నటకిరీటికి నీరాజనం


(జూలై పంతొమ్మిది రాజేంద్రప్రసాద్ జన్మదినం.ఆ సందర్బంగా ఈ వ్యాసం )

వి నేను ఏడవ తరగతి చదివే రోజులు.వారం రోజులుగా మా స్కూల్ చుట్టుప్రక్కల ఒకటే సందడి.'ఏంటా సంగత'ని ఆరా తీస్తే రాజేంద్రప్రసాద్ సినిమా షూటింగ్ అన్నారు మా ఫ్రెండ్స్.స్కూల్ ప్రక్కనే వెస్ట్ రైల్వే స్టేషన్.దానికావల ఒక చర్చ్.ఆ చర్చ్ పరిసరాల్లో సినిమా తీస్తున్నారని చెప్పారు.క్లాస్ లో ఆ చుట్టుప్రక్కల ఇళ్ళల్లో ఉంటున్న పిల్లలు కొంతమందున్నారు. వాళ్ళొచ్చి రోజూ షూటింగ్ కబుర్లు చెబుతూంటే పసందుగా ఉండేది.క్లాస్ రూం కిటికీలోంచి కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కనిపించేది.దాంతో టీచర్లు చెప్పేది బుర్రకెక్కేది కాదు.రాజేంద్రప్రసాద్ అంతే తమాషానా? 'ఆహ నా పెళ్ళంట,వివాహభోజనంబు ' లాంటి భారీ విజయాలతో టాప్ హీరోలతో సమానమైన పాపులారిటీ తెచ్చుకొని,ఇంటిల్లీపాదీలో ఒకడిగా చెలామణీ అయిపోతున్న హీరో.అతని సినిమా వస్తోందంటే టాక్ తో సంబంధం లేకుండా జనం థియేటర్ల దగ్గర బారులు తీరేవాళ్ళు.హీరోగా అతనంటే ఇష్టపడని వాళ్ళు బహుతక్కువని చెప్పోచ్చు.

అప్పట్లో నేను ప్రొద్దున్నే లేచి మా క్లాస్ టీచర్ దగ్గర మాథ్స్ ట్యూషన్ కి వెళ్ళేవాన్ని.ఆవిడ ఉండేది మా స్కూల్ దగ్గరే.ఏడవ తరగతి కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గరపెట్టుకొని కూడా చదివేవాన్ని.ఒకసారి అలా ట్యూషన్ ముగించుకొని సైకిలెక్కి ఇంటిముఖం పట్టబోతూంటే మా మిత్రబృందం ' అలా చర్చ్ వరకు వెళ్ళొద్దాం రా రా ' అన్నారు.'దేనిక'ని అడిగా.'రాజేంద్రప్రసాద్ షూటింగ్ ఉందంట వెళ్ళొద్దాం' అన్నారు.వాళ్ళలో ఒకడు రాజేంద్రప్రసాద్ వీరాభిమాని(అతను నిజంగా రాజేంద్రుడి ఫ్యాన్ కాదేమో అని నేను మొదట అనుమానపడ్డాను.అప్పటిదాకా మేమంతా ఏ చిరంజీవి ఫ్యానో, బాలయ్య ఫ్యానో,నాగార్జున ఫ్యానో,వెంకీ ఫ్యానో అని విన్నవాళ్ళమే గానీ ఇలా వేరైటిగా రాజేంద్రప్రసాద్ ఫ్యాన్ అని చెప్పుకోవటాన్ని వినలేదు.అందరూ రాజేంద్రప్రసాద్ ని అభిమానిస్తారని,అతనికిష్టమైన హీరో వేరొకరుండొచ్చని,చెబితే నవ్వుకుంటామని ఇలా చెప్పాడేమో అనుకున్నాను.నా అభిప్రాయం తప్పని అతను నిజంగానే కేవలం రాజేంద్రప్రసాద్ అభిమానని తర్వాత తెలిసింది).

రాజేంద్రప్రసాద్ పేరు వినగానే నేను ఎగిరి గంతేశాను.అతనంటే నాకూ ఇష్టమే.'ఆహ నా పెళ్ళంట' సన్నివేశాలు ఇంకా మదిలో ఫ్రెష్ గానే ఉన్నాయి.మా సైకిళ్ళు చర్చి వైపు దారి తీసాయి.కాంపౌండ్ లోకి ప్రవేశిస్తూండగా ఒక తెల్లటి అంబాసిడర్ కారు మమ్మల్ని దాటుకుంటూ దూసుకుపోయింది.మా స్నేహితుడొకడు ఆయాసపడుతూ సైకిల్ తొక్కుతూనే 'ఆ కార్లో ఉన్నాడేమో రా' అన్నాడు."నీ మొహం.అది ఎవరి కారో ఏంటో ? అయినా రాజేంద్ర ప్రసాద్ ఈ కార్లో ఎందుకొస్తాడు ?" అన్నాడు వీరాభిమాని.
మొదటివాడు మాత్రం ఊరుకోలేదు.అందులో ఉన్నది రాజేంద్రప్రసాదే అని నిర్ణయానికి వచ్చేశాడు.మేము వారించేలోగా 'ఒరేయ్ రాజేంద్రా' అని అరిచేశాడు గట్టిగా .

