మధ్యే నిర్మించినదైనా ఆ ప్రదేశానికున్న చారిత్రక ప్రాముఖ్యతను రొమ్ము విరుచుకొని చాటి చెప్పేలా ఉంది.దానికి ప్రక్కనే 890 ఏళ్ళనాటి హొయశాళేశ్వరుడు,శాంతలేశ్వరుల ఆలయాలున్నాయి. బస్టాండులో కాకాహోటల్లో టిఫన్ పూర్తిచేసి ఆలయసందర్శనకు ఉత్సాహంగా బయలుదేరాం.

హళేబీడు అసలు పేరు ద్వారసముద్రం. క్రీ.శ.12వ శతాబ్దంలో హొయశాలుల రాజధానిగా ఈ ప్రాంతం ఒక వెలుగు వెలిగింది. హొయశాలులు పశ్చిమ కనుమలలోని కొండజాతి వాళ్ళు. ప్రాథమికంగా జైనమతారాధకులైన వీరు తర్వాత హిందువులుగా మారిపోయి, అవసానదశలో ఉన్న ఆనాటి రాజవంశాల(పశ్చిమ గాంగేయులు, రాష్ట్రకూటులు) పరిస్థితులను ఆసరా చేసుకొని క్రమక్రమగా పట్టు సాధిస్తూ తమ సామ్రాజ్యాన్ని విస్తృతం చేశారు. వారిలో ముఖ్యుడు విష్ణువర్థన మహారాజు. ఆయన ఆనతి ప్రకారమే రెండు శివాలయాలను నిర్మించారు. ఒకటి హొయశాళేశ్వరుడికి, ఇంకొకటి కేదారేశ్వరుడికి. హొయశాలేశ్వరాలయాన్ని క్రీ.శ 1121లో దండనాయకుడైన కేతుమల్లుని పర్యవేక్షణలో ప్రారంభిస్తే, కేదారేశ్వరాలయాన్ని మహారాణి శాంతలాదేవి పేరుమీదుగా క్రి.శ 1219లో ప్రారంభించారు. శాంతలాదేవి అభీష్టం మేరకు నిర్మింపబడిన గుడి కాబట్టి కేదారేశ్వరునికే శాంతలేశ్వరుడని మరో పేరు. నిర్మాణానికి 105 ఏళ్ళు పట్టింది.


ఆలయ నిర్మాణ శైలి అబ్బురపరుస్తుంది.నక్షత్రాకారంలో వెలసిన ఎత్తైన వేదికపై రెండు ఆలయాలనూ నిర్మించారు.ఆలయాంతర్భాగంలో పైకప్పుపై అద్భుతమైన శిల్పాలు చేక్కారు.గర్భగుడి ద్వారమైతే శిల్పకళకు పరాకాష్టగా నిలుస్తుంది. క్రిందినుంచి 




పైవరకూ మొత్తం శిల్పాలలో అలంకరించేశారు. ద్వారపాలురైన నంది,భృంగి విగ్రహాలు,మానవ కపాళాలతో నిండిన వారి కిరీటాలు చూసి నోళ్ళువెళ్ళబెట్టకతప్పదు. కపాలం ఎంత డొల్లగా ఉంటుందో నంది,భృంగి కిరీటాలలోని కపాలాలు కూడా అంతే డొల్లగా ఉంటాయి. కపాలంలో ఒక రంధ్రం నుంచి మరో రంధ్రానికి చిన్న పుల్లను దూర్చి తియ్యవచ్చు. అలాగే విగ్రహాలు ధరించిన నగల మధ్య కూడా చేతి వ్రేళ్ళు దూరేంత ఎడమ ఉంది. శాంతలేశ్వరునికి అభిముఖంగా ఉన్న నందీశ్వరుడి ప్రతిమ 


 


ఆకట్టుకుంటుంది. భారతదేశం మొత్తం మీద ఇంత అందంగా రకరకాల అలంకరణలతో చెక్కబడిన మరో నంది విగ్రహం లేదంటే అతిశయోక్తి లేదు. హొయశాళేశ్వరునికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం కూడా బావుంది కానీ దానికి ఇన్ని అలంకరణలు లేవు.

