రాత్రి కురిసిన వర్షం

 
 
రాత్రంతా కురిసిన వర్షం
తడి జ్ఞాపకాలను మిగిల్చివెళ్ళింది
చివికిపోయిన కన్నులచూరు నుండి
చుక్కలుగా తరలిపోతున్న దుఃఖం
కాలప్రవాహంలో జారి కరిగిపోతోంది
విరహ ఝంఝ ఉధృతవడిలో
శాఖలు తరిగిన శిథిల తరువునై
శోకనిశీధిలో చిక్కి ఉన్నాను
విచ్చుకుంటున్న వెల్గురేఖవై నన్నక్కున చేర్చుకొని
శుష్కించిన నా చైతన్యానికి స్వస్థత  చేకూర్చవూ
 
 
నీ తలపులతోనే తలారస్నానం చేసి
ఆరుబయట కురులారబెట్టుకున్నాను
విభాతకాంతుల దువ్వెనతో  
తడిసిన కురుల కరిమబ్బులని
తాపీగా దువ్వుకుంటున్న వియత్సుందరిని చూస్తూ నిల్చున్నాను
వెచ్చని నీ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు వీవెనలా వీతెంచి
ముచ్చెమటల ముత్యాలహారాలు నా మెడవంపులో కూర్చాయి
 
 
నీకు తెలుసో లేదో
తొలిసారి నా పై జారిన నీ తుంటరి చూపులు
తొలకరిజల్లులై నన్నింకా తబ్బిబ్బు చేస్తున్నాయి
ఆల్చిప్పల్లాంటి నా కన్రెప్పల్లో
అందమైన నీ ముఖబింబాన్ని ముత్యంలా పొదువుకున్నాను
అరవిచ్చిన పెదవులతో నువ్వు రువ్విన  ప్రతి నవ్వూ
మల్లెలుగా  ఏరుకొని మదిసీమలో నాటుకొన్నాను 
గుభాళించిన చిలిపి ఊహలన్నీ గిలిగింతలు రేపితే
గగనవీధులలో తేలి గాంధర్వ గీతాలు పాడాను
 
పరిచయాల పృథ్విపై  ప్రభవించిన మన ప్రేమ
భావాల కలయికతో బహుశాఖలు తొడిగి
పెద్దల అనుమతితో పరిణయమై 
                                  పొదరిల్లై మారినప్పుడు
ఫలించిన ఆశలన్నీ ప్రకాశించే తారలై
స్మరించిన నీ రూపం సుధాకరునిలా నన్నల్లుకున్నపుడు
చెలువములన్నీ చెంగలువలై
చలనములన్నీ కవనములై
తటాకమై నా మేను తాదాత్మ్యత చెందిన క్షణాలని
ఘనీభవించిన కాలానికి గుర్తుగా
గుండెపొరలలో నిక్షిప్తం చేసుకున్నాను
 
 
ఓర్వలేని వికృత విధి
ఉద్యోగం పేరిట నిన్ను విదేశాలకు విసిరికొట్టి
కారు మబ్బుల కర్కశ రాత్రిని కళ్ళ ముందు పులిమింది 
పొర్లుతున్న దుఃఖాన్ని పెదవంచున అదిమిపెట్టి
భారమైన కాలాన్ని భావరహితంగా మోస్తూ
సమూహంలో ఒంటరినై నే శిలాజమై మిగిలాను 

వాసంత సమీరం వెళ్ళిపోయింది వలపు వేణువులూదకనే
హేమంత తుషారం కరిగిపోయింది హృదయ సంతుష్ట రశ్మి సోకకనే
 
 
నీ మేనిపై తలవాల్చి
నీ చేతిని చుట్టిపట్టి
దయాపూరితమైన నీ కళ్ళలో
ద్యోతకమైన నా వలపుసౌధాలు
విస్ఫారిత నేత్రాలతో విస్మయంగా చూస్తూ
దొరలుతున్న మాటల మలయానిలంలో
దూదిపింజనై తేలిపోతూ
సైకత తీరాలలో సుప్రశాంత వనాలలో
నేను నడిచిన ప్రతి అడుగూ
గడిపిన ప్రతి ఘడియా
గవ్వలలో ఏరుకున్నాను
ఘనవృక్షసారముల మధ్య వెదుక్కొన్నాను
 

