పిల్లలు - రియాలిటి డాన్స్ షోలు
'ఆ
ట ' ప్రోగ్రాం పై ఆఖరుకి వేటు పడింది.టీ.వీ.లో ఆ ప్రోగ్రాం చూడాల్సి వచ్చినప్పుడల్లా ఉష్ట్రపక్షి ఇసుకలో తలదాచేసుకొని శతృవుల బారి నుంచి తప్పించుకున్నట్లు,వేరే రూంలోకి పారిపోయి ఇతర వ్యాపకాల్లో తలమునకలైపొయి నన్ను నేను కాపాడుకొనేవాడిని.ఆ అవసరం ఇప్పుడు తప్పింది.కళ పేరుతో వ్యాపారం చేస్తూ,ఆ కళకే వలువలు నిస్సుగుగా వొలిచేస్తూంటే,వస్త్రదానం చేసి పరువు నిలిపిన శ్రీకృష్ణ పరమాత్ముడిలా జస్టిస్ సుభాషిణ్ రెడ్డి నేతృత్వంలోని మానవహక్కుల కమీషన్ కరుణించి కొరడా ఝళిపించింది.ఈ పోలిక కొంతమందికి అతిశయోక్తిగా అనిపించవచ్చు గానీ దురదృష్టవశాత్తూ ఇది నిజం.

ఒక రకంగా ఈ పరిస్థితికి ఓంకారే బాధ్యుడు.మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా బుల్లితెర జీవితం ప్రారంభించి,అనతికాలంలోనే నిర్మాతగా,ప్రయోక్తగా పలు విజయవంతమైన కార్యక్రమాలు రూపొందించిన ఆయన,మెట్లెక్కే తొందరలో కొన్ని ప్రామాణిక విలువలు గాలికొదిలేశారు.అదే ఇంత రాద్ధాంతానికీ దారి తీసింది.పిల్లల స్పెషల్ గా 'ఆట ' ను ప్లాన్ చేసుకున్నప్పుడు,ప్రైం టైం లో దాన్ని ప్రసారం చేస్తున్నప్పుడు అందులో అసభ్యత,అశ్లీలతకు తావుండకూడదు.కానీ ఓంకార్ ఆ ప్రాథమిక సూత్రం విస్మరించారు.అర్హతలేని వారిని కూడా అందలం ఎక్కించే ప్రయత్నం చేశారు.ముఖ్యంగా మెంటర్లు.మనం మాట్లాడేది కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నారని,కాస్త హుందాగా వ్యవహరించాల్సిన అవసరం చాలా వుందని వాళ్ళకు ఏ కోశానా ఉండదు.ఏది మంచో,ఏది చెడో పిల్లలకు విడమరిచి చెప్పాల్సిన మెంటర్లే చిల్లర మాటలు మాట్లాడుతూ,వెకిలి వేషాలు వేస్తూ,పిచ్చి ఛాలెంజిలు చేసుకుంటూ ఉంటారు.ఆట-4 లో అయితే అచ్చం కుళాయిల దగ్గర ఆడవాళ్ళు తన్నులాటల్లానే ఉండేది.ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన పిల్లలు వాటినే వేమన పద్యాల్లా,సుమతీ శతకాల్లా భావించి వల్లిస్తూంటారు.ఆట-4 లో వయసుకు మించిన మాట్లాడిన గీతిక,ఆట-5 లో ఆ పాపను మించి వల్గర్ డాన్సులు చేసే భువన..ఈ లిస్టు చాల పెద్దది.దానికితోడు కురచ దుస్తులు వేసుకొని,'నన్ను కొరికేయ్ రో,నా వయసు పదహారే,రింగరింగ రింగరింగా రే ' లాంటి పాటలకు డాన్సులు వెయ్యడం.అతిమాటలు మాట్లాడే పిల్లల్ని నాలుగు తగిలించి మంచి మాటలు చెప్పాల్సిన తల్లిదండ్రులు,తమ పిల్లలు ఎవో ఘనకార్యాలు చేసినట్లు నవ్వుకుంటూ చప్పట్లు కొట్టడం ఇంకో విడ్డూరమైన విషయం.ఇటువంటి షోలు చూసే పిల్లల్లో అవి ఎన్ని దుష్పరిణామాలకు దారితీస్తాయో చెప్పనక్కరలేదు.

