హుష్‌కాకి !మధ్య స్విస్‌బ్యాంక్ కళ్ళుబైర్లు గమ్మి, నోట మాటపడిపోయే వాస్తవాలను ప్రపంచం ముందుంచింది.వారు ప్రకటించిన వివరాల ప్రకారం , భారతీయులు దాచుకున్న సొమ్ము  ప్రపంచంలోని ఇతర జాతీయులు దాచుకున్న మొత్తం కంటే ఎక్కువ.1,456 బిలియన్ ‌డాలర్లతో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే, ఎక్కడో సుదూరంగా 470 బిలియన్‌ డాలర్లతో రష్యా రెండవ స్థానంలోనూ, 390 బిలియన్‌ డాలర్లతో యూ.కె మూడవ స్థానంలోనూ, 100 బిలియన్ ‌డాలర్లతో ఉక్రెయిన్ నాల్గవ స్థానంలోనూ, 96 బిలియన్ ‌డాలర్లతో చైనా ఐదవ స్థానంలోనూ కొనసాగుతున్నాయి.1,456 బిలియన్ ‌డాలర్లు అంటే దాదాపు 70 లక్షల కోట్ల రూపాయిలు.ఇది మనదేశానికున్న విదేశీ రుణాల కంటే 13% శాతం ఎక్కువ.ఇదంతా  కేవలం స్విస్‌బ్యాంకుల్లో దాచిన సొమ్ము మాత్రమే . రహస్య బ్యాంకింగ్ సదుపాయాన్ని ఆస్ట్రియా, లిచ్‌టెన్‌స్టిన్, లెబనాన్, లక్సెంబర్గ్, సింగపూర్, పనామా  లాంటి  దేశాలు,కేమెన్ దీవులు కూడా అందిస్తున్నాయి.ఆ దేశాల్లో ఎంత నల్లధనం మూలుగుతోందో ఆ పరమేశ్వరుడికే ఎరుక. ఇంత మొత్తం దేశం నుంచి తరలిపోతున్నా అరవైనాలుగేళ్ళుగా అంధత్వాన్ని నటించిన ప్రభుత్వాలని చూస్తే మన మీద మనకే జాలి కలగక మానదు. నేతలంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ విషయాన్ని, స్విస్ బ్యాంక్ స్వయంగా వెల్లడించింది కాబట్టి  సర్వత్రా పెద్ద  దుమారం రేగి రాజకీయపార్టీలలో కదలిక మొదలైంది కానీ, లేకపోతే దాన్నిపట్టించుకున్న నాథుడెవడు ?

ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతూనే ఉంది.ఒకప్పుడు రాజకీయ నాయకులు సున్నిత మనస్కులై ఉండేవారు. ఎక్కడో జరిగిన రైలు ప్రమాదానికి జవాబుదారీ వహించి రాజీనామా చేసిన లాల్‌ బహదూర్ ‌శాస్త్రి తరం అంతరించిపోయి, తోలు మందం నాయకులైన మాయావతులు, రాజాలు, యడ్యూరప్పల శకం నడుస్తున్న రోజులివి. విలువలున్న రాజకీయ నాయకుడు నేడు వింతపశువుతో సమానం. నల్లధనాన్ని వెలికితీసే సమస్యపై సుప్రసిద్ధ లాయరైన రాంజెత్మలానీ  సుప్రీమ్‌కోర్టులో పిటిషన్‌వేసి, కోర్టు ద్వారా వివరణ కోరితే దాన్ని ' టాక్సు రికవరీ సమస్య ' గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఘనత వహించిన మన కేంద్ర ప్రభుత్వం.' ట్రిలియన్ డాలర్లంటే ఎన్ని సున్నాలు ? దేశాన్ని నిలువుదోపిడి చేసి ఇంత భారీ మొత్తాన్ని కూడబెట్టారు.అయినా కేంద్ర ప్రభుత్వం దీన్ని కేవలం టాక్సు రికవరీ సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తొంది.ఇది ఆందోళన కలిగించే అంశం.అన్ని విషయాలు పక్కన బెట్టి, వారి పేర్లు వెల్లడించండి' అని  జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, జస్టిస్ నిజ్జర్‌లతో కూడిన కోర్టుబెంచ్ గట్టిగా అక్షింతలు వేస్తే మన నాయకమాన్యులకు దిమ్మతిరిగి పొలమారింది.
ఆకాశాన్నంటిన ధరలు, వరుస స్కాములతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేంద్రప్రభుత్వానికి ఇదొక విషమ సమస్యగా పరిణమించింది. పరువు కాపాడుకునే చర్యలు ప్రారంభించి నల్లధానాన్ని స్వదేశానికి తీసుకురావటానికి అపసోపాలు పడుతోంది. ముదురుతున్న ఈ వివాదం నేపథ్యంలో అసలు