బాహ్యగోడలపై ఎనిమిది వరుసల శిల్పశైలి ద్యోతకమవుతుంది. క్రింద నుంచి మొదటి వరుసలో ఏనుగులు, రెండో వరుసలో సింహాలు, మూడవ వరుసలో లతలు తీగెలు,నాల్గవ వరుసలో ఆశ్విక దళం, ఐదవ వరుసలో మళ్ళీ లతలు తీగెలు, ఆరవ 


 


వరుసలో రామాయణ మహాభారత ఇతివృత్తాలు, ఏడవ వరుసలో మకరం, ఎనిమిదవ వరుసలో హంసలు కనిపిస్తాయి. వాటిపైన వెలసిన శిల్పాల అందచందాలని చూసి ఆస్వాదించాల్సిందే కానీ మాటలలో వర్ణించడం సాధ్యం కాదు.ప్రతి శిల్పం సహజత్వం ఉట్టిపడుతూ,శిల్పాచార్యుని సృజనాత్మక ప్రతిభకు నిలువుటద్దం పడుతుంది. ఒక్కో శిల్పం గురుంచి వివరిస్తూ పొతే చిన్న పుస్తకమే అవుతుంది. నాకు చేతనైన రీతిలో కొన్ని శిల్పాలు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.

ఏనుగు ఉదరం చీల్చుకొని పరమశివుడు నృత్యం చేస్తున్న భంగిమ గజాసురవధ శిల్పంలో కనిపిస్తుంది.ఆనందంతో చిందులేస్తున్న నందిని, మృదంగం వాయిస్తున్న ప్రమదగణాలని పొట్టలోనే చూడవచ్చు. శంకరుని వాడైన గోళ్ళు ఎనుగు మృతకళేబరాన్ని చీల్చుకొని వెలుపలికి వచ్చినట్టు మలిచారు.త్రివిక్రమావతారమైన వామనావతార ఘట్టంలో ఒక పాదాన్ని బ్రహ్మదేవుడు కడుగుతున్నట్లు, ఆ నీరే నదిగా మారి జాలువారినట్లు,అందులో చేపలు ఇతర జలచరాలు

 


ఈదులాడుతున్నట్టు, గరుడుడు భక్తిప్రపత్తులతో మ్రొక్కుతున్నట్లు, దేవతా స్త్రీ వింజామరలు వీస్తునట్లు మలిచారు. దశకంఠుడైన రావణుడు కైలాసాన్ని ఎత్తే శిల్పంలో, శిఖరాగ్రభాగాన పార్వతీసమేతుడై కూర్చున్న పరమేశ్వరున్ని మలిచారు. భక్తుని బలదర్పానికి ఆగ్రహించిన నిరంజనుడు తన కాలిబొటనవ్రేలితో పర్వతాన్ని తొక్కిపట్టగా, జీవనాడులన్నీ కదిలిపోయి రావణుడు కనుగుడ్లు తేలవేసిన దృశ్యాన్ని శిల్పం ప్రతిబింబిస్తుంది. ఈ శిల్పానికి చేరో వైపు బ్రహ్మవిష్ణువులను చెక్కారు.

సాధారణంగా త్రిమూర్తుల చిత్రాలలో మహావిష్ణువు మధ్యలో ఉంటే ఆయనకు చెరోవైపు బ్రహ్మరుద్రులుంటారు.కానీ ఇది శివాలయం కాబట్టి శివున్ని కేంద్రస్థానంలో ఉంచి,విష్ణువుకి స్థానచలనం కలిగించారు.

