నన్నయ Vs పాల్కురికి సోమనాథుడు

చరా పుణ్యమా అని తెలుగులో ఆదికవి నన్నయా లేక పాలకురికి సోమనాథుడా అనే వివాదం బయలుదేరింది కాబట్టి ఎవరు ఎలాంటివారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నన్నయ


నన్నయ పదకొండవ శతాబ్దానికి చెందిన కవి.ఆయనకు ముందు ఆంధ్ర సాహిత్యం అధ్వాన్న స్థితిలో ఉండేది. సంస్కృత భాషలో రచింపబడిన వేదవేదాంగాలు, పురాణాలు, కావ్యాలు సామాన్య ప్రజానీకానికి సులభంగా బోధపడేవి కావు. ఈ విషయాన్ని గ్రహించిన జినుడు, గౌతమ బుద్ధుడు తమ బోధనలు జనబాహుళ్యానికి అర్థమయ్యే రీతిలో వ్యవహారిక భాషల్లోనే బోధించి విజయం సాధించారు. ఆరవ శతాబ్దం చివర్లో నిర్మింపబడ్డ శాసనాల్లోనే తెలుగు ఆనవాళ్ళు కనిపించినా, అప్పటికి తెలుగులో ప్రామాణికమైన రచనలు జరిగినట్లు దాఖలాలు లేవు. తెలుగు ప్రయోగం మాత్రం అంతంతమాత్రంగానే ఉండేది. చెదురుమదురుగా కొన్ని పద్యాలు ఉన్నప్పటికీ అవి సంస్కృత వృత్తాల వాసనలను పోలి ఉండేవి. దీనికి కారణం తెలుగులో తగిన పదజాలం లేకపోవటం. ఉన్న కొన్ని పదాలకు స్థిరమైన రూపం ఉండేది కాదు( ఉదాహరణకు  దేవుడు అనే శబ్దం దేవడు, దేవండు, దేవణ్డు ' గా, తూర్పు అనే శబ్దం తూఱ్వు, తూఱ్పు, తూఱ్గు గా వ్రాయబడేది).

తెలుగులో పరిస్థితి ఇలా ఉండగా పొరుగుభాషలైన తమిళం,కన్నడంలో పరిస్థితి మరోలా ఉంది. తమిళంలో క్రీస్తుకు పూర్వమే తోల్కాప్పియం, తిరుక్కురళ్ వంటి గ్రంథాలు వెలువడితే క్రీస్తు తర్వాత సిలప్పదికారం, మణిమేకలై వంటి మహాకావ్యాలు వచ్చాయి. భారతం కూడా రచింపబడింది. కన్నడలో విక్రమార్క విజయం, గదాయుద్ధం వంటి గొప్ప కావ్యాలు వచ్చాయి. అటువంటి సమయంలోనే  ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్న చాళుక్యులు భాషాభిమానంతో  వ్యవహారిక తెలుగు భాషలోనే శాసనాలు వేయించటానికి ప్రయత్నించారు. చాళుక్య ప్రభువైన రాజరాజనరేంద్రుడు వైదిక మతాభిమాని. అతని ఆస్థాన కవి నన్నయభట్టు. నారాయణభట్టు, భీమనభట్టు ఇతర ప్రముఖ కవులు. కన్నడ దేశంలో సాహితీ ప్రక్రియ ద్వారా విస్తరిస్తున్న జైనమతం రాజరాజనరేంద్రున్ని కలవరపెట్టింది. వైదిక మతోద్ధరణ తన గురుతర బాధ్యతగా భావించాడు. కన్నడ, తమిళ బాషలలో అప్పటికే భారతం రచింపబడి ఉండగా తెలుగులో అప్పటివరకూ లిఖిత కావ్యరచన జరుగలేదన్న వాస్తవాన్ని గ్రహించి విచారించి, ఆ లోపాన్ని సరిదిద్దే బాధ్యతను నన్నయ భుజస్కందాల పై మోపాడు.