 •  స్విస్‌బ్యాంకులు ఎలా పనిచేస్తాయి ?
 • హవాలా అంటే ఏంటి?
 •  నల్లధనాన్ని వెలికితియ్యటానికి మనదేశానికున్న ఇబ్బందులేంటి? తీసుకున్న చర్యలేంటి?
 అని అనుమానాలు కొందరికైనా రావటం సహజం. నాకు తెలిసినంతలో విశిదీకరిస్తాను.

స్విస్ బ్యాంకు కథాకమామీషు

స్విస్ బ్యాంక్ లావాదేవీలు చాలా రహస్యంగా జరుగుతాయి.1934లో వచ్చిన స్విస్‌బ్యాంక్ చట్టం ప్రకారం వినియోగదారుల వివరాలను బ్యాంకులన్నీ గోప్యంగా ఉంచాలి.అకౌంట్ వివరాలలో కేవలం అకౌంట్ నంబర్‌మాత్రమే ఉంటుంది. ఖాతాదారుని పేరుండదు. అది రహస్యంగా ఉంచుతారు. ప్రతి ఖాతాదారుకీ ఒక కోడ్‌నంబర్ ఉంటుంది.ఆ నంబర్‌తో తనను తాను బ్యాంకుకు పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. ఖాతాదారు మరణిస్తే ఆ సొమ్ము మొత్తం బ్యాంక్‌కే చెందుతుంది .పన్నులు కట్టకపోవటానికి, పన్నుల చెల్లింపులో నేరాలకు పాల్పడడానికి మధ్య వ్యత్యాసం ఉంది. పన్నులు ఎగవెయ్యటం స్విట్జర్‌ల్యాండ్‌లో పెద్ద నేరం కాదు. ఖాతాదారుడు  క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు రుజువు చేసే ఆధారాలు, అతనిపై స్విస్ జడ్జి జారీ చేసిన సమ్మన్లు ఉంటే తప్ప అతని వివరాలు ఎవరికీ  లభ్యం కావు. స్థానిక పన్నుల శాఖాధికారులు , స్విస్ ఉన్నతాధికారులు దీనికి అతీతులు కారు . విదేశీయులు స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకుంటే నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి. ముందుగా ఆ దేశానికీ  స్విట్జర్‌ల్యాండ్‌కు మధ్య సమాచారన్ని పంచుకునే విషయమై ఒక ఒప్పందం ఉండాలి. ఆ ఒప్పందాన్ని రెండు దేశాలలోని వివిధ ప్రభుత్వ శాఖాధికారులు అమోదించాలి, పార్లమెంట్లలో నెగ్గాలి. ఇన్ని జరిగిన తార్వాత  ఒప్పందం అమల్లోకి వస్తుంది.ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవు. ఇన్ని వెసులుబాట్లుండబట్టే స్విట్జర్‌ల్యాండ్ నల్లధనానికి చిరునామాగా మారింది.

