కోట్లు ఖర్చుపెట్టినా పసలేని సినిమాలుకొన్ని సినిమాలు ఆరంభం నుంచే ఊరిస్తూంటాయి.హీరో హీరోయిన్ల కాంబినేషన్ వల్లనో,హీరో దర్శకుల అరుదైన కలయిక కారణంగానో,ఒక ప్రతిష్ఠాత్మకమైన బేనర్ నిర్మించే చిత్రం కావటం వల్లనో,లేక ఒక హిట్ కాంబినేషన్ రిపీటవ్వడం మూలానో ఎక్కడలేని క్రేజ్ ఏర్పడుతుంది.షూటింగ్ స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొట్టిన దగ్గర్నుంచి చిత్రీకరణ పూర్తయ్యి గుమ్మడికాయ కొట్టి విడుదలయ్యే నాటి వరకు ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తారు.దానికి తగ్గట్టు 'ఈ సినిమాలో హీరోని ఎవ్వరూ ఊహించని విధంగా చూపిస్తున్నాం,ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్,ప్రసిద్ధ కెమెరామెన్,సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నారు, సినిమాని అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నాం,ఇన్ని సెట్స్ వేశాం,ఎవరూ చూడని ప్రదేశాలు చూపిస్తున్నాం,ఇన్ని కోట్లు ఖర్చుపెట్టాం, క్వాలిటీ విషయంలో  రాజీపడకుండా నిర్మిస్తున్నాం' అని విడుదలకు ముందు సదరు నిర్మాతలు చెవినిల్లు కట్టుకొని పోరుపెడతారు.నిజమే కాబోలని నమ్మేసి ముందూ వెనక ఆలోచించకుండా డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున డబ్బులు చెల్లించి హక్కులు కొంటారు.వేలకు వేలు తగలేసి అభిమానులు బేనర్లు కటౌట్లు పెడతారు.ఉత్సాహంతో ర్యాలీలు చేస్తారు. పిచ్చి ముదిరి పాకాన పడిన ఇంకొంతమంది రిలీజ్‌కు ముందే 'మా సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది,ఈ రికార్డ్ బ్రేక్ చేస్తుందని' పందేలు వేసుకుంటారు.

సినిమా రిలీజవుతుంది.
కథ ఉండదు,కథ ఉంటే లాజిక్ ఉండదు,రెండూ ఉన్నా కథనం ఉండదు.

సినిమా బాక్సాఫీసు దగ్గర చతికిలపడుతుంది.
పరువుపోయిందని అభిమానులు బూతులు తిట్టుకుంటూ మొహాలు వేళ్ళాడదీసుకొని బయటికివస్తారు.
తెచ్చిన అప్పు,కట్టాల్సిన వడ్డీ తలుచుకోని డిస్ట్రిబ్యూటరు బావురుమంటాడు.

దీనికంతటికీ కారణం ఎవరు?

అనుభవజ్ఞుడైన శిల్పి ఒక విగ్రహాన్ని దీక్షగా చెక్కినట్టు తెగ బిల్డప్పిచ్చి చివరకు తలతోకా లేని సినిమాను తీసిన దర్శకుడిదా?
గుడ్డిగా అతన్ని నమ్మి డబ్బుని మంచినీళ్ళలా ఖర్చుపెట్టిన నిర్మాతదా?
ఫైట్లు,డాన్సుల మీద ఉన్న ఇంటరెస్టు, కథ మీద లేని హీరోలదా ?

ఉదాహరణకు ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు తీసుకుందాం.పవన్‌కళ్యాణ్  నటించిన ' కొమరం పులి ' సినిమా దాదాపు రెండేళ్ళపాటు నిర్మాణం జరుపుకొని ఆ మధ్యే రిలీజయ్యింది.ఈ సినిమాని చూసిన ప్రేక్షకుడికెవరికైనా ఇంత నాసిరకం సినిమాకి అన్నేళ్ళు అన్ని కోట్లు ఎందుకు ఖర్చుపెట్టారో ఒక పట్టాన అర్థం కాదు.కథ లేదు,ఉన్న లైన్ కుడా బాగా నలిగిపోయిన కథ.పోనీ అదే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారా అంటే అదీ లేదు.బ్యాంకాక్ లో సన్నివేశాలు చిత్రీకరించి వాటిని హైదరాబాద్ కి ఆపాదిస్తాడు దర్శకుడు.ఇక హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యటానికి సృష్టించిన పోరాటాలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

