నేను - నా సైకిలు - భద్రాచలం


ది కొత్తగా నేను ఇంటర్మీడియట్ లో చేరిన నాటి సంగతి.


పదో తరగతి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణున్నై క్లాస్ ఫస్ట్ రావటంతో మా నాన్నగారు హీరో రేంజర్ సైకిలు కొనిచ్చారు నాకు.అంతకుముందు మా నాన్నగారిది పెద్ద సైకిల్ అట్లాస్ ఉండేది.దాన్లో స్కూల్ కి వెళ్ళేవాడిని.ఇప్పుడు నాకంటూ స్వంత వస్తువు రావటంతో చాలా సంబరపడ్డాను.మంగళవారం పూట కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి చిన్నసైజు పూజలు అవీ చేసాను.చీకట్లో కుడా నా పేరు మిలమిల మెరిసేలా రేడియం స్టిక్కర్ అంటించాను. తళాతళాలాడే ఆ కొత్త సైకిల్ పై కూర్చొని,నలిగిపోని పువ్వుల చొక్కా,నిగనిగలాడే బ్యాగీప్యాంటు తొడుక్కుని,బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోలా కలలు కంటూ,యథాశక్తి నాకు వచ్చిన అరకొర విన్యాసాలు చేస్తూ మా కాలేజ్ వెళ్ళేవాడిని.






ఓ రోజు ఇలాగే నా సైకిల్ తీసుకొని లైబ్రరీకి వెళ్ళాను.బయట చాలా సైకిళ్ళు,స్కూటర్లు పార్క్ చెయ్యబడి ఉన్నాయి.నేనూ నా సైకిల్ లాక్ చేసి స్టయిల్ గా లైబ్రరీ లోనికి వెళ్ళాను.అక్కడ దినపత్రికలు తప్ప ఏమీలేవు.వారపత్రికలు లేకపోతే పోయే కనీసం చందమామ,బాలమిత్ర లాంటివి కూడా లేకపొయ్యేసరికి మనకి బోర్ కొట్టింది.ఆ ఉన్న నాలుగైదు దినపత్రికలు చెల్లాచెదురైపోయి,చిరిగిపోయి పదిమంది చేతుల్లో విడివిడిగా దర్శనమిచ్చాయి.అపరాధ పరిశోధకుల్లా అందరూ తమ చేతుల్లోని పేపర్లలో తలమునకలైపోయి,వార్తలతో పాటూ,అందులోని అడ్వర్టైజ్మెంట్లు కూడా చదివివేస్తున్నారు.నాదాకా పేపర్ వచ్చే పరిస్థితి కనిపించలేదు.ఏం చెయ్యాలో పాలుపోక కాసేపు బిక్కమొగంవేసి 'ఓకే లెట్స్ గో హోం' అని నిర్ణయించుకొని బయటికి వచ్చాను.వచ్చి చూద్దును కదా నా సైకిల్ అక్కడ లేదు. గుండె గుభిల్లుమంది.






పధ్నాలుగువందలు పోసి కొన్న సైకిల్ అది.కొని పట్టుమని పదిరోజులు కుడా కాలేదు.నాకు చెమటలు పట్టేశాయి.ఎవరైనా దొంగలించారేమోనని చుట్టుపక్కల వీధులన్ని తిరిగేశాను.ఎక్కడా కనిపించలేదు.
మానవయత్నంతో పాటు దైవయత్నం కూడా ఉండాలని భధ్రాచలం రామున్ని కూడా వేడుకున్నాను.'నా సైకిల్ నాకు దొరికేలా చెయ్యి స్వామీ.సకుటుంబ సమేతంగా వచ్చి నీ దర్శనం చేసుకుంటా' అని మొక్కుకున్నాను.నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ మళ్ళీ లైబ్రరీ దగ్గరికే వచ్చాను.నా అవస్థనంతా చూసిన ఒక పెద్దమనిషి 'ఇందాకే ట్రాఫిక్ పోలీసులొచ్చి కొన్ని సైకిళ్ళు,స్కూటర్లు పట్టుకెళ్ళారు బాబు.ఎందుకైనా మంచిది వెస్ట్ పోలిస్ స్టేషన్లో వెదుకు ' అని ఆపద్భాంధవుడిలా మార్గదర్శనం చేశారు.నాలో ఆశ చిగురించింది.ఆయనకు కృతజ్ఞతలు చెప్పి పోలిస్ స్టేషన్ కి వెళ్ళాను.వెళ్తూ దారిపొడవునా ఆలోచిస్తూనే ఉన్నాను ' నా సైకిల్ ఏమైనా రోడ్డుకడ్డంగా పెట్టానా ' అని.అలాంటిదేమీ లేదు.అక్కడ నా సైకిల్ తో పాటుగా చాలా సైకిళ్ళున్నాయి.వాటిని వదిలేసి నా సైకిల్ మాత్రం ఎలా పట్టుకెళ్తారు అనిపించింది.


