జగదానందకారకంగా శ్రీరామరాజ్యం పాటలుశ్రీరామరాజ్యం పాటల కోసం నేను ఆత్రంగా ఎదురుచూడ్డానికి ప్రధాన కారణం బాపు-రమణ ,ఇళయరాజాల కాంబినేషన్. నేను ఇళయరాజాకు వీరాభిమానిని. ఆయన కూనిరాగం కూడా నాకు మహాప్రసాదమే. ఇక రాముడంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు రామాయణమంటే ఉప్పూ-కారం లేని కూరలా చప్పగా ఉంటుందని ఈసడించుకొన్న మాట నిజమే కానీ గత రెండు మూడేళ్ళుగా రామాయణం మీద రకరకాల పుస్తకాలు చదవటం వల్లనైతేనేమి, ప్రవచనాలు వినడం వల్లనైతే నేమి, నా అవగాహన మెరుగుపడి పాత్రల ఔచిత్యం బోధపడి, గౌరవం, భక్తిభావం రెండు కలిగాయి. సీతాసమేత రామలక్ష్మణ హనుమంతులకు నా మదిలో మందిరమే కట్టేశాను. ఇక హనుమంతుడిలాగా రామనామాన్ని నరనరాన జీర్ణించుకున్న భక్తులు బాపు-రమణలు. ఇద్దరికీ పౌరాణికాల మీద మంచి పట్టుంది. అంతకు మించి నిబద్ధత ఉంది. కథ ఏదైనా కమర్షియల్ ఫార్ములా పేరుతో చవకబారు శృంగారం కుమ్మరించే దర్శకేంద్రులు కోకొల్లలుగా ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంకా మనుగడగలుగుతున్నారంటే అందుకు కారణం కేవలం వృత్తి పట్ల వాళ్ళకున్న నిజాయితీనే. ఇటువంటి అరుదైన వ్యక్తుల కలయికలో తయారవుతున్న  చిత్రమంటే ఎవరికి మాత్రం ఉత్కంఠత ఉండదు ?

గీత రచయితగా జొన్నవిత్తుల గారి పేరు ప్రకటించినప్పుడు నేను తెల్లబోయాను. ఆనాటి లవకుశ పాటల స్థాయిలో  సాహిత్యం సమకూర్చగలరా అన్న సందేహం కలిగింది. తెలుగు భాష గొప్పదనం గురుంచి వ్రాసిన పాట తప్ప,ఆయన పేరు వినగానే ఠక్కున స్ఫురింపజేసే పాటలేవి నాకు తెలియవు. వేటూరి గారి చేత పాటలు వ్రాయిద్దామనుకుంటే అప్పటికే ఆయన స్వర్గస్థులైపోయారు. ఇక ఆ స్థాయిలో వ్రాయగలిగింది సిరివెన్నల సీతారామశాస్త్రి గారొక్కరే అని నా ప్రగాఢ నమ్మకం. జొన్నవిత్తులకు అవకాశమిచ్చి తప్పు చేస్తున్నారేమో అనుకున్నాను కాని ఆయన అద్భుతంగా గేయ రచన చేసి నన్ను ఆశ్చర్యానికి గురి చేశారు. పాటలన్నీ పామరులకు సైతం అర్థమయ్యేలా సరళంగా వ్రాసారు.దండకం వంటివి వ్రాయల్సి వచ్చినప్పుడు కాస్త విజృంభించారు. ఆయన సినీ జీవితంలో చిరస్థాయిలో నిలిచిపోయేలా సాహిత్యమందించారు. ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో చెప్పినట్లు ఈ పాటలన్నీ ముందు జొన్నవిత్తుల గారి చేత వ్రాయబడి, రమణ గారి అంగీకారం పొంది తర్వాత ఇళయరాజా చేత స్వరాల సొగసులు అందుకున్నవే.


