' తెలుగురత్న' లో నా కథ- బలిపశువులు

  ( ' తెలుగురత్న' లో మార్చి 2 2010న ప్రచురితం)
   

   

కొడిగట్టిపోతున్న కర్షకుల జీవితాల్లా ఆకాశంలోని నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ ఉసూరుమంటున్నాయి.శిథిలమైపోయిన ఊరిబావిలా సగం చిక్కిన చంద్రుడు నిర్వికారంగా చూస్తున్నాడు.కీచురాళ్ళ సొద,అప్పుడప్పుడు ఎక్కడినుంచో దూరంగా వినిపించే కుక్క అరుపు తప్ప అంతా స్తబ్ధుగా ఉంది.

ఊరి పొలిమేరలో !
తన చేను మధ్యలో !

అస్త్రసన్యాసం చేసి అంపశయ్య చేరిన భీష్మపితామహుడిలా నిస్సహాయంగా జారగిలబడి ఉన్నాడు అనంతరామయ్య.చుట్టూ వున్న కటిక చీకటిలాగే అతని గుండెల్లో గుబులు దట్టంగా పరచుకొని ఉంది.నిరాశా నిస్పృహలు దావానలంలా అతని నరనరాన్ని దహించి వేస్తున్నాయి.గురవయ్య విధించిన గడువు నేటితో తీరిపోయింది.జోళ్ళు అరిగేలా ఊళ్ళు తిరిగినా ఎక్కడా అప్పు పుట్టలేదు.ఇక పుట్టదనీ అర్థమైపోయింది.ఆఖరు బస్సుదిగి,ఇంటికి వెళ్ళడానికి మనసొప్పక ఇటువైపు వచ్చాడు.అప్పటికే అతనొక నిర్ణయానికి వచ్చేశాడు.

ఎండిపోయిన వేరుశెనగచేను వైపు పేలవంగా చూసి భారంగా నిశ్వసించాడతను.అతని కళ్ళలో జీవం లేదు.తడారిపోయిన నీటి చెలమల్లా ఉన్నాయి.గెడ్డం కలుపుమొక్కలా ఏపుగా పెరిగిపోయి అక్కడక్కడా నెరసిపోయింది.ముఖంపై ముడతలు ముంచుకొస్తున్న వార్ధక్యానికి సూచికల్లా ఉన్నాయి.చిరుగులు పడ్డ అతని పంచె పేదరికాన్ని మరుగున పెట్టలేక నానా అవస్థలు పడుతోంది.మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన అతని కళ్ళ ముందు మెదలింది.

రేచీకట్లు ముసురుకుంటున్న గోధూళి వేళ.పక్షులన్నీ గూళ్ళకు చేరుకుంటున్నాయి.వయసుడిగిపోయి,వ్యాపకాలు లేని వృద్ధులు రావిచెట్టు క్రింద రచ్చబండ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు.తను పశువులు మేపుకొని అప్పుడే ఇంటికొచ్చాడు.దొడ్లో వాటిని కట్టేసి,వాటికి ఎండుగడ్డి వేసి,కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉండగా అలజడి మొదలైంది.వీధిలోకి వచ్చి చూస్తే వడ్డీవ్యాపారి గురవయ్య,అతని మనుషులు.