వెస్ట్ పోలీస్ స్టేషన్లో నా సైకిల్ కనిపించగానే పోయిన ప్రాణం తిరిగొచ్చింది.
కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళి నా సైకిల్ ఇవ్వమని అడిగాను.ఆయన వయస్సు నలభై - యాభై మధ్యలో ఉంటుంది.బానపొట్ట.నావైపు ఎగాదిగా చూసి మా నాన్నేం పని చేస్తారో కనుక్కొని ' రోడ్డుకడ్డంగా సైకిల్ పెట్టావ్, ఫైన్ కట్టి తీసుకెళ్ళు ' అన్నాడు.' నేనేం సైకిల్ అడ్డంగా పెట్టలేదు ' అని అతనితో వాదించాలని నాకనిపించింది.కాని ధైర్యం చాలలేదు.అవతల పోలిసోడితో వ్యవహారం.నీళ్ళు నమిలి ' నా దగ్గర లేదు సార్ ' అన్నాను. ఆయన ముఖం చిట్లించి అయితే రేపు కోర్టుకొచ్చి జరిమానా కట్టి,సైకిల్ తీసుకు ఫో' అన్నాడు.నాకు ఏడుపు వచ్చినంత పనైయ్యింది.సైకిల్ కోసం మొదటిసారి కోర్టుగుమ్మం ఎక్కాలా దేవుడా,నేను నా పరువు,ఇంటి పరువు ఏం కావాలని అరవ సినిమాలో హీరోలా తెగ కుమిలిపోయాను.


ఇంతలో గజేంద్రుడి మొరవిన్న విష్ణుమూర్తిలా ఎస్సై వచ్చాడు.నేను నాగోడు వెల్లబోసుకున్నాను.ఆయన కానిస్టేబుల్ ని పిలిచి విచారించాడు.నా వైపు తిరిగి ' ఏం బాబు.మీ నాన్న ఆఫీసర్ అని ఏదో పొగరుగా మాట్లాడావట ' అని అడిగాడు.కానిస్టేబుల్ తప్పు కప్పిపుచ్చుకోడానికి చెయ్యని నేరం నామీద వేస్తున్నాడని తెలిసి నాకు ఏడుపు వచ్చేసింది.బావురుమని నేనా పని చెయ్యలేదని విన్నవించుకున్నాను.నా ఏడుపు చూసి ఎస్సై కి విషయం అర్థమయ్యింది.ఆయన కానిస్టేబుల్ ని చీవాట్లు పెట్టి ' అడ్డమైన కేసులన్నీ తీసుకొస్తావ్ గదయ్యా.ఆ సైకిల్ అతనికిచ్చెయ్ ' అని విసుక్కున్నాడు.


సైకిల్ నాకిచ్చేస్తూ ' ఐదు రూపాయిలివ్వు.రిక్షాలో తీసుకొచ్చా ' అన్నాడు కానిస్టేబుల్.నా దగ్గర నయాపైసా లేదు.అదే చెప్పాను.చావు గిరాకీ తగిలిందని గొణుక్కుంటూ ఆయన వెళ్ళిపోయాడు.సైకిల్ దొరికిందన్న ఆనందంతో నేను బయటపడ్డాను.


అయితే నా సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు.గిట్టనోళ్ళు ఎవరు గింజుకున్నారో కానీ,పి.హెచ్.డి చేస్తున్న మా బాబాయ్ నా సైకిల్ తీసుకెళ్ళి పెడల్ విరగొట్టుకొచ్చాడు.ఆ పెడల్ స్క్రూ టైప్.అప్పట్లో కొత్తమోడల్ .మళ్ళీ బిగిద్దామంటే అలాంటి స్క్రూ ఏ సైకిల్ షాప్ లోను విడిగా దొరకలేదు.వెల్డింగ్ చేయించినా పెడల్ తేడాగానే ఉండిపోయింది.


దాంతోపాటు నా భధ్రాచలం మొక్కు కూడా అలానే ఉండిపోయింది .