హిరణ్యకశిపుని వధ శిల్పంలో ఆగ్రహోదగ్రుడైన స్వామివారు రాక్షసి మూకలో ఒకడి తల చర్మం వలిచి పైకి లేపినట్లు చూపారు. వరహావతారంలో ఒక వైపు హిరణ్యాక్షుని తొక్కి పట్టి మరోవైపు ఆయుధాలతో రాక్షసగణాన్ని చీల్చిచెండాడుతున్న దృశ్యం 


 


కనిపిస్తుంది. గోవర్ధన గిరిధారి శిల్పంలో పర్వతంలో వేటగాన్ని, కోతిని ఇతర జంతువులను, వృక్షాలను చిత్రించి వాటికి జీవకళ తీసుకొచ్చారు. రోదసీ వీక్షణానికి టెలిస్కోపుని, త్రాగడానికి స్ట్రాని పాశ్చ్యాత్యుల కంటే మనమే ముందుగా ఉపయోగించామని చెప్పే శిల్పం,ఆంగ్లేయుల తలకట్టును, వస్త్రధారణను పోలిన శిల్పం


 

కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. టెలిస్కొపును కనుగొన్నది, ఆంగ్లేయులు వ్యాపారనిమిత్తం మనదేశానికి వచ్చినది 17వ శతాబ్దంలో. త్రాగడానికి వ్రాడే స్ట్రాను 19వ శతాబ్దంలో కనుగొన్నారు. ఈ విశేషాలన్నీ అంతకుముందే ఎప్పుడో పన్నెండు పదమూడో శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయాల్లో చూచాయగా బయటపడటం అప్పటికే మనదేశీయులు సాధించిన అపూర్వమైన అభివృద్ధికి సమ్మున్నత తార్కాణంగా భాసిస్తుంది . షరా మాములుగా అద్భుత శిల్పసంపదకు ఆలవాలమైన ఈ ఆలయాలను 1311లో మాలిక్ కాఫర్ ఒకసారి, 1326లో మహమ్మద్‌బిన్ తుగ్లక్ ఒకసారి ధ్వంసం చేసి సంపదనంతా మూటలు గట్టి అనేకసార్లు ఒంటెలపై మోసుకొనివెళ్ళారు. మహమ్మదీయుల దాడిలో ధ్వంసమై ప్రాభవం కోల్పోయిన ఊరు కాబట్టి హళేబీడు(పాత నగరం)అన్న పేరు స్థిరపడింది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యాధీశులు వీటి సంరక్షణభారం వహించారు. మొత్తం 35000 శిల్పాలకు పైగా శిల్పాలు ఈ ఆలయాల్లో ఉన్నాయని ఒక అంచనా. కొన్నింటిని ఆంగ్లేయులు తరలించుకొని పోయి లండన్‌లో భధ్రపరిచారని చెబుతారు.

ఆలయం వెలుపల పెద్ద సాక్షి గణపతి విగ్రహం ఉంది.దానికి ఎదురుగా హొయసల రాజలాంఛనం కనిపిస్తుంది.పూర్వం ఈ ద్వారం గుండానే మాహారాజ ప్రభృతులు పరతెంచి వచ్చి మొదట సాక్షి గణపతిని అర్చించి ఆ తర్వాత ఆలయ ప్రవేశం చేసేవారట. హొయసల రాజ చిహ్నం వెనుక ఓ కథ ఉంది. పూర్వం శాళుడు గురుకులంలో విద్యనభ్యసిస్తున్న రోజుల్లో అక్కడో సింహం జొరబడి భయోత్పాతం




 సృష్టించిందట. తక్కిన శిష్యులంతా భీతావహులై పరుగులుపెడితే, శాళుడు ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఒంటరిగానే సింహంతో కలియబడ్డాడట. శిష్యుడి ధైర్యసాహసాలకు ముగ్ధుడైన జైన గురువు సుదత్తుడు ' హొయ్ శాళా హొయ్ శాళా' అని అతన్ని ఉత్తేజపరిచారట.ప్రాచీన కన్నడ భాషలో' హొయ్ ' అంటే కొట్టు అని అర్థం. ఆ శాళుడు స్థాపించిన సామ్రాజ్యం కాబట్టి ఆ సంఘటనే రాజచిహ్నమయ్యింది.