గురవయ్య వీధిలోంచే తనకివ్వాల్సిన వడ్డీడబ్బుల గురుంచి గొడవ ప్రారంభించాడు.తను ' ఇంట్లోకి రండి మాట్లాడుకుందాం ' అన్నా వినలేదు.ఈ రభసకు భార్య,కూతురు బయటికి వచ్చారు.నలుగురూ పోగయ్యారు.తాడోపేడో తేల్చుకోడానికి వచ్చినవాడిలా చిందులు తొక్కుతున్నాడు గురవయ్య.'కూతురు పెళ్ళి రెండునెలల్లో ఉంది.పెళ్ళయ్యాక తలతాకట్టు పెట్టైనా అప్పు తీర్చేస్తాను.అంతవరకూ ఆగమ 'ని తను వేడుకున్నా వినిపించుకోలేదు.గారపల్లు బయటపడేలా పెళుసుగా నవ్వి ' మింగ మెతుకు లేనోడికి మీసాలకు సంపెంగ నూనె దేనికిలే ? ఇప్పుడ్నీ కూతురికి పెండ్లికాకపోతే వచ్చే నష్టమేముంది? ' అనేశాడు తేలిగ్గా.తనకు తలకొట్టేసినట్లైంది.అప్పటికీ అక్కడ మూగిన జనంలో కొందరు తన వైపు వకాల్తా పుచ్చుకొని ' కూతురు పెండ్లంటున్నాడు కదా,కొన్ని రోజులు వోపికపట్టు.నీ సొమ్ము యాడికి బోదులే ' అన్నారు. గురవయ్య వాళ్ళ మీద కస్సుమంటూ పైకి లేచాడు.' చాల్చల్లేవయ్యా చెప్పొచ్చారు.పెతివోడూ నీతులు జెప్పేటోడే.మీకేం మీ సొమ్ముకాదు కాబట్టి ఎన్ని కబుర్లైనా చెబ్తారు.అవతల ఈళ్ళ దగ్గర డబ్బులొసూలు చెయ్యలేక నా పేనాలు పొతావుండాయి.ఇప్పటికి మూడ్నెలలు వడ్డీబాకీ.మీరెవురైనా హామీ వుంటానంటే చెప్పండి,ఇప్పుడే వదిలేస్తా ' అని కసురుకున్నాడు.ఎవ్వరూ కిక్కురుమనలేదు.అతను తనకు మూడురోజుల గడువిచ్చి,అది దాటితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి వెళ్ళిపోయాడు.ఇంతటి ఘోరమైన అవమానం తనకెప్పుడూ జరగలేదు.ఎన్నో ఏళ్ళుగా వ్యయప్రయాసలకోర్చి తను నిర్మించుకున్న పరువుప్రతిష్ఠ ఆ రోజు మట్టిలో కలిసిపోయాయి.

సినిమా వదిలేశాక దాన్ని సమీక్షిస్తూ జనం విడిపోయినట్లు,అక్కడ మూగిన జనం కూడా తలోమాట మాట్లాడుకుంటూ చెదరిపోయారు.చేష్టలుడిగిన శిలాప్రతిమలా నడివీధిలో తాను నిలబడిపోతే,శెలవులలో ఇంటికొస్తూ జరిగిన దారుణమంతా చూసిన తన కొడుకు సూర్యం,తనను ఇంట్లోకి తీసుకువెళ్ళాడు.' తనిక డిగ్రీ చదవనని,పట్నంలో ఏదైనా పని చూసుకొని చేతనైన సహాయం చేస్తాన ' ని కొడుకు, ' ఇప్పట్లో పెళ్ళివద్దని ' కూతురు మొండికేశారు.అందరి కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి.తనే వాళ్ళను సమాధానపరచి పట్టు సడలింపచేశాడు.అప్పట్నుంచి ఎక్కడైనా అప్పు దొరక్కపోదా అని తిరుగుతూనే ఉన్నాడు.తన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి.

కూతురిని తలచుకోగానే అనంతరామయ్య హృదయం దుఃఖంతో బరువెక్కింది.పెళ్ళిడొచ్చి ఏళ్ళు కావొస్తున్నా ఇంకా గడప దాటని కూతురు.తన ఈడు పిల్లలంతా తల్లులై సంసారాలీదుతుంటే తను మాత్రం ఇంకా వంటపని,పొలంపని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది.ఇప్పటికైనా ఆమెకు పెళ్ళి చెయ్యకపోతే తను విఫలమైనట్టే అనుకొని తనకున్న పరిమితులలో మంచి సంబంధం చూసి ఖాయం చేశాడు.కట్నకానుకలంటూ పెద్దగా లేకపోయినా కనీస ఖర్చులుంటాయి కదా.అతను అప్పు చేశాడు.వేరుశెనగ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
ఈ సీజన్ లో వర్షాలు కాస్త ఆశాజనకంగానే ఉన్నాయి.ఒక పంటపండినా అతను కాస్త తెరపినపడ్డట్లే.