రహస్య బ్యాంకింగ్ విధానంలోని లోపాల వల్ల ఎన్నో కంపెనీలు కూలిపోయినా, వ్యవస్థలు నాశనమైనా, విమర్శలు వచ్చినా,ఆందోళనలు చెలరేగినా  తమ ధోరణి మార్చుకోని  ఈ దేశాలు, 2001 సెప్టంబర్ 11 తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.తన ప్రథమ శత్రువైన ఒసామా బిన్‌లాడెన్ ఆర్థిక లావాదేవీలన్నీ స్విస్ బ్యాంకుల ద్వారానే జరిగాయన్న విషయం గ్రహించిన అమెరికా తోక తొక్కిన పామే అయ్యింది. తన శక్తియుక్తుల్ని ఉపయోగించి  బ్యాంకింగ్ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు తెచ్చింది. UBS బ్యాంక్‌కు భారీ పెనాల్టీ విధించింది. అవుటాఫ్ కోర్టు సెటిల్‌మెంట్  ద్వారా పన్నులు ఎగవేసిన ఖాతాదారుల వివరాలు పొందింది. స్విస్  డేటాబేస్‌లో సమాచారాన్నిరాబట్టగలిగే  ప్రొగ్రామ్‌ని రూపకల్పన చేసింది. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు కూడా ఫిర్యాదులు చేయ్యటంతో, స్విస్ తలొగ్గి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునే విషయంలో సానుకూలంగా  స్పందిస్తోంది.

నిజానికి రహస్య బ్యాంకింగ్ విధానం కొత్తగా పుట్టినది కాదు. కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నదే. అందరికీ తెలిసినదే. అమెరికా, గ్రేట్ బ్రిటన్ లాంటి సంపన్న దేశాలు గట్టిగా తలచుకుంటే ఈ విషవృక్షాన్ని కూకటి వ్రేళ్ళతో పెకలించవచ్చు. అయినా కిక్కురుమనకుండా ఉన్నాయి. నిరుపేద దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోంచి నిధుల్ని కొల్లగొట్టి, ధనిక దేశాలకు మళ్ళించే  ఈ వికృత విధానాన్ని తెలిసి తెలిసి ఉపేక్షించాయి .కాకుల్ని కొట్టి గ్రద్దలకు వెయ్యటమంటే ఇదే.  చిలువలు పలువలు వేసిన అదే ధనం టెర్రరిజం రూపంలో తమ దాకా వచ్చేసరికి ఇప్పుడు నొప్పి తెలిసి వచ్చిందిహవాలా


హవాలా అన్న పదం అరబిక్ భాష నుండి ఉద్భవించింది.ఈ పదానికి చిల్లర, మార్పు, బిల్, ప్రామిసరీ నోటు, నమ్మకం అని అనేక అర్థాలు చెలామణిలో ఉన్నాయి. దీనికే హుండీ ఇని మరొక పేరు కూడా ఉంది. హవాలా రెండు రకాలు చట్టబద్ధమైనవి, చట్టవిరుద్ధమైనవి.లావాదేవీలన్నీ నమ్మకం ప్రధానంగా జరుగుతాయి. రసీదులు ,రికార్డులు లాంటి పేపర్‌వర్క్ ఉండదు. కాబట్టి దర్యాప్తు కూడా కష్టమే.