ప్రధానమైన ఈ ఆలయాలు సందర్శించాక ప్రక్కనే ఉన్న జైనదేవాలయాలకు వెళ్ళాం. పార్శ్వనాథ స్వామి(జైనుల 23వ తీర్థంకరుడు) దేవాలయంలో నల్లశిలతో చెక్కబడిన పెద్ద విగ్రహం ఉంది. ఆ మూర్తి తలపై పడగలు విప్పిన ఏడుతలల సర్పాన్ని చెక్కారు. అయితే ఆలయమంతా గబ్బిలాల వాసనే. మందిరం ఎదురుగా ఉన్న రాతిస్తంభాల మండపం బావుంది. జైన దేవాలయాలకు కొద్దిగా ప్రక్కనే రంగనాథస్వామి ఆలయం కూడా ఉంది.

హళేబీడు నుంచి బేలూరుకు 17మైళ్ళ దూరం. ప్రతి అరగంటకు బస్సులున్నాయి. మేం వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది. అప్పటికే సమయం పదకొండయ్యి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూండటంతో, ఇంకో అరగంట వేచి చూసే ఓపిక లేక ప్రవేట్ బస్సులో బేలూరు బయలుదేరాం.

బేలూరు



యగచి నదీతీరంలో ఉంది బేలూరు పట్టణం. దీని పూర్వనామం వేలాపురి.హళేబీడు ధ్వంసమయ్యాక హొయసలులు దీనిని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన గావించారు. ఇక్కడున్న ఏకైక దర్శనీయ స్థలం చెన్నకేశవాలయం. దీని నిర్మాణానికి నాంది పలికింది కూడా విష్ణువర్థనుడే. చోళులపై తన ఘనవిజయానికి గుర్తుగా ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించాడు. హళేబీడులోని శివాలయాల కంటే ఈ ఆలయం చాలా పెద్దది. క్రీ.శ.1116లో శంఖుస్థాపన జరుపుకున్న ఈ ఆలయాన్ని మూడు



తరాలవాళ్ళు 103 ఏళ్ళు కష్టపడి నిర్మించారు. ఇక్కడి మూర్తి, మోహినీ అవతారంలో ఉన్న చెన్నకేశవస్వామి(చెన్న అంటే కన్నడలో అందమైన అని అర్థం). ఈ స్వామికే విజయనారాయణుడని, సౌమ్యనారయణుడని మరో పేర్లు. హొయసాలులు నిర్మించిన అనేక దేవాలయాల్లో నేటికీ ప్రతి ఉదయం,సాయంత్రం క్రమంతప్పకుండా ధూపదీప నైవేద్యాలందుకొంటున్న ఏకైక దేవాలయం ఇదొక్కటే. మోహినీ అవతారంలో మహావిష్ణువు భస్మాసురున్ని అంతమొందించింది ఇక్కడే అని భక్తుల విశ్వాసం.

ఆలయం వెలుపల ఉన్న 42 అడుగుల ఏకరాతి కార్తీకదీపోత్సవ స్తంభాన్ని విజయనగర పాలకులు ప్రతిష్ఠించారు.ఎటువంటి పునాదులు లేకుండా ఒక రాతి 





వేదికపై నిలబెట్టబడిన ఈ స్తంభం నేటికీ పడిపోకుండా నిలబడి సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది.ఆలయ ఆవరణలో చెన్నకేశవునికి అభిముఖంగా, ధ్వజస్తంభం వద్ద వెలసిన గరుడప్రతిమను ఇటీవలే ప్రతిష్ఠించారు.

ఆలయ ప్రాంగణంలో నాలుగు గుడులున్నాయి.మొదటిది ముఖ్యమైంది అయిన చెన్నకేశవస్వామి గర్భగుడి మధ్యలో ఉంటే,దానికి ఒకవైపు కప్పే చెన్నిగరాయని ఆలయం,మరోవైపు సౌమ్యనాయకి(లక్ష్మీదేవి),రంగనాయకి(భూదేవి) ఆలయాలున్నాయి .