మహేష్ ' ఖలేజా ' కుడా అంతే. మూడేళ్ళ తర్వాత వచ్చిన ఈ చిత్రంలో కాస్త కథ ఉన్నా,దాని మీద కసరత్తు చెయ్యకుండా తన ట్రేడ్ మార్క్ కామెడీ  మీద దృష్టిపెట్టాడు దర్శకుడు.పాటలు వీక్.వినడానికి బావున్న కొన్ని పాటలు, చిత్రీకరణలో అంతంతమాత్రం. సమయం సందర్భం లేకుండా వచ్చిపోతూంటాయి.దానికి తోడు కథకు సంబంధం లేని టైటిల్. ' కొమరం పులి ' కి 42కోట్లు ఖర్చైతే, ' ఖలేజా ' కి 50కోట్ల బడ్జెటయ్యిందనీ నిర్మాత సెలవిచ్చారు. ' వరుడు 'లో ఐదురోజుల పెళ్ళి విశిష్టత గురుంచి చెప్పాలనుకున్న గుణశేఖర్, కేవలం ఆ పెళ్ళి, ఆ సెట్టింగు మీదే మనస్సుపెట్టటంతో సినిమా ఘోరపరాజయం పాలై అల్లు అర్జున్ కి షాక్‌నిచ్చింది. ఈ చిత్రానికైన ఖర్చు 31 కోట్లని ఒక రూమరు. ఈ సొమ్ములో ఒక్కశాతం ఇచ్చినా ఇంతకంటే మంచి కథలు అందించేవాళ్ళు మన వర్ధమాన రచయితలు. అంత ఓపిక లేదు. ఈ స్పీడుయుగంలో ఎంత త్వరగా నాలుగురాళ్ళు వెనకేసుకుంటే అంత గొప్ప కాబట్టి హడావుడిగా సినిమా ప్రారంభిస్తారు. చివరకి ఏం తియ్యాలో తెలియక, తీసినవాటిని మార్చి ,మార్చిన వాటిని మళ్ళీ తీసి, ఇలా ఏళ్ళు గడిపి చివరకి ఏదో అయ్యిందనిపిస్తారు. దాని ఫలితం కూడా అలానే ఉంటుంది.

ఈ వ్యాధి ఒక్క మన తెలుగు దర్శక నిర్మాతలకే కాదు మణిరత్నం లాంటి లబ్ధప్రతిష్టులైన దర్శకులకి ఉంది. ఒక సాదాసీదా కథకి రామాయణన్ని, ముఖ్యంగా అందులో రావణుడి వ్యక్తిత్వాన్ని విశ్లేషించే యత్నం చేసినట్లు ప్రొజెక్ట్ చేసి కుతూహలం పెంచారు. ఈ సినిమా బడ్జెట్ 55 కోట్లు. ప్రధాన పాత్రధారుల నటన, ఫోటోగ్రఫీ, సంగీతం బావున్నా, కథ తేలిపోవటంతో ఈ సినిమా బోల్తాపడింది. ఈ విషయంలో శంకర్‌కి కూడా మినహాయింపేమీ లేదు. 150 కోట్లు(అనధికారిక అంచనా 200 కోట్ల పైనే) ఖర్చుపెట్టి తీసిన ఈ సినిమాలో కథ అంతంతమాత్రమే. ఇదే కాన్సెప్ట్ తో కన్నడలో ఉపేంద్ర ' హాలీవుడ్ ' అనే చిత్రాన్ని తీసాడు చాలా కాలం క్రితం. అది గొప్ప ఫెయిల్యూర్‌గా మిగిలిపోయింది. అదే కథకి కాస్త టెక్నాలజీనీ జోడించి శంకర్ మళ్ళీ  ప్రేక్షకుల మీదకు వదిలాడు. చిత్ర కథానాయకుడు రజనీ కావటం,కొన్ని గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండటంతో సినిమా కాస్త బయటపడింది కానీ లేకుంటే డిస్ట్రిబ్యూటర్లు మసైపోయేవాళ్ళు.(తమిళ సోదరులు ఎంత గింజుకున్నా రోబో తెలుగులో 20 కోట్లకు మించి చెయ్యదని ట్రేడ్ పండితుల అంచనా.ఒక డబ్బింగ్ చిత్రం అంత వసూలు చెయ్యటం గొప్ప విషయమే కానీ,దాన్ని కొన్నది 30 కోట్లకు.కాబట్టి నష్టం తప్పదు).

