భూదేవికి విష్ణువిచ్చిన వరాలు, బలరాముని లీలలు ఇతర భాగవత విశేషాలు.

ఇంకొన్ని భాగవత విశేషాలు.
  1. 1.   త్రివిక్రముడైన వామనమూర్తి పాదాలను బ్రహ్మ తన కమండలంలోని నీళ్ళతో కడుగగా ఉద్భవించినదే గంగానది.

  2. 2.   విశ్వరూపున్ని చంపిన ఇంద్రుడుకి బ్రహ్మహత్యామహాపాతకం చుట్టుకుంటుంది. ఆ పాపాన్ని భూమి, వృక్షాలు, నీరు, స్త్రీలు పంచుకుంటారు. అందుకే భూమ్మీద కొంతభాగం ఎడారిగా నిర్మానుష్యంగా ఉంటుంది. వృక్షాలు స్రవించే ద్రవాలను (కల్లు వగైరా) త్రాగరాదని, బుడగలు నురగతో నిండిన నీరు నిరుపయోగమని, ఋతుమతియైన స్త్రీలని అంటరాదని పెద్దలు చెబుతారు. తన పాపాన్ని పంచుకున్నందుకు ప్రతిగా ఇంద్రుడు, త్రవ్విన ప్రతి గుంత తనంతట తనే పూడుకుపోతుందని భూమికి, కొమ్మలు నరికేసినా మళ్ళీ చివురిస్తాయని వృక్షాలకు, కలిసిన ప్రతి వస్తువు పెరుగుతుందని నీటీకి, అపరిమితమైన క్రీడాసక్తిని కలిగి ఉంటారని స్త్రీలకు వరాలిస్తాడు.

  3. 3.   వృత్తాసురుడు పూర్వజన్మలో చిత్రకేతుడనే రాజు. విష్ణుభక్తుడైన ఆయన, ఒకనాడు దివ్యవిమానంలో లోకాలన్నీ సంచరిస్తూ, కైలాసంలో ప్రమదగణాలన్నీ పరివేష్టించి ఉండగా సతీదేవిని ఆలింగనం చేసుకున్న పరమశివున్ని చూసి విరగబడి నవ్వుతాడు. సతీదేవి ఆగ్రహించి అతన్ని అసురుడవై పుట్టమని శపిస్తుంది.


  1. 4.   ఇక్ష్వాపు వంశీయుడైన యువనాశ్వుడనే మహారాజు సంతానప్రాప్తి కోసం ఇంద్రుని గూర్చి యజ్ఞం చేస్తాడు. యజ్ఞం పరిసమాప్తమయ్యాక మంత్రించిన పుణ్యజలాన్ని ప్రమాదవశాత్తూ మింగి గర్భం దాలుస్తాడు. అతని ఉదరం చీల్చుకొని పుట్టినవాడే మాంధాత. పుట్టగానే గ్రుక్కపట్టి ఏడ్చిన ఇతనికి ఇంద్రుడే స్వయంగా అమృతం తినిపిస్తాడు. మాంధాత షట్చక్రవర్తులలో ఒకడు.

  2. 5.   అత్రి మహర్షి ఆనందబాష్పముల నుండి ఉద్భవించినవాడు చంద్రుడు.

  3. 6.   చంద్రవంశానికి ఆద్యుడు పూరూరవుడు.ఇతను ఇళ-బుధు (గ్రహం) ల  కుమారుడు.సూర్యవంశపు మూలపురుషుడైన శ్రాద్ధదేవుని కూతురు ఇళ. ఆమెను వశిష్టుడు తపోశక్తితో పురుషునిగా మార్చి సుద్యుమ్నుడని నామకరణం చేస్తాడు. సుద్యుమ్నుడు ఒకనాడు వేటకు వెళ్ళి నిషిద్ధప్రాంతంలో కాలుమ్రోపి శాపవశాత్తూ మళ్ళీ స్త్రీగా మారిపోతాడు. వశిష్టుని ప్రార్థనకు  పరమశివుడు కరిగిపోయి సుద్యుమ్నుడు ఒక నెల స్త్రీగా మరొకనెల పురుషునిగా బ్రతుకుతూ  జీవితం కొనసాగిస్తాడని వరమిస్తాడు.అలా సుద్యుమ్నుడు స్త్రీగా ఉన్న సమయంలోనే చంద్రుని కుమారుడైన బుధునితో కలిసి పురూరవునికి జన్మనిస్తాడు.