ఒక ఉదాహరణతో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అష్రఫ్ న్యూయార్క్‌ మహానగరంలో ఒక క్యాబ్ డ్రైవర్. తను సంపాదించిన మొత్తంలోంచి 5000 డాలర్లు భారతదేశంలో ఉన్న తన నిరుపేద తండ్రికి అత్యవసరంగా పంపించాలనుకున్నాడు. బ్యాంకులను సంప్రదిస్తే బోలెడు నిబంధనలు చెప్పారు. వారిచ్చే ఎక్ఛేంజ్ రేట్లు కుడా తక్కువగా ఉన్నాయి. డబ్బులు చేరటానికి వారం రోజుల పైనే పట్టొచ్చు.అతను ఇతర మార్గాలు అన్వేషించాడు.   హుస్సేన్ బాలీవుడ్ ఆడియో వీడియో సీడీలు దిగుమతి చేసుకుంటూ,ఎలక్ట్రానిక్ వస్తువులు ఎగుమతి చేస్తూంటాడు. ప్రీ-పెయిడ్‌ కాలింగ్‌కార్డులు, తక్కువ ధరకే ఎయిర్‌టికెట్లు, కరెన్సీ కన్వర్షన్ అతని సైడ్‌బిజినెస్‌. ఆకర్షణీయమైన అతని   వ్యాపరప్రకటన అష్రాఫ్ కంటబడింది. అతన్ని కలిశాడు. బ్యాంకులు ఆఫర్ చేసిన ఎక్స్‌ఛేంజ్ రేట్ల కంటే మెరుగైన రేట్లు ఇస్తానని,ఒకటి- రెండు రోజుల్లోగా పైకాన్ని భారతదేశం చేరుస్తానని, అందుకు ప్రతిగా డాలరుకి ఒక రుపాయి తీసుకుంటానని చెబుతాడు హుస్సేన్. అష్రఫ్ సంతోషంగా ఒప్పుకున్నాడు . సొమ్ము పుచ్చుకున్న హుస్సేన్ భారతదేశంలో ఉన్న రిజ్వాన్‌కు ఫోన్ చేసి 'ఇంత' మొత్తాన్ని ఫలానా చిరునామాలో ఉంటున్న అష్రఫ్ తండ్రికి అందజెయ్యమని చెబుతాడు. గడువులోగా సొమ్మును చేరవేస్తాడు రిజ్వాన్.నగదు బదిలీ పూర్తవుతుంది.ఇక్కడ హుస్సేన్‌, రిజ్వాన్ బంధువులు కావచ్చు లేదా బిజినెస్‌ పార్ట్‌నర్స్ కావచ్చు. ఒకవేళ రిజ్వాన్ హుస్సేన్ కి బాకీపడి ఉంటే ఆ మొత్తాన్ని ఇలా హవాలా కస్టమర్స్ ద్వారా తీర్చేస్తాడు. బిజినెస్‌ పార్ట్‌నర్స్ అయితే  ఇన్‌వాయిసుల్లో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. బ్యాంకులకున్న ఖర్చు హవాలాదారులకు లేకపోవటం వల్ల వారికి బాగా గిట్టుబాటవుతుంది. బ్యాంక్యులు ఇస్తానన్న మొత్తం కంటే ఇంకా ఎక్కువ మొత్తాన్ని తక్కువ ఖర్చుతో తండ్రికి పంపగలగటం ద్వారా అష్రఫ్ కూడా  లాభపడ్డాడు.నమ్మకం ప్రధానంగా సాగే వ్యాపారం కాబట్టి బ్యాంక్ లావాదేవీలలో లాగా ధనం మిస్ అయ్యే సమస్య లేదు. అష్రాఫ్ పంపిన డబ్బు చట్టబద్ధంగా సంపాదించినదే. కాబట్టి ఇది వైట్ హవలా. చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా సంపాదించిన ధనం హవాలా పద్ధతుల్లో విదేశాలకు తరలిపోతే అది బ్లాక్ హవాలా. భారత్, పాకిస్తాన్లలో రెండు రకాల పద్ధతులు చట్టవిరుద్ధం.