పంట ఏపుగా పెరిగి గింజపట్టే దశకు చేరుకొంది.అతని సంతోషానికి అవధుల్లేవు. ' ఇంకో పదును వానపడితే చాలు ' అనుకుంటూండగా పరిస్థితులు మళ్ళీ తిరుగుముఖం పట్టాయి.ఎలక్షన్లలో వాగ్దానాల్లా మెరిపించి మురిపించిన మేఘాలు,గెలిచిన నాయకుడికి మల్లే ముఖం చాటేశాయి.ఎండ తీక్షణత పుంజుకొంది.వేరుశెనగ వాడిపోవడం ప్రారంభించింది.ఊటబావిలోని కాసిని నీళ్ళతో కొన్నాళ్ళు నెట్టుకొచ్చాడు.తర్వాత అదీ ఎండిపోయింది.అతని నెత్తిన బండ పడ్డట్లైంది.గింజపట్టని నీళ్ళకాయలు అతనేం చేసుకోగలడు ?! హతాశుడయ్యాడు.

అనంతరామయ్యది వానాకాలం చదువు.ఉన్న ఆస్తల్లా తాతతండ్రుల ద్వారా సంక్రమించిన ఐదెకరాలే.తండ్రి కాలం చేశాక,తల్లి పోషణభారం కుటుంబబాధ్యతలు భుజానికెత్తుకొని కొన్నేళ్ళపాటూ పొలంలో బంగారమే పండించాడు.ఐదెకరాల ఆస్తికి మరో రెండెకరాలు జతచేసి ఏడెకరాలు చేశాడు. ఆ సమయంలోనే వొక ఇంటివాడై ఇద్దరు పిల్లల తండ్రయ్యాడు.ఒక కూతురు,వో కొడుకు.

రోజులు దొర్లాయి.కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు.ఫెళఫెళకాస్తూ కరువొచ్చింది.అతను నిబ్బరంగా ఎదుర్కొన్నాడు. ' ఒక్క ఏడాదేలే' అనుకున్న కరువు మరో మూడేళ్ళు కొనసాగింది.కురవాల్సిన వర్షాలు సకాలంలో కురవక పొయ్యిమీది పెనంలా పొగలసెగలుపోయింది పుడమితల్లి.ఏనుగుదాహంతో అలమటిస్తున్నట్లు భూములన్నీ నోళ్ళు తెరచిపెట్టుకొని బీటలు వారాయి.అడుసునేలలో పరవళ్ళు త్రొక్కాల్సిన నాగళ్ళు మూలపడ్డాయి.కొమ్ములెగరేసి, కుప్పెలు ప్రదర్శిస్తూ ఠీవీగా తిరిగిన కాడెద్దులు కబేళాలకు తరలిపోతున్నాయి.ఆకాశం పిండినా చుక్కచినుకు రాలేలా లేదు.పాతాళం తవ్వినా పచ్చిగంగ ముట్టేలా లేదు.జీవనోపాధి కరువైన జనం పొట్టచేతబట్టుకొని,

తిరునాళ్ళకెళ్ళినట్లు పొలోమంటూ వలసపోతున్నారు.పుట్టిన మట్టి,దుక్కిన నేలపై మమకారం చావని తత్తిమ్మా జనం అప్పోసప్పో చేసుకొని,కలోగంజో త్రాగుతూ జీవచ్ఛవాల్లా పడి ఉన్నారు.ఒకప్పుడు పిల్లాజెల్లా,ముసలీ ముతకాతో కళకళలాడిన ఊరు ఇప్పుడు వీధులన్నీ బోసిపోయి మరుభూమిలా ఉంది.