  4. 7.   ప్రజాపతి ద్రోణుడు, ఆయన భార్య ధర, బ్రహ్మ అజ్ఞానుసారం నందుడు,యశోదగా జన్మిస్తారు.

  5. 8.   ఉగ్రసేన మహారాజు భార్య, సఖులతో కలిసి వనవిహారం చేస్తూంటే  ద్రమిళుడనే గంధర్వుడు ఆమెను చూసి మోహిస్తాడు.ఉగ్రసేనుడి రూపం ధరించి ఆమెను ఏకాంతంలో కలుసుకుంటాడు.ఆమె గర్భవతౌవుతుంది. ఆలస్యంగా విషయం తెలుసుకొని కోపంతో, తనకు పుట్టబొయే బిడ్డ రాక్షసుడవుతాడని శపిస్తుంది. ద్రమిళుడు, ఆ బిడ్డ తనవారి చేతనే ద్వేషింపబడుతాడని  ప్రతిశాపం యిస్తాడు.అలా పుట్టినవాడే కంసుడు. ఈ రహస్యాన్ని నారద మహర్షి అతనికి తెలియజేస్తాడు.

  6. 9.   వసుదేవునికి దేవకి కాకుండా ఇంకో ఆర్గురు భార్యలున్నారు. వారిలో రోహిణి ఒకతె. దేవకీదేవి గర్భాన ఏడవ కుమారుడిగా జన్మించిన బలరామున్ని విష్ణువు రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెడ్తాడు. అలాగే వసుదేవునికి ఐదుగురు అక్కచెళ్ళెళ్ళు. వారిలో కుంతీదేవి ఒకతె. ఆమె శ్రీకృష్ణునికి స్వయానా మేనత్త.

  7. 10.   ఏడేళ్ళ వయసులో ఏడు రోజుల పాటూ  గోవర్ధనగిరిని తన చిటికెనవ్రేలి పై మోస్తాడు బాలకృష్ణుడు. అలా గోవులను కాచినందుకే 'గోవిందు'డౌతాడు.

  1. 11.   కుబేరుడు మెల్లకన్ను కలవాడు. పార్వతిదేవి సౌందర్యం చూసి క్షణకాలం మనస్సు చలించటంతో మెల్లకన్ను పొందుతాడు.

  2. 12.   నలకూబర, మణిగ్రీవులు కుబేరుని పుత్రులు. గంధర్వకాంతలతో కలిసి మధువు సేవిస్తూ వివస్త్రులై ఒళ్ళుపై తెలియకుండా ఆకాశగంగలో స్నానం చేస్తూంటే, ఆ దారెంట వెళ్తున్న నారద మహర్షి కనిపిస్తాడు. గంధర్వ స్త్రీలంతా హడావుడిగా బట్టలు కట్టుకొని ఆయనకు భయభక్తులతో నమస్కరిస్తే, వీరిద్దరూ గర్వాంధకారంతో ఏమీ పట్టనట్లు దిసమొలతో నిలబడి, మిన్నకుండిపోతారు. నారదుడు ఆగ్రహించి వారిని వంద దివ్య సంవత్సరాలపాటూ మద్దిచెట్లై పడుండమని శపిస్తాడు. కృష్ణావతారంలో భగవంతుడు నడుముకి రోకలి కట్టుకొని ఈ మద్దిచేట్ల మధ్యలోనే వెళ్ళి వాటిని పడద్రోసి వారికి శాపవిమోచనం కలిగిస్తాడు.