ఏతావాతా చెప్పోచ్చేదేమిటంటే సినిమాకు కథ ముఖ్యం.

కథనం ఊపిరైతే కథ శరీరం లాంటిది.
 

ఈ రెండూ లేకుండా  సరిగ్గా లేనప్పుడు మిగతా ఎన్ని హంగులు,ఆర్భాటాలు ఉన్నా సినిమాని రక్షించలేవు.ఈ విషయం మన దర్శక,నిర్మాతలు ఇప్పటికైనా గ్రహిస్తే భవిష్యత్తులో ఇలాంటి కాస్ట్లీ మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ జరగవు.లేకపొతే తెలుగు సినిమా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.8 comments

Anonymous
October 10, 2010 at 3:56 AM

ఏమిటో ..

రెండు రోజులు కాకుండానే ఖలేజాను కలిపేసారా ?

కాస్ట్లీ మిస్టేక్స్ వలన మీకు కలిగే నష్టం ఏమిటి ?

Reply
October 10, 2010 at 7:41 AM

ధనార్జనే ముఖ్యంగా సినిమాలు తియ్యటమే ప్రస్తుతపు సినీ రుగ్మతకు అసలు కారణం. నిర్మాతకు ఒక అభిరుచి ఉండాలి. డబ్బులు ఉండి అవి పారబోసి సినిమా తీసినంత మాత్రాన అది విజయవంతం కావాలని లేదు. కథ, కథకు తగ్గ నటుల ఎంపిక, ఆ నటులచేత అవసరమైనతవరకు నటన రాబట్టుకోగలిగిన సత్తా ఉన్న దర్శకుడు, సందర్భొచితంగా, కథకు తోడ్పడే సంభాషణలు, సినిమాలో ఇమిడిపోయే పాటలు (ఊరికే గెంతుకుంటూ, "స్టెప్పుల" పేరిట వికృత చేష్టలు చేయటం కాదు)..... ఆరోగ్యకరమైన పదర్ధాలతో దీక్షగా సినిమాలు తీయగలిగిన రోజున, విడుదల రోజు వచ్చే గుండెపోటులు తగ్గుతాయి. ఎంత అద్భుతంగా తీసినా, ప్రజలు ఆదరించాలి. ఈ రిస్కు నిర్మాత తీసుకోవటం తప్పనిసరి.

సమాజంలో ఉండే lumpen elements కోసం తీసే సినిమాలు విజయవంతం అవుతున్నాయి అంటే, మన సమాజం ఎంత దిగజారిపోతున్నదో చూసి భయపడాలి. అలాంటి చెత్త సినిమాలు విఫలమవ్వటం, సామాజిక శాస్త్రజ్ఞులకు సంతోషాన్నే ఇస్తుంది. ప్రతి చెత్త చూడకూడకు అన్న విజ్ఞత ప్రజలు కొంతలో కొంత చూపిస్తున్నందుకు సంతోషించాలి.

మంచి సినిమాకి కొలబద్ద సినిమా విజయమే కాదు. కురచ బుధ్ధిగల సినీ పండితుల దృష్టిలో 1977 to 2009 విజయవంతమైన సినిమాలు రెండో సారి విడుదల చేస్తే ఎవరన్నా చూస్తారా!. అటువంటి చౌకబారు విజయాలు సాధించిన సినిమాలు (ఉదహరిస్తే లంపెన్ ఎలెమెంట్లను రెచ్చగొట్టినట్టు అవుతుంది) ఏవీ కూడ మళ్ళి విడుదల చేసే సాహసం ఏ డిస్ట్రిబ్యూటర్ చేయటం లేదు.