అనంతరామయ్య తల్లి జబ్బునపడి మంచంపట్టింది.పిల్లలు పెద్దవాళ్ళయ్యారు.అతని అవసరాలు పెరిగాయి.ఆసుపత్రులకి,మందులకి,బోర్లకి,మోటర్లకి,వాటి రిపేర్లకి తడిసిమోపెడయ్యింది. మునుపటిలా పిల్లలిద్దరినీ చదివించే స్థితిలో లేడు.కూతురు చదువు మానిపించేశాడు.ఖర్చుల కోసం,పంటల కోసం అప్పుచేశాడు.వాటిని తీర్చడానికి రెండెకరాలు అమ్మేశాడు.అలా విత్తుకున్న అప్పు మొక్క,ఏటేటా శాఖోపశాఖలు పరచుకొని కొడుకును కాలేజిలో చేర్పించేనాటికి గాఢంగా వేళ్ళూనిన వటవృక్షంలా రూపాంతరం చెందింది.వాటికి అదనంగా ఇప్పుడు కూతురు పెళ్ళి జతయ్యింది.
నడిసముద్రపు పెనుతుఫానులో చిక్కుకున్న ఒంటరి నావికుడిలా అయిపోయిందతని పరిస్థితి.తుఫాను ఎప్పుడు శాంతిస్తుందో తెలియదు.తీరం ఏవైపుందో తెలియదు.

చేయూతనివ్వడానికి ఎవ్వరూ లేరు.ఎంతకాలమని గుడ్డిగా ఎదురీత ఈదగలడు ?

ఆలోచనలతో అతని మనస్సంతా అతలాకుతలమైపోయింది.

కొడుకుగా,భర్తగా,తండ్రిగా అన్నిరకాలుగా తను విఫలమయ్యాడు.

ఇక మిగిలింది వొక్కటే !

ఆత్మహత్య !!

అతను తనచొక్కాజేబు తడుముకున్నాడు.బస్సెక్కబోతూ టౌనులో కొన్నాడు దాన్ని.అతని చేతికి చల్లగా తగిలింది పురుగులమందు సీసా !

ఒక్కసారి దాన్ని తేరిపార చూశాడు. చీడపురుగుల్ని మట్టుబెట్టడానికి ఉద్దేశించిన ద్రవాన్ని తను త్రాగబోతున్నాడు.తనూ చీడపురుగేనా ? మరి వీళ్ళంతా ఎవరు? మొలకెత్తని విత్తనాలతో మోసం చేసే విదేశీ కంపెనీలు,బ్లాక్ మార్కెట్ కి ఎరువులు తరలించి బ్యాంక్ బాలెన్సులు పెంచుకునే డీలర్లు,అసహాయతను ఆసరా చేసుకొని అధిక వడ్డీలతో పీల్చుకుతినే ఫైనాన్స్ కంపెనీలు,కొనుగోలుదారుడికి,రైతుకి మధ్య సైంధవుల్లా అడ్డుతగిలే దళారులు,పరిశ్రమల పేరుతో వ్యవసాయభూములు కారుచౌకగా కొనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పారిశ్రామికవేత్తలు,ఎగువరాష్ట్రాలు అక్రమంగా నీళ్ళు వాడుకుంటున్నా చోద్యం చూసే రాజకీయనాయకులు,ప్రతి అరగంటకో రైతు బలవన్మరణం చెందుతున్నా సమస్యకు పరిష్కారం కనుక్కోకుండా డబ్బులు విదిలించి వదిలించుకొనే ప్రభుత్వాలు..వీళ్ళనేమనాలి ? కాదు..తను చీడపురుగు కాదు.ఆ మాటకొస్తే రైతనేవాడెవడూ చీడపురుగు కాదు.తామంతా బలిపశువులు.అనుక్షణం దగాపడుతూ,అవమానాల గ్రుక్కిళ్ళు దిగమింగుతూ బ్రతకడం చేతకాని బలిపశువులు.

అతను నిర్వేదంగా నవ్వి మూత తీశాడు !

మొండి ధైర్యంతో సీసాను గొంతులోకి వొంపుకున్నాడు !

మొదట నోరు....తర్వాత గొంతు...భగ్గున మండాయి !