అంతే ! ముందు వెళ్తున్న కారు కిటికీలోంచి రాజేంద్రప్రసాద్ తల బయట పెట్టి చూట్టం...నవ్వుతూ మమ్మల్ని రమ్మని సైగ చెయ్యటం జరిగిపోయాయి.

మాకు ఒక్కక్షణం మతి పొయ్యింది.'ఒరేయ్ గిరేయ్' అని వాగినందుకు మమ్మల్ని తిడుతారేమో అనుకున్నాం.మర్యాద లేకుండా మాట్లాడినందుకు మా స్నేహితుడి మీద కోపం వచ్చింది.అభిమాన హీరోని చూడబోతున్న ఆనందం ఒకవైపు, మందలిస్తారేమో అన్న భయం ఒక వైపు.సైకిళ్ళు నిలబెట్టి అలానే షూటింగ్ స్పాట్ కి వెళ్ళాం.

ఆ రోజు షూటింగ్ ఇంకా మొదలవలేదు.విశాలమైన చెట్ల నీడలో కొన్ని టేబుళ్ళు,వాటి మీద ఏవో కొన్ని గిన్నెలు,చుట్టూ కొన్ని కుర్చీలు అమర్చబడి ఉన్నాయి.మల్లెపువ్వు లాంటి తెల్లటి పొడుగు చేతుల షర్టు,పంచె కట్టుకొని ఓ కుర్చీ వైపు వెళ్తూ 'రండి పిల్లలు టిఫన్ చేద్దురు గానీ' అన్నారు రాజేంద్రప్రసాద్ చిరునవ్వుతో.సినిమా వాళ్ళలో ఒకతను 'ఒరేయ్ అంటారా' అని మమ్మల్నేదో అనబోయాడు.రాజేంద్రప్రసాద్ అతన్ని వారించి 'వాళ్ళంతా నా ఫ్యాన్సయ్యా' అన్నారు.

మాకు చాలా సంతోషం వేసింది.తనొక పెద్ద ఆర్టిస్టనే అహంభావం లేదు.నవ్వుతూ సరదాగా ఉండే మనిషి.'వద్దు సార్ ' అన్జెప్పి నోటుపుస్తకాల్లో ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ లు తీసుకున్నాం.
ఆటోగ్రాఫ్లిస్తూండగా తెల్ల చీర కట్టుకొని ఒక అమ్మాయొచ్చింది.పరిచయం ఉన్న మొహంలా కనిపించలేదు.అప్పటికి మాకెవరికీ సితార,జ్యోతిచిత్ర లాంటి పత్రికలు చదివే అలవాటు లేదు కాబట్టి ఆమెవరో తెలియలేదు.ఆవిడే కాదు,ఒక్క రాజేంద్రప్రసాద్ తప్పితే అక్కడ ఉన్న మిగతా సినిమాజనంలో ఎవరు ఆర్టిస్టులో,ఎవరు అసిస్టెంట్లో తెలియదు.ఆటోగ్రాఫ్ పొందిన ఆనందంతో మా ఛాతీలు ఉప్పొంగాయి.మేం వచ్చేశాం.

తర్వాత ఆ సినిమా షూటింగ్ చాలా సార్లు చూశాను.కొన్ని నెలల తేడాతో విడుదలైన ఆ సినిమా మంచి విజయాన్నే దక్కించుకొంది.

ఆ సినిమా 'చెట్టు కింద ప్లీడరు'.
ఆ అమ్మాయి హీరోయిన్ 'కిన్నెర'.

రాజేంద్రప్రసాద్ ని ఆ తర్వాత చాలాసార్లు చుశాను.'సీతాపతి ఛలో తిరుపతి ' సినిమా అయితే మా ఇంటిదగ్గరే తీశారు. వాణీవిశ్వనాథ్ ని చూడ్డానికి జనం ఎగబడ్డారు.మా నాన్నగారు ఆ సినిమాలో ఒక వేషం వెయ్యాల్సింది.కలెక్టర్ ప్రోగ్రాం ఉండటంతో కుదర్లేదు.

