సుందర దృశ్యరూపం శిరిడిసాయినేను షిర్డీ సాయిబాబా భక్తున్ని కాను. దృశ్యరూపంగా సినిమాలలో గానీ సీరియల్స్‌లో గానీ ఆయన మహత్యాలు చూసిన సంఘటనలు గానీ, కర్ణాకర్ణిగా ఆయన చరిత్ర విన్న దాఖలాలు గానీ లేవు . అలాగని ఆయన పట్ల ఎటువంటి వ్యతిరేకత కూడా లేదు. మా ఆవిడ మాత్రం సాయిబాబా భక్తురాలు. గురువారాలు ఉపవాసాలు ఉండటం, సాయి సచ్చరిత చదవడం లాంటివి  క్రమం తప్పకుండా చేస్తూంటుంది. పూర్తిగా ఆమెకోసమే కాకపోయినా, ఇటువంటి సినిమాల పట్ల నాలో మాములుగా ఉన్న ఆసక్తి, నాగార్జున ఎలా చేశాడోనన్న ఉత్సుకత ఏమూలనో ఉండటం చేత మొదటిరోజే సినిమాకు వెళ్ళిపోయాం. సినిమా చూస్తూ, చూశాక చాలా ఆశ్చర్యానికి లోనయ్యాం.

శిరిడిసాయి చాలా బావుంది. సాయిబాబా జీవిత చరిత్రను నిజాయితీగా వివరించే ప్రయత్నమని సినిమా చూస్తున్నంతసేపూ అనిపించింది. కథ, కథనం చాలావరకు సాయి సచ్చరితలో ఉన్నట్లే చిత్రీకరించారని మా ఆవిడ ద్వారా తెలిసింది. ఎటువంటి సినిమాలలో అయినా చవకబారు హాస్యాన్ని, వెకిలి శృంగారాన్ని గుప్పించే రాఘవేంద్రరావు ఈ సినిమాలో స్కోపు లేవటం మూలంగానో, శ్రీ రామరాజ్యం విడుదలైనప్పుడు ఆ చిత్రాన్ని తన చిత్రాలతో పోల్చి జరిగిన చర్చల మూలానో కాస్త పద్ధతిగా తీశాడు. ఆయితే ఇందులోనూ చవకబారు సంభాషణలు లేకపోలేదు. ఆలీ, అనంత్ , బ్రహ్మానందం, శ్రీహరి ఆ కార్యాన్ని తమ పంథాలో నిర్వహించారు. బ్రహ్మానందం నటన ఎనభైలలో ప్రదర్శించిన ఆయన శైలిని గుర్తుచేస్తుంది. గ్రాఫిక్స్ సరిగ్గా కుదరలేదు. ఒక్కటే దేవుడు పాట ప్రారంభంలో ఋషులు, ముల్లాలు, క్రైస్తవ మతపెద్దలు హిమాలయాల్లో లైన్‌గా కూర్చొని ప్రార్థనలు చేస్తూంటారు. ఆ సన్నివేశాలు కాస్త నవ్వు తెప్పించాయి. అమరారామ,శరణు శరణు శరణం పాటలు నాకు బాగా నచ్చాయి . మిగతా పాటలు సన్నివేశాలకు సరిపోయాయి అనిపించింది కానీ గొప్పగా అనిపించలేదు. బాబా పట్ల నాలో భక్తిభావం లేకపోవటం అందుకు కారణం కావచ్చు.

నాగర్జున నటన మీద నాకు మొదటినుంచీ పెద్ద భ్రమలు లేవు. అన్నమయ్య చుశాక ఫర్వాలేదు అనుకున్నాను. శ్రీరామదాసు ద్వితీయార్థంలో ప్రదర్శించిన హావభావాలు చుశాక నా ఆభిప్రాయం సడలింది. శిరిడిసాయి చూశాక నాగార్జున నటనలో పరిణితి కనబడింది. ఇటువంటి చిత్రాలు చేస్తున్నప్పుడు నటీనటుల ఆహర్యం ముఖ్యం. సగం మార్కులు అక్కడే పడిపోతాయి అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయిలలో నాగార్జునకు ఆహర్యం బాగా నప్పింది. బాడీలాంగ్వేజ్‌లో సాయిబాబా శైలిని చక్కగా అనుకరించాడు. పతాక సన్నివేశాల్లో ముఖంలో సాత్వికతను ఆర్ద్రత బాగా ప్రకటించగలిగాడు. పూర్తిగా ఒన్‌మ్యాన్ షో. అతను గర్వంగా చెప్పుకునే చిత్రాలలో ఇదొకటని నిస్సందేహంగా చెప్పొచ్చు.

మిగతా నటీనటులందరూ ఆయా పాత్రలకు సరిపోయారు. శ్రీకాంత్, శరత్‌బాబు, తదితరులు తమ పరిధి మేరకు బానే చేశారు. కమలినీ ముఖర్జీ తేలిపోయింది.

చవకబారు సినిమాలన్నీ కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తున్న ఈ రోజుల్లో ఈ సినిమా ఘనవిజయం సాధించి  ఇటువంటి మరిన్ని చిత్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆశిస్తున్నాను.


1 comment

November 20, 2012 at 12:12 PM

very good

Reply
Post a Comment