ఒక్క ఆట మాత్రమే కాదు,నృత్య ప్రధానమైన రియాలిటీ షోస్ అన్నీ దాదపుగా అలానే తగలడ్డాయి.ఓంకారే నిర్వహించే ఛాలెంజ్ (మా టీవీ),నాగరాజ్/ఉదయభాను నిర్వహించే మగధీర (జీ టీవీ) అంతకంటే ఘోరంగా వుంటున్నాయి.మెంటర్లు గా పిలవబడే వ్యక్తులకు,పార్టిసిపెంట్లకు చాలా మందికి స్టేజి మీద ఎలా ప్రవర్తించాలో తెలియనట్లుంది.లేదా పుర్తిగా మరిచిపోతున్నట్లున్నారు.సగం కార్యక్రమం కేకలు,సవాళ్ళూ,ప్రతి సవాళ్ళతోనే నిండిపోతోంది.ఇలా చేస్తే గానీ రియాలిటి అనిపించుకోదనో లేక టీ.ఆర్.పీ రేటింగ్ లు పెరుగుతున్నాయి కాబట్టి మనం చేస్తున్నదని కరక్టే అని భ్రమలో వాళ్ళు ఉన్నారో తెలియదు. ఆమ్మ రాజశేఖర్,నవనీత్ కౌర్ లాంటి జడ్జిలు కొన్ని సందర్భాల్లో శ్రుతి మీరి ఆసభ్యంగా ప్రవర్తించారు.అయితే అవన్నీ యువత ప్రధానంగా పాల్గొనే ప్రోగ్రాములు కాబట్టి 'ఆట ' కు ప్రజాసంఘాల నుంచి వచ్చినంత వ్యతిరేకత వాటికి రాలేదు.కాస్త సంసారపక్షం గా ఉండి,ఇంటిల్లిపాదీ చూడగలిగేలా ఉండే నృత్య ప్రధానమైన కార్యక్రమం ఎదైనా వుంది అంటే అది 'ఢీ' ఒక్కటే.అప్పుడప్పుడు ఉదయభాను కాస్త అతి చేసినా,ఏనాడూ,ఎబ్బెట్టుగా అనిపించలేదు.ఈ విషయం లో మల్లెమాల గారిని,ఈ టీవి యాజమాన్యాన్నీ అభినందించాలి.

ఓంకార్ గారు,ఇతర నిర్వాహకులు కూడా అసభ్యత,ఆశ్లీలతను పక్కన పెట్టి, సృజనాత్మకతకు పెద్దపీట వేసి మళ్ళీ జనరంజకరమైన కార్యక్రమాలు నిర్మించి ప్రజాదరణ పొందాలని ఆశిద్దాం.తమ పిల్లల ప్రగతి ఎదుగుదలని ఓర్వలేని వారే ఇలా అడ్డుకొంటున్నారని భావించే తల్లిదండ్రులు కూడా, పిల్లల మనస్తత్వ నిపుణులోకరు టివీలో చెప్పిన మాటను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.మీ పాపకో,బాబుకో నాట్యం మీద ఆసక్తి వుంటే తప్పకుండా నేర్పించండి.అది కూచిపూడి,భరత నాట్యమే కానవసరం లేదు.కానీ వాళ్ళ చేత ఆశ్లీల నృత్యాలను మాత్రం చేయించకండి.అటువంటి కార్యక్రమాలను మీరు చూస్తూ పరోక్షంగా వారిని ప్రోత్సాహించకండి.ఆశ్లీల నాట్యాల్లో వయసుకు మించిన భావాలు పలికించాల్సి వచ్చినప్పుడు పిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతారు.ఆది అనేక అనర్థాలకు కారణం అవుతుంది.కోరి సమస్యలని తెచ్చుకోవద్దు.'ఆట ' ద్వారానో,మరింకొకటి ద్వారానో కొన్ని నిరుపేద కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియచ్చు.కానీ మీ పిల్లలు ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారో మీరూ అలోచించండి.నేటి బాలలే కదా రేపటి పౌరులు.