'స్నేహం' సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టిన రాజేంద్రప్రసాద్, తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు.వంశీ,జంధ్యాల,బాపు,రేలంగి నరసింహారావు,ఎస్వీ కృష్ణారెడ్డి,ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేషన్లలో ఎన్నో మరపురాని హిట్సందించారు.'ఏప్రిల్ 1 విడుదల(ఈ సినిమా పోస్టర్ చూసి,రిలీజ్ డేటేదో,సినిమా పేరేదో తెలుసుకోలేక తికమకపడ్డాను),ఆ ఒక్కటీ అడక్కు,

పెళ్ళిపుస్తకం,మిస్టర్ పెళ్ళాం,బృందావనం, మేడం,అప్పుల అప్పారావు,ఆలీబాబా అరడజను దొంగలు,కొబ్బరిబొండాం,రాజేంద్రుడు గజేంద్రుడు,మాయలోడు ' ఇలా బోల్డన్ని.ఒకవైపు కామెడీ హీరోగా ఏకచ్ఛత్త్రాదిపత్యం వహిస్తూనే 'ప్రేమతపస్సు', 'ఎర్రమందారం' లాంటి సినిమాల్లో నటించి తన నటనకు రెండు వైపులా పదునుందని నిరూపించుకున్నారు.పాత్ర ఏదైనా పండించగల ఆల్ రౌండర్ అనిపించుకున్నారు. పాటలు పాడి,కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా చేశారు.కొన్ని పొరపాట్లు చేసి అప్రధాన్య పాత్రలు సైతం వేశారు( శ్రీకాంత్ 'తాళి ',జగపతిబాబు 'చిలక్కొట్టుడు' లాంటివి).1996 నుంచి అనుకుంటాను ఆయన సినిమాలు వరుసగా పరాజయాల బాట పట్టినప్పుడు నేను చాలా బాధపడ్డాను.ఇటువంటి టాలెంటెడ్ హీరోని జనం మిస్సవ్వకూడదు అనుకున్నాను.అంతలో 'క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ' వచ్చింది.ఆ టైపు సినిమాలు కొన్ని వరుసగా వచ్చి(శ్రీరామచంద్రులు,సందడే సందడి)విజయం సాధించాయి.మళ్ళీ అపజయాలు.ఆ క్రమంలో కొంతగ్యాప్ తరువాత వచ్చిన ' ఆ నలుగురు ' మళ్ళీ నటకిరీటిని సత్తాని చాటింది.'మీ శ్రేయోభిలాషి ' కూడా మంచి ప్రయత్నమే.'క్విక్ గన్ మురుగన్' పర్లేదనిపించింది.

అందం,నటన రెండూ ఉండి దాదాపు ఒక దశాబ్దం పాటు(1985 లేడీస్ టైలర్ to 1996 వద్దు బావా తప్పు వరకు ) తిరుగులేని కామెడీహీరోగా వెలుగొందిన ఏకైక తెలుగు కథానాయకుడు రాజేంద్రప్రసాద్.మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు సైతం మానసికోల్లాసానికి ఆయన సినిమాలు చూసేవారంటే అంతకు మించిన అవార్డులు,రివార్డు ఏముంటాయి.రాజేంద్రప్రసాద్ ను పూర్తిస్థాయిలో రిప్లేస్ చేయ్యగల నటుడు ఇంకా తెలుగుసినీరంగానికి దొరకలేదు.భగవంతుడు ఆయనకు చిరాయువునిచ్చి మరిన్ని మంచి చిత్రాలలో నటింపజేసి మనల్నందరినీ అలరింపజెయ్యాలని ఆశిస్తూ...

ఒక అభిమాని.


(కొన్ని హాస్యసన్నివేశాలు)


2 comments

July 15, 2010 at 5:34 PM

నాకూ రాజేంద్రప్రసాద్ అంటే చాలా ఇష్టమండీ! చిన్నప్పుడు పెద్దగా సినిమాలు చూసింది లేదు గానీ, పెద్దయ్యాక అప్పటి సినిమాలు కూడా అన్నీ చూస్తున్నాను. నాకెప్పుడైనా విసుగ్గా గానీ, డల్ గా గానీ అనిపిస్తే వెంటనే రాజేంద్రప్రసాద్ సినిమా చూసేస్తాను. అప్పుల అప్పారావు, అహనా పెళ్ళంట, రెండు రెళ్ళ ఆరు, చిన్నోడు పెద్దోడు, పేకాట పాపారావు, ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, లేడీస్ టైలర్... ఒకటని కాదు.. రాజేంద్రప్రసాద్ ఉంటే చాలు ఎలాంటి సినిమా అయినా చూసేస్తా నేను. :) మా తమ్ముడి పుట్టినరోజు కూడా ఆ రోజే అవడం వల్ల నేను రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు ఎప్పుడూ మర్చిపోను :) మీరెంత లక్కీనో రాజేంద్రప్రసాద్ ని చూసేసి ఆటోగ్రాఫ్ కూడా సంపాదించారు. మీ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి. మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
Happy Birthday to నటకిరీటి :)

Reply

మధురవాణి గారు, మీ తమ్ముడికి కూడా జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్ గా.

Reply
Post a Comment