గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తించని పాఠశాలలురిపబ్లిక్ డే వచ్చేసింది.  గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక నార్మల్ హాలిడే. సరదాగా ఇంటిపట్టున గడుపుతూనో లేక ఏ సినిమాతోనో, షాపింగ్‌మాల్ లోనో కాలం వెల్లిబుచ్చేస్తారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన త్యాగధనులని  ఈ రోజు ఎంత మంది ఎంతసేపు స్మరిస్తున్నారు, జాతీయ సెలవు దినాలలోనైనా ఎంత మంది  వారి ఆదర్శాలను వల్లించుకుంటున్నారు, దేశ స్వాతంత్ర్యం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది, అన్న విషయాల మీద  ఎవరైనా
సర్వే నిర్వహిస్తే ఎంత బావుణ్ణు. దేశం సిగ్గుపడే విషయాలు బయటికి వస్తాయి.
అసలు రిపబ్లిక్‌డే ని ఈ రోజే ఎందుకు జరుపుకోవాలి ?  చాలా మందికి ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలియదు. 1950 జనవరి ఇరవయ్యారవ తేదినుంచి మనదేశ రాజ్యాంగం అమల్లోకికి వచ్చింది కాబట్టి ప్రతి ఏటా అదే తేదిన మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అనుకుంటారు కొంతమంది . ఇందులో కాస్త నిజం లేకపోలేదు. అయితే అసలు కారణం వేరే ఉంది. భారత రాజ్యాంగానికి నవంబరు 26 1949 లోనే ఆమోదం లభించింది. అమలు పరచే తారీఖుకి ఒక ప్రాముఖ్యత  ఉండాలని రెండు నెలలు ఆగారు.  ఏమిటా తారీఖు ? ఏమిటా ప్రాధాన్యత ? 1930 జనవరి 26వ తేదిన లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో మొదటిసారిగా దేశానికి పూర్ణ స్వరాజ్యం కావాలని ప్రకటించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం లభిస్తే చాలు, సర్వోత్కృష్టమైన సంపూర్ణ అధికారం భ్రిటిషు వారి చెప్పు చేతుల్లోనే వుంచి సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకొనే వాళ్ళు మన రాజకీయ నాయకులు (!!) . జలియన్‌వాలాబాగ్ ఉదంతం జాతిని ఉలిక్కిపడేలా చేసింది. సుభాష్ చంద్రబోస్ , జవహర్‌లాల్ నెహ్రూ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో కాకపుట్టించి పూర్ణ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రకటన ఇప్పించగలిగారు. ఆ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో  నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి జనవరి 26 1950 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.

అటువంటి రిపబ్లిక్‌డే ప్రైవేటు పాఠశాలలకు నేడొక ఆటవిడుపులా మారింది. గవర్నమెంటు హాలిడే కాబట్టి పిల్లలు స్కూళ్ళకు రానవసరం లేదని ముందు జాగ్రత్తగా హోం డైరీల్లో హెచ్చరించే పాఠశాలలు కొన్నైతే,  ఏ శనివారమో ఆదివారమో రిపబ్లిక్‌డే వస్తే ఎక్కడ ఆ రోజు మళ్ళీ పనిచేయాల్సి వస్తుందోనని ముందు రోజే తూతూ మంత్రంగా జెండావందనం జరిపించేసి మమ అనుకునే  స్కూలు యాజమాన్యాలు ఇంకొన్ని. ప్రేమికులరోజుకి రకరకాల భాష్యాలు చెప్పి పిల్లల చేత ఠంచనుగా సెలబ్రేట్ చేయించి స్వాతంత్ర్యదినోత్సవాన్ని మాత్రం ఆగస్టు పన్నెండవ తేదీనే జరుపుకున్నమిషనరీ స్కూలు, గురూజీ పూజ, సత్సంగం లాంటి కార్యక్రమాలను సెలవు రోజుల్లో అట్టహాసంగా నిర్వహించి రిపబ్లిక్‌డే ని విస్మరించే పాఠశాల మా ఇంటికి కూతవేటు దూరంలోనే ఉన్నాయి. భావిభారత పౌరుల్ని తయారుచెయ్యాల్సిన పాఠశాలలు ఇంత బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించబట్టే  బాలబాలికల్లో దేశభక్తి నానాటికి తీసికట్టు నాగంబొట్లు చందంగా తయారవుతోంది. సెలవు దినాల్లో పిల్లలు బడికి వెళ్ళకపోతేనేం అనుకునే తల్లిదండ్రులూ ఉన్నారు. గాంధీ నెహ్రూలు తప్ప మరో స్వాతంత్ర్య సమరయోధుడు తెలియని పిల్లలున్నారంటే అది వీళ్ళ చలవే. సమస్యకు మరో పార్శ్వం వీళ్ళు. 