అతను బాధను నొక్కిపట్టాడు.ఇంకెంత కొన్ని నిమిషాలేగా !!


* * *


అనంతరామయ్య ఆత్మహత్య చేసుకున్నాడన్న పిడుగులాంటి వార్తతో ఆ ఊరు తెల్లారింది.శరాఘాతం తగిలిన లేడికూనలా ఆ కుటుంబం నిలువెల్లా వణికిపోయింది.ఒక్కసారిగా వాళ్ళ బ్రతుకులు అంధకారబంధురమైపోయాయి.

తండ్రి శవాన్ని చూడగానే సూర్యం మెదడు మొద్దుబారిపోయింది.
గ్రామస్తుల సాయంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు.రోదనలు మిన్నంటాయి.అనతరామయ్య భార్య దుఃఖంతో సొమ్మసిల్లిపడిపోయింది.
ఆడవాళ్ళు ఆమెకు సపర్యలు చేస్తున్నారు.బంధువులు వొక్కొక్కరుగా వస్తున్నారు.పరామర్శించి వోదారుస్తున్నారు.తమలో ఒకడిగా,తలలో నాలుకలా మెలిగిన అనంతరామయ్యను కడసారిగా చూడ్డానికి చుట్టుప్రక్కల ఊళ్ళనుంచి కూడా తండోపతండాలుగా వస్తున్నారు జనం.అతని విగత శరీరం వొక నగ్నసత్యాన్ని ఆవిష్కరిస్తూ వాళ్ళల్లో భవిష్యత్తుపట్ల భయాందోళనలు రేకెత్తిస్తోంది.

పంచాయితీ పెద్దలకు కబురు వెళ్ళింది.వాళ్ళూ వచ్చారు.రెవిన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే అవకాశాలున్నాయని సూర్యంకు చెప్పారు.అయితే ప్రజాస్వామ్యభారతంలో ప్రతిదానికీ వో రేటున్నట్లే,
ప్రభుత్వాధికారులు,డాక్టర్ల చేతులు తడపడానికీ రేట్లున్నాయని కనీసం ఐదారువేలన్నా అందుకు కావల్సివుంటుందని అనుభవజ్ఞులు కొందరు హెచ్చరించారు.సూర్యంకు అసలు ఆ ప్రతిపాదనే నచ్చలేదు.పోస్టుమార్టం పేరుతో తండ్రి దేహాన్ని ఛిద్రం చేసి,ఆ పై దానికి ' యింత ' అని వెలకట్టడానికి అతనికి మనస్కరించలేదు.

ఈ లోగా విషయం గురవయ్యకు తెలిసింది.అతనితో పాటూ అనంతరామయ్యకు అప్పిచ్చిన మిగతా జనం రెక్కలుకట్టుకొని ఊడిపడ్డారు.ఇటువంటి వ్యవహారాల్లో ఎలా ప్రవర్తించాలో వాళ్ళకు కొట్టిన పిండే.ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని వాళ్ళకు బాగా తెలుసు.ఎప్పటికైనా జరగాల్సిన తతంగమే కాబట్టి పెద్దమనుషులు కొందరు రంగప్రవేశం చేసి సూర్యం ను ప్రక్కకు పిలిపించి మంతనాలు నడిపారు.

అనంతరామయ్యకున్న ఐదెకరాలు తెగనమ్మి అప్పులు తీర్చేలా తీర్మానం చేశారు.కూతురు పెళ్ళికోసం తెచ్చిన డబ్బుకూడా ఆ జాబితాలో కలిసిపోయింది.చివరకు ఆ కుటుంబానికి తలదాచుకోను ఇల్లొక్కటి మిగిలింది.అప్పులవాళ్ళు శాంతించారు.
సూర్యం మస్తిష్కంలో మాత్రం అలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి.