రాజరాజ నరేంద్రుని ప్రోత్సాహంతో వ్యాస భారతాన్ని ఆంధ్రీకరించే ప్రయత్నానికి నాంది స్థాపన చేశాడు నన్నయ.
సంస్కృతాన్ని ప్రధానంగా తీసుకొని సంస్కృత శబ్దాలతో సమ్మిళితమైన భాషను ఆంధ్రభాషగా స్వీకరించాడు . కొన్ని వేల సంవత్సరాల క్రితం సంస్కృత ప్రాకృత పదాల కలయికతో ఏర్పడ్డ పదాలకు వ్యుత్పత్తి అర్థాలు సృష్టించాడు. వివిధ రూపాలతో వ్యావహారికంలో నలుగుతున్న అనేక పదాలను సంస్కరించి, ప్రామాణికతను నిర్థారించి గ్రాంథికత కల్పించాడు. తెలుగు భాష ప్రత్యేకతైన అక్షరసామ్య యతిని, కన్నడ ప్రాసను మేళవించి సంస్కృత వృత్తాల యతినియమాలు మార్చి కొత్త చోట్ల యతిని ప్రవేశపెట్టాడు. ద్రవరూపంలో ఉన్న భాషకు స్థిరరూపాన్నిచ్చి సుసంపన్నం చేశాడు. ఋష్యత్వం సిద్ధించిన కవులకే తప్ప ఇతర కవులకు ఇది సాధ్యం కాదు

నన్నయ వ్యాస భారతాన్ని ఉన్నది ఉన్నట్లు తెనుగించలేదు. కొన్ని విడిచిపెట్టాడు. కొన్ని సృజించాడు. మరికొన్ని ఇతర పురాణాల్లోంచి స్వీకరించాడు. ఇది స్వేచ్ఛానువాదం. సంస్కృత భాషాభిమానులు తెలుగు భాషను నిరసిస్తున్న రోజుల్లోనే పంచమవేదమైన మహభారతాన్ని తెనుగించే సాహసాన్ని చెయ్యడం నన్నయ సామర్థాన్ని చాటిచెబుతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి సాయపడినట్లు నారయణభట్టు తనకు పరిపూర్ణ సాయమందించాడని అవతారికలో వ్రాసుకొన్నాడు నన్నయ.

పాలకురికి సోమనాథుడుపాలకురికి సోమనాథుడు 13వ శతాబ్దానికి చెందిన కవి. ఇతని తల్లిదండ్రులు విష్ణూరమిదేవుడు, శ్రియాదేవి. బ్రాహ్మణుడిగా జన్మించి వేదవేదాంగాలు నేర్చుకొని బసవేశ్వరుని బోధనలతో ప్రభావితుడై జంగముడిగా మారాడని కొందరు, పుట్టుకతోనే జంగముడని మరికొందరు వాదిస్తారు. ఇతని జన్మస్థలం మీద కూడా వివాదం ఉంది. అధిక సంఖ్యాకులు ఇతనిది వరంగల్లు దగ్గర్లోని పాలకురికి అని భావిస్తే ఇంకొంతమంది కర్నాటకలోని పాలకురికి అని విబేధిస్తారు.

సోమనాథుడు సంస్కృత, తెలుగు, కన్నడ భాషలలో కావ్యాలు వ్రాశాడు. తమిళ, మరాఠి ఇతర భాషలు కూడా వచ్చు.సంగీతంలో ప్రవేశం ఉంది. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, మల్లమ్మదేవి పురాణం, సోమనాథ స్తవం మొదలైన కావ్యాలు వ్రాశాడు. నన్నయ్య నడచిన బాటను విడిచిపెట్టి తనదైన ప్రత్యేక మార్గాన్ని తొలుచుకుంటూ వెళ్ళి విజయం సాధించాడు. నన్నయ్య సంస్కృత శబ్ద సమ్మిళతమైన తెలుగును స్వీకరిస్తే, సోమనాథుడు జానుతెలుగును అక్కునజేర్చుకున్నాడు. అచ్చ తెలుగు చంధస్సు ద్విపదలోనే అధికశాతం కృతులు వ్రాశాడు. సాధ్యమైనన్ని తెలుగు పదాలను రచనల్లో ప్రయోగించి తెలుగు పదాలకు పల్లకీ మ్రోశాడు. వాడుకలో ఉన్న శివ భక్తుల కథలన్నిటినీ కలిపి బసవని కథకు అన్వయించి కావ్యరచన చేశాడు. ఇతను వ్రాసిన వృషాదిప శతకం తెలుగులో తొలి శతకం. అలాగే చెన్నమల్లుసీసము మొదటి సీసపద్య శతకం.పశ్చిమ చాళుక్యుల వద్ద సేనానిగా పనిచేసిన సోమనాథుడు అంత్యకాలంలో శ్రీశైలం చేరి అక్కడ బసవేశ్వరుని మేనల్లుడైన చెన్నమల్లుని పై సీస పద్యాలు వ్రాశాడు.