Reply

శివ గారు,
ఈ శాటిలైట్ టీ.వీ.యుగంలో పాత సినిమాలను డిస్ట్రిబ్యూటర్లు మళ్ళీ విడుదల చెయ్యడం పెద్ద సాహసమే అవుతుంది.రిలీజైన ఆర్నెల్లకే టీ.వీ లో వచ్చేస్తూంటే మళ్ళీ థియేటర్లకెళ్ళి సినిమా చూసేంత ఓపిక ఎవరికుంటుంది లేండి.అయిటే 1977 నుంచి ఇప్పటిదాకా విడుదలైన సినిమాలలో మళ్ళీ మళ్ళీ చూడదగ్గవి చాలానే ఉన్నాయి.వాటిలో ఫక్తు కమర్షియల్ సినిమాలు ఉన్నాయి,విలువలతో కూడిన సినిమాలు ఉన్నాయి.ఈ సినిమాల వలన కలిగిన సామాజిక ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తే అదొక పెద్ద వివాదాస్పదమైన చర్చవుతుంది.


a2zdreams గారు,

ఒక యావరేజ్ సినిమాకి అభిమానులు మూడేళ్ళు వెయిట్ చెయ్యాలా? కాస్ట్లీ మిస్టేక్స్ వల్ల నాకొచ్చిన నష్టం ఏంటంటారా,'అతడు' సినిమా తర్వాత నేను కూడా ఈ కాంబినేషన్ మీద లేని పోని అంచనాలు పెట్టుకొని కొంత డబ్బు సమయం వెచ్చించి సినిమా చూసి నిరాశపడినవాన్నే.నాకొచ్చిన నష్టం కంటే ఈ సినిమాను కొన్న వారికొచ్చే నష్టం ఇంకా ఎక్కువ.50 కోట్లు ఎలా రికవర్ అవుతాయి? ఇప్పుడున్న టాక్ తో ఎలా సాధ్యం?

Reply
October 10, 2010 at 12:05 PM

ఖలేజా ని కూడా కలపడం చాలా అన్యాయం. బుర్రేకో బుద్ది జివ్హకో రుచి కానీయండి బ్లాగులన్నాక ఏమైనా రాయచ్చు

Reply

కిరణ్ గారు,

ఆ సినిమాలకు వచ్చినంత భయంకరమైన టాక్ ఈ సినిమాకు లేకపోవచ్చు.కానీ బాక్సాఫీస్ పరంగా చూస్తే అంతిమ ఫలితం అదే అని నా నమ్మకం.

Reply
October 10, 2010 at 10:46 PM

లోకేష్ గారూ మీరు చెప్పినట్టుగా ".....1977 నుంచి ఇప్పటిదాకా విడుదలైన సినిమాలలో మళ్ళీ మళ్ళీ చూడదగ్గవి చాలానే ఉన్నాయి...." అవును ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కాని నా ఉద్దేశ్యం, సినిమా విజయవంతమైనంత మాత్రాన ఆ సినిమా గొప్పది కానక్కర్లేదని. మునుపు మన దృష్టిలో విజయవంతమైన సినిమాను కొంతకాలం తరువాత ఓకప్పుడు ఆ సినిమాకి బట్టలు చించుకుని వెళ్ళినవారే మళ్ళి ఆ సినిమా ఇప్పుడు చూసి (వయస్సుతో వచ్చిన పరిణితితో) ఈ సినిమాకా ఇంత ఎగబడ్డాం అనుకుంటారు. ఎప్పుడు చూసినా ఆహ్లాదన్నిచ్చే సినిమాలు బహు కొద్ది. నాకు తెలిసిన ఒక పెద్దాయన (50+) సాటర్డే నైట్ ఫీవర్ సినిమా గురించి తెగ అంగలార్చాడు. చెత్త సినిమా బాబూ అంటె వినడే. సరే కొంత ప్రయత్నం మీద సంపాయించి ఆయనకి ఇచ్చాను చూడమని. అది చూసి మర్నాడు ముఖం వేలాడేసుకుని వచ్చి చెప్పాడు, ఈ సినిమాకోసమా, ఇంత వెతుకులాట చేశాను, సిగ్గేస్తొంది అని వాపోయాడు. అలాగే నేను 20-30 సంవత్సరాలు పాత సినిమా నాగేశ్వరరావు, భానుమతి, సి ఎస్ ఆర్ నటించిన చక్రపాణి సినిమా మీద మక్కువ పెంచుకున్నాను. తీరా ఈ మధ్య సినిమా దొరికి చూస్తే ఎమున్నది, ఉట్టి చెత్త సినిమా, నటన లేదు, దర్శకత్వం లేదు. పాతదైనంత మాత్రాన అద్భుతమూ కానక్కరలేదు.

