భగ్నప్రేమ

కౌముది.నెట్ తాజసంచిక (సెప్టంబరు 2011) లో కవితాకౌముది విభాగానికి వెళ్ళి నా కవిత 'భగ్నప్రేమ '( ఇక్కడ ) చదివి మీ అమూల్యమైన అబిప్రాయాలు తెలియజేయండి. కవితను ప్రచురించిన కౌముది యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.





చైత్రమాసపు కోయిలనై చివురించిన తలపులన్ని ఎలుగెత్తి పాడాను
వైశాఖ గాడ్పులలో వలపు చలివేంద్రమంటి నీ చిరునామా వెదికాను
జగతిలో శ్రేష్టమైనవన్నీ జ్యేష్ఠలో పదిలపరిచాను
ఆషాడ మేఘాల అనురాగ పరిష్వంగంలో
నీ అందెల నిక్వాణం విని నిదురమరిచాను
భారమైన హృదయం ఆవిరైన ఆర్ణవమైతే
కురిసిన శ్రావణ భాధ్రపద కుంభవృష్టి ధారలలో 
తడిసీ, వణికీ తనువంతా నీరైపోయాను
ఆశ్వయుజమంతా ఆశలపందిళ్ళు పరచి
ఆవిష్కృత శరద్వెన్నెలలో నీ మోము గాంచి
అవ్యక్తానుభూతుల సుడిలో అవశేషమునై నిలిచాను
కార్తీకమంతా కలతల కడగండ్లు రేగి
కాటుక శర్వరిలా కమ్ముకొని భయపెడితే
వెచ్చని నీ ఊసుల దీపాలు వెలిగించి ఉపశమనం పొందాను
నీ వియద్వేణియ నుండి విరివిగా రాలిన నీటిబొట్లు 
మార్గశీర్షపు తొలిసంధ్యలలో మంచుముత్యాలై మెరిసిపోతే
మత్తెక్కిన మధుపమునై తిరిగి మధురోహలు గ్రోలాను
పుష్యమాసపు ప్రవాసినై
ప్రేమంతా పోగు చేసి పుష్పమాలికలల్లి
భవిష్యత్ బహిర్ద్వారం వద్ద బంట్రోతునై నిలబడితే
తిరస్కరించి తూలనాడి తిమిరంలోకి నెట్టేశావు
మాఘమాసపు పెళ్ళిపందిరిపై మందస్మితయై అటు నువ్వు
మొదలు తెగిన వృక్షమునై మృత్యువాకిట ఇటు నేను
కఠిన కర్కశ పాషాణ నాతివై నువ్వు కాదు పొమ్మన్నా
కడతేరని ప్రేమతో కొత్త ఊపిరులూదుకుంటాను
నీ పెరటి పున్నమితోటలో
ఫల్గుణినై పరిమళిస్తాను










6 comments

September 1, 2011 at 3:14 PM

అభినందనలు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

శిరాకదంబం వెబ్ పత్రిక

Reply
September 1, 2011 at 3:14 PM

Beautiful, very beautiful. Very tender and heart touching. Loved it.

Reply
September 1, 2011 at 4:29 PM

అభినందనలు.. చాలా బావుందండీ మాసాలతో ముడిపడిన ప్రేమ కవిత.. మీరు వాడిన పదజాలం కొత్తగా అనిపించింది.

Reply

@SRRao గారు,
ధన్యవాదాలు.మీకు మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు.

@మానస గారు,
థాంక్యూ.

@మధురవాణి గారు,
చాలా సంతోషమండి.

Reply
September 29, 2011 at 9:15 AM

మీ కవిత కౌముదిలో చదివాను. చాలా బావుంది. ఈ నెలలోనే నా కవిత కూడా కౌముదిలో ప్రచురించారు.

Reply

జ్యోతిర్మయి గారు,ధన్యవాదాలు.అయితే నిరీక్షణ కవిత మీరు వ్రాసిందేనన్నమాట.మీకు కూడా శుభాకాంక్షలు

Reply
Post a Comment