గోదావరి యాత్ర-2

రాజమండ్రిలో మేమున్న హోటల్ పేరు పర్ణశాల ప్రిన్స్‌లి. పుష్కరఘాట్ కి కాస్త దగ్గర్లో కుమారి థియేటర్ రోడ్డులో ఉంది. గదులూ అవీ ఫర్వాలేదు కానీ మూడు చిక్కులున్నాయి. ఒకటి - హోటల్ క్రిందనే బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. రెండవది-హోటల్ రెసెప్షన్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి లిఫ్టున్నా అది పనిచెయ్యదు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మిగతా అంతస్తులకు మాత్రమే పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడే పెద్దవాళ్ళెవరైనా ఉంటే  మొదటి అంతస్తు వరకు మెట్లెక్కి వెళ్ళడం కష్టం. మూడవ చిక్కు విద్యుత్‌కోతలలో లిఫ్టు పనిచెయ్యదు. గదులకు ఏ.సి మాత్రం పనిచేస్తుంది.

ఇలాంటి హోటల్‌లో ఎలా ఉన్నావయ్యా వారం రోజులంటే నా సమాధానాలు ఇవి - హోటల్‌లో మేము గడపదలచుకున్న సమయం చాలా తక్కువ. ప్రొద్దున్నే ఏడున్నర-ఎనిమిదికళ్ళా బయటపడి  మళ్ళీ రాత్రి ఏడుగంటలకు హోటల్ చేరుకొనేవాళ్ళం. కేవలం రాత్రి విశ్రమించడానికే అయితే సౌకర్యంగానే ఉంది .  పర్ణశాల ప్రిన్స్‌లి ప్రక్కనే అక్షయ్ రెసిడెన్సీ అని మరో హోటల్ ఉంది.  అందులో గదులు బావున్నాయి. ధర కూడా ఫర్వాలేదు. విద్యుత్‌కోతలలో లిఫ్టు పనిచేస్తుంది కాని ఏ.సి. పని చెయ్యదు. ఫ్యాన్లు పనిచేస్తాయి. రాజమండ్రిలో వేసవిని తట్టుకోవాలంటే ఫ్యాన్లు సరిపోవు. ఏ.సి ఉండాల్సిందే. హోటల్ ఎత్తులో కట్టడం వల్ల మెట్ల సమస్య దానికీ ఉంది. ఇక బార్ అండ్ రెస్టారెంట్ విషయానికొస్తే  దానికి జనాల తాకిడి లేకపోవటం పెద్ద ఊరటనిచ్చే అంశం. ఒకరిద్దరు కంటే ఎక్కువమందిని అక్కడ చూసినట్లు నాకు గుర్తులేదు. ఇదే తిరుపతిలో అయితే ఒక సూపర్‌స్టార్ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్‌షోకి జనం ఎలా కొట్టుకుంటారో అలా ఎగబడేవాళ్ళు. బెంగుళూరులో కూడా ఈ తంతు కొన్ని చోట్ల గమనించాను. వేసవిలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని మొన్నామధ్య పేపర్లో చదివి నేనేం ఆశ్చర్యపోలేదు. దేశంలో తాగడానికి మంచి నీళ్ళు లేనప్పుడు పుష్కలంగా దొరికేదేదో అది తాగి ప్రాణాలు నిలుపుకోవాలి కదా !

మరుసటి రోజు ప్రొద్దున్నే ఎనిమిదిన్నరకు  మారుతి టూరిజం వారి ఇన్నోవాలో అందరం  బయలుదేరాం.  

కోనసీమ అందాలతో పరిచయం, రాజమండ్రి నుంచి బిక్కవోలుకు వెళ్ళే దారితో ప్రారంభమయ్యింది. రోడ్డుకు ఇరువైపులా పంటకాలువలు, వాటి పక్కనే కంటిచూపు ఆనినంతవరకూ పచ్చటి పైరుపొలాలు. ఈడొచ్చిన  తెలుగుపిల్లలా భూకన్య పచ్చటివోణీ తొడుక్కుని సిగ్గుతో మురిసిపోతూంటే, ఆ సిగ్గును పల్చటి మేలి ముసుగుతో కప్పుతున్నట్లు జలతారు మంచుతెర, ఇంతటి సుందర సన్నివేశానికి ఆహ్వానాలు మోసుకెళ్తున్న నెచ్చెలుల్లా గగనసీమలో కొంగల బారు ..నయనమనోహర దృశ్యాలు దారిపొడవునా సాక్షాత్కరించాయి . శీతాకాలంలో మంచు తెరలు మాములే కానీ నిండు వేసవిలో బారెడు పొద్దెక్కాక మంచు తెరలు చూడటం ఇదే మొదటిసారి.