భారత ఉపఖండానికి సంబంధించినంత వరకు  హవాలా మార్కెటింగ్‌కి ముఖ్య స్థావరం దుబాయ్. సరళీకృతమైన ఆర్థిక విధానాల కారణంగా అక్కడ హవాలా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.ప్రైవేట్ విమానాల ద్వారా కూడా ఈ ధనం తరలిపోతోందంటే మీరు నమ్మకపోవచ్చు కానీ ఇది అక్షర సత్యం. భారీ మొత్తంలో పోగైన బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకోవడానికి ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు హవాలాదారులు. గ్యాంబ్లింగ్, అక్రమ ఆయుధాల రవాణా, డ్రగ్స్‌ సరఫరా, టెర్రరిజం, మనుషుల రవాణా లాంటి సామాజిక అవలక్షణాల కన్నిటికీ ఆయువుపట్టు ఈ నల్లధనమే.    

మనదేశానికున్న ఇబ్బందులు - తీసుకున్న చర్యలు

నల్లధనాన్ని నిరోధించటానికి మనదేశంలో చాలా చట్టాలే ఉన్నాయి( ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ సంరక్షణ మరియు స్మగ్లింగ్ నిరోధక చట్టం 1974, ఇంకమ్‌టాక్స్ చట్టం 1961, బినామీ లావాదేవీల నిరోధక చట్టం 1988, నార్కోటిక్ డ్రగ్స్ రవాణా నిరోధక చట్టం 1985, 1988).2002లో వచ్చిన మనీలాండరింగ్ చట్టం ప్రకారం నేరం నిరూపణ అయితే మూడేళ్ళ నుంచి పదేళ్ళ వరకు కఠిన కారాగారవాసం, ముఫ్ఫై లక్షల జరిమానా తప్పదు. అనేక ఒత్తిళ్ళకు తలొగ్గి 2005 వచ్చేసరికి అది కాస్తా ఐదు లక్షలయ్యింది.మన పాలకుల చిత్తశుద్ధికి ఇదొక తార్కాణం. 

1996లో భారత - స్విట్జర్‌ల్యాండ్‌ దేశాల మధ్య DTA (Double Tax Avoidance) ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలోని లొసుగుల కారణంగా భారత్‌కు
తీవ్ర ఆర్థికనష్టం వాటిల్లింది. నల్లధనాన్ని సమర్ధవంతంగా నియంత్రించటానికి  DTA ఒప్పందానికి మరిన్ని సవరణలు చేయ్యాలని ఆగస్ట్ 30 2010న జరిగిన సమావేశంలో ఇరుదేశాలు నిర్ణయించాయి. జనవరి 1 2012లో సవరణలతో కూడిన కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది. అప్పటి నుండి స్విస్‌ బ్యాంకుల్లో జరిగే అనుమానాస్పద లావాదేవీలపై సమాచారన్ని కోరే హక్కు భారత్‌కు  లభిస్తుంది.అంతకు మునుపు జరిగిన ఆర్థిక నేరాలు ఈ ఒప్పందం పరిధిలోకి రావు.వాటికి పాత షరతులే వర్తిస్తాయి.గుడ్డిలో మెల్ల చందాన,రహస్య సమాచారం అందిన వెంటనే సదరు వ్యక్తులని కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తే వివరాలు వెల్లడవుతాయని ప్రణబ్ ముఖర్జీ గారు సెలవిచ్చారు. ఆయనే ఉంటే మంగలి దేనికన్నట్లు, మన ప్రభుత్వాలకు అంతటి నిజాయితీ ఏడిస్తే ఈ దుస్థితి దేనికి ?ఈ లోగా నల్లకుబేరులు బ్లాక్‌మనీ మొత్తం విత్‌డ్రా చేసి ఇతరదేశాలకు తరలిస్తే మనదేశానికి మిగిలేది మట్టే.  

అంటే 70 లక్షల కోట్లు హుష్‌కాకేనన్నమాట. !
 

పాపం శమించుగాక !!
నిరాశ, నిర్వేదం నా దేశపు యువతను పూర్తిగా కమ్మేయముందే  చైతన్య పాశుపతం వారికి సిద్ధించుగాక !!
 