  3. 13.   బృందావనంలోని యమునా నదిలో సౌభరి అనే ఋషి నిలబడి గొప్ప తపస్సు చేసుకునేవాడు. ఆ నదిలోని ఒక మగచేపను ఒక గ్రద్ద చంపి తినటంతో చేపలన్నీ వెళ్ళి మునితో తమ బాధను చెప్పుకుంటాయి. ఆయన జాలిపడి, గరుత్మంతుడితో సహా ఏ పక్షైనా మరోసారి ఇటువైపు వస్తే మరణం తధ్యమని శపిస్తాడు.

  4. 14.   రమణక ద్వీపంలో నివసించే పాములకు గరుత్మంతుడికీ మధ్య ఒక ఒప్పందం ఉంది. గరుత్మంతుడు పాములనన్నిటినీ ఇష్టం వచ్చినట్లు ఆరగించకుండా నెల నెలా ఒక కుటుంబం పెట్టే బలి ఆహారాన్ని మాత్రమే పుచ్చుకోవాలని ఒడంబడిక చేసుకుంటారు. తన వంతు వచ్చినప్పుడు కాళీయుడు ఆ ఒప్పందాన్ని ధిక్కరించి విషం క్రక్కుతూ గరుత్మంతుడిపై దాడి చేస్తాడు. ఆయన దాన్ని తరుముకుంటూ వెళ్తాడు. కాళీయుడు భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోకాలన్నితిరిగి తిరిగీ చివరకి అధోలోకాలకి వెళ్ళి అనంతుడి కాళ్ళపై పడితే, ఆయన బృందావనంలోని యమునా నదిలో దాక్కుంటే గరుత్మంతుడు ఏమీ చెయ్యలేడని సలహా ఇస్తాడు.అలా కాళీయుడు యమునానది చేరుకొని తన మహోగ్ర విషంతో అందులోని జీవజాలాన్ని నాశనం చేసి స్థిర నివాసం ఏర్పరుచుకుంటాడు. కృష్ణుడు అతని పీచమణచి, తిరిగి రమణకద్వీపం వెళ్ళిపొమ్మని, తలపై తన పాదముద్రలున్నాయి కనుక గరుడుడు ఏమీ చెయ్యడని అభయమిస్తాడు.

  5. 15.   రామావతారంలో గర్భవతియైన సీతమ్మను పరిత్యజించటానికి ప్రధానకారణమైన చాకలివాడిని కృష్ణావతారంలో అంతమొందిస్తాడు మహావిష్ణువు. గతజన్మ వాసనలవల్ల ద్వాపరయుగంలో కూడా చాకలిగా జన్మించిన అతను, కంసుని దగ్గర సేవకుడిగా పనిచేస్తూ బ్రతుకు వెళ్ళదీస్తుంటాడు. ధనుర్యాగం కోసం మధురానగరం వచ్చిన బలరామకృష్ణులు, వీధులలో కలయతిరుగుతూ కంసుని పట్టువస్త్రాలు మోసుకెళ్తున్న అతన్ని చూస్తారు. అతని వద్దనున్న మూటలోంచి కొన్ని పట్టువస్త్రాలు తమకూ కట్టుకోవటానికి ఇవ్వమని అడుగుతారు. చాకలివాడు ఆ బట్టలు ఇవ్వకపోగా 'పాలు పెరుగుతిని క్రొవ్వుతో కొట్టుకుంటున్న గొల్లవార' ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో, యుగాలు మారినా ఇతని ఆలోచనా ధోరణి మారలేదని గ్రహించిన కృష్ణుడు ఒక్క పిడికిలిపోటుతో అతన్ని యమపురికి పంపిస్తాడు.

  6. 16.   పంచజనుడనే రాక్షసుని శరీరం నుండి పుట్టినదే పాంచజన్యమనే శంఖం.గురువైన సాందీపుని కుమారున్ని అన్వేషిస్తూ వెళ్ళిన కృష్ణుడు ఆ రాక్షసుని చంపి శంఖాన్ని తీసుకుంటాడు.