చందాలు పోగయ్యాయి.ఏ మట్టిని నమ్ముకొని,ఎక్కడైతే అసువులు బాశాడో,అక్కడే ఆ సాయంత్రం అనంతరామయ్యకు అంత్యక్రియలు జరిగిపోయాయి.రైతుల పట్ల వివక్ష ప్రభుత్వాలకే కానీ,పంచభూతాలకు కాదన్నట్లుగా అగ్నిదేవుడు అతని దేహాన్ని ఆప్యాయంగా కౌగలించుకొని తనలో ఇముడ్చుకున్నాడు.ఎగసిపడుతున్న ఒక్కో అగ్నిశిఖ వైపు అనిమేషంగా చుస్తూ మనస్సులోనే యిలా ధృఢంగా అనుకున్నాడు సూర్యం.

" బ్రతుకుతెరువు కోసం కొద్దిరోజుల్లో నేను పట్నం వెళ్తున్నాను నాన్నా ! పుట్టినూరిని, కన్నతల్లిని,అక్కని,నానమ్మని..అందరినీ వదలి వెళ్తున్నాను.కడకు స్వంతరాష్ట్రం కూడా విడిచి వెళ్తున్నాను.ఎక్కడికని కదూ నీ ప్రశ్న? బెంగళూరు వెళ్తున్నాను.అక్కడ నా మిత్రులున్నారు.శెలవులలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తూ వేడినీళ్ళకు చన్నీళ్ళు లా తమ చదువుల కోసం డబ్బులు పోగుచేసుకుంటున్నారు.రోజుకి రెండొందల రూపాయులు జీతం.'అయ్యో ! డిగ్రీ చదువుతూ నా బిడ్డ కూలిపని చెయ్యాల్సి వచ్చిందే ' అని కించపడకు నాన్నా.చట్టబద్ధమైన ఏ పనికైనా కష్టపడటంలో తప్పు లేదు.అయినా ఎల్లకాలం కూలీగా ఉండిపోం కదా.స్వంత ఇల్లు తప్ప మనకింకేం మిగల్లేదు.అయినా సరే..నేను భయపడను.నా గుండెల్లో కొండంత ఆత్మవిశ్వాసం ఉంది.సాధించాలన్న కసి ఉంది. త్వరలోనే నేను ప్రయోజకుడినై తిరిగొస్తాను.అక్క పెళ్ళి ఘనంగా చేస్తాను.ఇక్కడే ఉండి వ్యవసాయం చేస్తాను.ఇప్పుడు మనం కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి సంపాదిస్తాను.వ్యవసాయం వొక జూదం కాదని నిరుపిస్తాను.నిరాశా నిస్పృహలతో నీలా ఇంకొకరు ప్రాణాలు తీసుకోకుండా,వాళ్ళకు ప్రేరణలా నిలుస్తాను.నన్ను ఆశీర్వదించు."


తెలుగురత్న లంకె


9 comments

March 13, 2010 at 9:14 AM

really touching,
but who is listening and who comes to the rescue of the poor and innocent farmar

Reply
Anonymous
March 13, 2010 at 10:40 AM

కధ బావుందండీ. రైతు ఆత్మహత్యతో కాక భవిష్యత్తుమీద ఆశ తో కధని ముగించడం బావుంది.
రైతుల కడగండ్లు ఎప్పటికీ తీరేవికాదు. వ్యవసాయం జూదం కాదని నిరూపించడం అంత తేలికైన విషయం కాదేమో ! ఎందుకంటే ప్రకృతిమీద ఆధార పడ్డ రైతుకు ప్రకృతి మీద అజమాయిషీ లేదు కదా . రేపటిమీద ఆశే మనిషికి వుత్తేజాన్నిస్తుంది కాబట్టి వుందిలే మంచి కాలం ముందు ముందునా ......అనుకుందాం .