ఆలయ నిర్మాణశైలి చాలావరకు హళేబీడులోని శివాలయాలను పోలి ఉంటుంది. ఇక్కడ కూడా నక్షత్రాకారపు వేదిక మెట్లెక్కి ప్రదక్షిణపూర్వకంగా తిరిగి ఆలయంలోకి ప్రవేశించాలి. బాహ్యగోడలపై దర్శనమిచ్చిన శిల్పాలు హళేబేడులోని కొన్ని శిల్పాలను గుర్తుచేస్తాయి. అయితే హళిబేడుకి బేలూరుకి ఉన్న ముఖ్య వ్యత్యాసం ఏమిటంటే హళేబేడు దేవాలాయాలకు బాహ్యసౌందర్యం ఎక్కువ. బేలూరు ఆలయానికి బాహ్యసౌందర్యం, అంతస్సౌందర్యం రెండూ ఉన్నాయి.

చెన్నకేశవాలయంలో ఉన్న 48 స్తంభాలు వేటికవే వైవిధ్యంగా ఉంటాయి.ఇందులో ఐదు స్తంభాలు ముఖ్యమైనవి.వాటిలో నరసింహ స్తంభం వినుతికెక్కింది.ఒకప్పుడు ఈ స్తంభం తనంతట తానే తిరిగేదట. ఇప్పుడు నిలిచిపోయింది. హొయసాలుల 




ఇష్టదైవమైన నరసింహస్వామి ప్రతిమను,ఇతర చిన్న శిల్పాలను ఈ స్తంభంలో మలిచారు. ఒక చోట ఉద్దేశపూర్వకంగానే ఖాళీని ఉంచి ఏ శిల్పి అయినా ఈ స్తంభం విశిష్టత చెదరకుండా ఆ స్థలంలో సరిపోయే శిల్పం చెక్కవచ్చునని సవాలు విసిరారు.అది ఇప్పటికీ ఖాళీగానే ఉంది. మిగిలిన నాలుగు స్తంభాలు గర్భాలయానికి ఎదురుగా ఉన్న నవరంగ మండపం దగ్గరున్నాయి. ఒక్కో స్తంభంపైన ఒక్కో సాలభంజికను చెక్కారు. ఈ సాలభంజికలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. ఈ శిల్పాలకన్నిటికీ జగదేకసుందరి మహారాణి శాంతలాదేవి అందచందాలే ప్రేరణ అని చెబుతారు. శాంతలాదేవికి భరతనాట్యంలో మంచి ఆభినివేశం ఉంది. పురజనుల కోరిక మేరకు దేవాలయాల్లో మూలవిరాట్టుకు ఎదురుగా నృత్యం చేసి అందరినీ మెప్పించి నాట్య సరస్వతి,నృత్యశారద లాంటి అనేక బిరుదుల్ని పొందింది. నవరంగ మండపంలోనున్న ఒక స్తంభంపై నృత్యం చేస్తున్న ఆమె భంగిమ మనసు దోచుకొంటుంది. ఆ ప్రతిమ తలపై వ్రేలాడుతున్న పాపటిబిళ్ళ అల్లాడుతున్నట్లే ఉంటుంది.మొత్తం నలభైరెండు సాలభంజికలున్నాయి. వాటిలో నాలుగు నవరంగ మండపంలో ఉంటే తక్కినవి బాహ్యకుడ్యాలపై వెలిశాయి.

నవరంగ మండపం మధ్యలో పైకప్పుపై అద్భుతమైన శిల్పకళ ఆవిష్కృతమవుతుంది.వేలాడే స్తంభాన్ని పైకప్పులో వీక్షించవచ్చు .

బాహ్యగోడలపై చెక్కిన సాలభంజికలలో జగత్ప్రసిద్దమైనది దర్పణసుందరి ప్రతిమ. త్రిభంగి నృత్యకారిణి ప్రతిమలోని భంగిమను ఇప్పటివరకూ ఏ నృత్యకారిణి అనుసరించలేకపోయిందని ప్రతీతి. అలాగే మహావిష్ణువు దశావతారాలు, ఇతర రూపాలు, రామాయణ మహాభారత గాథలలోని సన్నివేశాలు సునిశిత పరిశీలనాశక్తితో ప్రాణంపోసుకొని నయనమనోహరంగా దర్శనమిస్తాయి. 