బిక్కవోలు 

బిక్కవోలు చిన్నగ్రామం. ఇక్కడున్న ప్రసిద్ధమైన ఆలయ సముదాయం శ్రీగోలింగేశ్వర స్వామి దేవాలయం. క్రీ.శ.9వ దశాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ ఆలయాలు తురుష్కుల దండయాత్రలలో శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలక్రమంలో పుట్టలు,పొదలు పెరిగి అరణ్యంతో కప్పబడిపోయిన ఈ ఆలయాలని గోవులు తమ క్షీరధారలతో అభిషేకించటం గమనించి ఆశ్చర్యపోయిన కరణం, పుట్టలను తవ్వించి లింగాన్ని బహిర్గతం చేశారు. గోవుల క్షీరధారలతో అభిషిక్తమైన మూర్తి కనుక గోలింగేశ్వరుడయ్యాడు. ఆయననే ఆలింగన చంద్రశేఖరుడని కూడా అంటారు.
బిక్కవోలు పూర్వనామం బిరుదనవోలట. పూర్వం ఇక్కడి నుంచి పెద్దాపురానికి సొరంగమార్గం ఉండేదని , బ్రిటీషు వాళ్ళు బిగ్‌హోల్ అని పిలవటం మూలన కాలగర్భంలో అది బిక్కవోలుగా మారిందని ఒక కథనం.
గోలింగేశ్వరస్వామి వారి ఆలయానికి దగ్గర్లో పచ్చటి పోలాల మధ్యలోనున్న స్వయంభూ లక్ష్మీగణపతి ఆలయం కనువిందు చేస్తుంది. గణపయ్య ఎంత బొద్దుగా ఉంటే అంత అందం. ఇక్కడ స్వామివారు విశాలమైన చెవులు, కుడివైపుకు తిరిగిన పొడవాటి తొండం, పెద్ద బొజ్జతో భూమిలో కూరుకుఫోయి ఉంటారు. స్వామి చెవులలో మన ఈప్సితాలు చెప్పుకుంటే అవి నెరవేరుతాయని ప్రతీతి.

బిక్కవోలు, గొల్లల మామిదాడ, దాక్షారామం, పీఠాపురం, అన్నవరం, కడియం - ఇవి ముందుగా మేం బుక్‌ చేసుకున్న ప్యాకేజి ప్రకారం  మొదటిరోజు వెళ్ళవలసిన  ప్రాంతాలు. బిక్కవోలు చూశాక స్థానిక ప్రాశస్త్యం ఉన్న చిన్న గుళ్ళ కంటే లోకప్రాశస్త్యం ఉన్న దేవాలయాలు, ప్రాంతాలు దర్శించడం  ఉత్తమమనిపించింది . మా రూట్‌మ్యాప్‌లోంచి గొల్లల మామిదాడ , కడియం తొలగించి వాటి స్థానాల్లో సామర్లకోట, కాకినాడ చేర్చాం. మా డ్రైవరు  మాటకారి, బ్రతకనేర్చినవాడు కాబట్టి దానికి అంగీకరించాడు. పనిలో పనిగా మరుసటిరోజు ప్యాకేజ్‌కు బదులు వాహనాన్నే మాట్లాడుకోమని, దాని ద్వారా బోలెడంత డబ్బు ఆదా అవుతుందని (తనకూ, మాకూ) ,ఇష్టమొచ్చిన ప్రదేశాలు చూడవచ్చని సలహా ఇచ్చాడు. మాకా సలహా నచ్చింది.


కారు దాక్షారామం వైపు బయలుదేరింది.

(సశేషం..)


6 comments

August 27, 2014 at 4:53 AM

ఏది ఏమైనా వీటిని చూసి చాలా కాలమయింది. ఆ రోజులలో పనికి రానివాణ్ణి అణా కానీ గాడనీ అణా పరక గాడనీ అనేవారు.


Reply

శర్మ గారు,

మీ స్పందనకు కృతజ్ఞతలు.

Reply
August 28, 2014 at 8:54 AM

following your blog it is good with sweetness of telugu

prasad

Reply

నాదెళ్ళ ప్రసాద్ గారు,

Thankyou.

Reply
September 7, 2014 at 9:13 PM

పచ్చని పల్లెల అందాలన్నీ ఒక్కమాటలో చెప్పేశారండి. ఆహ్లదకరమైన వర్ణ. చదువుతుంటే గోదారి గాలి తగిలినట్టైంది. బిక్కవోలు పేరే వినలేదు నేనెప్పుడూ, ఇప్పుడే వినడం. ఈసారి అటుగా వెళితే చూసే ప్రయత్నం చేస్తాను.
గణపయ్య ఎంత బొద్దుగా ఉంటే అంత అందం --:)))I agree, He is the cutest God ever :D

పంచారామాల్లో రెండు చూసినట్టున్నారే! పిఠాపురంలో అమ్మవారి గుడి కదూ? గొల్లలమామిదాడ తీశేశానన్నారు. అసలక్కడ ఏముంటుంది? ఏవైనా గుడులా? లెదంటే ఊరు బాగుంటుందా?

Reply

మానస గారు,

గొల్లల మామిదాడలో రామాలయం,సూర్యనారయణ స్వామి దేవాలయం చాలా బావుంటాయని చెప్పారు.ముఖ్యంగా రామాలయం రాజగోపురాలు చక్కటి అధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయట.పీఠాపురం గురుంచి తరువాయి టపాలో .. :-)

Reply
Post a Comment