సోమనాథుడి సమాధి వరంగల్లు దగ్గర్లోని పాలకురికిలో ఉందని కొందరంటే కాదు మైసూరు జిల్లాలో ఉందని ఇంకొందరంటారు.

సోమనాథుడు వ్రాసిన బసవపురాణం, పండితారాధ్య చరిత్ర స్వతంత్ర్య రచనలైనప్పటికీ, సాహిత్యపరంగా నిర్జీవమైన భాషను బ్రతికించి పరిపుష్టం చేసింది నన్నయభట్టే. పైగా సోమనాథుని కంటే ముందు నన్నెచోడుడు కుమారసంభవ మనే కావ్యాన్ని ఇంచుమించు స్వతంత్ర్యంగానే వ్రాశాడు. అయితే కథా వస్తువు ప్రాచీనమైనది. జానుతెలుగు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇతనే. సోమనాథుని ఆదికవిగా భావించాల్సి వస్తే, అతనికి ముందు కాలం వాడైన నన్నెచోడున్ని ఆదికవిగా ఎందుకు భావించకూడదు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే  ఎటువంటి పదకోశం లేని కాలంలోనే పంచమ వేదమైన మహాభారతాన్ని తెనుగించే ప్రయత్నం చేసి, దాని కోసం భాషను సంస్కరించిన నన్నయ్యభట్టునే ఆదికవిగా పరిగణించాలి. సోమనాథుడు, నన్నెచోడుడు లాంటి కవులు తప్పిస్తే అధిక శాతం కవులందరూ నన్నయ్య పరచిన బాటలోనే సాగిపోయి జైత్రయాత్రలు చేశారు. పెద్దానాదులు సైతం ఆదికవిగా నన్నయ్యను కీర్తించారు.

కాబట్టి తెలుగులో ఆదికవి నన్నయే.

(మూలం: సినారే  "ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు:ప్రయోగములు " )


7 comments

Anonymous
August 9, 2012 at 10:14 AM

Good info.

Reply
August 9, 2012 at 12:26 PM

excellent post. both are great personalities in thier era. kudos to both of them. Dragging nothing to convtroversy and there by cashing to his vested intrests is nothing new to ka cha ra.that is why he is demogogue.

Reply
Anonymous
August 9, 2012 at 12:33 PM

బాగా వ్రాశారు.

Reply
August 9, 2012 at 4:50 PM

మీరు రాసింది సరియైనదే.పరిశోధకులు ఎప్పుడో రాసారు.కుల,ప్రాంతీయ తత్వాలకి అతీతంగా ఆలోచించాలి.ఎక్కడివారైనా,ఎప్పటివారైనా గొప్ప కవులని,రచయితల్ని,ఇతరకళాకారుల్ని అభిమానించి,గౌరవించాలి.But facts are facts.

Reply

ఆ మహనీయులకి ప్రాంతీయ తత్వం అంటగట్టే గుంట నక్కలని ఏమనాలి?

Reply

@ SNKR గారు
@ తాడేపల్లి గారు

కృతజ్ఞతలు.

@కిరణ్ గారు,
@ముద్దు వెంకట రమణారావు గారు,

ప్రతి దానికీ రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవటం కచరాకు మాములే. ప్రతిభామూర్తులను ప్రాంతీయతా చట్రంలో బంధించాలనుకోవటం మూర్ఖత్వం.

@కృష్ణ గారు,

ఏమనాలి అని ఆడుగుతూనే ఎలా పిలవాలో చెప్పేశారుగా :-)

Reply
August 11, 2012 at 10:00 AM

తమ్మీ వాన్కి నచ్చ జెప్పుండ్రి,
రాజకీయాల్ , వసూల్ , దందాల్, చూసుకునేతోంకి , కవుల్, కళాకార్ల గురించి ఎందుకు..?
కుక్క పని గాడిద జేసుడేందుకు..? సాకలోనితో సావు దెబ్బల్ తినే టంద్కా..?

Reply
Post a Comment