ఇక్కడున్న కప్పే చెన్నిగరాయ దేవాలయం గురించి కూడా చెప్పుకోవాలి.ఈ ఆలయం శాంతలాదేవి కోరిక మేరకు అమరశిల్పి జక్కన నిర్మించినది.కొడుకు పుట్టక ముందే ఆలయ నిర్మాణం కోసం ఊరు విడిచి వస్తాడు జక్కన్న.పెరిగి పెద్దవాడైన కొడుకు డంకణ్ణ, తండ్రిని వెదుక్కుంటూ బేలూరు వచ్చి అక్కడ మూలవిరాట్టు విగ్రహాన్ని చెక్కుతున్న జక్కన్నను చూస్తాడు.తండ్రి వాడుతున్న శిల దోషభూయిష్టమైనది చెబుతాడు.ఆవాక్కై ఆగ్రహానికి గురైన జక్కన్న, నింద రుజువు చేసిన పక్షంలో తన కుడిచేతిని నరుక్కొంటానని శపథం చేస్తాడు.డంకణ్ణ గంధపు ముద్దను తీసుకొని విగ్రహమంతా పులుముతాడు.శరీరమంతా పూసిన పూత ఒక్క నాభి దగ్గరే తడిగా మిగిలిపోతుంది.అక్కడ ఉలితో మోదగానే, పగిలి అందులోంచి ఇసుక,నీరు,ఒక కప్ప గెంతుకుంటూ బయటపడతాయి.జక్కనాచారి మాటమీద నిలబడి తన చేతిని నరుక్కొంటాడు.అప్పుడే అతనికి డంకణ్ణ తన కన్నకొడుకని తెలుస్తుంది.మాహావిష్ణువు ఆదేశాల మేరకు అతని స్వగ్రామంలో ఒక కేశవాలయం నిర్మించి పోయిన తన కుడిచేతిని మళ్ళీ పొందుతాడు.



దురదృష్టవశాత్తూ మేమా ఆలయాన్ని దర్శించలేదు. మేం కుదుర్చుకున్న గైడ్ మాకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మాకా అవకాశం లేకుండా చేశాడు. కప్పే చెన్నిగరాయని దేవలయాన్ని ముందుగా సాంపిల్‌గా నిర్మించి మధ్యలోనే ఆపేసి చెన్నకేశవాలయాన్ని నిర్మించారని మాకతను చెప్పాడు. దానికి తగ్గట్టుగానే బాహ్యకుడ్యాలపై ఎటువంటి శిల్పాలు లేక ఖాళీగా కనిపించటంతో మేమటువైపు వెళ్ళలేదు.ఫోటోలు తీసేపనిలో గుడికి అనేక ప్రదక్షిణలు చేసి అప్పటికే అలసిపోయాం. దానికితోడు మధ్యాహ్నం ఒంటిగంట కావడంతో, రాత్రికి బెంగళూరు చేరుకోవాలన్న విషయం గుర్తొచ్చి అప్పటికి స్వస్తి చెప్పాం. అయితే మా అమ్మగారు మాత్రం వాటిని కవర్‌చేశారు.

బేలూరులో మంచి వసతి సౌకర్యాలున్నాయి. మధ్యాహ్నం బేలూరులోనే భోజనం చేసి హస్సన్ బస్సెక్కాం. ఈ బస్సు మళ్ళీ హళేబీడు మీదుగా వెళ్ళి గంటన్నరపాటూ మా సమయాన్ని వృథా చెయ్యకుండా,వేరొక మార్గంలో ప్రయాణించి అరగంటలోనే గమ్యస్థానం చేరుకుంది. అక్కడ దిగి కాస్త ఫ్రెషపయ్యి రెండున్నరకంతా బెంగుళూరు బస్సెక్కేశాం.

అక్కడితో మా యాత్ర పరిసమాప్తమయ్యింది .


1 comment

Post a Comment