Reply

@మినబే గారు,

నెనర్లు.ఎవరు పట్టించుకోవటం లేదనే బాధతోనే ఈ కథను వ్రాశాను.ప్రభుత్వాలకి పారిశ్రామీకరణ పట్ల వున్న ఉత్సాహం,వ్యవసాయం పట్ల కొరవడింది.రైతులే దేశానికి పట్టుగొమ్మలు అన్నారు గాంధీ గారు.దురదృష్టవశాత్తు ఆ దృక్పథం మన నేతలకి లేకపోయింది.ఒక రాజకీయ నిరుద్యోగి నిరాహారదీక్ష చేస్తే,రాష్ట్రాన్ని చీల్చడానికి అర్థరాత్రి సిద్ధపడ్డ ప్రభుత్వం,అంతే ప్రేమను ప్రతి అరగంటకూ చనిపోతున్న పేదరైతు ప్రాణం మీద కుడా చూపిస్తే పరిస్థితులు చక్కబడతాయి.

@లలిత గారు,

నెనర్లు.వ్యవసాయం జూదమే అన్న మీమాటతో నేనూ ఏకీభవిస్తున్నాను.కథ చదివిన కొంత మంది సన్నిహితులు కూడా యిదే అనుమానం వెల్లిబుచ్చారు.సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా,ప్రకృతి ఆధిపత్యానికి మానవుడు తలవంచక తప్పదు.కానీ రైతు అన్ని విధాలుగా మోసపోతున్నాడు.కొంత అతని తప్పూ ఉన్నా, అధిక భాగం అతని నియంత్రణలోని విషయాలే అందుకు ప్రధాన కారణం.వాటి పై ఉద్యమించిన రోజే వారికి మహర్దశ .

Reply
March 13, 2010 at 10:35 PM

ఇది కొంచెం aggresive గా అనిపించవచ్చు . ఎవరి నైనా నొప్పిస్తే క్షమించండి .
వ్యవసాయం జూదమై తే మనిషి జీవితమే జూదం కదా

Reply

విశ్వనాథ్ గారు,

నెనర్లు.క్షమాపణలు చెప్పాల్సినంత మాటలు మీరేమీ వాడలేదు.

Reply
March 18, 2010 at 10:22 PM

ఆంధ్ర దేశమంతటా గత పదేళ్ళుగా చర్విత చర్వణమవుతున్న కథే.
కానీ మీ వచనంలో ఏదో శక్తి ఉంది.
"రైతుల పట్ల వివక్ష ప్రభుత్వాలకే కానీ,పంచభూతాలకు కాదన్నట్లుగా అగ్నిదేవుడు అతని దేహాన్ని ఆప్యాయంగా కౌగలించుకొని తనలో ఇముడ్చుకున్నాడు"
ఈ వాక్యం చాలా గొప్పగా ఉంది. మీరేమనుకోనంటే ఒక ఉచిత సలహా.
కేవలం ఒక సంఘటనని కథగా రాసెయ్యడం కాకుండా, జీవితంలోని సంక్లిష్టతని గమనించండి. దాన్ని అక్షరాల్లో పెట్తండి.
అభినందనలు.
మరో సూచన - లేత నీలమ్మీద తెల్ల అక్షరాలు చదవడం కష్టంగా ఉంది. రంగు కానీ, టెంప్లేటు గానీ మార్చి చూడండి.

Reply

కొత్తపాళీ గారు,

థాంక్యూ.అమూల్యమైన సలహాలు ఇచ్చారు.ఆచరణలో పెట్టడానికి కృషి చేస్తాను.

Reply
August 12, 2010 at 3:08 AM

Chala bagundi kadha. Really touching. Meerannattu oka paniki rani rajakeeya nirudyogi chesina nirahadeekshaki kadili maroka neta puttina roju kanuka ga abhivarnistoo rastanni vibhajinchadaniki unna sradda, desaniki pattukommalaina gramalni, aa gramaliki aadharamaina rythula kastalni parishkiramchidamlo ledu.

Reply

హవ్యవాహన గారు,

నా కథ మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు.
అందరూ పనిచేసేవాళ్ళే ఉంటే పంట పండించేవాళ్ళుండరు.అప్పుడు ఆహర ధాన్యాల కోసం కూడా ఇతరదేశాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.ఈ సత్యం మన పాలకులు ఎంత త్వరగా గ్రహిస్తే మనదేశానికి అంత మంచిది.

Reply
Post a Comment