నా చిన్నతనంలో స్కూళ్ళో జరుపుకున్న జాతీయపండుగలు నాకింకా గుర్తున్నాయి. పాఠశాలంతా అలంకరించిన మూడు రంగుల పేపర్ తోరణాలు, విశాలమైన ఆవరణలో ఆవిష్కరింపబడి వినువీధులలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం, తెల్లటి చొక్కాకి ఎడమవైపు పిన్నీసుతో గుచ్చబడి, పడిపోయిందో లేదోనని నేను అప్పుడప్పుడూ తడుముకొని గర్వంగా చూసుకున్న చిట్టి జెండా, భారతదేశము నా మాతృభూమి అని అందరితో కలిసి చేసిన ప్రతిజ్ఞ, ఒళ్ళు ఉప్పోంగేలా పాడిన వందేమాతరం, మైకు చేతబట్టుకొని వచ్చీ రానీ భాషా జ్ఞానంతో ' తేనెల తేటల మాటలతో మనదేశ మాతనే కొలిచెదమా ', ' శ్రీలు పొంగిన జీవ గడ్డై, పాలు వారిన భాగ్యసీమై' లాంటి  పాటలు శ్రావ్యంగా పాడిన మిత్రబృందం, వాడిపోయిన  మొహాలు చూసి కూడా ఉపన్యాసాలు విరమించని ముఖ్య అతిథులు, చివర్లో చాక్‌లెట్ల కోసం మేం సంబరంగా ఎగబడ్డ సన్నివేశాలు .. అన్నీ గుర్తున్నాయి.  

ఇప్పుడేవీ ఆ ప్రతిజ్ఞలు ?
ఏదీ ఆ జాతీయగీతాలాపన ?
ఏదీ ఆ ఆనందం ?

దేశంలో చాలా సమస్యలకు దేశభక్తి లేకపోవటం కూడా ఒక కారణం. భారతదేశ ప్రతిజ్ఞ ఎవరు వ్రాశారో తెలియకపోయినా, బూతులతో నిండిన తెలుగు సినిమా డైలాగులు, వాటి కలెక్షన్లు కంఠతా పట్టేసి, నటీనటులను గుడ్డిగా అరాధించే యువతరం తయారైతే అంతకంటే దరిద్రం ఈ దేశానికి మరొకటి లేదు. తల్లిదండ్రులు కనీసం జాతీయ పర్వదినాలోనైనా ప్రముఖుల ఆదర్శజీవితాల్లోంచి ముఖ్యమైన ఘట్టాలని, వారి పోరాట స్ఫూర్తిని, నిజాయితీని కళ్ళకు కట్టేలా పిల్లలకు విడమరిచి చెప్పి దేశభక్తిని పెంపొందింపజెయ్యాలి .ప్రైవేటు స్కూళ్ళు ఇప్పటికైనా తమ బాధ్యత గుర్తించి గణతంత్ర దినోత్సవం,స్వాతంత్ర దినోత్సవం లాంటి పండుగలను విధిగా నిర్వహించాలి. ప్రభుత్వం కళ్ళుతెరిచి జాతీయ పర్వదినాలను సెలబ్రేట్ చేసుకోని పాఠశాలల గుర్తింపు రద్దు చెయ్యాలి.


9 comments

January 26, 2012 at 4:36 PM

మీ ఆవేదన అర్ధం చేసుకున్నాను . మీలోని దేశభక్తి కి అభినందనలు .

Reply
January 27, 2012 at 12:00 AM

పడిపోయిందో లేదోనని నేను అప్పుడప్పుడూ తడుముకొని గర్వంగా చూసుకున్న చిట్టి జెండా
......................................
నిజంగా నాక్కూడా ఆ మధురక్షణాలు గుర్తుకొచ్చాయి మీ టపా చదువుతుంటే....