ఆధునిక ఉపకరణాలతో అంతరంగాన్ని శోధించి
అంతా బాగానే ఉందని సమాధానపడిపోకు
వెబ్‌చాట్లు, వీడియోఫోన్లు వియోగార్ణవాన్ని విశదం చెయ్యలేవు
అమావాస్య చీకట్లను తడుము
అలముకున్న నైరాశ్యం బోధపడుతుంది
ఎరుపెక్కిన దిక్కులు చూడు
బరువెక్కిన రెప్పల కావి కనబడుతుంది
ఘూర్ణిల్లే సముద్రపు హోరులో గతితప్పిన గుండె ఘోషను విను
ఆకుల ఆలింగనం వదిలి ఆర్తిగా జారిపోతున్న తుషారకన్యకల్లో నా కన్నీళ్ళు చూడు
 
వేయి తమస్సుల తపోవరమై
కోటి కోర్కెల ఉషోదయమై
విహంగ జతివై
ఉధృతగతివై
నా కోసం నువ్వు కదలి వచ్చేదెన్నడు
చారికలు గట్టిన చెంపలపై నీ పెదవి 
చేవ్రాలు పెట్టేదెన్నడు14 comments

February 11, 2012 at 3:03 AM

బాగుందండీ.. నాకు రెండో పేరా బాగా నచ్చింది. :)

Reply
February 11, 2012 at 3:04 AM

శూన్యమయిన హృదయ౦లోని విరహాన్ని, ఒంటరితనాన్ని కలగలపి భద్రంగా భావ నిక్షిప్తి చేశారు. భావం, భాషా సౌ౦దర్యంతో భాసిల్లుతోంది. వానవెలిసిన వేళ చుక్కల పండగ కాదా..నిశిరాత్రి తరువాత సూర్యోదయమవదా..

Reply
February 11, 2012 at 7:51 AM

ఎంత బాగా రాశారండీ..! అద్భుతంగా ఉంది..
వియోగాలు, విరహాలు మనిషి ఆత్మీయ స్పర్శతో కరిగిపోవాలే కానీ, వీడియో చాట్‌లు ఏనాటికి తీర్చేను..!

Reply

చాలా లోతైన భావం. స్పందన కూడా దీటుగా ఉంటుందా? ఏమో!!

Reply
February 11, 2012 at 10:46 AM

"శాఖలు తరిగిన శిథిల తరువునై" - I felt nice about this line .. the way you placed it..

Good one.

Reply
Anonymous
February 11, 2012 at 12:17 PM

చాలా బావుందండీ . నిజానికి ఆశ్చర్యపోతూ చదివాను.

Reply
February 11, 2012 at 4:21 PM

ఆధునిక ఉపకరణాలతో అంతరంగాన్ని శోధించి
అంతా బాగానే ఉందని సమాధానపడిపోకు

కవిత మొత్తం బావుంది ఈ వాక్యాలు ఇంకా నచ్చాయి.

Reply

@ మధురవాణి గారు
@ జ్యోతిర్మయి గారు
@ మానస గారు
@ మందాకిని గారు
@ శివ గారు
@ లలిత గారు
@ శైలబాల గారు

మీ ప్రశంసాపూర్వక వాక్యాలకు కృతజ్ఞతలు

Reply
February 12, 2012 at 2:31 AM

చాలా అద్భుతంగా, మనోరంజకంగా ఉంది!

Reply

రసజ్ఞ గారు
మీ స్పందనకు ధన్యవాదాలు.

Reply
Anonymous
February 13, 2012 at 3:33 PM

Well said keep it up

Reply

@ భాస్కరశర్మ గారు, థాంక్యూ.

Reply
February 15, 2012 at 8:46 PM

ok. but, but, ....

Reply

ఎం.ఎస్.నాయుడు గారు,
స్వాగతం. but..అని అక్కడే ఆపేశారు.మీ అభిప్రాయాన్ని పూర్తిగా వెల్లడించి ఉంటే బావుండేది. :-)

Reply
Post a Comment