ఆ తరువాత మీరు అనే విషయం ..."సామాజిక ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తే అదొక పెద్ద వివాదాస్పదమైన చర్చవుతుంది..." లో రెండు మాటలు ఉన్నాయి. ఒకటి సామాజిక ప్రయోజనం. ఈ మాట దుర్వినియోగం అయినంతగా తెలుగులో మరే మాటా దుర్వినియోగం అవ్వలేదు. ఎవరికి వారు తమకు నచ్చినదే సామాజికత అంటారు. నా ఉద్దేశ్యం, అలసిన మనసుకు, ఉల్లాసాన్నిచేదే సినిమా. అంతకంటె మరే ప్రయోజనమూ ఆశించకపోవటమే మంచిది. ఉల్లాసం అన్నాం కదా అని, అనారోగ్యకరమైన ఉల్లాసం కాకూడదు. ఏది ఉల్లాసకరమైన వినోదం అంటె, అది నిర్ణయించుకోవటంలోనే సమాజ పరిణితి బయటపడేది.

Reply
October 10, 2010 at 10:47 PM

ఆ తరువాత మీరు అనే విషయం ..."సామాజిక ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తే అదొక పెద్ద వివాదాస్పదమైన చర్చవుతుంది..." లో రెండు మాటలు ఉన్నాయి. ఒకటి సామాజిక ప్రయోజనం. ఈ మాట దుర్వినియోగం అయినంతగా తెలుగులో మరే మాటా దుర్వినియోగం అవ్వలేదు. ఎవరికి వారు తమకు నచ్చినదే సామాజికత అంటారు. నా ఉద్దేశ్యం, అలసిన మనసుకు, ఉల్లాసాన్నిచేదే సినిమా. అంతకంటె మరే ప్రయోజనమూ ఆశించకపోవటమే మంచిది. ఉల్లాసం అన్నాం కదా అని, అనారోగ్యకరమైన ఉల్లాసం కాకూడదు. ఏది ఉల్లాసకరమైన వినోదం అంటె, అది నిర్ణయించుకోవటంలోనే సమాజ పరిణితి బయటపడేది.

తరువాత ఏమిటని ప్రశ్నిస్తే వివాదమౌతుంది, అంటున్నారు. నిజమే! చర్చ జరగాలి, వాదన కాదు. చర్చ జరిగినంత మాత్రాన అక్కడ వివాదం ఉన్నదని కాదు. ఉన్న వివాదం తొలగించటానికే చర్చ. ఆ చర్చ అరోగ్యకరంగా జరగాలి. అటువంటి ఆరోగ్యకరమైన చర్చ చేయగల మానసిక స్థితి ఉన్నవారు బ్లాగుల్లో చాలా తక్కువ. అందుకని ప్రతిదీ వివాదాస్పదమౌతోందని భయపడుతున్నారు. అంతే.

Reply

>>ఈ సినిమాకోసమా, ఇంత వెతుకులాట చేశాను, సిగ్గేస్తొంది అని వాపోయాడు.

శివ గారు,ఇలాంటి అనూభవాలు నాకూ ఉన్నాయి .నాకు పాత సినిమాలంటే చాలా ఇష్టం.ఓ సారి ఇలాగే ఎన్‌టీఆర్ 'బండరాముడు' సినిమా కోసం తెగ ట్రై చేశాను.అది చూశాక నా నెత్తిన బండే పడింది.

>>నా ఉద్దేశ్యం, అలసిన మనసుకు, ఉల్లాసాన్నిచేదే సినిమా. అంతకంటె మరే ప్రయోజనమూ ఆశించకపోవటమే మంచిది.

మీ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను

Reply
Post a Comment