ఇక పాటల్లోకి వెళ్దాం. • జగదానంద కారక (5/5) - ఈ పాటను ఆల్బంకే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. త్యాగరాజ కృతిలోని పల్లవిని మాత్రం తీసుకొని విడిగా చరణాలు వ్రాసుకొని స్వరాలు సమకూర్చారు. ఇదే పల్లవితో   పెళ్ళిపుస్తకం  , త్యాగయ్య  సినిమాలలోను పాటలున్నాయి. ఆ పాటలకు ఈ పాటకు తేడా గమనించండి. ఆపారమైన ఇళయరాజా స్వరసంపత్తికి ఇదొక మెచ్చుతునక. పాట చివరలో జగదానంద కారకా అని ప్లెయిన్ వాయిస్‌లో వచ్చే బాలు గారి స్వరం ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది . ఈ పాటకున్న ఏకైక అపశృతి శ్రేయఘోషల్ 'శ' ను 'ష' గా ఉచ్ఛరించటం. సాహిత్యాన్ని బట్టి ఇది సినిమాలో మొదటిపాట, శ్రీ రామ పట్టాభిషేకం జరిగే సమయంలో వచ్చే పాట అనుకుంటున్నాను.

 • శ్రీ రామా లేరా ఓ రామా (5/5) -మరొక అద్బుతమైన పాట. ఇది రెండవ పాట కావొచ్చు.రాముడి దైనందిన జీవితం, సీతాదేవితో ఏకాంతంగా గడిపే క్షణాలను మోంటేజ్‌ పద్ధతిలో చిత్రీకరించి వుండే అవకాశముంది. వర్థమాన గాయకుడు రాము చాలా చక్కగా పాడారు.

 •  కలయా నిజమా వైష్ణవ మాయా (5/5) -ఇదొక బిట్ సాంగ్. ఒక మంచి పాటను చిన్నదిగా కుదించి అన్యాయమే చేశారు. టిప్పు ఇంత అద్భుతంగా పాడగలరని ఈ పాట ద్వారే తెలిసింది. ఇది కూడా మొదటి భాగంలో వచ్చే పాటే.  సీతను అడవుల పాలుచెయ్యనున్నారని తెలిసి ఆంజనేయుడు పడే మానసిక క్షోభను ఈ పాటలో ప్రతిబింబించారు.

 • సీతారామ చరితం (5/5) -దండకారణ్యం నుంచి మొదలై రావణ వధ వరకు సాగే సన్నివేశాలను సులభంగా అర్థమయ్యే రీతిలో వర్ణించిన పాట. అనిత, కీర్తన చాలా బాగా పాడారు. 'ఎందుకు ఈ పరీక్ష, ఎవ్వరికీ పరీక్ష? శ్రీరాముని భార్యకా శీలపరీక్ష,అయోనిజకి అవనిజకా అగ్నిపరిక్షా ? ' అంటూ ప్రశ్నలు అడిగే విధానం చాలా నచ్చింది. సినిమా రెండవ భాగంలో కుశలవులు పాడే పాటల్లో ఒకటి కావచ్చు.

 •  దండకం (5/5) - క్లైమాక్స్ ??

 • సీతా సీమంతం (4/5) -సీతాదేవి సీమంతానికి సంబంధించినది.  సాహిత్యాన్ని జాగ్రత్తగా వింటే ఇది సినిమాలో రెండుసార్లు వస్తుందని తెలిసిపోతుంది. మొదటి సగం అయోధ్యలో, రెండవ సగం వాల్మీకి ఆశ్రమంలో.

 •  గాలి నింగీ నీరు
  (4/5) -ఇది మరో మోంటేజ్ సాంగ్. లవకుశలో ' ఏ నిమిషానికి ఏమి జరుగునో' లా సీతాదేవిని అడవుల పాల్జేసే సమయంలో వచ్చే పాట. ఈ పాటమీదున్న ఏకైక ఫిర్యాదు అధునిక సంగీత వాయిద్యాలు వాడటం.

 • దేవుళ్ళే మెచ్చి(4/5) -రామ కథపై ఇంకొక పాట.