  7. 17.   వరాహమూర్తిగా ఉన్నకాలంలో మహావిష్ణువు భూదేవికి పలు వరాలిస్తాడు.భూమిపుజ అలా వచ్చిన వరమే.అలాగే పుస్తకం నేల మీద పెడితే చదువు సిద్ధించకూడదని, శంఖం నేల మీద పెడితే మంగళం జరుగరాదని, తులసిని పువ్వులని నేల మీద పెడితే దేవతలు వారి ఇంట పూజలు స్వీకరించరాదని, శివలింగం నేలపెట్టిన ఇంట దేవతలు నివసించరాదని భూదేవి వరాలు కోరుతుంది.

  8. 18.   నరకాసురుని భార్య పేరు చతుర్దశి.

  9. 19.   నరకాసురుడు చెరపట్టిన 16100 మంది కన్యలను 16100 రూపాలతో ఏకకాలంలో వివాహం చేసుకుంటాడు కృష్ణ పరమాత్ముడు.ప్రతి భార్యతోను 10 మంది పిల్లలు కలిగారు. వీళ్ళ పిల్లలు, మనవళ్ళకు చదువు చెప్పడానికి నియమించిన గురువుల సంఖ్య మూడు కోట్ల ఎనభైవేల ఒక వంద.

  10. 20.   రుక్మిణిదేవి అన్న రుక్మిని బలరాముడు చంపేస్తాడు. పాచికలాడి పలుమార్లు బలరామున్ని ఓడించి  పకపకా నవ్వుతాడు రుక్మి. బలరాముడు పట్టుదలగా ఆడి గెలిచినా ఒప్పుకోక, ' గొల్లవార' ని అవహేళన చెయ్యటంతో ఆయన ఆగ్రహించి అతన్ని పరలోకం పంపిస్తాడు.

  11. 21.   మన్మథుడు ఒక్క రతీదేవికి తప్ప మిగతా వారెవ్వరికీ కనిపించడు.అతను అనంగుడు.

  12. 22.   బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. వాళ్ళలో పెద్దవాడు శివభక్తుడైన బాణాసురుడు.

  13. 23.   ద్వివిదుడు నరకాసురుని మిత్రుడు.ఇతను వానరరాజైన సుగ్రీవుని మంత్రి మైందుని తమ్ముడు. అయినా యుగప్రభావం వల్ల తన మిత్రుని చంపిన కృష్ణుడిపై పగబట్టి యాదవ గ్రామాలను, నగరాలను ధ్వంసం చేస్తాడు. రైవతక పర్వతం పైనున్న బలరాముడు కొంతసేపు ఉపేక్షించి ఇక లాభం లేదని అతన్ని సంహరిస్తాడు


  1. 24.   జాంబవతి-కృష్ణుల కొడుకు సాంబుడు. అతను దుర్యోధనుడి కూతురైన లక్షణ స్వయంవరానికి వెళ్ళి ఆమెను బలవంతంగా తీసుకువెళ్తూంటే కౌరవులంతా దాడి చేస్తారు. అతని శౌర్యప్రతాపాగ్నికి తట్టుకోలేక అందరు చుట్టిముట్టి, కట్టడి చేసి బంధిస్తారు. శాంతిప్రియుడైన బలరాముడు కృష్ణుడికి నచ్చజెప్పి హస్తినాపురం వెళ్ళి వారిని వదిలేయమని హితుల ద్వారా చెప్పి పంపిస్తాడు. దుర్యోధనుడు పెడచెవిన పెడతాడు. బలరాముడు ఆగ్రహించి,' హస్తినాపురాన్ని యమునా నదిలో కలిపేస్తా' నని తన నాగలి భూమిలో గ్రుచ్చి నగరం మొత్తాన్ని పైకి లేపేసరికి అందరూ హాహాకారాలు చేస్తారు. దుర్యోధనుడు కాళ్ళబేరానికొచ్చి యువదంపతులను విడిచిపెడతాడు.


1 comment

astrojoyd గారు థాంక్యూ

Reply
Post a Comment