Reply

భావరాజు గారు,వినోద్ గారు

కృతజ్ఞతలు.నా బ్లాగుకి స్వాగతం

Reply
January 27, 2012 at 9:57 AM

శ్రీకాంత్‌ గారు నమస్తే..!
దేశభక్తి అంటే ఏంటో, జాతీయ నాయకుల పేర్లేమిటో తెలియని పిల్లలున్నారంటే కాదని అనలేం..!
కానీ "గణతంత్ర దినోత్సవం"కి అంత ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం లేదనే అనుకుంటున్నా, ఎందుకంటే 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఈ దేశం విధానాన్ని నిర్ణయించుకునే స్వాతంత్ర్యం మనకి వచ్చింది. దాన్ని వాడుకుని 1950 నుండి "ప్రజాస్వామ్యా"న్ని దేశప్రజ ఎంచుకుంది. ఆ రోజు మనదేశంలో ప్రజాస్వామ్యానికున్న ప్రాముఖ్యతని గుర్తింపజేసేది మాత్రమే..! అందుకే గణతంత్ర దినం అయింది. నిజానికి దానికీ స్వాతంత్ర్యానికీ సంబంధం ఉందని నేనకోవట్లేదు.
కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ రోజున సెలవు కూడా ఇవ్వరు. నిజానికి వాళ్ళకి ఉండేది రెండు లేదా మూడు సెలవులు - స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి, అప్పుడప్పుడూ అంబేద్కర్‌ జయంతి.. ఇవి తప్ప మిగిలినవి జాతి మొత్తం జరుపుకుంటున్న పండుగలు కావు, ఉదాహరణకి గణతంత్ర దినోత్సవాన్ని మావోయిస్టులు జరుపుకుంటే అది బహుశా వాళ్ల మూలసూత్రానికే వ్యతిరేకం..(ఇది నా అనుకోలు) ప్రజాస్వామ్యం అన్నా, రాజ్యాంగం అన్నా వాళ్లకి పడదు కనక..! కానీ స్వాతంత్ర్య దినోత్సవం అంటే ప్రతీ ఒక్కడు జరుపుకుంటాడు. (ఇది కూడా మానేస్తే అది వాడి దౌర్భాగ్యం, తద్వారా దేశ దౌర్భాగ్యం)

Reply
January 27, 2012 at 1:16 PM

కళ్ళు చెమర్చాయి...దేశానికి ఏమిచ్చినా, ఇవ్వలేకపోయినా, దేశమంటే తన్నుకొచ్చే సగర్వమూ, ఉద్వేగమూ, ఇంకా సజీవంగానే ఉన్నాయన్న నిజాన్ని, మీ టపా మరోసారి గుర్తు చేసింది.

అర్థవంతమైన అభిప్రాయమాలికకు కృతజ్ఞతలు.

Reply

@ వామనగీత గారు,

నేషనల్ హాలిడేస్ మూడే. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి. ఇవి దేశంలోని అన్ని మూలల్లో జరిపి తీరాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే ప్రతి సంవత్సరం వీటిని నిర్వహించినట్లు రికార్డులు మెయిన్‌టైన్ చేస్తారు. అంబేద్కర్ జయంతిని అన్ని రాష్ట్రాల్లోనూ జరుపుకోరు. గణతంత్ర దినోత్స్వానికి ప్రాముఖ్యత ఉందనే అనుకుంటున్నాను. మనకు స్వతంత్ర్యం రాక ముందు 26 జనవరినే స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకొనేవాళ్ళు. మావోయిస్టులు లేదా మరోక గ్రూపు వ్యతిరేకించినంత మాత్రన దాని వైశిష్ట్యత తగ్గిపోదు. మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు.

@ మానస గారు,
ధన్యవాదాలు.

Reply
February 3, 2012 at 1:10 PM

idhi nijanga jarugutunnade.
sir meeru inta chakkaga ye software upayoginchi telugu type chestunnaro telupagalaru

Reply

సూర్య గారు,

కృతజ్ఞతలు.Google transilerate లేదా lekhini.org వాడండి.

Reply
Anonymous
January 25, 2013 at 11:22 AM

Wow sir u r really great... Yes idi ee rojjulo jarugu tunde really great... JAI HIND

Reply
Post a Comment