13 comments

April 29, 2010 at 4:06 AM

beautiful analysis.

Reply
April 29, 2010 at 10:44 AM

బావుంది, బాగా చెప్పారు

Reply

ఆట కార్యక్రమానికి వెళ్తున్న పిల్లలు నిరు పేద కుటుంబాల నుంచి వచ్చినవాళ్ళు కాదు. వాళ్ళ తల్లులు కట్టుకునే ఖరీదైన చీరలు చూస్తే తెలిసిపోతుంది.

Reply
April 29, 2010 at 4:26 PM

ఆహా చీర చూసి రేంజి చెప్పే శర్మ గారు జిందాబాద్

Reply
April 29, 2010 at 5:17 PM

good write up

Reply
Anonymous
April 29, 2010 at 5:58 PM

మాకు ఈ చానల్ రాదు కాబట్టి ఆట చూడలేదు.
అయినా ఈ ఓంకార్ ఎవరో కాని చాలా ఎగస్ట్రాలు చేస్తాడు.
ఒకసారి మా టి వి లో అదృష్టం అనుకుంటా చూసాను.
అందులో ఈయన యండమూరి ని ట్రీట్ చేసిన విధం చూస్తే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టు ఉంది.
మర్యాదగా ఏంకరింగ్ చేయడం ఎలాగో బాలు లేదా అమితాబ్ నుండి తెలుసుకోవచ్చు.

Reply

కిరణ్ గారు,సౌమ్య గారు,చెరసాల శర్మ గారు,శ్రీనివాస్ గారు,కొత్తపాళీ గారు,బోనగిరి గారు అందరికీ కృతజ్ఞతలు.

@చెరసాల శర్మ గారు,ఆట లో పాల్గొంటున్న వాళ్ళలో చాలమంది నిరుపేదలేనండి.ఒకటే చీరను,సూట్ ని అన్ని షోలకు వేసుకొచ్చిన పిల్లల తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు.

@బోనగిరి గారు ఆ ప్రోగ్రాం పేరు అదృష్టం అనుకుంటా.ప్రజాదరణ కరువై నిలిపేశారు.యండమూరిని బాగానే ట్రీట్ చేశారు లెండి.కాకపొతే కాన్సెప్ట్ ని సరిగ్గా హాండిల్ చెయ్యలేక విఫలమయ్యారు.

Reply
April 29, 2010 at 9:15 PM

చాలా బాగా రాసారు.

Reply

ఆ తల్లితండ్రులు హైకోర్టులో పిటిషన్ వేస్తామంటున్నారు కదా. వాళ్ళకి డబ్బు ఎక్కడిది అని నా డౌట్.

Reply

@ సాయిప్రవీణ్ గారు నెనెర్లు.

@ చెరసాల శర్మ గారు, లాయర్ ఖర్చులు ఓంకార్ పెట్టలేరంటారా?

Reply
May 1, 2010 at 12:51 AM

మీ పోస్ట్ చాలా బాగుందండీ
చెప్పుతో కొట్టారు

>>>వాళ్ళ తల్లులు కట్టుకునే ఖరీదైన చీరలు చూస్తే తెలిసిపోతుంది.

మార్తాండ ఎవర్నీ వదలవా నువ్వు

Reply

హరేకృష్ణ గారు నెనర్లు.

>>చెప్పుతో కొట్టారు

అంత మాటలు ఎందుకులెండి.ఏదో నాకనిపించింది వ్రాశాను.

Reply
June 17, 2011 at 12:21 PM

ilanti vati valla pillalaki participate cheyalane interest kuda pothundandi... idi manalanti vallu ardham chesukunna parents ardham cheskovatledu... TV lo kanipistharu kada anukuntu pampisthu pillalni hurt chesthunnaru...

Very good post... :)

Reply
Post a Comment