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో జైహింద్.
  5 comments

  Post a Comment

  సినిమాల్లో మా సీనియర్

  యన నాకు సీనియర్.మంచి ఒడ్డు పొడవు.చూడ్డానికి హీరోలా ఉంటాడు.కాలేజ్‌లో ఉన్నప్పుడే మోడలింగ్ చెయ్యాలని కలలు కనేవాడు.యాక్టర్ కాకపోయుంటే డాక్టర్ అయ్యేవాళ్ళమని తారలు చెప్పే కబుర్లు చెప్పాల్సిన అవసరం తనకి లేదు.ఎందుకంటే తను నిజంగా డాక్టరే .విదేశాల్లో ఎం.బి.బి.యస్ పూర్తి చేశాక హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో వైద్య వృత్తిని నిర్వహిస్తూ తన ప్రయత్నాలు కొనసాగించాడు. హాస్పిటల్‌కు వచ్చే సినీపరిశ్రమకు చెందిన వ్యక్తుల కళ్ళల్లో పడటంతో అతని పంటపండి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.మొదట్లో కొన్ని వేషాలు వేసినా జగపతిబాబు హీరోగా వచ్చిన సిద్ధం  అతనికి మంచి గుర్తింపునిచ్చింది.కమలహాసన్, వెంకటేష్, మోహన్‌లాల్ లాంటి ప్రముఖ నటులతో కలిసి పని చేసే అదృష్టం వరించింది. (ఈనాడు, ఈనాడు తమిళ్ వెర్షన్ ఉన్నైపోల్ ఒరువాన్ ). మంచి నటుడిగా మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు అక్కినేని నాగార్జున నటించిన గగనం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.  గగనం గురుంచి ప్రత్యేకంగా చెప్పటానికి ఒక కారణం ఉంది.అక్కినేని నాగార్జున తన అభిమాన కథానాయకుడు. చిన్నప్పుడు ఏ హీరో చిత్రాల కోసం కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూశాడో, క్యూలైన్లో నిలబడి ఎగబడి చూశాడో అదే హీరో పక్కన తనూ ప్రధాన పాత్రలో నటించే అవకాశం రావటం సామాన్యమైన విషయం కాదు. వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో వర్ణించే ఉదాహరణలకు ఏ మాత్రం తీసిపోని పరిణామక్రమం ఇది. ప్రతిభ,పట్టుదల ఉంటే ఆకాశమే హద్దనే విషయాన్ని భరత్‌రెడ్డి మళ్ళీ నిరూపించాడు.

  Hats off to him and wishing him all the best in his future endeavors


  ఎవర్రా బాబు ఈ బుక్‌ని కంపోజ్ చేసింది ?

  మా పాప నర్సరీ బుక్‌లో English Alphabets ‌కి ఇచ్చిన పదాలు ఇవి.  I  for INSPECTOR, INCH TAPE
  M for MICROPHONE, MOUSE
  U for UNDERWARE, UNCLE
  W for WAITER
  Y for YOUTH


  ఎవర్రా బాబు ఈ బుక్‌ని కంపోజ్ చేసింది ? Y for YOUTH అంటే ఏం వివరిస్తాం అంత చిన్న పిల్లలకి? ఇన్స్‌పెక్టర్, మౌస్, మైక్రోఫోన్, అండర్వేర్ ..ఇంత కంటే మంచి పదాలు దొరకలేదా  ఆ Alphabets కి ? అందరికీ అర్థమయ్యే ICE CREAM , INK BOTTLE, MANGO, MUG లాంటి పదాలుండగా వాటిని వదిలేసి  కఠిన పదాలతో పుస్తకాలను తయారు చేసి వాటిని పిల్లలపై రుద్దే ప్రచురణకర్తలను, పాఠశాల యాజమాన్యాలని ఏమనాలో అర్థం కావటం లేదు.


  7 comments

  Post a Comment