 • రామాయణము (4/5) -రామ కథను కీర్తిస్తూ కుశలవులు పాడే మరొక పాట.
 • రామరామ (3.75/5) -ఈ పాట రెండవ భాగంలో వస్తుంది. అల్లరి చేసినందుకు కోప్పడిన తల్లిని అనునయిస్తూ రాముడి బాల్య చేష్టలను వర్ణిస్తూ కుశలవులు గానం చేసే పాట.
 • ఎవడున్నాడు (3.5/5) -అక్కినేని వ్యాఖ్యానంతో ఈ చిన్న పాట ఆరంభమవుతుంది. తనకు నారదునికి మధ్య జరిగిన సంవాదం రామాయణ రచనకు ఎలా పురిగొల్పింది వివరిస్తూ వాల్మీకి చెప్పే సన్నివేశం ఈ పాటలో పొందుపరిచారు. ' ఓంకారానికి సరిజోదు' అంటూ రాముడి గుణగణాలను అలతి పదాలలో అందంగా సాక్షత్కరించారు.
 • మంగళం రామునకు (3.5/5) -శ్రీరామునికి మాంగళాశ్వాసం.పట్టాభిషేకమయ్యాక వచ్చే చిన్న గేయం
 • సప్తాశ్వరూఢం (3.5/5) -సూర్యభగవానుడు, శ్రీ రాముడు మీద పద్యాలు .ఇది చిత్ర ప్రథమార్థంలో పట్టాభిషేకానికి ముందో తర్వాతో వచ్చే పద్యాలు.
 • ఇది పట్టాభి రాముడు,శంఖు చక్రాలు పోలిన -(3.25/5) -ఇవి రెండు ఒకే బాణీలో ఉన్నాయి.కుశలవులు అయోధ్య వచ్చినప్పుడు రాచనగరును చూపిస్తూ రాముని పరివారంలోని వారో లేక, కూడా వచ్చిన మునికుమారులో పాడే పాటలా ఉంది.జానపదులు పాడుకొనే శైలిలో ఉంది.  


 పాటలన్నీ విన్నాక ఇళయరాజా మాత్రమే ఇటువంటి చిత్రానికి న్యాయం చేకూర్చగలరనిపించింది. శంఖుచక్రాలు పోలిన, గాలి నింగి నీరు పాటలు ఆధునిక శైలిలో ఉన్నప్పటికీ అన్ని పాటలు బావున్నాయి.  కీరవాణి బాణీలు నాకు పెద్దగా నచ్చలేదు. 'అన్నమయ్య' లో కీర్తనలన్నీ అంతకుముందే ప్రాచుర్యంలో ఉన్నవే. అందులో మూడు పాటలకే స్వంతంగా స్వరాలు సమకూర్చారు (తెలుగుదనానికిది, ఏలే ఏలే, అస్మదీయ మగటిమి).' శ్రీరామదాసు' లో కొన్ని మాత్రామే బావున్నాయి. 'పాండురంగడు' లో అంతంత మాత్రం .  అలా కాకుండా చేస్తున్నది మొదటి పౌరాణిక చిత్రమైనా, మేరుపర్వతం లాంటి 'లవకుశ' తో పోటీపడుతున్నా ఏ మాత్రం తొణక్కుండా ఇంత ఆహ్లాదభరితమైన సంగీతాన్ని అందించటం ఒక్క స్వరరాజాకే చెల్లింది. ఈ పాటలకు బాపు దర్శకత్వ ప్రతిభ తోడైతే ఆకాశమే హద్దు. ఆస్తిలో కొంతభాగం పోయినా ఫర్వాలేదు కానీ సినిమా మాత్రం కావ్యంలా మిగిలిపోవాలని తపనపడే నిర్మాత యలమంచలి సాయిబాబా అభిరుచిని అభినందించక తప్పదు. ఈ చిత్రం  అపూర్వవిజయం సాధించి రమణ గారికి ఘననివాళి అర్పించాలని మనసారా కోరుకుంటున్నాను.


1 comment

September 7, 2011 at 11:50 AM

మంచి పోస్ట్..
పాటలు చాల చాల బాగున్నాయి..

Reply
Post a Comment